రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, December 17, 2017

564 : సందేహాలు -సమాధానాలు



Q :    ఇంటెన్స్ యాక్షన్ మూవీకీ, సీరియస్ యాక్షన్ మూవీకీ తేడా ఏమిటి? ఇంటెన్స్ క్యారక్టర్ అంటే ఎలా వుండాలో డిఫైన్ చేయగలరా? వీలయితే ఎగ్జాంపుల్స్ తో సమాధానం బ్లాగులో ఇచ్చినా ఫర్వాలేదు. కొంచెం డిటైల్డ్ గా చెప్పండి.
- అశోక్ పి, సహకార దర్శకుడు 


 
A :    తెలుగు మహా సభలు జరుగుతున్న ఈ ఐదు రోజులైనా సినిమా భాషని శుభ్రమైన తెలుగు భాషగా రాయాలని ప్రయత్నిద్దామన్నా  రాయలేనంత హాలీవుడ్డీకరణ జరిగిపోయింది. ఇంటెన్స్ యాక్షన్ మూవీ, సీరియస్ యాక్షన్ మూవీ, ఇంటెన్స్ క్యారక్టర్, డిఫైన్, ఎగ్జాంపుల్స్, డిటైల్డ్ ...ఇవి తెలుగు సినిమా పదాలే. సినిమా భాషని  మించిన వాడుక భాషలేదు. ఎంత అడ్డగోలుగా అంటే అంత అడ్డగోలుగా వాడుకోవచ్చు. కూరగాయలమ్మే ముసలమ్మే ‘స్ట్రెయిట్ గా ఫో!’ అంటున్నప్పుడు ఏమిటి సమస్య? 2100 నాటి కల్లా తెలుగు వుండదంటున్నారు. అందుకు పల్లెటూరి ముసలమ్మలే ఇలా కొంగు బిగిస్తూంటే,  మనం ఎన్ని కలాలు పట్టుకుని వాళ్ళ తెలుగు సంహరణోత్సాహాన్ని అణిచి మూల కూర్చోబెట్టగలం. 

          ఇంటెన్స్ కీ, సీరియస్ కీ మాటల్లోనే తేడా తెలిసిపోతోంది. ఇంటెన్స్ అంటే తీవ్రమైనది, సీరియస్ అంటే గంభీరమైనది. మళ్ళీ ఇలా తెలుగులో చెప్పుకుంటే తప్ప తేడా అర్ధం గాదు, స్పష్టత వుండదు. మొదటిది యాక్షన్ తో తీవ్రంగా వుంటుంది, రెండోది విషయంతో గంభీరంగా వుంటుంది. మొదటిది ‘ఖైదీ’ అనుకుంటే, రెండోది ‘శివ’ అనుకోవచ్చు. మొదటిది ఉరుకులుబెడుతుంది, రెండోది ఆలోచింపజేస్తుంది. ఆలోచింప జేస్తూ సాగే సీరియస్ ( గంభీర) యాక్షన్ మూవీస్ గా ఇంకా నాయకుడు, రోజా, అంకుశం, భారత్ బంద్, సర్ఫరోష్, సత్య, గాడ్ ఫాదర్, జాస్, మ్యాడ్ మాక్స్ -2 లాంటివి చెప్పుకోవచ్చు. 


          ఉరుకులుబెడుతూ థ్రిల్ చేసే ఇంటెన్స్ (తీవ్ర స్వభావంగల) యాక్షన్ మూవీస్ గా  క్రిమినల్, ఒరు ఖైదీయన్ డైరీ, కంపెనీ, రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్, టర్మినేటర్, డై హార్డ్, జేమ్స్ బాండ్ సినిమాలు  మొదలైనవి చెప్పుకోవచ్చు. 


          ఐతే ఈ రెండు తరహాల సినిమాలు తెలుగులో రావడం ఎప్పుడో మానేశాయి. స్టార్లే  కామెడీ చేయడమనే ఒక ట్రెండ్ గత దశాబ్దంన్నర కాలంగా వేళ్ళూనుకోవడం వల్ల సీరియస్ యాక్షన్, ఇంటెన్స్ యాక్షన్ లనేవి ఇకలేవు. యాక్షన్ ఎంటర్ టైనర్లు, లేకపోతే యాక్షన్ కామెడీలు అనే ఫటాఫట్ సినిమాలే చూడ్డానికి దొరుకుతున్నాయి. 


          గరుడవేగ,  వివేకం లాంటివి  సీరియస్ యాక్షన్ లు గానే కన్పిస్తాయి. కానీ అందుకు తగ్గ విషయ గాంభీర్యం లేక గందరగోళంగా అన్పిస్తాయి. సింగం త్రీ లాంటి ఇంటెన్స్ యాక్షన్ తీసినా,  దాన్ని ఆ స్టార్ పాత్రకి  కి మించిన టెక్నికల్ హంగులతో నరాల మీద సమ్మెట పోట్లుగా తయారు చేస్తున్నారు. లేదా స్పైడర్ లాంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తీసినా, హీరోకి ఆ ఇంటెన్సిటీ వుండక, విలన్ కుండేలా చేస్తున్నారు. 


          పూర్వపు సృజనాత్మకతకీ, ఇప్పటికీ ఇదీ తేడా. పూర్వపు సృజనాత్మకతకి జానర్ మర్యాదలు తెలుసు. ఇప్పడు జానర్లే తెలుసు, వాటి మర్యాదలు తెలీవు. అంతా కిచిడీ వంటకమే. అందువల్ల పూర్వంలాగా సీరియస్, ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ తీయలేకపోతున్నారు. రెండోది, ఈ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా తక్కువ – ఎంటర్ టైనర్ల జమానాలో. 


          ఇక ఇంటెన్స్ క్యారక్టర్ గురించి. ఒక మానసికావస్థతో వుండే ఏ పాత్ర రాయాలన్నా ముందు సైకాలజీ తెలుసుకోవాలి. లేకపోతే అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్డర్ (ఓసిడి)పాత్రంటూ ప్రచారం చేసి, ఒట్టి పరిసరాలపట్ల ఎలర్జీగల పాత్రని చూపించినట్టు వుంటుంది (మహానుభావుడు). ఇంటెన్స్ (తీవ్రస్వభావంగల) క్యారక్టర్ ని సైకాలజీ ఇలా వివరిస్తుంది : మనసులో ఏదీ దాచుకోకుండా పైకి చెప్పేసే, ఏదైనా పొందాలనుకుంటే దాని గురించి తీవ్రంగా తపించే, అవసరం లేదనుకుంటే అస్సలు పట్టించుకోకుండా  వుండే, వాదోపవాదాల్లో గెల్చి తీరాలన్న పట్టుదలతో  వుండే, మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడే,  ఇతరులతో సంబంధాల్లో నిజాయితీగా వుండే, గొప్పలు చెప్పుకునే వాళ్ళని దూరంగా పెట్టే, ఇంటలెక్చువల్ గా వుండాలని ప్రయత్నించే, వివిధ రంగాల గురించి అవగాహనతో మాట్లాడే, కళ్ళలోకి సూటిగా చూస్తూ సంభాషించే, ఒకరితో ఎక్కువ సేపు గడిపి అదే మరోరోజు చప్పున వదిలించుకుని వెళ్ళిపోయే, ప్రేమల విషయానికొస్తే పాత క్లాసిక్స్ లా వుండాలని ఆశపడే, పుస్తకాల్లో సినిమాల్లో ఏదైనా ఇష్టపడిన పాత్ర ట్రాజడీగా ముగిస్తే, రోజులతరబడి దాని గురించే  బాధపడే లక్షణాలుంటే అది ఇంటెన్సివ్ క్యారక్టర్ అనొచ్చు. 


          ఇలా పాజిటివ్ గా కన్పిస్తున్న ఇంటెన్సివ్ స్వభావాన్ని హీరోకీ విలన్ కీ ఎవరి కైనా వాడుకోవచ్చు. కాకపోతే విలన్ నెగెటివ్ గోల్ కోసంచేస్తాడు. పైన చెప్పుకున్న స్వాభావిక లక్షణాలు జత చేసి, సన్నివేశాలు సృష్టించి  యాక్షన్ పాత్రలు రాస్తే సజీవంగా అన్పిస్తాయి. ఈ కథాక్రమంలో కామెడీ వుండాలనీ, మసాలా వుండాలని ప్రయత్నిస్తే పాత్ర స్వభావం మారిపోతుంది. ఇందుకు ఇటీవలి ఉదాహరణ సప్తగిరి ఎల్ ఎల్ బి. దీని మాతృకైన హిందీ జాలీ ఎల్ ఎల్ బి పాత్ర విషయం పట్ల నిబద్ధతతో వుండే ఇంటెన్సివ్ పాత్ర. తెలుగులో దీన్ని పిచ్చ కామెడీ మాస్ యాక్షన్ హీరోగా, డాన్సర్ గా, లవర్ గా తయారు చేశారు. విషయం వదిలేసి విన్యాసాలు చేశారు.


          ఇంటెన్సివ్ పాత్రలు యాక్టివ్ పాత్రలు. అంటే కథని అవే సృష్టించి అవే నడుపుతాయి. వాటిని కథకుడు సృష్టించి నడిపే కథల్లో  పావులుగా వాడుకోరాదు. అప్పుడవి పాసివ్ గా మారిపోయి తేలిపోతాయి. పాసివ్ గా వుండడం ఇంటెన్సివ్ స్వభావానికి విరుద్ధం. 


Q : థ్రిల్లర్/సైకో థ్రిల్లర్ జానర్ ఎలిమెంట్స్ ఏవో చెప్పగలరా?
-దిలీప్ కుమార్, ఈఎల్ ఎఫ్ విశ్వవిద్యాలయం
(సమాధానం రేపు)

సికిందర్