రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 13, 2017

530 : రివ్యూ!

రచన – దర్శకత్వం : ఓంకార్
తారాగణం : నాగార్జున అక్కినేని, సమంతా అక్కినేని, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, రావు రమేష్,  నరేష్,
కథ
: రంజిత్ శంకర్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : ఆర్. దివాకరన్
బ్యానర్ : పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్
నిర్మాత : ప్రసాద్ వి. పొట్లూరి
విడుదల అక్టోబర్ 13, 2017

***
     క్కినేని నాగార్జున చాలా రోజులకి వచ్చారు. తెలుగులో ఒక కొత్త రకం పాత్రకి ఇన్స్ పైర్ అయి ఈ  ‘హార్రర్ కామెడీ’ కి స్టార్ మూవీ హోదా కల్పిస్తూ సమంతాతో నటిస్తూ వచ్చారు. ‘రాజుగారి గది’ తీసిన దర్శకుడు ఓంకార్ ఈసారి కూడా హార్రర్ కామెడీ అభిప్రాయం కల్గిస్తూ,  ‘రాజుగారి గది -2’ అంటూ సీక్వెల్ కాని సీక్వెల్ తీశారు. హార్రర్ కామెడీల సీజన్ ఎంతకీ ముగియడం లేదు. ఈసారి స్టార్లే నటించడంతో కొత్త గ్లామర్ వచ్చి ప్రేక్షకులకి కూడా వెరైటీయే. ఇంత ఆకర్షణీయమైన ప్యాకేజిగా కన్పిస్తున్న ఇందులో వున్న విష యమేమిటి? ఎంతవరకు ఒక తేడా గల వినోదాన్నిచ్చారు? ఒకసారి చూద్దాం...

కథ 
      అశ్విన్, కిషోర్, ప్రవీణ్ ( అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్) అనే ముగ్గురు క్లాస్ మేట్స్ ఒక  రిసార్ట్ ప్రారంభిస్తారు. అక్కడ సుహానిసా (సీరత్ కపూర్) వచ్చి బస చేస్తుంది. కిషోర్, ప్రవీణ్ లు ఆమె వెంట పడుతూంటారు. ఆమె అమ్మాయి కాదనీ, ఆత్మ అనీ తెలుసుకుని భయపడతారు. ఇది అశ్విన్ నమ్మడు. ఒకరోజు అశ్విన్  కూడా నమ్మే అనుభవం ఎదురవుతుంది. దీంతో చర్చి ఫాదర్ (నరేష్) ని సంప్రదిస్తారు.  ఆయన వచ్చి ఆత్మని వెళ్ళ గొట్టడం తన వల్ల కాక రుద్ర (నాగార్జున) ని రికమెండ్ చేస్తాడు. రుద్ర ఒక మెంటలిస్టు. మనోనేత్రంతో చూసి కేసులు పరిష్కరిస్తూంటాడు. ఈయన వచ్చి సుహానిసా ఆత్మ కాదని,  ఆమెలోకి వేరే అమ్మాయి ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుని, ఆ అమ్మాయెవరో  తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అమృత (సమంత) అనే అమ్మాయి గురించి తెలుస్తుంది. ఎవరీ అమృత? ఎందుకని ఈమె చనిపోయి ఆత్మ అయింది? ఏం అన్యాయం జరిగింది? ఇప్పుడేం కోరుకుంటోంది?... ఇవి తెలియజేస్తూ సాగేదే మిగతా కథ.

ఎలావుంది కథ? 
      ఇది కథ  కాదు, గాథ.  2016 లో మలయాళం లో విడుదలైన ‘ప్రేతం’ రీమేక్ ఇది. మలయాళంలో పెద్దగా ఆడలేదు. హార్రర్ కంటే ఎమోషనల్ డ్రామా ఎక్కువై,  అదీ నిలబడని సందేశాలతో ముగియడం వల్ల. తెలుగులో యథాతధంగా తీశారు. అభ్యంతరకర వీడియోలు తీసి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే సంస్కృతిని  చూపించారు. కానీ కథా ప్రయోజనం కన్పించదు,  గాథ కాబట్టి.  ఇలాటి పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలో  ఆపరేటింగ్ పార్ట్ చూపించకుండా, గాథ కుండే లక్షణాలకి తగ్గట్టు ఒదార్పులతో సరిపెట్టారు. కలియుగం యాక్షన్లో వున్నప్పుడు ఓదార్పులతో పనిజరగదు, అది ఇంకింత సెల్ఫ్ పిటీని పెంచుతుంది. బర్నింగ్ ఇష్యూలకి గాథలు పనికిరావు. ఇందుకు ఉద్దేశించిన పాత్ర కూడా అయోమయంగా వుంది . ప్రేక్షకుల  నుంచి అయ్యో పాపమనే సానుభూతిని రాబట్టుకోవడమే గాథ చేసే పని. ఇది కూడా ఇదే చేసింది, సమస్యకి పరిష్కారం మాత్రం లభించదు. చెబుతున్నది కథ అని పొరబడుతూ గాథ చెప్పడం వల్ల ఈ పరిస్థితి. పైగా టైటిల్ కీ ఈ గాథకీ సంబంధం కూడా లేదు.

ఎవరెలా చేశారు
     నాగార్జున పోషించిన మెంటలిస్టు  రుద్ర పాత్ర 40 వ నిమిషంలో వస్తుంది. ఆయన గ్లామర్ ని కాపాడుకుంటూ స్టన్నింగ్ కాస్ట్యూమ్స్ తో అట్టహాసంగా  కన్పిస్తారు. పారా సైకాలజిస్టు పాత్ర పాతబడిందనేమో,   మెంటలిస్టు పాత్రని మలయాళం లోంచి అలాగే దించారు. మైండ్ రీడింగ్ చేసి వినోదపర్చే మెంటలిస్టులు నిజానికి మెజీషియన్ వృత్తిలో వుంటారు. వీళ్ళని హార్రర్ - క్రైం నవలల్లో, సినిమాల్లో దించేసి కేసుల్ని పరిష్కరించే  కాల్పనిక పాత్రలుగా మార్చేశారు విదేశాల్లో. దేశీయంగా మొదటిసారి మలయాళ ‘ప్రేతం’ లో దీన్ని ప్రవేశపెట్టారు. 
ఈ పాత్రలో నాగార్జున మరీ రజనీకాంత్ ‘చంద్ర ముఖి’ పారా సైకాలజిస్టు లాంటి పవర్ఫుల్ పాత్ర పోషించలేదు.  కారణం తను తలపడే ఆత్మ అంత పవర్ఫుల్ కాకపోవడం వల్ల. సాత్విక నటనతోనే ఆత్మకీ – అన్యాయం చేసిన పాత్రకీ సమన్వయకర్తగా నటించి ఇద్దరికీ నచ్చజెప్పి ముగించారు. అదే అన్యాయం చేసిన పాత్ర మగపాత్ర అయితే అంతు  చూసేవారేమో. నీ ప్రాణం తీసే శత్రువైనా సరే క్షమించడంలో  గొప్పదనముందనే పాత్ర,  నేర పరిశోధకుడి పాత్ర ఎలా అవుతుందనేది తర్వాతి సంగతి. 

     ఇక సమంత పోషించిన అమృత పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేపాత్ర. ఈమె లా కోర్సు లో టాపర్. కేసుల దర్యాప్తులో  ఎవరు నేరం చేశారు, ఎందుకు చేశారు, ఏం ప్రయోజనం పొందారు - అనే మూడు ప్రశ్నలేసుకోవడం ముఖ్యమని నమ్ముతుంది. కానీ తననెవరో అభ్యంతరకర వీడియో తీశారని అవమానం ఫీలై ఆత్మహత్య చేసేసుకుంటుంది! 

     పాత్రని పరిచయం చేసిన దానికీ,  దాని ప్రవర్తనకీ పొంతన కనపడదు. ఇది కథలో పాత్రయితే పోరాడేది న్యాయవాద స్పిరిట్ తో. పోరాడి తనలాంటి బాధితులకి ఆదర్శంగా నిలబడేది.  ఇది గాథలో పాత్ర కావడం వల్ల పాసివ్ గా ట్రాజడీ పాలబడింది. ఇలా చేయాలన్నా కూడా ఆమెని లా కోర్సులో టాపర్ గా బిల్డప్ ఇవ్వకూడదు, సగటు అమాయక అమ్మాయిగా చిత్రిస్తే పాత్ర నడకకి అడ్డుపడదు. 

     చనిపోయాక తనకి ఎవరు అన్యాయం తలపెట్టారో తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి మనుషులమీదే ఆధారపడుతుంది. ఆత్మకి తెలియకపోవడ మేమిటి? అన్నీ తెలుస్తాయి. తెలుసుకోమని మనుషుల్ని పురమాయించడమేమిటి?  ఇలా ఆత్మ పాత్ర చిత్రణ  కూడా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆషామాషీగా పాసివ్ గా మారింది. ఆత్మలు పాసివ్ గా వుంటాయా? వుంటే హార్రర్ సినిమాలా వుంటుందా? ఇందుకే ఇది హార్రర్ సినిమాలా లేదు. 

     అమృత తండ్రి పాత్రలో టీచర్ గా రావురమేష్ మరో బలహీన  పాత్ర. బయట ఉపాధ్యాయుడిగా గొప్పపేరు. ఇంట్లో కూతురికి - నీ ప్రాణం తీసే శత్రువైనా సరే క్షమించడంలో  గొప్పదనముందనే సూక్తి నేర్పుతాడు. ఈ సూక్తిని ఆమె మర్చిపోయి ఆత్మగా ప్రతీకారం తీర్చుకోబోతుంది. మెంటలిస్టు గుర్తుచేస్తేనే తగ్గుతుంది. ఈమె తండ్రి ఎంత గొప్ప ఉపాధ్యాయుడైతేనేం, సమస్యల్ని  ఎదుర్కొనే ధైర్యం కూతురికి నేర్పలేకపోయాడు. కూతురి వీడియో వూరూవాడా అయి లోకం దెప్పిపొడుస్తోందని గుండాగి చనిపోతాడు. నా కూతురిని ఎవడ్రా అనేది - అని ఆ కూతురికి బాసటగా నిలబడాల్సింది పోయి!  ఎందుకిలా అంటే ఇది గాథలో పాత్ర కాబట్టి.  గాథల్లో బాధిత పాత్రలే తప్ప పోరాడే పాత్రలుండవు. 

          హీరోలు కాని హీరోలుగా సినిమాని ప్రారంభించే
అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లు షకలక శంకర్ తో కలిసి ఫస్టాఫ్ అంతా ఆత్మలతో టెంప్లెట్ కామెడీలే చేసుకుంటూ ఎంటర్ టైన్ చేస్తారు. సీరత్ కపూర్ తో కొన్ని సేల్ఫీ సీన్లు నవ్విస్తాయి. సీరత్ కపూర్ పొట్టి నిక్కర్లు తప్ప ఇంకోటి వేసుకోనని శపథం చేసినట్టు  స్కిన్ షో చేసుకుంటూ తిరుగుతుంటుంది. 

     తమన్ పాటలు బిట్ సాంగ్స్ గానే వచ్చిపోతాయి. సినిమాలో హార్రర్ అనేది లేకపోయినా ఆయన హార్రర్ ఫీలైపోతూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. దివాకరన్ కెమెరా పనితనం ఓకే. గ్రాఫిక్స్ కూడా బావున్నాయి. అబ్బూరి రవి మాటలు ఫస్టాఫ్ కామెడీ కి, సెకండాఫ్ విషాదానికీ సరిపోయేట్టే  వున్నాయి. పివిపి ప్రొడక్షన్ విలువలు స్థాయికి తగ్గట్టున్నాయి. 

చివరికేమిటి 
      ‘రాజుగారి గది’ తీసిన దర్శకుడు  ఓంకార్ మలయాళ రీమేక్ ని  విషయంతో సంబంధం లేకుండా ‘రాజుగారి గది -2’ టైటిల్ తో విడుదల చేశారు. పైన చెప్పుకున్నట్టు భావోద్వేగాల చింతనే తప్ప చివరికి ఏం  తేల్చామనే విషయం పట్టించుకోలేదు. ఇందుకే దీనికో స్క్రీన్ ప్లే లేకుండా పోయింది. గాథలకి స్ట్రక్చర్ వుండదు. అందుకనే ఫస్టాఫ్ లో గాథ మొదలవలేదు. కథయితే మొదలై వుండేదేమో. ఫస్టాఫ్ దెయ్యం కామెడీలతో గడిపేశారు. 40 వ నిమిషంలో నాగార్జున పాత్ర వచ్చినా దాని పరిచయ ఎపిసోడ్ ఒకటి సాగి, ఇంటర్వెల్ లో సమంతా ఆత్మకి  ఎదురుకావడంతో అర్ధోక్తిలో ఆగుతుంది. 

     సెకండాఫ్ ఇరవయ్యో నిమిషం లో అసలు గాథే మిటో తెలుస్తుంది సమంతా పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో. ఇక గాథ మొదలవుతుంది. ఇదే కథ అయి ఇప్పుడు ప్రారంభమై వుంటే,  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యేది. గాథ కావడం వల్ల సంఘర్షణ లేదు. సంఘర్షణ లేకపోతే కథ అవదు. ఇక్కడ గాథతో ఇంకోటేం జరిగిందంటే, ఎండ్ సస్పెన్స్ బారిన పడింది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత దాదాపు ముగింపు వరకూ వీడియో ఎవరు తీశారనే దర్యాప్తు తోనే సాగుతుంది. వీడియో తీసిన పాత్ర చిట్టచివర్లో తెలిసి ఆ పాత్ర కూడా డిఫెన్స్ లో పడడంతో సంఘర్షణకి తావే లేకుండా పోయింది. ఇక నాగార్జున కౌన్సెలింగ్ మొదలవుతుంది.

     మహేష్ భట్ ‘రాజ్’  కోవలో కథ చేసి ఓంకార్ దీన్ని పవర్ఫుల్ గా నిలబెట్టాల్సింది. అప్పుడు థ్రిల్, హార్రర్, సస్పెన్స్, అన్ని ఎమోషన్సూ కలగలిసి సమస్యతో సంఘర్షణతో, ఆర్గ్యుమెంట్ తో ఒక సమగ్ర ఆవిష్కరణయేది. 

     చివరిగా, సమంతా పాత్ర అదేదో బరితెగించి తనే వీడియో దిగి వైరల్ చేసినట్టు- ఆమె చుట్టూ పాత్రలు అలా తిడతాయేమిటి? తండ్రి శవం దగ్గర కూడా,  చెడ బుట్టిందని అలా శాపాలు పెడతారేమిటి? చూపించే భావోద్వేగాలకైనా లాజిక్ అవసరం లేదా? సమంతాది నెగెటివ్ పాత్రా?


-సికిందర్ 
https://www.cinemabazaar.in