రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 1, 2015

రైటర్స్ కార్నర్ -2

ఎన్ హెచ్- 10  రైటర్ సుదీప్ శర్మ 
          సినిమా కళ నేడు సంభాషణల్ని తగ్గించుకుని, దృశ్యపరమైన భావోద్వేగాల చిత్రణగా రూపం మార్చుకోవడం కొన్ని థ్రిల్లర్ కథా చిత్రాల్లో చూస్తున్నాం.  తాజాగా హిట్టయిన ‘ఎన్ హెచ్- 10’ అనే రోడ్ థ్రిల్లర్ లోనూ ఇదే మేకింగ్ కన్పిస్తుంది. ఈ సినిమా విజయం రచయిత సుదీప్ శర్మ విజయంగా భావించవచ్చు : అతనలా స్క్రిప్టు రాశాడు- డైలాగులతో నడిచే కథగా గాకుండా, ఎమోషన్స్ తో నడిచే దృశ్య మాధ్యమంగా స్క్రీన్ ప్లేని ప్లాన్ చేయడం వల్ల.  దీనికి ముందు తను రచన చేసిన ‘ప్లేయర్స్’ అతణ్ణి విమర్శల పాల్జేస్తే, ఆ తర్వాత తీసిన ‘రాక్ ది షాదీ’ మధ్యలోనే ఆగిపోయింది. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని బాలీవుడ్ లో కడుగుపెట్టిన సుదీప్ శర్మ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’  కిచ్చిన ఇంటర్వ్యూని ఈ క్రింద అందిస్తున్నాం...

?  ఎన్ హెచ్- 10’ దర్శకుడు నవదీప్  సింగ్ ని మీరెలా కలుసుకున్నారో చెప్పండి?
 నమ్ముతారో నమ్మరో, మేం ఫేస్ బుక్ లో కలుసుకున్నాం! ఒకరోజు నేను తీసిన ఇండీ ఫిలిం ‘సెంషుక్’ తనకి చూపించాలనుకుంటున్నట్టు  మెసేజ్ పెట్టాను. ఆయన చాలా ఔదార్యంగా నాకా అవకాశం కల్పించారు. నా ఫిలిం చూశాక మామధ్య అయిడియాల సమరమే జరిగిందనుకోండి. ఆ సమయంలో ఆయన ‘రాక్ ది షాదీ’ మీద వర్క్ చేస్తున్నారు. నాకు డైలాగులు రాసే అవకాశాన్ని చ్చారు. ఆ సినిమా పూర్తికాకపోయినా మేమిద్దరం చక్కటి పార్ట్నర్స్ గా మిగిలాం. మా క్రియేటివ్ విజన్, ప్రాపంచిక దృష్టీ ఒకేలాగున ఉండడంతో మా ఇద్దరికీ బాగా కుదిరింది. స్క్రిప్ట్స్ విషయానికి వస్తే మా బలాలేమిటో మాకు బాగా తెలుసు. తను స్క్రిప్ట్ ఓవరాల్ థీమాటిక్  స్ట్రక్చర్ మీద మంచి పట్టు కల్గిన వ్యక్తిగా వుంటే, నేను  స్క్రీన్ ప్లే క్రాఫ్ట్ మీద మంచి పట్టున్న మనిషిని. కాబట్టి మేమిద్దరం హే పీ జంట అన్నమాట.

?  మీరు రచయిత అవాలని ఎలా అనుకున్నారు...ఇన్స్పిరేషన్ ఏమిటి?
 ఇండియాలో మధ్యతరగతి కుటుంబంలో పెరగడమంటే ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ డిగ్రీ ఇవే ఏకైక దిక్కు గా పెరగడ మన్నమాట. ఈ మైండ్ సెట్ తోటే  పెరిగిన వాణ్ణి నేను. నా ఇరవై ఒకటవ ఏట ఎం బీ ఏ చేయడానికి వెళ్ళినప్పుడు జీవితంలో నేనేం కావాలనుకుంటున్నానో  నాకే లక్ష్యమూ లేదు. ఆ కోర్సులో చేరితే ఇది నాకు సరిపడేది కాదని మాత్రం అన్పించింది.  సినిమా, ఇతర కళలూ  నాకెంతో ఆనందాన్నిస్తాయని గుర్తించాను. ఇదేదో లైటు బల్బులా  ఫ్లాష్ గా వచ్చిన ఆలోచన కాదు, నాలో క్రమంగా రూపుదిద్దుకుంటూ వస్తున్న రియలైజేషనే అనుకుంటున్నా. అయినా అలాగే  ఎం బీ ఏ పూర్తిచేసి ఓ కార్పొరేట్ కంపెనీలో కొన్నేళ్ళు పని చేస్తూ ఉండిపోయాను. నా ఇరవై ఎనిమిదో అనుకుంటా, ఇక ఉండబట్టలేక స్క్రీన్ రైటర్ నై పోవాలని డిసైడ్ చేసుకున్నాను.
?  ఐ ఐ ఎం –ఏ గ్రాడ్యుయేట్ – స్క్రీన్ రైటర్ ఈ రెండూ భిన్న ధృవాలేమో?
 స్క్రీన్ రైటింగ్ ఒక క్రాఫ్టే గానీ అదొక అచ్చమైన కళ కాదు. కనుక క్రాఫ్ట్ ని డిమాండ్ చేసే అన్ని వృత్తి వ్యాపారాలకి లాగే దీనికీ ఓ మెథడ్ వుంది. నా ఎం బీ ఏ నీ, కార్పొరేట్ ఉద్యోగాన్నీ నేనెంత ద్వేషించినా, సబ్ కాన్షస్ గా వాటి మెథడ్ లోనూ ఓ క్రాఫ్ట్ నే అనుసరించాను. నా మెథడ్ చాలా సింపుల్- నాకూ నా దర్శకుడికీ ఓ థ్రిల్లింగ్ ఐడియా వచ్చింనుకోండి- మేమిద్దరం దాంతో ఓ రెండు నెలల పాటు కుస్తీ పడతాం. రీసెర్చి చేయడం, పాత్రల్ని చర్చించు కోవడం, కథని రూపొందించడం, ఒక విస్తృత స్టోరీ లైన్ ని నిర్ణయించడమూ...ఇదంతా అన్నమాట. ఇంతవరకూ లైట్ గా తీసుకుని వర్క్ చేస్తాం, దీని తర్వాత పని రాక్షసులమై పోతాం- ఓ నెలపాటూ ఇద్దరం కలిసి ఇండెక్స్ కార్డ్స్  మీద వర్క్ చేస్తాం ( లైన్ ఆర్డర్ ని ఇలా ఇండెక్స్ కార్డ్స్ మీద వేస్తూ పని చేస్తే, ఇక్కడ తెలుగు ఫీల్డులో వీడెవడ్రా అన్నట్టు చూసే వెనకబాటు తనమే కొనసాగుతోంది- ఇందులోవున్న వెసులుబాటు ఇప్పట్లో  అర్ధంగాదు! )  దీంతో ఒక స్టెప్ అవుట్ లైన్ వస్తుంది.
          దీని తర్వాత, నేను స్టెప్ అవుట్ లైన్ ని  డిటెయిలుగా  చెప్పడం ప్రారంభిస్తాను. ఇది నెలా  రెండు నెలలూ పడుతుంది. దర్శకుడి ఫీడ్ బ్యాక్ మీద ఆధార పడుతుంది. ఇది పూర్తి చేసేసరికి చేతిలో 20-30 పేజీల డాక్యు మెంట్ రెడీగా వుంటుంది. ఇది నాకు స్క్రీన్ ప్లే గైడ్ గా ఉపయోగ పడుతుంది. ఇప్పుడే అసలు స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభిస్తాను- ఆ రాసిన నూట ఇరవై పేజీల స్క్రీన్ ప్లేనే చివరికి సినిమాగా తెరకెక్కుతుంది.. ఈ స్క్రీన్ ప్లే పార్టు ని చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేస్తాను. స్క్రీన్ ప్లే రచనకి కి పూర్వం చేసిన హార్డ్ వర్క్ అంతా ఇక మర్చిపోతాను.  ఒక నెలలో స్క్రీన్ ప్లే రచన పూర్తి చేస్తాను.
?  మీరు నిరాశా నిస్పృహ లకి గురైన రోజుల్లేవా? 
 సోకాల్డ్  స్ట్రగుల్ ని నేను గ్లామరైజ్ చేయదల్చు కోలేదు. ఇరత రంగాల్లాంటిదే ఇదీనూ. దర్శకులు, నిర్మాతలూ మన శైలిని అర్ధంజేసుకుని మనల్ని విశ్వాసం లోకి తీసుకునేంత వరకూ స్ట్రగుల్ తప్పదు. ఒకసారి మనమేంటో వాళ్లకి అర్ధమై మనల్ని నమ్మితే ఇక ఫీల్డులో మనకి గట్టి పునాదులు పడ్డట్టే. నాకూ నిరాశా నిస్పృహ లెదురయ్యాయి, కాదనను. కొత్త ఫీల్డులో కొచ్చాక వీటిని ఎదుర్కోకుండా ఎలా వుంటాం?  ఆ కష్ట కాలంలో నా క్రాఫ్ట్ ని నేను ఇంప్రూవ్ చేసుకుంటూ, నేను రోడ్డున పడకుండా ఎలాగో చూసుకో గలిగాను.
?   లింగ వివక్షపై  ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రభావం ఎన్ హెచ్ - 10 లో ఏ మేరకుంది?
 నాకూ నవదీప్ కీ  ఢిల్లీ - ఇంకా ఉత్తర భారతమంతా పరిచయముంది. ఈ సినిమా  కథకోసం మేం హర్యానాలో పర్యటించాం.  అక్కడి కుల రాజకీయాల్ని పరిశీలించాం. చాలా పుస్తకాలూ, వార్తాకథనాలూ చదివాం. కొన్ని నిజ జీవితంలో జరిగిన కేసుల్నీ, సంఘటనల్నీ కథనం లో అక్కడక్కడా పొందుపర్చాం.
కుల- వర్గ విభేదాలు మా ఇద్దరికీ ఆసక్తి కల్గించే అంశాలు. లింగ వివక్ష రాజకీయాలకంటే కూడా! ఈ సినిమా కుల రాజకీయ- వర్గ విభేదాలపై ఒక స్టడీ అనుకోవాలి.  
     ఐతే ఇవి వేటికవి విడివిడి సమస్యలు కావు. లింగ వివక్షా రాజకీయాలు, కుల రాజాకీయాలూ, వర్గ విభేదాలూ ఇవన్నీ  ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అధికారం కోసం పోరాటం లో భాగమే. ఈ అధికారం కోసం పోరాటం అనే సామాజిక పార్శ్వం చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్టు మాకు. దీని సారాన్ని కొంత వరకూ సినిమాలో దింపగలిగాం. అయితే ఇదే ఈ సినిమా ఇతివృత్తం కాదు- ఇది కేవలం బ్యాక్ డ్రాప్ గానే ఉంటుంది.  ఈ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. ఈ నేపధ్యం లో ఓ రాత్రంతా ఓ యువతి పడిన సంఘర్షణని ప్రధానం చేసి, దీన్నే ఫోకస్ చేస్తూ, ఈ హైవే థ్రిల్లర్ ని తీశాం.
?   ఈ సినిమా సక్సెస్ నీ , క్రిటికల్ రివ్యూవ్స్ నీ మీరెలా రిసీవ్ చేసుకున్నారు? దీని తర్వాత మీరు చేపట్టిన  ప్రాజెక్టు ఏమిటి?
 ఈ సక్సెస్ చాలా స్వీట్ గా వుంది. నిర్మాతలకి లాభాలు కూడా తెచ్చి పెట్టింది, క్రిటిక్స్ కూడా మా ప్రయత్నాన్ని హర్షించారు. ఇవన్నీ గాక, ప్రేక్షకుల రెస్పాన్స్ అమోఘంగా వుంది! కొందరు క్రిటిక్స్ కి ఈ సినిమా నచ్చలేదు, ఫరవా లేదు. వాళ్ళ అభిప్రాయాల్ని నేను గౌరవిస్తూనే  మేం చేసిన ప్రయత్నానికి  గర్విస్తాను. నా తాజా ప్రాజెక్టు ‘ఉడ్తాపంజాబ్’  ( ఎగిరే పంజాబ్). అభిషేక్ చౌబే దీని దర్శకుడు. పంజాబ్ లో షూట్ చేస్తున్నాం. పంజాబ్ ని ప్రస్తుతం వణికిస్తున్న  డ్రగ్స్  సంక్షోభం కథాంశం గా  ఇదొక డ్రామా –థ్రిల్లర్. ఇదిగాక, నవదీప్ నేనూ మా తర్వాతి ప్రాజెటు పై పని మొదలెట్టాం. .ఇది కెనడాలో ఒక గ్యాంగ్ స్టర్స్ గ్రూపు ఉత్థాన పతనాల గురించి వుంటుంది.
?  ఎం హెచ్ -10 లో మాటలు చాలా తక్కువ వున్నాయి,  అయినప్పటికీ  స్క్రిప్టు చాలా టై ట్ గా వుందే?
 కథని నడి పించడానికి డైలాగుల మీద ఆధార పడలేదు. అలాటి సినిమాలంటే నా కిష్ట ముండదు. అది సోమరి రచన అనుకుంటాను. నిజ జీవితంలో ఎలా ఎంత మాటాడతామో అంతే నా పాత్రలు మాటాడ తాయి. రచయితకి కూడా ఓ  వాయిస్ వుంటుంది. అది థీమ్ లో, స్క్రీన్ ప్లేలో అంతర్లీనం గా ఉండాలే గానీ,  డైలాగుల్లో మోతెక్క కూడదు.
?  ఈ ప్రయాణంలో మీరు నేర్చుకున్న పాఠా లేమిటి?
 అతిముఖ్య పాఠం సినిమా అనేది డైరెక్టర్స్  మీడియా అన్నది.. ఇలాంటప్పుడు రచయితగా ఎవరైనా తమ ఐడెంటిటీ నీ, క్రాఫ్ట్ నీ  పరిరక్షించు కోవాలంటే, తమ విజన్ తో, ప్రాపంచిక దృష్టితో సరిపోయే దర్శకులతో కొలాబరేట్ అవ్వాలి. అదే సమయంలో కొంత పట్టు విడుపూ ప్రదర్శించకా తప్పదు!

***