రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, September 22, 2019

874 : మూవీ నోట్స్


      పెద్ద సినిమాల సంక్షోభం ఇంకా తీరడం లేదు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆది సాయికుమార్ లాంటి గుర్తింపు వున్న హీరోల నుంచీ, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ సినిమాలు 31 విడుదలైతే 11 మాత్రమే గట్టెక్కాయి. పెద్ద సినిమాల ప్రమాణాలు చిన్నా చితకా సినిమాలకేం తీసి పోవడం లేదు. ఈ తొమ్మిది నెలల్లో 31 లో 20 పెద్ద సినిమాలు ఫ్లాపయ్యాయంటే పరిస్థితిని అర్ధం జేసుకోవచ్చు. సినిమా చిన్నదైనా పెద్దదైనా కథతోనే తీస్తారు. టేబుల్ తోనో, కుర్చీతోనో తీయరు. స్టార్స్ తో కూడా తియ్యరు. కథతోనే తీస్తారు. సినిమా ఫ్లాపయిందంటే మాత్రం టేబుల్నో కుర్చీనో కారణంగా చూపిస్తారు. కథ చీకేసిందని ఒప్పుకోరు. కథ నిప్పులాంటి స్వచ్ఛమైనది. పప్పు లాంటి ప్రేక్షకులే ఫ్లాప్ చేస్తున్నారు. ఒక్కోసారి ప్రేక్షకులు కూడా తెలిసో తెలీకో పప్పు లాంటి సినిమాల్ని కూడా నిప్పులాంటి హిట్ చేసేస్తారు. ఇలాటివి హిట్టయిన 11 పెద్ద సినిమాల్లో వున్నాయి. అప్పుడా తప్పుల తడక కథే కథా రాజ్యాంగ మైపోతుంది. చూశారా, కథకి రూల్స్ గీల్స్ లేవని కింద పడేస్తారు. ఇలా పప్పులాంటి సినిమాలు కథా రాజ్యాంగాన్ని నిర్ణయిస్తూంటాయి. కాబట్టి ఇక హిట్టయిన పప్పులాంటి సినిమాల్ని స్క్రీన్ ప్లేలకి  కథా రాజ్యాంగంలా వాడుకుని బోధించాలేమో ఆలోచించాలి.

         
మిళ డబ్బింగ్ సినిమాలకి ప్రేక్షకులు నో ఎంట్రీ పెట్టేస్తున్నారు. మనకే చాలా మంది స్టార్స్ వున్నారు, ఇంకా వీళ్ళ నెక్కడ మోస్తామన్నట్టు చెక్ పోస్ట్ పెట్టేశారు. వచ్చిన సినిమాని వచ్చినట్టు వెనక్కి పంపించేస్తున్నారు. సూర్య, విక్రమ్, విజయ్, ఆర్య, ప్రభుదేవా, లారెన్స్ రాఘవ, కన్నడ నుంచి కిచ్చా సుదీప్ ఎవరైనా కానీ, ఇదివరకటి ఓపెనింగ్సే ఇవ్వకుండా అవమానిస్తున్నారు. ఇక తమిళ డబ్బింగులు మానుకుంటే మంచిది. తమిళంలో కొత్త స్టార్ల కొరత వుంది. తెలుగులో విజయ్ దేవరకొండ, నాని, వరుణ్ తేజ్, శర్వానంద్ లాంటి కొత్త తరం బ్రాండ్ న్యూ స్టార్లు తమిళ డబ్బింగుల్లో కనిపించడం లేదు. విశాల్, కార్తీ, విజయ్ ఆంటోనీ లాంటి ఓ ముగ్గురు ఏం సరిపోతారు. మనకున్నంత మంది వారసులుకూడా అక్కడ లేరు, అదీ సమస్య.
 
         
స్క్రీన్ ప్లే సంగతులు ఒకే మూసలో రాయడం లేదు. నేటి అవసరాన్నిబట్టే అవి వుంటున్నాయి. ఇది వరకు చేసినట్టుగా మొత్తం అంకాల విశ్లేషణ అంతా చేయకుండా, సినిమా హిట్టవడానికో, ఫ్లాపవడానికో కారణమైన ఒకటి రెండు అంశాలపైనే విశ్లేషణ లుంటున్నాయి. ఈ తేడా గమనిస్తే వీటిని ఆపెయ్యాలని ఎవరూ కోరుకోరు. ఏ సినిమా ఏమిటో ఒక రికార్డు మెయింటెయిన్ చేయడం కోసమైనా స్క్రీన్ ప్లే సంగతుల అవసరముంది. చదివి తీరాలని నిర్బంధమేమీ లేదు.

         
డైలాగ్ వెర్షన్ అంటే డైలాగులు రాసుకోవడంలా వుంది కొందరి వరస చూస్తూంటే. పైగా అన్ని జానర్లకీ కలిపి ఒకే మూస డైలాగులు రాసెయ్యడం. మూస సినిమాలకి సాంకేతికంగా డైలాగ్ వెర్షన్ రాసుకోనవసరం లేదు. డైలాగులు రాసేసి, అడ్డ గీతలు గీసేసి షాట్ డివిజన్ అనుకుంటే సరి. ఇతర సినిమాలకి షాట్ డివిజన్లు కాదు, అది షూట్ చేసేప్పటి విషయం. లెఫ్ట్ సాంకేతికంగా వుండాలి. మైక్రో లెవెల్లో రాయాలి. సీను పేపర్ మీద అనుభవం కావాలి. ఆ అనుభవమయ్యే దాకా పాలిష్ చేస్తూనే వుండాలి. మూస సినిమాలకి వారం రోజుల్లో  ముతక డైలాగ్స్ రెడీ, స్క్రిప్ట్ వూడకుండా లాక్ చేశామని చంకలో పెట్టుకుంటే సరిపోతుంది పవిత్ర గ్రంథంలా. ఇతర సినిమాలకి ఐదు వారాలు పడుతుంది. రెండు వారాలు రఫ్ రాయడానికి, ఓ వారం రాసింది మర్చిపోయి తిరగడానికి. ఇంకో రెండు వారాలు రాసింది ఫ్రెష్ మైండ్ తో తీసి, కొత్త ఐడియాలతో, కొత్త సమాచారంతో, అదే పనిగా పాలిష్ పట్టడానికి. కడుపుకి పాలిష్ బియ్యం తింటున్నవిశ్వాసానికి. ఇంత టైం నిర్మాతలు ఇవ్వడం లేదంటే, అప్పుడు మూసకెళ్ళి మరో మూస తీయాలి.

         
రోమాంటిక్ కామెడీలకి అలవాటు పడిన ప్రాణాలు మార్కెట్ పిలుపునిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల ఆరాటం పెంచుకుంటున్నాయి. కానీ అవి రాయలేకపోతున్నాయి, తీసే సంగతి తర్వాత.  గత ఇరవై ఏళ్ళూ ఊక దంపుడుగా రోమాంటిక్ కామెడీలతో కాలక్షేపం చేశాక, ఇప్పుడు మార్కెట్ తిరగబడే సరికి, సృజనాత్మక లేమి అంటే ఏమిటో కొత్తగా తెలిసివస్తోంది. కలిమి రోమాంటిక్ కామెడీ లతోనూ లేదు, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్లతోనూ లేమితో పరంపరాగత పారవశ్యమే.

సికిందర్