రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 19, 2019

901 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు


      మిడిల్ కథ : స్కూల్లో విశాలి ముభావంగా వుండడంతో ఆమె బెస్ట్ ఫ్రెండ్ అర్పితకి ఆమె మీద అనుమానమేసింది. మాల్ లో ఆమె ఎవరో కొత్త వ్యక్తిని కలుసుకోగా చూసింది అర్పిత. ఆందోళనచెంది ప్రిన్సిపాల్ కి విషయం చెప్పేసింది. ప్రిన్సిపాల్ పోలీసులకి కంప్లెయింట్ చేశాడు. పోలీసులు వచ్చి విశాలిని తీసికెళ్లారు. ఆమె చేత విద్యుత్ కి కాల్ చేయించారు. లైన్లో కొస్తే ట్రేస్ చేయడానికి. కానీ విద్యుత్ నెంబర్ మార్చేసి అజ్ఞాతంలో కెళ్ళి పోయాడు. విశాలి తండ్రి ప్రైవేట్ డిటెక్టివ్ ని నియమించుకున్నాడు. ప్రైవేట్ డిటెక్టివ్ పోలీసుల దగ్గరున్న విశాలి చాటింగ్ డేటా తస్కరించి విద్యుత్ ఐపీ అడ్రెస్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. అదెక్కడో విదేశాల్లో వున్నట్టు మాస్క్ చేశాడు విద్యుత్. విశాలి తండ్రికి దిక్కు తోచలేదు. కూతురితో, భార్యతో సంబంధాలు చెడాయి. జరిగింది మర్చిపోదామని అంటున్నారు వాళ్ళు. యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్న విశాలి తండ్రి, తన మీద పడేస్తున్న టీనేజర్లని చెడగొట్టే వల్గర్ యాడ్స్ ఇక చెయ్యనని భీష్మించుకున్నాడు.

       
క విద్యుత్ ని వదిలి పెట్టకూడదని నిశ్చయించుకున్నాడు విశాలి తండ్రి. విశాలిని తన మిత్రుడైన డాక్టర్ని వెళ్లి కలవమని బలవంతంగా పంపించాడు. డాక్టర్ తో ఏదీ చెప్పడానికి ససేమిరా అంది విశాలి. విద్యుత్ పట్ల ప్రేమ చెప్పనీయడం లేదు. ఇది మర్చి పోతాననీ, అతనే వచ్చి పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్నాననీ చెప్పేసింది. 

        కొన్ని రోజుల తర్వాత స్కూలు కెళ్ళడం మొదలెట్టింది. బెస్ట్ ఫ్రెండ్ అర్పిత సారీ చెప్పడానికి ప్రయత్నించింది. అవకాశ మీయలేదు విశాలి. తనతో మాట్లాడవద్దని కరాఖండీగా చెప్పేసింది. తల్లిదండ్రులూ అర్పితా అందరూ కలిసి విద్యుత్ ని బద్నాం చేస్తున్నారని మండి పడసాగింది. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. విద్యుత్ దొరకలేదు. అయితే మరి కొంత మంది అమ్మాయిల్ని అతను వంచించినట్టు డీఎన్ఎ సాక్ష్యాలు రుజువు చేశాయి. విద్యుత్ మోసం చేసిన అమ్మాయిల ఫోటోల్నివిశాలి చూసింది. ఇప్పుడు నిజం తెలిసొచ్చింది. తనని విద్యుత్ మోసం చేశాడని డాక్టర్ కి చెప్పేసింది (ప్లాట్ పాయింట్ టూ)

      ఈ మిడిల్ వర్క్ షీట్ చూద్దాం :  పై కథనం గత వ్యాసంలో చూసిన బిగినింగ్ కథనానికి మిడిల్లో కొనసాగింపు. మిడిల్ విభాగమంటే ప్రధాన పాత్ర అనుకున్న గోల్ ని సాధించడానికి ప్రత్యర్ధితో చేసే పోరాటం. దీనికుండే టూల్స్ : 1. గోల్ కోసం ప్రత్యర్ధితో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే, 2. క్యారక్టర్ ఆర్క్, 3. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 4. సొల్యూషన్ (ప్లాట్ పాయింట్ -2). వీటన్నిటితో గోల్ ఎలిమెంట్స్ నాల్గింటినీ కలుపుకు వెళ్ళాలి. ఆ గోల్ ఎలిమెంట్స్ వచ్చేసి కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. ఇదంతా రెగ్యులర్ సినిమాల స్ట్రక్చరే. 

         
ముందుగా యాక్షన్ రియాక్షన్ల  ఇంటర్ ప్లే చూద్దాం : ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రధాన పాత్ర సమస్యలో పడ్డాక, దాంతో ఒక గోల్ ఏర్పడ్డాక, ఏ జానర్ కథకైనా ఈ మిడిల్లో గోల్ కి మొదట ప్రతికూల పరిస్థితులెదురవడం మొదలెడతాయి. అంటే ప్రతికూల పరిస్థితులతో గోల్ తలపడ్డమన్న మాట. దీన్ని - ఈ ఎలిమెంట్ ని, మిడిల్ విభాగపు బిజినెస్ లో ముందుగా ఎస్టాబ్లిష్ చేయాల్సి వుంటుంది. విశాలి పాత్రకి ఎస్టాబ్లిష్ అయింది. ఈ మిడిల్ విభాగంలోకి విద్యుత్ తో ఇంకా ప్రేమే అన్న మొండి నమ్మకంతో (గోల్ తో) వుంటూ ఎంటరయ్యింది విశాలి. ఈమె ఈ గోల్ కి వరసగా బెస్ట్ ఫ్రెండ్ అర్పిత, ప్రిన్సిపాల్, పోలీసులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ డిటెక్టివ్, డాక్టర్ అడ్డు పడుతున్నారు. ప్రేమ కోసం వీళ్ళందర్నీ ఎదుర్కొంటూ విద్యుత్ ని కాపాడుకుంటోంది విశాలి. ఈ స్ట్రగులే వీళ్ళందరి యాక్షన్స్ కి తన రియాక్షన్స్ తో ఇంటర్ ప్లే.

        ఈ ఇంటర్ ప్లేలో విశాలి యాక్టివ్ గా వుందా లేక పాసివ్ గా వుందా? అందర్నీ తిప్పి కొడుతూ యాక్టివ్ గానే వుంది. మరైతే కనిపించని విద్యుత్ ని కలుసుకోవడం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ పాత్రలు కృత్రిమ ఎమోషన్స్ తో కాకుండా, వాస్తవిక చిత్రణలతో వుంటాయి. ఈ జానరే ఒక టీనేజీ క్యారక్టర్ స్టడీ. ఈ కథలు క్యారక్టర్ నే ఫోకస్ చేస్తూ, క్యారక్టర్ చుట్టే కథని చేర్చి, క్యారక్టర్ పట్ల ఆలోచనలు రేకెత్తించేవిగా వుంటాయి. ఒక నీతి చెప్తాయి. విశాలిలాంటి టీనేజర్లు ఎందరో వుంటారు. బయటి ప్రపంచమే తెలీని విశాలికి లాప్ టాప్ తో అయిన లోకజ్ఞానం ఎంతటిది? మనుషులతో ప్రత్యక్ష అనుభవమే లేని వర్చువల్ కాంటాక్ట్. మొదటిది లేకుండా రెండోది నమ్మి విద్యుత్ తో మోసపోయింది. క్యారక్టర్ నీతి : కాస్త చుట్టూ ప్రపంచంతో ప్రత్యక్ష అనుభవంలోకి వెళ్ళండి, వర్చువల్ వరల్డ్ కి ఎడిక్ట్ కాకండి - అసమర్ధులై పోతారు.  

        బయటి ప్రపంచమే తెలీని విశాలి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పుడు విద్యుత్ కోసం బయటి ప్రపంచం లోకి వెళ్ళలేని అసమర్ధురాలు. అందుకే చుట్టూ ప్రత్యర్ధులతో అక్కడక్కడే కొట్టుమిట్టాడుతోంది. మరి ఇది పాసివ్ పాత్రే కదా? కాదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకు ఈ జానర్ లో వుండే టీనేజీ పాత్ర ప్రయాణమని ముందే చెప్పుకున్నాం. అజ్ఞానం లోంచి జ్ఞానంలోకి. ఇమ్మెచ్యూరిటీ లోంచి మెచ్యూరిటీ లోకి. ఇది అంచలంచెలుగా జరుగుతుంది, తొందరపడి పాసివ్ పాత్రనుకోవద్దు. మన అజ్ఞానం బయట పడుతుంది. 

        ఆమెకి సమయమిద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. ప్రస్తుతనికామె విద్యుత్ వస్తాడు, ప్రేమిస్తాడు, తీసికెళ్ళి పోతాడని నమ్ముతోంది. ఆడపిల్ల ఇలా అనుకుంటూ ఎదురు చూస్తే తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ‘రాజువారు రాణిగారు’ లోలాగా ‘మగహీరో’ హీరోయిన్ వస్తుంది, నన్ను ప్రేమిస్తుందని మూడున్నరేళ్ళు వూళ్ళో ఎదురు చూస్తూ మూల కూర్చుంటే వెగటుగా వుంటుంది. ఎదురు చూసేది ఆడది, ఎదురెళ్ళేది మగాడు. 

        ఇలా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మొదలైన ఈ మిడిల్ ప్లాట్ పాయింట్ టూ దగ్గర కొలిక్కి వచ్చేదాకా ఈ విభాగంలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగుతూనే వుండాలి. ప్లాట్ పాయింట్ టూ దగ్గర మిడిల్ క్లోజవుతుంది. ప్లాట్ పాయింట్ టూకి దారితీసే ఇంటర్ ప్లే కూడా చూద్దాం : మిడిల్ కథాక్రమంలో విద్యుత్ ఇంకెంత మంది అమ్మాయిల్ని మోసం చేశాడో డీఎన్ఏ సాక్ష్యాలు దొరకడంతో, ఆ అమ్మాయిల ఫోటోలు కూడా విశాలి చూడ్డంతో కొలిక్కొచ్చింది. ఇకామె డాక్టర్ దగ్గరికెళ్ళి నిజం ఒప్పేసుకుంది. 

        ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఎప్పుడూ వ్యతిరేక క ప్రతిబింబాల్ని చూపించే ఎదురెదురు అద్దాలే. వన్ దగ్గర సమస్య ఏర్పాటు, టూ సమస్యకి ముగింపు. వన్ దగ్గర విశాలి విద్యుత్ ది ప్రేమేనని నమ్మింది, టూ దగ్గర మోసమని గ్రహించింది. సమస్యని పుట్టించే ప్లాట్ పాయింట్ -1, సమస్యకి పరిష్కారాన్నిచ్చే ప్లాట్ పాయింట్ - 2 ఎప్పుడూ కాంట్రాస్ట్ గా వుంటాయి. అది నెగెటివ్ గా వుంటే, ఇది పాజిటివ్ గా; అది పాజిటివ్ గా వుంటే, ఇది నెగెటివ్ గా. మధ్యలో జరిగిందంతా అంతరంగ మథనమే. మిడిల్ అంటేనే అంతరంగ మథనం. అందులోంచి నేర్చుకోవడం, మారడం, తనని తాను తెలుసుకోవడం, ఎదగడం. ఇవే  జరిగాయి విశాలి పాత్రకి. ఇది ఏ జానర్ స్క్రీన్ ప్లే కైనా స్ట్రక్చర్ లో అంతర్భాగమే. 

       
యాక్షన్ - రియక్షన్ల టూల్ ఇలా పనిచేశాకా, ఇక క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) చూద్దాం : కథ నడిపే క్యారక్టర్ ఆర్క్ అన్నాక ఆ గ్రాఫ్ పడుతూ లేస్తూ వుండాలి. ప్లాట్ పాయింట్ టూ దగ్గర మిడిల్ కొలిక్కి వచ్చినప్పుడు, కథని బట్టి పూర్తిగా పరాజయంతో పతనమవడమో, విజయంతో పూర్తిగా పైకి లేవడమో జరగాలి. విశాలి పాత్ర ఈ ఫ్రేమ్ వర్క్ లోనే వుంది : ఈ కథని బట్టి ప్లాట్ పాయింట్ టూ దగ్గర అపజయంతో అధో ముఖంగా వుంది ఆమె క్యారక్టర్ ఆర్క్. ప్రేమ కాదు మోసమని తెలుసుకున్న ఓటమి ఇది. ఈ రెండు పాయింట్ల మధ్య ఆమె ఆర్క్ ప్రత్యర్ధులతో ఒడిడుకుల పాలవుతూనే వుందని మిడిల్ కథనంలో భావించవచ్చు. ఆమె పట్టు విడవకుండా ప్రేమ కోసమే వుంది. 

      టైం అండ్ టెన్షన్ (టీటీ) గ్రాఫ్ : అంటే సినిమా ప్రదర్శిస్తున్న తెరమీద కాలం గడిచే కొద్దీ కథనంలో టెన్షన్ పెరుగుతూ పోవడం. పాత్ర ఉత్థాన పతనాలతో కూడిన స్ట్రగులే ఈ టెన్షన్ ని పుట్టిస్తుంది. ఈ టెన్షన్ ఆయా  చర్యల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రశ్నల వల్ల ఏర్పాటవుతుంది. ఏం ప్రశ్నలు? ఎక్కడ్నించీ ప్రశ్నలు? గోల్ ఎలిమెంట్స్ లోంచి వచ్చే ప్రశ్నలు. ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటయినట్టుగా మనం చూసిన గోల్ ఎలిమెంట్స్ - కోరిక, పణం, పరిణామాల హెచ్చరికా, ఎమోషన్స్ అన్నవి  ఈ టీటీ గ్రాఫ్ లో పాలు పంచుకుంటాయి - ప్రశ్నల్ని రేకెత్తిస్తూ. అలా ఈ గ్రాఫ్ ప్రేక్షకులతో ఇంటరాక్టింగ్ వ్యూయింగ్ కి వీలు కల్పిస్తుంది. పాసివ్ గా చూడకుండా, కథలో లీనమై ఆయా భావోద్వేగాల్ని అనుభవిస్తూ, యాక్టివ్ గా చూసేట్టు చేస్తుంది. 

          ఈ మేరకు విశాలి  పడడం, మళ్ళీ లేవడం అన్న స్ట్రగులే ప్రశ్నల్ని సంధిస్తూ టీటీ గ్రాఫ్ ని గీస్తోంది. మొదట బెస్ట్ ఫ్రెండ్ అనుమానించినపుడు కథనంలో టెన్షన్ పెరిగింది, ప్రిన్సిపాల్ కి చెప్పినప్పుడు ఇంకింత పెరిగింది, పోలీసులు వచ్చినప్పుడు మరింత పెరిగింది, పోలీసులకి విద్యుత్ దొరకనప్పుడు టెన్షన్ డ్రాప్ అయిపోయింది.
విశాలి తండ్రి ప్రైవేట్ డిటెక్టివ్ ని నియమించుకున్నప్పుడు మళ్ళీ పెరిగింది, ప్రైవేట్ డిటెక్టివ్ పోలీసుల దగ్గరున్న విశాలి చాటింగ్ డేటా తస్కరిస్తున్నప్పుడు ఇంకింత పెరిగింది, విద్యుత్ ఐపీ అడ్రెస్ ట్రేస్ చేయడానికి ప్రయతినిస్తున్నప్పుడు మరింత పెరిగింది, ఐపీ అడ్రెస్ విదేశాల్లో ట్రేస్ అయ్యేట్టు విద్యుత్ మాస్క్ చేయడమతో పూర్తిగా పడిపోయింది. విశాలి తండ్రికి కూతురితో, భార్యతో సంబంధాలు చెడినప్పుడు మళ్ళీ పెరిగింది, విద్యుత్ ని వదిలి పెట్టకూడదని విశాలి తండ్రి నిశ్చయించుకున్నప్పుడు ఇంకింత పెరిగింది, విశాలి తండ్రి విశాలిని డాక్టర్ దగ్గరికి పంపించినప్పుడు మరింత పెరిగింది, విశాలి తన ప్రేమ మీద నమ్మకంతో డాక్టర్ ని గట్టిగాఎదుర్కోవడంతో పూర్తిగా పడిపోయింది టెన్షన్ గ్రాఫ్. 

        కొన్ని రోజుల తర్వాత స్కూలు కెళ్ళడం మొదలెట్టినప్పుడు పడిపోయిన గ్రాఫ్ ప్రశాంతతని సూచిస్తోంది. ఈ ప్రశాంతత ఇప్పుడింకేం జరుగుతుందన్న సస్పెన్స్ కోసం. బెస్ట్ ఫ్రెండ్ అర్పిత సారీ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు టెన్షన్ అందుకుంది, విశాలి తనతో మాట్లాడవద్దని కరాఖండీగా చెప్పేసినప్పుడు తగ్గింది, తల్లిదండ్రులూ అర్పితా అందరూ కలిసి విద్యుత్ ని బద్నాం చేస్తున్నారని మండి పడుతున్నప్పుడు పెరిగింది, మరిన్ని రోజులు గడిచిపోయిన  టైం లాప్స్ తో ప్రశాంతత, సస్పెన్స్; విద్యుత్ ఇంకా దొరక్క పోవడంతో అదే న్యూట్రల్ స్థితి, అతను ఇంకింత మంది అమ్మాయిలని వంచించినట్టు డీఎన్ఎ సాక్ష్యాలు రావడంతో టెన్షన్ పెరిగింది, అమ్మాయిల ఫోటోలూ విశాలి చూడ్డంతో ఇంకింత పెరిగింది, ఆమె నిజం తెలుసుకోవడంతో ఇంకింత పెరిగిపోయింది. 

       
ఇక మిడిల్ విభాగాన్ని నడిపే టూల్స్ లో చివరిదైన  సొల్యూషన్ :  ఇది ప్లాట్ పాయింట్ టూ దగ్గర వస్తుంది మిడిల్ ని ముగిస్తూ. సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తూ. ఇక నిజం ఒప్పుకోవడమే తన సమస్యకి పరిష్కారమని నిర్ణయించుకుంది విశాలి. విద్యుత్ మోసమే చేశాడని డాక్టర్ దగ్గర ఒప్పుకుంది. ఇదే సొల్యూషన్. 

         
ఈ మిడిల్ కి మరింత బలాన్ని చేకూర్చే బయటపడని ఒక బ్యాక్ గ్రౌండ్ కథ, ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే ఒక హుక్ లా ఆద్యంతం పనిచేస్తోంది. సస్పెన్స్ ని పోషిస్తోంది. అది విద్యుత్ ఎవరన్న ప్రశ్న. అతను నిజంగానే విశాలి కోసం వస్తాడా? ప్రస్తుతం పోలీసుల భయంతో పారిపోయాడా? లేక మోసగాడేనా? ఇప్పుడెక్కడున్నాడు? ఈ సందేహాలు వెళ్లి వెళ్లి అతను సీరియల్ సెక్సువల్ నేరగాడని తేలడంతో తీరాయి. మరి అతనెప్పుడు దొరుకుతాడు? దొరికితే అతడితో విశాలి  కథెలా వుంటుందన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో. ఇలా ఈ మిడిల్ వర్క్ షీట్ పూర్తయింది.
 


         ఇక ఎండ్ విభాగం చూద్దాం : మర్నాడు విశాలి కొత్త జీవితం ప్రారంభించింది. బెస్ట్ ఫ్రెండ్ అర్పితని క్షమించింది. స్కూలు నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీల్లో పాల్గొనసాగింది. అప్పుడు అక్కడే వున్న ఆమె తండ్రి ప్రేక్షకుల్లో ఒకతన్ని గమనించాడు. అతను ఫోటోలు తీస్తున్నాడు. పరీక్షగా చూస్తే, ఆల్రెడీ కేసులున్న లైంగిక నేరగాడతను. వెళ్లి నిలదీశాడు. అతను బతిమాలుకున్నాడు. అల్లరి చేయవద్దని, భార్యా పిల్లలకి తెలిస్తే అన్యాయమైపోతానని. తిట్టి వెళ్ళగొట్టాడు విశాలి తండ్రి. ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేయడంతో అందరి ముందూ సిగ్గుతో చచ్చిపోయింది విశాలి-  ‘నేను మర్చిపోయి నా బతుకు నేను బతుకుదామనుకుంటే ఎందుకు పుండును కెలుకుతావ్?’ అని తండ్రిని నిలదీసింది. 

        తర్వాతొకరోజు బెస్ట్ ఫ్రెండ్ అర్పిత రహస్యంగా చెప్పింది - మార్ఫింగ్ చేసిన విశాలి ఫోటోల్ని ఎవరో పోర్న్ సైట్ లో పెట్టి, ఆమె ఫోన్ నెంబరూ అడ్రసూ ఇచ్చారని. విశాలి అది చూసి, నిద్ర మాత్రలు మింగి బాత్రూంలో పడిపోయింది. 

        కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో వుంది. తల్లిదండ్రులున్నారు. వాళ్ళని పట్టుకుని ఏడ్వసాగింది. కోలుకుని తల్లిదండ్రుల సహకారంతో నెమ్మదిగా సాధారణ జీవితంలోకి రాసాగింది...

        ఎండ్ విభాగం వర్క్ షీట్ : ప్లాట్ పాయింట్ టూలో విద్యుత్ మోసగాడని తెలిశాక విశాలి ఏ అఘాయిత్యం చేసుకోలేదు. అప్పుడే నిద్రమాత్రలు మింగి వుంటే పాసివ్ క్యారక్టర్ అయ్యేది. మిడిల్ విభాగమంతా ఆమె విద్యుత్ కోసం ప్రయత్నించకుండా వుండి పోవడం పాసివ్ క్యారక్టరైజేషన్ కాదు. ఆమె విద్యుత్ కోసం ప్రయత్నించకపోవడానికి ఆమె పరిమితుల గురించి చెప్పుకున్నాం : రియల్ వరల్డ్ అనుభవాన్ని నిర్వీర్యం చేసిన వర్చువల్ వరల్డ్ ఎడిక్షన్. విద్యుత్ కోసం భౌతికంగా ప్రయత్నించకపోయినా, విద్యుత్ మీద నమ్మకంతోనే అందర్నీ ప్రతిఘటిస్తూ వచ్చింది. ప్రతిఘటించే పాత్ర పాసివ్ పాత్రవదు. ఇక చివరికొచ్చేసరికి నిజం తెలిశాక, తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకుంటూ డాక్టర్ కి చెప్పేసి భౌతికంగానూ యాక్టివ్ క్యారక్టరైంది. ఇప్పుడామెకి కనువిప్పు అయింది. ఇక మానసికంగా ఎదిగే వ్యక్తురాలైంది. ఆమె టీనేజీని ఆమె ఇమ్మెచ్యురిటీ కాజేశాక, దాన్ని దాటి పెద్దరికంతో స్త్రీత్వాన్ని మీదేసుకుని బ్రతకవచ్చు ఇకపైన.

        ఈ పూర్వరంగం నుంచి - ప్లాట్ పాయింట్ టూ నుంచి - ఎండ్ విభాగంలోకి ప్రవేశించింది తను. ఇక్కడా చేదు అనుభవాలెదురయ్యాయి. తనని మోసం చేసిన లాటి ఎవరో నేరగాడితో ఫాదర్ సీన్ క్రియేట్ చేసి పుండుని కెలకడాన్ని సహించలేకపోయింది. తను మర్చిపోదామనుకుంటే గుర్తు చేసే ప్రవర్తనలు బాధిస్తూ వుండక తప్పని పరిస్థితి. తన లాటి బాధితురాలిని ఇలా ప్రొఫైలింగ్ చేసేస్తారు ఇంటా బయటా. అతి జాగ్రత్తతో ఇంట, వెటకారంతో బయట. పోర్న్ వెబ్సైట్లో తన ఫోటోలు పెట్టి పరువుతీయడం పరాకాష్టయింది. ఇప్పుడు నిద్రమాత్రలు మింగేసింది. అంటే, ఒకసారి తప్పటడుగేస్తే దాని విషపరిణామాలు చాలా వుంటాయన్న హెచ్చరిక. ఈ పరీక్ష కూడా తట్టుకుని సాధారణ జీవితంలోకి రాసాగింది...

విద్యుత్ ఎక్కడ?
        ఒక వీడియో కెమెరా ఫుటేజీలో ఒకతను ఒకబ్బాయిని వీడియో తీస్తూ కనపడుతున్నాడు. ఆ అబ్బాయి ఆ కెమరా తీసుకుని అతణ్ణి వీడియో తీయసాగాడు. ఇప్పుడతను విద్యుత్ గా రివీలయ్యాడు. ఇంకో అబ్బాయి తన పేరెంట్స్ తో వచ్చి, విద్యుత్  ని తన ఫిజిక్స్ టీచర్ గా పరిచయం చేశాడు. ఇంతలో విద్యుత్ భార్య కూడా వచ్చి వాళ్ళతో కలిసింది...

        ఈ ఆధునిక కథ డేవిడ్ ష్విమ్మర్ దర్శకత్వంలో, లియానా లిబరాటో నటించిన, కమింగ్ ఆఫ్ ఏజ్ ‘ట్రస్ట్’ (2010) మూవీ లోనిది.

సికిందర్