రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, మార్చి 2023, మంగళవారం

1312 : స్క్రీన్ ప్లే సంగతులు“If you think about it, most Hollywood movies, in particular, are based on very simple story ideas.” Michael Hauge

      గాలి దూరని చీకటి గదిలో ఎక్కువై పోయిన క్రియేటివిటీ నేలమీద పారించుకుంటూ పది మంది క్రిక్కిరిసి కూర్చుని జోరుగా రైటింగ్ చేసేస్తున్నారు. చేస్తున్న కొద్దీ చేయాలనే అన్పిస్తోంది రైటింగ్. అంత ఉత్సాహపడి వేసేస్తోంది రేటింగ్ క్రియేటివిటీ. పేజీలకి పేజీలు రైటింగ్ చేసి పక్కన పడేస్తున్నారు. ఎంత రైటింగుకీ తనివి దీరడం లేదు. ఫైళ్ళకి ఫైళ్ళు రైటింగ్ చేసేసి పక్కన పడేస్తూంటే ఉన్నట్టుండి పోలీసులు రైడ్ చేశారు- గెటప్! ఆ కారుతున్న రైటింగ్స్ పట్టుకుని పదండి బైటికి! గద్దించారు. ఎవరు మీరు? ఇక్కడికెందుకొచ్చారు?’ అరిచింది వాళ్ళలో క్రియేటివిటీ తారులా కారుతున్న ఆమె. స్క్రిప్ట్ పోలీస్! పదండి జైలుకి! పట్టుకుని లాగారు. స్క్రిప్టు పోలీసులేంటి? స్క్రిప్టు డాక్టర్లు కదా?’ గింజుకుంటూ అరిచారు. మీకిప్పుడు స్క్రిప్ట్ పోలీసులే కరెక్ట్! దబాయించారు. ‘ఎందుకు పట్టుకుంటున్నారు మమ్మల్ని? ఏం పాపం చేశాం మేం?’ ఆందోళన వెలిబుచ్చింది క్రియేటివిటీని ఇష్టంగా తుడుచుకుంటూ వాళ్ళలో ఆమె. మీరు ఫస్టాఫ్ కథ లేకుండా స్క్రిప్టులు రాసి  హింసిస్తున్నారు ప్రేక్షకుల్ని రెక్కలుచ్చుకుని లాక్కెళ్ళారు అందర్నీ.
        
ఇంతా చేసి ఆ స్క్రిప్టు పోలీసుల్ని ఫీల్డు మీదికి వదిలింది ప్రేక్షకులే. ఇలా వుంది పరిస్థితి. ఫస్టాఫ్ కథ లేకపోవడమనే లోటుని ఓ పదేళ్ళ  క్రితం వరకైతే ఫీలవలేదు ప్రేక్షకులు. కానీ చూస్తే 2000 వ సంవత్సరం నుంచే ఈ పరిస్థితి అమల్లో వుంది. ఆ నాడు ఎప్పుడైతే కథ -మాటలు -స్క్రీన్ ప్లే -దర్శకత్వం అంటూ అన్నీ తామే అయిన కొత్త తరం మేకర్ల రాకతో యూత్ సినిమాల పేరుతో కొత్త ట్రెండ్ మొదలైందో, అప్పట్నుంచీ కథ లేని ఫస్టాఫ్ కాదు, ఏకంగా సెకండాఫ్ లోనూ కథ కనపడని క్షామం వుంది. ఎక్కడో థర్డ్ యాక్ట్ దగ్గర్లో కథ ప్రారంభమై చప్పున ముగిసిపోయే లైటర్ వీన్ ప్రేమ సినిమాలు. లైటర్ వీన్ అనేది అప్పట్లో మేకర్ల, నిర్మాతల అభిమాన పదం.
        
అప్పుడెందుకు ప్రేక్షకులు లోటు ఫీలవలేదంటే, అందరూ యూత్ క్యారక్టర్లతో అంతకి ముందెన్నడూ లేని అల్లరల్లరి కామెడీలతో ప్రేమ సినిమాలు కొత్తగా అన్పించడంతో. ఎక్కడో థర్డ్ యాక్ట్ దగ్గర్లో మాత్రమే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటయి- అప్పుడు ప్రేమలో చిన్న ప్రాబ్లం (కథ) ఏర్పడి, ఓ పదిహేను నిమిషాల్లో పరిష్కారమైపోయి హాయి అన్పించేలా  సినిమా ముగిసిపోవడం. దీంట్లో కథతో కూడిన మిడిల్ (సెకండ్ యాక్ట్) వుండేది కాదు కాబట్టి వీటికి మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలని అప్పట్లో పేరు పెట్టాం. ఈ ట్రెండ్ లో ఒక్క తేజ తీసే ప్రేమ సినిమాలు మాత్రమే త్రీయాక్ట్ స్ట్రక్చర్లో పద్ధతిగా వుండేవి. అంటే నస పెట్టకుండా ఫస్టాఫ్ అరగంటలో కథ ప్రారంభ మైపోయేది.

1. ఫస్ట్ యాక్ట్ అక్రమాలు
        ఆ లైటర్ వీన్ ప్రేమ సినిమాల ట్రెండ్ ఐదారేళ్ళలో ముగిసిపోయినా వాటి నుంచి మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలనే వికారాలు ఇతర సినిమాలకూ ప్రాకాయి. పెద్ద సినిమాలు సహా ఇప్పుడూ వస్తున్నాయి. ఇవలా వుండగా, పరిస్థితి కాస్త మారి ఫస్టాఫ్ లోనే కథ ప్రారంభమయ్యే సినిమాలు రావడం మొదలెట్టాయి. అంటే ఫస్టాఫ్ ఇంటర్వెల్ నుంచి కథ ప్రారంభమవుతుంది. అంతవరకూ ఫస్ట్ యాక్టే ఇంటర్వెల్ వరకూ సాగి, ఇంటర్వెల్లో కథ పుట్టిన సెకండ్ యాక్ట్ వన్ సెకండాఫ్ లోకి జరిగిపోయి, అక్కడున్న సెకండ్ యాక్ట్ టూ ని వెనక్కి జరిపేసి, తను కూడా సెకండాఫ్ ని పంచుకోవడం. ఆ తర్వాత థర్డ్ యాక్ట్. ఇలా సెకండాఫ్ క్రిక్కిరిసి పోవడం. ఫస్ట్ యాక్ట్ మాత్రం ఫస్టాఫ్ నిండా దురాక్రమించి వుండడం. ఇలా తయారు చేసి దీన్నొక కథ అనడం.
        
మరి యూత్ సినిమాలతో కథా లోటు ఫీలవని ప్రేక్షకులు ఇప్పుడెందుకు ఫీలవుతున్నారు. ఫస్టాఫ్ లో యూత్ సినిమాల్లోని కామెడీలు లేకపోవడం. హీరో హీరోయిన్ల మధ్య పొడిపొడి టెంప్లెట్ కథనం వుండడం. ఆ సీన్లు ఎంతకీ మలుపు తిరగక ఇంటర్వెల్లో గానీ మలుపు (ప్లాట్ పాయింట్ వన్) తీసుకుని, అప్పుడు గానీ కాన్ఫ్లిక్ట్ ఏర్పడక పోవడం. ఇలా ఇంటర్వెల్ వరకూ ఇంకెప్పుడు ఏం జరుగుతుందాని ఎదురు తెన్నులు కాయాల్సి రావడం.
        
స్వాతిముత్యం (2022) లో ఫస్టాఫ్ పెళ్ళి చూపులుప్రేమపెళ్ళీ ఘట్టం వరకూ ఉపోద్ఘాతం వదిలి విషయంలోకి వెళ్ళక ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందు వరకూ డల్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి ముందు, హీరో హీరోయిన్ల పెళ్ళిలో బిడ్డనెత్తుకుని వచ్చే శైలజ పాత్రతో ఫస్ట్ యాక్ట్ ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. అంటే కథ మొదలవుతుంది.
        
లైగర్ (2022) లో  లైగర్ కి నత్తి వుంటుంది. ఇతడి తండ్రి ఫైటర్ గా ఛాంపియన్ కావాలన్న కల నెరవేరక ముందే చనిపోతాడు. లైగర్ తల్లి లైగర్ ద్వారా భర్త కోరిక నెరవేర్చాలన్న పట్టుదలతో ట్రైనింగ్ ఇప్పిస్తుంది. లక్ష్యం పూర్తయ్యే వరకూ అమ్మాయిల వెంట పడకూడదని ఆంక్ష పెడుతుంది. కానీ లైగర్ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఇంటర్వెల్లో ఒకానొక ఘట్టంలో లైగర్ కి నత్తి వుందని తెలిసి హీరోయిన్ వదిలేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ యాక్ట్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది.

2. హాలీవుడ్ సంగతి
        ఇలా ఇంటర్వెల్ వరకూ ఫస్ట్ యాక్ట్ ని సాగదీసే సినిమాలు చాలా వున్నాయి, ఇంకా వస్తూనే వున్నాయి కూడా. వీటిలో అత్యధిక భాగం ఫ్లాపులే. అయితే హాలీవుడ్ లో కూడా ఫస్ట్ యాక్ట్ బారుగా సాగే గాడ్ ఫాదర్’, టేకెన్ లాంటి చాలా సినిమాలొస్తూంటాయి. వాళ్ళకీ మనకీ తేడా ఏమిటంటే, వాళ్ళ సినిమాల్లో ఫస్ట్ యాక్ట్ బారుగా సాగినా దాన్లో టైమ్ పాస్ సీన్లు వుండవు. ఫస్ట్ యాక్ట్ తర్వాత వచ్చే సెకండ్ యాక్ట్ లో కథ కవసరపడే సమాచారాన్నే ఇస్తూపోతారు. దీంతో ఆ సీన్లు చూస్తూంటే తర్వాత కథకి సంబంధించి ఏదో జరగడానికే ముందస్తు తయారీ అన్నట్టన్పించి ఆసక్తి పెంచుతాయి. డొల్ల ఫీలింగ్ వుండదు. ఇలా 90 నిమిషాల టేకెన్ లో 40 నిమిషాలూ ఫస్ట్ యాక్టే సాగుతుంది. 180 నిమిషాల గాడ్ ఫాదర్ లోనూ 40 నిమిషాలూ ఫస్ట్ యాక్టే సాగుతుంది. ఇంత బారుగా సాగే ఫస్ట్ యాక్ట్ లో స్ట్రక్చరల్ బిజినెస్ (పాత్రల పరిచయం, కథా నేపథ్యపు ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన) కి అదనంగా జరిగిన బిజినెస్ ఏమిటో లైనార్డర్ వేసుకుని పరిశీలిస్తే అర్ధమవుతుంది.
        
మన సినిమాల్లో ఫస్ట్ యాక్ట్ లో, సెకండ్ యాక్ట్ కథ కవసరపడే సమాచారం కూడా కలుపుకోకుండా, పాత్రల పరిచయాలు, లవ్ ట్రాకులు, కామెడీలు, పాటలు ఇవే వుంటాయి. ఇంటర్వెల్లో కథ లోకి వెళ్ళేంతసేపూ ఇవే టైమ్ పాస్ సీన్లు. దీంతో ఫస్టాఫ్ డొల్లగా మారక మరేమవుంతుంది.

3. మరేం చేయాలి?
        ఏమీ చేయనవసరం లేదు. ఇంటర్వెల్లోనే కథ ప్రారంభమవ్వాలని రూలైతే లేదు. త్రీయాక్ట్ స్ట్రక్చర్ కి కుదరదు కూడా. రెండు గంటల సినిమా వుందంటే అరగంట ఫస్ట్ యాక్ట్, గంట సెకండ్ యాక్ట్, మరో అరగంట థర్డ్ యాక్ట్ వుంటే త్రీయాక్ట్ స్ట్రక్చర్. అంటే ఫస్టాఫ్ లో అరగంటకే ఫస్ట్ యాక్ట్ పూర్తయి, ప్లాట్ పాయింట్ వన్ తో కథ మొదలై సెకండ్ యాక్ట్ ప్రారంభమవాలి. ఇది ఇంటర్వెల్ వరకూ  సాగి, సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ మిగిలిన భాగం టూ పూర్తవాలి. అంటే ఇంటర్వెల్ కి ముందు సెకండ్ యాక్ట్ వన్ అరగంట, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ యాక్ట్ టూ ఇంకో అరగంట వుండాలి. ఆ తర్వాత అరగంట థర్డ్ యాక్ట్. దీనికి వ్యతిరేకంగా ఫస్ట్ యాక్ట్ (ఉపోద్ఘాతం) కి ఇంటర్వెల్ వేస్తున్నారు, అసలు ఇంటర్వెల్ వేయాల్సింది సెకండ్ యాక్ట్ వన్ (కథ) కి. ఏది ఉపోద్ఘాతం, ఏది కథ అర్ధం జేసుకోకుండా స్క్రిప్టులు రాసేస్తున్నారు సిల్లీగా.
        
ఇలా ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత గంటసేపు కథ నడవాల్సిందే. అప్పుడే ఒక సినిమా చూసిన తృప్తి మిగులుతుంది. జరుగుతున్న దేమిటంటే ఇంటర్వెల్ వరకూ కథ లేకుండా టైమ్ పాస్ చేసి, ఇంటర్వెల్ తర్వాత కథ ప్రారంభించి, ఓ అరగంట నడిపి క్లయిమాక్స్ కెళ్ళి పోవడం. అంటే ప్రేక్షకులకి గంట కథ అమ్మాల్సిన చోట అరగంట కథే అమ్మి తూకంలో మోసం చేస్తున్నారన్న మాట. ఇది గ్రహించాలి.
        
నిన్నటికి నిన్న ఒక పెద్ద బ్యానర్లో కథ విన్పించే ముందు వచ్చిన వ్యక్తి బిగ్ బడ్జెట్ ప్రేమకావ్యం దీనికంటే అన్యాయం- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. కథ వదిలేసి సీన్లు దృశ్యకావ్యాలు. ఏమంటే ఇంకో సినిమాలా వుండకూడదని, భిన్నంగా (కాన్ఫ్లిక్ట్ కూడా లేకుండా పాసివ్ పాత్రలతో గాథ) వుండాలని తను మనసులో ముద్రించుకున్న అందమైన కథ. చిత్రకారుడు కూడా అందమైన దృశ్యం వూహించి పెయింటింగ్ వేస్తాడు. దాన్ని ఎగబడి కొనేస్తారు. ఈ సినిమాని కూడా కథ లేకుండా అందమైన దృశ్యాలు అమ్మేయడమే. రాధేశ్యామ్ ని ఇలాగే అమ్మారుగా.
        
ఫస్టాఫ్ లో కథలోకి ఎందుకు వెళ్ళరంటే, అమ్మో గంట పాటు కథ నడపాలంటే మాటలా, అంత పెద్ద కథ అల్లడం వస్తుందో రాదో, ఎందుకొచ్చిన గొడవ- గంట టైమ్ పాస్ చేసేసి షార్ట్ ఫిలిం లాగా ఓ అరగంట కథ పడేద్దాం- ఇలా నేర మనస్తత్వంతో ఆలోచించడం. వంద రూపాయల టికెట్టుకి ప్రేక్షకులకి పాతిక రూపాయల సరుకే అమ్మేసి మోసం చేయడం. వందకి వంద రూపాయల కథా (సెకండ్ యాక్ట్) అమ్మాల్సిందే. మిగతా ఫస్ట్ యాక్ట్, థర్డ్ యాక్ట్ లు ఇడ్లీతో చట్నీ సాంబారులాగా ఫ్రీ. సినిమాలో కథ పేరుతో అరగంట షార్ట్ ఫిలిం ఇరికించి అమ్మడం నేరం.

4. ఇలాగే తప్పదంటే...
        అయినా గంట పాటు కథ అల్లే భయమే వదలకపోతే ఏం చేయాలి? గత ఇరవై యేళ్ళుగా జీర్ణించుకుపోయిన అలవాటిది. అంత తేలికగా వదలదు. అందుకని అలాగే ఇంటర్వెల్ వరకూ కథ లేకుండా ఫస్టాఫ్ ని నిలబెట్టాలంటే ఏం చేయాలి? దీనికి పరిష్కారం హాలీవుడ్ లో దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు మన లాగా ఫస్టాఫులు తీయరు కాబట్టి ఈ దిశగా ఆలోచించి వుండరు. మనమే ఆలోచించి ఏదో మార్గం కనిపెట్టాలి. పైన చెప్పుకున్న గాడ్ ఫాదర్, టేకెన్ మోడల్స్ ని ప్రయత్నించ వచ్చు. అంటే ఇంటర్వెల్ వరకూ సాగదీసే ఫస్ట్ యాక్ట్ లో- తర్వాత సెకండ్ యాక్ట్ లో అవసరమున్న సమాచారాన్ని లోడ్ చేయడం. దీంతో ఫస్టాఫ్ లో కూడా కథ వుందన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం. కథకీ, ఉపోద్ఘాతానికీ తేడా ప్రేక్షకులందరికీ తెలిసి వుండదు గాబట్టి, ఉపోద్ఘాతాన్ని కథ అన్పించేలా చీట్ చేయడం. ఇది పైన చెప్పుకున్నలాటి మోసం కాదు. సదుద్దేశంతో చీట్ చేసే పరికరాల్ని కథనంలో వాడడం సర్వసాధారణమే. బాధ్యతాయుత మద్యపానమని ఆంధ్ర మంత్రి ప్రకటించినట్టు బాధ్యతాయుత చీటింగ్!
        
పైన చెప్పుకున్న స్వాతిముత్యం ఇంటర్వెల్లో శైలజ అనే పాత్ర హీరోహీరోయిన్ల పెళ్ళిలో బిడ్డతో వచ్చి ఇది నీదే అంటుంది హీరోతో. ఔను నాదే అంటాడు. పెళ్ళింట్లో గోలగోలై పెళ్ళాగిపోతుంది. బిడ్డని హీరోచేతుల్లో పడేసి వెళ్ళిపోతుంది శైలజ.
        
ఈ సీన్లో లోపమేమిటి? ఇందులో హిచ్ కాక్ చిట్కా అమలు కాలేదు. సడెన్ గా బ్యాంగ్ ఇస్తే అందులో టెర్రర్ వుండదన్నాడు హిచ్ కాక్. ఏదో జరుగబోతోందని ముందుగా  హింట్ ఇస్తేనే టెర్రర్ వుంటుందన్నాడు. అందుకని శైలజ సడెన్ గా వచ్చి ఈ బిడ్డ నీదే అనడంలో బ్యాంగ్ లేదు. శైలజతో ముందుగా రెండు మూడు సీన్లు వేస్తేనే వుంటుంది. ఫస్ట్ యాక్ట్ లో ఆమె యాక్టివిటీస్ విడిగా చూపించుకుంటూ రావొచ్చు మిస్టీరియస్ గా, బిడ్డ తోడు లేకుండా. చర్చికి వెళ్ళినట్టు, ఎవర్నో కలవడానికి ప్రయత్నిస్తున్నట్టూ వగైరా. ఈ ఫోర్ షాడోయింగ్ సీన్లని ఇంటర్వెల్లో పే ఆఫ్ చేస్తే ప్లాట్ పాయింట్ వన్ కి బలమే గాక, తర్వాత సెకండ్ యాక్ట్ కథనానికి తోడ్పడతాయి. ఫస్టాఫ్ లో సస్పెన్స్ క్రియేట్ అయి కథ చూస్తున్నట్టు వుంటుంది. ఇది టూకీగా చెప్తున్నదే, దీన్ని- దీంతో బాటు మరి కొన్ని అంశాల్ని డెవలప్ చేసుకోవాలి.
        
లైగర్ ఫస్ట్ యాక్ట్ లైగర్ కి నత్తి వుందని ఇంటర్వెల్లో హీరోయిన్ వదిలేయడంతో ముగుస్తుంది. ఇంతవరకూ ఛాంపియన్ షిప్ కోసం లైగర్ ట్రైనింగుహీరోయిన్ తో ప్రేమమదర్ తో ఫ్యామిలీ సీన్లూ ఇవే వుంటాయి ఓ మూడు పాటలతో. మధ్య మధ్య వీధి పోరాటాలతో. అసలు లైగర్ కథ లోనే విలన్ లేక, విలన్ తో వుండాల్సిన ఛాంపియన్ షిప్ తాలూకు కాన్ఫ్లిక్ట్ లేక, కేవలం హీరోయిన్ తో ప్రేమలో కాన్ఫ్లిక్ట్ అనే బలహీన బాక్సాఫీసు ఎలిమెంట్ వుండడం వేరే విషయం, పక్కన బెడదాం.
        
లైగర్ ట్రైనింగుకి సంబంధించిన సీన్లలో సెకండ్ యాక్ట్ సరుకు నింపొచ్చు. ఇంతా చేసి అసలు ఛాంపియన్ షిప్ ఇండియాలో జరగడం లేదనీ, విదేశాల్లో ఎక్కడో జరుగబోతున్నాయనీ బిల్డప్ ఇచ్చుకుంటూ రావడం. ఈ విషయం లైగర్ కి దాచిపెట్టి ఫస్ట్ యాక్ట్ లో సస్పెన్స్ క్రియేట్ చేయడం, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ యాక్ట్ లో రివీల్ చేసి లైగర్ ని బోల్తా కొట్టించడం వగైరా ఒక ఐడియా మాత్రమే.

5. సబ్ ఫ్లాట్స్ తో  భర్తీ
        ప్రధాన కథకి ఫస్ట్ యాక్ట్ ప్రొసీడింగ్స్ నడుస్తూండగా వేరే పాత్రలతో ఒకటి రెండు సబ్ ఫ్లాట్స్ ఓపెన్ చేసి రన్ చేయడం. ఇంటర్వెల్ కి ముందు ప్రధాన కథ ఫస్ట్ యాక్ట్ కి ముందు సబ్ ఫ్లాట్స్ ని కలిపేసి, అందులోంచి ఇంకో కొత్త సబ్ ప్లాట్ సృష్టించి సస్పెన్సుతో లేదా క్లిఫ్ హేంగర్ మూమెంట్ తో ఆపడం, సెకండాఫ్ కి వాయిదా వేయడం.

6. ఫాల్స్ ప్లాట్ పాయింట్ వన్
        ప్లాట్ పాయింట్ వన్ లోని అంశంలో రెండు పార్శ్వాలుంటే ముందు ఒక దాంతో ఫాల్స్ ప్లాట్ పాయింట్ వన్ ని సృష్టించడం. స్వాతి ముత్యంలో హీరోహీరోయిన్ల పెళ్ళిలో శైలజ డైరెక్టుగా బిడ్డతో రావడం ప్లాట్ పాయింట్ వన్. ఆమె రాకని రెండు పార్శ్వాలుగా చూస్తే, బిడ్డతో రావడం, బిడ్డ లేకుండా రావడంగా వుంటాయి. ఈ రెండిటినీ వేర్వేరుగా ప్లే చేస్తే ముందు ఫాల్స్ ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది.
        
ముందు హీరో హీరోయిన్ల పెళ్ళి కుదిరాక అరగంట రన్ తర్వాత, శైలజ పాత్ర వచ్చి హీరోని బ్లాక్ మెయిల్ చేయడం, హీరో ప్రాబ్లం లో పడడం లాంటి ప్లాట్ పాయింట్ వన్ అన్పించే మలుపుని సృష్టించడం. తర్వాత ఇంటర్వెల్ లో ఆమె హీరో పెళ్ళిలో ఈసారి బిడ్డతో రావడం గలాభా సృష్టించడం రియల్ ప్లాట్ పాయింట్ వన్ గా వుంటుంది.

7. మినీ సినిమాల సిరీస్
        ఇంటర్వెల్ వరకూ సాగే వున్న ఫస్ట్ యాక్ట్ సీన్స్ నే ఒక్కో మినీ సినిమాలా క్రియేట్ చేయడం, ప్రేక్షకుల్ని బిజీగా వుంచడం. సీను ఏదైనా కావొచ్చు, ప్రతీ సీనూ త్రీయాక్ట్స్ లో వుండాలి. ప్రతీ సీను బిగినింగ్ - మిడిల్ -ఎండ్ విభాగాలతో నిత్య చలనంలో వుండాలి. సంజయ్ దత్ నటించిన వాస్తవ్ (1999) లో ప్రతీ సీనూ ఒక మినీ మూవీలా అలరిస్తుంది.

8. మోనోమిథ్ టూల్
        జోసెఫ్ క్యాంప్ బెల్ మోనోమిథ్ స్ట్రక్చర్ ఫస్ట్ యాక్ట్ లో రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్ అనే దశ వుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడడబోయే సమస్యని ఎదుర్కోవడానికి ప్రధాన పాత్ర తిరస్కరించే ఘట్టం. దీన్ని వాడుకుని ప్లాట్ పాయింట్ వన్ ని ఆలస్యం చేయొచ్చు. ఉదాహరణకి శివ లో నాగార్జున అమలతో జేడీ పాల్పడుతున్న చేష్టల్ని రెండు సార్లు చూసి చూసి, మూడోసారి ప్లాట్ పాయింట్ వన్ లో తిరగబడి జేడీని సైకిలు చెయినుతో కొట్టడం ప్రారంభిస్తాడు.
        
దీన్ని ఆలస్యం చేస్తే ఫస్ట్ యాక్ట్ ఇలా పెరుగుతుంది : జేడీ పాల్పడుతున్న చేష్టలు మొదటిసారి నాగార్జున చూసీ చూడనట్టు వుంటాడు. రెండో సారీ చూసీ చూడనట్టు వుంటాడు. ఫ్రెండ్స్ నిలదీస్తే, ఇంట్రెస్ట్ లేదని అంటాడు (రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’). దీంతో అమలకి అనుమానం వేస్తుంది- తనని ప్రేమించడం లేదా అని. రిలేషన్ షిప్ లో ఈ ప్రతిష్టంభనతో కొన్ని సీన్లు లాగవచ్చు. నాగార్జున క్యారక్టర్ ఎవరికీ అర్ధంగాక, నాగార్జునని ఇక చులకనగా తీసుకున్న జేడీ ప్రయత్నలూ పెరిగి, అమల తానే ఆత్మరక్షణ చర్యలు చేపట్టుకుని, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరికి వచ్చేసరికి, ఫైనల్ గా నాగార్జున రియాక్ట్ అవడంతో ముగించవచ్చు.

9. పది నిమిషాలకో వామ్మో
        ప్రధాన పాత్ర చేత ఇంటర్వెల్ వరకూ పది నిమిషాలకో బ్యాంగ్ చొప్పున ఫస్ట్ యాక్ట్ ని నడిపి మైమరిపించవచ్చు. ఎడ్డీ మర్ఫీ సినిమాలిలాగే వుంటాయి. భలేభలే మగాడివోయ్ కూడా.

10. క్యారక్టర్ డెవలప్ మెంట్
        ప్రధాన పాత్ర చిత్రణని కథ కవసరమైన అన్నికోణాల్లో పరిపూర్ణంగా చేసుకొస్తూ ఫస్ట్ యాక్ట్ ని సాగ దీయడం.

11. సాంగ్స్ స్పెషల్
        ఇంటర్వెల్ వరకూ ఫస్ట్ యాక్ట్ లో మూడు లేదా నాల్గు పూర్తి స్థాయి పాటలతో నింపడం. అయితే ఈ పాటల మీద ఎక్కువ కృషి చేయాలి. ప్రతీ పాటకీ సూపర్ హిట్ స్టేటస్ వుండాలి. లేని పక్షంలో ఫస్ట్ యాక్ట్ బెడిసి కొడుతుంది.

12. ఫ్లాష్ బ్యాక్ ప్లే
        ప్లాట్ పాయింట్ వన్ తో ఫస్ట్ యాక్ట్ ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లో ఫస్ట్ యాక్ట్ చెప్పుకొస్తూ, ప్రారంభంలో చూపించిన ప్లాట్ పాయింట్ వన్ తో కలపడం. రవిబాబు తీసిన అదుగో ఉదాహరణ. అయితే దీన్లో అరగంట ఫస్ట్ యాక్ట్ ని గంటకి పొడిగించాలంటే, ప్రారంభించిన ప్లాట్ పాయింట్ వన్ కి చాలా బలం వుండాలి. ఆ బలంతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ వగైరాలతో నడపాల్సి వుంటుంది. ప్రారంభంలో వేసిన ప్లాట్ పాయింట్ వన్ హుక్ లా ముగింపు వరకూ పనిచేసెట్టు చూసుకోవాలి. ఈ మొత్తం ప్రత్యామ్నాయాలు ఏ జానర్ కథకైనా వర్తిస్తాయి. శుభాకాంక్షలు.
—సికిందర్