రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, April 12, 2015

ఆనాటి సినిమా


          మేఘం తమిళనాడు నుంచి అలా అలా తేలుతూ వచ్చి వాలింది. వాన మేఘాలు కేరళ నుంచొస్తాయి. ఇది వాస్తు మేఘం. అందులో తెల్లగా మెరుస్తూ ఏవో అక్షరాలూ. ఏమిటా అని పరీక్షగా చూస్తే  అది దర్శకుడి పేరు! ఇదేదో డిఫరెంట్ గా వుందే  న్యూ వేవ్ గా.. అని ఫ్రీజై, వాస్తు మారిపోయిన ఆ వాల్ పోస్టర్ డిజైన్ పై భాగం కేసే తెలుగు ప్రేక్షకుల క్రేజీ లుక్స్.. ‘మన్మధలీల’ ఆ సినిమా...కె. బాలహందర్ ఆ దర్శకుడు!
న్యూవ్ వేవ్ ప్రయోగాలతో నిత్య పథికుడతను!


          దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారే గానీ, ఆ పేరుని కాస్త క్యాప్షన్ లో పెట్టి గౌరవించు కోవాలని అప్పటిదాకా ఎవరికీ తట్టలేదు, బాల చందర్ కి తప్ప!
          పోస్టర్ల అడుగున ఇతర సాంకేతికుల పేర్ల వరసలో ఇరుక్కున్న దర్శకుడి పేరుని అమాంతం పైకి లాక్కొచ్చి , నింగిలో ప్రతిష్టించిన వాడు కైలాసం బాలచందర్. ఇంటి పేరులోనే ఊర్ధ్వ ముఖ యానం ఉన్నాక, అది పోస్టర్లో నూ ఉండాలన్న ఆలోచన రాకపోతుందా? ఇది తర్వాత తెలుగులోనూ ప్రముఖ దర్శకులకి మాస్ కాపీయింగ్ వనరు అయిపోయిన సంగతి తెలిసిందే.
          బాల చందర్ బ్రెయిన్ చైల్డ్ ప్రభావం అలాంటిది...
          కొత్తాలోచన, కొత్త పంథా అతడి కళలు. ఫ్రేముల్ని ప్రేమించడానికి మనకి బాపు ఎలాగో  తమిళులకి బాల చందర్ అలాగ. కళ్ళజోడు ఫ్రేముల్లోంచి కెమెరా కూడా పట్టుకోలేని ప్రతీకల ప్రహేళికలు, పాత్రల ప్రస్థానాలు, మనస్తత్వాల మదింపులు.. నాటక రచయితగా ప్రారంభమయ్యాడు. సినిమాల్లోకి వచ్చాడు. ఎమ్జీఆర్, ముక్తా శ్రీనివాసన్ ల వంటి పాపులర్ హీరోలకి అప్పట్లో మాస్ డైలుగులు రాశాడు. తను డైరెక్టర్ అయ్యేటప్పటికి దీనికి భిన్నమైన పంథా పట్టుకు పోయాడు. అదే మాస్ మసాలా కి దూరంగా న్యూవేవ్ పంథా!  కమర్షియల్ సినిమాలతో హీరోల ఏలుబడిలో హీరోయిన్లకి విలువ లేకుండా పోవడం చూశాడు. అప్పుడు మధ్యతరగతి జీవితాల్ని సున్నితంగా తడిమి, ఒకటొకటిగా విధి వంచితల వృత్తాంతాలతో ప్రేక్షక హృదయాల్ని గెల్చుకోవడం ప్రారంభించాడు. న్యూ వేవ్ అతడి ఒరవడి అయ్యింది. సైకాలజీ దాని ముడి సరికయ్యింది. మనసు చుట్టే రీళ్ళు చుడతాడు. మనసుకవి ఆత్రేయ లాగా మనసు దర్శకుడతను.
          అతడి న్యూవేవ్ ప్రయోగాల్లోనూ ఒక తేడా వుంది. న్యూవేవ్ సినిమాలంటే హిందీ లో సైతం అప్పటిదాకా కమర్షియల్ విలువల్లేని సీరియస్ కళారూపాలుగా  ఉంటున్న తీరుని కాస్తా, దాని మేధోపరమైన బడాయిని కాస్తా, బ్రేక్ చేసేస్తూ తనదైన న్యూవేవ్ సినిమాని ప్రవేశపెట్టుకున్నాడు.. నాణేనికి రెండు ముఖాలుంటాయి. బాల చందర్ చేతుల్లో రెండు పళ్ళేలుంటాయి. ఒక పళ్ళెం లో వేడివేడి అన్నం వడ్డిస్తాడు, మరో పళ్ళెంలో ఫాస్ట్ ఫుడ్ పెట్టేస్తాడు! ఇదీ బాలచందర్ బ్రాండ్ న్యూవేవ్!  ఆఫ్ బీట్ లో కమర్షియాలిటీని కలిపికొట్టి వడ్డించే విందు భోజనం!
          ‘బొమ్మాబొరుసా పందెం వెయ్యీ..నీదో నాదో  పై చెయ్యీ..’ అన్నపాట చాలామంది వినే వుంటారు. అప్పట్నించీ –అంటే 1971 నాటి నుంచీ తెలుగులో వున్నాడు బాలచందర్. అప్పటి ‘బొమ్మాబొరుసా’ అతను తెలుగులో తీసిన తొలి సినిమా అయింది. తర్వాత ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘47 రోజులు’, ‘ఇది కథ కాదు’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, ‘కోటి విద్యలు కూటి కొరకే’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’, ‘గుప్పెడు మనసు’...ఇవన్నీ ప్రత్యేకించి తెలుగు వాళ్ళకోసం తన హృదయాన్ని ఒలిచి మల్చిన  సజీవ చిత్రాలు. మరో తొంభై దాకా తమిళ, హిందీ కన్నడలూ అతడి కెరీర్ గ్రాఫ్ లో కొలువు దీరాయి. ఏడు  జాతీయ అవార్డులూ జై కొడుతూ ముంగిట వచ్చి చేరాయి.
          1930 లో జన్మించాడు బాలచందర్. ‘మన్మధలీల’  తీసేనాటికి 46వ ఏట వున్నాడు! సాధారణంగా ఈ వయసు కొచ్చేటప్పటికి దర్శకులు, తరం మారి మళ్ళీ తాజాగా పుట్టుకొచ్చే  నవతరం  ప్రేక్షకుల హృదయాల్ని అర్ధం జేసుకోలేక, అవే పాతవాసనల చాదస్తాల్ని ప్రదర్శించుకుని ఔటై పోవడం చూస్తూంటాం. బాలచందర్ ఈ కోవకి చెందడు. 46 ఏళ్ల వయసులో  ఇరవైలలోని కుర్రకారులకి పిచ్చెత్తించే ‘మన్మధలీల’ తీసి వదిలాడు! మళ్ళీ 48 ఏట ‘మరోచరిత్ర’ అనే మరో కుర్ర సినిమాని యూత్ కి ఎక్కుపెట్టి కిర్రెక్కించాడు! మనసు దర్శకుడికి మానసిక వృద్ధాప్యం అప్పుడే వుండదేమో!
          మరో చరిత్ర! ఇందులో మనసు- వయసుల లడాయి ఎలావుంటుందో చూపిస్తాడు. మనసుకు ప్రతీక కమల్ హాసన్ పాత్ర అయితే - వయసుకి సింబల్ సరిత పాత్ర. మనసూ వయసుల సయ్యాటలో పడి మిగతా ప్రపంచాన్ని ఆదమరిస్తే దాని పర్యవసానాలెంత  తీవ్రంగా ఉంటాయన్నదే ఇక్కడ హెచ్చరిక. ఈ పర్యవసానాలకి ‘విధి’ అని పేరు పెడతాడు. ‘విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్ఠ లేననీ’ -అంటూ ఆత్రేయ చేత పాట రాయించి!
       విధి అనే ఎలిమెంటు ఆరోజుల్లో బాక్సాఫీసు ఫార్ములాగా ఏలుకుంటోంది. సినిమాలు సబ్జెక్టివ్ గా ఉండేవి- ప్రేక్షకులూ ఆలాగే సబ్జెక్టివ్ గానే బుద్ధిగా వుండే వాళ్ళు. వీర హీరోయిజాలతో ఆబ్జెక్టివ్ గా సినిమాలు తీయడం- ప్రేక్షకులు మళ్ళీ దీనికి బుద్ధిగా మారిపోవడం తర్వాత్తర్వాత  జరిగింది. సినిమాలెలా ఉండాలో ప్రేక్షకులు నిర్ణయించరు, సినిమాలే నిర్ణయించుకుని తమ వెంట ప్రేక్షకుల్ని తీసుకుపోతాయి. అలా ఆనాటి విధి అనే సబ్జెక్టివ్ ఎలిమెంటు – అది సృష్టించే విషాద ముగింపులూ  అప్పటి ట్రెండ్ లో ఒక ఆమోదనీయమైన భాగమై పోయాయి. ‘మరోచరిత్ర’ విషాదాంతం ఓ పునర్జన్మకి ప్రారంభమే. కాకపోతే పుట్టుకల్లేవు. ఎప్పుడు పుడతారో తెలీదు. బాలూ – స్వప్న ( కమల్- సరిత) ల ఆత్మలు వచ్చి తమ కథ చెప్పుకుంటున్నాయి. సముద్ర హోరులో ఆ శిథిల సౌధంలో వాళ్ళ స్వీట్ నథింగ్సే ప్రతిధ్వనిస్తున్నాయి. ఇహలోకంలో ఒక్కటి కాలేకపోయిన ఆర్తి వాళ్ళ సంభాషణల్లో వ్యక్త మౌతోంది. ఆ సముద్రపు టొడ్డున ఇంకా ఆ రోజుల్లో విశాఖకి ఉక్కు కర్మాగారం రాలేదు. దాని తాలూకు పైలాన్ మాత్రమే  వెలసింది పర్యాటక కేంద్రంలా. అది సినిమాలో కన్పిస్తూంటుంది.. ఇంకా ఆరోజుల్లో అబ్బాయిలు చక్కగా బెల్ బాట మ్సే వేసుకుని వీర స్టయిల్ కొడుతున్నారు. అమ్మాయిలూ ఇంకా నిండుగా చీర కట్టుకుంటూనే, తామూ మోడరన్  అన్పించుకోవడానికి కాస్త ధైర్యం చేసి, స్లీవ్ లెస్ జాకెట్లు మాత్రమే  వేసుకుని పబ్లిక్ రియాక్షన్స్ ని టెస్ట్ చేస్తున్నారు. అబ్బాయిలకి ఇంకా సెల్ ఫోన్లు అనే జీవనాధారం లేక మౌతర్గాన్ లు వాయించుకుంటూ కూర్చున్నారు. ఉద్యోగాలకి ఈసురోమనే గవర్నమెంటాఫీసులే గతి. అలాటి ఓ నిద్రపుచ్చే ఆఫీసులో దిక్కుమాలిన ఉద్యోగానికి ఛీ కొట్టేసి ఇంటికొచ్చేస్తాడు బాలూ.

      పక్కింట్లో వుంటుంది స్వప్న. ఎదురుగా పర్చుకుని అంతా సముద్రం. పక్కపక్కనే ఈ తెలుగు-తమిళ కుటుంబాలు రెండిటికీ ఎప్పుడూ కీచులాటలే. సంస్కృతుల సమరం. అలాటిది బాలూ స్వప్నలకి ప్రేమకుదిరి ఇళ్ళల్లో దుమారం రేగుతుంది. వీళ్ళ ప్రేమ మత్తుని వదిలించడానికి కుటుంబాలు రెండూ ఉపాయంతో ఓ షరతు పెడతాయి. ఏడాది పాటు ఇద్దరూ దూరం దూరంగా గడపాలి. ఏడాది ఎడబాటు తర్వాతకూడా ఇంకా ఇంతే  బలంగా ప్రేమలుంటే ఆప్పుడు పెళ్లి చేస్తామంటారు  ఎలాగూ ఆ నాటికి ప్రేమలే ముంటాయిలే పిచ్చోళ్ళకి అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళది!

         దీనికి సరేనని స్వప్నని వదిలి హైదరాబాద్ కొచ్చేస్తాడు బాలూ. ఇక్కడ సంధ్య పాత్రలో మాధవి పరిచయమౌతుంది. ఈమె దగ్గర నాట్యం నేర్చుకునే పనిలో పడతాడు. అటు బాలూనే స్మరించుకుంటూ బరువుగా గడుపుతున్న స్వప్నకి  పెళ్లి సంబంధం తెస్తారు. ఈ పెళ్ళికి ఒప్పుకుందని అటు అపార్ధం జేసుకున్న బాలూ, మనసు విరిచేసుకుని సంధ్యకి పెళ్లి ప్రతిపాదన చేసిపారేస్తాడు. భర్త లేని సంధ్యకి బాలూ ప్రతిపాదనతో ప్రాణం లేచొస్తుంది. తీరా స్వప్నతో అతడి అసలు కథ తెలిసి, పెద్ద మనసు చేసుకుని, ఆ అపార్ధాలూ తొలగించి తను తప్పుకుంటుంది వాళ్ళ జీవితాల్లోంచి. ఇక ఏడాది గడువు ముగిసిపోయి, ఏమాత్రం మాసిపోని ప్రేమతో స్వప్నని  చేపట్టేందుకు హ్యాపీగా వెళ్తున్న  బాలూ మీద దుండగుల దాడి జరుగుతుంది. అదే  సమయంలో స్వప్న మీద వేరొకడు అత్యాచారం చేస్తాడు. కొనూపిరిరులతో మిగిలిన ప్రేమికులిద్దరూ విధిలేక ఇక ఆత్మార్పణం చేసుకుని కథ ముగిస్తారు!

   శాడ్ టర్నింగ్..ఎందుకీ విషాదం? రాని  భాషలతో ఇద్దరి మధ్యా  రోమాన్సూ అంతగా పండించి, అరడజను సూపర్ హిట్ పాటలతో అలరించి, కామిక్ రిలీఫ్ కోసం మిశ్రోతో నవ్వించి, కాలం-దూరం- సమాచార లేమి అనేవి నిజమైన ప్రేమల్ని నిర్వీర్యం చేయలేవనీ నిరూపిస్తూ ఈ ఆకస్మిక ట్రాజడీ దేనికి?

     సినిమాలకి రెండు రూపాల్లో క్లయిమాక్సులు వుంటాయి. స్టోరీ ( కథా ) క్లయిమాక్సు ఒకటైతే, ప్లాట్ ( కథనపు) క్లయిమాక్స్ రెందోది. మొదటిది ఉద్దేశించిన స్టోరీ పాయింటుకి  న్యాయం చేస్తుంది. అంటే ఏడాది పాటూ ఎడబాటుని భరించిన బాలూ స్వప్నలు ఎలా ఏకమయ్యారనేది స్టోరీ క్లైమాక్సు చూపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ కోవలోనే ముగింపునే ఊహిస్తారు. కానీ ప్లాట్ క్లయిమాక్స్ వచ్చేసరికి అది స్టోరీ క్లయిమాక్సుని  అప్రస్తుతం చేసేస్తుంది. ఏ సినిమా చూసినా బాలచందర్ ముగింపుతో ఒక షాక్ ఇస్తాడు. షాక్ ట్రీట్ మెంట్, యాంటీ క్లయిమాక్సులు అతడి రెండు కళ్ళు కదా? ఈ సినిమాలో ఏం చక్కా స్టోరీ క్లయిమాక్స్ కి ప్లాట్ క్లయిమాక్స్ తో చెక్ పెట్టేసి తమాషా చూశాడు. ఇదే సరైనదన్పించి ప్రేక్షకులకి వడ్డించాడు.

          ప్లాట్ క్లయిమాక్స్ కథనం లోంచి పుడుతుంది. ఎలాగంటే, కథనం లో సంధ్య అన్న బాలూ మీద కక్ష గట్టే  బీట్ ఒకటి వుంది. తన చెల్లెలు సంధ్యతో పెళ్లిని ఎగ్గొడుతున్నాడన్న కక్ష అది. అలాగే అటు స్వప్న తో ఒకడెవడో అదివరకు మిస్ బిహేవ్ చేసి లెంపకాయ తిన్నవాడు పగబట్టిన బీట్ కూడా వుంది. ఈ రెండు బీట్లూ ఉన్నాక మొదట ఉద్దేశించిన- ప్రేక్షకులాశిస్తున్న స్టోరీ క్లయిమాక్స్ అనేది ఆటోమేటిగ్గా అప్రస్తుత మైపోతుంది.


          గొప్ప సినిమాల్లో నిగూఢంగా వుండే సత్యాల కోసం వెతకాలంటాడు  జేమ్స్ బానెట్. ఇక్కడ ప్లాట్ క్లయిమాక్స్ ద్వారా ఓ నిగూఢ సత్యాన్నే స్థాపించాడు బాలచందర్. ఇదే ప్రేక్షకుల సబ్ కాన్షస్ తో వాళ్లకి తెలీకుండా కనెక్ట్ అయిపోయింది. ఫలితంగా సినిమా దిగ్విజయం సాధించింది.

          ఆఫ్ట్రాల్ విధి అంటే ఏమిటి! కేవలం మన ఇగోలని బట్టి పని చేసుకు పోయే యాంత్రిక శక్తేగా? మన ఇగోలతో మనం పోగేసుకున్న మంచీ చెడ్డ కర్మల తూకాన్ని బట్టి జీవితంలో ఆయా ఘట్టా లె దురవుతూంటాయి కదా? దీన్నే విధి విలాసమన్నారు కదా? అప్పుడు దీంతో దేవుడి కెలాటి  సంబంధమూ లేదు. దేవుడు ఉపయోగించుకోమని మనకి ఓ చక్కటి విచక్షణా జ్ఞానం గల మెదడు ని మాత్రమే ఇచ్చి ఊరుకున్నాడు. ఎలా ఉపయోగించుకుంటే అలా తయారవుతాం! స్వప్న తన వయసు ప్రభావం చేత విచక్షణా జ్ఞానం తో తీసుకోవాల్సిన ఛాయిస్ ని మరచి, తనతో మిస్ బిహేవ్ చేసిన వాడి ఇగోని దారుణంగా దెబ్బ తీసింది అలా లెంపకాయ కొట్టేసి! ఆ తర్వాత కాలంలో తప్పించుకోలేని ఆ చర్య తాలూకు ఫలితం అనుభవించింది. అటు బాలూ కూడా ఆ క్షణంలో విచక్షణా జ్ఞానం లేక మనసు మీద అదుపు కోల్పోయాడు. ప్రేమించిన స్వప్ననే అనుమానించాడు. దరిమిలా దారితీసిన పరిణామాల రిత్యా కక్ష గట్టిన సరిత అన్నతోనే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! ఎవరైనా తొందరపడి ఛాన్స్ తో గాక- ఛాయిస్ తో నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్లాట్ క్లయిమాక్స్ ప్రవచిస్తున్న నిగూఢ సత్యమన్న మాట!

          ఇంత విషయమున్నాక- ఇంకా సిల్లీగా ప్రేమికులిద్దర్నీ కలిపేసి సుఖాంతం చేయాలని కేవలం విషయపరిజ్ఞానం లేని దర్శకులే చేస్తారు- బాలచందర్ కాదు!

          ప్లాట్ క్లయిమాక్స్ తో శాస్త్రీయంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయి మెగా హిట్టయిన ఈ ‘మరో చరిత్ర’ ని స్వర్గీయ  ఎల్వీ ప్రసాద్ హిందీలో ‘ఏక్ దూజే కే  లియే’ గా రీమేక్ చేయాలని నిర్ణయించినప్పుడు కూడా - ముగింపుని సుఖాంతం చేయాల్సిందిగా వొత్తిళ్లు వచ్చాయి బాల చందర్ మీద. ఆయన ఒరిజిజనల్ ముగింపు నుంచి అంగుళం కూడా కదిలేది లేదని స్పష్టంగా చెప్పేశాడు. మళ్ళీ దుఖాంతమే హిందీలో సూపర్ హిట్టయ్యింది. దుఖాంతంలో జీవితసత్యాలతో సబ్ కాన్షష్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ వున్నాయి! దీనికి ముందు తెలుగు ఒరిజి నల్ తమిళంలో డబ్బింగ్ అయి కూడా ఏడాది పాటూ ఆడింది. హిందీ రిమేక్ కూడా హైదరాబాద్ లో ఏడాది పాటూ ఆడింది. కథలో వున్న  వినూత్న ‘ఏడాది ఎడబాటు’ పాయింటే గమ్మత్తుగా  ప్లాట్ క్లయి మాక్సుగా మ్యాజిక్ చేసి ఏడాది పాటూ ప్రదర్శనలకి దారి తీసిందన్న మాట!

          ‘మరో చరిత్ర’ - ఒక అపూర్వ చరిత్ర. మనకోసం బ్లాక్ అండ్ వైట్ లో ఇంత అద్భుతంగా సృష్టించిన ఈ వెచ్చటి అనుభవానికి రివాజుగా బాల చందర్ ఆస్థాన  విద్వాంసులందరూ పనిచేశారు. గణేష్ పాత్రో, ఆచార్య ఆత్రేయ, ఎం ఎస్ విశ్వనాథన్, లోకనాథ్ ప్రభృతులు...ఇక కమల్ హాసన్- సరితల జంట  తమ అసమాన నటనలతో ఈ సినిమా చూసే ఏ తరం ప్రేక్షకుల హృదయాలలో నైనా చిరస్థాయిగా నిలిచి పోతారు.


సికిందర్ 

(సెప్టెంబర్ 2009 ‘సాక్షి’ కోసం)