రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 28, 2022

1237 : రివ్యూ!


రచన - దర్శకత్వం : అశ్వథ్ మారిముత్తు 
తారాగణం : విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ తదితరులు
మాటలు : తరుణ్ భాస్కర్, సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం విధు అయ్యన్న
బ్యానర్స్ : పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు : పరం వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
విడుదల : అక్టోబర్ 21, 2022
***

ఊర మాస్ హీరో విశ్వక్ సేన్ రూటు మార్చి పాగల్’, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి ప్రేమ సినిమాల్లో నటించి మెప్పించలేక పోయిన తర్వాత, అశ్వథ్ మారిముత్తు అనే తమిళ దర్శకుడితో మరో ప్రేమ సినిమా ఓరి దేవుడా లో నటించాడు. తమిళంలో మారి ముత్తు రెండేళ్ళ క్రితం తీసిన హిట్టయిన ఓ మై కడవులే కి ఇది రీమేక్. ఇది కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో లక్కీమ్యాన్‌ గా రీమేక్ అయి హిట్టయ్యింది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో  విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర నటించారు. మరి రెండు భాషల్లో హిట్టయిన ఈ ప్రేమ సినిమా ఈసారి విశ్వక్ సేన్ తో తెలుగులో ఎలావుంది? ఇందులో వున్న ప్రత్యేకత విశ్వక్ సేన్ కేమైనా ప్లస్ అయిందా?

కథ

అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) స్కూల్ మేట్స్. ఓ రోజు తనని పెళ్ళి  చేసుకోమని అర్జున్‌కి ప్రపోజ్ చేస్తుంది. అర్జున్ ఎలాటి సంకోచం లేకుండా అంగీకరిస్తాడు. కానీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి ముద్దు పెట్టుకోబోతూంటే ఫక్కున నవ్వొస్తుంది. చిన్నప్పట్నుంచీ చూస్తున్న ఆమెతో రోమాంటిక్ గా ఫీల్ కాలేక పోతున్నానని అంటాడు. అయితే ఫీలైనప్పుడే ఫస్ట్ నైట్ చేసుకుందామంటుంది. కానీ ఏడాది తిరిగేసరికి విడాకుల కోర్టులో వుంటారు.

కోర్టులో ఒకడు పరిచయమై విడాకులు జరగవని భవిష్యత్తు చెప్పి
, విజిటింగ్ కార్డు ఇచ్చి అదృశ్యమై పోతాడు. అర్జున్ ఆ అడ్రసుకి వెళ్ళేసరికి అక్కడ దేవుడు (వెంకటేష్ ) వుంటాడు, కోర్టులో అదృశ్యమైన వాడు (రాహుల్ రామకృష్ణ) అక్కడే వుంటాడు. దేవుడు అర్జున్ చెప్పుకున్నదంతా విని, నీ జీవితాన్ని మార్చుకోవడానికి సెకెండ్ ఛాన్సు ఇస్తున్నానని చెప్పి, ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ అర్జున్ తోనే వుండాలి, ఎవరికీ దని గురించి చెప్పొద్దు, చెప్తే చస్తావని హెచ్చరిస్తాడు.

ఇప్పుడు ఆ టికెట్ తో అర్జున్ జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు
? విడాకులు మానుకుని అనుతోనే వున్నాడా? లేక అనుకోకుండా వచ్చిన స్కూల్ సీనియర్
మీరా (ఆశా భట్)తో ప్రేమలో పడ్డాడా? ఏం జరిగింది? ఎలా పరిష్కరించుకున్నాడు సమస్య? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రేమ కథలో ఫాంటసీ వుండడంతో కొత్తగా అన్పించే కథ. ఫాంటసీ అన్నాక లాజిక్ వుండదు. కానీ థ్రిల్, అడ్వెంచర్ వుండాలి. అప్పుడే ఫాంటసీ అన్పించుకుంటుంది. ఇవి లోపించడంతో పాయింటు మాత్రమే కొత్తగా, కథనం పాతగా వుంటాయి. తప్పుల్ని సరిదిద్దుకోడానికి జీవితంలో సెకెండ్ ఛాన్స్ ఎప్పుడూ వుంటుంది, అలా జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవచ్చన్న పాయింటుకి ఫాంటసికల్ గా పరిష్కారం చెప్పడం బాగానే వుంది గానీ, ఫాంటసీ జానర్ మర్యాదలైన థ్రిల్, అడ్వెంచర్ లతో కథనముండాల్సింది లేదు.

పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు- ప్రేమ పెళ్ళిళ్ళు
; స్నేహాలు- ప్రేమలు, శ్రమ విలువ - ఆనందం వంటి అంశాలు కూడా గంభీరంగానే చెప్పాడు దర్శకుడు. ఈ ఫాంటసీకి దర్శకుడు పాటించిన ఎలిమెంట్ కామెడీ మాత్రమే. ఇది కూడా హీరోతోనే. హీరోయిన్లని కామెడీకి దూరంగా వుంచాడు.

ఫస్టాఫ్ టైమ్ వేస్ట్ చేయకుండా మొదటి పది నిమిషాల్లోనే పెళ్ళయి పోతుంది. 20 నిమిషం కల్లా విడాకులకొస్తుంది కథ. దీంతో దేవుడి పాత్ర ప్రవేశిస్తుంది. ఇక్కడ్నుంచీ ఇంటర్వెల్ ముందు వరకూ సుమారు 40 నిమిషాలు నస పెడుతుంది. ఎందుకంటే దేవుడు వెంకటేష్ అడుగుతున్న వివరాల్ని విశ్వక్ సేన్ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్పుకొస్తూంటాడు. ఇప్పుడు విడిపోవడానికి కారణాలేంటో ఆ కథనం బలహీనంగా వస్తూంటుంది. ఈ బలహీనతని కవర్ చేయడానికా అన్నట్టు
, ప్రెజెంట్ స్టోరీలో వెంకటేష్ తన మార్కు డైలాగ్ కామెడీని  ప్రయోగిస్తూంటాడు.

ఇంతా చేస్తే విడిపోవడానికి కారణం కొత్తగా వుండదు. స్కూల్ సీనియర్ మీరా ఎంట్రీతో అనుమానం పెనుభూతమై గొడవ పడతారు భార్యా భర్తలు. ఈ టెంప్లెట్ రొటీనే విడాకులకి కారణమవుతుంది. ఈ విడిపోవా లనుకోవడానికి మొదటి రాత్రి ఎస్టాబ్లిష్ చేసిన రోమాంటిక్ గా ఫీలవలేక పోతున్న మానసిక కారణమే వుండుంటే కొత్తదనం వుండేది. ఒక చోట- ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకోకూడదు
, పెళ్ళి చేసుకున్నాక భార్యని ఫ్రెండ్ గా చేసుకోవచ్చని అంటాడు కూడా విశ్వక్ సేన్. అతడికి అడ్డు పడుతున్న ఈ సైకలాజికల్ కారణాన్నే పక్కన పెట్టేశాడు దర్శకుడు. దానికి ట్రీట్ మెంట్ తీసుకోకుండా వేరే స్కూల్ సీనియర్ తో తిరగడం, భార్యకి అనుమానాలు కల్గించడం, ఇదంతా పాయింటు వదిలేసి క్యారక్టరైజేషన్ని చెడగొట్టిన వ్యవహారంగా మారింది.

ఇక ఇంటర్వెల్ లో దేవుడుగా వెంకటేష్ టికెట్ ఇవ్వడంతో మాత్రమే డల్ గా వున్న ఫస్టాఫ్ కి కాస్త ఊపొస్తుంది. ఇక సెకండాఫ్ కథ- విశ్వక్ సేన్ టైమ్ ట్రావెల్ చేసి- హీరోయిన్ తో పెళ్ళిని తిరస్కరించి వుంటే ఎలా వుండేదన్న కథనంతో సాగి
, స్కూల్ సీనియర్ తో ప్రేమాయణం సాగించి, హీరోయిన్ విలువ తెలిసొచ్చి, ఆమెకోసం ప్రాకులాడే సాధారణ రొటీన్ గానే వుంటుంది.  చివరికి వెంకటేష్ జోక్యంతో వూహించినట్టుగానే సుఖాంతమవుతుంది హీరోయిన్ తో.

దేవుడి క్యారక్టర్ తో ఫాంటసీ అనేది పేరుకే. ఎక్కడా ఫాంటసీ చూస్తున్నట్టే వుండదు. దేవుడిచ్చిన టికెట్ తో అద్భుతాలేమీ జరగవు. అడ్వెంచర్
, థ్రిల్ మొదలైన ఫాంటసీ జానర్ ఎలిమెంట్స్ వుండవు. విశ్వక్ సేన్ లాంటి హైపరాక్టివ్ హీరో రెక్కలు కత్తిరించేసినట్టు వుంది.

నటనలు- సాంకేతికాలు

విశ్వక్ సే కిది కొత్త తరహా పాత్ర. ఐతే తనకున్న ఇమేజికి కామెడీ స్థాయినైనా పెంచుకోవాల్సింది. ఊర మాస్ హీరో అయివుండి కూడా ఫస్టాఫ్ ని నిలబెట్ట లేక పోవడం విచారకరం. తమిళంలో నటించిన అశోక్ సెల్వన్ సాఫ్ట్ హీరో. అతడికి సరిపోయింది. తెలుగులో విశ్వక్ సేన్ కి పాత్ర తీరుతెన్నుల్ని మార్చాల్సింది. తమిళంలో అశోక్ సెల్వన్ కామెడీ అరుపులు అరుస్తూంటే బాగానే వుంది. విశ్వక్ సేన్ తో ఇది ఎబ్బెట్టుగా వుంది. ఇంకోటేమిటంటే విశ్వక్ సేన్ కాస్త స్లిమ్ గా కూడా మారాలి.

హీరోయిన్లిద్దరూ బావున్నారు గానీ
, తమిళంలో నటించిన హీరోయిన్లంత కాదు. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన దేవుడి పాత్రని వెంకటేష్ నటించడం బాగానే —వుంది. వంక పెట్టడానికి లేదు. అలాగే ఆయన అసిస్టెంట్ గా రాహుల్ రామ కృష్ణ. ఒక పాత్రలో మురళీ శర్మ ఫ్లాష్ బ్యాక్ కథ కదిలిస్తుంది. గమ్మత్తేమిటంటే, ఈ ప్రేమ కథలో హీరోహీరోయిన్లతో కదిలించే సీన్లు అనేవి లేకపోవడం

సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్
, ఛాయాగ్రహకుడు వి
ధు అయ్యన్నఇద్దరూ తమిళ ఒరిజినల్ కి పనిచేసిన వాళ్ళే. ఫర్వాలేదు. చివరిగా, రొటీన్ గా వచ్చి పోతున్న ప్రేమ సినిమాలకంటే భిన్నంగా వుండడానికి చేతిలో ఫాంటసీ కాన్సెప్ట్ ని వుంచుకుని కూడా, సద్వినియోగం చేసుకోకపోవడం బాక్సాఫీసుకి ఇబ్బందిగా మారింది.

—సికిందర్