రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, నవంబర్ 2016, శుక్రవారం

రివ్యూ

రచన-  దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 
తారాగణం : :నాగచైతన్య, మంజిమా  మోహన్‌, బాబా సెహగల్‌, రాకేందుమౌళి, సతీష్‌ కృష్ణన్‌, అజయ్‌ గొల్లపూడి తదితరులు 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, 
ఛాయాగ్రహణం : డాన్‌మాక్‌ ఆర్థర్‌, 
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్‌ 
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 
విడుదల
:11 నవంబర్, 2016.
***
          సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండిపోయి ఇవ్వాళ విడుదలైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఒక యాక్షన్ థ్రిల్లర్ గా గౌతమ్ మీనన్- నాగ చైతన్యల కాంబినేషన్ నుంచి ఎదురుచూడని నజరానా. వినోదపరుస్తూ సరదాగా సాగే ఓ ఎంటర్ టైనర్ గా ఆశించే వెళ్ళే ప్రేక్షకులకి వూహించని అనుభవం ఎదురయ్యే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అసలేముందో ఈ కింద చూద్దాం...

కథ 
     అతను (నాగచైతన్య) ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఎంబీఏ కూడా చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగి. ఖాళీగా ఉంటూ  అమ్మాయిల గురించి ఆలోచిస్తూ,  ఫ్రెండ్స్ తో చర్చిస్తూ గడిపేస్తూంటాడు. చెల్లెలు మైత్రేయి ఫ్రెండ్ గా లీలా (మంజిమా  మోహన్‌,) రావడంతో ఆమెతో ప్రేమ ఖాయం చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఆమె స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు చేయడానికి వైజాగ్ వచ్చింది. అతడి ఇంట్లోనే బస కూడా చేయడంతో అతడి పంట పండుతుంది. కానీ ప్రేమని వ్యక్తం చేసే అవకాశం ఎప్పుడూ  లభించదు. ఒకరోజు బైక్ మీద లాంగ్ టూరు వేస్తాడు- కన్యాకుమారి వెళ్లి అక్కడ సూర్యో దయాన్ని చూడాలని. అతడి వెంట ఆమె కూడా వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకుంటారు. వీళ్ళ బైక్ ని ఒక లారీ గుద్దేస్తుంది. దీంతో ఇద్దరి జీవితాలూ డిస్టర్బ్ అయిపోతాయి. అది మమూలుగా జరిగిన ప్రమాదం కాదనీ, ఎవరో లీల ని చంపడానికే చేయించారనీ తెలుస్తుంది. లీలా తల్లిదండ్రులు మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో వుంటారు.  వాళ్ళ మీద కూడా హత్యాయత్నం జరిగినట్టు తెలుసుకున్న అతను -అనుకోకుండా ఒక పోలీసు అధికారిని చంపి ప్రమాదంలో పడతాడు. కామత్ అనే మరో పోలీస్ అధికారి (బాబాసెహగల్) కూడా కుట్రలో భాగస్తుడుగా బయటపడతాడు. 

          అసలీ కుట్ర దార్లెవరు, లీలా కుటుంబాన్ని ఆమె సహా అంత మొందించాలని ఎవరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు, చివర్లో తప్ప తన పేరు కూడా వెల్లడించని కథానాయకుడు లీలా కోసం ఈ ఇరుక్కున్న పరిస్థితి లోంచి  ఎలా బయటపడ్డాడూ అన్నవి మిగతా కథలో టెలి అంశాలు.  

ఎవరెలా చేశారు
      ఫస్టాఫ్ లవర్ బాయ్ గా- సెకండ్ హాఫ్ యాక్షన్ హీరోగా నాగచైతన్య కన్పిస్తాడు. అయితే కథ సరిగ్గా కుదరని కారణంగా ఎమోషన్ లేని రియాక్టివ్ క్యారక్టర్ గా మిగిలిపోతాడు.  ఎప్పుడైతే కథలో  విలన్ ని దాచి పెట్టి ఎండ్ సస్పెన్స్ చేశారో, అప్పుడు చైతన్య  పాత్ర కూడా దిక్కుతోచక కథ నడప లేని స్థితిలో పడిపోయింది. కథ అనేది హీరో లేదా హీరోయిన్ – ఎవరు ప్రధాన పాత్ర అయితే ఆ ప్రధాన పాత్రలోంచి పుడుతుందే తప్ప- బయట నుంచి రచయిత పుట్టించేది కాదు. ఈ పొరపాటు వల్ల నాగచైతన్య పాత్ర – నటన కూడా ఏకపక్షంగా కన్పిస్తాయి. క్లయిమాక్స్ లో పాత్ర ఇచ్చిన ట్విస్టు బాగానే ఉన్నప్పటికీ- ఈ ఒక్క సీనుతోనే అనూహ్యంగా కథ ముగిసిపోవడంతో తీవ్ర  అసంతృప్తే మిగులుతుంది. హీరోయిన్ తో  కెమిస్ట్రీ – రోమాన్సూ  మాత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తాయి.

          కేరళ  హీరోయిన్  మంజిమా మోహన్ టాలెంట్ వున్న గ్లామరస్ నటియే. అయితే సెకండాఫ్ కొచ్చేసరికి పాత్ర పూర్తిగా సీరియస్ గానూ, ఎక్కడా రిలీఫ్ లేకుండా శాడ్ గానూ మారిపోయి ఏడుస్తూ వుండడమే పనిగా పెట్టుకోవడంతో (రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఏడ్వడం దేనికి?) యూత్ అప్పీల్ కి వ్యతిరేకంగా మారింది. పాత్రపరంగా తను  స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు చేస్తున్న రచయిత్రి అయినప్పుడు తన కెదురయ్యే కష్టాలకి ఏడ్వడం అసహజంగా అన్పిస్తుంది. తన గురించి ఏడ్చే రచయిత్రి స్క్రీన్ ప్లేలు ఏం రాస్తుంది?  పేరుకి హీరోయిన్ కి గొప్పగా ఒక క్వాలిఫికేషన్ చూపించి ఆతర్వాత వదిలేసే మూసఫార్ములా చిత్రణకి గౌతమ్ మీనన్ కూడా పాల్పడ్డారు. ఆమెని స్క్రీన్ ప్లే రైటర్ గానే పూర్తి స్థాయిలో చూపించి వుంటే, ఈ డ్రైగా వున్న  థ్రిల్లర్ ని  ఆమె పాత్ర కూడా చేసే సాహసాలు చైతన్యం నింపేవి. 

          సింగర్ బాబా సెహగల్ బోడి గుండుతో నెగెటివ్ పాత్ర  నటించాడు. టెర్రర్ సృష్టించే పోలీసు పాత్రలో ఓకే అన్పించుకున్నాడు. అయితే చివరి దాకా హీరోని వేధించే తను విలన్ కాదు- విలన్ కి అనుచరుడు మాత్రమే. ఇకపోతే ఒక్క నాగచైతన్య తప్ప ఈ  సినిమాలో మరో తెలుగు ఆర్టిస్టు ఎవరూ లేరు.

         
డాన్‌మాక్‌ ఆర్థర్‌ ఛాయాగ్రహణం అత్యున్నతంగా వుంది. కన్యాకుమారి సముద్ర తీర దృశ్యాలు చాలా అందంగా వున్నాయి. చాలా భాగం రాత్రి సమయాల్లో సాగే కథకి ఆ మేరకు నైట్ సీన్స్ ని డెప్త్ తో చిత్రీ కరించాడు. ఇక  ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఒక ఎసెట్టే ఈ సినిమాకి. అయితే ఆరు పాటలూ ఫస్టాఫ్ లోనే పెట్టేశారు. సెకండాఫ్ లో పాటల్లేవు. 

చివరి కేమిటి?
     గౌతం మీనన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ని మాత్రమే తీశారు. దీనికి ప్రేమ కథతో సంబంధం లేదు. యాక్షన్ కి కారణమైన అంశం పూర్తిగా వేరు. అందుకే సెకండాఫ్ లో కథ రోమాంటిక్ ఫీల్ ని కోల్పోయింది. ఫస్టాఫ్ లో రోమాన్స్- సెకండాఫ్ లో దాంతో సంబంధం లేని యాక్షన్ గా తీశారు. అయితే యాక్షన్ కథకి హీరోయిన్ తో సంబంధముంది- కానీ ఆమె హీరోని ప్రేమించడంతో సంబంధం లేదు. గౌతం మీనన్ సెకండాఫ్ లో రోమాన్స్ నీ, సాంగ్స్ నీ ఇంకెలాటి వినోదాన్నీ కూడా పూర్తిగా  పక్కన బెట్టేయడంతో, యాక్షన్ కథ ఏకబిగిన మంచి పట్టుతోసాగే  థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ని సృష్టించిందని చెప్పొచ్చు.  చివర్లో నాగచైతన్య పాత్రతో ఇచ్చిన ట్విస్టు మాంచి కమర్షియల్ గిమ్మిక్కు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఎలా తీశారంటే తన సహజమైన న్యూవేవ్ ధోరణికి మూస ఫార్ములా కూడా జోడించారు. దీంతో చివరి ట్విస్టు బాగానే వున్నా అది ఈ జానర్ లో పొసగనట్టు అన్పిస్తుంది. హీరోయిన్ ని స్క్రీన్ ప్లే రైటర్ గా పరిచయం చేసి ఆ తర్వాత మూస ధోరణికి వెళ్ళిపోవడం కూడా ఇలాటిదే.

          గౌతమ్ మీనన్ ఎండ్ సస్పెన్స్ కథనంలో  చిట్ట చివర్లో రివీల్ చేయడానికి పెట్టుకున్న సస్పెన్స్ అంశం ఏ మాత్రం బలంగానూ లేదు. పైగా మరాఠా ప్రాంతంపు నేటివిటీతో, పాత్రలతో మరాఠీ – హిందీ సంభాషణలతో నడిపితే తెలుగు ప్రేక్షకులు అర్ధం జేసుకోవడం ఇబ్బందే- ఎంత  తెలుగులో సబ్ టైటిల్స్ వేసివప్పటికీ అవి చదువుకుంటూ కూర్చోలేరు. 

          ఫస్టాఫ్ రోమాన్స్, సెకండాఫ్ యాక్షన్ అనే స్కీము  పెట్టుకుని, గౌతమ్ మీనన్ నాగ చైతన్యతో చేసిన ఈ ప్రయత్నాన్ని  వినోదాన్ని మాత్రం ఆశించి చూడకూడదు. సెకండాఫ్ లో పాత్ర పరంగా, కథా పరంగా లోపాలున్నా, బలహీనతలున్నా సాధారణ ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చుని చూసేలా చేస్తుంది.

-సికిందర్