రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 18, 2019

900 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు


        మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులకి సంబంధించి స్ట్రక్చర్ వ్యాసం సాంప్రదాయ దృశ్యం’ తర్వాత ఇప్పుడు ‘ఆధునిక దృశ్యం’ ఎలా వుంటుందో చూద్దాం. సాంప్రదాయ కథలు, ఆధునిక కథలు ... సాంప్రదాయ కథలు ఓల్డ్ స్కూల్ డ్రామాలుగా వుండొచ్చు గానీ, ఆధునిక కథలు రియలిస్టిక్ కథలుగా వుంటేనే యూత్ కి కనెక్ట్ అయ్యేది. సినిమా మార్కెట్ ప్రధానంగా యూత్ దే. ఈ యూత్ కాలేజీ, ఆ పైన జాబ్ మార్కెట్లోకి ప్రవేశించిన ఏజి గ్రూప్ యూతే తప్ప; హైస్కూల్, అంతకి తక్కువ టీన్ - ప్రీటీన్ పిల్లకాయలు కాదు. మేమిలాటి పిల్లకాయలుగా వున్నప్పుడే పైసలెత్తుకు పోయి శుభ్రంగా సినిమాలు చూసేసే వాళ్ళం - తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అప్పుడప్పుడు అరవ సినిమాలూ వదిలిపెట్టకుండా. వారానికో రోజు స్కూలు పిల్లలకోసం కన్సెషన్ షోలు వేస్తే థియేటర్ నిండా పిల్లలే. అవి పిల్లల సినిమాలు కూడా కావు, ప్రదర్శించే రెగ్యులర్ సినిమాలే వారానికో రోజు స్కూలు పిల్లలకి. అలా అన్ని జానర్ల సినిమాలూ పిల్లకాయలప్పుడే అలవాటయ్యాయి. ఏ జానరూ కాని అజానరీయ అమర్యాదకర లపాకీ సినిమా లొచ్చినా అవీ అడ్డంగా ఆరగించడమే. అంత విశేష ‘జ్ఞాన సంపద’ సొంతమన్నమాట. సినిమాలు చూసి అట్ట ముక్కల కిరీటాలు పెట్టుకుని, కర్రల్ని కత్తులుగా చేసుకుని, గడ్డి మేటుల్లో ఫైటింగు దృశ్యాలు కూడా రక్తి కట్టించే వాళ్ళం. ఇంకా చెప్పాలంటే బజార్లలో ఫిలిం ముక్కలు అమ్మేవాళ్ళు. అట్ట పెట్టెలకి రంధ్రం చేసి, అందులో బల్బు పెట్టి, ఎదురుగా భూతద్దం పెట్టి, ఫిలిం ముక్కల్ని గోడల మీద ‘సినిమాలు’ గా బ్రైట్ గా ఫోకస్ చేసే టెక్నాలజీని కూడా వాడేశాం. ఎనిమిదో తరగతప్పుడే యాక్షన్ తో కూడిన ఏవో పిచ్చి పిచ్చి నాటకాలు రాయడం, బొమ్మల కథలు వేయడం వగైరా కార్యకలాపాలు అదనంగా నిర్వహించాం. ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో, అంత సాహిత్యమూ చదివే వాళ్ళం. ఈ పరిస్థితి మారింది. థియేటర్ల బుకింగ్స్ దగ్గర పిల్లలు కన్పించడం లేదు. పట్టణాల్లో, పల్లెటూళ్ళల్లో కూడా. వాళ్ళు వస్తే గిస్తే ఎప్పుడో పేరెంట్స్ తో తప్ప రావడం లేదు.  

       
కాబట్టి ఒకప్పటి లాగా ఏది పడితే అది, ఎలా బడితే అలా తీసి చూపించేందుకు ప్రేక్షక లోకంలో మాలాగా అమాయక - వెర్రి మాలోకం బాలలోకం లేదిప్పుడు. కాలేజీ ఈడు నుంచే ప్రేక్షక వర్గం ప్రారంభమవుతోంది. ఈ వయసుకి కాలీన స్పృహ వుంటుంది. గ్లోబల్ గా చూస్తున్న ఆధునికత, వాస్తవికత, వర్తమాన స్పృహలతో ఒక యూత్ అప్పీల్ ని డెవలప్ చేసుకుంటారు. ఈ వయసు నుంచీ ఇలా ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన కాలేజీ - జాబ్ మార్కెట్ యూత్ వరకే రెగ్యులర్ ప్రేక్షక లోకంగా లెక్కేసుకోవాలి. మళ్ళీ ఈ యువ ప్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులు సినిమాలకి రాని పరిస్థితి కూడా వుంది. ఎప్పుడో ఎంతో టాక్ వస్తే తప్ప చిన్న హీరోల సినిమాలకి యువతులు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలూ కట్, యువతులూ కట్. మిగిలింది కొత్త మీసాల మస్తీ యూతే. పెద్ద స్టార్ సినిమాలకి ఎలాగూ కుటుంబాలు సహా అందరూ తరలి వస్తారు. ఒకవేళ యువ ప్రేక్షకుల్లో యువతుల్నీ లెక్కేసుకున్నా ‘వెంకీ మామ’ లాంటి దాన్లో వెంకటేష్, నాగ చైత్యనలని యూత్ అప్పీల్ లేని ఓల్డ్ స్కూల్ డ్రామాతో చూపించలేరు. రియలిస్టిక్ గా రావాల్సిందే. పెద్ద హీరోల మూస సినిమాలకి టీఆర్పీరాక, యాడ్స్ కూడా తగ్గిపోతున్నాయని, అందుకని ఇకపైన భారీ మొత్తాలు వెచ్చించి వీటి శాటిలైట్ హక్కులు కొనేది లేదని చెప్పే స్థితికి ఛానెల్స్ కూడా వచ్చేశాయి. ఇక ప్రేమ సినిమాలే తీసినప్పుడు అవెంత యూత్ అప్పీల్ తో రియలిస్టిక్ గా వుండాలి? వర్తమాన కాలం ప్రతిబింబిస్తేనే యూత్ అప్పీల్. ఇక ఆధునిక ‘కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ తీస్తే ఇంకెంత రియలిస్టిక్ గా, వర్తమాన యూత్ జీవితం ప్రతిబింబిస్తూ వుండాలి?

విశాలి కథ
        కనుక కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఆధునిక దృశ్యం చూసినప్పుడు, ఇది కూడా త్రీయాక్ట్ స్ట్రక్చర్ లోనే వుంటుంది. కాకపోతే విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించి వుంటుంది. రిపీట్ - విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించే  వుంటుంది. మూస లవ్వు స్టోరీ తీసి కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే నవ్విపోతారు. ఆధునిక కమింగ్ ఆఫ్ ఏజ్ కి ఉదాహరణ -  విశాలి అనే టీనేజర్ వుందనుకుందాం, ఆమెకి పద్నాల్గేళ్ళు. స్కూల్లో పదో తరగతి చదువుకుంటోంది. చదువు తప్ప ఆమెకేమీ తెలీదు. ఆమె పుట్టిన రోజుకి పేరెంట్స్ ఒక లాప్ టాప్ కొనిచ్చారు. అప్పుడామె చాలా తెలుసుకోవడం మొదలెట్టింది. ఇక ఏదో స్వతంత్రం, ఏదో వ్యక్తిత్వం తనకొచ్చేసినట్టూ, తను ఎదిగిపోయినట్టూ ఫీలింగ్ వచ్చేసింది. అలా ఆన్ లైన్లో ఆమెకి విద్యుత్ పరిచయమయ్యాడు. వెంటనే కనెక్ట్ అయిపోయింది. చాలా ఆశ్చర్యమేసింది. తానింతవరకూ అబ్బాయిలవైపు చూడాలంటేనే, వాళ్లతో మాట్లాడాలంటేనే బిడియపడి దూరంగా వుండేది. అబ్బాయిలెవరూ తనకి స్నేహితులుగా లేరు. అలాటిది ఆన్ లైన్లో ఇంత చొరవ వచ్చేసింది. 


        విద్యుత్ తనకి పదహారేళ్ళని చాటింగ్ లో చెప్పాడు. విశాలికి ఉత్సాహమొచ్చింది. తోచిన కబుర్లాడింది. క్రమంగా చాటింగ్ నుంచి నేరుగా మొబైల్ మెసేజిలకి కమ్యూనికేషన్ మారింది. అప్పుడతను తనకి ఇరవై ఏళ్లని చెప్పాడు. ఏం ఫర్వాలేదనుకుంది. మళ్ళీ పాతికేళ్ళని మెసేజి కొట్టాడు. నో ప్రాబ్లమనుకుంది. ఒకబ్బాయితో ఇలా కమ్యూనికేట్ అవడమే గొప్పనుకుంది. అంతేకాదు, తనలో ఇంకేదో ఫీలింగ్స్ మొదలవడం గమనించింది. ఆ ఫీలింగ్స్ ప్రేమనుకుంది. 

        అలా రెండు నెలలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తో గడిపాక, కలుద్దామన్నాడు. మాల్ లో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. విశాలి మాల్ కెళ్ళి అతడితో ముఖాముఖీ భేటీ కోసం వెయిట్ చేస్తోంది. అతనొచ్చాడు. చూసి షాకైంది. ముప్పై ఏళ్ళు పైనే వుంటాడు. అఫెండ్ అయింది. అతను అద్భుతంగా మాటాడి ఆమెని ఆకట్టుకుని హోటల్ గదికి తీసికెళ్ళాడు. ఆమె కోసం కొనితెచ్చిన డ్రెస్సూ, లోదుస్తులూ ఆమెకి తొడిగిస్తూ ఫోటోలు తీశాడు. ఆమెని కిస్ చేయబోతూంటే ఆగమంది. ఆగకుండా ఆమెని బెడ్ మీదికి లాగి  మీద పడ్డాడు...(ప్లాట్ పాయింట్ వన్)


       ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం : ఇది బిగినింగ్ విభాగపు కథనం. ఇందులో బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : టీనేజర్ విశాలికి ఆ వయసులో అపరిచితుడితో రిలేషన్ షిప్ అనే తొందరపాటు నిర్ణయం తీసుకున్న అప్రియ వాతావరణం, 2. పాత్రల పరిచయం : స్కూల్లో చదువుతున్న విశాలితో బాటు, మధ్య తరగతికి చెందిన ఆమె తల్లిదండ్రులు, విద్యుత్ అనే ఇంకా వివరాలు తెలీని ఆగంతకుడులతో, ఈ బిగినింగ్ విభాగాన్ని నడిపేందుకు అవసరమైన పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన : అంతవరకూ అబ్బాయిలంటే బెరుకు వున్న విశాలికి, పేరెంట్స్ లాప్ టాప్ కొనివ్వడంతో అపరిచితుడితో ఉత్సాహపడి ప్రేమలో పడ్డం, అతను తడవకో వయసు చెబుతూ మభ్యపెడుతున్నా ఆంతర్యం గ్రహించక పోవడం, ఆన్ లైన్ వల్ల తానెంతో స్వతంత్రంగా ఎదిగిపోయినట్టు భావించుకుని, తల్లిదండ్రులనుంచి ప్రైవసీని మెయింటెయిన్ చేయడం, అతను కలుద్దామంటే గుడ్డిగా వెళ్లి కలుసుకోవడం, తన కంటే చాలా పెద్దవాడైన అతణ్ణి చూసి షాకవడం, అతడి తియ్యటి మాటలకి పడిపోయి హోటల్ కెళ్ళి పోవడం, 4. సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్ -1) : అతడి మీద ప్రేమ పెరిగిపోయి హోటల్ గది కెళ్ళి పోయిన ఆమె, తన దుస్తులు మారుస్తున్నా, తనని ఫోటోలు తీస్తున్నా, అప్రమత్తం కాక అతడి కుట్రకి బలై పోవడం. 

         
కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీ లక్షణాల ప్రకారం, ఇందులో విశాలి పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల ఆమె అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ఈ బిగినింగ్ విభాగంలో జరగాలి. జానర్ మర్యాదలననుసారం పాత్ర మానసికంగా అస్తిరత్వం లోంచి స్థిరత్వం లోకి చేసే టీనేజీ కథా ప్రయాణానికి బీజాలు ఈ బిగినింగ్ విభాగంలోనే పడతాయి. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఉన్నదాన్లోంచి స్వేచ్ఛ కోరుకోవడంతో వస్తుంది. అస్థిరత్వానికి మూలం స్వేచ్ఛా కాంక్ష. స్వేచ్ఛా కాంక్ష ఎందుకు రగుల్కొంటుంది? వయసొచ్చింది కాబట్టి ఉన్నట్టుండి అవసరాలు పెరిగిపోయాయని భావించుకోవడం వల్ల. ఇదంతా విశాలి పాత్ర పరిచయంలో జరిగాయి. 

        ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. ఇంటర్వూలో వంకర సమాధానాలు చెప్తే లేచెళ్లి పొమ్మంటాడు ఆఫీసర్. మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ గా ఏదైనా ఉనికిలోకి రావాలంటే ఆలోచన నిర్దుష్టంగా వుండాలి. 

        కనుక విశాలితో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన పై చట్రంలో జరగాలి. జరిగింది కూడా. తను లోపల అనుకుంటున్న దానికీ బయట జరుగుతున్న దానికీ పొంతన లేదు. లోపల ప్రేమ అనుకుంటోంది, బయట కుట్ర జరుగుతోంది. ఒక్కో అడుగూ కుట్ర కేసే వేస్తోంది. మొదటి సారిగా అతణ్ణి చూసినప్పుడు, అతడి అసలు వయసు ముప్పై అని తెలిసినప్పుడు, భౌతిక ప్రపంచం అర్ధమై, ఆ భౌతిక ప్రపంచం తిరస్కరించడం మొదలెట్టింది వయోభేదం రూపంలో. అస్థిర మనస్తత్వ పరిణామం. ఉత్తుత్తి జీవిత లక్ష్యపు  ప్రమాదం. ఆ వయసులో ఆమెది ప్రేమే అయితే ఇలా చెయ్యదు. ఆ వయసులో వుండేది ఆకర్షణే కాబట్టి ఇలా చేసేసుకుంటూ వెళ్లి పోయింది. ఆకర్షణని ప్రేమనుకుంది. భౌతిక ప్రపంచం తిరస్కరించినా ఆ ఆకర్షణ వికర్షణగా మారకుండా అపరిపక్వ ప్రేమే అడ్డుపడింది. అందుకని అతడి వల్లో పూర్తిగా పడిపోయింది. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొలిక్కిచ్చి,  కన్యాత్వాన్ని పోగొట్టుకోవడంతో సమస్య ఏర్పాటయింది ప్లాట్ పాయింట్ వన్ లో. 

           ఇలా సమస్య కూడా ఏర్పాటయ్యాక, తర్వాత వచ్చే టూల్ ‘గోల్’ ఏర్పాటు గురించి. ఇప్పుడు విశాలి గోల్ ఏమిటి? ఇది మానభంగం అనుకునే వయసు కాదు, అతడి ప్రేమే అనుకునే వయసు. అందుకని ఈ ‘ప్రేమ’ ని కొనసాగించడమే ఆమె గోల్. 

        ఎప్పుడైనా కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో పాత్ర గోల్ మూర్ఖంగానే వుంటుంది. ఆ వయసులో జీవితమంటే ఏమిటో తెలీదు కాబట్టి. ఇలాటి సాంప్రదాయ కథలో కూడా హీరో గోల్ మూర్ఖంగానే వున్నట్టు గత వ్యాసంలో గమనించాం. పొరపాటున కూడా పాజిటివ్ గోల్ ఇవ్వకూడదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకి అపరిపక్వ పాత్ర ప్రయాణం కాబట్టి.

        మరి ఈ బలహీన గోల్ కాని గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1. కోరిక : విశాలి కోరిక ఇక పెళ్లి చేసుకుంటాడనే కావొచ్చు. 2. పణం : కన్యాత్వాన్ని పణంగా పెట్టేసింది, అది రమ్మన్నా తిరిగిరాదు, ఎట్టి పరిస్థితిలో అతడితో పెళ్లి జరగాల్సిందే. 3. పరిణామాల హెచ్చరిక : ప్రెగ్నెన్సీ ప్రమాదం పొంచి వుంది. 4. ఎమోషన్ : ఒకవైపు కన్యాత్వాన్ని పోగొట్టుకుని, ఇంకోవైపు పెళ్లవుతుందో లేదోనన్న సందిగ్ధావస్థ. దీన్నెలా హేండిల్ చేస్తుందో తెలీదు. పైగా పద్నాల్గేళ్ళకే పెళ్ళేమిటి? రెండింతల పైగా వయసున్న వాడితో? 

        ఇలా బిగినింగ్ బిజినెస్ లో నాల్గు టూల్స్ ని, నాల్గు గోల్ ఎలిమెంట్స్ నీ  సెట్ చేసుకున్నాక ముందు మిడిల్ కథేమిటో చూద్దాం...

సికిందర్