రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, జూన్ 2016, ఆదివారం






దర్శకత్వం : ముప్పలనేని శివ
తారాగణం : కృష్ణ, విజయనిర్మల, అంగనా రే, మురళీ శర్మ, పోసాని, సాయికుమార్, పృథ్వీ, ఎల్బీ శ్రీ రామ్, డా. రవి తదితరులు.
సంగీతం :
ఈ ఎస్ మూర్తి,  ఛాయాగ్రహణం :  సతీష్ ముత్యాల
కథ : రమేష్ డీఓ  ప్రొడక్షన్స్,  కాన్సెప్ట్  రైటర్ : కల్యాణ్ జీ, మాటలు :  రామ్ కంకిపాటి
నిర్మాతలు
: శ్రీసాయి దీప్ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్ సిరాజ్
విడుదల :  3. 6. 2016

***
రికార్డు స్థాయిలో 350 సినిమాల సూపర్ స్టార్ కృష్ణ,  గోల్డెన్ జూబ్లీని  పూర్తి  చేసుకుంటూ ‘శ్రీ శ్రీ’ అనే యాక్షన్  మూవీతో హీరోగా విచ్చేశారు- అమితాబ్ బచ్చన్ గెటప్ తో - కాకపోతే నేచురల్ బ్లాక్ గడ్డంతో. ‘డెత్ విష్’  ఫేమ్ ‘విజిలాంటీ’ ఛార్లెస్ బ్రాన్సన్ పాత్రని పోషిస్తూ  దుష్ట శిక్షణ గావించారు. సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ,  ఘట్టమనేని వంశీకులతో ఓ ‘మనం’ కూడా చేద్దామనుకున్నారు దీన్ని, ఇది కుదర్లేలేదు

    
క లా ప్రొఫెసర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా వుంటుంది?  చాలా కొత్తగా వుంటుంది. కళ్ళ ముందు నేరం జరుగుతున్నప్పుడు లా ప్రొఫెసర్ ఏం చేస్తే బావుంటుంది? నేరాన్ని అడ్డుకుంటే బావుంటుంది. నేరాన్ని అడ్డుకోలేనప్పుడు ఏం చేస్తే  బావుంటుంది? తన దగ్గరున్న సెల్ ఫోన్లో ఆ నేరాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టేస్తే బావుంటుంది. అప్పటికీ చట్టం సరిగ్గా పని చెయ్యక పోతే ఏం చేస్తే బావుంటుంది? సినిమా కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే బావుంటుంది. లా ప్రొఫెసర్ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కొత్తగా వుండడం వేరు, బావుండడం వేరు. కొత్తగా ఉండడానికి క్యారక్టరైజేషన్ అవసరం లేదు, బావుండడానికి అవసరం. 

     శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీపాద రావు) ఒక లా ప్రొఫెసర్. సుమతి (విజయనిర్మల) అనే భార్య, ఓ పెళ్ళయిన కొడుకూ పెళ్లి కాని  కూతురూ వుంటారు. కూతురు శ్వేత ఒక టీవీ రిపోర్టర్. నగరంలో జేకే (మురళీశర్మ) అనే బడా పారిశ్రామికవేత్తా, అతడి తొత్తు డాక్టర్ ముసుగులో ఆర్ఎంపీ క్వాక్  భిక్షపతీ ( పోసాని) వుంటారు. పోతురాజుల గూడెం అనే గిరిజన ప్రాంతం. అక్కడ ఫార్మా కంపెనీ నడుపుతూంటారు. దాంతో జల వాయు కాలుష్యా లేర్పడి భూములు బీడు పోతాయి. ఇంకో పక్క ఏదో కొత్త మందు కోసం మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ, వాళ్ళు  చచ్చిపోతే ఒక శిథిలమైన క్వారీలో శవాల్ని పడేస్తూంటారు. వీటికి వ్యతిరేకంగా పోరాడేవాడు సూర్యారావు ( సాయి కుమార్). ఇతడికి తోడయ్యింది శ్వేత. ఈమె తీస్తున్న డాక్యుమెంటరీ విషయం తెలిసి జేకే ఆదేశాలపై అతడి కొడుకు, భిక్షపతి కొడుకు, ఇంకొకడి కొడుకూ కలిసి ఛానల్ కార్యాలయంలో శ్వేత మీద దాడి చేస్తారు పెన్ డ్రైవ్ కోసం. ఆ సమయంలో అక్కడే వున్న శ్రీశ్రీ అడ్డుకోబోతే  కొట్టి పడేస్తారు. అవతల అద్దాల గదిలో తన కూతురు మీద జరుగుతున్న దాడిని కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేక తల్లడిల్లిపోతాడు శ్ర్రీ శ్రీ.  పెన్ డ్రైవ్ దొరక్క ఆమెని చంపేసి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు కొడుకులూ.   

        వీళ్ళే హంతకులని  కేసు నమోదవుతుంది. కానీ  సరైన  సాక్ష్యాధారాల్లేక విడుదలైపోతారు. శ్రీ శ్రీ ఇంకా తల్లడిల్లి పోతాడు. భార్య సుమతి ఇక ఒకటే మార్గముందని చెప్తుంది. పేపర్లో పడిన ఆ ముగ్గురు హంతకుల ఫోటోలలో ఒకడి ఫోటోని  మార్క్ చేసి,  శ్రీ శ్రీని యుద్ధానికి పంపిస్తుంది. వెళ్లి చంపేసి వస్తాడు. రెండో వాణ్ణీ  మార్క్ చేసి ముహూర్తం పెడుతుంది. ఇంకో విధంగా చంపేసి వస్తాడు. 

     ఇప్పుడు ఎసిపి అజయ్ కుమార్ (నరేష్)  రంగంలోకి వస్తాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో అర్ధం జేసుకోలేకపోతాడు. అయితే  రెండో హత్య చేస్తున్నప్పుడు మంకీ క్యాప్ వేసుకుని వచ్చిన హంతకుడి పోలికలు చెప్తాడు ఆ ఇంటి పనివాడు. ఆ పోలికలతో ఒక ఊహా చిత్రం తయారు చేయిస్తాడు  ఎసిపి అజయ్. ఈ మంకీ క్యాప్ వ్యక్తి  ఎవరో అంతుపట్టదు. అప్పుడు శ్రీ శ్రీ ఒక ఫైలు పంపిస్తాడు. అప్పట్లో తను పోరాడిన తన కూతురి హత్య తాలూకు కేసు వివరాలు అందులో వుంటాయి. ఆ ఫైలు చదువుకున్న అజయ్, అందులోనే శ్రీ శ్రీ పంపుకున్న శ్రీశ్రీ  ఫోటో చూసి, ఊహా చిత్రంతో  మ్యాచ్ చేసుకుని శ్రీశ్రీని అరెస్ట్ చేయడానికి బయల్దేరడంతో సగం కథ ముగుస్తుంది.

     ఈ కథ శ్వేత చనిపోయి, కేసు కొట్టేసిన వాతావరణ నేపధ్యంలో ప్రారంభమవుతుంది. ఆమె ఎలా వుండేదీ, ఏం చేసి ఎలా హత్యకి గురయ్యిందీ అంచెలంచెలుగా  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో ఇంటర్వెల్ లోపే  తెలిసిపోతుంది. నడుస్తున్న కథలో అప్పటికి శ్రీశ్రీ ఇద్దరు హంతకుల్ని కూడా చంపేస్తాడు.  అజయ్ అరెస్ట్ చేయడానికి వస్తే, ముందు పోతురాజుల గూడెం వెళ్లి అక్కడ్నించీ నీ దర్యాప్తు చేసుకో –అని సుమతి దబాయిస్తుంది. లాగి ఓటిచ్చుకుంటుంది కూడా ( ఎంతైనా తెరవెనుక కన్నతల్లే కాబట్టి కొడితే ఓర్చుకుని ఉంటాడు నరేష్, కాస్సేపు పాత్రని  హాయిగా మర్చిపోయి- ఇలా డ్రామా బాగా పండుతుందనుకుని). అజయ్ పోతురాజుల గూడెం వెళ్తే అక్కడున్న సూర్యా రావు తనదైన ఫ్లాష్ బ్యాక్ తో శ్వేత కథ మొదలెడతాడు. ఓ పాట కలుపుకుని ఇరవై నిముషాలు సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ నిజానికి అవసరమే లేదు- ఆమె కథ మొత్తం ఫస్టాఫ్ లో చెప్పెశాక. ఇంకా ఆమె అక్కడ ఉద్యమం తీసి పోరాడుతున్నట్టు చూపడం కూడా అసహజం. ఒక రిపోర్టర్ రిపోర్టింగ్ మాత్రమే చేయగలదు, ఉద్యమాలు లేవదీయడం తీయడం ఆమె పని కాదు. ఆ రిపోర్టింగ్ కూడా ఛానెల్ అనుమతిలేకుండా కూడా చేయలేదు. 

     ఈ ఫ్లాష్ బ్యాక్ ముగింపు ఏమిటంటే, ఆ దుష్ట త్రయం సూర్యా రావు కాలు విరగ్గొట్టడం! దీంతో ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని ఈ లోకంలో కొచ్చేస్తాడు సూర్యారావు. ‘షోలే’  లో సంజీవ్ కుమార్ చేతులని  గబ్బర్ సింగ్ నరకగానే ఫ్లాష్ బ్యాక్ అయిపోయినట్టు-  అలాటి షోలేయిజం కోసం కాలు విరగ్గొట్టి తాపత్రయ పడినట్టుందే తప్ప, మరే ప్రయోజనమూ లేదు. సూర్యారావు కాలు విరిగితే ఏమిటి, చేతులిరిగితే ఏమిటి? దీనికి బదులు ఇంటర్వెల్లో ఆపిన శ్ర్రీశ్రీ ని ఢీకొనడానికి వచ్చిన ఎసిపి అజయ్ తో కథని ముందుకు నడిపించి వుంటే బావుండేది. 

     ఎసిపి అజయ్  శ్రీశ్రీ ఇంటికి వచ్చేముందు  సూర్యారావు వచ్చి శ్రీశ్రీతో మాట్లాడుతూంటాడు. కట్ చేస్తే ఎసిపి అజయ్ వస్తాడు. ఇప్పుడు చూస్తే  శ్రీశ్రీ గాఢనిద్రలో వుంటాడు. ఎసిపిని చూసి సూర్యారావు దాక్కుని ఉంటాడు. ఇదెలా సంభవం ఒకపక్క ఇంటికొచ్చిన సూర్యారావు ఉండగానే శ్రీశ్రీ నిద్రపోవడం? ఎసిపి వచ్చి మాట్లాడుతున్నా మెలకువ రాకపోవడం, సుమతి చెంపఛెళ్లు మన్పించినా లేవకపోవడం? చెంప వాయింప జేసుకుని ఎసిపి వెళ్తున్నప్పుడే లేస్తాడు శ్రీశ్రీ. అతణ్ణి ఏదోలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు అజయ్. కామెడీగా వుటుందీ సీరియస్ సీను- సూర్యారావు కాలు విరిగే సీనులాగే. సినిమాలో కామెడీ లేని లోటు ఇలా తీర్చినట్టున్నారు.

      ఇక శ్రీశ్రీ విషయం. ఛానెల్లో ఆ యెత్తున కూతురి మీద దాడిజరుగుతున్నా మొత్తం ఛా నెల్లో ఇంకెవరూ లేకపోవడం,  సెక్యూరిటీ సిబ్బంది  కూడా లేకపోవడం పోనీలే అని సరిపెట్టుకున్నా, లా ప్రొఫెసర్ శ్రీశ్రీ పోలీసులకి ఫోను చేయకుండా, కూతురి మీద  జరుగుతున్న ఘొరాన్ని  కనీసం చిత్రీకరించకుండా వూరికే తల్లడిల్లి పోతూంటాడు. ఇక కేసెలా గెలుస్తాడు, కేసు గెలవక పోవడానికి తనే కారకుడైనప్పుడు వ్యవస్థ మీద కోపమెందుకు?

       శ్రీశ్రీ చేసే ఇంకో పోరపాటేమిటంటే పనిమాలా కేసు ఫైలు తన ఫోటోతో  సహా ఎసిపికి పంపడం! పాత్ర ఇలా చేయదు, కథ ముందుకు నడవడం కోసం దర్శకుడు, రచయితలూ జోక్యం  చేసుకుని ఇలా చేశారు! 

      ఆ శ్రీశ్రీ రాసి చూపిస్తే, ఈ శ్రీశ్రీ చేసి చూపిస్తాడని ఇచ్చుకున్న బిల్డప్  ప్రకారం కృష్ణ పాత్ర బలంగా గానీ, చేసే హత్యలు ఎమోషనల్ గా గానీ  లేకపోవడం చాలా మైనస్ ఈ సినిమాకి. ఇప్పుడు ఈ తారాగణంతో ఈ సినిమా ఏదో అద్భుతం చేయగలదని కాదు, కనీసం కథా కథనాల్లో, పాత్రచిత్రణల్లో బలంవున్నా, వయసురీత్యా స్టామినా  తగ్గినప్పటికీ అదే ఎస్సెట్ అయ్యేది కృష్ణ పాత్రకి. వయోభారంతో ఓ పెద్ద బాధ్యత మీదేసుకున్న పెద్దమనిషి సతమతమయ్యే మానసిక, శారీరక సంఘర్షణలతో పాత్ర అద్భుతంగా నిలబడేది.  ఆయన కష్టం చూడలేక భార్యా కొడుకూ ఆ ప్రతీకార కాండలో చేతులు కలిపితే ఆ దృశ్యాలు కమర్షియల్ గా మరింత  ప్లస్ అయ్యేవి.    కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఒక మూసలో వుండిపోయి,  పాత మూస తరహాలో ఈ సినిమా తీశారు - ఎక్కడా ఆసక్తి గానీ టెన్షన్ గానీ పుట్టించకుండా. దర్శకుడు ముప్పలనేని శివ టేకింగ్ పద్ధతులు కూడా అప్ డేట్ కాలేదు. 

       నాల్గు పాటలూ ఛాయాగ్రహణమూ అంతంత మాత్రంగా వున్నాయి. కృష్ణలో చురుకుదనం తగ్గింది, విజయనిర్మలలో బాగా పెరిగింది. స్ప్లిట్ స్క్రీన్ లో వీళ్ళిద్దరి పాత సినిమాల బిట్లు వేయడం ఓ గిమ్మిక్కు. ఎసిపి పాత్రలో నరేష్ ప్రొఫెషనల్ గా కన్పిస్తాడు. సూర్యారావుగా సాయికుమార్ ఇంకో నారాయణ మూర్తి అనుకోవాలి. ఇక శ్వేత పాత్ర నటించిన అంగనా రే పాత్రకి మించిన చురుకుదనంతో ఓవరాక్టింగ్ చేస్తున్నట్టు వుంటుంది. విలన్లు మురళీశర్మ, పోసానీలు షరామామూలే.

     సినిమా మహేష్ బాబు వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. ఈ వాయిసోవర్ ముగింపులో కూడా వుంటుంది. మహేష్ బాబు, కృష్ణ, విజయనిర్మల, నరేష్ ల తర్వాత ఇక చిట్టచివర్లో- ‘మనం’ లో మిగిలిన అక్కినేని వంశాంకురం అఖిల్ వచ్చినట్టు- ఇక్కడ సుధీర్ వచ్చేసి- మొత్తం ఘట్టమనేని అల్బంని కంప్లీట్ చేస్తాడు! 

     ఇలాటి క్రియేటివిటీని కాస్త కథమీద కూడా చూపించి వుంటే బావుండేది.

-సికిందర్