రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 1, 2014

ఆయనే ఒక స్కూలు

ఆర్టికల్
బాపు సినిమాల్లో వైవిధ్య విలాసం!
            కీ.శే. బాపు సినిమాలు అనగానే రామాయణమే గుర్తు కొచ్చేంతగా ఆయన ముద్ర పడిపోయారు. ఆ ముద్ర చెరిపేసుకోవాలని ఏనాడూ ఆయన ప్రయత్నించలేదు. ఒక పెళ్లి కథో, ఇంకో భార్యాభర్తల మధ్య సంబంధాల కథో తీస్తే - ఆఁ... ఏముందిలే, ఇంకో రామాయణ పారాయణమే కదా అనేసి ప్రేక్షకులు ముందే ఊహించేస్తున్నా, ఆయన లక్ష్యపెట్టలేదు
            ఈ రోజుల్లో సినిమా విడుదలయ్యేవరకూ కథ బయటికి పొక్కకుండా తీసుకుంటున్న జాగ్రత్తల నేపధ్యంలో ఆలోచిస్తే, బాపు కా రోజుల్లో ప్రేక్షకులు తన సినిమా ఏ బాపతు కథో ముందే చెప్పేస్తున్నా గాభరాపడలేదు. ఎన్ని సార్లు రామాయణాన్ని తిప్పి తిప్పి తీస్తూ పోయినా, ఇంకేదో వైవిధ్యం కనబరుస్తాడనన్న ఆసక్తి ప్రేక్షకులకి మిగిలే ఉంటుందని ఆయన భరోసా. ఆ భరోసాతోనే ప్రేక్షకాసక్తిని నీరుగార్చకుండా అటువంటి సినిమాలు తీస్తూ విజయాలు సాధిస్తూ పోయారు. ఆ సినిమాల్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించుకో నక్కరలేదు. ఇక్కడ ప్రధానంగా చెప్పబోతున్నది, బాపు అంటే కేవలం రామాయణ ప్రమోటర్ మాత్రమే కాదనీ, ఆ నాటికి అందుబాటులో వున్న ఇంకా ఇతరానేక ప్రక్రియల్లో కూడా ఆయనది అందెవేసిన చెయ్యి అని కూడా గుర్తుంచుకోవాలని మాత్రమే!
            1967 – 2011 మధ్య కాలంలో ఆయన తీసిన మొత్తం 51 సినిమాల్లో నేరుగా తీసిన రామాయణం (సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీరామ రాజ్యం) తో నాలుగే వున్నాయి. అంతటి  రామభక్తుడు ఫక్తు పౌరాణికాలే తీయాలని ఉత్సాహ పడలేదు.  

పౌరాణీకాన్ని సాంఘీకం చేయడం పైనే దృష్టి పెట్టారు. దీంతో నాటి ముత్యాలముగ్గునుంచీ నిన్నమొన్నటి సుందరకాండదాకా పూర్తి రామాయణీకరించిన లేదా అక్కడక్కడా ఆ ఛాయలతో కూడిన  ప్రేమా పెళ్ళీ- దాంపత్యాల కథా కమామీషుల్ని సినిమాలుగా తీయకుండా
ఉండలేకపోయారు.  ఇవి పక్కనపెడితేశ్రీనాథ కవి సార్వభౌమ, త్యాగయ్య, భక్త కన్నప్ప, రాజాధిరాజు లాంటి హిందూ- క్రైస్తవ చారిత్రక- భక్తి కథా చిత్రాలూ తీశారు. మంత్రిగారి వియ్యంకుడు, జాకీ, బుల్లెట్ లాంటి పక్కా వినోదాత్మకాలూ తీశారు. బుద్ధి మంతుడు లాంటి ఆస్తిక- నాస్తిక చర్చకీ తెర తీశారు. వంశవృక్షం లాంటి సనాతన ధర్మాల కథ తోనూ తీశారు. మళ్ళీ శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ లాంటి హిందూ- క్రైస్తవ మతాంతర ప్రేమ కథతోనూ తీశారు. అలాగే, తూర్పు వెళ్ళే రైలు, రాధాకళ్యాణం లాంటి తమిళ రీమేకులూ తీశారు. స్నేహం అనే హిందీ రీమేకూ వదలలేదు. ఇక బాలీవుడ్ వెళ్లి ఏకంగా 12 హిందీ సినిమాలకి దర్శకత్వం వహించేశారు!
            ఇదంతా ఒకెత్తు అయితే, సినిమారంగ ప్రవేశం చేస్తూనే  ‘సాక్షి’  అనే సామాజిక చైతన్యం గల సినిమా తీయడం, ఈ సామాజిక- విప్లవ కథా చిత్రాల పంథా లోనే కలియుగ రావణాసురుడు, మనవూరి పాండవులు, బాలరాజు కథ లాంటివీ  తీయడం మరొకెత్తు!

            ఇలా ఇంత వైవిధ్యం ఆయన లోంచి ప్రవహించింది. ఇప్పటిలా కాక అప్పటి ప్రేక్షకుల అభిరుచి బహుముఖాలుగా వుండడం వల్ల, నాటి అనేక ఇతర దర్శకులకి లాగే బాపుకి ఈ వెరైటీ అంతా సాధ్యపడింది. అయితే ఇదంతా వ్యాపారాత్మక చిత్రాల పరిధి లోనే. ఆ పరిధి దాటి పోలేదు. ఒక చిత్రకా రుడిగా ఆయన మేధావియే కావొచ్చు, కానీ చలన చిత్రకారుడిగా సామాన్యులని అలరించే కమర్షియల్ సినిమాలే తీశారు. చిత్రకారుడిగా ఆయన శైలి ప్రభావంలో ఒక తరానికి తరమే యువ చిత్రకారులు కొట్టుకు పోయారు. అలాంటిది సినిమాల విషయానికొస్తే, ఆయన శైలిని అనుసరించకపోయినా ఫర్వాలేదు, కనీసం కథ చెప్పడంలో ఆయన సినిమాలు ఏ నూతన పోకడలు ప్రతిపాదిస్తున్నాయో తెలుసుకుని అనుసరించిన పాపాన ఏ యువ దర్శకుడూ పోలేదు. ఇదికూడా తెలుగు సినిమాల నాణ్యతా ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా తయారవడానికి మూలకారణ మైన వాటిలో ఒకటిగా చెప్పొచ్చు. ఏదైనా సినిమా చూస్తే అందులోంచి కథని తెలియకుండా ఎలా సొంతం చేసుకోవాలా అన్న దృష్టితోనే చూస్తారు తప్ప, ఆ కథ చెప్పడంలో ఏవైనా కొత్త విషయాలుంటే నేర్చుకోవాలన్న అధ్యయన దృష్టితో కాకపోవడం అలవాటుగా మారింది.

         బాపు తీసిన వాటిలో రెండు సినిమాలు - ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు రెండూ రెండు సినిమా కళా పాఠాలుగా నిలబడతాయి. రెండూ కమర్షియల్ గా సూపర్ హిట్టయినవే. కానీ రెండూ రెండు ప్రయోగాత్మక సినిమాలే. ప్రయోగాత్మక సినిమాలు ఆబాలగోపాలాన్ని ఉత్తేజ పర్చే కమర్షియల్ హిట్స్ కావడం చాలా చాలా అరుదైన విన్యాసం. నేడు క్రాసోవర్ సినిమాలంటూ కొత్త వర్గీకరణతో బాలీవుడ్ లో తీస్తున్న వందలాది మల్టీప్లెక్స్ సినిమాలని చూసి- ఓహో సినిమాలు ఇలా కూడా తీయవచ్చా అని సంబర పడుతున్నాం గానీ,  2000 - 2001 లలో వీటికి బీజం వేసిన ఆర్టు సినిమా దర్శకులైన శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ లని కీర్తిస్తున్నాం  గానీ, ఈ పని తెలుగులో ఏనాడో 1975 లోనే  బాపు ముత్యాల ముగ్గుతో చేసి చూపెట్టేశారు!

     `80 లు దాటి `90ల కల్లా దేశవ్యాప్తంగా ఆర్టు సినిమాల ఉద్యమం చల్లబడుతూ వచ్చి, అవి ఇంకెంత మాత్రమూ వర్కౌట్ కావని తెలుసుకున్న బెనెగళ్, నిహలానీ ప్రభృతులు, మళ్ళీ తమ ప్రేక్షకుల్లో ఊపుతీసుకు రావడానికి తొట్టతొలి సారిగా, తమ తమ భేషజాలూ ఇతర మానసిక నిషేధాలూ వదులుకుని బాలీవుడ్ తో రాజీ పడిఅప్పటి పాపులర్ స్టార్స్ ని ఆశ్రయించి, ‘జుబేదా’ (2001) అని ఒకరూ, ‘తక్షక్’ (2000) అని మరొకరూ తీసి ఆర్ట్ సినిమాలకి విచిత్రమైన రూపు తొడిగారు. అది కమర్షియలార్టుఅయి కూర్చుంది. ఇలా ఆర్టు సినిమా కమర్షియల్ కి క్రాసోవర్ అవడంతో వీటికి క్రాసోవర్ సినిమా అనే పేరు ప్రాచుర్యం లోకి వచ్చింది. ఈ ధోరణిలో బాలీవుడ్ స్టార్స్ తో ఇతర దర్శకులూ, కొత్తగా వచ్చే దర్శకులూ లో బడ్జెట్ సినిమాలు తామర తంపరగా తీస్తూ దేశవ్యాప్తంగా మల్టీ ప్లెక్స్ థియేటర్ లకి కావలసినంత ఫీడింగ్ ని ఇవ్వసాగారు. ఒకప్పుడు ఆర్ట్ సినిమాల్ని అభిమానించే ప్రేక్షకులు ఉన్నట్టే, ఇప్పడు మల్టీప్లెక్స్ ప్రేక్షకులు కమర్షియలార్టు  సినిమాల పోషకులయ్యారు. ఇదంతా భవిష్యద్దర్శనం చేసినట్టు బాపు గారు ఏనాడో ముత్యాలముగ్గు ద్వారా చూపించేశారు!
            అయినా అప్పుడూ ఇప్పుడూ కూడా తెలుగులో ఇలాటి ట్రెండ్ జాడే లేదు. కారణం, లో- బడ్జెట్ లో చిన్న సినిమాలయినా సరే, అవి  భారీ సినిమాల కృత్రిమత్వానికి అలవాటు పడిపోవడమే. దీన్నుంచి పక్కకు జరిగి సహజత్వాన్ని అంగీకరించక పోవడమే. భారీ సినిమాల అనుకరణల జాడ్యం లో పడి ఐపులేకుండా పోతున్నా సరే, దీపం చుట్టూ పురుగుల్లా సమిధలవడానికి ఇష్ట పడడమే

           
ఈ నాటికీ ముత్యాలముగ్గు అంతర్జాతీయ స్థాయి సినిమానే. అప్పటికే అది వ్యాపార విలువల్ని జోడించుకున్న కళాత్మక సినిమా. అతి తక్కువ డైలాగులతో ఆర్టు సినిమా లుండవచ్చు. కమర్షియల్ సినిమాలకి డైలాగుల దండకం వుండాల్సిందే. అలాంటిది అతి పొడుపు చేసిన డైలాగులతో, హావభావాల మీద పండించిన సన్నివేశాలతో,  క్లాస్-మాస్ ప్రేక్షకులనే తేడాల్ని చెరిపేస్తూ కనక వర్షం కురిపించుకున్న సినిమా ఏదైనా వుందంటే అది ఇదే. తర్వాత ఈ సరళిలోనే శంకరా భరణం, సితార, మేఘ సందేశం వచ్చి అవికూడా పెద్ద హిట్టయి ఉండొచ్చు. ఇవి ముత్యాల ముగ్గుకి అనుసరణలు మాత్రంకావు. ఆ ఉద్దండ దర్శకుల ఓరిజినాలిటీయే అది! కానీ ముత్యాలముగ్గు కథ ఎత్తుగడని కానీ, విశ్రాంతి ఘట్టం తర్వాత నుంచి పట్టాల్సిన మార్గం గురించి గానీ, చివరికి ముగింపెలా ఉండాలో గానీ, పరిశీలించుకుని వుంటే కొన్ని వందల సినిమాలు ఫ్లాపు బాట పట్టి పోయేవి కావు.
           
కానీ దురదృష్ట మేమిటంటే, కాపీ కొట్టడమనే తమ వంశాచారం ప్రకారం, ఎన్నో సినిమాల్లో ముత్యాలముగ్గు ఎత్తుగడనే యధాతధంగా దించేసుకుంటూ వస్తున్నారు. హీరోయిన్ సంగీతకి పెళ్ళ వుతూ వుంటే, హీరో శ్రీధర్ ఆ పెళ్ళికి అతిధిగా రావడమనే అత్యంత ఆసక్తిరేపే ప్రారంభ దృశ్యాన్ని కాపీ కొట్టి ఎన్నో సినిమాల్లో పదేపదే చూపించారు. అంతే గానీ, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని; వేరే యాక్షన్, కామెడీ తదితర కథా చిత్రాలకి వాటి కథల ప్రకారం ఈ ఎత్తుగడని మల్చుకుని, ఆ కొత్తదనాన్ని ప్రేక్షకులకి ఎప్పుడూ పంచి పెట్టింది లేదు.
           
విశ్రాంతి ఘట్టం తర్వాత ద్వితీయార్ధం అనేకానేక సినిమాల్లో కథ దారితప్పి వేరే కథ నడవడాన్ని గమనిస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతోందో ఏమిటో ముత్యాల ముగ్గు ని చూస్తే  తెలుస్తుంది. ప్రథమార్ధంలో ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది. పూర్వార్ధంలో లో ఇలా విడదీయడం సులభమే. ద్వితీయార్ధంలో  ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే సవాలు విసిరే ప్రక్రియ! 

          ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి?  పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే అవుతుంది.
         
పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే రస భంగం కలక్కుండా కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ- రమణలు దిగ్విజయంగా!
          ఇక ముగింపు ఎలా ఉండాలనే దానికి- పతాక స్థాయి కొచ్చేసరికి
ఒకర్నొకరు వెన్నుపోట్లు  పొడుచుకుని కలహించుకుంటున్న దుష్ట చతుష్టయానికి,  మామూలుగా నైతే కళ్ళు తెరచిన హీరో వచ్చి బుద్ధి చెప్తాడు. కానీ ఇక్కడ అలాకాదు, బాపు తన బుద్ధికి పని చెప్పి- బ్రహ్మపురాణంలో చెప్పినట్టు- సృష్టి ఉపసంహార ప్రక్రియల్లో ఒకటైన, పంచమహా భూతాలు ఒకదాన్నొకటి మింగేసుకునే ‘నైమిత్తిక’ తరహా ముగింపుతో బుద్ధి చెప్పారు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే పండితుడు పదే  పదే  ఒకటే చెప్తాడు- ఎప్పుడైతే ప్రేక్షకుల నరనరాన జీర్ణించుకు పోయిన పురాణాల తాలూకు ఛాయలు వెండితెరమీద ప్రతిఫలించి తెలియకుండా వాళ్ళ ఆత్మిక దాహాన్ని తీరుస్తాయో- అప్పుడా సినిమాకి బేషరతుగా వాళ్ళు దాసోహమై పోతారని!
          ఇక పాత్ర చిత్రణలో రావుగోపాల రావు ప్రతినాయక పాత్ర ఒక క్యారక్టర్ స్టడీ. దాని భాష, యాస, 
చేత, తలరాత అన్నీ నిజజీవితంలోంచి ఉట్టిపడినవే. ఇప్పటి తెలుగు సినిమాల విలన్ కి ఈ సహజత్వం తెలీదు. సహజంగా మాట్లాడ్డమే రాదు. అరుపులు అరవడం, కత్తితో పొడవడం ఇవే తెలుసు. సరిగ్గా ఈ 1975  లోనే అటు హిందీలో ‘షోలే’ విడుదలై అమ్జద్ ఖాన్ ‘గబ్బర్ సింగ్’ ప్రతినాయక పాత్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ డైలాగులతో ఎల్పీ రికార్డులు ఎంత వేలంవెర్రిగా అమ్ముడుపోయాయో- ఇటు రావుగోపాలరావు ‘కాంట్రాక్టర్’ రికార్డులు అంతే జోరుగా అమ్ముడయ్యాయి. ఎక్కడ చూసినా  వీళ్ళిద్దరి ‘పంచ్’ డైలాగుల మోతే. ఎక్కడి ‘షోలే’ బడ్జెట్ - ఎక్కడి ‘ముత్యాలముగ్గు’ బడ్జెట్! ఇంకేం రుజువు చేసి పెట్టాలి భావి తెలుగాంధ్ర దర్శకులకి బాపు?
          రామాయణం ఇంత పనిచేసిందా – ఇక భారతం ఏం చేసిందో చూద్దాం. భారతాన్ని కమ్యూనిజంలోకి దింపి ‘మనవూరి పాండవులు’ తీశారు బాపు. కమ్యూనిస్టు, లేదా విప్లవ, ఇంకా లేదా జనం భాషలో డప్పు సినిమాలు- ఒక మూసలో కొట్టుకు పోతున్న కాలంలో, సంస్కరించి ఇలా కూడా నీటుగా చెప్పవచ్చని బాక్సాఫీసు విజయం సాక్షిగా తీర్పిచ్చారు బాపు. 

మనవూరి పాండవులు 
          భారతంలోని పాండవులు, శ్రీ కృష్ణుడు పాత్రల్ని ఓ పల్లెటూళ్ళో అన్యాయాలకి వ్యతిరేకంగా పెట్టి, ఎలాటి రొటీన్ అరుపులు, డప్పు పాటలు, విప్లవ డైలాగులూ లేకుండా ఓ కొత్త పంథాలో నడిపిన కథా కథనాలనుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు ఎర్ర సినిమాల దర్శకులెవరూ. తన రంగం కాని విప్లవ రంగంలో బాపు అడుగు పెట్టారన్న అభిప్రాయమే ఏమో- అలా మనవూరి పాండవులు మనవూరి పాండవులుగానే మిగిలిపోయింది. విప్లవ సినిమాలకి మార్గదర్శి కాలేకపోయింది. 
          ఇప్పుడు షార్ట్ ఫిలిం మేకర్లే సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న కాలంలో బాపు సినిమాల నిశ్శబ్ద సందేశాలేవీ ఆయా బిజీ యువదర్శకుల మస్తిష్కాలకి తాకే అవకాశమే లేదు. కంటెంట్ కంటే టెక్నిక్కే ప్రధానంగా దూసుకొస్తున్న ఈ నవ దర్శకుల చేతిలో తెలుగుసినిమాకి  మూసలో మునకలే తప్ప, ఏ క్రాసోవర్ తీరానికీ చేరే ప్రసక్తే లేదు!

-సికిందర్ 
నవంబర్ 2014, ‘పాలపిట్ట’ మాసపత్రిక కోసం