రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

నాటి సినిమా..


సరి ‘గమ్యాల’ సరిత!

‘నా జీవితం అనేక విధాలా అంతులేని కథతో పోలి వుంటుంది’ అని జయప్రద అన్నప్పుడు అందువల్లే ఆ పాత్రకి అంత జీవం పోసిందేమో అన్పించక మానదు.
1.  తను హర్ట్ అయినప్పుడు పెల్లుబికే హావభావాలు
2. అనుకున్నది అవనప్పుడు ఎగిసిపడే రియాక్షన్స్
3. సెల్ఫ్ పిటీ అప్పడు  పాతాళం లోకి జారే శోక ముద్ర
4. త్యాగాలు చేసినప్పుడు ఆకాశాన్నంటే ఆనందం

      ముఖం ఒకటి – భావాలే మరీ కోటి. తెలుగు తెరకి మునుపెన్నడూ లేనంత సంకీర్ణ  స్త్రీ పాత్ర సృష్టి జయప్రద పోషించిన సగటు సరిత పాత్ర.  ఈ సినిమా నాటికి స్త్రీల వృత్తులు ఇప్పుడున్నంత పోటాపోటీగా లేవు. అప్పట్లో ఉద్యోగినులు, ఇప్పుడు వర్కింగ్ వుమెన్.  అప్పట్లో కెరీర్ నిచ్చెన మెట్ల గురించి పెద్దగా చింత లేని తనం, ఇంటి చుట్టూ ఆలోచనలతో సతమతం. తేడా అల్లా ఈ సినిమాలో ఆ ఇంటి బాధ్యతలు మీద పడ్డందుకే ఆక్రందనలు!
      వై? ఎందుకలా? 1976 లో ఆశా పూర్ణా దేవీ ( 1909 – 1995 ) రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా హిందీలో తారాచంద్ బర్జాత్యా తీసిన ‘తపస్య’ లో కథానాయిక ఇలా కాదే?  1974 లో కె. బాలచందర్ తమిళంలో సృష్టించిన సరిత అనే పాత్రతో ‘అవళ్ ఒరు తోడుర్కథాయ్’ తీసినప్పుడు అందులో అలవాటైన తన బ్రాండ్ యాంటీ హీరోయిజాల, యాంటీ క్లైమాక్సుల మోజు వెనుక వెలిగించిన అభ్యుదయ దీపమే, 1976 లోనూ తిరిగి తెలుగులో ‘అంతులేని కథ’ లో వెలుగులు జిమ్మింది.

      పాత కట్టుబాట్లూ,  కాలం చెల్లిన సాంప్రదాయాల సంకెళ్ళూ తెంచి పారెయ్యాలన్నదే బాలచందర్ ‘విజన్’  అయినట్లయితే, దీనికి ప్రతిగా ఆ పాత కట్టుబాట్ల,  సాంప్రదాయాల విలువలకే పట్టం గడుతూ, భారతీయ స్త్రీని శాంతీ సహనాలకీ, యుగాల కట్టుబాట్లకీ చిహ్నంగా చూపడమే ఆశా పూర్ణా దేవీ దృక్పథం అయింది. అయితే ఈవిడ చేసిన పాత్ర చిత్రణ తన వాదానికి బలం చేకూర్చినట్టుగా, బాలచందర్ సృష్టి కన్పించదు. కారణం, ఆయన అభ్యుదయవాదం కాస్తా అవగతమైన సాంప్రదాయవాదం లోకి తిరగ బెట్టడమే. ఆయన సృష్టించిన రివల్యూషనరీ సరిత పాత్ర కాస్తా ఏమీ సాధించలేని కౌంటర్ రివల్యూషనరీగా పలాయనం చిత్తగించడమే. ‘తపస్య’ లోని పాత  సాంప్రదాయ పాత్రలాగా స్థిరపడి పోవడమే. గాడ్, ఇంత దానికి ఈ డొంక  తిరుగుడంతా దేనికో?

       గమ్మత్తేమిటంటే ఆ సంవత్సరం విడుదలైన ఈ రెండూ సూపర్ హిట్సే!

      ‘అంతులేని కథ’ జయప్రదకి సుదీర్ఘమైన తిరుగు లేని సురక్షిత సినీ జీవితాన్ని ప్రసాదించింది. సావిత్రికి ‘చివరకు మిగిలేది’ ఎలాగో, జయప్రదకి ‘అంతులేని కథ’ అలాగ. ముక్కు పుటాలు కంపిస్తాయ్- తన మీద తనకే ఎందుకో కోపం; కోర చూపులు ప్రసరిస్తాయ్ - కసికసిగా ఇతరులంటే చిన్న చూపు; ముక్తసరి మాటలు ఉడుకుతాయ్- నత్తలా తనలోకి తాను  ముడుచుకోవడం...ఇప్పుడు ముప్పయ్యేళ్ళ తర్వాతయినా ఈ లెవెల్లో ఇంత ఫైర్ బ్రాండ్ సరితని మర్చిపోగలరా ఎవరైనా? కాస్త సహనవతి అయ్యుంటే ఎంత బావుణ్ణురా భగవంతుడా అని మగ ప్రేక్షక  ప్రపంచం మొర పెట్టుకుంటూనే ఉండొచ్చు ఇంకా.

      సహనం శాంతి సౌఖ్యాలూ అభ్యుదయం కాకుండా పోవు. ఈ గుణాలే అభ్యుదయమైతే తిరుగుబాట్ల తలనొప్పులే వుండవు. ఏదైతే అందదో, దాని గురించి తియ్యటి బాధ వుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రా ల్లాగా, ఏదో మంచి చేయడానికే సినిమాల్లో స్త్రీ పాత్రలకి ఆ నెగెటివిజాన్నేదో వండివార్చినట్లయితే, పొలోమని అప్పుడు వెంట పడుతుందేమో పురుష ప్రేక్షక దండు. ఈ సినిమా ఇంతటి శాస్వత తత్వాన్ని మూట గట్టుకోవడానికి ఈ మేల్ ఫ్యాక్టరే మంత్రంలా పని చేసిందేమో.

        పైకి నిరర్ధకంగా కన్పించే నెగెటివ్ పాత్ర సరిత. అది పాజిటివ్ గా మారే క్రమాన్నే మనం చూస్తాం. పాజిటివిజం తో ఎప్పుడూ భౌతిక  సుఖాలే ఉండక పోవచ్చు. అంతకి మించిన మాననసిక శాంతి, సంతృప్తీ తప్పక వుంటాయి. మనకి తెలిసిపోతూ తనకి తెలీకుండా సరిత ఇదే సాధిస్తుంది చివరికి. ‘నాలో వున్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు’ అని పాడుతుంది మొదట్లో. అది ఉత్త ట్రాష్. ఏం తెల్సని ఆమెకి? ‘నన్ను కూర్చో బెట్టి ఇంత అన్నం పెట్టే నాధుడు కావాలీ’  అనేనా? ఎప్పుడు ఈ ఇంటి బాధ్యతల పీడా వదిలి పెళ్లి కూతుర్నై కులుకుదామనేనా? పెళ్ళయితే చాలు, ఈ వెధవ ఉద్యోగం కూడా వదిలిపారేసి హాయిగా మొగుడు పెట్టింది తింటూ కూర్చో వచ్చనేనా? కాబట్టి ఈ అజ్ఞానానికి శాస్తి అన్నట్టుగానే ఇలాటి ఆమె కలలన్నీ పటాపంచలయ్యాయి చివరికి. ఇక పునీతురాలయింది. పాత్రలోకి వెళ్లి మనం చూస్తే ఈ సంగతే ఆమె తెలుసుకున్నట్టు వుండదు. మనం ఫీలవుతాం ఆమె ఫీలవ్వాల్సిన సంగతిని. ఇదింకో అజ్ఞాన పర్వానికి తెర తీయడం!

     వైజాగ్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూంటుంది సరిత. ఆ జాబ్ కి తగ్గట్టు స్లీవ్ లెస్ జాకెట్లు, పెదాలకి లిప్ స్టిక్, పాదాలకి హై హీల్స్, చదువుకోవడానికి ఇంగ్లీషు నవలలు; తన గదిలో విశ్రమించడానికి తనకంటూ ప్రత్యేక ఫోం బెడ్, ఫ్యానూ, సోఫా సెట్ ఎట్సెట్రా ...ఇది తన వాళ్ళ మీద కసితో ఏర్పాటు చేసుకున్న తన గొప్ప ప్రపంచం. చుట్టూ ఇంకో దిక్కుమాలిన ప్రపంచం. పోష్ లొకాలిటీని అనుకునే మురికి స్లమ్ వాడ వున్నట్టు...ఇందులో తన మీద ఆధారపడ్డ కన్న తల్లి, విధవరాలైన చెల్లి, ఎదిగిన మరో చెల్లెలు, అంధుడైన తమ్ముడు, ఆవారా అన్న, వదిన, వాళ్ళ ముగ్గురు పిల్లలూ..దిక్కుమాలిన సంత! వీళ్ళంతా ఏదో కతకడం, కటిక నేల మీద పడి కునుకు తీయడం, సరితమ్మ వుంటే కిక్కురుమనకుండా తొంగోవడం. ఆవిడ ఆఫీసుకి బయల్దేరిందే తడవు ఇల్లంతా పండగే పండగ చేసుకోవడం. ఆఫీసులోనూ ఆవిడ ఆడపులే. చాలా పొగరుబోతు. గయ్యాళి. కొరకరాని కొయ్య. గర్విష్టి పైగా. తండ్రేమో సన్యాసుల్లో కలసిపోయి, అన్నేమో బేవార్సుగా మారి, కుటుంబ పోషణంతా తన ఆడ ప్రాణం మీద పడి, ఎప్పుడు ఈ రొంపి లోంచి విముక్తి దేవుడా అని అలమటిస్తున్నట్టు ప్రవర్తించడం..

       అటు ప్రేమిస్తున్న తిలక్ (ప్రసాద్ బాబు) ని పెళ్ళాడాలంటే ఇంటి బాధ్యతల్ని విడిచి పెట్టాలి. ఇది కుదరదు. ఇక ఈమెతో లాభం లేదని విధవరాలైన ఈమె చెల్లెలితో ఇతను వరస కలుపుకోవడం. ఈ గుండె కోతని కూడా భరించి  ఆ చెల్లెల్ని (శ్రీప్రియ) ఈ ప్రేమిస్తున్న ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసేయడం.


    ఈ చెల్లెల్నే మూగగా ప్రేమిస్తున్న ఒక వికట కవి (నారాయణరావు) ఉంటాడు. ఇతడికి జీవితంలో దారి తప్పిన తన కొలీగ్ (ఫటాఫట్ జయలక్ష్మి) కిచ్చి పెళ్లి చేసేస్తుంది సరిత. ఇటుపైన సరిత జీవితం లో దేవుడు కరుణించా డన్నట్టుగా శుభాలే జరుగుతూంటాయి. ఆవారా బేకార్ అన్న( రజనీ కాంత్ ) కూడా కాస్త ప్రయోజకుడవుతాడు. హమ్మయ్యా అని జాబ్ మానేస్తుంది సరిత. ఈమె రాజీనామా  స్వీకరించిన బాస్ (కమల్ హాసన్) ఈమెతో పెళ్లిని ప్రతిపాదిస్తాడు. ఇక పెళ్లి పీట లెక్కడమే తరువాయి ఆ ప్రయోజకుడైన అన్న కాస్తా హత్యకి గురవుతాడు. సమాప్తం. ఖేల్ ఖతం. తిరిగి మొదటి కొచ్చింది కొలిక్కి రాబోయిన సరిత కథ..నీదొక అంతులేని వ్యధాభరిత గాథే సుమా అనేసి. 

       ఇక తన ఈ రెండో కాబోయిన వరుణ్ణి కూడా రెండో చెల్లెలికి త్యాగం చేసేసి, తిరిగి గానుగెద్దు జీవితం మొదలు ... మళ్ళీ పెదాలకి అదే దొరసాని లిప్ స్టిక్, వొంటికి అవే స్లీవ్ లెస్ షో పీసెస్, టిక్కు టిక్కు మని కాళ్ళకి హై హీల్స్, ఉద్యోగిని హోదా వెలగబెడుతూ చేత్తో లంచ్ బాక్స్- ‘అమ్మా ఆఫీసు కెళ్తాను’ అనేసి ఈసురోమని నడక బస్టాపు కేసి..

        కాకపోతే ఇప్పుడు వైధవ్యం ప్రాప్తించిన వదిన వుంది. ఇంట్లో ఈ మార్పు తో బాటు తనలో కూడా ఎంతో మార్పు. ఎంతో పరిపక్వత. భద్రకాళి సరిత కాదిప్పుడు. పాఠాలన్నీ ఎంచక్కా  నేర్చేసుకున్న ప్రౌఢ ఇప్పుడు. ఇంటి బాధ్యతలు ఎంతో అపురూపంగా కన్పిస్తున్న సహనవతి ఇప్పుడు.

 

      వృద్ధ కన్యలు ఆ కాలంలోనూ వున్నారు. పరిస్థితుల కారణంగా తోబుట్టువుల బాధ్యతలన్నీ తీర్చుకుని తెప్పరిల్లే సరికి వైవాహిక జీవితం కాస్తా ఎండమావులై పోయిన వాళ్ళున్నారు. సరిత లాగా కసిని పెంచుకుని వుండరు. తమ దయాదాక్షిణ్యాలతో కుటుంబ సభ్యులు ఇంత తిని చస్తున్నారన్న ఏహ్యభావంతో వుండరు. అలా జరిగితే ఆడతనానికి అర్ధమే ఉండదు. స్త్రీ సహజాతాన్ని ఏ స్త్రీ జయించ జాలదు. జెండర్ సమానత్వం గురించి మాట్లాడినప్పుడు సరితకి లాంటి పరిస్థితులు ఎదురైతే బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ఎక్కడో నూటికో కోటికో ఎవరో ఉండొచ్చు. అలాటి అరుదాతి అరుదైన ఉదంతాల్ని తీసుకుని  సామాన్యీకరించలేం. హిందీ సినిమా ‘తపస్య’ లో హీరోయిన్ రాఖీ పోషించిన ఇలాటిదే పాత్ర సహజమైన పెద్దరికంతో,  అవివాహితగానే కుటుంబ బాధ్యతంతా మీదేసుకుని మహా సహనశీలీ, విశాల హృదయినీ అయి, ఎంతో శ్రమించి తోడబుట్టిన వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తే, వాళ్ళు తన్నేసి పోతారు. ప్రేమిస్తున్న ప్రియుడు (పరీక్షిత్ సహానీ) – ‘ఫర్వాలేదు, నీ ఇంటి బాధ్యత నేను తీసుకుంటానంటే, వద్దని వారిస్తుంది. స్త్రీ కుండే త్యాగ గుణానికీ, పురుషుడు కనబర్చాల్సిన ఓర్పుకీ  ప్రబల నిదర్శనం గా నిల్చి పోయిందీ చిత్రీకరణ.

    తెలుగులో దీన్ని కోదండ రామిరెడ్డి సుజాత తో ‘సంధ్య’ గా తీస్తే ఇదీ హిట్టయ్యింది.

      ఇలాంటి యాంటీ మిత్ / యాంటీ హీరోయిన్ లేదా హీరో పాత్రలు దేనికో టెంప్ట్ అయి, పతనాన్ని కొని తెచ్చుకోవడం మామూలే. అన్న ప్రయోజకుడయ్యాడని సరిత టెంప్ట్ అయి ఉద్యోగం వదిలెయ్యడమే మూర్ఖత్వ మన్పించుకుంది.

      ఈ సినిమాతో రజనీకాంత్, శ్రీ ప్రియ, నారాయణ రావులు పరిచయమయ్యారు. అప్పుడే రజనీకాంత్ సిగరె ట్టెగరేసే దృశ్యా  లిందులో వున్నాయి. ఆయన మీద జేసుదాస్ పాడిన సూపర్ హి ట్ ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ’ పాట చిత్రీకరణ కూడా వుంది. 

     జయప్రద మీద ఎస్. జానకి స్వరంలో ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’ గీతం ఓ సంచలనం అప్పట్లో. ఇక ఫటాఫట్ జయలక్ష్మి, నారాయణ రావులవి వెరైటీ పాత్రలనడం కంటే కల్ట్ పాత్రలనడం న్యాయం. ఫటాఫట్ అనే జయలక్ష్మి ఊతపదం ఇప్పటికీ పాపులరే. ఆమె మీద ఎల్లారీశ్వరి పాడిన ‘అరె ఏమిటీ లోకం పలుగాకుల లోకం’ పాట, నారాయణ రావు మీద మిమిక్రీతో ‘తాళి కట్టు శుభవేళ’ పాటా అంతే హిట్స్. పాటల, మాటల సృష్టికర్త ఆత్రేయ.


     స్వరకర్త ఎం.ఎస్. విశ్వనాథన్. బీ ఎస్ లోకనాథన్ ఛాయాగ్రాహకుడైతే, ఈ సినిమా ఘనవిజయం తర్వాత వెంటనే ‘మరో చరిత్ర ‘అనే ఇంకో సూపర్ హిట్ నిర్మించిన రామ అరణ్ణంగళ్  నిర్మాత. మద్రాస్ నెప్ట్యూన్ స్టూడియోలోనూ, వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ జరిపారు. 

     1982 లో తాతినేని రామారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ రేఖ హీరోయిన్ గా ‘జీవన్ ధారా’ అని హిందీలో రిమేక్ చేస్తే అదీ హిట్టయ్యింది.

సికిందర్
(జనవరి 2010, ‘సాక్షి’ కోసం)