రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, సెప్టెంబర్ 2018, మంగళవారం

680 : స్ట్రక్చర్ అప్డేట్స్

     సినిమా కథల్ని కాపాడుకోవడమనే కాన్సెప్ట్ అసలుందా? ఉండే అవకాశం లేదు. బెటర్ మెంట్ పేరుతో ఎన్నో చేతులు పడ్డాక చివరికి ఏ తీరాలకి కథలు చేరతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నప్పుడు, సినిమా కథల్ని కాపాడుకోవడమనే కాన్సెప్ట్ కి స్థానం లేదు. కాపాడుకోవాలనే ఆరాటం ఒక్క ఒరిజినల్ గా రాసిన వ్యక్తికే వుంటుంది. అతడి అర్హతలేమిటో తర్వాతి సంగతి. అతడి కథని అతను కాపాడుకోవా లనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ కాపాడుకునే పరిస్థితులు అతడి చేతిలో వున్నాయా? బెటర్ మెంటు అనేది నిరంతర ప్రక్రియ అనీ, కాపాడుకోవడానికి ఆ ప్రక్రియ ఒక చోటే ఆగిపోయేది కాదనీ బ్రేకులేస్తూంటే అతడి చేతిలో ఏముంటుంది? మరి అదొక నిరంతర ప్రక్రియగా అన్నేసి చేతులు అన్నేసి బెటర్ మెంటులు చేస్తున్నా 90 శాతం ఫ్లాపులే వస్తున్నాయే? ఎందుకని? అప్పుడా బెటర్ మెంటుల కర్ధమేమిటి? అసలా బెటర్ మెంటు చేతుల ప్రాతిపదికేమిటి? ఒకప్పుడు – ప్రపంచమింకా కుగ్రామం కానప్పుడు, నాలెడ్జి వనరులు దాదాపు లేని పరిస్థితి. సాహిత్యంలోంచీ, నాటకాల్లోంచీ వచ్చిన వాళ్ళు ఆయా అనుభవాల్లోంచే సినిమాలు తీస్తూ పోయారు. ప్రపంచం కుగ్రామయ్యాక - అంటే నెట్ యుగం ప్రారంభమయ్యాక – సాహిత్యంతో, నాటకాలతో తెగతెంపులు చేసుకున్న కొత్త తరం అవతరించింది. ఈ తరం కేవలం సినిమాల్ని చూసి సినిమాలు తీసే సెకెండ్ హేండ్ పైపై క్రియేటివిటీకి అలవాటు పడింది. దీంతో బెటర్ మెంటుల అవసరాలు బాగా పెరిగి పోయాయి. మళ్ళీ ఈ బెటర్ మెంటులకి ఫస్ట్ హేండ్ క్రియేటివ్ కుంపటి లేదు. నెట్ యుగం నెట్ యుగమే, తమలోకం తమదే. ఇదీ అసలు సమస్య! 

మిమ్మల్నే, జాగ్రత్త!
     నెట్ యుగం పుణ్యమాని షార్ట్ మూవీస్ కీ, వరల్డ్ మూవీస్ కీ, ఇంకా రకరకాల విజువల్ మీడియాలన్నిటికీ ప్రమాదకర స్థాయిలో ఎక్స్ పోజ్ అవుతున్న కొత్త తరానికి ఓ అసహనం వుంటుంది. ఎవరేం చెప్పినా ఇక విన్పించుకోలేని అసహనం. చెప్పించుకోవాలని అన్పిస్తుంది, ఆ చెప్పించుకునేది తాము అనుకున్నదాన్ని మెచ్చుకునేలా మాత్రమే వుండాలన్పిస్తుంది. వుండకపోతే తమకే ఎక్కువ తెలుసనిపిస్తుంది. ఈ నెట్ యుగంలో అన్నీ వాటికవే తెలిసిపోతున్నప్పుడు, ఇంకా చెప్పించుకునే అవసరమేమిటన్న అసహనం వచ్చేస్తుంది. వెరీ వెల్, మంచిదే. అయితే  ఇక్కడే వుంది అసలు సమస్య!

         ఈ నెట్ యుగంలో తెలుసుకుంటున్నదేమిటి? నేర్చుకుంటున్న దేమిటి? సులభంగా కాపీలు, కట్ అండ్ పేస్టింగులు, రీసైక్లింగులు. అరచేతిలో ఇంటర్నెట్ లో విజువల్ వనరులు ఇందుకే వున్నట్టు. నెట్ లో ఇంత చూస్తున్నాం కాబట్టి తమకే నాలెడ్జి ఎక్కువున్నట్టు. ఇతరుల నాలెడ్జి ఎవరిక్కావాలి. ఐతే ఇదే ఇంటర్నెట్ ఇంకో గొప్ప సేవ కూడా చేస్తోంది. ఈ సేవని కూడా గుర్తించాలనిపించదు. కొన్ని వేలమంది నిరంతర శ్రమతో ఈ సేవలందిస్తున్నా సరే, అవసరం లేదన్పిస్తుంది. అమెరికన్ సినిమాలు ప్రాణప్రదమన్పిస్తుంది. ఆ సినిమాలకి కారణమైన అమెరికన్ నాలెడ్జి పరాయిదన్పిస్తుంది. ఇంటర్నెట్ లో సరఫరా చేస్తున్న లక్షలాది పేజీలకి పేజీల స్క్రీన్ ప్లే నాలెడ్జి అంతా తమకి సంబంధం లేని వ్యవహారమన్పిస్తుంది. 

        ఇప్పటి తరానికి అంది వచ్చిన అద్భుత వరం ఇంటర్నెట్ స్క్రీన్ ప్లే నాలెడ్జి అని అంగీకరించడానికి మనస్కరించదనిపిస్తుంది. ఈ నాలెడ్జి ఇంత విస్తారంగా ఉచితంగా లభిస్తూంటే దీని వంకే చూడకూడదన్పిస్తుంది. తమకున్న విజువల్ ఎక్స్ పోజరే గొప్పదనిపిస్తుంది. ఉచితంగా మనసారా సొంతం చేసుకుంటున్న విజువల్ నాలెడ్జి ముందు క్రియేటివ్ నాలెడ్జి తక్కువ స్థాయిదన్పిస్తుంది.  తిరస్కరించాలనిపిస్తుంది. ఖండించాలన్పిస్తుంది. బాయ్ కాట్ చేయాలన్పిస్తుంది.

     ఇదే పరిస్థితి బెటర్ మెంటులకీ కూడా. కేవలం విజువల్ ఎక్స్ పోజర్స్ తోనే బెటర్ మెంటులు. ఇందాక పైన చెప్పుకున్నట్టు, ఒకప్పుడు నెట్ పూర్వపు యుగంలో, దాదాపు సినిమా నాలెడ్జి వనరులు లేవు. ఇప్పుడేమైంది? ఇప్పుడు నాలెడ్జి వనరులు చుట్టూ కళ్ళముందే తారట్లాడుతున్నా కళ్ళు మూసుకోవాలన్పిస్తుంది. నెట్ యుగం నెట్ యుగమే, మన లోకం మనదే అనుకుని సుఖంగా వుండిపోవాలన్పిస్తుంది. చదివి నేర్చుకోవడం చవటల పని అన్పిస్తుంది. పనీపాటా లేనివాళ్ళే చదువుకుంటూ కూర్చుంటారన్పిపిస్తుంది. 

          ప్రపంచంలో ఏ దేశమూ అందించని స్క్రీన్ ప్లే నాలెడ్జి అమెరికా అందిస్తోంది. ఇంకే దేశం నుంచీ ఒక స్క్రీన్ ప్లే పుస్తకం రాదు, నెట్ లో వ్యాసం కూడా రాదు. ఒక్క హాలీవుడ్డే  అలా అభివృద్ధి చేసుకుంది. ఎందరో హాలీవుడ్ దర్శకులు, రచయితలు కూడా నాలెడ్జిని దాచుకోకుండా నెట్ లో పంచి పెడుతున్నారు. తమకి తెలిసిన నాలెడ్జి బయటికి చెప్తే ఇంకొకడు బాగు పడిపోతాడనో, తమని మించి పోతాడనో అనే అనారోగ్యకర ఆలోచనా విధానం వాళ్ళకి లేదు. ఎంత పంచితే అంత నాలెడ్జి పెరుగుతుంది. హాలీవుడ్ సినిమాలని  నిశితంగా పరిశీలిస్తూ వాటిలో లోపాలతో, కొత్త విషయాలతో ఎప్పటి కప్పుడు నాలెడ్జిని అప్డేట్ చేస్తున్నారు. ఇక పుస్తకాలకైతే, సాఫ్ట్ వేర్ లకైతే లెక్కలేదు. హాలీవుడ్ ఇంతా చేస్తూంటే సక్సెస్ శాతం 50 దగ్గర వుంటోంది. ఏమీ చెయ్యని టాలీవుడ్ కి 10 శాతానికి కూడా తాకడం లేదు. 

       పూర్తిగా విజువల్ నాలెడ్జికి బానిసలవడమే అసలు సమస్య. దాని పక్కనే నెట్ లో నిండిపోతున్న క్రియేటివ్ నాలెడ్జికి కళ్ళు మూసుకోవడమే అసలు మానసిక సమస్య. నెట్ యుగమంటూనే నాలెడ్జికి తలుపులేసుకుని, చాటుమాటున ఫారిన్ విజువల్స్ చూసుకుని, భలే నాలెడ్జిరోయ్ అని చీర్స్ చెప్పుకోవడం. ఆ మందు గ్లాసుల  ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టుకోవడం. విజువల్ ఎక్స్ పో్జర్స్ కి లోనైన వాళ్ళు విజిబిలిటీ కోసమే ఆరాటపడతారు. 

          సరే, ఎన్ని చెప్పుకున్నా మారేది కాదు. టాలీవుడ్ లో ఎవరో మారాలని అమెరికన్ నిపుణులు రాస్తూ కూర్చోరు. అలాటి ఆశలేమీ అమెరికన్లకి లేవు. హాలీవుడ్ నుంచి క్రిస్టఫర్ నోలన్ వచ్చి తెలుగులో కొంచెం రాసుకుంటానబ్బా అన్నా- ‘ఇదేమిటీ? పాసివ్ క్యారెక్టర్స్ ఏవీ? మిడిల్ మటాష్ ఏదీ? కథని నిట్టనిలువునా చీల్చి పారేసే సెకండాఫ్ సిండ్రోం ఏదీ? ఎండ్ సస్పెన్స్ ఏదీ? సింగిల్ స్టోరీలో డబుల్ గోల్స్ ఏవీ? తమాషాగా వుందా? పోపోవయ్యా, పెద్ద చెప్పొచ్చావ్. మా ఫ్లాపులతో కోటాను కోట్లు పోగొడుతూ మేమేదో సుఖంగా వుంటే నీ శాస్త్రం పట్టుకొచ్చావా? నీ సినిమాలు మాకు కావాలి, శాస్త్రం అక్కర్లేదు. 
మాకు వాస్తు శాస్త్రం, ముహూర్తాల శాస్త్రం చాలు. మేమిలా మిగిలాం. దయచేసి దండం పెడుతున్నాం... నువ్వెళ్ళి ఫో!’ – అనేసి తరిమేసే చేతులు వెంటపడతాయి. క్రిస్టఫర్ నోలన్ పారిపోయి హాలీవుడ్ కి ఎలాగో చేరుకుని, టాలీవుడ్ కి నెట్ ని కట్ చేయించి పారేస్తాడు.

      నెట్ ని కట్ చేయక పోయినా అందులో పడున్న నాలెడ్జిని ఇక్కడెవరూ  పట్టించు కోరని అతడికి తెలీదు పాపం. అందుకని హెచ్ ఆర్ డికోస్టా అనే రచయిత టాలీవుడ్ వైపు కొంత కొత్త నాలెడ్జిని అప్డేట్ చేసి వదిలాడు వూరికే అలా పడుంటుందని. అదేమిటంటే, చాలామంది చెప్పేదే. ప్లాట్ పాయింట్ వన్ ని, అంటే కాన్ ఫ్లిక్ట్ ని, అంటే ప్రధాన పాత్ర గోల్ ని పటిష్టం చేసుకోమనే. కథ బతుకంతా దాంట్లోనే వుంటుందనే. జేమ్స్ బానెట్  కాన్షస్ – సబ్ కాన్షస్ లడాయిగా పెట్టుకోమని ఎప్పుడో చెప్పాడు. బెటర్ మెంట్ భేటీల్లో కథకుడు కథని కాపాడుకోవాలంటే – ‘గొప్ప కథకి పునాది వేస్తే మంచి కథ మిగలొచ్చు’ అనే వ్యాసం దీన్నాధారంగానే రాసి ఈ బ్లాగ్ లోనే  పెట్టాం. ఇప్పుడు  డికోస్టా చెబుతున్నది కూడా, దీన్నే కంపెనీల్లో ప్రాజెక్టు మేనేజిమెంట్ లో భాగంగా బోధించే చిట్కాలని వర్తింపజేసుకుని, ప్లాట్ పాయింట్ వన్ ని ఎలా బలంగా తీర్చిదిద్దుకోవచ్చనే. ఏమంటున్నాడో చూద్దాం...

            బలహీన కథలు. ఎవరూ రాయాలని ఇష్టపడరు. 

          అయినా ఎన్నో సినిమాలూ నవలలూ బయ్యర్లని ఆకర్షించలేని ఉల్లిపొర ల్లాంటి కథలతో వుంటున్నాయి. ఇదెలా జరుగుతోంది? ప్రధాన పాత్రకి ఒక స్పష్టమైన, బలమైన గోల్ లేకపోవడం వల్ల. కథలకి ఈ గోల్ అనేది ఒక ముఖ్యా వసరం. అదేం చేస్తుందంటే - 

          1) కథకి వెన్నెముకని సమకూరుస్తుంది.

       
2) ప్రత్యర్ధి పాత్రెవరో నిర్ణయిస్తుంది.
        3) గోల్ కోసం పెట్టిన పణాన్ని నిర్వచిస్తుంది. 

          మీ ప్రధాన పాత్రకి గోల్ అంటూ లేకపోతే, మీ కథ పేజ్ టర్నర్ అవడం అసాధ్యాల్లో కెల్లా అసాధ్యం. ఇంతే, చాలా సింపుల్. చాలామంది రచయితలు దీన్ని గుర్తిస్తారు. సమస్యేమిటంటే, మర్చిపోతారు. ఇంకేదో పాత్ర పాలబడి ప్రధాన పాత్రని మర్చిపోతారు. కథకి దారి కనపడక కాటు కలిసిపోతారు. దీన్నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే, రాసే ముందు ప్రధాన పాత్రకి స్పష్టమైన గోల్ ఏర్పడేలా చూసుకోండి. అలాగని పాత, రొటీన్ పద్ధతిలో గోల్ ఏర్పాటుకి పూనుకోకండి. ‘కేసినో రాయల్’ లో, ‘దేరార్ డిన్నర్ జాకెట్స్ అండ్ డిన్నర్ జాకెట్స్’ అని వెస్పర్ లిండ్ అన్నట్టు, కొత్త గోల్ విధానాన్ని ఎంపిక చేసుకోండి ( పై డైలాగుని గోల్స్ తో చెప్పుకుంటే- ‘గోల్స్ వున్నాయి, గోల్స్ కూడా వున్నాయ్’  అన్న అర్ధం వస్తుంది. అంటే గోల్స్ వున్నాయి, ఇంకా మంచి గోల్స్ కూడా వున్నాయని పూర్తి అర్ధం –వ్యాసకర్త ). అప్పుడు జేమ్స్ బాండ్ ఎంపిక చేసుకున్నట్టు, మీరు రెండో దాన్నే ఎంపిక చేసుకోవాలి. ఇక్కడే మీరొక ప్రాజెక్టు మేనేజరు లాంటి బుద్ధి కుశలతని ప్రదర్శించాల్సి వస్తుంది. 

      ప్రాజెక్టు మేనేజర్లురు టీముల లక్ష్యాల సాధనని రొటీన్ గా SMART ఫ్రేమ్ వర్క్ నుపయోగించి నిర్వచిస్తూంటారు. ఇందులోని ఒక్కో అక్షరం ఒక్కో కర్తవ్యాన్ని సూచిస్తుంది. దీంతో గోల్స్ సాధనకి టీముల సామర్ధ్యం విశేషంగా పెరుగుతుంది. 

       ఈ అప్రోచ్ రచయితగా మీకూ ప్రాక్టికల్ గానూ విలువైనది గానూ వుంటుంది. మీ ప్రధాన పాత్ర గోల్ ఎంత SMART గా వుంటే, మొత్తంగా మీరు రాసే కథ అంత బలంగా మారుతుంది. 

          మరి SMART గోల్స్ లక్షణాలేమిటి? అవి ఈ కింద చూడండి...
          S
Specific
         
M Measurble
          A
Actionable
          R
Realistic
          T
Time –bound
          ముందుగా S గురించి రేపు!

సికిందర్