రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 23, 2024

1430 : మలయాళం రివ్యూ


రచన- దర్శకత్వం : జిత్తూ మాధవన్
తారాగణం : ఫాహద్ ఫాజిల్
, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, శంతన్, అంబన్, మన్సూరలీ ఖాన్, నీరజా రాజేంద్రన్ తదితరులు
సంగీతం :
సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : సమీర్ తాహిర్
బ్యానర్స్ : అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్
నిర్మాతలు : నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్
విడుదల : మే 9
, 2024 (అమెజాన్ ప్రైమ్)

 ***

        లయాళం సినిమాలు తిరిగి హిట్ బాట పట్టి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి, 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకూ వరుసగా 5, 15,30 కోట్ల బడ్జెట్స్ తో తీసిన సినిమాలు 100 కోట్లకి పైగా వసూళ్ళు సాధిస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆడు జీవితంల తర్వాత ఇప్పుడు ఆవేశం...ఏప్రిల్ 11 న విడుదలైన ఆవేశం అయితే 4 వారాల్లో 155 కోట్లు వసూలు చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ కొచ్చేసింది. దీన్ని 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫాహద్ ఫాజిల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ ఈ రోజు (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం మలయాళం భాషలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ప్రసారమవుతున్న ఈ మూవీ లో అసలేముంది? ఎందుకింత హిట్టయ్యింది? తెలుసుకుంటే సినిమా తీయడం చాలా సింపుల్ విషయమని తెలిసిపోతుంది. హైప్ లు, బిల్డప్పులు, హీరోయిన్లు, రోమాన్సులు కూడా అవసరం లేదని అర్ధమైపోతుంది. వివరంగా చూద్దాం...

కథ

అజు (హిప్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శంతన్‌ (రోషన్ షానవాజ్) అనే ముగ్గురూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగుళూరు వస్తారు. కాలేజీ హాస్టల్ కంటే ప్రైవేట్ హాస్టల్లో స్వేచ్ఛగా వుండొచ్చని అక్కడ చేరతారు. కాలేజీలో సీనియర్ విద్యార్ధి కుట్టి తో మాటామాటా పెరిగి అతడి అహాన్ని దెబ్బతీస్తారు. ప్రతీకారంగా కుట్టి అతడి గ్యాంగ్ ముగ్గుర్నీ కొడతారు. దీన్ని అవమానంగా భావించి అజు ప్రతీకారం తీర్చుకోవడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్స్ ని వెతకడం ప్రారంభిస్తాడు. ఒక బార్ లో ముగ్గురికీ మలయాళీ-కన్నడిగ గ్యాంగ్ స్టర్ రంగా (ఫాహద్ ఫాజిల్) పరిచయమవుతాడు. అతను మెడకి, చేతులకి బాగా బంగారం వేసుకుని, వైట్ డ్రెస్ లో వుంటాడు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అతిగా స్పందిస్తాడు. అతడితో స్నేహం కొనసాగిస్తూ కాలేజీలో కుట్టి గ్యాంగ్ వల్ల తమకి జరిగిన అవమానం గురించి చెప్తారు. రంగా తన గ్యాంగ్ ని పెట్టి కుట్టినీ, అతడి గ్యాంగ్ నీ చిత్తుగా తన్నిస్తాడు. అయితే అజు అండ్ ఫ్రెండ్స్ కి దీంతో సంతృప్తి కలిగినా, రంగాతో స్నేహం వదులుకోలేని పరిస్థితి వుంటుంది, అతను వెంటపడి స్నేహం చేస్తూంటే.
       
దీంతో చదువులో వెనుకబడిపోతారు.
పరీక్షలు తప్పుతారు, ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయబోతే, బతిమాలుకుని పరీక్షలు క్లియర్ చేస్తామని మాటిస్తారు. కానీ పరిస్థితిని రంగా అర్ధం జేసుకోడు. అతను హర్ట్ అవకుండా స్నేహం ఎలా వదులుకోవలో వీళ్ళకీ అర్ధం గాదు. ఇంతలో రంగా మాజీ బాస్ రెడ్డి (మన్సూరలీ ఖాన్) రంగాని  చంపడానికి ఈ ముగ్గురి సాయం కోరతాడు.
       
ఇప్పుడేం ఛేశారు
? రంగాని వదిలించుకుని చదువు మీద దృష్టి పెడదామంటే రెడ్డి వచ్చి సాయం అడుగుతాడేమిటి? రంగాని వదిలించు కోవడమంటే అతడ్ని చంపడమేనా? ఇలా ఇన్ని సమస్యల్లోంచి ఎలా బయటపడ్డారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది చాలా తేలికపాటి యాక్షన్ కామెడీ కథ. ఎంటర్టయిన్ చేయడమే ముఖ్యోద్దేశం. ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ తమకి జరిగిన  అవమానానికి ప్రతీకారం కోసం గ్యాంగ్ స్టర్ ని ఆశ్రయిస్తే, ఆ గమ్మత్తయిన కామెడీ గ్యాంగ్ స్టర్ ఈ ప్రతీకారం తీర్చి బదులుగా స్నేహం చేయడం మొదలెట్టాడు. దీంతో వాళ్ళ చదువు గల్లంతై అతడ్ని వదిలించుకోవడమెలా అనుకుంటే, ఇంకో గ్యాంగ్ స్టర్ వదిలించుకునే మార్గం చెప్పాడు... ఇంతే కథ. ఈ స్పీడు యుగంలో భారీ కథలు అక్కర్లేదు. ఈ తేలికపాటి కథకి రెండున్నర గంటలు కూర్చోబెట్టే కథనం చేయడం దగ్గరే  కష్టపడాలి, అంతే. సినిమాకి ఇంత చాలు. ఎక్కువైతే ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. హాలీవుడ్ ది బీకీపర్ కూడా ఇలాగే యాక్షన్ ఎక్కువ, స్టోరీ తక్కువ.  
       
అయితే ఈ తేలికపాటి స్టోరీని నిలబెట్టిన ఎలిమెంట్ ఇంకోటి కూడా వుంది. ఫాహద్ ఫాజిల్ గ్యాంగ్ స్టర్ క్యారక్టర్ తీరుతెన్నులు. అంతు చిక్కని మనస్తత్వంతో
, ఎప్పుడేం చేస్తాడో తెలియని బిహేవియర్ తో, సంతోషమైనా, కోపమైనా, ఏదైనా చాలా అతి చేసే ఎమోషనల్ క్యారక్టర్ గా తన చుట్టూ తిరిగే కథతో ఆడుకోవడం. ఈ క్యారక్టరైజేషన్ లేకపోతే తేలికపాటి స్టోరీకూడా ఏమీ చేయలేదు.
       
ఫస్టాఫ్ - సెకండాఫ్ రెండిటినీ బ్యాలెన్స్ చేసే క్యారక్టర్ ఇది. మీకు సాయం కావాల్సి వస్తే పోలీసుల దగ్గరికెళ్ళండి
, రౌడీల్ని వెంటబెట్టుకుంటే వాళ్ళు శత్రువులకన్నా ఎక్కువై పోతారని- ఒక అంతర్లీన హెచ్చరిక చేసే కథ ఇది.  మీడియం రేంజి సినిమాకి హై రేంజి ఫలితాల్ని ఇచ్చే- ఇస్తున్న మూవీ మేకింగ్ పాఠమిది.

నటనలు- సాంకేతికాలు

ఇది పూర్తిగా ఫాహద్ ఫాజిల్ ఒన్ మ్యాన్ షో. అతడి నటనకి స్పీడు ఒక ముఖ్య టూల్. పూర్తిగా సైకో కామెడీ చేసే పాత్ర. క్లయిమాక్స్ వరకూ ఒక సస్పెన్స్ పోషిస్తాడు. ఇంత హైపర్ యాక్టివ్ గా ఏదైనా అతిగా చేసే ఇతను పిరికివాడా అన్నట్టు వుంటాడు. ఎలాగంటే, ఏదైనా స్ట్రీట్ ఫైట్ జరిగేటప్పుడు తన గ్యాంగ్ ని ముందుకు తోసి తను వెనక దాక్కుంటాడు. గ్యాంగ్ లో అంబన్‌ (సజీన్ గోపు) అనే అనుచరుడు కెప్టెన్ గా పొరాడి సక్సెస్ చేస్తాడు. ఇలా తను ఫైట్ చేయకుండా పిరికివాడా అన్నట్టు సస్పెన్స్ ని పోషిస్తాడు. క్లయిమాక్స్ లో మాత్రం ఒంటరిగా విరోధులకి చిక్కి నప్పుడు విజృంభించి విశ్వరూపం చూపిస్తాడు. పాత్రచిత్రణలో ఈ వెలుగు నీడలు ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ఫాజిల్ దీంతో స్టార్ గా చాలా ఎత్తుకెళ్ళిపోయాడు.
       
ఈ మూవీలో హీరోయిన్లు లేరు
, రోమాన్సులు లేవు. ఉన్న ఒక్క స్త్రీపాత్ర ఒక స్టూడెంట్ కి మదర్ గా నటించిన నీరజా రాజేంద్రన్, అంతే. స్టూడెంట్స్ గా నటించిన ముగ్గురూ హిప్ స్టర్, మిథున్ జై శంకర్, శంతన్ మంచి టాలెంట్ ని ప్రదర్శించారు.
       
డిమ్ లైటింగ్ తో సమీర్ తాహిర్ ఛాయాగ్రహణం కథకి తగ్గ మూడ్ ని క్రియేట్ చేస్తే
, సుశీన్ శ్యామ్ సంగీతం సీన్స్ కి ప్రాణం పోసింది. భారీ క్రౌడ్ తో గ్యాంగ్ స్టర్ రంగా బర్త్ డే పార్టీ సాంగ్ కొరియోగ్రఫీ పరంగానూ, కళాదర్శకత్వం పరంగానూ అతి పెద్ద ఆకర్షణ.
       
2023 లో
రోమాంచమ్ అనే సూపర్ హిట్ తీసిన దర్శకుడు జిత్తూ మాధవన్ తనదైన బ్రాండ్ ముద్రతో, శైలితో సినిమా తీయడానికి లేనిపోని బరువులు మోయనవసరం లేదని మరోసారి నిరూపిస్తూ బాక్సాఫీసుని భారీగా నింపేశాడు.

—సికిందర్