రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, మే 2019, శుక్రవారం

816 : బాలీవుడ్ అప్డేట్
         
ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలని ఎన్నికల సంఘం ఆపేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యా నాథ్ బయోపిక్ గా బరితెగించి తీసిన తీసిన ‘జిల్లా గోరఖ్ పూర్’ పోలీసు కేసు నమోదు కావడంతో విడుదల ఆగిపోయింది. ఇందులో సీఎం యోగీని పిస్టల్ పట్టుకున్న నేతగా యాంటీ హీరోగా చూపిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. ఇదిలా వుండగా తాజాగా ఇంకో యోగీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని పేరు నకాష్ (శిల్పి). దర్శకుడు జైఘం ఇమాం. యోగీని ప్రియతమ నేతగా చూపిస్తూ శ్లాఘించాడు. సెన్సారు వారు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. నిజానికి ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయిన దీన్ని ఇంకాలస్యం చేయకుండా విడుదల చేయవచ్చు. కానీ ప్రధాని బయోపిక్ నే ఈసీ ఆపేశాక యోగీ వెండితెర కావ్యాన్ని ఈసీ అనుమతిస్తుందన్న ఆశలేం పెట్టుకోవడం లేదు నిర్మాతలు. అందుకని వచ్చేనెల విడుదల చేస్తున్నారు. 

          ‘నకాష్’ నిజానికి యోగీ ఆదిత్యానాథ్ బయోపిక్ కాదు. ఇందులో ఒక ముఖ్య  పాత్రగా మాత్రమే ఆయన కన్పిస్తాడు. అదెలా అన్నది దర్శకుడు చెప్పడం లేదు. కానీ దీని కథ మాత్రం బయటి కొచ్చేసింది. గత సంవత్సరం సింగపూర్ దక్షిణాసియా చలన చిత్రోత్సవాల్లో అవార్డు  గెలుచుకున్న సందర్భంగా కథ తెలిసిపోయింది. దర్శకుడు జైఘం ఇమాంని  ‘ఎమర్జింగ్ ఫిలిం మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది కూడా జ్యూరీ. ‘నకాష్’ కథ సెక్యులర్ ఇండియా కథ. మరి సెక్యులర్ ఇండియా కథలో యోగీ పాత్ర  పనేమిటి? యోగీని ఇందులో ఎలా చూపించినా సంఘ్ పరివార్ మాత్రం అల్లరి చేయకుండా ప్రశాంతంగా వుంది.    కథ వచ్చేసి,  వారాణసిలో ఒక ముస్లిం శిల్పి అల్లా రఖా. ఇతను ఆలయాల్లో హిందూ విగ్రహాలని చెక్కుతూంటే ముస్లిం సమాజం వెలి వేస్తుంది. మదరసాలో అతడి పిల్లలకి ప్రవేశం దొరకదు. హిందూ సమాజం కూడా కన్నెర్ర జేస్తుంది. పోలీసులు పట్టుకుని కొడతారు. అల్లారఖా రక్షణలో ఆలయ ట్రస్టుకి చెందిన బంగారం వుంటుంది. దాన్ని అతడి స్నేహితుడు సమద్  దొంగిలిస్తాడు. ఏడాది గడుస్తుంది. అల్లా రఖాని  మతసామరస్యానికి  ప్రతీకగా కీర్తిస్తుంది మీడియా. దీంతో మున్నా అనే హిందూ నేత ఎన్నికల్లో ఓడిపోతాడు. వారణాసిలో ఇరుమతాల వారికీ హీరో అయిపోయిన అల్లా రఖా మీద మున్నాతో బాటు సమద్  కక్ష గడతాడు. నేపధ్యంలో ఏం జరిగిందన్నది మిగతా కథ. 

         ఇందులో సీఎం యోగీగా కుముద్ మిశ్రా నటించాడు. ఈ పాత్రని యోగీతో ఏంతో స్ఫూర్తి పొంది రూపొందించినట్టు  దర్శకుడు వివరించాడు. ప్రేక్షకులు ఈ పాత్రని బాగా  ఎంజాయ్ చేస్తారని కూడా అన్నాడు. సింగపూర్  చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించాక కేన్స్ చిత్రోత్సవాలకి కూడా వెళ్ళింది ‘నకాష్’. ఇందుకు గాను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఎంపిక చేసి పంపింది. 'నకాష్' నిర్మాతలుగా గోవింద్ గోయల్, పవన్ కుమార్ మిశ్రా, ఆశుతోష్ శర్మ, శ్వేతా తివారీ లున్నారు. సరే, ఇదంతా యోగీ హీరోయిజం గురించి. మరి యాంటీ హీరోయిజం గురించి? 

          ‘జిల్లా గోరఖ్ క్ పూర్’ గత సంవత్సరం ఆగస్టులో పోలీసు కేసు నమోదై విడుదల ఆగిపోయింది. బిజెపి నేతలే కేసు వేసి దీన్ని అడ్డుకున్నారు. యోగీ ఆదిత్యానాథ్ కాస్ట్యూమ్స్ లో వున్న పాత్ర చేతులు వెనుక కట్టుకుని నిలబడితే, ఆ చేతుల్లో పిస్తోలు వుండడం, ఎదురుగా  ఆలయాలూ గోవులూ వుండడం పోస్టర్ల మీద చూసి దుమారం లేపారు బిజెపి నేతలు. యోగీని గోరఖ్ పూర్ మాఫియాగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మాత వినోద్ తివారీ మీద కేసు వేసి సినిమా విడుదలని అడ్డుకున్నారు. 
 నిర్మాత తివారీ స్పందిస్తూ,  పోస్టర్లు చూసి అపార్థం చేసుకున్నారనీ, అయినప్పటికీ సమాజంలో శాంతి సామరస్యతల దృష్ట్యా ‘జిల్లా గోరఖ్ పూర్’  ని బుట్ట దాఖలు చేస్తున్నట్టు ప్రకటించాడు. 

సికిందర్