రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, డిసెంబర్ 2019, సోమవారం

894 : రైటర్స్ కార్నర్


      స్క్రిప్ట్ డాక్టర్, స్టోరీ ఎనలిస్ట్, స్టోరీ కన్సల్టెంట్...ఇలా కొన్ని పేర్లతో సినిమా కథా నిపుణులు వుంటారు. రచయితలు రాసిన స్క్రిప్టుల్ని మూల్యాంకన చేసి లోటుపాట్లు సూచిస్తూంటారు. హాలీవుడ్ కి చెందిన అలాటి ఒక స్క్రిప్ట్ డాక్టర్ మైకేల్ రే బ్రౌన్ రచయితలు ఈ నిపుణుల్లో ఏం చూసి సంప్రదించాలో చెబుతూ, మరికొన్ని స్క్రిప్టు సంబంధ టిప్స్  ఇచ్చారు. అవేమిటో చూద్దాం....

సినిమా పరిశ్రమ గురించి రచయితలు కొత్తగా తెలుసుకోవాల్సినవి ఏమిటంటారు?
భారీ సినిమాలు నిర్మించే స్టూడియోలకీ చిన్న చిన్న సినిమాలు తీసే నిర్మాతలకీ అంతరం పెరిగిపోతోంది. రచయితలు తమ స్క్రిప్టులు అంగీకారం పొందాలంటే ఈ అంతరాన్ని గుర్తించాలి. తాము ఎటువైపు వుండాలో నిర్ణయించుకోవాలి. ఈ అంతరానికి వేయగల్గిన వారధి ఒక్కటే : చిన్న సినిమాలు కూడా పాత్ర బలంగా వుంటే పెద్ద స్టార్స్ ని ఆకర్షిస్తాయి.

నేటి మార్కెట్లో రచయితలకి కన్సల్టెంట్ ల అవసరముందంటారా?
పూర్వం కంటే ఇప్పుడు ఏంతో పోటీ వుంది. సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. నిర్మాతలు ఎక్కువ రిస్కు తీసుకోదల్చుకోవడం లేదు. వాళ్ళు స్క్రిప్టులకి నో చెప్పే మూడ్ లోనే వుంటారు. ఓ ఆరు నెలల కాలంలో వాళ్ళు చదివిన స్క్రిప్టులకి మించి వుంటే తప్ప ఎస్ అనే ఛాన్సే లేదు. కథ ఫ్రెష్ గా లేకపోయినా, కథనం లోప రహితంగా లేకపోయినా, పాత్రలు కమర్షియల్ గా లేకపోయినా, స్క్రిప్టులు ఓకే చేసే అవకాశమే లేదు. ఇది తెలుసుకోక పోతే రచయిత కెరీర్ లో పురోగతి వుండదు. కన్సల్టెంట్ అవసరం తప్పని సరేమీ కాకపోవచ్చు, కానీ అతను నిర్మాతల దగ్గరికి వెళ్ళే ముందు రచయితకి చాలా విషయాలు క్లియర్ చేస్తాడు. స్క్రిప్టులో లోపాలు సహా. లోపాలున్న స్క్రిప్టుతో కెరీర్ ఎటూ వెళ్ళదు.

స్క్రిప్టుకి వుండాల్సిన యోగ్యతలేమిటంటారు?
క్వాలిటీ స్క్రిప్టుకి చాలా యోగ్యతలుంటాయి. స్క్రిప్టు రచన క్రాఫ్టే కాకుండా కళ కూడా. స్క్రిప్టు ఎంత బావుందన్నది మొదటి ఐదూ పదీ పేజీల్లోనే తెలిసిపోతుంది. ప్రాక్టికల్ ఆయా కథలకి వుండే సహజ శోభ ప్రారంభ పేజీలలోనే తెలిసిపోతుంది. ఐడియాలకి కొదవేం వుండదు. ఆ ఐడియాలని కథలుగా చెప్పడంలోనే వుంది అంతా. రచయితకి ఒక పాషన్ వుండొచ్చు, ఒరిజినల్ వాయిస్ వుండొచ్చు. కథ చెప్పే ప్రతిభాపాటవాలు లేకపోతే ఈ రెండూ వృధాయే. నావరకూ నేను చదవగానే వదల బుద్ధిగాని స్క్రిప్టుల కోసం చూస్తూంటాను.

కన్సల్టెంట్ ని సంప్రదించే ముందు రచయిత లేదా రచయిత్రి విధులేమిటో చెప్పండి.
రచయిత లేదా రచయిత్రి వీలయినంత సమర్ధవంతంగా స్క్రిప్టు రాసుకోవాలి. పైపైన రాసేసి కన్సల్టెంట్ చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. కన్సల్టెంట్ స్క్రిప్టులు రాసి పెడతాడని ఆశించ వద్దు. కన్సల్టెంట్ ఎంపిక చేసుకునే ముందు ఎనాలిసిస్ కి వాళ్ళ అప్రోచ్ ఏమిటో అడిగి తెలుసుకోవాలి. ఏవైనా శాంపిల్స్ వుంటే చూపించ మనాలి. వాళ్ళకి వెబ్ సైట్ వుంటే దాన్ని పరిశీలించాలి. ఎవరైనా స్క్రిప్టు కన్సల్టెంట్ అని చెప్పుకోవచ్చు. అసమర్ధులైన  స్క్రిప్ట్ కన్సల్టెంట్స్ కి కొదవ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి డబ్బు లాగేస్తారు. అసలు తమ స్క్రిప్టు విషయంలో తామేం కోరుకుంటున్నారో రచయిత / రచయిత్రి స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడు దాని మీద ఫోకస్ చేసి కన్సల్టెంట్ ఎనాలిసిస్ చేసుకోగల్గుతాడు. ప్రశ్నావళి తయారు చేసుకుని వెళ్తే ఇంకా మంచిది.

రైటర్స్ తిరస్కారానికి గురవడానికి ఓ మూడు ప్రధాన కారణాలు చెప్పండి.
ప్రధాన కారణం పకడ్బందీ కథనం లోపించడం. అంటే కాన్ఫ్లిక్ట్ లో స్పష్టత లేకపోవడం లేదా బలహీనంగా వుండడం. ప్రధాన పాత్రకి తగిన డైలమా లేకపోవడం. ప్రేక్షకుల్నికట్టి పడేసే ఒక బలమైన, ఏకీకృత పాయింటాఫ్ వ్యూ ప్రధాన పాత్రకి లేకపోవడం. ఏ పాత్రని కూడా మనం ఐడెంటిఫై చేసుకోలేకపోవడం. ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఆ పాత్రలకి ఏం జరిగినా మనకి ఆసక్తి వుండదు. కాన్ఫ్లిక్ట్ చాలా  కీలకం. రెండు పాత్రల్ని ఎదురెదురు పెట్టేసి కాన్ఫ్లిక్ట్ అంటే ప్రయోజనం వుండదు. ప్రధాన పాత్రకి దాని లక్ష్యం చుట్టూ వుండే కాన్ఫ్లిక్ట్ పైన రచయిత దృష్టి పెట్టకపోతే అప్పుడా కథ వీగిపోతుంది. నిర్మాతలకి ఆసక్తి నశించి రిజెక్ట్ అవుతుంది. నిర్మాతలు స్క్రీన్ ప్లే నాలెడ్జి తో వుంటారని మర్చి పోవద్దు...నేనెప్పుడూ రచయితల్ని వెనక్కి పంపను. వాళ్ళ స్క్రిప్టుల్ని ఎలా బాగు చేసి వాళ్ళకి తోడ్పడాలా అనే చూస్తాను. ఏ కథకి ఏ మందు వేస్తే ఆరోగ్యంగా వుంటుందో నాకు తెలుసు.

కన్సల్టెంట్ కుండాల్సిన మూడు గుణాలు చెప్పండి.
ఒకటి ఎక్స్ పీరియెన్స్ : ప్రొఫెషనల్ స్టోరీ ఎనలిస్టు అన్పించుకోవాలంటే అతడికి రియల్ వరల్డ్ అనుభవముండాలి. రెండు, ఇంటెగ్రిటీ : రైటర్స్ తో ఓపెన్ గా, నిజాయితీగా వుండాలి. వాళ్లకి బాధ కలిగినా సరే ఈ రెండో గుణం వదులుకోకూడదు. మూడు, క్రియేటివిటీ : రైటర్స్ తో కలిసి మేధో మధనం చేసే క్రియేటివ్ పవర్స్ వుండాలి. స్క్రిప్టుని శక్తివంతం చేయడానికి వలసిన క్రియేటివిటీ అంతా కలిగి వుండాలి.

అసమర్ధ కన్సల్టెంట్స్ ని గుర్తించడమెలా?
కొందరు కన్సల్టెంట్స్ ప్రొఫెసర్స్ లా బిహేవ్ చేస్తారు. వాళ్ళ పాండిత్య ప్రకర్షకి రచయితలు ఉత్తేజితు లవకపోగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏదో లెక్చర్ ఇస్తున్నట్టు వుంటుంది. వాళ్ళు చేసే స్క్రిప్టు మూల్యాంకన శాంపిల్స్ చదివితే సినిమాలు తీయడానికి పనికి రాని  థియరీలు రాసి వుంటాయి. రచయితలకి సినిమాలకి వర్తింపజేసుకునే ప్రాక్టికల్ సలహాలు కావాలి. అలాటి సలహాలిచ్చే వాళ్ళని ఎంపిక చేసుకోవాలి.

సినిమా రచయిత అవడం రాను రాను కష్టమైపోతున్న పరిస్థితులు తయారవుతున్నాయంటారా?
టాలెంట్ కి గుర్తింపు లభించాలంటే ఏడాది కేడాది కఠినతరమై పోతోంది. మునుపటికంటే ఇప్పుడు చాలా స్క్రిప్టు పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు గెలిచిన స్క్రిప్టుల్లో ఒకటీ అరా కూడా నిర్మాతలు పట్టించుకోవడం లేదు. నిర్మాతల చేత ఒక స్క్రిప్టు చదివించాలంటే తలప్రాణం తోక కోస్తోంది. ఏజెంట్లు కూడా చదవడం లేదు. అయినా మార్కెట్ మునుపటికన్నా పెరిగింది. ముఖ్యంగా టీవీ రంగం. ఒక సిరీస్ కి సింగిల్ స్క్రిప్ట్ పని పొందిన రచయిత ఆ ఆదాయంతోనూ జీవనం కొనసాగించ లేడు. అయినా ఆ అవకాశం ఒక విజయం కిందే లెక్క.

విజయవంతమైన సినిమాలు ఒకేలా వుంటాయని మనకి తెలిసిందే. అంటే విజయవంతమైన ఒక సినిమా చూసి దానిలాగే స్క్రిప్టు రాసుకోవడం మంచిదంటారా? కొత్త ట్విస్టు పెట్టి, లేదా లుక్ నే మార్చేసి?
స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు మొత్తంగా ఒక సరికొత్త కథ కోసం చూస్తున్నామంటారు. నిజానికి వాళ్ళు చూసేది కొత్త సీసాలో పాత సారా కోసమే. పూర్తి కొత్త కాన్సెప్ట్ వాళ్ళ మార్కెటింగ్ శాఖకి ప్రగతి నిరోధకంగా కన్పిస్తుంది. ఆ కాన్సెప్ట్ ని ఏ పాత ఉదాహరణతో పోల్చుకోలేక ఇది అమ్ముడు పోదని తేల్చేస్తారు. అమ్ముడు పోతుందని నమ్మాలంటే దానితో పోలింది ఇంకోటి కన్పించాలి. రోమాంటిక్ కామెడీలనే తీసుకుందాం. ఈ రోజుల్లో రోమాంటిక్ కామెడీలు రాయాలంటే చాలా కష్టమై పోతోంది. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ కి బహిర్గతంగా అవరోధాలు తగ్గిపోతున్నాయి. అందుకని తెలివైన రచయిత రోమాంటిక్ కామెడీల పాత ఫార్ములాకే కొత్త ట్విస్టు పెడతాడు. సాంప్రదాయంగా వుంటున్న హీరోయిన్ ని హీరో స్థానంలో పెట్టి, ఆమె చేత ఆమె ఏడ్చిన పాత సాంప్రదాయ ఏడ్పుల్ని అతడి చేత ఏడ్పిస్తాడు. రోల్ రివర్సల్ అన్నమాట. ఇప్పుడు ఆమె పీడకురాలు, అతను పీడనకి గురయ్యేవాడు.

మీరు ఏడు మేజర్ స్టూడియోల్లో స్టోరీ డిపార్ట్ మెంట్స్ లో పని చేశారు. ఇప్పుడు స్టోరీ కన్సల్టెంట్ గా ఏం తేడా గమనిస్తున్నారు?
ప్రొఫెషనల్ గా మారాను. స్టూడియోల్లో పని చేయడం వల్ల స్క్రిప్టుల్లో నిర్మాతలేం చూస్తారో ఎగ్జిక్యూటివ్ లేం చూస్తారో తెలుసుకోగలిగాను. కాబట్టి రైటర్స్ తో కన్సల్ట్ అవుతున్నప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో, ఏది కాదో చెప్పగల్గుతున్నాను.

అసమర్ధ కన్సల్టెంట్ కంటే ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఎలా గొప్పవాడో చెబుతారా?
కొందరు కన్సల్టెంట్లు ఏ కథయినా ఒకే ఫార్ములా చట్రంలో పెట్టి చూస్తారు. వాళ్ళ ఎనాలిసిస్ లు చదివితే, ఫలానా ఫార్ములాలో ఆ కథ పడిందా లేదా అనే విశ్లేషణే వుంటుంది. ఈ విశ్లేషణకి కన్సల్టెంటే అయివుండనవసరం లేదు. నా అప్రోచ్ ఎక్కువ సానుకూలంగా వుంటుంది. నా గైడింగ్ రూలు స్క్రిప్టు నా కాసక్తిగా వుండాలి. ప్రతీ కథా దానిదైన యూనిక్ డైనమిక్స్ తో వుంటుంది. నేను ప్రయత్నించే దేమిటంటే, థీమ్ ఐడెంటిఫై చేసి, కథా కథనాలు ఆ థీమ్ కి ఎంతవరకూ న్యాయం చేస్తున్నాయో విశ్లేషించడమే. దాన్ని బట్టి ఆ థీమ్ ని ఇంకెంత డ్రమెటిక్ గా చెప్పవచ్చో రచయితకి తెలియజేయడమే. నేను మెంటర్నీ, కొలాబరేటర్నీ అని భావిస్తాను. నా కన్సల్టేషన్ తో నా క్లయంట్స్ అనేక కొత్త, ప్రాక్టికల్ అయిడియాలతో తిరిగి వెళ్తారు. వాళ్ళు సక్సెస్ అయ్యారంటే నేనూ సక్సెస్ అయినట్టే.
*