రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, September 27, 2021
1059 : మూవీ నోట్స్
ప్రేమ సినిమాల్లో కులాంతర ప్రేమలు కూడా చార్మినార్
కాలం నాటివే వస్తున్నాయి. గత నెల్లోనే ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే కులాంతర ప్రేమ
చార్మినార్ కాలం నాటిదే. ఇంకా చెప్పాలంటే గోలీ సోడాలున్న చార్మినార్ కాలం నాటిది.
దీని పీరియెడ్ ని సూచిస్తున్నట్టు సినిమాలో కూడా ఇప్పుడు లేని గోలీ సోడానే
చూపించారు. కాకపోతే ఈ కులాంతరానికి ఈ కాలపు వార్తల్ని సృష్టిస్తున్న ఆనర్
కిల్లింగ్ అనే ఆవేశం తోడయ్యింది. దీనికి ముందొచ్చిన ‘ఉప్పెన’ అనే ఇంకో కులాంతరంలో ఇంకో ఆవేశం తొడయ్యింది. ఇక ఇప్పుడొచ్చిన ‘లవ్ స్టోరీ’ లో ఈ ఆవేశాలకి భిన్నంగా కాస్త ఇంకేదో
ఆవేశం సృష్టించానుకున్నట్టుంది కమ్ముల. దీంతో కులాంతర సమస్య తో శేఖర్ కమ్ముల దృక్కోణంలోంచి
ఆశించిన ఆయన స్టోరీ ఐడియానే లేకుండా పోయింది.
చైల్డ్ ఎబ్యూజ్ మీద హిందీలో ఈ మధ్య
రెండు విడుదలయ్యాయి : ‘కహానీ- 2’ (2016), ‘హైవే’ (2014). వీటికి పూర్వం ఇండిపెండెంట్
దర్శకురాళ్ళ సినిమాలు రెండు వచ్చాయి. దీపా మెహతా 2005 లో తీసిన ‘వాటర్’, మీరా నాయర్ 2001 లో తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ అన్నవి. మొదటి రెండూ చైల్డ్ ఎబ్యూజ్
తో వేరే కథలు. మూడోది ‘వాటర్’ 1938 నాటి
పీరియెడ్ కథా నేపథ్యం. నాల్గోది ‘మాన్సూన్ వెడ్డింగ్’ లో ఎన్నారై లంతా ఒక చోట కూడే పెళ్ళి వేడుకల కథ. ఈ పెళ్ళి వేడుకల కథలోంచి సెకండాఫ్
లో చైల్డ్ ఎబ్యూజ్ కథ బయటపడుతుంది.
ఇందులో ఇంకో వేరే పాయింటు లేదు. నాల్గు
రోజుల పెళ్ళి వేడుకల్లో సెకండాఫ్ లో చిన్నప్పుడు చైల్డ్ ఎబ్యూజ్ నెదుర్కొన్న షెఫాలీ
షా పాత్ర, అది బయటపెట్టి అలజడి సృష్టించే ఒకే పాయింటు తప్ప. దీనికి
పరిష్కారంగా పెళ్ళి కూతురి తండ్రి పాత్ర నసీరుద్దీన్ షా, చైల్డ్
ఎబ్యూజ్ కి పాల్పడ్డ తోడల్లుడు రజత్ కపూర్ ని పెళ్ళి వేడుకల్లోంచి బహిష్కరిస్తాడు.
‘లవ్ స్టోరీ’ లో కులాంతర ప్రేమ కథగా నడుస్తూంటుంది. దీనికి హీరోయిన్ బాబాయి పాత్ర అడ్డుపడాలి
నిజానికి. కానీ మళ్ళీ ఇది పాత కాలపు కథై పోతుందనేమో, బాబాయికి
హీరోయిన్ తో చైల్డ్ ఎబ్యూజ్ విలనీ సృష్టించారు. దీంతో బాబాయి హీరోయిన్ మీద అదే కాంక్షతో
వేధిస్తూంటాడే తప్ప, ఆమెకి హీరోతో వున్న కులాంతర ప్రేమ గురించి
కాదు. చివరికి సెకండాఫ్ లో పెళ్ళి సందర్భంగా హీరోయిన్ ఇది బయట పెట్టినప్పుడు, హీరో దీని తాలూకు కసితోనే బాబాయిని చంపేస్తాడు. ఇందులో కులాంతరం సమస్య ఎక్కడుంది.
లేనప్పుడు కులాంతర ప్రేమ కథ ఎందుకు.
కులాంతరమే కాదు ఇంకా లింగ వివక్ష, జీవన పోరాటం పాయింట్లు కూడా కథలో నడుస్తూంటాయి. ఒక ఇంటర్వ్యూలో - అన్ని పాయింట్లూ
కలిపేసిన కిచిడీ ఈ కథ - అని కమ్ములే స్వయంగా అన్నట్టు, ఇది ప్రేక్షకులకి
నచ్చి హిట్ చేశారు. కులాంతర ప్రేమ కథలు ఏదో రకంగా, వంకరగా కూడా, చావులతోనే ముగుస్తాయన్న మాట.
―సికిందర్
Subscribe to:
Posts (Atom)