రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 15, 2019

824 ; స్క్రీన్ ప్లే సంగతులు -4


(క్రియేటివ్ యాస్పెక్ట్ కంటిన్యూ)
         
‘నువ్వే సమస్తం’ పరిచయ పాట మధ్యలో సీఈవో రిషిని రిపోర్టర్ (ఝాన్సీ) చేసే ఇంటర్వ్యూ వస్తుంది. 950 కోట్ల రూపాయలు ప్లస్ కంపెనీ షేర్స్ ప్యాకేజీతో ఘనంగా అప్పాయింటయిన రిషిని అడుగుతుంది - ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీకెలా అన్పిస్తోందని. అప్పుడొక ఫ్లాష్ కట్ పడుతుంది. రిషి చిన్నప్పటి దృశ్యం. ఇందులో చిన్నప్పుడు అతడి పాయింటాఫ్ వ్యూలో అతడి తల్లి దండ్రులు (జయసుధ, ప్రకాష్ రాజ్), అప్పుల వాడూ కన్పించి, కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఎస్టాబ్లిష్ అవుతుంది. తన చదువు కోసం చేసిన పదివేల అప్పు తండ్రి కట్టలేని పరిస్థితి. ఈ ఫ్లాష్ కట్ మూడు కథావసరాలు తీర్చే ఉద్దేశంతో  వుంది. చిన్నప్పుడు అతడి పాయింటాఫ్ వ్యూలో అతడి తల్లిదండ్రుల పాత్రల్ని పరిచయం చేసెయ్యడం, చిన్నప్పటి రిషి - ఇప్పటి రిషిల మధ్య అభివృద్ధిని విజువల్ కాంట్రాస్ట్ గా  చూపడం, ఇక రాబోయే ఫ్లాష్ బ్యాక్ కి ప్రేక్షకుల్ని సిద్ధం చేస్తూ ఇలా టీజర్ ని వదలడం. 

         
సాధారణంగా ఫ్లాష్ బ్యాకులు ఉన్నట్టుండీ ఒకేసారి మొదలైపోతాయి. అప్పుడు, హమ్మో మొదలెట్టాడ్రా సుత్తీ అని ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి. ఫ్లాష్ బ్యాకులిలా చులకనై పోయాయి. ఇలా కాక, ఫ్లాష్ బ్యాక్ వుండబోతోందని హీరో జ్ఞాపకంగా, నాందీ ప్రస్తావనగా ఒక షాటు వేసి, ముందస్తుగా టీజర్ లా వదిల్తే, సర్దుకుని చూడ్డానికి సంసిద్ధమవుతారు. పైగా టీజర్ ఒకవైపు వూరిస్తూంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే అవకాశం కూడా వుండొచ్చు. నిజానికి ఈ మిడిల్ -1 లో వచ్చిన ఈ ఫ్లాష్ కట్ బిగినింగ్ విభాగంలోనిది. బిగినింగ్ లోనే కదా పాత్రల పరిచయాలుంటాయి. రిపోర్టర్ అడిగిన ప్రశ్న తగు సమాచారాన్ని డిమాండ్ చేయడంతో, ఈ బిగినింగ్ బిట్ ని తెచ్చుకుని మిడిల్ -1 లో ఇలా వాడుకున్నారు.

          అయితే రిషి ఈ గతాన్ని తల్చుకున్న ఈ సమయంలో తండ్రి జీవించి లేడు. ఈ విషయం పూర్తి ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పట్ల ద్వేషం తోనే వుంటాడు. ఇప్పుడు తండ్రి మీద అదే ద్వేషంతో మాట్లాడడు, ఆర్ధిక దుస్థితి గురించే మాట్లాడతాడు. ‘నువ్వే సమస్తం’ పాట ఫ్రెండ్ త్యాగం రిఫరెన్స్ పాయింటుగా లేనట్టు, ఈ ఫ్లాష్ బ్యాక్ బిట్ కి రిషి వ్యాఖ్యానం విషయంలో అలాటి పొరపాటు చేయలేదు. అతను తండ్రి చనిపోయిన రిఫరెన్స్ పాయింటు నుంచే మాట్లాడతాడు. 

           రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఈ గతాన్ని తల్చుకుని అంటాడు, ‘ఈ రోజు నేను సంపాదించే వేలకోట్ల కన్నా, ఆ రోజు పదివేలు లేవే అన్న బాధే ఎక్కువ గుర్తుంటుంది’ అని. 

          ఇక్కడొచ్చింది సమస్య. పాత్రచిత్రణతో చిక్కు. ముందు ముందు కథలో రిషి ఈ స్థాయికి ఎదగడానికి  రహస్యంగా అతడి ఫ్రెండ్ రవిశంకర్ చేసిన మేలు మాత్రమే కారణమని మనకి తెలుస్తుంది కాబట్టి, దీన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుని ఇప్పుడు మనమిక్కడ రిషి మాటల్ని చూడాలి. పరిచయ పాట ‘నువ్వే సమస్తం’ ని ఈ రిఫరెన్సు పాయింటు ప్రకారమే దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో చూసి ఆ పాట సరికాదని గమనించాం. ఇప్పుడు ఈ ఫ్రెండ్ త్యాగమనే రిఫరెన్సు పాయింటుతో బాటు, ఇకముందు ఫ్లాష్ బ్యాకులో వచ్చే రిషి క్యారెక్టరైజేషన్ ని బట్టి కూడా ఇక్కడ రిషి మాటల్ని చూడాలి. ఫ్లాష్ బ్యాకులో, అంటే బిగినింగ్ విభాగంలో, రిషి స్థూలంగా ఇగోతో బిహేవ్ చేసే క్యారెక్టర్. సక్సెస్ కోసం అన్నీ పక్కన పెట్టేసే ఇగో సెంట్రిక్ క్యారెక్టర్. ఇది మంచిదే. ఇగో ని మెచ్యూర్డ్ ఇగో స్థాయికి తీసికెళ్ళి చూపించడమేగా గొప్ప సినిమాల లక్షణం. ఈ సినిమా  కూడా రిషి (ఇగో), మహర్షి (మెచ్యూర్డ్ ఇగో) స్థాయికి ఎదిగే ఉదాత్త ప్రయాణపు కథేగా? 

          మరి ఇగో రిషి నేపధ్యంలోంచి ఇగో రిషి వచ్చి, ప్రపంచాన్నేలేద్దా మనుకున్నసక్సెస్ ని ఇప్పుడిప్పుడే సాధించి,  ఇప్పుడే మెచ్యూర్డ్ ఇగో మహర్షిలా మాట్లాడితే,  ఇక మహర్షి అయ్యే సినిమా ఏముంటుంది?

ఇంటర్వ్యూ ప్రశ్న జవాబులు 
        ‘ఈ రోజు నేను సంపాదించే వేలకోట్ల కన్నా, ఆ రోజు పదివేలు లేవే అన్న బాధే ఎక్కువ గుర్తుంటుంది’ అనడంలో ఇగో ఎక్కడుంది, రియలైజేషన్ తప్ప? ముందుకు దూసుకెళ్ళే వాడికి గతం గురించెందుకు? ఇప్పుడే రియలై జేషన్ తో మెచ్యూర్డ్ గా మాట్లాడితే ఇక పాత్రోచిత చాపం (క్యారెక్టర్ ఆర్క్) ఎక్కడుంటుంది?  ఈ సక్సెస్ సాధించిన అతడి ఇగో, పొగరు, విగరు అన్నీ వీగిపోయే ఘట్టం ముందు ముందు ఫ్రెండ్ చేసిన మేలు తెలిసినప్పుడు కదా? పాత్ర ఉత్థాన పతనాలతో కూడిన ఈ క్యారెక్టర్ ఆర్క్ ఏర్పాటు కాకపోతే, పాత్ర చిత్రణ కర్ధమేముంటుంది? 

          ఇంకో మాట కూడా ఫిలాసఫికల్ గా అంటాడు - మనం సక్సెస్ అయ్యామో లేదో గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడెక్కడున్నాం, దీన్ని బట్టే తెలుస్తుందని. ఇంత సాత్వికంగా మాట్లాడడం ఇగోతో దూకుడుగా సాగిపోవాలన్న అతడి ఏకోన్ముఖ మనస్తత్వాన్ని ప్రతిబింబించదు. ఫ్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ గా వున్నప్పుడు ఒక పాత కొటేషన్ అంటాడు - సక్సెస్ కి ఫుల్ స్టాప్ లేదని, కామాలే వుంటాయనీ. అలాంటప్పుడు – ‘సక్సెస్ ఒక నిరంతర ప్రయాణం. ఇక్కడితో ఆగుతాననుకుంటున్నారా? అది మీ అజ్ఞానం. ఇంకేమేం చేస్తానో నాకే తెలీదు’ - అని వుంటే అతడి ఇగో సంతృప్తి పడే సమాధానమయ్యేది. ఇతను ఈ స్థాయి నుంచి అప్పుడే ఇంకే స్థాయికీ వెళ్తాడోనని ప్రేక్షకులకి ఒక ఆసక్తినీ, ఆదుర్దానీ పుట్టించినట్టు కూడా అయ్యేది. ఒక సీను వుందంటే అది ఎందుకుంటుంది - పాత్రగురించి ఓ కొత్త విషయం చెప్పడానికో, లేదా కథ ముందుకెళ్ళే ఓ పాయింటు కల్పించడానికో కదా? మున్ముందు ఢమాల్ మని కింద పడే పాత్రని వీలైనంత పైకి తీసి కెళ్ళి చూపించడం కథనాన్ని చైతన్యవంతం చేసే డైనమిక్స్ కదా? 

          టెక్నికల్ గా చెప్పుకోవాలంటే, రిషి ఇప్పుడింకా అదే ఫ్లాష్ బ్యాక్ లోని నెగెటివ్ షేడ్ తోనే వుండాలి. ఫ్రెండ్ వల్ల తను సక్సెస్ అయ్యాడని తెలిశాకే, పాజిటివ్ షేడ్ లోకి రావాలి. అంతవరకూ ఎక్కడా ఫిలాసఫికల్ గా మహర్షిలా వుండకూడదు. ఇది కామన్ సెన్సు. రిపోర్టర్ ఇంకో ప్రశ్న అడుగుతుంది- సక్సెస్ కి డెఫినేషన్ ఏమిటని. అప్పుడంటాడు - మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతామని. ఇప్పుడు నిజమైన రిషిలా ఇగోతో మాట్లాడుతున్నాడు. ఇలా రిషిలా కాసేపు, మహర్షిలా మరి కాసేపూ మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇలా ఎందుకు జరిగిదంటే,  ఫ్రెండ్ త్యాగమనే రిఫరెన్స్ పాయింటుని, ఫ్లాష్ బ్యాకులో కొనసాగిన రిషి క్యారెక్టరైజేషన్ నీ,  దృష్టిలో పెట్టుకోకుండా,  ఈ ప్రారంభ దృశ్యాలు రాసుకుపోవడంవల్ల ఈ రసభంగం కలిగినట్టు అన్పిస్తోంది. 

          ఇంతాచేసి రిపోర్టర్ ‘మీ సక్సెస్ వెనుక ఎవరున్నారంటారు?’ అని అడగాల్సిన సహజ ప్రశ్న ఒక్కటి అడగదు. అడిగి వుంటే రిషి క్యారెక్టర్ కి ఐరనీ పార్టు ఇంకా పెరిగి కథనం మజా వచ్చేది. తన విజయం వెనుక ఫ్రెండ్ వున్నాడని ఇంకా తెలీదు -  ఈ ప్రశ్నకి ఏమని చెప్తాడు? నోటెడ్ ఇగోయిష్టుగా ఏం చెప్పినా నిజం బయటపడ్డప్పుడు ఢమాల్ మనే సమాధానమే అవుతుంది. ఇలా ఈ ఒక్క సీన్లో క్యారెక్టర్ కి సెటప్ చేసి తర్వాత, ఐరనికల్ గా పే ఆఫ్ చేయాల్సిన అంశాలున్నాయి. ఇదంతా ముఖ్యం కాదనుకున్నారేమో. స్క్రీన్ ప్లే లో ఈ ప్రారంభ దృశ్యాలు బిగినింగ్ విభాగపు దృశ్యాలు కావు, ఫ్లాష్ బ్యాకులో వున్న బిగినింగ్ ని పూర్తి చేసుకుని వచ్చిన మిడిల్ -1 దృశ్యాలు. కాబట్టి ఫ్లాష్ బ్యాకుగా వున్న బిగినింగ్ లో పరిచయంచేసిన రిషినే అదే క్యారెక్టరైజేషన్ తో మిడిల్ - 1 లోనూ  కంటిన్యూ చేయాలే తప్ప, అతడికి ఫ్రెండ్ గురించిన నిజం తెలిసేదాకా మార్చడానికి వీలుండదు. 

          ఇక క్లాస్ మేట్స్ తో బాటు ప్రొఫెసర్ సెలెబ్రేషన్స్ కి రావడంతో, రిషి పూర్తి స్థాయి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయి, ఈ మిడిల్ -1 కి బ్రేక్ ఇచ్చి - ఫ్లాష్ బ్యాక్ లోకి, అంటే బిగినింగ్ విభాగంలోకి వెళ్తుంది కథనం. 

బిగినింగ్ సంగతులు 
        బిగినింగ్ బిజినెస్ లో ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథ దేనిగురించో నేపథ్య వాతరణ సృష్టి చేసి, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, ప్లాట్ పాయింట్ దగ్గర ప్రధాన పాత్ర పరిష్కరించడానికి సమస్యని స్థాపించాలి.

          ఇక్కడ క్యారెక్టర్ ఏమిటో పరిచయమవుతాడు రిషి. చదువు, తండ్రితో విభేదం, పూజతో ప్రేమ, రవిశంకర్ తో స్నేహం అన్న చతుర్ముఖాలుగా బిగినింగ్ బిజినెస్ లో రిషి ఇంటరాక్షన్స్ వుంటాయి.  వీటిలో పాత్ర తత్త్వం ఎస్టాబ్లిష్ అయ్యే చదువు కోణం ప్రధానమైనది. రిషి స్వార్ధంతో, ఇగోతో వుంటాడు.  పదేపదే తన సక్సెస్ గురించే మాట్లాడతాడు. మాటలే తప్ప విజువల్ సపోర్టు వుండదు. జీవితంలో ఇన్నత స్థానాలకి  చేరుకోవాలన్న తన సంకల్పాన్ని విజువలైజ్ చేసి ప్రేక్షకులకి  చూపించాలనుకోడు. ప్రేక్షకులకి ఇదో వెలితి. 


          ప్రొఫెసర్ తో సక్సెస్ గురించి ఒక సీనుంటుంది. ఇందులో ఇద్దరుఅథ్లెట్స్ ఉసైన్ బోల్ట్,  మో ఫరాలనిప్రస్తావిస్తాడు. వీళ్ళల్లో తన సక్సెస్ గోల్ కి ఎవరు ఎందుకు ఆదర్శమో చెప్తాడు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు అథ్లెట్స్ విజువల్స్వేసి, తన ఆశయాన్ని దృశ్యాత్మకంగా  ప్రేక్షకులకి డెమో ఇవ్వాలనుకోడు - వంద సార్లు మాటల్లో చెప్పేకన్నా ఒక్క విజువల్ వేస్తే సరిపోయేదానికి! ఈ అథ్లెట్స్ ఎవరో ఎంతమంది ప్రేక్షకులకి తెలుసు.  మిడిల్ - 1 దగ్గర్నుంచీ వెనక్కొస్తే ఈ బిగినింగ్ లో కూడా సక్సెస్ గురించి అతడి కొటేషన్స్ రకరకాలుగా రిపీటవుతూ వుంటాయి. వరుసగా వారానికొకటిగా మజిలీ, జెర్సీ, చిత్రలహరిల్లో కూడా ఇవే వినీవినీ వున్నాం. తనేం అవ్వాలనుకుంటున్నాడో దృశ్యదృశ్యాలుగా వూహించుకోవడం మనిషి స్వభావం. ఇలా రిషి మానసిక లోకాన్ని దృశ్యాత్మకంగా ఆవిష్కరిస్తే, ప్రేక్షకులు మానసికంగా ఆ పాత్రలో సంలీనమయ్యే పరిస్థితే వేరు. రిషి మహర్షి అయ్యే ముక్తి మార్గాన్ని అంతరంగ విజువల్ ట్రీట్ గా చూపించక పోతే ఎలా. ఏకంగా డ్రీం సాంగులే వేసుకుంటున్నప్పుడు, తన జీవితాశయం గురించిన ఒక్క డ్రీం సీక్వెన్స్ వేసుకుంటే  పోయేదేమిటి



          ఏం చేద్దామనుకుంటున్నావని ప్రొఫెసర్ అడిగినప్పుడు, ప్రపంచాన్నేలేద్దామనుకుంటున్నానని అంటాడు. మహేష్ బాబు స్టార్ డమ్ ని ఎలివేట్ చేసే కమర్షియల్ డైలాగు ఇది. అయితే ఈ డైలాగు డీప్ నాలెడ్జితో అంటాడు. ప్రపంచాన్నేలాలంటే అలెగ్జాండర్ లా దండయాత్రలు చేయడం కాదని - గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి ఒక్క డిజిటల్ అప్లికేషన్ కనిపెడితే ప్రపంచం చేతిలో వుంటుందనీ అంటాడు. నిజమే, ఆటమిక్ వార్ ని దేశాలు కోరుకోవడం లేదు. ఓట్ల కోసం బూచిగా చూపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఎకనమిక్ వార్. ఎకనమిక్ వార్ తో ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నారు. ఇక పైన జరిగేవన్నీ అభివృద్ధి కోసం ఆర్ధిక యుద్దాలే.



 గోల్ కి మూలమేమిటి? 
         ఇక రిషి చదువుకుని యూఎస్ కెళ్ళి పోతానని తండ్రితో అనడంతో గోల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ గోల్ కి మూలం ఎంత సముచితంగా వుందో చూస్తే, చిరుద్యోగి అయిన తండ్రి అంటే రిషికి చిన్నచూపు, చాలా ద్వేషం కూడా. ఇదే తండ్రిని బయట జనం ఇష్టపడతారు. తల్లి వుంటుంది గానీ ఆమె తండ్రీ కొడుకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ని తీర్చాలనుకోదు. ఎప్పుడో తండ్రి చనిపోయాక ఆయనలా రాజీపడి బ్రతకడానికి కారణమేమిటో అప్పుడు  చెప్తుంది. రిషికి చదువు సహా అన్నిఅవసరాలూ తండ్రి సంపాదనతోనే తీరుతున్నప్పుడు తండ్రి మీద ద్వేషమెందుకో అర్ధంగాదు. తండ్రి తనని పట్టించుకోక పోతేకదా?  ఈ ‘మహర్షి’ కి ముందు వారమే విడుదలైన ‘నువ్వు తోపురా’ లో తల్లితో హీరోది కూడా ఇదే అర్థంలేని ప్రవర్తన. ఆ చిన్న సినిమాకీ, ఇప్పుడీ పెద్ద స్టార్ సినిమాకీ, డ్రామాని సృష్టించే సామర్ధ్యంలో తేడా కన్పించడం లేదు.


          అసలు తన చదువుకి తండ్రి మీద ఆధారపడకుండా,  పై పెచ్చు కుటుంబానికి బాసటగా వుంటూ, కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆన్ లైన్లో సంపాదించుకునే అవకాశాలు బోలెడు. ఈ నాలెడ్జి లేనివాడు సక్సెస్ గురించి ఎలా మాట్లాడతాడు.  ఈ రోజుల్లో ఇలాటి యూత్ ఎవరూ ఖాళీగా లేరు. ఆఖరికి స్మార్ట్ ఫోనుల్లో గేములు ఆడి  సంపాదించుకుంటున్నారు. తనని జయించలేని రిషి ప్రపంచాన్ని జయిస్తానంటాడు. ఇది ఈ కాలపు పాత్రలా  కాక, గ్లోబలైజేషన్ పూర్వపు మూస ఫార్ములాగా వుండడం శోచనీయం. 

           ఇంకా శోచనీయమేమిటంటే, తన గోల్ కి తను చెప్పుకునే కారణం. ‘ఆయన్ని చూసే ఓడిపోవడమంటే నాకు భయం పుట్టింది’ అని తండ్రి నుద్దేశించి తల్లితో అంటాడు. తండ్రితో అవసరాలు తీర్చుకుంటూ తండ్రినే ఓడిపోయిన వాడు అంటాడు. ఇంతే కాదు, తండ్రి తోనే నేరుగా అనేస్తాడు - నిన్ను చూసే నీలాగా కాకూడదన్న గోల్ ఏర్పడిందని. ఇది మరీ దారుణం. అన్నిటికీ తండ్రి మీద ఆధారపడి జీవిస్తూ ఈ మాటనడం. ‘నాన్నా నాకు నువ్వు చాలా చేశావు. మన కష్టాలు తీరతాయి, నన్ను నమ్ము’ అనొచ్చుగా?  అకారణంగా తండ్రిని ద్వేషించి, ఈ ద్వేషంలోంచే అన్యాయంగా గోల్ ని పుట్టించుకోవాలా? తండ్రిని అర్ధం జేసుకున్న కొడుకుగా తన బాధ్యత లోంచి పాజిటివ్ గా గోల్ ని పుట్టించుకోలేడా? అసలు గోల్ ఇలా పుట్టడమేమిటి - ఎవరికైనా చేస్తున్న పనే కోరిక (గోల్) ని పుట్టిస్తుంది. చదువుకుంటూంటే చదువే కోరిక (గోల్) ని పుట్టిస్తుంది. ఈ రెండూ కాక ఇంకోటేదో తనకి గోల్ ని పుట్టించాలని కూర్చుంటే - ఇలాగే  ఇతరుల్ని టార్గెట్ చేసే శాడిస్టు బుద్ధులు పుడతాయి. ‘నీ జీవితాన్ని చూస్తూంటే నాకు విరక్తి పుడుతోంది!’ అని అగ్గిపుల్ల గీసి అంటించేస్తూంటాడు విలన్ గా నటించిన పుండరీకాక్షయ్య ‘కర్తవ్యం’ లో. ఇలాగే రిషి కూడా ‘నీ జీవితాన్ని చూస్తూంటే నాకు గెలవాలన్పిస్తోంది’ అంటాడు తండ్రిని చంపినంత పనిచేస్తూ. పిల్లలతో తండ్రి పాల్పడే ప్రవర్తనలని, చర్యల్ని జడ్జి చేయలేమంటాడు స్వామి సుఖభోదానంద. కనీసం తండ్రి ఇలా ఎందుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నాడు రిషి. నిజంగానే తండ్రి తనని నిర్లక్ష్యంగా వదిలేస్తే సినిమాలో చూపించిన ఈ రిషి వైఖరి చెల్లుతుందేమో గానీ, తండ్రి అలా లేనప్పుడు ఈ వైఖరికి అర్ధం లేదు.  మొత్తానికి ఇలా ఏదోలా అమెరికా వెళ్ళాలన్న గోల్ ఒకటి ఏర్పాటయ్యాక - ఇక క్లాస్ మేట్స్  పూజా, రవిశంకర్ పాత్రలుంటాయి. 

ప్రేమలేదనీ, ప్రేమించరాదనీ 
      పూజాది కింగ్ ఫిషర్ క్యాలెండర్ పాత్ర అని మనకి తెలిసిపోతూనే వుంటుంది. ఒకవైపు ఇది రిషి మహర్షిగా మారే జర్నీ అంటూనే, ఈ ఉదాత్త కథ జానర్ మర్యాదలైనా పాటించకుండా,  రొటీన్ ఫార్ములా బ్రెయిన్ లెస్ హీరోయిన్ పాత్రేమిటి? ఈమెకీ రిషికీ మధ్య లవ్ ట్రాక్ పదేపదే కాఫీ తాగే టీజింగ్ తో, టీనేజి పిల్లల స్థాయిలో వుంటుంది. ఈమెతో తిరిగీ, పాటలు పాడీ, చివరికి రిషి కటీఫ్ అంటాడు. ఇది అమెరికాకి బయల్దేరే సందర్భం. తనకి ప్రేమలు కుదరవని, అనుకున్న సక్సెస్ సాధించడమే తన టార్గెట్ అనీ బై చెప్పేస్తాడు. ఇలాంటప్పుడు ఆమెతో తిరిగి ఆశలెందుకు కల్పించాడు. ప్రేమలు కుదరవని ముందే చెప్పేస్తే ఆమె ఫ్రెండ్ గా వుండేదేమో. రిషి క్యారెక్టర్ యూజ్ అండ్ థ్రో టైపు కానప్పుడు ఇలా చూపించనవసరం లేదు. హీరోపాత్ర జీవిత ప్రయాణమనే ‘మహోజ్వల’ కథలో హీరోయిన్ పాత్ర ఇలా వుండనవసరంలేదు.     
     
          ఇక రిషి ఫ్రెండ్ గా రవిశంకర్ పాత్రతో కాలేజీ సీన్స్ ‘త్రీ ఈడియెట్స్’ ఛాయలతో ఒరిజినాలిటీ ఫ్యాక్టర్ కి తీసికట్టే, వదిలేద్దాం. సగటు విద్యార్ధి రవిశంకర్ కి రిషి లిఫ్ట్ ఇస్తాడు, కానీ తనతో పూజ ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడాన్ని సహించలేక లెంప కాయకొట్టి దూరమవుతాడు. రవిశంకర్ కి ఒక చిన్న రైతుగా తనని కష్టపడి చదివిస్తున్న  తండ్రి కలలు నిజం చేయాలన్నగట్టి సంకల్పమే వుంటుంది. ఇలా రిషికి వుండదు. రిషి ఇగోయిస్టిక్ నెగెటివ్ పాత్ర అని మనకి తెలిసిందే.  కాంట్రాస్ట్ కోసం ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ తండ్రుల పట్ల ఈ వైరుధ్యాల్ని  ఏర్పాటు చేశారు. 

          ఈ పై మొత్తం నేపధ్యంలో ఇది రిషి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నకథగా మనకి తెలుస్తుంది. ఈ బిగినింగ్ కథనం ఎటు వైపు సాగుతోందో తెలియడానికి, అమెరికా  వెళ్ళే గోల్ గురించి చెప్పారు. మరి ఈ గోల్ కి (సమస్యకి) తగ్గ పరిస్థితుల కల్పన చేయాలి. ఇందుకు ఒక పాజిటివ్ సన్నివేశం, దీనికి వ్యతిరేకమైన నెగెటివ్ సన్నివేశం సృష్టించారు. పాజిటివ్ సన్నివేశం వచ్చేసి, రిషి ఒక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసినట్టు, దీంతో అతడి స్కిల్స్ చూసి  అమెరిన్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చినట్టూ చూపారు. ఇక నెగెటివ్ సన్నివేశం వచ్చేసి, రాయబోయే ఎగ్జామ్ పేపర్ దొంగతనం రిషి మీద మోపి అమెరికా వెళ్లేందుకు అడ్డంకిగా చూపించారు. దీని వెనుక కుట్ర రిషికి తెలుసు. ప్రతీ సెమెస్టర్ లో తను టాప్ రావడాన్ని సహించని స్టూడెంట్ కుట్ర ఇది. హీరో టాప్ వస్తున్నాడని కుట్రలు చేయడం చాలా పాతకాలపు డిగ్రీ కాలేజీ టెంప్లెట్ సీన్లు. ఇప్పుడు సిల్లీగా వుంటాయి. ఐఐటీల్లో ఎలాటి రాజకీయాలు జరుగుతున్నాయో ఇప్పుడు హిందీ సినిమాల్లో ఆధునికంగా, వాస్తవికంగా  చూపిస్తున్నారు. మహర్షి మహోజ్వల కథని ఏ రీసెర్చీ లేకుండా లాగించేసినట్టు కనపడుతోంది. 

          ఇంతే కాదు, కుట్ర చేస్తున్న స్టూడెంట్ తండ్రి ఒక ఎంపీ కావడం మూసే. అతను వచ్చి, తన కొడుకు ఫస్ట్ రావాలంటే నువ్వు తగ్గాలని రిషికి ఆఫర్ ఇవ్వడం కూడా సిల్లీ బీగ్రేడ్ సన్నివేశమే. ‘విశ్వాసం’ లో అజిత్- జగపతి బాబుల మధ్య కథ ఇలాటిదే. నా కూతురు గెలవాలంటే నీ కూతురు తగ్గాలన్న కొట్లాటే. కాకపోతే ఇది స్పోర్ట్స్ కి సంబంధించి. 

          సరే, ఈ ఎగ్జామ్ పేపర్ కేసులోంచి రిషి బయట పడిపోతాడు. ఏం జరిగిందో పోలీసులు చెప్పరు. ఇక ఎగ్జామ్  రాసేసి యూఎస్ వెళ్ళిపోతాడు రిషి. ఇదే ప్లాట్ పాయింట్ వన్.

 కథానికల జర్నీ 
       ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర సమస్య ఏర్పాటు కాకుండా రిషి సాఫీగా అమెరికా ప్రయాణమై పోవడంగా వుంది. అంటే బిగినింగ్ విభాగంలో అతడికి కల్పించిన గోల్ ని పూర్తి చేయడంగా వుంది. గోల్ పూర్తయాక ఇక కథేముంది. స్ట్రక్చర్ లేకుండా జర్నీ కథ చేస్తే ఇలాగే  వుంటుంది. ఇప్పుడు తీస్తున్న బయోపిక్స్ జర్నీ లాంటివే. వాటిని స్ట్రక్చర్ లోనే తీస్తున్నట్టు గమనించాలి. ఇక్కడ మహర్షి జర్నీకి స్ట్రక్చర్ చేయదల్చుకోలేదు.  ఈ పాత్ర జీవిత ప్రయాణాన్ని  ఎపిసోడ్లుగా విడివిడి కథానికలుగా సాగించారు. ఒకే పెద్ద కథగా చేస్తే, కథంతటికీ ఒకే ప్రధాన సమస్యా, దాంతో సంఘర్షణా వుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఈ స్ట్రక్చర్ లోనే వుంటాయి. 

          రిషి కథని కథగా చేయకుండా, రిషి మహర్షిగా మారే ఒక జర్నీగా చేశారు. ఎపిసోడ్ల మయమైన జర్నీకి కథాలక్షణాలుండవు. అది డాక్యుమెంటరీ లక్షణాలని పుణికిపుచ్చుకుని వుంటుంది. రిషి జీవిత ప్రయాణంలో వివిధ ఘట్టాల్ని డాక్యుమెంటేషన్ - గ్రంథస్థం – చేయడంగానే వుంటుంది. కాబట్టి ఈ జర్నీలో ఒకే ప్రధాన సమస్య, దాంతో సంఘర్షణా అనే స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ వుండదు. ఒక సమస్య ఎదురై అది పరిష్కారమై, ఇంకో సమస్య ఎదురై అదీ పరిష్కారమై ...ఇలా రకరకాల ఎపిసోడ్లుగా సాగేదే జర్నీ జానర్ సినిమా.  ఇది సరీగ్గా కుదరాలంటే రీసెర్చి చేయాలి. చేసినప్పుడు స్ట్రక్చర్ లేకుండా ‘ఫారెస్ట్ గంప్’ అంత గొప్ప సినిమా ఎలా అయిందో, మనం కూడా దాన్ని ముందు పెట్టుకుని ఎలా అలవాటైన చేతి వాటం చూపించవచ్చో తెలుస్తుంది... ‘త్రీ ఈడియెట్స్’ ని ముందు పెట్టుకుని దాన్నెలా మార్చేయవచ్చో తపన పడే కన్నా,  మొత్తం సినిమా స్వస్థతకి ఇది చాలా బెటర్. 

(రేపు ముగింపు)
సికిందర్