రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 22, 2016

సాంకేతికం





సీన్ - 1 : పుణె 
    చేతిలో సిగరెట్ పట్టుకుని డైలాగ్స్ కొడుతున్నాడు విలన్. హీరో విసిరిన కత్తి వేటుకి ఆ సిగరెట్ ఎగిరి వెళ్లి పెట్రోల్ ట్యాంకర్ దగ్గర పడింది. అంతే, ఆ ట్యాంకర్ తో బాటు అక్కడున్న ఇతర వాహనాలు టపటపా పేలిపోయి పైకేగిరాయి. ఆకాశమంతా భగ్గున అగ్నిగోళాలు!  

సీన్ -2 : హిమాచల్ ప్రదేశ్ 
     శత్రువుల్ని చావదన్ని గుడారాల్లోకి విసిరేశాడు హీరో. హీరోయిన్ తో కలిసి నడుచుకుంటూ పోతున్నాడు. ఉన్నట్టుండి ఆగి
, ఆ గుడారాల మీదికి  రాకెట్ లాంచర్ ప్రయోగించాడు. ఒక్కసారి లేచిన మంటలకి గుడారాలు భస్మీపటలమై మాడి మసయ్యారు శత్రువులు.

          పేలుళ్లు లేదా బ్లాస్టింగ్స్ అన్నవి తప్పనిసరి యాక్షన్ ఎపిసోడ్స్ అయ్యాయి సినిమాల్లో. పేలుళ్లు లేని ఫైటింగ్ సీన్ అంటే బ్యాంగ్ వుండని ఇంటర్వెల్ లాంటిదన్న మాట. ఒక కళ అనే కంటే కూడా ఈ పేలుళ్ళ ప్రక్రియని సైన్స్ అనాలి. కళలు పతనమవుతాయోమే గానీ సైన్స్ చెక్కుచెదరదు. పై రెండు యాక్షన్ సీన్లూ ‘ఖలేజా’, ‘పరమవీర చక్ర’ ల్లోనివి. వీటి సైన్స్ వెనుక హస్తం ఎస్. రామకొండది. ఏ ప్రేలుడుకైనా పెట్రోలే మూలాధారం. లక్ష్యాన్ని భస్మీపటలం చేసే ఇంధనం పెట్రోలే. ఒక కణితిలో పెట్రోలు నింపి, దానికి వైరింగ్ ఇచ్చి, ఆ వైరింగ్ ని స్విచ్ బోర్డుకి అనుసంధానించి, మళ్ళీ కణితి దగ్గర క్రాకర్స్ (టపాసులు) ఏర్పాటు చేసి- స్విచ్చి నొక్కితే క్రాకర్స్ లో స్పార్క్ పుట్టి, ఆ నిప్పురవ్వతో పెట్రోలు కణితి పేలిపోవడం!

          మరి ఈ పేలుడుతోనే టాటా సుమోలు ఉవ్వెత్తున పైకెగిరి పడతాయా అంటే  - నో - ఇది మరింకో సైన్స్. ఈ ప్రాసెస్ పేరు క్యానన్ బ్లాస్టింగ్. దీని టెక్నీషియన్లు వేరే ( క్యానన్ బ్లాస్టర్స్  మోహన్- కృష్ణ ల గురించి గతంలో చెప్పుకున్నాం).


     ఇలాటి సందర్భాల్లో రామకొండ క్యానన్ బ్లాస్టర్స్ తో కలిసి పనిచేస్తారు. వాహనాల కింద తను పెట్రో బాంబు పేల్చిన క్షణాన్నే, క్యానన్ బ్లాస్టర్స్ నైట్రోజన్ ట్యాంకుల్ని పేల్చేస్తారు. అప్పుడు పైకి లేచి ఆకాశంలోకి దూసుకుపోతాయి టాటా సుమోలు.

          ఇంకొన్ని సీన్లలో హీరోనో, విలనో అద్దాన్ని బద్దలు కొట్టుకుని అవతలికి దూసుకు పోతూంటాడు. దీని టెక్నిక్ చెప్పమని  రామకొండతో అంటే,  ‘మరేం లేదండీ, షుగర్ గ్లాస్ వాడతాం. అడుగున క్రాకర్స్ ఏర్పాటు చేసి స్విచ్ బోర్డుకు కలుపుకుంటాం. ఆ ఆర్టిస్టు అద్దానికి తగులుతున్న క్షణంలోనే స్విచ్చి నొక్కి అద్దాన్ని పగుల గొట్టేస్తాం. అప్పుడు ఆర్టిస్టు సేఫ్ గా  అవతలికి దాటేస్తాడు’  అన్నారు రామకొండ. క్షణం అనేది ఇక్కడ చాలా కీలకం. ఏమాత్రం ఒక్క క్షణం అటు ఇటైనా ఆర్టిస్టుకి ప్రమాదం తప్పదన్నారు. అయితే తన  సమర్ధత వల్ల  అలాటి ప్రమాదాలు ఇంతవరకూ జరగలేదు.

          రామకొండ కెరీర్ కూడా తండ్రి లాగే చిరంజీవితో ప్రారంభమైంది. ఈయన తండ్రి గారు సీనియర్ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ సాదిరెడ్డి రామారావు గురించి కూడా గతంలో చెప్పుకున్నాం. రామకొండ ‘కొదమసింహం’ (1990) కి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా మొదలై, చివరికొచ్చేసరికి, అప్పట్లో సౌత్ లో యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పేర్గాంచిన  ఏకనాథ్ కి అసిస్టెంట్ గా చేరిపోయి, ఆ ‘కొదమ సింహం’ తోనే బ్లాస్టింగ్స్ మొదలెట్టేశారు.



          తర్వాత ఏకనాథ్ కి హైదరాబాద్ ఇన్చార్జిగా వచ్చేసి, బాలకృష్ణ నటించిన ‘బొబ్బిలి సింహం’ తో ఆపరేటర్ గా మారారు. అదిమొదలు దాదాపు ప్రతీ భారీ బడ్జెట్ సినిమాకీ పనిచేస్తూ వస్తున్నారు.

          అన్ని రకాల బ్లాస్టింగ్సే  కాకుండా గన్ షాట్స్ కీ పని చేసే ఈయన్ని, మరి బాంబు పేలుడు తర్వాత దృశ్యాల సృష్టి ఎలా అని అడిగితే, ‘అక్కడంతా గొడ్డు మాంసం పడేస్తామండి. ప్రేగులు సహా. రక్తం కూడా చల్లుతాం. గొడ్డు గుండెకాయ కూడా పడేసి దాంట్లోకి గాలిని పంప్  చేస్తూ అది కొట్టుకుంటున్న ఎఫెక్ట్స్ తీసుకొస్తాం’ అని బీభత్సంగా చెప్పుకొచ్చారు.  ఇలా ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా బయాలజీలో కూడా తన చేతి వాటం చూపిస్తున్నారు.

          ఇంకా సోడా గ్యాస్ బ్లాస్టింగ్ గురించీ చెప్పారు. దీన్ని డ్రై ఐస్ బ్లాస్టింగ్ అని కూడా అంటారట. దేవతా లోకం వుంటుంది. ఆ లోకం నేల భాగమంతా పొగ మంచు కమ్మేసి వుంటుంది. ఇందుకు సోడా గ్యాస్ ని మరిగే నీటితో కలిపి వదుల్తామన్నారు. ఈ  ‘పొగ మంచు’  ఇరవై సెకన్ల పాటే వుంటుంది. అందుకని నిరంతరాయంగా సోడా గ్యాస్ ని వదులుతూనే వుంటామన్నారు.



       కత్తి పోరాటాల్లోనూ, గదలు ఢీ కొన్నప్పుడూ మెరిసే మెరుపుల ఎఫెక్ట్ పాజిటివ్, నెగెటివ్ బ్యాటరీ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా సాధిస్తామని వివరించారు. ‘పాటల చిత్రీకరణలో కురిసే పూలవాన కూడా మా టాలెంటే నండీ’  అన్నారు. అంటే బోటనీ కూడా నన్నమాట. పాటల్లో సిందూరం బ్లాస్టింగ్ కూడా వుంటుంది. ఈ గ్లామర్ ప్రక్రియలతో కళా దర్శకుడికి ఏ సంబంధమూ లేదు. ఈ గ్లామర్ ప్రక్రియలు, ఇంకా ఇందాకా చెప్పుకున్న గద, కత్తి యుద్ధాల్లో  మెరిసే మెరుపులూ, ఎంత  గ్రాఫిక్స్ తోనూ సాధ్య పడవన్నారు. భారీ పేలుళ్ళని గ్రాఫిక్స్ తో సృష్టించినా, ఆ తేడా తెలిసిపోతుందన్నారు. గ్రాఫిక్స్ తో  మెరుపులూ మంటలూ వగైరా చాలా పేలవంగా వస్తాయన్నారు.

          ప్రకృతి సూత్రాలతో నడిచే సైన్సే  వేరు. సాంకేతిక ప్రావీణ్యం పెంపొందే కొద్దీ కళలు చవకబారుగా ఉంటాయని ఏనాడో కొడవటిగంటి కుటుంబ రావు గారు రాసి పెట్టారు. ఈ దోషం రామకొండకి అంటదు. ఎందుకంటే ఆయనది కళ  కాదు, సైన్సు!



-సికిందర్
( ఆంధ్రజ్యోతి -2011)