రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జూన్ 2024, గురువారం

1442 : రివ్యూ!


రచన- దర్శకత్వం : నాగ్ అశ్విన్
తారాగణం : ప్రభాస్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, దిశా పటానీ, శోభన, అన్నాబెన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శాశ్వత చటర్జీ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం : జోర్డీ స్టోజిలికోవిచ్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : వైజయంతీ మూవీస్
నిర్మాతలు : అశ్వనీ దత్, ప్రియాంకా దత్, స్వప్నా దత్
విడుదల : 27 జూన్, 2024

కథ

ఈ కథ మహాభారత కాలంలో  కురుక్షేత్ర యుద్ధంతో ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడు (విజయ్ దేవరకొండ) విజయవంతంగా ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటే, అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) అలా చేయలేకపోతాడు. పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అతను పాండవ స్త్రీల గర్భాల మీదకి  దారి మళ్ళిస్తాడు. అది గర్భంతో వున్న అర్జునుడి  కోడలు ఉత్తర కడుపుని ఛేదిస్తుంది.  దాంతో శ్రీకృష్ణుడు ఆమె గర్భంలోని మృత శిశువుని బతికించి, అశ్వత్థామని మరణం లేకుండా నరకం అనుభవించమని శపిస్తాడు. భవిష్యత్తులో ఆరువేల సంవత్సరాల నాడు పుట్టబోయే విష్ణువవతారం కల్కిని కాపాడాల్సిన బాధ్యత అతడి మీదేస్తాడు. దాంతోనే అతడికి శాప విముక్తి లభిస్తుందంటాడు.

ఇప్పుడు ఆరువేల సంవత్సరాల తర్వాత 2898 లో కాశీలోని అరాచక (డిస్టోపియన్) రాజ్యంలో పాలకుడు సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే స్థావరాన్ని ఏర్పర్చుకుని వుంటాడు. అతనొక కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు సంతానోత్పత్తి లాబ్ ని సృష్టించుకుంటాడు. ఆ లాబ్ లో గర్భవతుల్ని బందీల్ని చేసి సీరం తీసి ప్రయోగాలు చేస్తూంటాడు. ఈ ప్రయోగాలకి సు - మేటి అలియాస్ సుమతి (దీపికా పదుకొనే) చిక్కుతుంది. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు కల్కి.
         
ఇది గ్రహించిన అశ్వత్థామ ఆమెని కాపాడుకునేందుకు పోరాటం ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో నేరస్థుల్ని పట్టుకుని  కాంప్లెక్స్ కి అప్పగించి పారితోషికాలు పొందే బౌంటీ హంటర్ భైరవ (ప్రభాస్) అనే షోకిల్లా రాయుడు
, సుమతీ గురించి తెలుసుకుని, ఆమెని పట్టుకుని కాంప్లెక్స్ కి అప్పగించే ప్రయత్నాలు మొదలెడతాడు.
         
దీంతో అశ్వత్థామకీ
, భైరవకీ మధ్య భీకర  ఘర్షణ ప్రారంభమవుతుంది. ఇప్పుడు సుమతీ కోసం వీళ్ళిద్దరి పోరాటంలో ఎవరు గెలిచారు?
అశ్వత్థామ, భైరవల మధ్య వున్న గత సంబంధమేమిటి? ఈ సంఘర్షణలో యాస్కిన్ తీసుకున్న కఠిన చర్యలేమిటి? అసలు సుమతీ ఎవరు? ఇవీ మిగతా భాగంలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

పురాణాన్ని ఆధునిక సైన్స్ ఫిక్షన్ తో మిక్స్ చేసి ఒక యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం చేసి నప్పుడు అందులో భావోద్వేగ బంధాన్ని మరిచారు. గర్భస్థ శిశువు కల్కి ప్రమాధంలో వుందన్న భక్తి భావం పాయింటు చుట్టూ తిరగాల్సిన ఈ మెగా బడ్జెట్ కమర్షియల్ కథని, చదును చేసి ఫీల్ లేకుండా చేశారు. ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే ఇలాటి పురాణ కథ భక్తిభావం ప్రవహిస్తూ స్పిరిచ్యువల్ థ్రిల్లర్ గా వుండాల్సింది- పురాణాన్ని వేరుగా, సైన్స్ ఫిక్షన్ ని వేరుగా చేసి చూపించారు. 
       
దీని మీద హాలీవుడ్ మార్వెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రభావం వుందనేది తెలిసిపోతూనే వుంది. అయితే మార్వెల్ యాక్షన్ థ్రిల్లర్లు స్పిరిచ్యువాలిటీతో సంబంధం లేనివి. వీటికి పూర్వం స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన
రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే యాక్షన్ మూవీ ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ థ్రిల్లర్ గా అంత హిట్టయింది. ఇందులో బైబిల్ కాలపు పురాతన వస్తువు (ఆర్క్) కోసం జర్మన్ నాజీలతో ఆర్కియాలజిస్టు హీరో పోరాటం వుంటుంది. చివరికి ఆ ఆర్క్ ని చేజిక్కించుకున్న నాజీలు మాడి మసై పోతారు.
       
ఆర్క్ ఎంత పవిత్రమైనదో
, గర్భస్థ శిశువు కల్కి కూడా అంతే పవిత్రమైనది. దీన్ని హైలైట్ చేస్తూ, దీని చుట్టూ భక్తి భావం వర్సెస్ ప్రమాదం అనే ద్వంద్వాలతో కూడిన సంఘర్షణగా చూపించి వుంటే -ఇది ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే బలమైన భావోద్వేగ బంధంతో వుండేది. దీన్ని వదిలేసి ఇతర పాత్రల కథలతో, పోరాటాలతో అధిక సమయం గడిపేయడంతో ప్రధాన కథకి, పాత్రలకీ స్పేస్ లేకుండా పోయింది. ఫస్టాఫ్ ప్రభాస్ నాల్గు సీన్లలో, సెకండాఫ్ ఏడు సీన్లలో మాత్రమే కనిపిస్తాడు! దీంతో కథకి  ఎమోషనల్ కనెక్ట్, స్పిరిచ్యువాలిటీ, ఆత్మిక దాహం వగైరా అంశాలు ఆవిరై పోయాయి.
       
గంటన్నర ఫస్టాఫ్
, గంటన్నర సెకండాఫ్ కథలో ఫస్టాఫ్ పెద్దగా ఏమీ జరగదు. కథ ప్రారంభం కాకుండా ఉపోద్ఘాతమే వస్తూంటుంది. సెకండాఫ్ దాదాపు గంట గడిచాక- అమితాబ్, ప్రభాస్ ల ఘర్షణకి బీజం పడ్డాకే కథ ప్రారంభమవుతుంది. అంటే సామాన్య భాషలో చెప్పుకుంటే ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. ఇలాటి భారీ కథలు కథగా వుండనవసరంలేదు, గాథగా వుండొచ్చు. అందుకే ఇలా వుంది. ఆ తర్వాత అరగంట సుమతి కోసం జరిగే పోరాటంతో వూపందుకుంటుంది గాథ.  క్లయిమాక్స్ యాక్షన్, గాథ ముగిస్తూ సీక్వెల్ కోసం ఇచ్చే ట్విస్టూ బావుంటాయి. ఒకలాంటి సంతృప్తితో బయటికి పోవచ్చు ప్రేక్షకులు.

నటనలు – సాంకేతికాలు

ప్రభాస్ బౌంటీ హంటర్ గా సరదా పాత్ర పోషించాడు. పూరీ జగన్నాథ్ తీసిన ఏక్ నిరంజన్ లోకూడా బౌంటీ హంటర్ పాత్ర నటించాడు. ఈసారి పాత్రకి బుజ్జి అనే రోబో తోడయ్యింది. ఈ రోబోతోనే కామెడీలు చేశాడు. సినిమా ప్రారంభమయిన అరగంటకి ఎంట్రీ ఇచ్చే ప్రభాస్ ఫస్టాఫ్ లో కథతో స్పర్శ లేకుండా ఇంకో మూడు సీన్లు నటించి, వీటిలో రెండు సీన్లు దిశాపటానీ తో రోమాన్సు  చేసి వెళ్ళిపోతాడు. సెకండాఫ్ లో కూడా ఇతర పాత్రల కథలు అడ్డు రావడంతో అప్పుడప్పుడు మాత్రమే కనిపించి, చివరి అరగంట పూర్తిగా యాక్షన్ లో వుంటాడు. ప్రభాస్ ఇలా పొదుపుగా కనిపించడం ఫ్యాన్స్ కి ఇబ్బందే.
       
సెకండాఫ్ లో వచ్చే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అధిక యాక్షన్ లో వుంటాడు. ఈ యాక్షన్లో వీరత్వంతో బాటు నిస్సహాయత
, పట్టుదల, త్యాగం మొదలైనవి తన స్కిల్స్ తో నటించి కట్టి పడేస్తాడు. అలాగే విలంగా రెండు సీన్లలో కన్పించే కమల్ హాసం కూడా. గర్భంలో కల్కిని మోస్తున్న కీలక పాత్రలో దీపికా పదుకొనే తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాత్రచిత్రణ వడం పెద్ద లోపం.
       
ఇక అతిధి పాత్రల్లో దుల్కర్ సల్మాన్
, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం క్లుప్తంగా కనిపిస్తారు. టెక్నికల్ గా విజువల్  వండర్ అని చెప్పుకోవచ్చు. యుద్ధాలు జరిగి ధ్వంసమైన భూమ్మీద ఏర్పాటయిన కొత్త జీవితాలు, ఆవాసాలు, వాహనాలు, ఆయుధాలు, ఇంగ్లీషు కలిసిన తెలుగు భాష- ఇలా ఒక భవిష్యద్దర్శనం చేస్తుంది సినిమా దృశ్య వైభవంతో.
        
సంతోష్ నారాయణన్ సంగీతం పెద్ద హైలైట్. జోర్డీ స్టోజిలికోవిచ్ ఛాయాగ్రహణం అంతర్జాతీయ ప్రమాణాలు గలది. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు కూర్పు పదునుగా వుంది. దర్శకుడు నాగ్ అశ్విన్,  నిర్మాతలు అశ్వనీ దత్, కుమార్తెలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు ఒక వెంటాడే డ్రామా తో కూడిన క్రియేషన్ ని అందించకపోయినా, పాన్ ఇండియాకి తెలుగు నుంచి ఒక గర్వకారణాన్ని మాత్రం అందించగలిగారు.
—సికిందర్