రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, అక్టోబర్ 2015, ఆదివారం

ఇంకొంచెం కంచె కథ!








రచన - దర్శకత్వం : క్రిష్

తారాగణం : వరుణ్ తేజ్, ప్రాగ్యా  జైస్వాల్, నికితిన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి మారుతీ రావు. షావుకారు జానకి, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, అనూప్ పురీ తదితరులు
సంగీతం : చిరంతాన్ భట్, పాటలు :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్, మాటలు : సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్ : సూరజ్ జగ్ తాప్- రామకృష్ణ అర్రం, కళ  : సాహిసురేష్ 
 యాక్షన్ : వెంకట్, డేవిడ్ కబువా, బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు : జె సాయిబాబు, వై రాజీవ్ రెడ్డి
విడుదల :   22 అక్టోబర్ 2015




భిన్న కథా చిత్రాల దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్) తన స్పాన్ నీ, గుణాత్మకంగా తెలుగు సినిమా స్థాయినీ, ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి ప్రతిష్టించారు. కొత్తదనం లేని అవే  మూస  సినిమాల మధ్య కాస్త క్వాలిటీ సినిమా కోసం ఎదురు చూసే  ప్రేక్షకులకి ‘కంచె’ తో ఆ కొరత తీర్చేశారు. ‘కంచె’ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే నేటివిటీ చట్రంలో ఇరుక్కుపోయే మరో వృధా శ్రమ కాదు- దీని నేటివిటీ సార్వజనీనం. దేశంలోనే కాదు, విదేశాల్లో ఎక్కడ ప్రదర్శించినా  ప్రశంసలే అందుతాయి.  ఏ కాలంలోనైనా స్థానిక- అంతర్జాతీయ వివక్షలు  ఒకటేననీ చెబుతూ, ఒక ప్రేమ కథ- ఇంకో యుద్ధకథ ఆలంబనగా అసామాన్య ప్రతిభతో తెరకెక్కించారు క్రిష్. 

రెండు కథల ప్రపంచం 
  రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ- యుద్ధానికి ముందు కాలంలోనూ - రెండు టైం లైన్స్ లో నడిచే రెండు విడివిడి కథల సంపుటి ఇది. 1939 లో రెండో ప్రపంచ యుద్ధం  ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో బ్రిటన్  తరపున పాల్గొనేందుకు రాయల్  ఇండియన్ ఆర్మీలో  చేరి ధూపాటి హరిబాబు ( వరుణ్ తేజ్) కూడా వెళ్తాడు. మొన్నటి వరకూ ఇదే యుద్ధంలో జర్మనీ, జపాన్ లతో కలిసి మిగిలిన దేశాలకి ( మిత్ర పక్షాలు) వ్యతిరేకంగా యాక్సిస్ దేశంగా వున్న ఇటలీ, ఆ కూటమి నుంచి విడిపోయి  మిత్రపక్షాల వైపు చేరుతుంది. దీంతో  ఇటలీ పనిబట్టాలని చూస్తూంటారు జర్మన్ నాజీలు హిట్లర్ ఆదేశాలతో. ఆ జర్మనీ- ఇటలీ  సరిహద్దులో ఇటలీ తరపున యుద్ధం చేస్తున్న దళంలో వుంటాడు హరిబాబు సైనికుడుగా. ఇతడి నేస్తంగా  దాసు (అవసరాల శ్రీనివాస్) ఉంటాడు. ఇతను అతి  భయస్థుడు,  పిరికివాడు కూడా. ఇదే దళంలో మరో తెలుగు వాడైన ఈశ్వర్ ( నికితాస్ ధీర్) అనే కల్నల్ ఉంటాడు. వీళ్ళందరికీ బ్రిటిష్ సైనికాధికారి సారధ్యం వహిస్తూంటాడు. 


        అయితే హరిబాబుకీ, ఈశ్వర్ కీ పడదు. పాత పగలతో బద్ధ శత్రువుల్లా వుంటారు. దీనికి కారణాల్ని వెల్లడిస్తూ ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది- 1936 లో మద్రాసులో హరిబాబు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, అదే కాలేజీలో చదివే సీతాదేవి  ( ప్రాగ్యా  జైస్వాల్) తో పరిచయం ప్రేమా ఏర్పడతాయి. సీతాదేవి రాచకొండ సంస్థానానికి చెందిన జమీందారు ( అనూప్ పురీ) వారసురాలు. ఆ దేవర కొండ గ్రామంలో క్షురకుడి  ( గొల్లపూడి మారుతీ రావు ) మనవడు హరిబాబు. వీళ్ళిద్దరి ప్రేమ సీత అన్న ఈశ్వర్ కి నచ్చదు. అతను కులాల అంతరాల్ని తెరపైకి తెస్తాడు. ఒక పక్క ఫ్లాష్ బ్యాక్స్ లో  ఈ ప్రేమకథ  అంతకంతకీ విషమంగా మారే పరిస్థితులు అంచెలంచెలుగా వెల్లడవుతూంటే, దీనికి కాంట్రాస్ట్ గా  ప్రస్తుత యుద్ధ కథ అనేక మలుపులు తిరుగుతూ సాగుతూంటుంది. 



        అకస్మాత్తుగా జర్మన్లు వైమానిక దళంతో  దాడి చేసేసరికి వాళ్ళ  ధాటికి తట్టుకోలేక లొంగిపోతుంది హరిబాబు వున్న దళం. హరిబాబూ దాసూ దాక్కుని ఆ తతంగం గమనిస్తూంటారు. జెనీవా ఒప్పందం ప్రకారం లొంగిపోయిన శత్రు దేశపు సైనికులపై ఏ దురాగతాలకీ పాల్పడకూడదు.  కానీ  ఇక్కడ చూస్తే  ఈ జర్మన్లు ఆ ఒప్పందాన్ని గౌరవించేలా లేరు.  మాట తేడా వచ్చిందని కళ్ళముందే లొంగిపోయిన కొందరు సైనికుల్ని కాల్చేశారు. ఓ పదిమందిని సజీవంగా పట్టుకెళ్ళారు. వాళ్ళల్లో బ్రిటిష్  సైనికాధికారితో బాటు, ఈశ్వర్ కూడా వున్నాడు. దీన్ని ఎట్టి  పరిస్థితిలో అడ్డుకోవాలని హరిబాబు ఒక సాహసోపేత ఆపరేషన్ కి నడుం బిగిస్తాడు. ఆ జర్మన్ దళం మీద ఎటాక్ చేసి తమ వాళ్ళని విడిపించుకునే ఆపరేషన్.

        ఇలా ఓ యుద్ధ కథ, ఇంకో ప్రేమ కథా విడివిడిగా సాగుతూ, ముగింపులో కలిసిపోయి ఒకటవుతాయి..ఒకటైన దగ్గర ఎదురు చూడని విషయం బయటపడుతుంది. 

కథెలా వుంది 
      దేశంలోనే మొట్ట మొదటి సారిగా రెండో ప్రపంచ యుద్ధం మీద ఒక తెలుగు సినిమా కథ వచ్చింది. ఇందుకు ముందు గర్వించాలి. అలవాటుపడిపోయిన మూస కథల భూతద్దంలో చూసి ఈ గర్వకారణాన్ని పలచన చేసుకోవడం మంచిదికాదు. మూస కథలేమీ సినిమాలకి గీటురాళ్ళు కావు వాటితో ‘కంచె’  కథని పోల్చి తేల్చెయ్యడానికి.  మూస కథలు నిజానికి చదువు రాని వాళ్ళనీ, చాలా మంది చదువుకున్న వాళ్ళనీ బ్రెయిన్ వాష్ చేసి, సినిమా నిరక్షరాస్యులుగా ఎప్పుడో తయారుచేసి పెట్టాయి. అందుకే హౌ టు  రీడ్ ఏ  మూవీ  అనే ఫాకల్టీని కోల్పోయారు. ‘కంచె’ ని ‘కంచె’ గానే చూసి దాంట్లో తప్పొప్పులు మాట్లాడుకుంటే అదొక అందం. ఇలాటి కథతో ఆడుతుందో లేదో దర్శకుడికి తెలియకే  సినిమా తీసి ఉంటాడా? నిర్మాతలు ఆలోచనలేకుండా 20 కోట్లు పెట్టేసి వుంటారా? రెండో ప్రపంచ యుద్ధం లో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై  వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై  వేలమంది బందీలుగా చిక్కారన్న ప్రజలెరుగని, దేశమూ జ్ఞాపకం చేసుకోని, సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన-  వీర సైనికులకి నివాళి అర్పిస్తున్న- ఉత్కృష్ట తెలుగు సినిమా కథా వైభవమిది. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులుగా మేమూ వున్నామని  ప్రపంచానికి తెలియజేసుకుంటున్న అపూర్వ సందర్భమిది. ఇంత కాలానికి ఆస్కార్ ఎంట్రీ కంటూ అర్హమయ్యే గుణగణా లతో ముస్తాబై కూర్చుందీ కథ.  తెలుగులోనే తొలిసారి ఒక పల్లె కథనీ, ఇంకో విదేశీ కథనీ ఏకం చేస్తూ తయారైన కథ ఇది. ఇలా ఇది కుల, మత, ప్రాంతీయ, సాంస్కృతిక వివక్షలనే సార్వజనీన, సార్వకాలిక కథాంశంతో,  తెలుగులోనే  తొలి గ్లోబల్ + లోకల్ = ‘గ్లోకల్’ మూవీ కూడా అయ్యింది. అలాగని ఇదేమీ మరీ మేధావులు మాత్రమే చూసి చప్పట్లు కొట్టే, నిలువెల్లా పచ్చి వాస్తవికత వలవలా కారిపోయే, ఆర్టు సినిమా కథ లాంటిది కాదు. ఇక్కడి ప్రేమ కథ, ఎక్కడిదో యుద్ధ కథా నేర్పుగా కలిస్తే పండిత పామరులు వీక్షించగలిగే సినిమా కథగా  కూడా అవుతుందని ఎవరూ ఊహించి వుండరు. శాశ్వత సత్యాలనేవి  మారేవి కావు. కులాహంకారంతో హింసా, జాత్యాహంకారంతో  యుద్ధోన్మాదమూ ఎప్పుడూ ఉండేవే.  కాకపోతే స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘సేవింగ్ ప్రైవేట్ రేయాన్’ లు రెండో ప్రపంచయుద్ధ కాలంలో నాజీల అకృత్యాలనే చూపిస్తూ జర్మనీకే పరిమితం చేశాయి. ఒకడుగు ముందుకేసి, లేదా ఇంకో  మెట్టు పైకి వెళ్లి- అలాటి కథలు ఇంకెక్కడైనా  ఉంటాయని ‘కంచె’ కథలు స్థానిక, అంతర్జాతీయ పరిస్థితుల పోలికలతో  చెప్పుకొచ్చాయి. అసలు తెలుగు సినిమాల  మూ (మో) స కథల ముళ్ళ కంచెని అడ్డంగా పడగొట్టి, ‘క్వాలిటీ రైటింగ్’ అనే తుపాకీ పట్టుకుని దిట్టంగా కాపలా కూర్చుందీ కథ! 

ఎవరెలా చేశారు 

చ్చితంగా ‘కంచె’ వరుణ్ తేజ్ జీవితాంతం దాచుకోగల జ్ఞాపిక. మొదటి సినిమా  ‘ముకుందా’ అనే పక్కా కమర్షియల్ నుంచి, రెండో సినిమాకే ఒక అర్ధవంతమైన, గుర్తుండిపోయే, నటనా సామర్ధ్యానికి కి పరీక్ష పెట్టే, జవజీవాలున్న నిజమయిన పాత్రకి ప్రమోట్ కావడం ఒక అరుదైన ఘట్టం. అతడిది స్థానికత వెల్లడి కాని ఫేస్ తో, కళ్ళతో,  ఏ దేశ ప్రేక్షకులు చూసినా మనవాడే అన్పించే యూనివర్సల్ ఫిగర్. ఇది ఈ తెలుగు సినిమా లుక్ ని స్వరూపంలోనూ సార్వజనీనం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం మీంచి ఇరాక్ యుద్ధం మీదికి మళ్ళిన హాలీవుడ్ సినిమాల పరంపరలో, ఆస్కార్ విన్నర్  ‘ది హర్ట్ లాకర్’ లోని  సైనికుడి పాత్రకి ఏమాత్రం తీసిపోకుండా కనబర్చిచిన సహజ నటనతో, తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్లాడు. దీని వెనుక దర్శకుడు క్రిష్ పాత్ర ఉందన్నది నిజమే. అలాగే స్థానికంగా ఓ ప్రేమికుడి పాత్రలో, అదీ ఎనభై ఏళ్ళనాటి పురాతన పాత్రలో, అంతే దీటుగా మెరిశాడు. టాలీవుడ్ నుంచి ప్రపంచ సినిమా వేదికకి అందిన వండర్ బాయ్  వరుణ్ తేజ్. ఈ గౌరవానికి కి ఇంతవరకూ దక్షిణం వైపు నుంచి కమల్ హాసన్ మాత్రమే వున్నారు.

      హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ అచ్చం ఒక రాచరికపు, జమీందారీ యువతి ఫేస్ కట్ తో వుండడం మరో ప్లస్ ఈ సినిమాకి. ఆమె తన రాచరికపు, కులీన స్త్రీ  ఠీవీ తో లీడ్ చేసే పాత్రేతప్ప, గుడ్డిగా హీరోని ఫాలో అయిపోయే చిగురుటాకు టైపు ఫిల్మీ ప్రేయసి కాదు. చొరవ చేసి అతన్నే పెళ్ళికి రెడీ అవమనే సరస భాషి. కులీన స్త్రీ భాషలో ఏమోయ్, రావోయ్, చూశావుటోయ్ వంటి పదాల్ని విలాసంగా వాడెయ్యగలదు. అయితే ఈ హీరో హీరోయిన్లిద్దరి సంభాషణలు గ్రాంథికం పాలెక్కువైపోయి అసహజత్వాన్నే ప్రోది చేసుకున్నాయనేది కూడా నిజం.  1936 ప్రాంతంలో  ఇలాగే మాటాడే వాళ్ళా- లేక సినిమా డైలాగులు ఇలాగే ఉండేవా అని చూస్తే - లేదని తేలుతుంది. కనీసం ‘కన్యాశుల్కం’ నాటకాన్ని చూసినా స్పష్టమైపోతుంది. ఆ కాలంలో నాటకమే వాడుక భాషలో వాడవాడలా పాపులరై నప్పుడు, సినిమాలెందుకు ఊరుకుంటాయి.  1936లో ‘మాలపిల్ల’ అయినా, 1939 లో వచ్చిన ‘రైతుబిడ్డ’,  ‘వందేమాతరం’, ‘వరవిక్రయం’ సినిమాల్లో అయినా ఇప్పుడు మనం మాటాడుకుంటున్న వాడుక భాషే వుంది. 1936 కి ముందు వరకూ పౌరాణికాలే  సినిమాలుగా, సినిమాలకి ఆ పౌరాణిక భాషే డైలాగులుగా అలవాటుపడి  వున్న జనం- అదే సంవత్సరం విప్లవాత్మకంగా, పౌరాణికాల ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ, వాడుక భాషలో  ‘ప్రేమ విజయం’ అనే సాంఘీకం తీస్తే దాన్ని వెంటనే ఠపీమని తిప్పి కొట్టారు. ‘మాలపిల్ల’ తో గానీ  గూడవల్లి రామబ్రహ్మం ఆ జనాల్ని  దారికి తెచ్చుకుని, సాంఘీక కథలకి, వాడుక భాషకీ విజయవంతంగా అలవాటు చేయలేకపోయారు. ‘కంచె’ లో హీరో హీరోయిన్ల మధ్య డైలాగులు కూడా ఇదే ధోరణిలో గనుక వుండి వుంటే,  సినిమా చూసే నేటి యూత్ కే కాదు, పెద్దలకీ అసౌకర్యంగా వుండేది కాదు. ఇక పల్లెటూరి దృశ్యాల్లో  ఇతర పాత్రలు మాటాడే భాష నేటి సినిమాటిక్ స్టయిల్లోనే, ఫ్లేవర్ లోనే  వుంది. తెలంగాణా యాసే అయినా, ‘మాభూమి’ లో 1940 లనాటి కథకి వాడిన భాష ఎంత సహజత్వంతో, మనకి తెలిసిన వాసనలతో పులకింప జేస్తుందో చెప్పక్కర్లేదు. 


        హీరోయిన్ బలమైన వ్యక్తిత్వం గలది. అయితే ఈ బలమైన వ్యక్తిత్వం కిందా మీదవడం దర్శకుడు, రచయిత గమనించినట్టు లేదు. పెళ్ళికి రెడీ ఐపో అని అంత ధాటీగా ఆర్డరేసిన ఆమే, తీరా ఆ సమయం వచ్చేసరికి - ఇలాటి పెళ్లి వూళ్ళో జరగలేదు, ఏమవుతుందో ఏమో - అని భయం వ్యక్తం చేయడం పాత్రౌచిత్యాన్ని దెబ్బతీస్తోంది. మళ్ళీ ఆమెకి వేరే పెళ్లి చేస్తూ నానమ్మ (షావుకారు జానకి పోషించిన మహాలక్ష్మి పాత్ర)  అమ్మ నగలేసుకో మన్నప్పుడు, అమ్మంటే బంగారం కాదు, ప్రేమ- అనేసి తిరస్కరించి వెళ్ళిపోవడం హీరోయిన్ పాత్రని ఎక్కడికో తీసికెళ్ళి పోయింది. ఈ కథలో ఫ్యూడల్ కుటుంబమే అయినా, ఆడాళ్ళు మగాళ్ళకి లొంగి లేరు. హీరోయిన్ తో  తండ్రి ఆడవాళ్ళ నుద్దేశించి  ‘ఆఫ్టరాల్’  అన్నాక, తల్లి మహాలక్ష్మితో- నువ్వయినా చెప్పు దానికి- అన్నప్పుడు, ఆమె ‘ఆఫ్టరాల్’ అర్ధం అడిగి తెలుసుకుని, ఆఫ్టరాల్ ఆడాళ్ళం మేమేం చెప్పగలంలే- అనేసి  నిరసనగా వెళ్ళిపోవడం పాత్రని  నిలబెట్టింది. మగాళ్ళు గర్భం వాడుకుని బతకడం నేర్చుకున్నారు- అని అంటుంది మనవరాలితో. ఇలా పాత్రచిత్రణలు బావున్నప్పుడే ఆ నటుణ్ణి లేదా నటిని చూడగలం. లేకపోతే చూడ బుద్ధి గాదు.    

        మూడో ప్రధానాకర్షణ- పిరికి సైనికుడి పాత్రలో అవసరాల శ్రీనివాసరావు. సినిమాలో కామిక్ రిలీఫ్ ఇతనే. కథా స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని, తనకోసం రాసిన సున్నిత హాస్యాన్ని చూస్తే, ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో ఎడారిలో కృష్ణ వెంట పడి  తిరిగే మాయలమారి/జిత్తులమారి నాగభూషణం పాత్ర గుర్తుకొస్తుంది. జ్ఞానోదమయ్యాక, చాలా ఫిలాసఫికల్ డైలాగుతో పాత్రని  ముక్తాయిస్తాడు. ఆద్యంతం ఈ క్యారక్టర్ కి కూడా ఒక ‘ఆర్క్’ వుంది. ఐతే ఈ పిరికి పాత్రకి కాంట్రాస్ట్ గా శ్రీ శ్రీ కవితల వ్యామోహం పెట్టడం బాగానే ఉందిగానీ, అప్పుడే శ్రీ శ్రీ కవిత్వం అంత  పాపులరయ్యిందా అన్న ప్రశ్న వేధించక మానదు. శ్రీశ్రీ 1936-40 మధ్య కాలంలో ఆ కవితలు రాసినా, 1950 లో ‘మహాప్రస్థానం’ గా పుస్తకాన్ని అచ్చేశాక గానీ ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదని తెలుస్తోంది. 

        క్షురకుడి పాత్రలో గొల్లపూడి మారుతీ రావు, ఈశ్వర్ పాత్రలో నికితిన్ ధీర్ లవి పూర్తి నిడివి కీలకపాత్రలు కాగా; పోసాని, సత్యం రాజేష్ లవి  ఒకటి రెండు సీన్లలో కన్పించిపోయే అతిధి పాత్రలు. ఈ మాత్రం దానికి పోసానిని పెట్టడం ప్రేక్షకులకి నిరాశే.

        ఇక  యూరప్ యుద్ధరంగంలో సైనికులుగా, సైనికాధి కారులుగా, యూదు కుటుంబంగా నటించిన విదేశీ నటీనటులందరూ ఈ సినిమాకి క్లాసిక్ లుక్ ని సంతరించిపెట్టారు. సహజత్వం ఉట్టిపడే వాళ్ళ నటనలలో పర్ఫెక్షన్ ని,  మళ్ళీ వందల కోట్ల డాలర్ల బిగ్ బడ్జెట్ యుద్ధ సినిమాల్లోనే చూడ్డం సాధ్యం.  


                                                     ***

         ఈ సినిమాకి మాటల రచయిత సాయిమాధవ్ బుర్రాలో ఒక గణేష్ పాత్రోని చూస్తాం. పాత్రల అంతరంగాల్ని మధించి ‘పాత్రో’ లాగా వెంటాడే డైలాగుల్నిరాస్తారు మాధవ్.  ప్రతీ పాత్రకీ ఓ భావజాలం వుంది. వాటి అనుభవిస్తున్న జీవితాల్లోంచి పుట్టుకొచ్చే భావజాలాలు. దీనివల్ల డైలాగులు అలా నిలిచిపోతాయి. నిజానికి ఏవో భావజాలాల పునాదిగానే మనుషులు మాటాడతారు. దురదృష్టవశాత్తూ ఇలాటి ఒక రచయిత గంధం నాగరాజుని క్రిష్ కోల్పోయారు. ఆ స్థానాన్ని బుర్రా భర్తీ చేస్తున్నారు- ఆడ‌త‌నం దేశాన్ని బ‌ట్టి మారుతుంటుంది అనుకున్నా, కానీ అమ్మ‌త‌నం ఏదేశంలో అయినా ఒకేలా ఉంటుంద‌ని తెలుసుకున్నా’ - ‘నువ్వెవరని అడిగితే నువ్వేం చేస్తూంటావని..నీ రక్తం ఏదని కాదు..అలా అడిగిన వాడు మనిషి కాదు’ - ‘అమ్మంటే బంగారం కాదు, ప్రేమ’ - ‘యుద్దంలో ప్రేమ ఉంటుంది, ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది’ - ‘మా అన్నయ్య నీకంటే ముందు నన్ను ప్రేమించాడు, నా మీద ప్రేమ కోసం మా అన్నని చంపుతానని అంటావా’-  ‘కమతాన్ని నమ్ముకున్నోడే కమ్మోడు, కాపు కాసేవాడు కాపు’ - ‘ఆ పసిపాప కూడా యుద్ధం చేస్తోంది, ఆకలితో’ -  లాంటి డైలాగుల్ని పాత్రలు పలకడం విప్లవాత్మకమే.

        అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు ఈ సినిమాకొక ఎసెట్. మొదటి పాటతో ఆయన రుద్రమ దేవికి రాసిన అశ్లీల పాట గుర్తుల్ని చెరిపేసుకున్నారు-

‘ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమోఅటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో’ అని  ‘కంచె’ లో హీరో హీరోయిన్లతో అన్పించారు.


‘చూసుకోవో  తీసుకోవో
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవో 
విందు ఉందోయి పొందు ఉందోయి

గుప్పిట్లోనే నీ గుట్టు పట్టుకోవోయీ..  - అని రుద్రమదేవి- వీరభద్రుడుల చేత అన్పించారు



        యూరప్ లో  యుద్ధానికీ, వూళ్ళో పెచ్చరిల్లిన కుల ఘర్షణలకీ కలిపి ఆయన రాసిన పదాలు మాస్టర్ స్ట్రోక్:

విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా
అడిగావా భూగోళమా 

నువ్వు చూశావా ఓ కాలమా...


        ఇంకో గీతం : 



భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో..
ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో..
ఏపంటల రక్షణకీ కంచెల ముళ్ళూ 
ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు 
ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు
ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు...
నిశినిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం
మృదులాలస స్వప్నాలస హృత్కపోతపాతం
పృథు వ్యధార్త పృధ్విమాత నిర్ఘోషిత చేతం
నిష్టుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం
ఏ విషబీజోద్భూతం ఈ విషాద బూజం...
ప్రాణమె పణమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడూ మేలు కొలుపు మేలుకొలుపు..

        ఆయనకో పెద్ద నమస్కారం!


                                                              ***
      హిందీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఇంకో ఎసెట్ అయితే,  కెమెరామాన్ వీఎస్ జ్ఞాన శేఖర్ విజువల్ శిల్పి. అంతర్జాతీయ స్థాయి సృష్టి చేశాడు. ఇంగ్లీషు వాడు చూస్తే, మేం ఎప్పుడో తీసిన యుద్ధ దృశ్యాలు కదా కత్తిరించి పెట్టుకున్నారు? - అనేస్తాడు. అంతలోనే నాలిక్కర్చుకుని,  ‘బాహుబలి’ తీస్తే ఇది కూడా సాధ్యమేనని సర్ది చెప్పుకుంటాడు. కళా దర్శకుడు సాహి సురేష్ మొత్తం ఆనాటి యూరప్ లోకేషన్స్ నీ, తెలుగు గ్రామీణ వాతావరణాన్నీ, ఆనాటి మద్రాసునీ  అచ్చు గుద్దినట్టు పునః సృష్టి చేశాడు. అలాగే వెంకట్ తో కలిసి డేవిడ్ ఖుబువా కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్- యుద్ధ దృశ్యాల సృష్టి టాప్ క్లాస్ గా వున్నాయి.  ఐతే వూళ్ళో కర్ర ఫైటింగ్ మాత్రం బలహీనంగా వుంది. బృంద సమకూర్చిన నృత్యాలు సినిమాకి ఇతర విభాగాలకి లాగా క్లాసిక్ లుక్ ని తీసుకు రాలేకపోయాయి. ఎడిటింగ్ విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్స్ కీ, ప్రెజెంట్ స్టోరీకీ మధ్య మధ్య అన్నీ స్మూత్ ట్రాన్సిషన్సే. చిట్ట చివరి ట్రాన్సిషన్లో అయితే తెలియకుండా జొనిపిన ఇంటర్ కట్  క్రియేటివిటీకి పరాకాష్ఠ. ఇటలీలో హీరో తెగించి శత్రువుల వైపు వెళ్తూంటాడు. అంతలో ట్రైను వస్తున్న షాట్ పడుతుంది. హీరో ఆ ట్రైను ఎక్కేస్తాడేమో అన్పిస్తుంది- నో, కాదు- ఆ ట్రైన్ ప్రస్తుత యుద్ధ రంగంలోది కాదు. రాబోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనిదని వూళ్ళో రైలు దిగిన పాత్ర ఝలక్ ఇస్తుంది.

                                                     ***
         దర్శకుడు క్రిష్  ఇటు సబ్జెక్టు కి సంబంధించి, అటు సెట్ ప్రాపర్టీస కి సంబంధించీ పకడ్బందీ రీసెర్చి చేసి,  సాధ్యమైనంత కచ్చితత్వాన్ని సాధించారు. ఇంత సినిమానీ  కేవలం 19 కోట్ల బడ్జెట్ తో, అదీ 55 రోజుల్లో పూర్తి చేయడమే ఒక విజయం. రెండో ప్రపంచ యుద్ధం లో వాడిన వస్తు వాహన ఆయుధ సాధన సంపత్తి, దుస్తులూ ఇంకా ఇతర అలంకరణల సేకరణనీ, పరిమిత బడ్జెట్లోనే డిటెయిల్డ్ గా వర్కౌట్ చేసిన యుద్ధ సన్నివేశాల  చిత్రీకరణనీ సుసాధ్యం చేసుకోవడం ఒకెత్తు. చాలా మేధోమధనం వీటన్నిటి వెనుకా వుంది. ఐతే మద్రాసు సెంట్రల్ అప్పుడెలా ఉండేదో, కూమ్ నది ఎలా ఉండేదో,  2010 లో ఎ ఎల్ విజయ్ తీసిన పీరియడ్ మూవీ మద్రాసపట్టినం( తెలుగులో 1947 ఎ లవ్ స్టోరీ’ ) లో చూశాం.  ఆ సహజత్వం క్రిష్ తీసుకురాకుండా ఈ రెండిటినీ తన సినిమాలో డిజైనర్ లుక్ తో సరి పెట్టారు. అలాగే హీరో ఆహార్యం ఆ కాలానికి మ్యాచ్ అయినట్టు హీరోయిన్ కాస్ట్యూమ్స్ లేవు. పైగా ఆమెని కూడా డిజైనర్ రాకుమారి లాగే చూపించారు. కూచ్ బీహార్ ప్రిన్సెస్ గాయత్రీ దేవిని రిఫరెన్స్ గా తీసుకున్నామని చెప్పినప్పుడు, గాయత్రీదేవి పీరియడ్ లుక్ హీరోయిన్ కి పూర్తిగా బదలాయింపు కాలేదు.  

        అలాగే  యుద్ధానికి సంబంధించి కొన్ని తేదీల్ని కథా సౌలభ్యం కోసం ఉపేక్షించడం కూడా చేశారు. ప్రేమ కథ 1936 లో ప్రారంభించి, యుద్ధ కథ 1939 లో ప్రారంభిస్తూ హీరోని అక్కడికి పంపించారు. కానీ ఇటలీ యాక్సిస్ దేశాల నుంచి విడిపోయింది 1943 లోనని చరిత్ర చెప్తోంది. అంటే, అంతవరకూ జర్మనీ మిత్ర దేశంగానే యుద్ధం చేసింది ఇటలీ. హీరో ఎప్పుడు ఇటలీ తరపున యుద్ధం చేసినట్టు?


స్క్రీన్ ప్లే సంగతులు
courtesy : cartoonstock.com 
       మొదట్లోనే చెప్పుకున్నట్టు, ఇది రెండు  విడివిడి కథల సంపుటి. రెండిటి టైం లైన్స్ వేర్వేరు. మొదటిదైన ప్రేమ కథ 1936 లోనూ, రెండోదైన యుద్ధ కథ 1939 లోనూ ప్రారంభమవుతాయి. ప్రేమకథ హీరో పాయింటాఫ్ వ్యూలో సాగే అంచెలంచెల ఫ్లాష్ బ్యాక్ కథనం.   యుద్ధ కథ హీరో పాల్గొంటున్న ప్రత్యక్ష కథనం.  ప్రత్యక్ష కథ, పూర్వ కథ (ఫ్లాష్ బ్యాక్)  ఈ రెండూ  దేనికది బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే మూడంకాల స్ట్రక్చర్ లోనే వున్నాయి. ఇంకో సంగతేమిటంటే, రెండిట్లోనూ ప్రధాన పాత్ర హీరోయే. రెండిట్లోనూ హీరోకి వేర్వేరు గోల్స్ వున్నాయి. ఇలా స్ట్రక్చర్, ఒక ప్రధాన పాత్ర, దాని గోల్ అనే లక్షణాల వల్లే  ఈ రెండూ  విడివిడి స్వతంత్ర కథలయ్యాయి.

        పూర్వ కథ : 1936 లో జరిగే పూర్వ కథలో, ప్రేమించుకుంటున్న హీరో హీరోయిన్ల మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో (ప్లాట్ పాయింట్-1 ), బిగినింగ్ ముగిసి మిడిల్లో పడుతుంది కథ. ఈ మిడిల్ బిజినెస్ ప్రకారం హీరోయిన్ అన్న ఈశ్వర్ తో హీరోకి సంఘర్షణ మొదలవుతుంది. హీరోయిన్ కి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఈశ్వర్. నిమ్న కులస్థుడైన హీరోని అడ్డు తొలగించుకునేదుకు తండ్రి చెప్పిన పథకంతో, వూళ్ళో కులఘర్షణలు రేకెత్తిస్తాడు. ఆ ఘర్షణల్లో హీరోని చంపేస్తే అది ఆ ఘర్షణల  మీదికి పోతుందని ఆలోచన (ఇవాళ్టి  రాజకీయం అప్పట్లోనూ వుండేదా?). ఘర్షణలతో వూరు రెండుగా విడిపోతుంది. నిమ్న కులస్థుల ఇళ్ళకీ , ఉన్నత కులస్థుల ఇళ్ళకీ  మధ్య కంచే కట్టేస్తారు.  అలా హీరో మీద కూడా దాడి చేయడంతో (ప్లాట్ పాయింట్-2) ఈ మిడిల్ ముగిసి, ఎండ్ విభాగంలో పడుతుంది కథ. ఇక్కడ హీరో హీరోయిన్ ఇంటికే వచ్చి,  అందరి ముందూ తాళి కట్టి ఆమెని తీసికెళ్ళి పోతాడు. దీంతో ఆగ్రహించి హీరోని చంపేసేందుకు వెళ్ళిన ఈశ్వర్ ని, హీరోయిన్ అడ్డుకోవడంతో ఆమెని తోసేస్తాడు. ఆమె ఇనుప చువ్వ మీద పడి కడుపులో గాయంతో విలవిల్లాడుతుంది. దీంతో ఎండ్  విభాగంకూడా ముగిసిపోతుంది. 


        ప్రత్యక్ష కథ : 1939 లో జరిగే ప్రత్యక్ష కథలో హీరో జర్మనీ - ఇటలీ సరిహద్దులో ఉంటాడు సైనికుడిగా. ఆ దళంలోనే ఈశ్వర్ కల్నల్ గా ఉంటాడు. ఇద్దరూ ప్రాణ శత్రువుల్లా వుంటారు. కుస్తీ పోటీల్లో చంపుకునేంత పనిచేసుకుంటారు. అంతలో జర్మన్లు వైమానిక దళంతో దాడికి దిగడం (ప్లాట్ పాయింట్ -1), హీరో దళం లొంగిపోవడం జరిగి, బ్రిటిష్ దళాధిపతినీ విడిపించుకోవాలన్న హీరో గోల్ తో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమవుతుంది. ఆ  గోల్ తో తన బ్యాచితో శత్రుదేశంలోకి ఎంటరైనప్పుడు, అక్కడా జర్మన్ దళాధికారి గ్యాంగ్ యూదు కుటుంబాన్ని హతమారుస్తూంటారు. జర్మన్  యువకుడు, యూదు యువతీ పెళ్లి చేసుకుంటే పుట్టిన ‘చెడు రక్తపు’  ఆర్నెలల పసిపాపని చంపెయ్యడానికి సిద్ధమవుతారు. ఇక్కడ హీరో లక్ష్యం బందీలుగా వున్న తన దళాన్ని విడిపించుకోవడమే అయినప్పటికీ, కళ్ళ ముందు పసిపాపతో జరుగుతున్న అకృత్యాన్ని సహించలేకపోతాడు. తన వూళ్ళో తనకి జరిగినట్టే  ఇక్కడ కూడా జాతి రక్తమంటూ రాక్షసత్వం జడలు విప్పుకుంటోంది. ఇక డేరింగ్ గా ఎటాక్ చేసి ముందు ఆ పసిపిల్లనీ, యూదు కుటుంబాన్నీ విడిపించుకుని పారిపోతాడు. జర్మన్లు వెంటపడతారు. ఒక శిథిల భవనం లో దాక్కున్నప్పుడు జర్మన్లు దాడి చేస్తారు. వాళ్ళ వాహనంలోనే బందీలుగా వున్న హీరో దళ సభ్యుల్లోంచి ఈశ్వర్ తనకి తానే తప్పించుకుని ఎటాక్ చేయడం మొదలెడతాడు ( తన బద్ధ శత్రువైన హీరో తనని విడిపించాడన్న క్రెడిట్ దక్కడాన్ని ఓర్వలేక - ఇది చాలా మంచి క్యారక్టరైజేషన్).  పసిపిల్లని కాపాడుకుంటూ హీరో కూడా జర్మన్ల మీద ఎటాక్ చేసి తన దళాన్ని విడిపించుకుని పారిపోవడంతో- ఒక నదిని దాటేందుకు సమకట్టడంతో  ( ప్లాట్ పాయింట్ -2),  ఈ మిడిల్ విభాగం ముగుస్తుంది. ఇక్కడ్నించీ ప్రారంభమయ్యే ఎండ్ విభాగంలో హీరో నది దగ్గర క్యాంపేసిన  జర్మన్ దళాల మీదికి తెగించి దాడికి పోతాడు...



          ఉపసంహారం : ట్రైన్లో హీరో మృతదేహంతో వూరికి చేరుకుంటాడు ఈశ్వర్. ప్రజల కన్నీళ్ళ మధ్య హీరోయిన్ సమాధి పక్కనే హీరోని సమాధి చేస్తారు. ఇలా పూర్వ కథతో వచ్చి ప్రత్యక్ష కథ కలుస్తుంది.

                                                       ***
లిండా ఆరన్సన్
        సమస్యేమిటి? 
        సమస్యలు కొన్ని వున్నాయి...



        పూర్వకథ నేపథ్యంలో, సాదాగా దాని మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో ప్రత్యక్ష కథ నదిపిస్తున్నప్పుడు, దేని మానాన దాన్ని అలా వదిలేస్తే ‘పెప్’ వుండదు. స్పీడు ఉండదు. కొంతసేపటి తర్వాత ఈ సినిమాలో అనుభవమయ్యిందిదే. పూర్వ కథని (ఫ్లాష్ బ్యాక్ ని)  ఖండికలుగా కాకుండా ఒకే ఫ్లాష్ బ్యాకుగా వేసేస్తే ఏ సమస్యా వుండేది కాదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ఎప్పుడూ ప్రత్యక్ష కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరే అయినప్పటికీ- ఖండికలుగా మల్టిపుల్  ఫ్లాష్ బ్యాకులకి సిద్ధ పడినప్పుడు, గతంలోంచి  ఆ సమాచార స్వీకరణతో బాటు, కొంత సస్పెన్సు పోషణా, ట్విస్టులూ వగైరా అవసరమే.


        దీనికి సంబంధించి స్క్రీన్ రైటర్ లిండా ఆరన్సన్ ఏమంటారో చూస్తే -   
Double narrative flashback:

  • type 1 ('Thwarted Dream flashback'), as seen in films like Shine, Remains of the Day, and Slumdog Millionaire, where an enigmatic outsider pursues a thwarted dream)
  • type 2 ('Case History Flashback' ), as seen in films like Citizen Kane, The Usual Suspects, The Life of David Gale etc – where the enigmatic outsider is either dead, close to death, and their story is told by others).  

  • The last two kinds have stories in both the past and the present. They can be put together much faster if you construct them as concentric circles, each circle being a different story in a different time frame,  and jump on cliffhangers in specific places in the story of the past and the story of the present. Where you jump is crucial to success..
        ఎనిమిది రకాల ఫ్లాష్ బ్యాకుల్లో Double narrative flashback ఒకటి. దీంట్లో మళ్ళీ టైప్-1, టైప్-2  అని రెండు రకాలు. ఈ డబుల్ నేరేటివ్ ఫ్లాష్ బ్యాక్ లో ‘కంచె’ లో వున్నది  టైప్-2 ‘కేస్ హిస్టరీ ఫ్లాష్ బ్యాక్’. దీని ప్రకారం పూర్వ కథలో ఆ ప్రేమ హిస్టరీ మనకి చెప్తూ పోయారు (అంటే జరిగిన విషయానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తూపోయారు).  కానీ  లిండా అరన్సన్ ఏమంటారంటే,  ఆ ఫ్లాష్ బ్యాక్ ఖండికలనీ , నడుస్తున్న ప్రత్యక్ష కథ ఖండికలనీ కలిపి చూపిస్తున్నప్పుడు, వాటిని వేర్వేరు కాల్లాలో జరుగుతున్న,  వేర్వేరు కథలుగా చూపిస్తూ,  క్లిఫ్ హేంగర్ మూమెంట్స్  ని కల్పిస్తే- స్పీడు పెరుగుతుందని. క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ అంటే పాత్ర లు డైలెమాలో పడ్డం, ఇరకాటంలో పడ్డం, సస్పెన్స్ ఏర్పడడం, ట్విస్టు తలెత్తడం మొదలైనవి.  వార పత్రికల్లో సీరియల్స్ ఏ వారానికావారం ఒక ట్విస్టు తోనో, సస్పెన్స్ తోనో ఆపి, మళ్ళీ వారం ఇన్ స్టాల్ మెంట్ కోసం ఆత్రుతగా ఎదురు చూసేట్టు చేసినట్టే, సినిమాల్లోనూ  మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో- ఏ ఖండికకా ఖండికగా  ఆపుతున్నప్పడు, అక్కడో  క్లిఫ్ హేంగర్ మూమెంట్  ని పెట్టేస్తే, మళ్ళీ రాబోయే ఫ్లాష్ బ్యాక్ ఖండిక కోసం అల్లాడిపోతారు ప్రేక్షకులు. సినిమా కథన మంటే కథనం మాత్రమే కాదు, ప్రేక్షకుల సైకాలజీని దృష్టిలో పెట్టుకోవడం కూడా. ఫ్లాష్ బ్యాక్ ఖండికలతో బాటు, ప్రధానంగా చూపించే ప్రత్యక్ష కథ ఖండికలకీ క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ ని జత చేస్తే, అప్పుడు ఆ పూర్వ- ప్రత్యక్ష కథలు రెండూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ పరుగులెత్తుతాయనే లిండా ఆరన్సన్ అంటున్నారు.

        అన్ని చోట్లా క్లిఫ్ హేంగర్  మూమెంట్స్ కి సిట్యుయేషన్ క్రియేట్ కాకపోవచ్చు. అయినా ఫరవాలేదు. వార పత్రికైతే ఇంకో వారం పాటు ఆగాలి. ఓ వారం క్లిఫ్ హేంగర్ మూమెంట్  లేకపోతే పత్రికని విసరి కొడతారు. సినిమా రెండున్నర గంటల సేపే ఒకేసారి చూసేస్తారు. కాబట్టి ఓ పది నిమిషాలు క్లిఫ్ హేంగర్ మూమెంట్ లేకపోయినా తిట్టుకుని లేచెళ్లిపోయే ప్రమాదమేమీ వుండదు. పైగా సినిమాలో ప్రేక్షులతో ఎలా ఆడుకోవచ్చంటే - ఆఁ...ఇప్పుడు ఈ ముక్కలో ఏం ట్విస్టు పెడతాడో చూద్దాం - అని కళ్ళప్పగించి చూస్తూ, తీరా తానాశించినట్టు ఒక ట్విస్టుతో ఆ ముక్క ముగియక పోతే - అబ్బా ఏం దెబ్బ కొట్టాడ్రా ఈడూ ..ఓకే..ఇప్పుడు మెయిన్ స్టోరీ ముక్కలో ఏం పెడతాడో చూదాం కదా - అని మళ్ళీ కళ్ళు నులుముకుని చూస్తూ.. ఇలా థియేటర్లో పాజిటివ్ సైకాలజీ రన్ అవుతూ వుంటుంది. ఇవాళ్టి సినిమాకి అత్యంత అవసరం ప్రేక్షకుల్ని బిజీగా ఉంచే ఇంటరాక్టివ్ సీన్ కన్ స్ట్రక్షనే. 


        కానీ 2003 లో ఎన్ చంద్ర తీసిన ఫ్లాపయిన ‘కగార్’ లోనూ, 2015 లో నిఖిల్ అద్వానీ తీసిన ఫ్లాపయిన ‘కట్టీ బట్టీ’ లోనూ మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో జరిగిన తతంగం ఒకటే : క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ లేని బలహీన కథనాలు. 


        పోతే, లిండా ఆరన్సన్  చెప్పిన  concentric circles అంటే- ఒకే అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని రెండు వృత్తాలు.  పక్క   పటం చూస్తే - వెలుపలి వృత్తానికీ, లోపలి వృత్తానికీ, కేంద్ర బిందు వొకటే. ‘కంచె’ లో ఈ  కేంద్ర బిందువు “జాతి రక్తం” అనే కథాంశమైతే, లోపలి వృత్తం ఆ “జాతి రక్తం” అనే కథాంశం చుట్టూ పరిభ్రమిస్తున్న ఫ్లాష్ బ్యాక్ ( స్థానికమైన  పూర్వ కథ), వెలిపలి వృత్తం వచ్చేసి అదే “జాతి రక్తం” కథాంశం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ప్రత్యక్ష- అంతర్జాతీయ కథ! 



                                                    ***


     దర్శకుడు క్రిష్ ఈ రెండు కథల్నీ పోలికల కోసం మాత్రమే చూపిస్తూ పోయినట్టుంది. కానీ పోలికతో బాటు వాటి ఏలిక చూసుకోలేదు. క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ లేని పరిస్థితి ఒకటైతే, ప్రత్యక్ష కథలో హీరోకి మరింత ఎమోషన్ కల్పించాల్సిన అవసరాన్ని  గుర్తించలేదు. కొన్ని తెలుగు సినిమాల్లో స్టార్లు రాజస్థాన్ వెళ్లి, బీహార్ వెళ్లి, నేటివిటీకి దూరంగా అక్కడి ప్రజల సమస్యలేవో  పరిష్కరించి వచ్చేశారు ఓ పనైందన్నట్టు. ఆ సినిమాల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ‘కంచె’ లో కూడా హీరో ఎక్కడో విదేశాలకెళ్ళి రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు చెయ్యాలి? ఎవరికోసం చేస్తున్నాడు? బ్రిటిష్ వాడి యుద్ధం తనెందుకు చెయ్యాలి? బ్రిటిష్ వాడితో చేస్తున్నది మన స్వాతంత్ర్య పోరాటం కదా? అన్న ప్రశ్న వస్తే, సమాధానం బలంగా రావాలి. 

        ఫ్లాష్ బ్యాక్ లో ఒక చోట హీరోయిన్ తో అంటాడు- నేను యుద్ధానికి వెళితే ఎలా ఉంటుందని. పెళ్లి ప్రయత్నాల మధ్య ఈ మాటేంటి? ఈ ఆలోచన వుంది కాబట్టే,  ఆమె చనిపోయాక వైరాగ్యం తో యుద్ధానికి వెళ్లిపోయాడని మనం అనుకోవడానికా ఆ మాట అక్కడ అసందర్భంగా చెప్పించారు? 

        హీరోయిన్ మరణానికి కారకుడైన అన్న ఈశ్వర్ కూడా - ఆడకూరుర్ని కోల్పోయిన పెద్ద వాళ్ళయిన ఇంట్లో తండ్రినీ నానమ్మనీ వాళ్ళ ఖర్మానికి వదిలేసి యుద్ధానికి వెళ్ళిపోవడం కూడా దర్శకుడు వివరించాల్సి వుంది. దీన్నలా ఉంచుదాం, హీరో వైరాగ్యంతోనే వెళ్ళాడనుకుంటే, అక్కడ బందీలైన బ్రిటిష్ అధికారిని, దళ సభ్యుల్నీ, వాళ్ళల్లో ప్రత్యేకించి తన శత్రువు ఈశ్వర్నీ
కాపాడాలనుకోవడంలో అంత బలమైన ఎమోషన్ ఏమీ లేదు. ఇది సినిమాకి కీలకమైన ప్లాట్ పాయింట్ - 1 అనే సన్నివేశం. అంటే స్క్రీన్ ప్లేకి మొదటి మూల స్థంభం. ఈ మొదటి మూల స్థంభంలో ఉండాల్సిన 1. గోల్, 2. ఆ గోల్ లో ఎమోషన్, 3. ఆ గోల్ కారణం గా ఉత్పన్నమయ్యే పరిణామాల హెచ్చరికా అనే మూడు పార్శ్వాల్లో,  3వది మాత్రమే బలంగా కన్పిస్తోంది. దళాన్ని విడిపించు కోవడానికి రిస్కు చేసి హీరో  శత్రు దేశంలోకి అడుగెట్టడమంటే ప్రాణాలు వదులుకోవడమే నన్న భయాందోళనలు రేకెత్తి స్తోందీ 3 వ పార్శ్వం. ఇటీజ్ వండర్ఫుల్. కానీ అసలు  గోలే  అంత కన్విన్సింగ్ గా లేదు. ప్రేక్షకులకి పరిచయంలేని, ఎమోషనల్ గా కనెక్ట్ కాని, ఎవరో బ్రిటిష్ అధికారిని హీరో విడిపించాలనుకోవడం గోల్ అన్పించుకోదు. ఇది మళ్ళీ రాజస్థాన్, బీహార్ వ్యవహారాలకి దారితీస్తుంది.  కాబట్టి 2 వ పార్శ్వం ‘ఎమోషన్’ అనేది ఫీలవడానికి లేదు ఆ గోల్ లో. తెలుగు సినిమాల్లో ఈ మొదటి మూల స్థంభాలతోనే సమస్య! మూలస్థంభం అంటే లారీలో ఓ దిమ్మె వేసుకొచ్చి  పాతెయ్యడమే  అనుకుంటున్నారు..


        ఓ పసిపాప వచ్చేసి దీన్నంతటినీ తుడిచి పెట్టేసింది. దిమ్మెని లేప్పారేసింది! ఒక గోల్ కోసం హీరో ప్రయాణంలో కొన్ని సబ్ గోల్స్ -సబ్ ప్లాట్స్ ఎదురవడం సహజమే. అలాటి గోల్/సబ్ ప్లాట్ ఈ పసిపాప. ఇది చెడురక్తం పంచుకు పుట్టిన పురుగు అని నాజీలు భావించినప్పుడు- హీరో ఫ్లాష్ బ్యాక్ లో తాను అనుభవించిన ఆ  రక్తాల తాలూకు బాధామయ కాన్సెప్ట్ తో ఇక్కడ కనెక్ట్ అయ్యాడు. concentric circles కి కేంద్ర బిందుగా పైన చెప్పుకున్న జాతి రక్తం కథాంశానికి ఈ  పాప వచ్చేసి సింబల్ అయ్యింది. ఈ పాపకోసం హీరో పోరాడడం లో ఆడియెన్స్ కి ఎమోషనల్ కనెక్ట్ వుంది. ఇప్పుడీ ఈ గోల్ లో యూనివర్సాలిటీ వుంది. లేకపోతే  ‘భజరంగీ భాయిజాన్’ కూడా వుండదు. అయితే ‘భజరంగీ భాయిజాన్’ లో యూనివర్సల్ సింబల్ అయిన మూగ బాలిక లాగా ఇక్కడ పసిపాప పాత్రచిత్రణ లేదు. ఇక హీరో ఈ పసిదాన్ని కాపాడుతూ కూర్చుంటే బందీలుగా వున్న ఆ దళం సంగతి? అది కూడా వుంటుంది. సినిమాలో వుంది కూడా . కాకపోతే ఇప్పుడు ఫిజికల్ గోల్ గా మాత్రమే. దీంతో ఆడియెన్స్ కి ఏ పేచీ వుండదు. పసిపాపని రక్షించే  ఎమోషనల్ గోల్ వుంది కాబట్టి. కనుక ఈ ఫిజికల్, ఎమోషనల్ గోల్స్ రెండిటి డైమెన్షన్ తో హీరో పాత్ర కూడా పరిపూర్ణమయ్యింది ప్రత్యక్ష కథలో.   


        సరే, ఈ ఎమోషనల్ గోల్ లో కూడా మళ్ళీ ఏముండాలి? పర్సనల్ ఫీల్, టచ్ వుండాలి. వీటితో బాటు, ఆ కాన్సెప్చ్యువల్ సింబల్ అయిన  పసిదాని ప్రతిస్పందనలు కూడా వుండాలి ప్రాణి కాబట్టి. అది హీరోని చూసి నవ్వాలి, ఏడవాలి, చేతులు జాపాలి, యుద్ధ ఫిరంగులకి బెదిరిపోవాలి. ఆ పసిపిల్ల కూడా యుద్ధం చేస్తోంది  ఆకలితో- అనే ఒకమాట పరోక్షంగా అన్పించేస్తే సరిపోదు. పసిదాంతో హీరో కి హ్యూమన్ టచ్ వుండాలి. ఎందుకంటే, తాళి కట్టిన మరుక్షణమే భార్యని కోల్పోయిన నేపధ్యం లోంచి వచ్చిన వాడు హీరో. అలాటి వాడు ఓ పసికందుని చూస్తే  భావోద్వేగాలెలా వుంటాయి? భార్యతో ఎలాటి జీవితం తనకుండేది- ఎలాటి పాప తనకుండేది - ఈ సహజ భావోద్వేగాల్ని పాపతో ఏ సన్నివేశంలోనూ పాదుకోల్ప లేదు దర్శకుడు. ఆ యూదు కుటుంబం తో ట్రక్కులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా వాళ్ళందరికీ తన వూరి వాళ్ళ పేర్లు పెట్టి పిలుచుకున్నాడే గానీ-  ‘ఇది మా ఇంటి లక్ష్మీ’ - అని పసిదాన్ని వొళ్లోకి కూడా  తీసుకోలేదు.  ఇలాటివి జరక్కపోతే ఆడియెన్స్ హీరోతో ఎలా ట్రావెల్ చేస్తారు? అతన్నో మనిషిగా ఎలా చూస్తారు? యూదు కుటుంబ సభ్యుల చేతుల్లో ఆ పసిదాని ఒకే రకమైన స్ప్లిట్ సెకండ్ క్లోజప్స్ వేస్తూపోతే, సరీగ్గా ఆడియెన్స్ కి కూడా ఆ  పాప రూపు రేఖలు అందే పరిస్థితి లేదు. (ఆ పాప ఎలా వుంటుందో ఈ వ్యాసకర్తకి కూడా గుర్తుకు రావడలేదు)  ఇక హీరో- పైన చెప్పుకున్న concentric circles లో ప్రత్యక్ష కథ అయిన వెలుపలి వృత్తం లో ఉంటూ,  కేంద్ర బిందువైన కథాంశానికి సింబల్ అయిన పసిదానితో- భౌతిక శాస్త్రం లో చెప్పేదాని ప్రకారం- అభికేంద్ర శక్తి (centripetal force) గా ఉండక, అపకేంద్ర శక్తి (centrifugal force) గా వృత్తం లోంచి పలాయనం చిత్తగిస్తు న్నట్టు వుంటే ఎలా?



                                                     ***
      ప్రత్యక్ష కథలో హీరో యుద్ధం ఎందుకు చెయ్యాలి అనేదానికి ఇంటర్వెల్  దగ్గర చెప్పేందుకు వచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. ఆ యుద్ధానికి మరింత భావోద్వేగపు ఉధృతిని  కల్పించే అదృష్టాన్ని వదులుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ లో హీరో డేరింగ్ గా పసిపాపని కాపాడుకున్నాడు. ఇంటర్వెల్ వేసేశారు. హీరోకి ఎదురవబోయే ఇంకే రకమైన రిస్క్ ని గానీ,  స్టేక్ ని గానీ ఎస్టాబ్లిష్ చేయకుండా, అంతా సుఖాంతం- ఇంకేమీ లేదు పొమ్మనే అర్ధం వచ్చేట్టు విశ్రాంతి వేశారు. ఇది సరయినదేనా? సెకండాఫ్ తో ఆడియెన్స్ కనెక్ట్ అవసరంలేదా? దేన్ని  ఫీలయ్యి  సెకండాఫ్ చూడ్డం కోసం ఆడియెన్స్ ఎదురు చూడాలి? సర్వసాధారణంగా సినిమాల్లో ఇంటర్వెల్లో వుండే క్లిఫ్ హేంగర్ మూమెంట్ నే ఇక్కడ ఉపేక్షిస్తే ఎలా!

        ఒకే ఒక్క పాయింట్ - కథని ఇక్కడనుంచీ మరింత బలంగా నడిపించే- ఒకే ఒక్క ట్విస్ట్ -ఇక్కడ పడివుంటే, అది సర్వరోగ నివారిణిలా పనిచేసేది. వెంకయ్య నాయుడు చెప్పే జిందా తిలిస్మాత్ లా పనిచేసేది. చంద్రబాబు నాయుడు చెప్పే సంజీవిని అయ్యేది. ఇంటర్వెల్ బ్లాకులో తమ మీద దాడి చేసి పసిదాన్ని లాక్కుంటే ఊరుకుంటారా అంత యుద్ధ తంత్రపు ప్రత్యర్ధులు? -‘రేయ్, ఆ పిచ్చి ముండని ఇచ్చెళ్ళక పోతే ఇక్కడ నీవాళ్ళ పుచ్చెల్లేచి పోతాయ్ రా పిచ్చోడా!’ అనరా?


        వాళ్లకి బందీలుగా పట్టుకున్నదళం అంత ముఖ్యం కాదిప్పుడు. తమ జాతిరక్తానికి సవాలుగా మారిన పసిదాని ప్రాణాలు అవసరం. ఇదేమీ చేయకుండా,  ఇక్కడ్నించీ సెకండాఫ్ లో చూపించినట్టు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోరు అంత యుద్ధాన్ని నడిపే ప్రత్యర్ధులు. ఇంటర్వెల్ దగ్గర ఆ జర్మన్ ప్రత్యర్ధులు  ఆ ట్విస్ట్ పెట్టి వుంటే, హీరో ఇప్పుడు మోరల్  డైలెమా అనే కొత్త చిక్కులో పడి,  క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని క్రియేట్ చేసేవాడు. ఆడియెన్స్ కి సెకండాఫ్ తో కనెక్ట్ ఇచ్చే వాడు. ఈ ప్రత్యక్ష కథ సెకండాఫ్ లో కొత్త పంథాలో సాగడానికి బాట వేసే వాడు. పసిపిల్లా? తన దళమా? ఏది ముఖ్యం?  అన్న ఆర్గ్యుమెంట్ బర్న్ అయ్యేది. కథంటే ఆర్గ్యుమెంటే కదా? ఉత్త స్టేట్ మాత్రంగా ఇచ్చిపోయే ‘గాథ’ లా దీన్ని నడిపారు. అందుకే గొప్ప యాక్షన్ క్రియేట్ అయ్యింది తప్పితే తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత ఎమోషనల్ డ్రామా దానికి జతపడ లేదు. ఆ దాటున అదలా సాదా- బలహీన ముగింపుకే దారి తీసింది.



        వెనక ఫ్లాష్ బ్యాక్  చివరి ఘట్టంలో,  హీరోయిన్ చువ్వల మీద పడి గాయపడ్డం చూపించి కట్ చేసి,  ఆమెకి తర్వాతేమయ్యిందీ  సస్పెన్సులో పెట్టారు. ఉపసంహారంలో ఆమె సమాధి చూపించినప్పుడు గానీ ఆమె చనిపోయిందని తెలీదు ఆడియెన్స్ కి. అయితే దీనికి ఇక్కడ ఇవ్వాల్సిన షాక్ వాల్యూ ఇవ్వలేదు. ప్రేక్షకులు పట్టనట్టు నిర్లిప్తంగా చూసేట్టు చేశారు. ఇదే ‘టెక్నిక్’ హీరో మరణానికి కూడా ఉపయోగించారు. క్లయిమాక్స్ లో అతను నది ఒడ్డున శత్రువుల వైపు వెళ్తున్నట్టు చూపించి ట్రైన్ షాట్ తో కట్ చేసి- ఊళ్ళోకి వచ్చారు. ట్రైన్ దిగిన ఈశ్వర్ హీరో మరణ వార్తని ప్రకటించాడు. ఇక్కడ కూడా షాక్ వేల్యూ లేదు. హీరోయిన్ సమాధి పక్కనే హీరో సమాధి కడుతున్నట్టు చూపించారు- మృతదేహాన్ని కూడా చూపించలేదు. ఇవన్నీ బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా పనిచేసే కథనాలయ్యాయి.


          దర్శకుడు ఈ రెండు కథలకీ మ్యాటరాఫ్ ఫ్యాక్ ( unemotional, practical, sensible, realistic, unsentimental, businesslike etc)  కథనాన్ని ప్రయోగించి నట్టుంది. దీన్ని ఏనాడో ప్యాసాలో గురుదత్ ప్రయోగించారు విజయవంతంగా. ఫలానా ఈ సంఘటన ఈ పాత్ర జీవితంలో ఇలా జరిగిందీ- అని ఒక టీవీ జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తున్న చందంగా చూపించి కట్ చేసేస్తారు ఏ సన్నివేశానికా సన్నివేశం దత్. పాత్రల ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీచల్తా. దీన్ని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్కథనమన్నారు పండితులు. ఇది మతిపోగొట్టే కథనమే. ఇలాంటిది చాలాకాలం వరకూ మరే దర్శకుడూ ప్రయత్నించలేదు- ఇటీవల కాలంలో ‘బర్ఫీ’ లోనే చూస్తాం. ఇవి ఫ్లాష్ బ్యాక్, మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూడిన కథనాలు కావు కాబట్టి చెల్లింది. కానీ చివరంటా మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులే రాజ్యమేలే  ‘కంచె’ లాంటి జోడు కథలకి చెల్లుతుందా?


-సికిందర్