రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఆగస్టు 2016, శనివారం

రివ్యూ!
దర్శకత్వం : సునీల్ రెడ్డి

తారాగణం : సాయి ధరం తేజ, లారిస్సా బొనెసీ, మన్నారా చోప్రా, వెన్నెల కిషోర్, అజయ్, పోసాని, సప్తగిరి, సత్య, రఘుబాబు తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : షేక్ దావూద్, మాటలు : లక్ష్మీ భూపాల్- హర్షవర్ధన్
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : గుహన్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్
నిర్మాతలు : డా. రోహిత్ రెడ్డి
విడుదల : 13 ఆగస్టు, 2016
***
        ఒకవేళ మన రెండు  రాష్ట్రాల్లో  పోలీసులకి నేరస్థుల్ని దండించే పని కష్టంగా తోస్తే, వాళ్ళ థర్డ్ డిగ్రీ టార్చర్ ని మించిపోయే  ‘తిక్క’ అనే తలతిక్క  సినిమా చూపిస్తే చాలు - గిలగిల కొట్టుకుని అక్కడికక్కడే చస్తారు నేరస్థులు. ఎన్ కౌంటర్ చేయలన్నా ఈ సినిమా ప్రయోగిస్తే  సరిపోతుంది. ఈ సినిమా పేరు చెబితే నేరస్థులిక తెలుగు రాష్ట్రాల్లో  వుండరు. నేరస్థులకే ఇలా వుంటే మనలాంటి  వాళ్ళ పరిస్థితేమిటో ఊహించుకోవాల్సిందే. ఈ సినిమాలో హీరోతో బాటు అతడి తండ్రి చీటికీ మాటికీ విషం బాటిల్ తీసి తాగెయ్యబోతారు. ఈ సినిమా కెళ్తే మనం కూడా ఓ విషం బాటిల్ ఎందుకు తెచ్చుకోలేదా అని విలవిల్లాడి పోతాం. ఎడాపెడా సినిమా పెట్టే టార్చర్ ని తట్టుకునే శక్తిలేక చచ్చిపోవడమే బెటరని ఆక్రందిస్తాం. ఈ సినిమా టికెట్స్ తో బాటు కౌంటర్స్ లో విషం బాటిల్స్ కూడా  పెట్టి ప్రేక్షకులకి సరఫరా చేసే ఏర్పాటు నిర్మాత చేసివుంటే ఎంతో పుణ్యం కట్టుకున్న వాళ్ళయ్యే వాళ్ళు. 

          ఈ తలతిక్క సినిమా తీసిన, రాసిన వాళ్ళెవరికీ  అసలు సినిమా అంటే ఏంటో కనీస జ్ఞానం లేదని అడుగడుగునా బట్టబయలై పోతూంటుంది. చిన్న పిల్లలు ఒక చోటచేరి చేసే పిల్ల కాయచేష్టల్లా నిర్మాత పెట్టిన డబ్బుతో ఇష్టమొచ్చినట్టు ఆడుకున్నారు. కామెడీ అంటే తమకి తామే కితకితలు పెట్టుకుని కిలకిలా నవ్వుకోవడంగా భావించుకుని ఒక పిచ్చి వాళ్ళ స్వర్గాన్ని వాళ్లకి వాళ్ళే సృష్టించుకుని అందులో  ఓలలాడారు. వాళ్ళ గెస్ట్ హౌస్ లో వాళ్ళే వేసుకుని ఆనందించుకుంటే సరిపోయే దానికి ప్రేక్షకుల మీదికి వదిలి ఇంత అరాచకం సృష్టించారు. ఒక్క చోటైనా ప్రేక్షకుడనే నిర్భాగ్యుడు నవ్వితే ఒట్టు. తెలుగు చలన చిత్ర చరిత్రలో సినిమా పేరుతో  ఇంత నరకప్రాయమైన చెత్త ఎప్పుడూ వచ్చి వుండదు. 

          మూడేళ్ళ క్రితం ‘ఓం’ అనే త్రీడీ తో కళ్యాణ్  రామ్ ని నిండా పాతిక కోట్లకి ముంచేసి, తిరిగి ఇప్పుడు నిర్మాత రోహిత్ రెడ్డి జేబులు కూడా ఖాళీ చేయించిన దర్శకుడు సునీల్ రెడ్డి పాలబడి ఇప్పుడిప్పుడే పైకొస్తున్న  హీరో సాయి ధరమ్  తేజ కూడా బలైపోయాడు. సినిమా  అంటే ఏంటో సగటు ప్రేక్షకులకున్న  అవగాహన కూడా లేకుండా రచన పేరుతో, దర్శకత్వం పేరుతో అనర్హులు చేరి నిర్మాతనీ, హీరోనీ భ్రష్టు పట్టించారు.  ఈ సినిమా దర్శకుడు, రచయితలూ వెనక్కి వెళ్లి సినిమా అంటే ఏమిటో అ ఆ లు నేర్చుకుని వస్తే నిర్మాతలూ హీరోలూ ప్రేక్షకులూ బతికిపోతారు- బయ్యర్లు కూడా!

          ఎక్కడైనా ఎప్పుడైనా సినిమా కథ ఇలా ఉంటుందా....ఆదిత్య (సాయి ధరమ్ తేజ్) అనే కార్పోరేట్ ఉద్యోగి ఉద్యోగం తక్కువ తాగితందానా లాడి, అమ్మాయిల వెంట పడ్డం ఎక్కువగా చేసే ఒక తిక్కలోడు. బాగా డబ్బున్న వీడి తండ్రి (రాజేంద్ర ప్రసాద్) కూడా తాగి తందానా లాడి ఆడ పిచ్చితో తిరిగే మరో తిక్క శాల్తీ. కొడుకు కారు నడుపుతూంటే వెనక సీట్లో తెచ్చుకున్న అమ్మాయితో సరసాలాడే కామ పిశాచి. పట్టపగలు కారులోనే తప్ప తాగుతూ డ్రైవ్ చేస్తూ అడ్డంగా పోతాడు ఆదిత్య. అంజలీ( లారిస్సా బొనేసా) అనే  వెర్రిబాగుల హీరోయిన్ కారు ఆ కారుని గుద్దెయ్యడంతో మనవాడికి చచ్చేంత పనై ప్రేమలో పడిపోతాడు. నమ్మశక్యంగాని  ఓవరాక్షన్ తో, వెర్రి చేష్టలతో ఏమేమో  చేస్తూ ఆమెని ప్రేమలో పడేసుకుంటాడు.  కానీ  వీడు కొన్ని తేదీలు గుర్తుంచుకోలేదని ఆ వెర్రిబాగుల హీరోయిన్ వీడికి కటీఫ్ చెప్పేసి తండ్రి  చూసిన హాఫ్ మగాడ్ని (వెన్నెల కిషోర్) చేసుకో  బోతూంటుంది. ఇక మనవాడికి పిచ్చి బాగా ఎక్కిపోయి టెర్రరిస్టులు దాడులు చేసినట్టుగా, మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగా (ఇలా పోలీస్ బాసే  అనుకుంటాడు పాపం)  పెట్రోల్ బంకుతో సహా పేల్చేసి నానా బీభత్సం సృష్టిస్తాడు. పోలీసులు వీణ్ణీ వీడి ఫ్రెండ్స్ నీ బొక్కలో వేస్తారు. ఇప్పుడు వీడి ప్రేమ ఎలా తిరిగి దక్కాలి? ఇందుకేం చేయాలి? ఏమైనా చేశాడా? రకరకాల గుంపుల మధ్య పడి అసలు కన్పిస్తాడా, గుంపుకో చోటా విలన్ చొప్పున వున్న గ్యాంగులు తలా ఒక్కో అమ్మాయిని వెతుక్కుంటూ గోలగోలగా పిచ్చాసుపత్రి పేషంట్స్ లా తిరుగుతోంటే అసలు మన వాడెక్కడున్నాడు? ఉన్నాడా, ఇంత సినిమా చాలనుకుని చెక్కేశాడా?  రైటర్ షేక్ దావూద్ సాబ్ హీరోయిన్ తో బాటు మిగతా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకీ తన మతాచారాన్ని  తెచ్చి పూస్తూ, బురఖాలు తొడిగించేసి సాంతం కన్ఫ్యూజ్ కామెడీ చేసుకు పోతూంటే- హీరోయిన్ తో బాటు అమ్మాయిల మొహాలే, గ్లామరే కన్పించని తాలిబానిజంతో సినిమాకే గతి పట్టింది?  తాలిబాన్లకి చూపిస్తే సూపర్ హిట్టయ్యే ఈ సినిమా ఎందుకొచ్చి తెలుగు వాళ్ళ మధ్య పడింది? దావూద్ సాబ్ కి తాలిబాన్ల నుంచి వార్నింగ్స్ వచ్చి ఈ విధంగా బురఖాలు తొడిగించేశారా? కానీ ఇప్పుడు బురఖా లేసుకుని కన్పించకుండా తిరగాల్సింది ఈ సినిమా రచయితలూ దర్శకుడే! నిర్మాతకి మాత్రం పెద్ద బురఖా తొడిగేశారు. అదేం బురఖా, కాస్ట్లీ దుబాయ్ బుట్ట బురఖాయేనా?

          మాటల రచయితలుగా దర్శన మిచ్చిన లక్ష్మీ భూపాల్, హర్షవర్ధన్ అనే వాళ్ళు ఒక్కసారి థియేటర్లో కూర్చుని తాము రాసింది చూడగలరా? వినగలరా? ఒక్క క్షణమైనా ఆ మాటల దాడి నుంచి విరామం ఇచ్చారా? ఒకరా ఇద్దరా-  ప్రతీ సీన్లో గుంపులు గుంపులుగా ఎందరో నటీనటులు చేరి-  కామెడీ పేరుతో  గోలగోలగా ఎవరేం మాట్లాడుతున్నారో- అరుచుకుంటున్నారో – చెవులు పోటెక్కే సౌండ్ పొల్యూషన్ తో – చేపల బజార్లా ఏమేం చేస్తున్నారో – తాము ఫాలో అయి రెండు ముక్కల్లో సూటిగా ఈ కథేమిటో చెప్పగలరా? 

          వెంటనే సూటిగా రెండు ముక్కల్లో ఈ చేపల బజార్ కథేమిటో చెప్ప గల్గితే ప్రేక్షకులు ఆత్మహత్యా ప్రయత్నాలు మానుకోగలరు. 

          ఈ సినిమా తీయడానికి ఎన్ని కోట్లయ్యిందో అన్ని తలా ఓ కోటి కృష్ణా నగర్- ఫిలిం నగర్ లలో ఏళ్ల తరబడి ఒక్క అవకాశమూ దక్కక, దిక్కులేక తిరుగుతున్న  అసిస్టెంట్లు ఓ పాతిక మందికి ఇచ్చి వుంటే-  నిర్మాత రోహిత్ రెడ్డికి నీతిగా నిజాయితీగా ఎంతో న్యాయం చేసి పెట్టే వాళ్ళు. ఆయన మరో పాతిక సినిమాలు తీయడానికి రెడీ అయ్యే వాళ్ళు. పాతికలో పది పోయినా లా ఆఫ్ ఎవరేజేస్ కింద తను లాభాల్లోనే వుండే వాళ్ళు. ఒకప్పుడు సేలంకి చెందిన మోడరన్ థియేటర్స్ సంస్థ అనుసరించిన సక్సెస్ ఫుల్ పంథా ఇది.


-సికిందర్