రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, అక్టోబర్ 2022, సోమవారం

1229 : రివ్యూ!

రచన- దర్శకత్వం : లక్ష్మణ్ కృష్ణ
తారాగణం : బెల్లంకొండ గణేష్, ర్షా బొల్లమ్మ, దివ్య శ్రీపాద, ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు 
సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సూర్య
బ్యానర్ : సితార ఎంటర్టయిన్మెంట్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 5, 2022
***
        సరా విడుదలల్లో స్వాతి ముత్యం ఒకటి. సితార ఎంటర్టయిన్మెంట్ నుంచి ఒక కుటుంబ కాలక్షేపం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం. ఐదు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి వర్షా బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కృష్ణ కొత్త దర్శకుడు. దసరాకి ఒకవైపు మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్’, మరోవైపు కింగ్ నాగార్జున ఘోస్ట్ పెద్ద స్టార్స్ సినిమాలు. ఈ రెండిటి మధ్య ఓ చిన్న సినిమాగా స్వాతి ముత్యం నిలబడే అవకాశముందా? నిలబడే విషయమేమైనా వుందా? అసలిందులో వున్న కొత్తదనమేమిటి? ఇవి తెలుసుకుందాం... 

కథ

పిఠాపురం లోని విద్యుత్ శాఖలో బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) క్లర్కుగా పని చేస్తూంటాడు. తల్లిదండ్రులు (రావు రమేష్, ప్రగతి), డాక్టర్ బుచ్చిబాబు (వెన్నెల కిషోర్) అనే మిత్రుడూ వుంటారు. ఉద్యోగంలో చేరాడు కాబట్టి తల్లిదండ్రులు పెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. భాగ్యలక్ష్మి (వర్షా బొల్లమ్మ) అనే స్కూలు టీచర్ తో పెళ్ళి చూపులు, పెళ్ళీ కుదురుతాయి. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (నరేష్, సురేఖా వాణి), పెదనాన్న (గోపరాజు రమణ) జోరుగా పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళింట్లో బిడ్డనెత్తుకుని శైలజ (దివ్యా శ్రీపాద) అనే క్రైస్తవ అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. ఈ బిడ్డ నీదే అంటుంది గణేష్ తో. అవును నాదే అంటాడు గణేష్. పెళ్ళింట్లో గోలగోల అవుతుంది. పెళ్ళాగిపోతుంది. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. బిడ్డని గణేష్ చేతుల్లో పడేసి శైలజ కూడా వెళ్ళిపోతుంది.

ఏమిటీ పరిస్థితి? అసలేం జరిగింది? బిడ్డని కన్న గణేష్ ఎందుకీ పెళ్ళికి సిద్ధపడ్డాడు? శైలజ ఎవరు? ఆమెతో గణేష్ కేం జరిగింది? ఇప్పుడు బిడ్డతో ఒంటరిగా మిగిలిన గణేష్ ఏం చేశాడు? భాగ్యలక్ష్మి సంగతేంటి? ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు.

ఎలావుంది కథ

రోమాంటిక్ డ్రామా జానర్ కి చెందిన రొటీన్ కథ. దీనికి యూత్ అప్పీల్ తక్కువ. ఇందులో హీరోయిజం వుండదు. తమ ప్రేమ సమస్యని హీరో హీరోయిన్లు తాము పరిష్కరించుకునే స్వావలంబనతో లేక, పెద్దల చేతుల్లో పరిష్కారమయ్యే రోమాంటిక్ డ్రామా జానర్ కథ. అయితే తెలుగులో దాదాపు అన్ని రోమాంటిక్ డ్రామాలు సెకండాఫ్ లో హీరో హీరోయిన్లు విడిపోవడం, విషాదంగా మారడం జరుగుతాయి. విషాదం వర్కౌట్ కాక అవన్నీ ఫ్లాపవుతున్నాయి. ప్రస్తుత రోమాంటిక్ డ్రామా ఫస్టాఫ్- సెకండాఫ్ రెండూ కామెడీతోనే నడవడంతో బ్రతికి బైట పడింది.    

ఈ కథకి కేంద్ర బిందువు సరొగసీ (అద్దె గర్భం) అంశం. దీన్ని సీరియస్ గా కాకుండా హిందీ మిమీ (2021) లో లాగా హాస్య ధోరణిలో చెప్పడం. టౌను పాత్రలతో టౌను కథగా తీయడం. కుటుంబ కాలక్షేపం. అయితే ఫస్టాఫ్ పెళ్ళి చూపులు, ప్రేమ, పెళ్ళీ ఘట్టం వరకూ 50 నిమిషాలు విషయం లేక డల్ గా సాగుతుంది. పెళ్ళిలో బిడ్డనెత్తుకుని వచ్చే శైలజ పాత్రతో కథ మొదలవుతుంది. అక్కడ్నించి సెకండాఫ్ సరొగసీ పాయింటుతో కామెడీకి కాస్త ఊపొస్తుంది. ఇంకోటేమిటంటే, ఈ కథ సాగదీస్తే నిలబడక పోవచ్చని గంటా 50 నిమిషాల్లోనే ముగించడం. అయితే రోమాంటిక్ డ్రామా - కుటుంబ కాలక్షేప సినిమాలు కురచ నిడివితో తృప్తిపరుస్తాయా అన్నది ప్రశ్న.

కృష్ణ వ్రింద విహారి లో హీరోయిన్ కి పిల్లలు పుట్టని విషయం దాచి పెట్టి ఆడే నాటకంగా కథ వుంటుంది. ఈ నాటకాలు ఔట్ డెటెడ్ కథలు. ఇది ఫ్లాపయ్యింది. ప్రస్తుత కథలో విషయం దాచిపెట్ట లేదు. పెళ్ళికి ముందు పుట్టిన బిడ్డతో బయట పడ్డ గుట్టుకి పరిష్కారం వెతికే హాస్య కథగా వుంది. అయితే ఇది చెప్పాల్సిన అసలు కథ కాదు. కథలో వున్న అసలు కథ పట్టుకోలేక పోవడం ఈ కథతో వచ్చిన సమస్య.

ఇక చెప్పిన కథకి హాస్య కథనం మరీ అద్భుతమేమీ కాదు. ఎందుకంటే సమస్య పుట్టించిన, దాంతో కథ నడపాల్సిన, ప్రధాన పాత్ర అయిన హీరో, పాసివ్ గా వుండిపోవడంతో, హాస్య ప్రహసనాలు అతను సృష్టించడం లేదు. ఇతర పాత్రలు సృష్టించుకుంటున్నాయి. అతను ఏ పరిస్థితిలో వేరే అమ్మాయి సరొగేట్ గా బిడ్డని కనాల్సి వచ్చిందో, పెళ్ళి చెడిన సమయంలో చెప్పేసి వుంటే, యాక్టివ్ హీరో పాత్రయ్యే వాడు. చెప్పక పోవడం వల్ల అతను వేరే అమ్మాయితో శారీరక సంబంధంతో బిడ్డని కన్నాడని ఇతర పాత్రలు అపార్ధం చేసుకుంటున్నాయి. ఈ అపార్ధం తొలిగేదెలా అన్నది పాయింటుగా చేసుకుని కథ నడిపారు. ఇది రాంగ్. చెప్పాల్సిన అసలు కథ ఇది కాదు.

ముందు కథకి ఐడియాని సరీగ్గా నిర్మించుకుని వుంటే, అపార్ధం అనేది నేటి బాక్సాఫీసు ఫీలయ్యే పాయింటు కాదనీ, నేటి ఆధునిక కాలపు కొత్త  సమస్య అయిన - సరొగేట్ బిడ్డతో కుటుంబం - సమాజం ఎలా రియాక్ట్ అవుతాయనేది  బాక్సాఫీసు అప్పీల్ నిచ్చే డైనమిక్ పాయింటవుతుందనీ తెలిసేది కొత్త దర్శకుడికి. ఇదీ చెప్పాల్సిన అసలు కథ. ముందు మార్కెట్ యాస్పెక్ట్ ని విశ్లేషించుకుని ఐడియాని నిర్మించుకోక పోతే, ఎంత క్రియేటివ్ యాస్పెక్ట్ ప్రదర్శించుకున్నా అది మార్కెట్ కి దూరంగానే వుంటుంది. ఇది సినిమాలకే కాదు, సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. సాహిత్యంలో సుత్తి కథలు చాలా వస్తున్నాయి.

అపార్ధం - సరొగేట్ సమస్యలు రెండుంటే, సమకాలీన చర్చనీయాంశం సరోగసీ  సమస్యే. కొత్త దర్శకుడిగా ఈ కొత్త సమస్య గురించి చెప్పాలి గానీ, ఇంకా అపార్ధం తొలగించడమనే అరిగిపోయిన రొటీన్ కాదు. ఈ అపార్థం తొలగించే కథకి పిఠాపురం లాంటి టౌను నేపథ్యం దాకా కూడా వెళ్ళనవసరం లేదు. ప్రొడక్షన్ కార్యాలయం వున్న నగరంలోనే  చెప్పొచ్చు. బడ్జెట్ ఆదా అవుతుంది.

కానీ ఇప్పుడు టౌను కథల ఉద్దేశం - మార్కెట్ యాస్పెక్ట్ వేరే వుంటోంది. హిందీ సినిమాల్లో నగరాల్లో ఆధునిక జీవన పోకడలతో ఉత్పన్నమయ్యే ఉపద్రవాల్ని నేపథ్యం మార్చి టౌను కథలుగా సినిమాలు తీస్తున్నారు. సరొగేట్, సహజీవనం, గే కథలు వంటి నగరపు ఆధునిక పోకడల్ని, వీటి గాలి సోకని నిద్రాణంగా వుండే టౌన్లలో ప్రవేశ పెట్టి కథలకి షాక్ వేల్యూ సృష్టించి సక్సెసవుతున్నారు. సిడ్ ఫీల్డ్ చెప్పినట్టు ఎగైనిస్ట్ ది గ్రెయిన్ టెక్నిక్ వాడుతున్నారు. అంటే, నేపథ్యం ఒకటుంటే దానికి వ్యతిరేకంగా వుండే కథ, లేదా సీన్లు సృష్టించడం.

పిఠాపురం లాంటి నిద్రాణంగా వుండే టౌన్లో షాకింగ్ గా సరొగేట్ కథనెత్తుకుంటే ఎగైనిస్ట్ ది గ్రెయిన్ టెక్నిక్ అవుతుంది. అపార్ధం తొలగించే కథ కాదు. ఈ షాకుతో టౌను పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటాయనేది హాస్యాయుతంగా చెపితే ఇది కథకి తగ్గ కామెడీ అవుతుంది తప్ప, అపార్ధం సృష్టించి దాంతో కామెడీ చేయడం కాదు.

బిడ్డనెలా కన్నాడో హీరో ముందే చెప్పేస్తే ఆ అసలు సమస్యతో పాత్ర, కథ రెండూ బలంగా వుండేవి. అలా కన్న బిడ్డని ఎలా అంగీకరించాలా అన్నది, అంగీకరిస్తే హీరో పెళ్ళెలా అవుతుందన్నది పరిష్కరించాల్సిన సమస్యలుగా వుండేవి. కానీ హీరో క్లయిమాక్స్ వరకూ హీరోయిన్ కీ, ముగింపు వరకూ పెద్దలకీ సరొగేట్ విషయమే చెప్పకుండా, అర్ధం లేకుండా సతమవుతూ వుంటాడు బిడ్డతో. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని చివర్లో హీరోయిన్ అడుగుతుంది. ఈ ప్రశ్నే పెళ్ళి గొడవలో (ఇంటర్వెల్లో) మనకి తడుతుంది. ప్రశ్న ఇదే, ఇంటర్వెల్లో స్థాపించాల్సిన సమస్యా ఇదే.

మరొకటేమిటంటే సమస్యగా వున్న ఆ బిడ్డకి పాత్రే లేదు. ఎత్తుకుని తిరగడం తప్ప. హాలీవుడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8 యాక్షన్ మూవీలో నెలల బిడ్డతో ఎంత కామెడీ వుంటుంది. ఎంత ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. పాత్రల్ని అయ్యో పాపమని దర్శకుడు జాలిపడితే కామెడీ రాదు.  

నటనలు – సాంకేతికాలు

బెల్లంకొండ గణేష్ పాత్ర స్వాతి ముత్యం అన్పించుకోవాలీ కాబట్టి సాత్వికంగా వుండాలేమో. ఇది కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రాముడు మంచి బాలుడుగా నటించడానికేమీ లేకుండా పోయింది. కామెడీ సినిమా అన్నప్పుడు క్యారక్టర్ ఫన్నీగా వుంటూ హిలేరియస్ కామెడీలు పుట్టిస్తూ వుంటే, కొత్త హీరోగా నటన ప్రదర్శించుకునే అవకాశం వుండేది. పైగా 50 నిమిషాలు డల్ గా సాగే ఫస్టాఫ్ హుషారుగా మారేది. ఇక ఎలాగూ రోమాంటిక్ డ్రామా అన్నాక హీరో చేయాల్సింది చేసుకోక పెద్దలే చక్కబెడతారు గనుక, సెకెండాఫ్ గణేష్ కి పెద్దగా బాధ్యత లేకుండా పోయింది. పెద్దల్ని సమస్యల్లో పడేసిన వాడు సమస్యల్ని పెద్దలకే ఎలా వదిలేస్తాడో రోమాంటిక్ డ్రామాల లాజిక్ వుండని తతంగం. రెండో సినిమాతోనైనా గణేష్ యాక్టివ్ క్యారక్టర్ నటిస్తే నటుడుగా తనేమిటో తెలుస్తుంది.

టీచర్ పాత్రలో వర్షా బొల్లమ్మ కూడా అసహాయురాలే. పెళ్ళి చెడిపోయాక ఇంటికి పరిమితమై కన్పించదు. ఏం చేయాలో ఆలోచించుకోకుండా దిగులుతో వుండిపోతుంది. టీచర్ గా తన సమస్యకి తనే కుంగిపోతే విద్యార్థులకి ఏం బోధిస్తుందో అర్ధంగాదు. ఈమె పెళ్ళికి తోటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని రప్పించడం ప్రొడక్షన్ మేనేజర్ మర్చిపోయి నట్టుంది. లేక హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు రాలేక పోయారేమో. హర్ష గ్లామరస్ గా మాత్రం బావుంది. హావభావాలు పలికిస్తుంది.

వెన్నెల కిషోర్ డాక్టర్ పాత్ర కృష్ణ వ్రింద విహారి దుష్ట సమాసం టైటిల్ సినిమాలో డాక్టర్ పాత్ర లాంటిదే. రెండిట్లోనూ హీరోల్ని ఇరికించి వదిలే అయోమయపు కామెడీ డాక్టర్ పాత్ర. పరిమితంగా నవ్విస్తాడు. సహాయ పాత్రల్లో ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు ...చాలా మంది వున్నారు గానీ, అందర్నీ డామినేట్ చేస్తూ ఫన్నీ పాత్ర పోషించిన గోపరాజు రమణ ఎక్కువ దృష్టి నాకర్షిస్తాడు. ఈయనతో బాటు రావు రమేష్ టౌను మనుషుల్లా వుంటారు.

మహతీ స్వర సాగర్ సంగీతం కృ.వ్రి. వి వికృత టైటిల్ సినిమాలో లాగే వర్కౌట్ కాలేదు. పాటలు సాహిత్యం, సంగీతం అసలేమీ బాగాలేవు. సితార వారి ప్రొడక్షన్ విలువలు మాత్రం బలంగా వున్నాయి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ నేటివ్ రచన, దర్శకత్వం, ముఖ్యంగా కామెడీ డైలాగులు బావున్నాయనుకుని ఓసారి మాత్రం చూడొచ్చు.

—సికిందర్