రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, August 26, 2018

676 : ఫ్లాష్ బ్యాక్ / రివ్యూ


దర్శకత్వం : టిన్నూ వర్మ
తారాగణం : సన్నీ డియోల్, టబూ, అర్బాజ్ ఖాన్, టిన్నూవర్మ, సుధేష్ బెర్రీ, మలై కా అరోరా, అనంగ్ దేశాయ్ తదితరులు
రచన : టిన్నూ వర్మ ,రవి శంకర్ జైస్వాల్
సంగీతం :  సాజిద్ – వాజిద్,  ఛాయాగ్రహణం : రాజూ కేజీ
నిర్మాత : మహేంద్ర ధరేవాల్
విడుదల : జనవరి 25, 2002
***
          సీమ కథల్ని నందమూరి బాలకృష్ణ గుత్తకు తీసుకున్నట్టు, సన్నీడియోల్ దేశభక్తిని కాంట్రాక్టు మాట్లాడుకున్నట్టుంది - ఈ ఆరు మాసాల్లో దేశభక్తితో ఇది మూడో దర్శనం. దేశభక్తికి అసలు సిసలు గుత్తేదారైన సీనియర్ దేశభక్తి పరుడు మనోజ్ కుమార్ కూడా ఇంత ఎక్స్ ప్రెస్ స్పీడుతో దేశ భక్తి సినిమాల్ని దేశం మీద వదల్లేదు. ఈ లేటు వయసులో సన్నీకి ఇక దేశభక్తితోనే కెరీర్ కి ముక్తి అన్నట్టుంది – ‘గదర్’ తో ఒక  హుషారు, ‘ఇండియన్’ ఇంకో బేజారూ ఖాతాలో వేసుకున్న తర్వాత, ఇప్పుడు ‘మా తుజే సలాం’ తో తిరిగి సలాములందుకునే స్థాయి కొచ్చేశాడు. అయితే ఈ క్రెడిట్ అంతా తనదే కాదు. ఈ మూవీ దర్శకుడు, స్టంట్ మాస్టర్ టిన్నూవర్మకే క్రెడిట్ అంతా పోతుంది. ఎందుకంటే, ఈ దేశభక్తి భారీ యాక్షన్ కి అసలు హీరో తనే – నటిస్తూ కూడా! 

          
స్టంట్  మాస్టర్లు దర్శకులయ్యారంటే ఎక్కువగా వాళ్ళ సినిమా సృష్టి ‘బి’ గ్రేడ్ లెవెల్ తో సరిపెట్టుకుంటుంది. టిన్నూ వర్మ దీనికి మినహాయింపు. ఒడలు జలదరించే భీకర పోరాటాల్ని నెంబర్ వన్ గా కంపోజ్ చేసే ఈయనకి, ఒక మంచి కళా హృదయమూ, భావుకతా వుండడం విస్మయం కలిగించేదే అయినా, ఇవే ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఇంకో స్థాయికి తీసికెళ్ళాయి. ఈ మధ్య సినిమాల పేరుతో అదే పనిగా హోరెత్తిస్తున్న ‘పేమ కతల’ ధాటికి బోరెత్తిన ప్రేక్షకులు, ఓసారి ఈ యాక్షన్లో వున్న దేశభక్తిని చూస్తే, కడుపు నిండిపోయి – ‘క్యా మస్త్ ఫిల్మ్ బనాయారే!’  అని తెగ ఉబ్బితబ్బిబ్బవక మానరు. చుట్టూ ఇన్ని ఉద్రిక్తతలేర్పడ్డ గడ్డు పరిస్థితుల్లో ఉబుసుపోక ప్రేమ కథలేనా, కాస్త అటు దృష్టి మరల్చి సరిహద్దులో బలగాలకేసి చూడక్కర్లేదా? సైనికుడక్కడ ధాటీగా నిలబడకపోతే, ఇక్కడ మనకి ఏ ప్రేమ కథలూ, కాకరకాయ కబుర్లూ వుండవు. 


        ‘దూద్ మాంగేతో ఖీర్ దేంగే, కష్మీర్ మాంగేతో చీర్ దేంగే!’ – (పాలు అడిగితే పాయసం ఇస్తాం, కశ్మీర్ ని అడిగితే చీరేస్తాం) అనే నాటు స్లోగన్ తో ప్రారంభమయ్యే కథ, సెంట్రల్ ఐడియా అంచెలంచెలుగా తీసికెళ్ళి ప్రేక్షకుల మెదళ్లలో బలంగా నాటి, అక్కడ్నుంచీ ముకుతాడేసి లాక్కుపోయే కథన చాతుర్యాన్ని మెచ్చ కుండా వుండలేం. ఇందులో నటీనటులకే కాదు, సాంకేతిక నిపుణులకీ ఈ పకడ్బందీ స్క్రిప్టు వాళ్ళ ప్రతిభని చాటుకోవడానికి తిరుగు లేని అస్త్రంలా మారింది. 

          జమ్మూ కాశ్మీర్ లో బటాలిక్ హిమ శిఖరాగ్రాన
, నియంత్రణ రేఖ సమీపంలో, పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, తన పటాలంతో అవుట్ పోస్టు నిర్వహించే మేజర్ ప్రతాప్ సింగ్ (సన్నీ డియోల్) సెలవు మీద బేస్ క్యాంపు కెళ్తాడు. అక్కడ కల్నల్ ఖన్నా (గోవింద్ నామ్ దేవ్) కుమార్తె, ఇంటలిజెన్స్ కెప్టెన్ అయిన సోనియా ఖన్నా(టబూ) వుంటుంది. ఇద్దరికీ పూర్వపరిచయం, ప్రేమా వుంటాయి. ఎంగేజి మెంట్ సన్నాహాల్లో వుంటారు. ఇలా వుండగా, సరిహద్దు సమీప గ్రామం జహానా బాద్ లో సుల్తాన్ లాలా (టిన్నూ వర్మ) అనే బలమైన భూస్వామి వుంటాడు. ఇతడికి ముగ్గురు తమ్ముళ్ళూ, అల్ బక్ష్ (అర్బాజ్ ఖాన్) ఆనే నమ్మిన బంటూ వుంటారు. ఈ నమ్మిన బంటుకి నర్గీస్ (మోనాల్) అనే ప్రియురాలుంటుంది. ఈ బంటు తన యజమానిని గుడ్డిగా నమ్మి, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు చేరవేస్తూంటాడు. తర్వాత ఈ ఆయుధాలతో యజమాని కుట్ర తెలిసిపోతుంది. సుల్తాన్ లాలా కుట్రేమిటంటే, కాశ్మీర్ ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కలిపేసి తను అధిపతి కావాలని. పాకిస్తానీ కమాండర్ గుల్ మస్తాన్ (సుధేష్ బెర్రీ) తో కుమ్మక్కయి ఈ పథక రచన చేస్తూంటాడు. 


         ఇది తెలుసుకున్న బంటు బక్ష్, ఏకంగా గుల్ మస్తాన్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కాశ్మీర్ పోలీసులకి అప్పజెప్పేస్తాడు. దీంతో లాలా రెచ్చిపోయి, బక్ష్ ని మట్టుబెట్టేందుకు పూనుకుంటాడు. ఇటు మేజర్ ప్రతాప్, సోనియాలు, బక్ష్ సాయంతో సరిహద్దు కావల లాలా తండానీ, మిలిటెంట్ల గుడారాల్నీ తుదముట్టించేసి, జెండా పాతేస్తారు. 

          స్థూలంగా ఇదీ కథయినా, దీని కాన్వాస్ – విస్తృతి పెద్దది. ఒకవైపు ప్రతాప్, సోనియాలు, అల్ బక్ష్, నర్గీస్ లతో బాటు, శివ - సత్య సోదరుల హిందూ కుటుంబం, దర్గాలో ఒక ముజావర్ (‘షోలే’లో మౌల్వీ పాత్ర లాంటిది?), ఇంకో వైపు లాలా గ్యాంగ్, మస్తాన్ తండా, ఇంకో దుష్ట ఇన్స్ పెక్టర్ అలీ ఖాన్ లతో బాటు, ఆర్మీ పోస్టు లో ఇంకో అయిదుగురు జవాన్ల కథా కలిసి, కథనానికి కావాల్సినంత ఇంధనాన్ని సమకూరుస్తూంటాయి.  


          అయితే ఇందులో ప్రధాన పాత్ర మేజర్ ప్రతాప్ కాదు. అంటే సన్నీడియోల్ కాదు. సహాయ పాత్రయిన అల్ బక్షే అనిపిస్తాడు. ఈ పాత్రకే నిడివి ఎక్కువ. చివరి ముప్పావు గంట మాత్రమే ప్రతాప్ పాత్ర పూర్తి స్థాయి యాక్షన్ లోకొస్తుంది. అమాయకుడైన ఈ అల్ బక్ష్ యజమాని పట్ల మొదట విధేయతని చాటుకునే దృశ్యాలు, అంకిత భావంతో ప్రియురాలు నర్గీస్ తో సలిపే ప్రేమ కలాపాలు, యజమాని అసలు రూపం తెలిశాక తన విశ్వరూప ప్రదర్శనా, మాతృదేశం కోసం ఏమైనా చేసేసే తెగువా, లోయలో శత్రువుల పాలిట మృత్యు నీడై సంచారం ...ఇంత కథ ఈ పాత్రకి కల్పించడాన్ని బట్టి చూస్తే, దర్శకుడి ప్రధానోద్దేశమేమిటో స్పష్టమవుతుంది. ఎలాగూ సైనిక సాహసాల సినిమాలు చాలా వచ్చేశాయి – ఇక ఉగ్రవాదంతో తప్పుదారి పట్టిపోతున్న ముస్లిం యూత్ కి, ఓ కనువిప్పు కావాలంటే, దేశమంటే ఏమిటో తెలియాలంటే, అది అల్ బక్ష్ పాత్రతోనే సాధ్యమవుతుంది. చెప్పాలనుకున్నపాయింటు సూటిగా, బలంగా వుంటుంది. ఈ పాత్రని అర్బాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ తమ్ముడు) గుర్తుండేలా పోషించాడు. 



      పూర్తిగా అవుట్ డోర్ లోనే సాగే ఈ యాక్షన్ మూవీలో కాశ్మీర్ ని పండు వొలిచినట్టు వొలిచి చూపెట్టాడు దర్శకుడు. కాశ్మీర్ అందాల్ని అందమైన అల్బంలా తీర్చిదిద్దాడు. రాజూ కేజీ అద్భుత కెమెరా పనితనం పట్టుకున్న సీనిక్ బ్యూటీ ఒక అందమైన అనుభవం. ఫారిన్ సినిమాల్లోంచి ఫైట్స్ నీ, ఇతర యాక్షన్ సీన్స్ నీ కాపీ కొట్టేస్తున్న ఈ రోజుల్లో, యాక్షన్ డైరెక్టర్ గా వర్మ వొరిజినల్ టాలెంట్ ప్రదర్శనని సంపూర్ణంగా ఇక్కడ చూస్తాం. రక్తం గడ్డకట్టే మంచులో రెండు జిహాదీ గ్రూపుల నడుమ వెన్నులో చలిపుట్టించే గన్ ఫైట్, టేక్రీ మీద జెండా ఎగరేసేందుకు గుర్రాల మీద పడే పోటాపోటీ, గెరిల్లా పద్ధతుల్లో అల్ బక్ష్ తీసే చావు దెబ్బలు, చివరి అరగంట పాటూ సాగే యుద్ధ దృశ్యాలూ, అత్యంత హైలైట్స్ అని చెప్పుకోవాలి. వీటికి ప్రేక్షకుల్లోంచి అమ్మాయిలు కూడా కేరింతలు కొట్టారంటే, లింగబేధాలకి అతీతంగా, అపూర్వంగా ఈ దృశ్యాల్లో రగిలించిన దేశభక్తి భావ బలం అలాంటిది. 

          దర్శకుడు మెలోడ్రామాని కూడా వదులుకోలేదు. ఆయుధాలకోసం అల్ బక్ష్ తన గ్రూపుతో సరిహద్దు దాటుతున్నప్పుడు, వద్దని అతణ్ణి వారిస్తూ ప్రియురాలు నర్గీస్ పాడే సోలో పాట చిత్రీకరణ, కదిలించే విధంగా వుంటుంది మెలోడ్రామా పెల్లుబుకుతూ. శత్రు వినాశం కోసం తనని ఆశీర్వదించాల్సిందిగా అల్ బక్ష్ వచ్చినప్పుడు, శివ (అనంగ్ దేశాయ్) పూజకు ఉపక్రమిస్తూంటాడు. అప్పుడేకంగా హారతి పట్టి తిలకం దిద్దేస్తాడు అల్ బక్ష్ కి. దేశాన్ని మించిన దైవం ఏముంటుంది. సోదరభావం, ఆధ్యాత్మిక - దేశభక్తి భావాలూ ఇమిడి వున్న ఈ దృశ్యం ఇంకో హైలైట్ గా చప్పట్లు కొట్టించుకుంటుంది. 



     అలాగే ఒక సోల్జర్ (శరత్ సక్సెనా) వుంటాడు. ఇతను వివిధ భారతి రేడియో సరిహద్దులో ఫౌజీ భయ్యాల కోసం ప్రసారం చేసే మీరు కోరిన పాటలు ‘జయమాల’ కార్యక్రమానికి  ఎన్ని ఉత్తరాలు రాసినా కోరిన పాట రాదు. ఆఖరికి ఆ పాట వస్తున్న సమయానికి మిలిటెంట్లు దాడి చేస్తారు. అలా పురాతన యుద్ధ చిత్రం ‘హకీఖత్’ లోని ‘కర్ చలే హమ్ ఫిదా హోకే తన్ సాథియో’ సూపర్ హిట్ పాట ఓ పక్క రేడియోలో వస్తూంటే, మిలిటెంట్లతో భీకర పోరులో ఆ సోల్జర్ అశువులు బాసే దృశ్యానికి కరుణ రసం వెల్లువవుతుంది. అతను ఆ పాట పదేపదే కోరుకోవడం (సెటప్), ఆ కోరిక ఈ పరిణామాలతో (పే ఆఫ్) తీరడం,  అస్సలు మనం వూహించలేని కథన చాతుర్యమే.

          అయితే ఇక్కడ రెండు పొరపాట్లు దొర్లాయి. ‘జయమాల’ కార్యక్రమంలో ప్రెజెంటర్ గా ఆలిండియా రేడియోలో ఇప్పుడు లేని లివింగ్ లెజెండ్ అమీన్ సయానీ గొంతు విన్పించడం, ‘జయమాల’ కార్యక్రమం వచ్చే సమయాన్ని పగలుగా చూపించడం రెండూ పొరపాట్లే.


          ఇక పోరాటాల మాస్టర్ వర్మ ఇంకో క్రియేటివ్ పార్శ్వాన్నికూడా ఇక్కడ ఇంకో చోట చూడొచ్చు. ‘8 పిఎం విస్కీ’ కి ఇటీవల ప్రసారమవుతున్న యాడ్ ఫిలిం మీద చేసిన ప్రయోగం! అలాగే సరిహద్దు కావల మిలిటెంట్ల స్థావరాన్ని ధ్వంసం చేసే దృశ్యంలో పై అధికారి సందిగ్థత, సన్నీ డియోల్ లేవనెత్తే ప్రశ్నలూ ఆలోచనాత్మకంగా వుంటాయి. అయితే అతడి వాదం ఎంత సబబైనా, ఇజ్రాయెల్ లా తెగించే అవకాశం మనకుందా? పాలస్తీనా, పాకిస్తాన్ ఒకటేనా? 



     ఇందులో డ్రీమ్ సాంగ్స్ లేవు. అన్నీ సందర్భాను సారం వచ్చే గీతాలే. ఇక టిన్నూ వర్మ పోషించిన విలన్ లాలా పాత్ర విషయాని కొస్తే,  అతడి బేబీ ఫేసుకి ఈ పాత్ర సరీగ్గా సరిపోయింది. వర్మ నటనలో అతి లేదుగానీ, సన్నీడియోలే  ఫైనల్ గా పోరాటంలోకి దిగాక ఓవరాక్షన్ ఎక్కువ చేశాడు (సన్నీ అంటే సన్నం కాదు, నాటు మోటేమో!). అంతంత గొంతేసుకుని ఆ అరుపులు అరవడం అతడికే సాధ్యం. అతడి గొంతు వున్నాక ఇక మందు పాతరల అవసరమే లేదు. అన్నేసి తూటాలూ, అగ్నిగోళాలూ పేల్తూంటే కూడా ఒక్కటీ తగలకపోవడం చూసి ప్రేక్షకులు ఎగతాళి చేయడం ఓ పక్క, ఆ తర్వాత సినిమా డాక్టర్ పాత్ర వచ్చి – ‘అరె ఒక్క గుండు కూడా తగల్లేదే ఆశ్చర్యం!’  అనే చోద్యం ఇంకో పక్క! పుండుమీద కారం జల్లినట్టు! మరెందుకా  పేలుడు పదార్థాలతో వృధా ఖర్చంతా?  

          పోతే, పాక్ కి చాలా చురకలేయడంతో పాటు, ‘మీరెంతో మంచివారు, ఈ దేశానికి మీరు గర్వకారణం’ అని అంతిమంగా ముసల్మానులకి ధృవీకరణా పత్రాలిచ్చే డైలాగులూ వున్నాయి. ఇలా గత సినిమాల్లో కన్పించదు. జాతీయ సమగ్రతకి ప్రతిరూపమైన బాలీవుడ్, ఒకవేళ ఇలా ఇప్పుడు తెలియకుండానే రాజకీయ నాయకుల పాత్ర పోషిస్తోందేమో పరిశీలించుకోవాలి. ఏమైనా ఈ సిన్సియర్ ప్రయత్నానికి తప్పుదారి పట్టే ఒక్క ముస్లిం యువకుడైనా క్షణమాగి ఆలోచిస్తే, ఈ స్టంట్ మాస్టర్ ఆశయం నెరవేరినట్టే. ఆల్ ది బెస్ట్ మిస్టర్ వర్మా.


          ―సికిందర్
         
(ఆంధ్రభూమి - 2002)