రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, డిసెంబర్ 2019, బుధవారం

898 : రైటర్స్ కార్నర్


       రాయడానికి రైటర్స్ కెన్నో పాట్లూ, అలవాట్లు. కథ మొదలు పెట్టడానికో ప్రేరణ, మొదలెట్టిన కథ రాస్తూ పోవడానికి మూడ్, వీటికోసం రకరకాల పద్ధతులు. విజయేంద్ర ప్రసాద్ కథ మొదలెట్టే ముందు ‘షోలే’ విధిగా చూస్తారు. పూరీ జగన్నాథ్ కథ రాయడానికి బ్యాంకాక్ దాకా వెళతారు. చెళియన్ రాయాలనుకున్నప్పుడు రాసేస్తారు...మరి అటు కొత్తగా వస్తున్న హిందీ రైటర్స్ అలవాట్లేమిటి? వాళ్ళెలా రాస్తారు? ఇది చూద్దాం. పోతే, రాయలేక పోవడానికి వంకలు చెప్పే వాళ్ళుంటారు. అవి చాలా వరకూ ఇంటి పనులతో వుంటాయి. ఆర్ధిక సమస్యలతో వుంటాయి. ఇలాటి వాళ్ళు నెట్వర్కింగ్ చేస్తూ తిరగనక్కర్లేదు. ఇతరుల సమయమూ శ్రమా వృధా. సినిమాల్లో అన్నిటినీ బ్యాలెన్సు చేయలేమనీ, సినిమాల్లోకి రావాలనుకుంటే అన్నీ వదిలేసి రావాలనీ అంటాడు సెల్వ రాఘవన్. కరుణానిధి తీరికలేని రాజకీయాల్లో వుంటూ కూడా సమయం తీసి 64 సినిమాలకి ఎలా రాశారో ఆలోచించాలి. నిజమైన రచయిత రాయడానికి కండిషన్స్ అప్లయి చేసుకోడు, బేషరతుగా వుంటాడు మిన్ను విరిగి మీద పడ్డా. ఇక విషయాని కొద్దాం...
        
        ఇంటి పనులు పూర్తి చేసుకుంటాడు. డ్రెస్సప్ అవుతాడు. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు. షూస్ వేసుకుంటాడు. బ్యాగు తీసుకుంటాడు. ఇంట్లోనే ఇంకో గదిలోకి వెళ్లి అఫీషియల్ గా కూర్చుని రాయడం మొదలెడతాడు. ఇతను శరత్ కటారియా (దమ్ లగాకే హైస్సా, తిత్లీ).
       యోగా కోసం పక్కన చాప పర్చుకుని కూర్చుంటాడు. బుర్ర కదలనప్పుడు యోగాసనాలు వేస్తాడు. యోగాతో కండరాలు షేపులో కొస్తాయి. థింకింగ్ బావుంటుంది. శవాసనం వేసినప్పుడు సబ్ కాన్షస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. ఇలా లేస్తూ కూర్చుంటూ రాస్తాడు. ఇంకో రచయితతో కలిసి రాయాల్సి వస్తే అతను కూర్చుని రాస్తాడు, తను ఆసనా లేస్తాడు. గదిలోనే కాదు, పార్కులో రాసినా ఇదే పధ్ధతి. ఇతను దేవాశీష్ మఖీజా (అజ్జి, భోంస్లే).
         కొత్త పెన్ను, నోట్ బుక్కు కొనుక్కుంటాడు. తేదీ వేస్తాడు, రాస్తాడు. అలా వదిలేస్తాడు. మళ్ళీ ఎప్పుడో తీసి చూస్తాడు. రాసిన తేదీని, తీసి చూస్తున్న తేదీనీ చూసుకుని ఎన్ని రోజులు గడిచిపోయాయో లెక్కేసుకుంటాడు. గిల్టీ ఫీలై గట్టిగా రాయడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ తేదీ వేసే రాస్తాడు. మళ్ళీ వచ్చి తేదీ చూసుకుంటాడు. మెమెంటో, ఇన్సెప్షన్ ల టైపులో ఇలా ముందుకీ వెనక్కీ పోతూ రాస్తూంటాడు. రాయడం మీద సరీగ్గా శ్రద్ధ పెట్టడం లేదన్నగిల్టీ ఫీలింగ్ మాత్రం వదలదు. ఇతను వాసన్ బాలా (మర్ద్ కో దర్ద్ నహీ హోతా, రామన్ రాఘవ్ 2.0).
        ఓల్డ్ లక్నోలో, ఢిల్లీ లోని చాందినీ చౌక్ లో ప్రత్యేకమైన అత్తరు కొంటాడు. కొన్ని మూడ్స్ క్రియేట్ చేసుకోవడానికి అత్తరు వాడతాడు. ‘తుంబడ్’ కి టైటిల్ సాంగ్ రాసినప్పుడు అత్తరు సువాసనే బాగా పనిచేసింది. ఆ పాట కష్టమైన పాట. దాని శబ్ద సంక్షిప్తీకరణ కష్ట సాధ్యమైనది. విసుగేసింది. అలాంటప్పుడు ఈ అత్తరు బాగా పనిచేసింది పాట రాయడానికి. ఎండా కాలం తర్వాత తొలివాన కురిసినప్పుడు వెలువడే మట్టి వాసన లాంటి పరిమళం వెదజల్లే అత్తరు అది. దాని పేరు గిల్. అలా ఆ పాట వింటే వాన కురుస్తున్న ఫీలింగే వుంటుంది. ఒక్కోసారి పాట కుదరక పోతే బస్సెక్కి తిరుగుతాడు. మధ్యలో దిగిపోయి ఆటో లెక్కుతాడు. ఇతను గీత రచయిత రాజ శేఖర్ (తుంబడ్, తనూ  వెడ్స్ మనూ).
      కర్పూరం వెలిగిస్తుంది. టైము తెలియకుండా కర్టెన్స్ వేసేస్తుంది. ఇంకేదీ దృష్టి మళ్లించకుండా చూసుకుని, గంటలు గంటలు రాస్తూనే వుంటుంది. ఈమె జుహీ చతుర్వేది (విక్కీ డానర్, పీకూ).
    కథ రాస్తాడు. రాస్తున్నప్పుడు బ్రేక్ తీసుకుని ‘ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్’ స్క్రీన్ ప్లే చదువుతూంటాడు. అన్నం వండుకు తింటాడు. వాకింగ్ కెళ్తాడు. ప్రేమ సన్నివేశాలు రాస్తున్నప్పుడు స్వీట్లు, ఐస్ క్రీములు బాగా తింటాడు. ఇతను వరుణ్ గ్రోవర్ (మసాన్, శాక్రేడ్ గేమ్స్).
            ఒక సీను రాస్తాడు. అది క్లోజ్ ఫ్రెండ్స్ కి విన్పిస్తాడు. తమ్ముడికీ చెల్లెలికి కూడా విన్పిస్తాడు. ‘షూట్ ఎట్ వడాలా’ లో అనిల్ కపూర్, సోనూ సూద్ తో అనే డైలాగొకటుంది – ‘పోలీస్ తూటాలో ఎంత ఐరన్ వుంటుందంటే, ఇది పెట్టి పేల్చానంటే జీవితాంతం నీకు రక్తంలో ఐరన్ లోపం రాదు’ - అని. రక్తం ఉడుకెత్తిపోయే డైలాగు. క్లోజ్ ఫ్రెండ్స్ కిది నచ్చ లేదు, చెల్లెలు బాగా లైక్ చేసింది. దీంతో ముందుకెళ్ళి పోయాడు.  ఈ డైలాగుతో ప్రోమో ఎంత హిట్టయ్యిందంటే అంత హిట్టయ్యింది. ఇతను మిలాప్ జవేరీ (మస్తీ, హౌస్ ఫుల్).
      ఇంట్లో రాస్తాడు, లేకపోతే ఆఫీసులో రాస్తాడు. ఒక్కటే నిబంధన. రాస్తున్నంత సేపూ షాషంక్ రిడెంప్షన్, కాసాబ్లాంకా, ఫారెస్ట్ గంప్, త్రిశూల్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, వేకప్ సిడ్, రంగ్ దే బసంతీ, బ్యాండ్ బాజా బారాత్ లతో బాటు, తను రాసిన హంప్టీ శర్మా కీ దుల్హనియా ప్లే అవుతూ వుండాల్సిందే. ఇంట్లోనైతే ఆన్ లైన్లో వుంటే బ్లూరేలో, లేదా డీవీడీలో ప్లే అవ్వాలి. ఆఫీసులోనైతే సెకండ్ లాప్ టాప్ లో, లేదా ఫోన్లో ప్లే అవ్వాలి. ఒకవేళ అవి చూడకపోయినా స్విచ్చాన్ చేసే పెడతాడు. ఆడియో వింటూ రాసుకుంటాడు. ఇతను శశాంక్ ఖైతాన్ (హంప్టీ శర్మా కీ దుల్హనియా, బద్రీనాథ్ కీ దుల్హనియా).
        రోజంతా రాయాల్సి వస్తే కేఫ్ కెళ్తుంది. ఇంట్లో అస్సలు రాయ బుద్ధిగాదు. రాయాలంటే కాఫీలు తాగడం అవసరం. ముంబాయి సహా గ్లోబల్ గా కాఫీ షాప్స్ లోనే కూర్చుని రాసింది. ఏ కేఫ్ పడితే ఆ కేఫ్ కెళ్ళదు. కేఫ్ ని జాగ్రత్తగా సెలెక్టు చేసుకుంటుంది. బిగ్ కెఫేలు నచ్చవు. కేఫే కాఫీ డే, స్టార్ బాక్స్ లాంటి బిగ్ చైన్స్ కెళ్ళదు. ఒక ఛార్మ్ తో, ఒక మూడ్ తో, హోమ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసే క్యారక్టరున్న కేఫ్స్ ని సెలెక్టు చేసుకుంటుంది. ముంబాయిలోనైతే బాంద్రా లోని ది బగెల్ షాప్ లో కూర్చుని చాలా రాసింది. అలాగే వెర్సోవాలోని విండోస్ లో. ఢిల్లీ వెళ్తే ఖాన్ మార్కెట్లోని లాటిట్యూడ్ లో. 8 నుంచి 10 గంటలు అలా కూర్చుని రాస్తూనే వుంటుంది. ఈవిడ అలంకృతా శ్రీవాస్తవ్ (లిప్ స్టిక్ అండర్ మై బురఖా, మేడిన్ హెవెన్).
       మ్యూజిక్ వింటూ రాసుకుపోతాడు. రాస్తున్నప్పుడు ఆ సీనుకో ఫీల్ కోసం పాటల్ని అన్వేషిస్తాడు. పాట దొరికితే దాన్ని పదే పదే ప్లే చేస్తూ సీను రాస్తాడు. ఆ పాటలో వుండే ఫీల్ ఆ పాట జోన్లోకి తీసికెళ్ళి పోతుంది. ఆ జోన్లో వుండిపోయి రాస్తాడు. యోయోమా రాసిన ‘బాచ్ సూట్’ సాంగ్ ఒక తండ్రీ కొడుకుల సీను రాయడానికి బాగా తోడ్పడింది. ఎసి/డిసి రాసిన ‘యూ షుక్ మీ ఆల్ నైట్ లాంగ్’ పాట ఫీల్ తో ఓ ఛేజింగ్ సీనే  రాసేశాడు. ‘తఖ్త్’ క్లయిమాక్స్ సీను కార్మినా బురానా పాట ఫీల్ అనుభవించి రాసేశాడు. ఈ పాటల ఫీల్ రైటర్ సుమిత్ రాయ్ (తఖ్త్, జుబాన్).
          ఇక రోజూ రాయాలని డిసైడ్ అయిపోయాడు. అందుకు ట్విట్టర్ థ్రెడ్ ని ప్రారంభించాడు. రోజు వారీ పనుల మధ్య ఒక టార్గెట్ పెట్టుకుని అన్ని పేజీలు, అన్ని గంటలు టైపింగ్ చేసేస్తాడు. సబ్జెక్టుపై మేధోమథనంగానీ రీసెర్చి గానీ అప్పుడే చెయ్యడు. ఆ రోజు టార్గెట్ పూర్తయ్యాక ట్విట్టర్ థ్రెడ్ కి ఎటాచ్ చేసేస్తాడు. అనారోగ్యం వచ్చినా, వేడుకలున్నా, ప్రయాణాలున్నా, ఇంటి పనులున్నా పనాపకుండా పూర్తి చేస్తాడు. ఇతను షార్ట్ ఫిలిం మేకర్ సత్యాంశూ సింగ్ (తమాష్, చింటూ కా బర్త్ డే).
***
        చూశారా బాలీవుడ్ కొత్త రైటర్ల పని విధానం. ఒరిజినాలిటీని సృష్టించే ప్రయత్నం. మనమైతే ఇతర సినిమాల్లోంచి కథలూ సీన్లూ షాట్లూ, షార్ట్ ఫిల్ముల్లోంచి డైలాగులు కూడా సంగ్రహించి సినిమాలు సింగారిచే కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీని వాడుతున్నాం. దాన్నే రైటింగ్, స్క్రిప్టు, సినిమా అని సంతోష పడుతున్నాం. ఎవరైనా మనల్ని చూసి నవ్వుకుంటే మనమూ నవ్వేసుకుని ఓ మందార మాలేసుకుని మస్తుగా జీవిస్తున్నాం. సినిమాలు కాదుగా తీసేది, నిర్మాతల జేబుల్లోంచి అందినన్ని కాసులు!
        
సికిందర్