రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, నవంబర్ 2020, బుధవారం

994 : కన్నడ రివ్యూ


 (బ్లాగులో పాజిటివ్ రివ్యూలు, నెగెటివ్ రివ్యూలు అని వుండవు. నిర్మాణాత్మక (constructive) రివ్యూలుంటాయి. అందుకే రేటింగ్స్ ఇవ్వడం లేదు)

భీమసేన నలమహారాజా (కన్నడ)
రచన దర్శకత్వం : కార్తీక్ సరగూర్
తారాగణం : అరవింద్ అయ్యర్
, ఆరోహీ నారాయణ్, ప్రయాంకా తిమ్మేష్ తదితరులు  
సంగీతం : చరణ్ రాజ్
, ఛాయాగ్రహణం : రవీంద్రనాథ్
బ్యానర్ : పద్మావత్ స్టూడియోస్
విడుదల :  అమెజాన్ ప్రైమ్

***

        "One cannot think well, love well, sleep well, if one has not dined well." Virginia Woolf. ఎంత నిజం. అక్షరాలా నిజం. భీమసేన నలమహా రాజా షడ్రసోపేత సోకాల్డ్  ఫుడ్డు వడ్డనతో ఇదే నిజం, నిద్ర పట్టక జాగారం. ఒకవైపు కన్నడలో పాక దర్పణ రాసిన సూర్యవంశ నలమహారాజుని కీర్తిస్తూనే జంక్ ఫుడ్ వడ్డిస్తే, ఈ సినిమాలో హీరోయిన్ పరిస్థితిలాగే తయారవొచ్చు- జ్ఞాపకశక్తి జీరో అయి! ప్రయోగశాలలో సైంటిస్టు చేత రెసిపీ తయారీ వ్యంగ్యంగా ప్రెజెంట్ చేసిన చేత్తోనే, నలభీమ పాకాన్ని భీకరంగా సిద్ధం చేసి వడ్డిస్తే, భీముడు గద పుచ్చుకుని తినబోయిన మనవెంట పడొచ్చు కుమ్మేయడానికి!

        వంటలూ రుచులూ ప్లస్ వంటకాడు లేదా కుక్ అనేవాడి కథ - మధ్యలో ప్లేటు ఫిరాయించి భేజా ఫ్రై చేస్తూ, కిచెన్ వదిలేసి క్లినిక్ లో పడితే పేషంట్స్ గా మిగిలేది మనమే. ఆరోగ్యకర వంటల కథకి ఇంటర్వెల్ నుంచి కన్నడ శరపంజర లోని హీరోయిన్లాంటి అనారోగ్య కథ, దీనికి క్లయిమాక్సులో మలయాళ మణిచిత్ర తళు హార్రర్ కలిపి వైద్యం చేస్తే తయారయ్యిందే భీమసేన నలమహా రాజా అనే షడ్రుచుల భీకర పాకం! పాకపాపం. 

    దర్శకుడు కార్తీక్ కి రెండు మూడు దశాబ్దాల కిందటి సినిమాల మీద చాలా ప్రేమ వున్నట్టుంది - వాటిని అక్కడే మర్యాదగా వుండనీయక ఇవతలికి లాగి రచ్చ చేశాడు. ఆ టైపు గయ్యాళి పెళ్లాన్నీ
, కలహాల కాపురాన్నీ, పెడ అరుపుల్నీ, కిష్కింధ కాండల్నీ, పిల్లదాని ఏడ్పుల్నీ, చివరికి సూర్యకాంతంలాగా నా గొలుసు దొంగిలించిందమ్మోయ్ పాపిష్టిది! అని అరిచి గోల చేసి ఆడే బాపతు పాత నాటకాన్నీ, ఓల్డ్ స్కూలు మెలోడ్రామాలనీ తెచ్చి నింపేశాడు. ఇది కన్నడ ప్రేక్షకులకి బాగా నచ్చిమెచ్చుకుంటే తను చేసింది కరెక్టే. 

***

    ఇందులో హీరో అరవింద్ అయ్యర్ లతేష్ అనే కుక్ గా నటించాడు. అతను చిన్నప్పుడు తల్లి తినిపించిన రుచులకి తల్లిలాగా అందరికీ వండి పెట్టాలని రిసార్ట్ లో కుక్ గా మారాడు. అక్కడికి సారా మేరీ (ప్రియాంకా తిమ్మేష్) వస్తుంది. ఈమె ఓల్డ్ ఏజ్ హోమ్ లో పని చేస్తుంది. బ్రేక్ తీసుకుని రిసార్ట్ లో గడపడానికి వస్తుంది. లతేష్ వంటల రుచులు చూసి దగ్గరవుతుంది. ఈ వంటలే ఒకమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేశాయని చెప్పి సారా మేరీకి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వేదవల్లి (ఆరోహీ నారాయణ్) కి బాగా వండి పెట్టే తల్లి, తండ్రి వల్ల చనిపోయింది. దాంతో తండ్రిని ద్వేషిస్తున్న ఆమె ఒకసారి రిసార్ట్ కి వచ్చినప్పుడు లతేష్ చేతి రుచులకి అమ్మ గుర్తొచ్చి, ప్రేమ కూడా ఒక రుచేనని తెలిసిందని ప్రేమలో పడింది. కానీ పెళ్లి చేసుకున్నాక గొడవలు పెట్టుకునే బద్ధ విరోధిగా మారింది. ఆవేశంతో బయటికెళ్ళి యాక్సిడెంట్ తో జ్ఞాపకశక్తి కోల్పోయింది. ఇదీ జరిగింది. ఇప్పుడేం చేయాలో లతేష్ కి తెలియడం లేదు...


    ఈ కథతో చేదు కూడా ఒక రుచేనని చెప్పాలనుకున్నాడేమో. ఆ చేదుని ఇంకే రుచితో పోగొట్టాలో చెప్పలేదు. కథకి అర్ధం, పాత్రల ఔచిత్యం దెబ్బతిని, వంటలూ రుచుల కథ కాస్తా ఇంటర్వెల్ కే తెగి - వేరే మెంటల్ కథతో సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది వ్యవహారం. అసలు ప్రారంభమే సహాయ పాత్ర సారా మేరీ ఓల్డేజ్ హోమ్ సేవల సీన్లతో బారెడు సాగి, బ్రేక్ తీసుకుని ఆమె రిసార్ట్ కి వస్తే, లతేష్ చెప్పే తన చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత వేదవల్లి చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ కలిపి పూర్తయ్యేసరికి, 33 నిమిషాలు గడిచిపోయాయి!

***

    33 నిమిషాలు చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులకే! స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం పూర్తయి ప్లాట్ పాయింట్ వన్ రావాల్సిన సమయమంతా ఇంకా చిన్నప్పటి స్పూన్ ఫీడింగులే. నేటి ప్రేక్షకులకి ఇంత స్పూన్ ఫీడింగ్ చేస్తే తప్ప పెద్దయిన హీరోహీరోయిన్ల పాత్రలు అర్ధం గావనేమో. సినిమా అంటే ఉపోద్ఘాతమా, లేక అసలు కథా? ఇది సినిమా కథ చెప్పే విధానమా అంటే, ఈ రోజుల్లో కూడా ఇంతే. చిన్నప్పటి ఊసులు పూసగుచ్చినట్టు చెప్తేగానీ తనివి దీరదు కొందరు ఈ కాలపు మేకర్లకి. బాలల చలన చిత్రం చూపిస్తున్నామా, లేక యూత్ సినిమా చూపిస్తున్నామా అన్న స్పృహగానీ, మార్కెట్ యాస్పెక్ట్ ఆలోచనగానీ బొత్తిగా ఏ కోశానా వుండవు!


        ఇంతకీ దాదాపు ఇంటర్వెల్ వరకూ చూపించిన బాలల కథలో విషయమేమిటంటే, బాలుడికి అమ్మ చేతి వంట ప్రీతి, అమ్మపోయాక అనాధాశ్రయంలో అనాధ జీవితం, వీధి రౌడీ తనం వగైరా. బాలికకి డిటో- అమ్మ చేతివంట టేస్టీ. టార్చర్ పెట్టే నాన్న వల్ల అమ్మపోతే నాన్న మీద ద్వేషం. ఇంతే. ఇదంతా ఎత్తేసి, డైరెక్టుగా రిసార్ట్ లో హీరోని కుక్ గా చూపించే ఓపెనింగ్ తో ప్రారంభిస్తూ, అమ్మ చేతివంట తిన్న నేను అమ్మలాగే వండి పెడతా -అంటూ ఒక డైలాగు చెప్పించేస్తే సరిపోదా?

     వేదవల్లిని రిసార్ట్ లో ఎంటర్ చేసి, అతడి వంటకి అమ్మ గుర్తొచ్చిందని ఒక మాట అన్పించేసి - ప్రేమలో పడేస్తే సరిపోదా? సహాయ పాత్ర సారా మేరీ ఓల్డేజ్ హోమ్ బోరు సీన్లు ఎత్తేసి, డైరెక్టుగా రిసార్ట్ లో ఎంటర్ చేసి- ఓల్డేజ్ హోమ్ లో పని చేస్తానని చెప్పించేస్తే సరిపోదా?

***

     చిన్నప్పుడు వాళ్ళ అమ్మల వంటలు, ఇప్పుడు హీరో వంటలు ఎలా మధురమో మనకైతే తెలీదు. ఏదో వండి పడేస్తారు. కుక్ గా హీరో ఏ వంటని ఏమేం కలిపి ఎలా వండితే ఘుమఘుమ లాడతాయో మన నూరూరించేలా వర్ణించకపోతే ఇదేం వంటల నేపథ్యంలో కథ? 'ఎగిరే పావురమా' లో 'ఆహా ఏమి రుచి' అంటూ వంకాయ కూరలు వండుతూ పాటపాడి - సుహాసిని నోరూరించ లేదా? హీరో రాగి ముద్ద గణేశ్, ఎయిరో ప్లేన్ దోశ అంటూ ఏవేవో వండిపడేస్తే జనం ఎగబడి తింటారు. మనకేమీ అన్పించదు ఆ తిండి. బడ్జెట్ వేస్ట్ సీన్లు ఇవి.

***

   చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులు పూర్తయ్యాక, మళ్ళీ వేదవల్లి ఎలా కలిసి ఆమెని పెళ్లిచేసుకున్నాడో ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు లతేష్. ఈ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ మీదుగా క్లయిమాక్స్ దాకా సాగుతుంది. ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ ఎడతెగని వాయిసోవర్లతో వస్తూంటాయి. ఇదొక దారుణం. సారాతో మొదలయ్యే ప్రెజెంట్ స్టోరీకీ, క్లయిమాక్స్ తో పూర్తయ్యే ప్రెజెంట్ స్టోరీకి కూడా వాయిసోవర్లే. పాత్రలు మాట్లాడుతున్నా వెనుకనుంచి వ్యాఖ్యానాల వాయిసోవర్లే. ఈ వాయిసోవర్లు లేకపోతే కథ అర్ధం గానట్టు ప్రారంభం నుంచీ ముగింపు వరకూ డాక్యుమెంటరీలకి చెప్పినట్టు వ్యాఖ్యానాలే!


    ఇక పెళ్లెలా జరుగుతుందంటే, రిచ్ వేదవల్లి పూర్ లతేష్ ని తీసికెళ్లి బెంగుళూరులో మొబైల్ ఈటరీ పెట్టిస్తుంది. ఈ ప్రేమ వ్యవహారం తెలిసి ఆమె తండ్రి ఈటరీ దగ్గరి కొచ్చి పెద్ద సీను క్రియేట్ చేస్తాడు. అప్పటికే ఆమెకి సంబంధం చూశాడు. అతణ్ణి తీసుకొచ్చి మరీ గొడవ చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదాని లతేష్ ని నిలదీస్తుంది. తండ్రి చటుక్కున జేబులోంచి తాళి తీసి కట్టమని సవాలు చేస్తాడు. లతేష్ కట్టేస్తాడు.        

    రోడ్డు మీద ఈ సీను పరమ పాత సినిమాలాగా వుంటుంది. ఇక పెళ్ళయిన ఒక సీను తర్వాత గొడవలు మొదలు పెట్టేస్తుంది. లతేష్ ఫ్రెండ్ ఇంట్లో వుంటున్నాడని, అతణ్ణి వెళ్లగొట్టడానికి తన గొలుసు దొంగిలించాడని పాత సీను క్రియేట్ చేస్తుంది. అక్కడ్నించీ కీచులాటలే. కీచులాటల మధ్యే పిల్ల పుడుతుంది. పిల్లముందు కూడా అది భయపడేలా కీచులాటలే. తండ్రి కూడా తను భయపడేలా తల్లిని టార్చర్ చేసేవాడు. అలాటి తండ్రిని ద్వేషిస్తూ తను చేస్తున్నది కూడా అదే. లతేష్ పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో పిచ్చెత్తిపోయి రోడ్డున పడి యాక్సిడెంట్ చేసుకుంటుంది. జ్ఞాపకశక్తి పోతుంది. ఇక సెకండాఫ్ అంతా ఈ అరిగిపోయిన జ్ఞాపకశక్తిని రప్పించే వేరే కథ. సెకండాఫ్ అంతా విషాదమే.

***

    1971 లో కన్నడలో శరపంజర అనే పుట్టణ్ణ కనగళ్ దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ వచ్చింది. 1974 లో ఇది కృష్ణం రాజు - వాణిశ్రీ లతో కృష్ణవేణి గా రీమేకై హిట్టయ్యింది. వాణిశ్రీ పాత్ర గతంలో ఒక సంఘటన గుర్తుకొచ్చి పిచ్చిదవడంతో వైవాహిక జీవితం అతలాకుతల మవుతుంది. ఆ రోజుల్లో మానసిక సమస్యలున్న స్త్రీలని ఎలా వెలివేసేవాళ్ళో అన్న పాయింటు చుట్టూ కథ ఇది. ఈ కథలోంచి వాణిశ్రీ పాత్రని  ఎత్తేసి - తండ్రితో సమస్యగా మార్చి జ్ఞాపకశక్తి పోయే కథగా బలవంతంగా మార్చినట్టుంది. కృష్ణవేణి లోనే వంటవాడుగా నటించిన రాజబాబు కామెడీని ఎలా మర్చిపోగలం. కుక్ లతేష్ కి ఇది మూలమేమో. 


    చివరికి జ్ఞాపకశక్తిని రప్పించడానికి, క్లయిమాక్స్ లో 1993 లో మోహన్ లాల్ నటించిన మలయాళ మణిచిత్ర తళు క్లయిమాక్సుని నరుక్కొచ్చి ఫ్రై చేసినట్టుంది! ఇలావుంది మనకి వడ్డించిన షడ్రసోపేత సమతుల ఆహారం. రుచుల్లో ప్రేమ రుచి కూడా వుంటుందని తెలుసుకుని అతణ్ణి పెళ్లి చేసుకున్న ఆమె రభస. కథ అర్ధంగాక దర్శకుడు కావాలని చేయించినట్టున్నరభస.

సికిందర్