రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 23, 2025

1388 : స్క్రీన్ ప్లే టిప్స్

 

 

        స్క్రిప్టు రాయడానికి ముందు ఎవరైనా ఏం చేస్తారు? కథ గురించి రూపు దిద్దుకున్న ఆలోచనని పేపరు మీద పెట్టడం ప్రారంభిస్తారు. అయితే ఆ ఆలోచన లేదా కాన్సెప్ట్ -దీనినే స్టోరీ ఐడియా అనుకుంటే, ఈ స్టోరీ ఐడియాతో స్క్రిప్టు ఎలా రాయాలో స్పష్టత లేకుండా రాసుకు పోవడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ స్టోరీ ఐడియాకి ఎంత వరకు న్యాయం జరుగుతుంది? పాత్రలు, సన్నివేశాలు, స్ట్రక్చర్, బీట్ షీట్లు, సంభాషణలు వగైరా ఎంతో బాగా రాయాలన్న ఉత్సాహం వుంటుంది- కానీ ఇవి స్టోరీ ఐడియాకి కనెక్ట్ కాకపోతే ఆ రాసినవన్నీ వృధా పోతాయి. దీనికి పరిష్కారమేమిటి? దీనికి పరిష్కారం PROBLEM లో వుంది. ఎలా? PROBLEM లో Pఅంటే Punishing, Rఅంటే Relatable, O  అంటే Original, B అంటే Believable, L అంటే Life –altering, E అంటే  Entertaining, M అంటే Meaningful. ఈ 7 టూల్స్ ని ఈ క్రింద పరిశీలిద్దాం....

1.                 1. Punishing : పాత్రలు వాటి పరిస్థితిని పరిష్కరించడం పనిష్మెంట్లా తీవ్రంగా అనిపించాలి, 2. Relatable : పాత్ర చిత్రణలు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా వుండాలి, 3. Original : కథకి ఫ్రెష్ యాంగిల్ ఇస్తున్నట్టు స్పష్టమవ్వాలి,4. Believable : కథ నమ్మదగ్గదిగా వుండాలి, 5. Life –altering : పాత్రల్ని ప్రశ్నార్ధకం చేసే పెను సవాళ్లు ఎదురవ్వాలి, 6. Entertaining : జానర్ అనుకూల ఫన్ వుండాలి, Meaningful. స్టోరీ ఐడియా వ్యక్తమయ్యేలా కథ గాఢత్వాన్ని (బ్యాక్ డ్రాప్ డెప్త్) సంతరించుకోవాలి.

చెక్‌లిస్ట్ తో స్టోరీ ఐడియాని  అమలు చేయడం ద్వారా నెలల తరబడి చేసిన కృషి వృధా పోకుండా వుంటుంది. మీ పాత్రల్ని అష్టకష్టాలకి గురి చేయాలి. రాసిన ఒక సన్నివేశం సజీవంగా అన్పించక పోవచ్చు. ఎందుకనేది అర్ధం గాదు. రాస్తున్నది యాక్టివ్ పాత్రే అయి వుండొచ్చు. ప్రేక్షకులతో  ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్టే అన్పించ వచ్చు. అయినా సన్నివేశం వర్కౌట్ కావడం లేదనే  అన్పిస్తుంది. అప్పుడు పరిశీలించాల్సింది ఆ సన్నివేశంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వుందా అని. పాత్రలు స్ట్రగుల్ చేస్తూంటే ప్రేక్షకులకి ఇష్టంగా వుంటుంది. మంచి కథ ఒక స్పోర్ట్స్ లాంటిది. ఓడిపోతున్న టీం పట్ల మనం ఆదుర్దాగా వుంటాం, ఎలాగైనా గెలవాలని కోరుకుంటాం. అలాగే  కొండంత కాన్ఫ్లిక్ట్ ని పాత్రలు  ఎదుర్కొంటూంటే టెన్షన్ పడుతూ శుభం జరగాలని కోరుకుంటాం. ఈ చిత్రణ సన్నివేశంలో లోపించిందేమో చూసుకుని సరిదిద్దుకోవాలి.

    సూపర్ హీరో సినిమాల్లో కూడా ఈ నియమాన్నే అనుసరిస్తారు. 90% రన్‌టైమ్‌లో విలన్ హీరో కంటే శక్తివంతంగా వుంటాడు. దీనర్థం ఎటువంటి కారణం లేకుండా పాత్రల పట్ల క్రూరంగా ప్రవర్తించాలని కాదు, సన్నివేశపరమైన సంఘర్షణ మాత్రమే ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుందని అర్థం చేసుకోవాలి. పాత్రలు తగినంతగా కష్టపడకపోతే  ప్రేక్షకులు వాటి పట్ల శ్రద్ధ వహించరనేది గుర్తించాలి.

    ఇక మీ కథ మీద అభిప్రాయాన్ని ప్రొఫెషనల్స్ ని అడిగి తెలుసుకోండి, స్నేహితుల్నో- కుటుంబ సభ్యుల్నో కాదు. ప్రొఫెషనల్ అభిప్రాయాన్ని పొందడం రైటర్ గా వుండడం లోని కష్టమైన పనుల్లో ఒకటి. చాలా మంది రైటర్స్ కి ప్రొఫెషనల్ అభిప్రాయాలు నచ్చవు, ఆహా ఓహో అని మెచ్చుకునే నాన్ ప్రొఫెషనల్ అభిప్రాయాలే నచ్చుతాయి. ఇదెంత తప్పో తర్వాత మీకే తెలుస్తుంది. మీ స్నేహితులు స్క్రీన్ రైటర్లు, మేనేజర్లు లేదా ప్రొఫెషనల్ విశ్లేషకులు కాకపోతే, వారు మీ కథలో పెద్ద లోపాల్ని సరి చేయడానికి చిన్న పరిష్కారాలపై దృష్టి పెట్టవచ్చు. ప్రొఫెషనల్ విశ్లేషకులు మీ పాత్ర గురించి మీరు పట్టించుకోనప్పుడు, గందరగోళంలో వున్నప్పుడు, లేదా వారు విసుగు చెందినప్పుడు మీకు చెబుతారు. అవి బాధించే పెద్ద సవరణలే కావొచ్చు, కానీ చాలా ముఖ్యమైనవి. ప్రొఫెషనల్ కన్సల్టేషన్ కోసం ఫీజు చెల్లించడం తప్పని సరి కావొచ్చు. ముందు మీ కథ మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే అమ్మకం జరగడం కూడా కష్టం కావొచ్చు. స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. మీ కథ మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే, మీ కథ తీసుకుని నిర్మాత ఎందుకు కోట్లు పెట్టుబడి పెడతాడు. ఆలోచించాలి.  

ఎరిక్ బోర్క్
(హాలీవుడ్ నిర్మాత, దర్శకుడు)