రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఆగస్టు 2016, మంగళవారం

సాంకేతికం :ద్దరు కాస్ట్యూమర్లు. ఒకరు రిఫరెన్సులు  లేకుండా కుట్టేస్తారు, మరొకరు రియలిస్టిక్ గా కుడతారు. ఒకరు సినిమాలు కూడా తీస్తారు. మరొకరు యూనియన్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తారు. ఒకరు ఇన్ఫర్మేటివ్ అయితే, మరొకరు ఎగ్రెసివ్. కాస్ట్యూమర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చిల్లర వేణుగోపాల రావు తమ శాఖ దుస్థితి మీద ఎడాపెడా విరుచుకు పడతారు. ‘ఎవరిమీద మీకింత ఆగ్రహం?’ అంటే,  వెంటనే శాంతిస్తారు. మనకందరికీ తెలిసిందే- రెడీ మేడ్ల,  ఫ్యాషన్ డిజైనర్ల ఈ కాలంలో పెద్ద ఆఫర్లు కాస్ట్యూమర్లకి అంతగా దక్కడం లేదని. అయితే దీనికి రెండో వైపు ఒక ఆశావహ దృశ్యం కూడా వుంది. ఫ్యాషన్ డిజైనర్లకి అంత సీనేమీ లేదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమే వాళ్ళ పని.  అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.


        దీనికొకటి చెప్తారు ఒకప్పుడు యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన వానపల్లి జగదీశ్ : ‘పంచాక్షరి’ లో హీరోయిన్ అనూష్కాకి ఒక రోమన్ డ్రెస్ కావాల్సి వచ్చింది. ముంబాయి చెన్నైల లోని ఫ్యాషన్ డిజైనర్లు దాన్ని  రూపొందించారు. ఆ  అతుకుల బొంతల్ని తిప్పి కొట్టారు అనూష్కా. ఇక జగదీశ్ రంగంలోకి దిగారు. అప్పటికి టైం లేదు, ఒక్క రోజులోనే కుట్టాలి. రిఫరెన్సులు కూడా అక్కరలేని తన సొంత క్రియేటివిటీతో,  రాత్రికి రాత్రి ఆ డ్రెస్ ని తయారు చేసేశారు. దాన్ని చూసి అనూష్కాతో బాటు సెట్లో అందరూ థ్రిల్లయ్యారు. నెట్, షీఫాన్ ల నుపయోగిస్తూ-  ఫాల్స్,  హేంగ్ వర్క్ లతో అత్యద్భుతంగా కుట్టిన ఆ వైట్ కలర్ డ్రెస్ ఇప్పుడు తన దగ్గరే వుంది- దాన్ని తీసి సగర్వంగా ప్రదర్శించారు జగదీష్. 

           కాస్ట్యూమర్స్ కి కుట్టు పని తెలియడంతో పాటు, స్పీడు కూడా వుంటుందన్నారు వేణుగోపాలరావు అలియాస్ వేణు. ఫాంటసీలని సృష్టించడంలో కూడా జగదీష్ దిట్ట అయితే, వేణు రియలిస్టిక్ గా పోతారు. జేడీ చక్రవర్తికి పర్సనల్ కాస్ట్యూమర్ గా వుండడం వల్ల తనకీ రియలిస్టిక్ అప్రోచ్ అబ్బిందన్నారు. ‘ఎగిరే పావురమా’ లో జేడీ రైల్వే గ్యాంగ్ మన్ పాత్రకి తను కుట్టిన బట్టల జత చూసి నిర్మాత రవికిషోర్, దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి లు ఏంతో  మెచ్చుకున్నారన్నారు. తెలుగులో మంచి కాస్ట్యూమ్స్ కి నాగార్జునని చెప్పుకుంటారనీ, తను ఆయనకి కూడా కాస్ట్యూమర్ గా వున్నాననీ  అన్నారు వేణు.   ఫాంటసీ డ్రెస్సు లకి కన్నడ హీరో ఉపేంద్ర గురించి అంతా చెప్పుకుంటారనీ, ఆయనకి తనే బట్టల ప్రదాతననీ చెప్పుకొచ్చారు జగదీష్. ఉపేంద్ర నటిస్తున్న ఓ కన్నడ సినిమాకి తను అందుబాటులో లేనప్పుడు, ముంబాయి  బెంగళూరుల నుంచి ఐదుగురు డిజైనర్లు ఐదు మోడల్స్ లో టైగర్స్ డ్రెస్సులు తయారు చేసి తెచ్చారనీ, అవేవీ నచ్చక పోవడంతో ఉపేంద్ర తనని వెతికి పట్టుకున్నారనీ - అప్పుడా జెర్కిన్, ప్యాంట్, బుల్లెట్ బెల్టు లతో కూడిన ఫాంటసీ ‘టైగర్’ కాస్ట్యూమ్స్ ని,  తను తయారు చేసి తీసుకుని పోతే- అక్కడున్న హీరోయిన్ నయనతార సహా అందరూ అవాక్కయి చూశారనీ గుర్తు చేసుకున్నారు జగదీష్. 

          ‘HO’ లో కూడా ఉపేంద్రకి ఒక కవచం తయారు చేశానన్నారు. అప్పటి వరకూ కవచాల్ని దేశంలో ఫైబర్ తో తయారు చేసే వారనీ, అవి పెళుసుగా వుండి తొడుక్కుంటే ఇబ్బంది పెట్టేవనీ; తను తొలిసారిగా ఫోమ్, స్పాంజిల నుపయోగించి, కంఫర్టబిలిటీకి తిరుగు లేకుండా రూపొందించాననీ అన్నారు జగదీష్. ఉపేంద్ర నటించిన ‘హాలీవుడ్’  లో రోబో డ్రెస్ ని కూడా అందరికీ భిన్నంగా కార్లు, చెప్పుల తయారీల్లో ఉపయోగించే విడిభాగాలతో రూపొందించానన్నారు. రజనీకాంత్ ‘రోబో’ కి ఆ కాస్ట్యూమర్లు పెళుసుగా వుండే ఫైబర్ నే వాడారన్నారు. మరి మీరెందుకు మీ కొత్త ప్రయోగాన్ని ‘రోబో’ నిర్మాతల దగ్గర ప్రమోట్ చేసుకో లేదన్న ప్రశ్నకి- తనకి ఆసక్తి లేదనేశారు జగదీష్. 

          బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రోత్సాహాన్ని కూడా ఇలాగే తిరస్కరించారు జగదీష్. హైదరాబాద్ లో ఆమె ‘అపురూపం’  షూటింగ్ కి వచ్చినప్పుడు ఎవరో తనని ఆమెకి పరిచయం చేశారు. అప్పుడామె తను  వేసుకున్న జీన్స్ కలర్ లోనే చెవి రింగులు కావాలన్నారు. ఆమె అనుమతితో ఆమె నడుం వెనుక భాగం నుంచి జీన్స్ లోపలి బెల్టు ముక్క కత్తిరించి, అక్కడికక్కడే దాంతో చెవి రింగులు తయారు చేసిస్తే,  కళ్ళు తిరిగిన ప్రియాంకా వెంటనే ముంబాయి వచ్చేయమన్నారు. కానీ  ఇంటి బాధ్యతల వల్ల తిరస్కరించాల్సి వచ్చింది జగదీష్ కి. 

      సుస్మితా సేన్. కత్రినా కైఫ్ లకి కూడా కాస్ట్యూమ్స్ అందించారు జగదీష్. అయితే ఓ కన్నడ సినిమాలో జ్యోతికకి కుట్టిన ఫాంటసీ డ్రెస్ సీతాకోక చిలుక మంచి పేరే తెచ్చింది. ఇదెలా వుంటుందంటే, రంగురంగుల స్లీవ్ లెస్ టాప్స్, దీనికి మ్యాచయ్యే అంబ్రెల్లా స్కర్ట్ తో అచ్చం సీతాకోక చిలుకలాగే వుంటుంది. 

       మరి ఇప్పుడొస్తున్న ఫాంటసీ సినిమాలతో కాస్ట్యూమర్స్ కి మళ్ళీ పూర్వవైభవం వచ్చినట్టే కదా అంటే, హైప్ కోసం ఫ్యాషన్ డిజైనర్ల వెంటబడుతున్నారన్నారు వేణు. ‘ ఆ ఫాంటసీ డిజైన్లు పట్టుకుని డిజైనర్లు మా దగ్గరికే వచ్చి కాస్ట్యూమ్స్ కుట్టించు  కుంటున్నారు... పేరు మాత్రం వాళ్ళది చెప్పుకుంటారు’ అని అక్కస్సుగా అన్నారు వేణు. ఇక్కడే వున్న ఒక అసిస్టెంట్ ని చూపిస్తూ, ఇతను తయారు చేసిచ్చిన ఒక అద్భుతమైన డ్రెస్ కి క్రెడిట్ ఇతడికి రాకుండా,  ఫ్యాషన్ డిజైనర్ కొట్టేశారని విమర్శించారు జగదీశ్. వేణూ జగదీష్ లు కలిసే వుంటారు, కానీ కలిసి పనిచెయ్యరు. అదొక స్నేహబంధం అంతే.  

        బాపట్లకి చెందిన వేణు 1991 లో ‘క్షణం క్షణం’ కి అసిస్టెంట్ గా పనిచేసి, 1996 లో ‘గులాబీ’ తో కాస్ట్యూమ్స్ చీఫ్ అయ్యారు. కాస్ట్యూమ్స్ తో ఈయన అలవర్చుకున్న వాస్తవిక దృక్పథం  ఎలాంటిదంటే,  పోసాని కృష్ణ మురళి తీసిన ‘శ్రావణ మాసం’ అనే ఫార్ములా సినిమాలోనూ,  50 మంది రికార్డు స్థాయి తారాగణం మొత్తానికీ, రియలిస్టిక్ దుస్తులనే తయారుచేసి ఇచ్చిపారేశారు. ఇప్పటివరకూ 75 సినిమాలు పూర్తి చేశారు. 

        జగదీష్  1983 లో వైజాగ్ నుంచి చెన్నై వెళ్లారు. ఆరేళ్ళప్పుడే సూది పట్టిన ఈయన,  అన్నం లేకుండా ఆర్రోజులు గడపగల జీవన కళ ని కూడా ఔపోసన పట్టారు.  అంతటి దుర్భర స్థితి నుంచి పైకొచ్చారు. మొదట  కె ఆర్ విజయ, ప్రభలకి, కె ఎస్ ఆర్ దాస్ సినిమాలకీ పనిచేసి;  ఉపేంద్ర , రాజ శేఖర్ లకి పర్సనల్ కాస్ట్యూమరై;  సురేష్ ప్రొడక్షన్స్ కి కంపెనీ కాస్ట్యూమర్ గా వ్యవహరిస్తూ, తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో 300 సినిమాలూ పూర్తి చేశారు. ఈయన శిష్యులు ఐదారుగురు కాస్ట్యూమర్స్ అయ్యారు. ‘సీమశాస్త్రి’, ‘హలో ఉమా’ సినిమాలకి సహ నిర్మాతగా కూడా వున్నారు జగదీష్.-సికిందర్
 (ఏప్రెల్ 2011- ‘ఆంధ్రజ్యోతి’ –సినిమాటెక్ శీర్షిక)