రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 19, 2016

స్క్రీన్ ప్లే సంగతులు!

        సినిమా కథల్లో సంఘర్షణ సంక్షోభాన్ని పుట్టించకపోతే ఆ సంఘర్షణే సంక్షోభంలో పడిపో తుందనేది తెలిసిందే. అప్పుడు సంఘర్షణ ఐడెంటిటీని కోల్పోతుంది. సంఘర్షణ ఐడెంటిటీని కోల్పోయాక కథేముంటుంది. యుద్ధానికి దిగాక యుద్ధం దేని కోసమో తెలీకపోతే అరాచకం మొదలయినట్టే, పాత్ర దేనికోసం సంఘర్షణ మొదలెట్టిందో తెలుసుకోకపోతే కథనం అనేక పక్క దార్లు వెతుక్కుంటుంది. కథలో సంఘర్షణ ప్రారంభించే  పాత్ర, కాల్పుల విరమణ ప్రకటించడానికి వీలే వుండదు. చావో రేవో సంఘర్షణలో పడి తేల్చుకోవాల్సిందే. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగంలో  పలాయనవాదానికి ఎలాటి చోటూ  వుండదు.  


        కాకతాళీయమే కావొచ్చు, ఒకే నెలలో విడుదలైన పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్’, షారుఖ్ ఖాన్ ఫ్యాన్రెండూ సంఘర్షణని భిన్న కోణాల్లో చూశాయి. సంఘర్షణ- అది దారి తీయించే సంక్షోభం ఈ రెండు సినిమాల్లోనూ ఒకలాగే వుంటాయి - హీరోని బద్నాం చేయడమే పాయింటు. అయితే ఈ బద్నాం చేసే ( హీరో పరువు ప్రతిష్టలకి భంగం కల్గించే) ప్రక్రియని మిడిల్లో ఎప్పుడు ప్రారంభించాలనే దానికి రెండూ రెండు సూత్రాలు చెప్పాయి. ‘ఫ్యాన్లో వెంటనే చెప్పడం ప్రారంభిస్తే, ‘సర్దార్ గబ్బర్ సింగ్ లో చాలా ఆలస్యంగా క్లయిమాక్స్ లో ఆ ప్రక్రియ చేపట్టారు. ఈ ఆలస్యమే సంఘర్షణని సంక్షోభంలోకి నెట్టేసిందా?

         
పవన్ కల్యాణ్ రచనా వ్యాసంగంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన  ‘సర్దార్ గబ్బర్ సింగ్ చలనచిత్ర కథా స్క్రీన్ ప్లేలతో,  అంత కష్టపడి సినిమా తీస్తే, ఒక్క నిమిషంలో  ఏం బాగా లేదని తేల్చేశారు జనాలు. సినిమాలో ఎన్నో వున్నాయి, వినోదానికి హద్దులే లేవు, విన్యాసాలకి అంతే లేదు, కథని  హీరో విలన్ల మధ్య రొటీన్ వయొలెంట్ పోరాటంగా వుంచక, తేలికబర్చిముక్కోణ ప్రేమతో ఎంటర్టెయిన్మేంటే  ప్రధానంగా నడిపించారు. అయినా నచ్చలేదు జనాలకి. ఎందుకు నచ్చలేదు- కథ లేదు కాబట్టి, ఎమోషన్ లేదు కాబట్టి నచ్చలేదు. ప్రతీ సినిమాలో కథే ఉండాలా, ఎమోషనే ఉండాలా, ఓ సారికి క్షమించేసి సరదాగా ఓ జాయ్ రైడ్ గా తీసుకుని, పవన్ లాంటి స్టార్ డమ్ ని అధిగమించిన పర్సనాలిటీని ఎంజాయ్ చేసేసి వెళ్లి పోకూడదా? ఇంత నిర్దాక్షిణ్యంగా శిక్షించాలా? ఐనా  కథల్ని ఎప్పట్నుంచీ సీరియస్ గా తీసుకోవడం మొదలెట్టారేమిటి  మహా జనాలు? వాళ్ళ దృష్టిలో కథలంటే ఏమిటి?  హీరో విలన్లు తన్నుకునే అవే రొటీన్ కథలా? ఎమోషన్ అంటే పాసివ్ హీరోలు ఏరులై పారించే అవే హాస్యాస్పదమైన ఎమోషన్సా? ఇక సినిమాల్లో సంఘర్షణ కూడా ఉండాలనీ, అదికూడా  హీరో విలన్ల మధ్య విజువల్ గా ఉండాలనీ జనాలు అనుకుంటే- ‘ఊపిరిలో ఏ సంఘర్షణ వుందని దాన్ని ఒప్పుకున్నారు?

      కానీ ఏదో వుంది, ప్రేక్షకులకి కావాల్సిందింకేదో లేకపోవడమే  జరిగింది. సినిమాల్లో కథ పెద్దగా లేకపోవడం ఒక సమస్యగా జనాలెప్పుడూ చూళ్ళేదు. కానీ ఉన్న కాస్త కథైనా కథలాగా ఉండాలనేది మాత్రం వాళ్ళకి తెలుసు. కథలా ఉండడమంటే ఏమిటి? ఓ కథ- ఆ కథకి ఒకే ఒక్క ప్రధాన  సమస్య- ఆ సమస్యలో ఎమోషన్, ఆ ఎమోషన్ సహిత సమస్యతో పోరాటం, ఇంతే. ఇంతకి  మించి గొంతెమ్మ కోర్కెలేవీ కోరక పోవచ్చు జనాలు. హీరో విలన్లు చిట్ట చివర్లో తన్నుకున్నా ఫర్వాలేదు. కానీ వాళ్ళ మధ్య సంఘర్షణ అంటూ పుట్టాక ఆ సెగ చివరిదాకా దమ్ బిర్యానీలా  తగులుతూ వుండాలి. సెగ వుందంటే సంఘర్షణకి కారణమైన సమస్య తాలూకు ఎమోషన్ (దమ్ బిర్యానీ ఘుమఘుమలు)  ఉన్నట్టే. సమస్య- సంఘర్షణ- సెగ- ఎమోషన్...ఈ కనీసావసరాలు తీర్చలేక పోయిందా పవన్ సినిమా?

         
పవన్ సినిమాని ఒక్క ముక్కలో జనం బాగా లేదని తేల్చెయ్యొచ్చు గాక, ఐతే ఎందుకు బాగాలేదో  అందుబాటులో వున్న శాస్త్రీయ సంగతులతో పోల్చి చూస్తే ఎక్కడా అంతు చిక్కదు. సాధారణంగా కమర్షియల్ సినిమాల మంచి చెడ్డలు స్థూల దృష్టికి తెలిసిపోతూంటాయి. కానీ భూతద్దం పెట్టినా సూక్ష్మ దృష్టికి కూడా అందని చిక్కడు దొరకడులా వుంది పవన్ తడాఖా!

         
ఇంతకీ పవన్ అత్యంత రహస్యంగా  ఏం చేసి వుంటే ఇలా బెడిసి వుంటుంది? ఇది మిలియన్ డిస్కుల ప్రశ్న. ఏ హాలీవుడ్ నిపుణులో వచ్చి డయాగ్నసిస్ చేయాలి తప్ప ఇక మనవల్ల కాదని చేతులెత్తేసిన సమయంలో, పరుచూరి బ్రదర్స్ స్కూల్ నుంచి వచ్చిన, నందమూరి హరికృష్ణ నటించిన  టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్మెదిలింది. ఈ సమయంలో ఇదెందుకు మెదిలిందబ్బా అని చూస్తే -అదీ ఇదే ఒకటే నన్నయూరేకాసిట్యుయేషన్ ఎదురయ్యింది. పవన్ రచనా చమత్కృతి రహస్యమంతా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్లోనే దాగి వుందన్న జ్ఞానోదయమైంది!
         
కథ నచ్చక, ఎమోషన్ లేక జనాలు నోచ్చుకోవడం నిజమే అనుకున్నా, మొత్తం కథంతా  నచ్చకపోవడం అంటూ జరిగుండదు. ఏదో ఒక దశనుంచే నచ్చక పోయుండాలి. ఆ దశ ఏది? ఆ ఎమోషన్ ఎక్కడ్నించీ  ఎందుకు మిస్సయ్యింది?

         
నేటివిటీ ఏమైనా ఎమోషన్ కి గండి కొట్టి ఉంటుందా? కథంతా ఒక హిందీ ప్రాంతంలో, హిందీ పాత్రలతో, వాళ్ళ సమస్యలతో  సాగుతుంది. ఇలాటిది జనం ఎప్పుడూ అంగీకరించలేదు. మహేష్ బాబు అంతటి ప్రిన్స్ నటించిన, రాజస్థాన్ ప్రజల కథైన  ‘ఖలేజా అయినా సరే, రవితేజ అంతటి మాస్ మహారాజా నటించిన,  మరో రాజస్థాన్ ప్రజలదే బాధ అయిన కిక్-2’ అయినా సరే, నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పవన్ మళ్ళీ  అనవసరంగా  రిస్కు చేశారేమో. వాళ్ళెవరో నేటివ్ ఫీల్ లేని పాత్రలతో ఎమోషన్ ఏం ఫీలవగలరు.
        విడుదలవుతున్న సినిమాల జయాపజయాల కారణాలతో స్టార్లు డేటా బ్యాంక్స్ ని నిర్వహించు కోకపోతే ఒకరు చేసిన తప్పు మరొకరు చేస్తూనే వుంటారు. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎందుకు దెబ్బ తిన్నాడో తెలుసుకోక రవితేజ ‘కిక్ -2’ తీశాడు. ‘కిక్ -2’ తో రవితేజ ఎలా దెబ్బ తిన్నాడో తెలుసుకోక పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీశాడు. ముగ్గురూ ముగ్గురే, ముగ్గులో గల్లంతయిన అన్నదమ్ములే. ఇక నాల్గో కృష్ణుడు ఎవరొస్తారో చూడాలి.

      పెద్ద సినిమాలే కాదు, చిన్నచిన్న  సినిమాల జయాపజయాల కారణాలు కూడా పెద్ద సినిమాల్లోకి చొరబడవచ్చు. కనుక వీటి డేటా బ్యాంక్స్  కూడా అవసరమే. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ని అలావుంచుదాం. ఈమధ్యే విడుదలై అట్టర్ ఫ్లాపయిన ‘సైజ్ జీరో’ అనే మీడియం బడ్జెట్ సినిమా పరాజయ కారణాలు కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో  వున్నాయని తెలుసా? ‘జ్యోతిలక్ష్మి’, ‘ఆటోనగర్ సూర్య’, ‘సిటిజన్’ సినిమాల పరాజయ కారణాలూ అన్నీ ఒకటే ననీ, అవే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లోనూ చొరబడ్డాయని తెలుసా?

         
నేటివిటీ సమస్య  సెకండరీయే. అసలు సమస్య కేవలం డాక్యుమెంటరీల్లో ఉండాల్సిన ‘స్టార్ట్ అండ్ స్టాప్’ తరహా కథనం ఇక్కడ ఇంత భారీ కమర్షియల్లోకి  వచ్చేసి జొరబడ్డమే.

        ఐతే టైగర్ హరిశ్చంద్రప్రసాద్ ని  స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో చిన్న చిన్న విడి విడి  కథలుగా  చెప్పారు. హీరో ఒకసారి రైతుల గిట్టుబాటు ధర సమస్య తీసుకుంటాడు, దాన్ని పరిష్కరిస్తాడు. ఇంకోసారి ఎరువుల సమస్య తీసుకుంటాడు, దాన్నీ  పరిష్కరిస్తాడు...ఇలా ఒక్కో రైతు సమస్య తీసుకుని పరిష్కరిస్తూ పోవడమే ఎపిసోడ్లుగా సాగే కథ. ఇది డాక్యుమెంటరీలు తీయడానికి రాసుకునే స్క్రిప్టు. ఇలా కాక సినిమా కథకి  ఒకే ప్రధాన సమస్య, దాని చుట్టే సంఘర్షణా ఉంటాయని తెలిసిందే.

        ‘
సర్దార్ గబ్బర్ సింగ్’ లో చిన్న చిన్న విడి విడి కథలు కాదు గానీ - మైండ్ బ్లోయింగ్ గా, ప్రపంచంలో ఎవరి బుర్రకీ తట్టని విధంగా, ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి స్థాపించిన ప్రధాన సమస్యతో, పుట్టిన ప్రధాన సంఘర్షణని వదిలేసి- అదే విలన్ తో వేరేవేరే చిన్న చిన్న విడి విడి సంఘర్షణలుగా చేసి చూపించు కొచ్చారు! అదీ సమస్య!
         
ఒకసారి కథలోకి వెళ్దాం...

నేటివిటీ ప్రశ్న 
        ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో ఎక్కడో రతన్ పూర్ అనే ఒక గ్రామం. ఇదొక్కప్పుడు పూర్వపు  రాజపుత్ర వంశీయుల సంస్థానంలో వుండేది. ఆ సంస్థానం వారసురాలు అర్షి దేవి ( కాజల్ అగర్వాల్) తల్లిదండ్రుల మరణంతో దళపతి అయిన హరినారాయణ్ (ముఖేష్ రిషి) సంరక్షణలో పెరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ వుంటుంది. ఈమెకి మధుమతి( ఊర్వశి) అనే చెలికత్తె,  శేఖర్ సింగ్  ( బ్రహ్మానందం) అనే మామా వుంటారు. ఈ ఒకప్పటి సంస్థానం పరిధిలోని గ్రామాలకి బొగ్గు మాఫియాగా ఎదిగిన రాజపుత్ర వంశీయుడే, భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్) అనే అతను ప్రజల పాలిట యముడిలా మారతాడు. అడ్డొచ్చిన వాళ్ళని చంపి గ్రామాల్ని బొగ్గు మైనింగ్ వనరులుగా మార్చుకుంటాడు. రతన్ పూర్ ని కూడా చెరబట్టి బొగ్గు తవ్వుకుని తరలిస్తూంటాడు.

        అటు హైదరాబాద్ లో గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్ ) అనే ఎస్సైఓ స్నేక్ గ్యాంగ్ అరచకాల్ని అరికట్టి పాపులర్ అవుతాడు. ఇతడి పై అధికారి (తనికెళ్ళ) ఇతడికి ప్రమోషన్ ఇచ్చి,  రతన్ పూర్ కి బదిలీ చేస్తూ అక్కడ పరిస్థితుల్ని చక్క దిద్దమని పంపిస్తాడు. వెంట సాంబా (అలీ) అనే కానిస్టేబుల్ ని కూడా పంపిస్తాడు. రతన్ పూర్ కి  గబ్బర్ సింగ్,  సర్కిల్ ఇన్స్ పెక్టర్ సర్దార్ గబ్బర్ సింగ్ గా రావడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి, ప్రత్యర్ధులకి ఆగ్రహం పెల్లుబుకుతుంది.  

        ఈ నేపధ్యంలో తనదైన స్టయిల్లోప్రత్యర్ధుల పని పడుతున్న గబ్బర్ కి,  అర్షి తారస పడుతుంది. దీంతో ఈ రాకుమారి అర్షి ని చెలికత్తెగానూ, అర్షి చెలికత్తె నడివయసు మధుమతిని రాకుమరిగానూ భ్రమించి, తన లెవెల్ చెలికత్తె తోనే అనుకుని, అర్షినే ప్రేమించడానికి నిర్ణయించుకుంటాడు గబ్బర్. ఇదే అర్షి మీద అటు పెళ్ళైన బైరవ్ సింగ్ కూడా కన్నేసి సమయం కోసం చూస్తూంటాడు..ఇదీ కథ.

క్రాస్ ఫైర్ లో కథ 
       భైరవ్ సింగ్ కీ, గబ్బర్ సింగ్ కీ లడాయి ఈ కథ. ఈ లడాయి కోల్ మాఫియాగా గ్రామాలకి గ్రామాలనే మాయం చేస్తున్న భైరవ్ పీడా ప్రజలకి తొలగించడం గురించి. ఓపెనింగ్ లోనే భైరవ్  రతన్ పూర్ ని నేలమట్టం చేయడాన్ని చూపించారు. గబ్బర్ వచ్చి ఫస్టాఫ్ లో భైరవ్ వ్యాపారాలు ఒక్కోటీ మూయించడం మొదలెట్టాడు. ఇంటర్వెల్ కి ముందు నాకాబందీ పెట్టి బొగ్గు రవాణాని అడ్డుకున్నాడు. దీంతో గబ్బర్- భైరవ్ లిద్దరూ మొదటి సారిగా ముఖాముఖీ సంఘర్షించుకున్నారు. ఆ సంఘర్షణలో   గబ్బర్ ఎంత శక్తిమంతుండో తెలుసుకుని  భైరవ్ వెనక్కి తగ్గాడు. 

        సెకండాఫ్ లో తిరిగి గబ్బర్ అర్షి తో ఫస్టాఫ్ లో  ప్రారంభించిన తన ప్రేమాయణాన్ని కొనసాగించాడు. ఈ ప్రేమకి భైరవ్ అడ్డు తగలడం మొదలెట్టాడు. ఇతను గబ్బర్ కంటే ముందే అర్షి తనదనుకుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వున్నాడు. ఇలా ముక్కోణ ప్రేమకథగా నడించింది. తీరా భైరవ్ నిశ్చితార్ధం చేసుకుంటున్నప్పుడు, గబ్బర్ దెబ్బ కొట్టి అర్షిని తీసుకుని పారిపోయాడు. దీంతో భైరవ్ అంతిమ పోరాటానికి తెర తీశాడు. ఇక్కడ అంతవరకూ ఓపిక పట్టి ఉంటున్న తన వ్యూహం గురించి చెప్పాడు-

        అదేమిటంటే,  గబ్బర్ ని చంపెయ్యడం పెద్ద కష్ట మేమీ కాదు, అలా చంపితే ప్రజల్లో వచ్చే తిరుగుబాటుతోనే  కష్టం. గబ్బర్ ప్రజల మనస్సులో నాటుకున్న ఒక ఐడియాలజీ. కాబట్టి ఆ ఐడియాలజీని చంపేస్తే ప్రజలకి వాడంటే వున్న పిచ్చి అంతా పోతుంది. అలా పిచ్చిని పోగొడితే ఎప్పట్లాగే తన బానిసల్లా పడి వుంటారు ప్రజలు...

        ఇలా గబ్బర్ ని కాక, గబ్బర్ అనే ఒక అయిడియాలజీని అంతమొందించడానికి  చకచకా కొన్ని దృశ్యాలు సృష్టించాడు భైరవ్. ఈ దృశ్యాలతో గబ్బర్ లంచగొండిగా, విలువలు లేనివాడిగా ప్రపంచానికి రివీల్ అయ్యాడు. పరువంతా పోగొట్టుకుని చట్టానికి దొరికిపోయాడు. ఇప్పుడు తనెలా తిరగబడ్డా డన్నది మిగతా క్లయిమాక్స్ లో  కథ.

        ఈ కథలో స్పష్టంగా తెలిసిపోతున్న లోపం ఏమిటంటే, ఫస్టాఫ్ తో సెకండాఫ్ తెగిపోవడం. ఫస్టాఫ్ లో  ప్రజల సమస్యతో, ప్రజలకోసంగా  ప్రారంభించిన గబ్బర్ పోరాటం, సెకండాఫ్ లో తనకోసం, తన ప్రేమని రక్షించుకోవడం కోసమే  చేసే పోరాటంగా మారిపోయింది. ఇలా ఫస్టాఫ్ లో  ప్రజలూ - సెకండాఫ్ లో ప్రేమా  అనే ఎదురెదురు కాల్పుల్లో (క్రాస్ ఫైర్ లో) చిక్కుకుని ప్రాణం విడిచింది కథ.

షాక్ ట్రీట్ మెంట్ 
      ఏ కథకైనా ఒకే ప్రధాన సమస్య, దాంతోనే  సంఘర్షణా ఉంటాయని చెప్పుకున్నాం. అలా స్థాపించిన ప్రధాన సమస్యతో సంఘర్షణని వదిలేసి, లేదా పెండింగ్ లో పెట్టి,  ఇంకేవో  వేరేవేరే సంఘర్షణలు ప్రారంభిస్తే, మొదట్లో స్థాపించిన ప్రధాన సమస్య ప్రశ్నార్ధక మవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులకి పళ్ళెంలో పెట్టి తాంబూలంలా ఇచ్చింది ఆ ప్రధాన సమస్యే గనుక. అలా ఇచ్చి, తాంబూలాలిచ్చేశాం ఇక తన్నుకోండని చేతులు దులుపుకుంటే ప్రేక్షకులే మైపోవాలి?

        స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో ఒక్కో సమస్యా దృష్టికి తెస్తూ డాక్యుమెంటరీలు తీస్తారని నమ్మింది ప్రపంచం. దీన్ని సినిమాలకి వాడేసి ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’, ‘సైజ్ జీరో’, ‘సిటిజన్’, ‘ఆటోనగర్ సూర్య’, ఆఖరికి
స్టీవెన్ స్పీల్బెర్గ్ అంతటి వాడూ తీసిన  వార్ హార్స్  లాంటి కథలు కాని ఫ్లాప్ కథలు అందిస్తారని ఊహించి వుండదు ప్రపంచం. 

        ఇది వేరే విషయం. జరిగిపోయిన వింత. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో
మైండ్ బ్లోయింగ్ గా, ప్రపంచంలో ఎవరి బుర్రకీ తట్టని విధంగా, చూపిస్తున్న కొత్త వింత ఏమిటంటే- ‘విడివిడి సమస్యల’ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ నే, ‘సంఘర్షణ’ కి కూడా వాడెయ్యడం! ఒక సంఘర్షణ లోంచి వేరే చిరుచిరు సంఘర్షణలు సృష్టించి చూపించడం!         

        ప్రతిపాదించిన సంఘర్షణ : భైరవ్ బారి నుంచి వూరిని కాపాడ్డం.
        అమలుచేసిన సంఘర్షణ : ప్రేమా పెళ్ళీ, పెళ్ళీ ప్రేమా చిరు చిరు సంఘర్షణలు.
        దీంతో సమస్యేమిటి : సంఘర్షణ కారకుడు భైరవ్ అంటూ ఒక విలన్ని చూపించాం కాబట్టి, ఆ విలన్ తోనే వేరే గొడవలు చూపించినా చెల్లిపోవచ్చను కోవడం- కథకి విలన్ అంటూ ఒకడు కన్పిస్తూ వుంటే చాలన్నట్టు.
        ఇది ఎందుకు చెల్లదు : ఇంటి ఓనర్ ఒకతను రంగారావుని ఇల్లు ఖాళీ చేయమని కోరితే ఖాళీ చేయించడం గురించే  గొడవ పడతాడు, ఆ రంగారావు కూతుర్ని ప్రేమించాలనుకోడు. ఈ పని చేస్తే,  అసలుపని - ఇల్లు ఖాళీ చేయించే సంగతి మర్చిపోవాలి గనుక.
        అసలు పని కంటే ఈ కొసరు వేషం మంచిదేగా రోమాంటిక్ గా : నిజ జీవితంలో ఎలాగైనా ప్రవర్తించ వచ్చు. నిజజీవితం ఆర్ట్ సినిమా లాంటిది. లేదా ఇండీ ఫిలిం లాంటిది. ఏ రూల్సూ వుండవు. అలాటి సినిమాలకి, జీవితాలకి ప్రేక్షకులు కూడా తక్కువే. కమర్షియల్ సినిమాల్లో అసలు పనే ముఖ్యం. గోల్ నుంచి పాత్ర తప్పుకుంటే గోల్మాల్ అయిపోతుంది కమర్షియల్ కథ.

        బుల్లెట్ ని ఒకసారి పేల్చడమంటూ జరిగాక దాని దిశని మార్చలేం. దానికదే బుల్లెట్ కూడా వంకర టింకరగా ప్రయాణించదు. అది ముక్కు సూటిగానే దూసుకు
పోతుంది. ఏదైనా అడ్డొస్తే తప్ప లక్ష్యాన్ని తాకేదాకా పలాయనంలోనే వుంటుంది. ఏదైనా అడ్డొస్తే  దానికి తగిలి లక్ష్యం చెదిరిపోవచ్చు. అప్పుడా బులెట్ ని పేల్చడం విఫలమైనట్టే. ఒకవేళ లక్ష్యాన్ని తాకినప్పటికీ,  చొచ్చుకు పోలేక పరావర్తనం చెందితే (రికోషెట్ బుల్లెట్) , తిరిగి వచ్చి తనకే తగిలితే  అది కూడా ప్రమాదకరం.  ఈ ప్రమాదం - ఈ ఎఫెక్ట్ కథల్లో పాత్రకి  శాడ్ ఎండింగ్. 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పాత్రకి లక్ష్యాన్నిచ్చి బుల్లెట్ లా పేల్చాక అది వంకర టింకరగా పోదు. పేల్చే ముందే ఆలోచించుకోవాలి. గబ్బర్ వూరి కోసం కమిట్ అయ్యాక,  ఇంటర్వెల్ దగ్గర సూటిగా బుల్లెట్ లా భైరవ్ కి తగిలాక, పడిపోయి- ఇంకో బుల్లెట్ పే ల్చండి రోమాన్స్ చేసుకుంటా అనలేడు. ఎందుకంటే తన మీద పేల్చిన బులెట్ కి భైరవ్ ఊరుకోడు. పౌరాణికాల్లో ప్రత్యర్ధులు పరస్పరం వేసుకునే బాణాలు సూటిగా గురితప్పకుండా ఢీకొట్టుకుని ఆకాశంలో మెరుపులు మెరిపిస్తాయి. అంతే గానీ- రాముడు నా మీద బాణం వేశాడా, అయితే నేను కాసేపు సీతమీద ప్రేమ బాణా లేసుకుంటా - అని రావణుడు టైం పాస్ చేయలేడు.

        భైరవ్ టైం పాస్ చేశాడు. ఇంటర్వెల్ దగ్గర వెనక్కి తగ్గాడు. ఏమంటే ఎందుకు వెనక్కి  తగ్గాడో క్లయిమాక్స్ దగ్గర చెప్పాడు. అప్పటికి ఆలస్యం అమృతం విషమైపోయింది. ఇంటర్వెల్ దగ్గర గబ్బర్ తన తడాఖా చూపిస్తే, భైరవ్  కూడా ఊరుకోకుండా తన ప్రతివ్యూహమేమిటో  అప్పుడే చెప్పేసి సవాలు విసిరితే,  బలాబలాల సమీకరణ ఎస్టాబ్లిష్ అయివుండేది.  గబ్బర్ అలా అయితే- భైరవ్ ఇలానా  అని క్లియర్ గా పిక్చర్ కనపడేది. కథ అర్ధమయ్యేది. కథ వున్నట్టూ కనపడేది.  భైరవ్ వ్యూహం : ఏ  ప్రజల కోసం గబ్బర్ నిలబడ్డాడో, ఆ ప్రజల్లో పాతుకుపోయిన గబ్బర్ అనే ఐడియాలజీని పెకిలించి పారెయ్యడం. ఈ ఇంటరెస్టింగ్ పాయింటుని ప్లాట్ పాయింట్ వన్ అయిన ఇంటర్వెల్ ఘట్టంలోనే వెల్లడించాలి భైరవ్. కానీ అతను ఈ పని చెయ్యలేదు. చెయ్యాలని మనసులో వుంచుకున్నాడు. క్లైమాక్స్ లొ మాత్రమే తన మనసులో వున్న వ్యూహం చెప్పి అమలు పరచాడు!  అంతవరకూ ప్రధాన సమస్యనుంచి డిస్కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్ కోసం రావణుడి అవతారమెత్తాడు.

‘ఫ్యాన్’ టాస్టిక్?  
       షారుఖ్ ఖాన్ ‘ఫ్యాన్’ లో ఇంటర్వెల్ కి ముందు షారుఖ్ తన ఫ్యాన్ (ఈ పాత్రకూడా షారుఖే నటించాడు, వీఎఫెక్స్ తో 24 ఏళ్ల కుర్రాడిగా మారిపోయి) కి చేసిన అవమానానికి, షారుఖ్   మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఫ్యాన్,  సెకండాఫ్ లో వెంటనే ఆ మేరకు రంగంలోకి దిగిపోతాడు షారుఖ్ ని టార్గెట్ చేస్తూ. అతడి లక్ష్యం ఒక్కటే - వీలైనన్నిచోట్లా తను షారుక్ లా వెళ్లి,  షారుఖ్ పేరుని బద్నాం చేసి పారిపోవడమే. ఈ వ్యక్తిత్వ హననాన్ని ఆపాలంటే షారుఖ్ ఒక్కటే  చెయ్యాలి- తనకి సారీ చెప్పాలి. సారీ చెప్పే ప్రసక్తే వుండదు షారుఖ్ కి. ఇదీ ఇద్దరు ప్రత్యర్దుల మధ్య ప్రారంభించిన గేమ్.

        ఇదే ఫ్యాన్ షారుఖ్ ని క్లయిమాక్స్ లో బద్నాం చేద్దాంలే అనుకుని, అప్పటిదాకా ప్రతీకారాన్ని ఆపుకుంటే? సమస్య ఏర్పడ్డాక సంఘర్షణని- ప్రతీకార భావాన్నీ ఎలా ఆపుతారు? పక్క పాత్రలతో అయితే ఆపవచ్చు. రాంగోపాల్ వర్మ ‘కంపెనీ’ లో అనుచరుడు విజయ్ రాజ్ అనూహ్యంగా ముగింపులో అజయ్ దేవగణ్ ని కాల్చి చంపి కక్ష తీర్చుకుంటాడు. అతడి కక్ష ప్రధాన కథ కాదు, అది సబ్ ప్లాట్. అతడి కక్షని ముగింపు దాకా ఆపవచ్చు. కానీ హీరో విలన్ల మధ్య ఆపలేరు. ‘ఫ్యాన్’ లో ఆపలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ఆపి వాయిదా వేశారు క్లయిమాక్స్ కి- అప్పుడేదో ఐడియాలజీ అంటూ గబ్బర్ ని బద్నాం చేసే ఎపిసోడ్ మొదలెట్టాడు భైరవ్. ఇంటర్వెల్ దగ్గర తెగిన ప్రధాన కథ ముక్కని క్లయిమాక్స్ లో జోడించారు. మధ్యలో అంతా హీరోయిన్ తో గబ్బర్- భైరవ్ ల మహా ముక్కోణ ప్రేమాయణం. దీని తాలూకు గిల్లి కజ్జాలు.

ఏది కథ- ఏది ఉప కథ
       హీరోయిన్ తో గబ్బర్ ప్రేమాయణం ఉపకథే. అతను  ప్రేమించడం కోసం రాలేదు, వూళ్ళో బైరవ్ పని పడదామని వచ్చాడు, ఇదే కథ. ఈ కథ ఇంటర్వెల్లో సంఘర్షణాత్మకంగా
మారేక, అంటే మిడిల్లోకి ప్రవేశించాక, మళ్ళీ బిగినింగ్ లో వాడుకున్నఉపకథ అయిన ప్రేమాయణాన్ని మిడిల్ మెయిన్ ట్రాకులోకి ఎలా తీసుకొస్తారు? ఇలా తేవడంవల్ల మిడిల్ చూస్తున్నట్టు గాక, మళ్ళీ బిగినింగ్ చూస్తున్నట్టే వుండదా? 

        ఉపకథ ప్రధాన కథగా ఎలా మారిపోతుంది? ఈ మధ్య ‘ఆమె ఎవరు?’ అనే సినిమాలో హీరో పాత్ర మంట గలిసిపోయి, పక్క పాత్ర హీరో అయిపోయి, చివరిదాకా తనే దున్నుకున్నట్టు- కథ, ఉప కథలు కూడా వంతు లేసుకుని మెయిన్ ట్రాకుతో చెలగాట మాడతాయా? ఇలా ‘సర్దార్ గబ్బర్ సింగ్’  స్క్రీన్ ప్లే ఇంటర్వెల్ దగ్గర్నుంచీ మధ్యకి ఫ్రాక్చర్ కూడా అయ్యింది- దాంతో సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో కూడా పడింది-
దొంగోడు’, ‘ధమ్’, ‘తేరేనామ్’, ‘హవా’, ‘జ్యోతిలక్ష్మీ, ‘సైజ్ జీరో’ తదితర సినిమాల సెకండాఫ్ సిండ్రోమ్స్ కి మల్లే.

        ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, భైరవ్  ఏమీ అనకుండా వెనక్కి తగ్గడం వల్ల, ఆ తర్వాతి సెకండాఫ్ కథనంలో,  అతడి తాలూకు సెన్సాఫ్ డేంజర్ ఏమైనా ఏర్పడిందా?
హీరో సవాలు విసిరాడు కదా, ఇక విలన్ ఏం ప్రమాదం తలపెడతాడో నన్నఆందోళన అతను  చెప్పకపోయినా బ్యాక్ డ్రాప్ లో ఫీలయ్యామా?

        ఫస్టాఫ్ లో,  అంటే బిగినింగ్ లో భైరవ్ కి చెందిన ఒక్కో వ్యాపారాన్నీ మూయిస్తూంటే భైరవ్ ఇక ఏం చేస్తాడో నన్న సెన్సాఫ్ డేంజర్ ఇక్కడ ఏర్పడింది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అతను  గబ్బర్ తో ముఖాముఖీ అయ్యాక కూడా ఇప్పుడేం  చేస్తాడో చెప్పేసి, ఆ సెన్సాఫ్ డేంజర్ ని  మర్యాదగా పే ఆఫ్ చేస్తే ప్రేక్షకుల మనోభావాలని మన్నించడం అవుతుంది. అలా చెయ్యకుండా భైరవ్ ఏం చేయబోతున్నాడో క్లయిమాక్స్ లొ చెప్పిస్తామంటే అప్పటికి సెన్సాఫ్ డేంజర్ డైల్యూట్ అయి ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతింటాయి.

        ఒక్క ‘సంఘర్షణ’ అనే మలుపు మీద స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ని ప్రయోగించిన దుష్పరిణామంగా, పవన్ స్క్రీన్ ప్లేలో సంఘర్షణే సంక్షోభంలో పడింది. సంఘర్షణే సంక్షోభంలో పడితే సంఘర్షణ ఎలా చెయ్యాలి? ఎవరు చేయాలి?

        ఒక పాత సినిమా పాట వుంది-
          నిప్పు రగిలి రేగు జ్వాల
          నీళ్ళ వలన ఆరును

          నీళ్ళలోనే జ్వాల రేగ
          మంట ఎటుల ఆరును...అని.
        ఇంతేకదా సంక్షోభంలో పడితే  సంఘర్షణ జాతకం!

-సికిందర్
cinemabazaar.in