రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, March 27, 2019

రిపీట్ ఆర్టికల్ ఆన్ డిమాండ్



స్క్రిప్టు రాయడానికి కూర్చుంటే మూడ్ రాదు. గది బాగా లేదనో, సౌకర్యాలు బాగా లేవనో, ఇంకేదో తగ్గిందనో మూడ్ రాదు. ప్రతిఘటన వల్ల రాని మూడ్ ఇది. నచ్చని బాహ్యపరిస్థితుల పట్ల ప్రతిఘటన. ఇది తనకే నష్టం. ప్రతిఘటనతో బోలెడు స్కిల్స్ ని చంపుకుని కూర్చోవడం. ఇది కండిషనల్. రాయాలంటే  ఇంకేదో  వుండాలనే కండిషన్ వల్ల మూడ్ రాకపోవడం. ఇలాకాక, బద్ధకం వల్ల మూడ్ లేకపోవడం వుంటుంది. ఇది అన్ కండిషనల్. దీనికి  బాహ్య పరిస్థితులతో సంబంధం  వుండదు. ఇది లాభం కల్గించేది.  బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా,  రాయాలనుకున్న విషయం మీద మెదడు దాని పని అది చేస్తూనే వుంటుంది. అదే ప్రతిఘటనతో  మూడ్ రాకపోవడంలో ఆలోచనలు కూడా బంద్ అయిపోతాయి. బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా  మెదడులో ఆలోచనలు పోగు పడిపోతూనే వుంటాయి.  అంతే గాక ఆలోచనలని పొదగడం కూడా వుంటుంది. మూడ్ వచ్చేటప్పటికల్లా మెదడు ఆలోచనల్ని పొదిగి పొదిగి పిల్లని బయటికి తీస్తుంది. అప్పుడు రాసుకుపోవడం సులభంగా, వేగంగా జరిగిపోతుంది. బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా మెదడు గుడ్లు పెట్టక మానదు. ఆ గుడ్లని పొదగకా మానదు. ఆ పిల్లని బయటికి తీయకా మానదు. బద్ధకం వల్ల రాని  మూడ్ ని బలవంతంగా తెచ్చుకుని రాసే ప్రయత్నం చేస్తే మెదడు మొరాయిస్తుంది. అప్పుడు రాయడానికి ఆలోచనలు సరీగ్గా కుదరవు. పూర్తి చేయడానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. 

          
మెదడు ద్విపాత్రాభినయం కూడా చేస్తుంది. ఒకవైపు పూర్తి చేయాల్సిన పని గురించి ఆలోచిస్తున్నా, మరో వైపు ఆ పనిని  వాయిదాలు వేయడానికి సాకులు వెతుకుతుంది.  ఒక సినిమా గురించి ఏదో రాస్తూ, ఆ సినిమా ఎప్పుడు విడుదలయ్యిందా అని నెట్ లో సెర్చి చేస్తూంటే, అక్కడ ఒక గాసిప్పో ఇంకేదో  ఆసక్తిగా కన్పిస్తుంది. అది చదువుకుంటూ అసలు విషయాన్ని పక్కన పడేస్తుంది మెదడు. ఆ రాయడం కంటే ఈ చదువుకోవడమే  హాయిగా అన్పిస్తుంది  మెదడుకి. ముందా పని  పూర్తి చెయ్ అని మెదడు గుర్తుచేస్తే,  ఆకలిగా వుందిగా, తిన్నాక పూర్తి  చేయవచ్చులే అని  సాకులు వెతుకుతుంది మెదడే.

          మెదడుని జయించగల వాడే వృత్తి రచయిత. వృత్తి రచయితకి అసలు మూడ్ తో పనేముంది? సినిమా కెళ్ళి  బయట వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో టకటకా టైపు చేసేసుకుంటాడు ఐడియాల్ని. సబ్జెక్టు మీద ఎక్కడ ఎప్పుడు ఏ ఆలోచన తట్టినా ఫోన్లో వాయిస్ రికార్డర్ లో  చెప్పేస్తూంటాడు. హైదరాబాద్ - విజయవాడ హైవే మీద నార్కెట్ పల్లి దగ్గర్లో  హోటల్ వివేరా అని వుంటుంది. అక్కడొక వ్యక్తి  బైక్ మీద వచ్చాడు. కాఫీ తెచ్చుకున్నాడు. కాఫీ తాగుతూ బ్యాగులోంచి పెన్సిలు, రబ్బరు, పేపర్లు తీసి రాయడం మొదలు పెట్టాడు. రాస్తూ చెరిపేస్తూ మళ్ళీ రాస్తూ వున్నాడు. మీరేం చేస్తూంటారని అడిగితే, టీవీ సీరియల్ అని చెప్పాడు. డిస్టర్బ్ చేయకుండా దూరంగా నించుని గమనిస్తోంటే, కాఫీ పూర్తయ్యే వరకూ రాసుకోవడం చేసి, పేపర్స్ పెన్సిలు రబ్బరూ తిరిగి  బ్యాగులో పెట్టేసుకుని,  బైక్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అతడికి మూడ్ తో పనిలేదు, ఎప్పుడు పడితే అప్పుడు రాయగలడు. ప్లేస్ తో పనిలేదు, ఎక్కడ పడితే అక్కడ రాయగలడు. టైంతో పనిలేదు, ఐదు నిముషాలు వీలుంటే ఆ ఐదు నిమిషాలూ రాసెయ్యగలడు. బైక్ మీద ప్రయాణిస్తూ కూడా పనిచేయగలడు, రాస్తున్న విషయం  గురించిన ఆలోచనలతో. అతను వృత్తి రచయిత. 

          ఒకసారి స్క్రీన్ ప్లే గురు సిడ్ ఫీల్డ్ సినిమా కంపెనీలో పని చేస్తున్నప్పుడు, కాళ్ళు టేబుల్ మీద ఎత్తి పెట్టుకుని, కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. ఆ నిర్మాత ఆఫీసులో ఎవరేం చేస్తున్నారో కనిపెట్టడానికి బూట్లు తీసేసి  స్లిప్పర్స్ వేసుకుని పిల్లిలా వచ్చేవాడు. అలా వచ్చేసి సిడ్ ఫీల్డ్ అలా లేజీగా కూర్చుని కన్పించడంతో పట్టేసుకున్నాడు. ఫైరయ్యాడు. తను కిటికీ లోంచి చూస్తూ సబ్జెక్టు గురించే ఆలోచిస్తూ కూర్చున్నానని సిడ్ ఫీల్డ్  ఎంత చెప్పినా విన్పించుకోలేదు. సబ్జెక్టు గురించే ఆలోచిస్తున్నట్టు ఎలా నిరూపించుకోవాలి?  చేసిన ఆలోచనల్ని తీసి చూపించలేం కదా?  ఈ తగాదా తేలలేదు. రచయిత ఖాళీగా కన్పిస్తే ఇతని పనై పోయిందనో, పనికిరాడనో అనుకుంటారు. అతను రాయాల్సిన ఆలోచనల్నే భారంగా మోస్తూ వుంటాడని అర్ధంజేసుకోరు.

బ్రేక్ లేదు
          వృత్తి రచయిత అనేవాడికి జీవితంలో బ్రేక్ అనేది వుండదని అంటారు. రచన నుంచి విరామం తీసుకుని విహారయాత్ర కెళ్ళినా ఆలోచనలు రచనల గురించే వుంటాయి. బ్రేక్ లేదు. ఏ మెదడుతో వెళ్ళిన వాడు అలాగే ఆ మెదడుతోనే వచ్చి మళ్ళీ రచన చేస్తాడు. ఒక సబ్జెక్టు మీదే పనిచేసే వృత్తి రచయితలకే ఇలావుంటే, ఇక ఒకేసారి ఎక్కువ సబ్జెక్టులు చేయాల్సి వస్తే? ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయిత, క్రిమినల్ లాయర్ పెర్రీమేసన్ పాత్ర సృష్టి కర్త,  ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ కి నాలుగు వేల ఎకరాల ఎస్టేట్ వుండేది. అక్కడే వుంటూ ఏడుగురు సెక్రెటరీలకి  ఏకకాలంలో ఏడు నవలలు డిక్టేట్ చేసేసే వాడు. మరోవైపు, ఒక పేరు మోసిన లాయర్ గా పేదల కోసం ఉచిత న్యాయసంస్థ స్థాపించి, వివిధ కోర్టుల్లో కేసులు పోరాడేవాడు. 

          రచనలతో కూర్చుని మానసిక, కేసులతో బయట తిరిగి భౌతిక - దినచర్యలు రెండూ సునాయాసంగా నిర్వహించేవాడు. ఇదెలా సాధ్యం? ఆయన మెదడు ప్రత్యేకంగా ఏమైనా తయారైందా? అదేం కాదు. అందరి మెదడు లాంటిదే. కాకపోతే దాదాపు మనుషులందరూ పది శాతం  మెదడునే వాడుకుని పనిచేస్తారు, గార్డెనర్  ఇంకొంచెం ఎక్కువ వాడుకున్నాడు. పనిచేయించుకుంటే మెదడుకి అసాధ్య మనేదేదీ లేదు. ఇక సాధారణంగా రచయితలు రాసే పనుంటే తిరగలేరు, తిరిగే పనులుంటే రాయలేరు. ఏకకాలంలో ఏడు నవలలనే సంగతి పక్కన పెడితే, ఏడు పేజీలు  రాయడానికే ఎన్నో వాయిదా లేస్తూంటారు. వృత్తి రచయితలిలా వుండరు. 

          ఈ వాయిదాలేయడం పైన చెప్పుకున్నట్టు ద్విపాత్రాభినయం చేసే మెదడు (సాకులు వెతికే) రెండో స్వభావమైతే, దీనికి బద్ధకం కూడా కారణమవుతుంది. ఐతే  బద్ధకం వల్ల కాకుండా,  మెదడు రెండో స్వభావంతో సంబంధం లేకుండా, బుద్ధిపూర్వకంగా వాయిదా వేస్తే?  అప్పుడు మెదడు పొదిగే పనిని ఇంకా బలంగా యాక్టివేట్ చేసుకుంటుంది. బుద్ధిపూర్వకంగా రాయడాన్ని ఆపాం కాబట్టి, రాసే మూడ్ లో మంచి వూపు మీదున్న మెదడు, ఆ అవాంతరానికి అంతే దీటుగా సమాధానమిస్తూ పని చేస్తుంది. అంటే ఆలోచనల్ని మరింత బలంగా పొదగడం చేస్తుంది. బద్ధక స్థితిలో ఆలోచనల్ని పొదగడం పాసివ్ చర్య అయితే, కావాలని రాయడం ఆపిన స్థితిలో ఆలోచనల్ని పొదగడమనేది యాక్టివ్ చర్య. 

          బద్ధకంతో మూడ్ లేక అసలే రాయకపోవడం, చురుగ్గా రాస్తున్నప్పుడు ఇంకేదో దానిమీదికి దృష్టి మళ్ళి రాయలేకపోవడం రెండూ వేర్వేరు. మొదటి దాని విషయంలో మెదడు ఆలోచనలని పొదుగుతుంది. రెండో దాని విషయంలో రాయడానికి చేస్తున్న ఆలోచనలని ఆపేస్తుంది. పైన చెప్పుకున్నట్టు ఏ గాసిప్సో చదువుకుంటూ కూర్చుంటుంది. 

          గాసిప్స్ వరకూ చదువుకుంటూ కూర్చుంటే  ఫర్వాలేదు, అదేదో పూర్తయ్యాక మళ్ళీ రాసేపని మీదికి వస్తుంది మెదడు. కానీ రాస్తూరాస్తూ వుండగా, చెయ్యి స్మార్ట్ ఫోను మీద పడిందా, ఇకంతే. బుక్కయిపోతుంది మెదడు. దాన్నుంచి విమోచనం పొందదు.  సోషల్ మీడియాలో మునకలేయడం మొదలెడుతుంది. ఏవేవో పోస్టులు చదివి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అంతుండదు. వూరుకోక తానో పోస్టు పెట్టేస్తుంది- ఈ రోజు నేను చాలా లక్కీ అని.  దీనికి ఎన్ని లైకులు వచ్చాయా అని పదేపదే చూసుకోవడం మొదలెడుతుంది. ఎన్ని కామెంట్లు వచ్చాయా అని చీటికీ మాటికీ చూసుకుంటుంది. రాసుకుంటున్నప్పుడు స్మార్ట్ ఫోన్ మీద చెయ్యి పడిందా, ఇక రాసేపని గోవిందా.

సోషల్ మీడియా నిషా!
          కొత్త రచయితలు ఇంకో ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటారు. తమగురించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం. ఆ రకమైన పోస్టులూ, సెల్ఫీలూ నిత్యం పెట్టుకోవడం. రచయితలుగా విజిబిలిటీ పెంచుకోవడం. ఎక్కడ చూసినా తామే కన్పించడం. ప్రపంచ ప్రసిద్ధ థ్రిల్లర్  రచయిత జేమ్స్ హేడ్లీ ఛేజ్ మీడియాలో ఎక్కడా కన్పించే వాడే కాదు. జీవితకాలమంతా ఇంటర్వ్యూలే ఇవ్వలేదు. ఒకటే చెప్పే వాడు – ప్రపంచవ్యాప్తంగా ముప్పయ్యారు భాషల్లో నా నవలల్ని కోట్లాది మంది చదువుతూండగా, పదేపదే రీప్రింట్లు అవుతూండగా, నేనెందుకు పాఠకుల ముందుకొచ్చి నాగురించి చెప్పుకోవాలి? వాళ్ళకీ,  వాళ్ళు చదివే నా నవలలకీ మధ్య నేనెందుకు పానకంలో పుడకలా? నవలలు అమ్ముడుపోకపోతే కదా వాళ్ళ ముందుకెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలతో పబ్లిసిటీ చేసుకోవాలి? – అని నిర్మొహమాటంగా అనేవాడు. 

          షాడో మధుబాబుదీ  ఇదే పధ్ధతి. మొన్న మొన్నటి వరకూ ఆయనెలా వుంటారో ఎవరికీ తెలీదు. ఎంత పాపులర్ అయినా నవలల మీద ఫోటోలే వేసుకోలేదు. పేరొచ్చాకైనా నేనే మధుబాబు నంటూ ముందుకూ  రాలేదు. అజ్ఞాతంగా వుంటూ ఎన్నో షాడో నవలల్ని సృష్టిస్తూ లక్షలాది మంది పాఠకులని నిలుపుకున్నారు. అంటే రాసింది పాఠకుల్లోకి వెళ్ళాలే గానీ, రచయిత కాదు. రచయిత ఫేసుని, కబుర్లనీ ఎవరూ కేర్ చెయ్యరు- నువ్వేం రాశావయ్యా అనే చూస్తారు. ఈ విజిబిలిటీ హీరోహీరోయిన్లకి, దర్శకులకి, నిర్మాతలకీ సినిమా పబ్లిసిటీ కోసం అవసరం. కదలిక వాళ్ళకవసరం. రచయితకి కదలిక కాదు, తెర వెనుక కదలకుండా కూర్చుని రాయడం అవసరం. పరుచూరిబ్రదర్స్, సత్యానంద్, దివాకర్ బాబు, పోసాని, తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరాం వంటి రచయిత లెవరూ పబ్లిసిటీ చేసుకుని పాపులర్ అవలేదు. రాయగల్గి పాపులర్ అయ్యారు. కొత్త రచయితలు సినిమా అవకాశం రాగానే సోషల్ మీడియాలో ధూం ధాం చేసేస్తూంటారు. సక్సెస్ కొట్టామని పోస్టులు పెట్టేస్తూంటారు. వాళ్ళేం సక్సెస్ కొట్టలేరు. ఈ ప్రపంచంలో విజయాలనేవి లేవు, త్యాగాలే వున్నాయి. అలాగే ఆయా నిర్మాతలు త్యాగం చేస్తేనే ఒక రచయితకి ఒక అవకాశం, అంతే. అది తన విజయం కాదు. వాస్తవాల పునాది మీద నిలబడి రచయితలు  కూడా ఆలోచించకపోతే ఎలా? 

          ఇతర రచయితలు రాసింది పత్రికలకి పంపుకుంటారు, లేదా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, లేదా సొంత బ్లాగులో పెట్టుకుంటారు. సినిమా రచయిత ఫైలు తయారు చేసుకుని నిర్మాతల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ఫైలు ఇంకెప్పుడు తయారుచేసుకుంటారు – సోషల్ మీడియాతో ఏకాగ్రత చెదరగొట్టుకుంటూ! 

          సోషల్ మీడియాని వృత్తిరీత్యా వాడుకుంటే అది వేరు. స్కిల్స్ పెంచుకోవడానికి నిర్మాతలతోనో,  దర్శకులతోనో, సీనియర్ రచయితలతోనో సమాచార వినిమయం కోసం  సోషల్ మీడియాని పరిమితం చేసుకుంటే ఏకాగ్రతతో వుండగల్గుతారు. ఇదివరకంటే నిర్మాతల, దర్శకుల, సీనియర్ రచయితల గేట్ల దగ్గర కాపేయాల్సి వచ్చేది.  ఇప్పుడలా  కాదు, ఆన్ లైన్ లో స్పందించి తమ విలువైన సూచనలివ్వడానికి వాళ్ళకేం  అభ్యంతరం వుండదు. అలా వాళ్ళ దగ్గర విజిబిలిటీ పెంచుకోవచ్చు. ఇది వదిలేసి వూరికే సోషల్ మీడియాలో వెలిగిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం కొత్త రచయితలు మలిగిపోతారు. సోషల్ మీడియాలో అంత  యాక్టివ్ గా  వుండే కొత్త రచయితలు వృత్తిగతంగా ఏం రాశారా అని చూస్తే ఏమీ కన్పించదు. వృత్తి రచయితలైతే రాసిన కట్ట కనపడాలి, సోషల్ మీడియాలో డప్పులు కాదు. అయితే, పక్కాగా సినిమా ఫీల్డులో స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళతో ఇలా వుండదు. అత్యధికశాతం స్ట్రగుల్ చేస్తున్న రచయితలకి, అసోషియేట్స్ కి, అసిస్టెంట్స్ కి ఫేస్ బుక్ ఎక్కౌంట్ కూడా వుండదు. వుంటే నామమాత్రమే.  వాళ్ళ ధ్యాసంతా  క్రియేషన్ మీదే,  రిక్రియేషన్ మీద కాదు. అనుత్పాదక కార్యకలాపాల మీద కాదు. షూటింగ్ నుంచి అర్ధరాత్రి రూముకొచ్చినా రాసుకుంటారు, లేదా ఓ సినిమా చూస్తారు.

కుడి ఎడమల కుసుమ పరాగం!
          ఒకసారి చెన్నై సన్ టీవీ ఆఫీసు రిసెప్షన్ లో పక్కనే ఒక పెద్దాయన లాప్ టాప్ మీద బిజీగా వున్నాడు. అది తమిళ సీరియల్ స్క్రిప్టులా వుంది. ఆయన ఇటు వైపు చూసి, ఏం పనిమీద వచ్చారని అడిగాడు. ‘చివరకు మిగిలేది’ శాటిలైట్ హక్కులు అమ్మడానికి వచ్చినట్టు చెప్తే, బయటికి తీసికెళ్ళి టీ ఇప్పించాడు ( ‘చివరకు మిగిలేది’ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ ఎం ఆర్ కొండలరెడ్డి కోరిక మేరకు వెళ్ళాల్సి వచ్చింది).  టీ తాగుతూ ‘చివరికిమిగిలేది’ గురించీ, అందులో సావిత్రి గారి నటన గురించీ గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. సార్, ఇప్పుడు కూడా మీరింత టైం వేస్ట్ చేయకుండా రాస్తున్నారే అంటే, ‘వయసులో వున్నప్పుడు అబ్బిన డిసిప్లిన్. ఇప్పుడు రిలాక్స్ అయి లీజర్ గా రాసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. శరీరాన్ని కష్ట పెట్టుకోవాల్సి వస్తోంది. ఇది శిక్షో భిక్షో తెలియడం లేదు’ అన్నాడు.

          క్రమశిక్షణ పురుగు దొల్చిందంటే అది శిక్షలా అన్పిస్తూనే, భిక్షలా కూడా ఊరిస్తూ చివరిశ్వాస  దాకా నడిపిస్తుంది. క్రమశిక్షణే బద్ధకానికి విరుగుడు. క్రమశిక్షణే ఏకాగ్రతకి ఎరువు. క్రమశిక్షణే ఉత్పాదకతకి ఇంధనం. ఇందుకే వృత్తి రచయిత అనుత్పాదక కార్యకలాపాలకి దూరంగా వుంటాడు, లేదా బాగా పరిమితం చేసుకుని, కాసేపు ఉపశమనానికి వాడుకుంటాడు. వృత్తి రచయిత రాసింది ప్రజల మధ్యకి పంపుతాడు, తను వెళ్ళడు. ఇంకా రాయడంలో తలమునలకై వుంటాడు. మధుబాబు ఎంత పేరొచ్చినా  దాన్ని ఎంజాయ్ చేయలేదు. పేరొచ్చిన సినిమా రచయితలు కూడా ఎంజాయ్ చేయరు. అంత తీరిక వుండదు. అంతేగాక,  ఎంజాయ్ చేయడానికి అదేమన్నా తమ గొప్పా? పాఠకులో ప్రేక్షకులో ఒప్పుకుని పెట్టిన భిక్ష! 

          ఇలా వృత్తి రచయిత లక్షణాల గురించి, అవసరాల గురించీ  చెప్పుకున్నాక, ఇప్పుడు తిరిగి బుద్ధిపూర్వక బద్దకం విషయానికొద్దాం. రాయలేక బద్ధకించినా దాని గురించే ఆలోచిస్తూ వుంటామని చెప్పుకున్నాం. అలాగే బుద్ధిపూర్వకంగా రాయడం ఆపడం గురించి కూడా చెప్పుకున్నాం. దీన్ని ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. దీన్ని బుద్ధిపూర్వకంగా బద్దకించడం అందాం. 

          ఎంత మూడ్ లో వుండి టకటకా రాసుకుపోతున్నా పొద్దంతా రాయకూడదు. తెలియకుండానే క్వాలిటీ తగ్గిపోతూ వుంటుంది.  అందుకని ఎంత ఊపు మీద రాస్తున్నా సమయం చూసి ఆపెయ్యాలి. ఆపేసి బద్ధకించాలి. బద్ధకించమంటే పట్టపగలు నిద్రపొమ్మని కాదు. ఇంకో పనేదో చెయ్యాలి. రాయడానికి  బద్ధకించమన్నామే గానీ, ఇతర పనులు చేసుకోవడానికీ బద్దకించమనలేదు. ఆ ఇతర పనుల్లో మళ్ళీ చదవడం, టీవీ చూడడం మాత్రం  వుండకూడదు. అలాచేస్తే దృష్టి మళ్ళి,  రాస్తున్న విషయం మీద మెదడు ఆలోచనలు చెయ్యదు. బయట తిరిగి రావచ్చు, వ్యాయామం చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఆఖరికి టేబుల్ తుడుచుకోవచ్చు. మాన్యువల్ పనులేవైనా  చేసుకోవచ్చు.  ఈ సమయమంతా మెదడు పట్టుబట్టి ఇంకా ఏమేం ఆలోచిస్తోందో తెలుస్తూనే వుంటుంది.అప్పుడుకూర్చుని రాయడం మొదలెట్టాలి. అప్పుడా క్వాలిటీ తెలిసి పోతూనే వుంటుంది.  పైగా త్వరగా పనై పోతుంది. నాలుగు గంటలు పట్టే పని రెండు గంటల్లో పూర్తయిపోతుంది.  ఏకబిగిన రాసుకుంటూ కూర్చుంటే  నాలుగుగంటలు పట్టే టైము, ఆరుగంటలు తీసుకుంటుంది.

          ఈ వ్యాసకర్త జయించలేని సమస్య ఒకటుంది. రాస్తున్నప్పుడు ఏదైనా నవ్వొచ్చే వాక్యం పడిందా, ఇక ఫక్కున నవ్వొచ్చి లేచి బయటి కెళ్ళి పోతాడు. ఆ వాక్యాన్ని తల్చుకుంటూ తల్చుకుంటూ నవ్వుకోవడంతోనే సరిపోతుంది. ఇది తప్పని తెలుసు. మనం రాసి మనమే నవ్వుకోవడం. ఇందులోంచి తేరుకోవడానికి నిముషాలు కాదు,  కొన్ని సార్లు గంటలూ పట్టి టైం వేస్టయి పోతూంటుంది. ఇలా ఎన్ని వాక్యాలకి నవ్వొస్తే అన్నిసార్లు లేచెళ్లి పోయి నవ్వుకోవడమే. ఇలాటి వాక్యాలు పడకుండా చూద్దామంటే అవి పడిపోతాయి. పడ్డాయా సమయమంతా వృధా. డెడ్ లైన్లు సఫా. దీనికి పరిష్కారమనేది కన్పించడం లేదు. నవ్వడం టానిక్కే, కానీ ఇక్కడ టైటానిక్ అవుతోంది. ‘హౌ టు స్టాప్ లాఫింగ్ అండ్ స్టార్ లివింగ్’ అని డేల్  కార్నెగీ రాసి వుంటే బావుండేది. 

          మెదడు రెండుగా వుంటుంది : కుడి మెదడు ఎమోషనల్ గా, ఎడమ మెదడు లాజికల్ గా అని తెలిసిందే.  కుడి మెదడే రచన చేసుకుపోతుంది, ఎడమ మెదడు సహేతుకత చూస్తుంది. కుడి మెదడు కథ ఆలోచిస్తూ రాసుకుపోతుంది  – ఎడమ మెదడు దాన్ని పరిశీలిస్తుంది, ఎడిట్ చేస్తుంది, పాలిష్ చేస్తుంది. కాబట్టి బుద్ధిపూర్వకంగా రాయడం ఆపి నప్పుడు, మెదడు పనిచేయడాన్ని నియంత్రించాలి. ఇంకా రాయడం ముగించలేదు కాబట్టి, రాయడం మీదే కుడి మెదడు ఆలోచించేందుకు వదిలెయ్యాలి. ఇలా కాక, అంతవరకూ రాసిన దాన్ని ఇది కరెక్టా? ఇందులో లాజిక్ వుందా?  అని ఆలోచిండం మొదలెడితే, కుడి మెదడుని ఆపేసి,  ఎడమ మెదడు దాని పని అందుకుంటుంది. అంతవరకూ రాసి ఆపిన దాన్ని పరిశీలించడం, ఎడిట్ చేయడం, పాలిష్ చేయడం మొదలెడుతుంది. అప్పుడు తిరిగి రాయడానికి కూర్చున్నప్పుడు ఆలోచనలు సాగవు.  ఎందుకంటే,  బుద్ధిపూర్వకంగా కథ రాయడాన్ని ఆపినప్పుడు, కథ ఆలోచించే కుడి మెదడుని బంద్ చేసుకుని,  పోస్ట్ మార్టం చేసే ఎడమ మెదడుని తట్టి లేపాం కాబట్టి.

          అందుకని అప్రమత్తంగా వుండాలి. రాయడం పూర్తయ్యే వరకూ ప్రశ్నించుకోకూడదు. ఎమోషనల్ గా (కుడి మెదడు) రాసుకుపోవాలి. రాసేశాక లాజికల్ గా (ఎడమ మెదడు) చెక్ చేసుకుంటూ పోవాలి. ఏకకాలంలో రెండూ చేస్తే మెదడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే, ఏకకాలంలో కుడి - ఎడమ రెండు మెదడులూ పనిచేయడం అసాధ్యం.

          ఇదీ బుద్ధిపూర్వకంగా బద్ధకిస్తూ రాసే (ఆలోచించే) విధానం. రాస్తున్నప్పుడు ఎడమ లాజికల్ మెదడు పనిచేయడమే మూడ్ చెడిపోవడానికి, మూడ్ లేకపోవడానికి కారణం. రాస్తున్నప్పుడే కాక, కథ ఆలోచిస్తునప్పుడు కూడా లాజికల్ మైండ్ ని అనుమతిస్తేనే ఆ కథ ఆలోచించే మూడ్ పోతుంది...

సికిందర్
.