రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, ఫిబ్రవరి 2015, సోమవారం

టెంపర్..

Social cause Returns!
రచన- దర్శకత్వం: పూరీ జగన్నాథ్
తారాగణం : ఎన్టీఆర్, కాజల్, మధురిమ, ప్రకాష్ రాజ్, పోసాని, కోటా శ్రీ నివాసరావు, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, పోసాని, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రమాప్రభ, కోవై సరళ  తదితరులు
కథ ; వక్కంతం వంశీ,  సంగీతం : అనూప్ రూబెన్స్, నేపధ్య సంగీతం : మణి శర్మ, ఛాయాగ్రహణం : శ్యాం కె నాయుడు, కూర్పు : ఎస్ ఆర్ శేఖర్,
బ్యానర్ :  పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్
 నిర్మాత : బండ్ల  గణేష్
విడుదల : 13 ఫిబ్రవరి, 2015 ,  సెన్సార్ : U/A
***       మధ్య కాలంలో బిగ్ స్టార్స్ తో తెలుగు కమర్షియల్ సినిమా ఎదుర్కొంటున్న విషయపరమైన వెలితి, తద్వారా అపజయాల పరంపర, ఇంకేం చేయాలో తోచని స్థితి, ఇవన్నీ అనివార్యంగా మర్చిపోయిన మూలాల వైపు తిరిగి చూసేలా చేయడంలో ఆశ్చర్యంలేదు. దీన్ని ఎవరైతే ముందు గుర్తిస్తారో, వాళ్ళు ఈ ప్రతిష్టంభనని బద్దలు కొట్టగల్గుతారు. రొటీన్ యాక్షన్ కామెడీలతో ప్రేక్షకుల హనీమూన్ కూడా ఎప్పుడో ముగిసిపోయింది. తమని సంతృప్తి పర్చడమంటే ఇప్పుడు మాటలు కాదు. బిగ్ స్టార్ ఇప్పుడు ఇంకా ఎక్కడో తమని తాకాలి. నేలకు దిగి రావాలి. చుట్టూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంతు  చిక్కని సమస్యలు అనేకం వేధిస్తున్నాయి. వాటికి సమాధానాలు చెప్పాలి. తదాత్మ్యం చెందేలా చేయాలి. అప్పుడుగానీ బ్రహ్మరధం పట్టడం సాధ్యంగాదు.
      ఇదే జరుగుతోందివ్వాళ. ఈ ప్రతిష్టంభనని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఐతే దీన్ని బ్రేక్ చేయడానికి నానా తిప్పలు పడ్డ మాట కూడా వాస్తవం. ఈ బిగ్ స్టార్ తో ఇంకా ఏదో అభద్రతా భావం వెంటాడినట్టు, చెప్పాలనుకున్న బలమైన పాయింటు చెప్పడానికి పూరీ జగన్నాథ్ సైతం  నానా హైరానా పడాల్సివచ్చింది. మొత్తానికి కిందామీదా పడి మసకబారిన ఇద్దరి ప్రతిష్టనీ తిరిగి వెలిగించుకున్నారు.
      విషయపరంగా నేలవిడిచి సాము చేయనవసరం లేని బిగ్ కమర్షియల్ సినిమాకి, శైశవ దశలో వున్న ఒక నమూనా  ‘టెంపర్’! ఈ నమూనా ఓకే అన్పించుకుంది గనుక ఇప్పుడిక ధైర్యంగా దీన్ని పెంచి పోషించుకో వచ్చు కొన్నాళ్ళపాటు. 

దయలేని దయా 
       అడ్డగోలు అవినీతి పోలీసు అధికారి దయా శంకర్ (ఎన్టీఆర్) కథ ఇది. తిండి లేని అనాధగా చిన్నప్పుడు ఒక పోలీసు అవినీతిని  చూసి అలాటి తను కూడా పోలీసు వాడై బాగా  సంపాదించుకోవాలన్న దుర్బుద్ధితో  పెరిగి డిపార్ట్ మెంట్ లో చేరతాడు. కేసులు చూడకుండా డబ్బులు వసూలు చేసుకోవడమే పని. ఎక్కడో వైజాగ్ లో వాల్తేర్ వాసు అనే ముఠాకోరు ఉంటాడు. అతడి గ్యాంగ్ లో నల్గురు తమ్ముళ్ళు. అతడికి అర్జెంటుగా తనకి సహకరించే పోలీసు వాడు అవసరపడ్డాడు. హైదరాబాద్ లో వున్న అలాటి నీచమైన ఎస్సై దయాని వైజాగ్ ట్రాన్స్ ఫర్ చేసి వాల్తేర్ వాసు పట్ల తన బాధ్యత తీర్చుకుంటాడు హోం మంత్రి( జయప్రకాష్ రెడ్డి). వైజాగ్ చేరిన దయా, వాసుతో చేతులు కలిపి అక్రమాలకి తెరలేపి తన కమిషన్ తను పుచ్చుంటూ ఉంటాడు. నిర్లజ్జగా పాల్పడుతున్న ఇతడి అవినీతిని చూసి అసహ్యించుకుంటూ ఉంటాడు నారాయణ మూర్తి (పోసాని) అనే హెడ్ కానిస్టేబుల్. స్టేషన్ కి ఒకావిడ వచ్చి తన కూతురు తప్పిపోయిందని ఆందోళన చెందుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు దయా.

       వైజాగ్ లోనే జంతు ప్రేమికురాలైన శాన్విఅనే ఒక ఎన్జీవో ( కాజల్ అగర్వాల్) తల్లి (కోవై సరళ), అమ్మమ్మ (రమాప్రభ) లతో వుంటుంది. ఈమెని ని చూసి ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కొనసాగుతూండగా వాసు గ్యాంగ్ పొరపాటున ఈమెని కిడ్నాప్ చేయబోతారు. దీంతో ఈమె దయాకి కనువిప్పు కల్గిస్తుంది- తనుకాకపోతే ఇంకెక్కడో ఇంకెవరో అమ్మాయి ఈ గ్యాంగ్ బారిన పడబోతోందనీ, వెళ్లి కాపాడమనీ అల్టిమేటం ఇస్తుంది.
       ఆ అమ్మాయి లక్ష్మీ ( మధురిమ) అనే ఎన్నారై. ఈమెని కిడ్నాప్ చేయకుండా దయా అడ్డుపడడంతో, వాసుకీ ఇతడికీ వైరం మొదలవుతుంది. వాసు బారినుంచి లక్ష్మిని కాపాడిన దయాకి షాకింగ్ రహస్యం తెలుస్తుంది. దీంతో అంతర్మధనం మొదలౌతుంది. ఆనాడు కూతురు కన్పించడం లేదని స్టేషన్ కి వచ్చి మొర  పెట్టుకున్నావిణ్ణి పట్టించుకోకుండా ఘోర తప్పిదం చేశాడు. దాని ఫలితం ఈ దారుణం. దీనికి తనే కారకుడన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు దయా..

        ఇక్కడ్నించీ అతడిలో మార్పు, దుష్ట శిక్షణ అనే బాధ్యతా మొదలై వాసునీ- అతడి గ్యాంగ్ నీ శిక్షించేందుకు ఎంతదూరమైనా పోతాడు దయా.
ఎన్టీఆర్ దండయాత్ర  
           తమాషాగా మారిన తెలుగు కమర్షియల్ సినిమా తీరుతెన్నులపై దండయాత్ర ఈ ఎన్టీఆర్ పాత్ర. చాలా బిగ్ కమర్షియల్స్ వచ్చాయి- స్టార్ కి మేకోవర్ అనీ, మేకప్ ఛేంజ్ అనీ, హేర్ స్టయిల్ డిఫరెంట్ అనీ, సిక్స్ ప్యాక్ అనీ..ఇలా! సినిమాలో అసలంటూ విషయం లేకుండా ఈ బిల్డప్పులతో స్టార్లు ఎంత అనుభవించాలో అంతా అనుభవిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడదే హై ఫ్యాషన్ తో వచ్చాడు. కఠిన వర్కౌట్లు చేసి బాడీని టోనప్ చేసుకున్నాడు. షర్టు తీసి సిక్స్ ప్యాక్ ప్రదర్శించాడు. వివిధ రకాల స్పైక్స్ తో కొత్త హేర్ లుక్, లెదర్ జాకెట్స్ లేని రఫ్ లుక్ గల డిజైనర్ కాస్ట్యూమ్స్, మొదటిసారి ట్రిమ్ చేసిన మీసం..వీటన్నిటినీ మంచి ఈజ్ తో, పవర్ఫుల్ గా క్యారీ చేసే ఇగో- డిఫెన్సివ్ యాటిట్యూడ్..ఈ మేకోవర్ అంతా మళ్ళీ పటాటోపంగా మారకుండా, ఎండమావులతో నరకం చూపిస్తున్న తెలుగు సినిమా కథా కథనాలని, నడిచే బాంబు లాంటి క్యారక్టర్ అనే వెపన్ తో అడ్డదిడ్డంగా వధించేస్తూ-  కొత్త కథా ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

        ఈ హై ఓల్టేజ్ డ్రామాలో ఎన్టీఆర్ దొక ఆథర్ బ్యాక్డ్ క్యారక్టర్. ఒక్కోసారి రచయిత మిగతా సినిమా దినుసులన్నిటినీ పక్కనపెట్టి పాత్రలో లీనమైపోయి- అది డ్రైగా మారుతున్నా సరే, దాని సహజ జీవితాన్ని కెలుకుతూ దాని కథే అల్లుకుంటూ కూర్చుంటాడు. దీన్నిసౌమనస్యంతో అర్ధం జేసుకోగలిగితే,  ఆ దర్శకుడు వీలైనంత యధాతధంగా తెరకెక్కించి సక్సెస్ అవుతాడు. ఇలా ఆధర్ బ్యాక్డ్ క్యారక్టర్ – అంటే రచయిత బ్రహ్మరధం పట్టిన పాత్రని - ఏ ఇగోలూ లేకుండా చేపట్టినప్పుడే ఆ స్టార్ కూడా సక్సెస్ అవుతాడు. కథా రచయిత వక్కంతం వంశీతో ఎవరూ ఇగోలకి పోకపోవడం జరిగిన మేలు. మొదటిసారి పరాయి కథకి దర్శకత్వం వహించేందుకు ముందుకొచ్చిన పూరీ కూడా ఒక లక్. లేకపోతే నాలుగేళ్ళుగా మరుగునపడి వున్న ఈ ఆ ఆధర్ బ్యాక్డ్ క్యారెక్టర్ కథ వెలుగు చూసేదే కాదు. 
       ఎన్టీఆర్  ఫ్యాన్స్ కూడా ఇంకెప్పుడూ  గొంతెమ్మ కోర్కెలు కోరి తమ అభిమాన స్టార్ ని ఎక్కడేసిన గొంగళి చేయకుండా వుంటే మంచిది.
        కాజల్ అగర్వాల్, మధురిమ లు కథని మలుపులు తిప్పడానికి  తోడ్పడ్డారు తప్పితే కథా నడకతో వాళ్ళకేం సంబంధం లేదు. పోసాని ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసే ఉత్ప్రేరక పాత్ర పోషించాడు. ప్రకాష్ రాజ్ సైకోతనపు విలనీతో మరోసారి విజృంభించాడు. తనికెళ్ళ ఒకే ఒక్క  చెంప పెట్టుతో కళ్ళు చెమర్చేలా సినిమా ఈక్యూని అమాంతం పెంచేశాడు. ఇక అలీ-సప్తగిరి-వెన్నెల కిషోర్ త్రయం హాస్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇంత హారిబులా?
        గత సృష్టి ‘హార్ట్ ఎటాక్’ లో నిలబెట్టుకున్న నిర్మాణ విలువలు, క్వాలిటీ మేకింగ్ ఈ సారి పూరీ  పట్టుతప్పి చాలా హారిబుల్ గా మారాయి. మూవీ అంతా బి, సి గ్రేడ్ బాపతు లౌడ్ నెస్ తో శబ్ద కాలుష్యమే. అరిచి తప్ప మామూలుగా మాట్లాడుకోలేని ఆర్టిస్టులు,  విధ్వంసం తప్ప సున్నితత్వం లేని మణిశర్మ నేపధ్య సంగీతం – ఎన్టీఆర్ తను అనాధకానని ఎమోట్ అయ్యే సీను సైతం ఈ అరిగిపోయిన విధ్వంస బాణీల్లో  కొట్టుకుపోవడం- ఫ్రెష్ నెస్ లేని అదే పాత తరహా శ్యాం కె. నాయుడు ఛాయాగ్రహణం, విజయ్ కి బడ్జెట్టే చాలనట్టు ‘లో- రేంజి’  ఫైట్లు..ఇలా మేకింగ్ పరంగా ఏ విలువలూ పాటించకుండా లాగించేశారు. అదేమిటో గానీ సరుకులేని సినిమాలకి మేకింగ్ అద్భుతంగా ఉంటోంది. టెక్నీషియన్లు వారెవ్వా అన్పించుకుని- విషయంలేక దర్శకులు టెక్నీషియన్ల ముందు వెలవెలబోవడం. ఈసారి ఈ సాంప్రదాయం తిరగబడింది. అనూప్ రూబెన్స్ సంగీతంలోని పాటలే రిలీఫ్. 
స్క్రీన్ ప్లే సంగతులు 
    ముందుగా  చెప్పుకున్నట్టు- ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న అంత బలమైన బాక్సాఫీసు విన్నింగ్ పాయింటు చెప్పడానికి నానా హైరానా పడ్డారు. అదృష్టవశాత్తూ కలిసివచ్చిన అధర్ బ్యాక్డ్ పాత్ర మీద  పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, ప్రేక్షకులమీద నమ్మకం కుదరనట్టే కన్పిస్తోంది. అందుకే ఫస్టాఫ్ ని అరిగిపోయిన పాత మూస ఫార్ములా అనే సేఫ్ జోన్నే  చూసుకున్నట్టుగా  అన్పిస్తారు. ఈ సేఫ్ జోన్ లో కూడా సిన్సియారిటీ లోపించడంతో మొత్తం కథ కిచిడీ పాకంలా తయారయ్యింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో వున్నట్టు- ఈ సినిమా కథ ప్రాణమంతా ముగింపు సన్నివేశాల్లో పెట్టుకుని, అంతవరకే సినిమా అన్నట్టు బిగదీసుకుని, మిగతా భాగాన్ని గజిబిజిగా వదిలేశారు. 

           సినిమా ప్రారంభమైన  సుమారు గంటా పదినిమిషాల సుదీర్ఘ కాలం తర్వాత -  మిస్టేకెన్ ఐడెంటిటీ తో కాజల్ ని కిడ్నాప్ చేసే ప్రయత్నంతో మొదటి మలుపు వచ్చి కథ మిడిల్లో పడుతుంది.    మేరకు ఈ బిగినింగ్ విభాగానికి ఇటువంటి మలుపు గమ్యం ఐనప్పుడు- ఈ గమ్యానికి చేరవేసే సంబంధిత దృశ్యాల కూర్పు సరిగ్గా లేకపోవడం ఫస్టాఫ్ బ్యాడ్ అనుకోవడానికీ, బోర్ కొట్టడానికీ కారణమయ్యింది. ఒక ముక్కోణం వుంటుంది : రచయిత/దర్శకుడు - కథ- ప్రేక్షకులు అనే ముక్కోణం. ఈ ముక్కోణంలో రచయిత/దర్శకుడు ఏకకాలంలో కథ తోనూ, ప్రేక్షకులతోనూ రోమాన్సులో ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ రోమాన్సుని సినిమా ముగింపు సన్నివేశాల్లో మాత్రమే ప్రారంభించాడు ఇక్కడ రచయిత/దర్శకుడు.
           మొదట్లో పాత్రపరంగా విలన్ చేతిలో హీరో కీలు బొమ్మ నిజమే, అంత వరకూ ఆ పాత్ర సహజమైన పాసివ్ తనాన్ని ఒప్పుకోక తప్పదు. ఐతే కాజల్ టర్నింగ్ తో నైనా విలన్ మధురిమ కోసం అసలెందు కోసం ప్రయత్నిస్తున్నాడో తెలుసుకుని, హీరో యాక్టివ్ పాత్రగా మారితే  – అలా సినిమా సక్సెస్ కి చాలా అవసరమైన యాక్టివ్ పాత్రగా మారి, ఆ రహస్యం తెలుసుకున్న వాడై,  దాంతో విలన్ ని ఛాలెంజి చేసివుంటే- ఇంటర్వెల్ సీను కూడా అలా ఉత్త అమ్మాయి కోసం ఉత్తుత్తి పెడబొబ్బల ప్రహసనం కాకుండా వుండేది. విలన్ చేసిన అసలు కుట్రేమిటో తెలుసుకోకుండా, హీరో ఎన్ని పాసివ్ అరుపులు అరిచి ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే మాత్రం ఏం ఎలాభం? ఇంకా హీరో గోల్ ఏమిటో తెలియకపోతే ఎలా?
          సస్పెన్స్ తో ముడిపడి వుండే ఏ అంశానికైనా  రెండు పార్శ్వలుంటాయి : ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేవి. ఈ రెండూ మూసిపెట్టి కథ నడిపిస్తే అర్ధంగాదు, బోరు కొడుతుంది. కచ్చితంగా అందులో ఒక పార్శ్వాన్ని విప్పి చూపాల్సిందే. రసపోషణ  కోసం అనివార్యంగా అది మొదటి పార్శ్వ్యమే అవుతుంది- ఏం జరిగింది?అనేది. ఇది ఓపెన్ చేసి కథ నడుపుతూ, అదెలా జరిగింది? అన్నది మాత్రం గుప్పెట్లో ఉంచుకున్నప్పుడే  అదొక సస్పెన్స్ కథవుతుంది.
          ఆ ఏం జరిగిందనే రహస్యం హీరో తెలుకుని ఇంటర్వెల్లో బయట పెడితే  కథ చెడుతుంది నిజమే. ఎందుకంటే అది చేదు మాత్ర. సెకండాఫ్ లో తగు సమయం వరకూ దాన్ని ముట్టుకోకుండా షుగర్ కోటింగ్ తోనే నడపాలి. ఐతే సినిమా మొదట్నించీ కూడా ఈ షుగర్ కోటింగ్ ని పట్టించుకోలేదు. లేకపోతే ఇలా కిచిడీ లా వుండదు. చేదు మాత్రైతే వుంది. కనీసం అది హీరోకి తెలుసనే అర్ధంలో ఇంటర్వెల్ కి వెళ్ళినా సస్పెన్స్ క్రియేట్ అయ్యేది. 
           ఇంటర్వెల్ కైనా హీరో యాక్టివ్ అవ్వాలి, తన గోల్ ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే  అతను ఇంటర్వెల్ ని ఏం చేసీ నిలబెట్ట లేడు. కథని బట్టి దీన్నెలా సాధించాలో అలా సాధించి తీరక తప్పదు. ఈ రెండూ ఇక్కడ ఎష్టాబ్లిష్ చేయకపోతే  అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫస్టాఫ్ తీయడం పూర్తిగా వేస్ట్.
          ‘ద గుడ్-ద బ్యాడ్-ద అగ్లీ’, ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్’,  ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ది వెస్ట్’ వంటి కౌబాయ్ క్లాసిక్స్ తీసిన దర్శకుడు సర్జియో లియోన్, 1971 లో ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డైనమైట్’ అనే మరో కౌబాయ్ అడ్వెంచర్ తీశాడు. దీని ఇంటర్వెల్ సీన్లో హీరో రాడ్ స్టీగర్, ఒక టెర్రి ఫిక్ కాల్పుల సీను చూస్తాడు. సమూలంగా అతడి జీవితాన్ని మార్చివేసే సీను. తనగురించి తానొక నిర్ణయం తీసుకునేందుకు పురిగోల్పే సీను. ఒక కరుడుగట్టిన, క్రూరుడైన బందిపోటుగా బతుకుతున్న తను, ఇక  పెద్ద దోపిడీ ఒకటి చేసేసి తన బంగారు కలలు నేరవేర్చుకోవాలన్న నేర బుద్ధి నుంచి పరివర్తన చెందే సీను. తత్పలితంగా పరివర్తనతో తన నేస్తం జేమ్స్ కోబర్న్ ఆశయాల కోసం ఫ్రీడమ్  ఫైటర్ గా కంకణ బద్ధుడయ్యేందుకు దారి తీయించే సీను.. 
          ‘టెంపర్’  హీరో కూడా అరాచక వాదియే ఐనప్పుడు, అతను మారడం కోసమే కథ నడిపినప్పుడు- కాజల్ అల్టిమేటం అప్పుడే ఆ మార్పు వచ్చినప్పుడు, అది కేవలం  వెర్బల్ గా కాకుండా- పైన ఉదహరించిన సినిమాలోలా విజువల్ గా వస్తే ఇంటర్వెల్లో అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయేవి. ఆ చేదు మాత్ర తాలూకు  విజువల్స్ ని షుగర్ కోటింగ్ చెడకుండా ఎలా ప్రొజెక్ట్ చేయాలన్నది దర్శకుడి ఇష్టం. 
            ఇక విలన్స్ తో హీరో యాక్షన్ ప్లాన్ విషయానికొస్తే, వాళ్ళని వెంటాడి పట్టుకుని అరెస్టు చేసి , కోర్టులో కేసు పెట్టడం పూర్తిగా ఆ హీరో పాత్ర ప్రవృత్తికి  విరుద్ధమే. ఎవరైనా అతనున్న స్థానంలో కాల్చి పారేస్తారు. ఎందుకటే ఒక అవినీతి పరుడైన ఎస్సైగా  వ్యవస్థ ఎలా వుంటుందో అతడికి తెలిసే వుంటుంది. అదే జరిగింది కూడా. కోర్టులో సాక్ష్యం తెల్లబోయేలా చేసింది. సినిమాటిక్ గా చూపించిన ఈ  కథనంలో కూడా, అంత విలువైన సాక్ష్యాన్ని కాపీలు తీసి ఉంచుకోకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరం ఎలా చేస్తాడు? కాపీలు తీసి వుండాల్సిందని తర్వాత బాధపడేలా చేయడం దర్శకుడు కథనంలో లోసుగుల్ని కవర్ చేయడానికి చేసే ప్రయత్నమే. ఈ ప్రయత్నంలో హీరో పాత్ర అసమర్ధంగా తయారయ్యింది. తను మంచి వాడుగా మారినా  అసమర్దుడైతే ఏం లాభం? ఇది సినిమాటిక్ లిబర్టీ సంగతి. ఇక లాజికల్ గా అయితే ఆ సీడీ మీద ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకుని పకడ్బందీ సాక్ష్యంగా కోర్టుకి సమర్పిస్తారు. ప్రాసిక్యూటర్ చేతిలో పెట్టరు. కేవలం ఆ సీడీ చూసేసి జడ్జి కూడా మరణ శిక్ష విధించడు. 
           ఆ క్రిమినల్స్ ని హీరో పట్టుకుని కాల్చేస్తూంటే  విలన్ గోల చేసి, అరెస్టు చేయించి ఉండాల్సింది. అప్పుడు  చంపే అవకాశం కోల్పోయిన హీరో,  ఇక కోర్టులోనే తలపడేందుకు సిద్ధపడినట్టు చూపిస్తే పాత్రకి న్యాయం జరిగేది. కానీ కోర్టులో హీరో ఇచ్చే టర్నింగ్ ని తురుపుముక్కగా పెట్టుకున్నారు గనుక,  పాత్ర కిల్ అవుతున్నా పట్టించుకోలేదు. చివరికి హీరో చేసిన పని వాళ్ళని పట్టుకుని చంపడమే అయ్యింది. ఇదేదో అప్పుడే చేసేస్తే పోయేదిగా?
          అలాగే అమెరికా వెళ్ళిపోయినా అక్కడుండి అనుక్షణం టీవీలో ఇక్కడి పరిణామాలు గమనిస్తున్న, ఇంటరాక్టు అవుతున్న మధురిమ, ఇక ఉరి తీస్తున్నారని తెలుసుకుని చెప్పిన మాట ఆ సీడీ తో జరిగిన మోసం బయటపడినప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇలా కథా సౌలభ్యం కోసం లాజిక్ ని పక్కన బెడితే,  సినిమాటిక్ గానూ ఇష్టానుసారం నడిపారు. హైదరాబాద్ ఎస్సై ఆంధ్రా కి ట్రాన్స్ఫర్ అవడం ఇంకో హరిబుల్  సినిమాటిక్ లిబర్టీ. కానీ పూరీ సినిమాలతో అభిరుచిగల ప్రేక్షకుల వాయిస్ కి స్థానం వుండదు కాబట్టి ఇలాటి ఎన్ని చేదు మాత్రలనైనా దిగమింగి సినిమా హిట్టని చప్పట్లు కొట్టాల్సిందే.

      అంతిమంగా సామాజిక సమస్యతో ప్రేక్షకుల్ని విజయవంతంగా కనెక్ట్ చేశామాలేదా అన్నది మాత్రమే ప్రస్తుతమైతే- ముందుగానే చెప్పుకున్నట్టు కిందా మీదా పడి తప్పకుండా ఇందులో సక్సెస్ అయ్యారు. ఇలాగే అన్నిసార్లూ సక్సెస్ కాలేరు. తిరిగి మూలాల వైపు చూసిన శైశవ దశ నమూనా ఇది కాబట్టి, ఈ శాంపిల్ తో ఫస్టాఫ్ –సెకండాఫ్ ఆసాంతం కూడా సోషల్ కాజ్ గల కథా కథనాల్ని ధైర్యంగా ప్రేక్షకులకి ఇకపైన రుచి చూపించవచ్చు.  
సికిందర్