రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 4, 2017

రివ్యూ...




దర్శకత్వం : ప్రియదర్శన్

తారాగణం : మోహన్ లాల్, సముద్ర కని,  అనుశ్రీ, విమలారామన్, నెడుముడి వేణు, బేబీ మీనాక్షి తదితరులు
కథ : గోవింద్ విజయన్, సంగీతం : రాన్ యోతాన్ యోహాన్, ఛాయాగ్రహణం : ఎన్ కె ఏకాంబరం
బ్యానర్ : ఆశిర్వాద్ సినిమాస్
నిత్మాత : బి. దిలీప్ కుమార్
విడుదల : ఫిబ్రవరి 3, 2017

***
          అంధత్వం వరుసగా ముడి సరుకవుతోంది థ్రిల్లర్స్ కి. ఈ ఆర్నెల్ల కాలంలో హాలీవుడ్ నుంచి  ‘డోంట్ బ్రీత్”, బాలీవుడ్ నుంచీ ‘కాబిల్’, మాలీవుడ్ నుంచి ‘ఒప్పమ్’, టాలీవుడ్ నుంచీ ‘ఒప్పమ్’  డబ్బింగ్ ‘కనుపాప’ అనే ‘బ్లయిండ్ థ్రిల్లర్స్’ నాల్గు వచ్చాయి. ప్రస్తుత టాలీవుడ్ ‘కనుపాప’ జయాపజయాల సంగతెలా వున్నా, మిగతా మూడు భాషల్లో మూడూ హిట్టయ్యాయి. అనేక కామెడీలు తీసి కామెడీ జానర్ కి మలయాళ, హిందీ భాషల్లో కొత్త ఒరవడిని దిద్దిన దర్శకుడు  ప్రియదర్శన్,  చాలాకాలం గ్యాప్ తర్వాత ఈ  క్రైం థ్రిల్లర్ తో వచ్చాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ ‘కనుపాప’  తెలుగు ప్రేక్షకులతో పరిచయం పెంచుకోవాలన్న అతడి ప్లానింగ్ లో భాగంగా  ఈ అయిదు నెలల కాలంలో ఇది నాలుగో సినిమా.  కానీ 1994 లోనే ప్రియదర్శన్ తీసిన ‘గాండీవం’ లో తొలిసారిగా మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.
          మోహన్ లాల్ అంధుడి పాత్ర నటించిన ప్రస్తుత ‘కనుపాప’  టైటిల్ కీ కథకీ వున్న 
సంబంధమేమిటో ఈ కింద చూద్దాం...

కథ
       కళ్ళులేని  జయరాం (మోహన్ లాల్) ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా  పనిచేస్తూ వూళ్లో వుంటున్న  చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడేస్తూవుంటాడు. అపార్ట్ మెంట్ లో అందరూ అతణ్ణి  బాగా చూసుకుంటారు. ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి కృష్ణమూర్తి (నెడుముడి వేణు) అనే అతను  జయరాంతో మరింత సన్నిహితంగా వుంటాడు. ఈ కృష్ణమూర్తికో సమస్య వుంటుంది. ఎప్పుడో ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో దోషికి  14 ఏళ్ళు ఖైదు విధించాడు. ఆ వాసుదేవ్ (సముద్రకని) అనే దోషి తానే  నేరం చేయలేదని మొరపెట్టుకున్నాడు. కానీ సాక్ష్యాథారాల్ని బట్టి మూర్తి శిక్ష విధించాడు. వాసుదేవ్ కుటుంబం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో వాసుదేవ్ సైకోగా మారాడు. జైల్నుంచి  విడుదలై తన జీవితం, తన కుటుంబ సభ్యుల జీవితాలూ అన్యాయమై పోవడానికి కారకులైన వాళ్ళందర్నీ -కేసుతో సంబంధమున్న  పోలీసు అధికార్లూ ప్రాసిక్యూటర్ సహా-  చంపడం మొదలెట్టాడు. ఇప్పుడు  కృష్ణమూర్తి ఒక్కడే  మిగిలాడు. కృష్ణమూర్తి తన కూతురు నందిని (బేబీ మీనాక్షి)ని వేరే చోట కాన్వెంట్ లో చదివిస్తూంటాడు. ఇదంతా జయరాంకి  చెప్పివుంచాడు. 

     ఈ నేపధ్యంలో అపార్ట్ మెంట్ లో ఓ పెళ్ళి జరుగుతూంటే, ఆ అవకాశం తీసుకుని వాసుదేవ్ వచ్చి కృష్ణమూర్తిని చంపేస్తాడు. చంపి పారిపోతూ జయరాంతో కలబడతాడు, తప్పించుకుని పారిపోతాడు. పోలీసులు కేసు టేకప్ చేస్తారు. కృష్ణమూర్తికి చెందిన యాభై లక్షలు కూడా పోవడంతో, అదే సమయంలో జయరాం చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడేస్తున్నాడని తెలియడంతో,  అతణ్ణి అనుమానించి వేధించడం మొదలెడతారు. మరోవైపు వాసుదేవ్ సాక్ష్యం లేకుండా చేయడానికి జయరాంని కూడా చంపడానికి ప్రయత్నిస్తూండడంతో,  కళ్ళులేని జయరాం గొప్ప చిక్కుల్లో పడిపోతాడు. అతడి ముందున్న మరో పెద్ద సమస్య- నందినిని కూడా వాసుదేవ్ చంపకుండా కాపాడుకోవడం...అటు పోలీసులనుంచీ, ఇటు హంతకుడి నుంచీ కూడా తనని కాపాడుకుంటూ, జయరాం తన ధ్యేయం కోసం ఎలా పోరాడాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       అచ్చమైన దేశవాళీ క్రైం థ్రిల్లర్ జానర్ కి చెందిన కథ ఇది. అంటే ఏ విదేశీ సినిమా లోంచీ కాపీ కొట్టలేదు. భౌతికంగా సాక్ష్యాధారాలు సేకరించకుండా, వాటి ఆధారంగా కేసు బిల్డప్ చేయకుండా, ఇంకా సాక్షుల వాంగ్మూలాలతో, వాళ్ళనుంచి వివరాలు రాబట్టే కర్రపెత్తనంతో, బుర్రపెత్తనానికి దూరంగా వుంటున్న అశాస్త్రీయ పోలీసు వ్యవస్థకి తార్కాణంగా వుంటుందీ కథ. ఇలాటి పోలీసుల్ని ఎదుర్కోవాలంటే మామూలు నిర్దోషులకే సాధ్యంకాదు, అలాంటిది కళ్ళులేని వాడి సంగతి చెప్పనవసరంలేదు. ఈ కథలో ఇంకో గొప్ప ఐరనీ ఏమిటంటే, ఏ జడ్జి తనకి అన్యాయంగా శిక్ష విధించాడని ఆ ‘నిర్దోషి’ ఆ జడ్జిని చంపాడో, అదే జడ్జి హత్య కేసులో ఇంకో నిర్దోషినే బోనెక్కించి చేతులు దులుపుకోవాలనుకోవడం! ఆ నిర్దోషీ ఈ నిర్దోషీ ఎప్పుడో స్వర్గంలో ఆ జడ్జిని కలుసుకుంటే అక్కడా కొట్టుకు చావాలనేమో!! 

          కథా ప్రయోజనం విషయానికొస్తే, ఇది ‘కాబిల్’ లో లాగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విజిలాంటీ గా మారే  అంధుడి వ్యక్తిగత వేదన కాదు, ‘డోంట్ బ్రీత్’ లోలాగా ఆత్మరక్షణ చేసుకునేకంటే, పోలీసులకి పట్టించడంకంటే,  దొరికిన దొంగల్ని చట్టాన్ని  తానే చేతుల్లోకి తీసుకుని,  కిరాతకంగా శిక్షించాలనుకునే అంధుడి శాడిజం కూడా కాదు; ఇరుక్కున్న కేసులోంచి బయటపడాలనుకునే, ప్రమాదంలో వున్న బాలికని కాపాడుకోవాలనుకునే, వ్యవస్థ బాధితుడైన గుడ్డివాడి పోరాటంగా సామాజిక ప్రయోజనమున్న కథ ఇది. కళ్ళున్న వ్యవస్థ బ్లయిండ్ జ్యూరీగా ప్రవర్తించే దురవస్థ ఇది. 

ఎవరెలా చేశారు 
     అంధ పాత్రని మోహన్ లాల్ సగటు మనుషుల సామాన్య ప్రపంచానికి దించాడు. హైఫై హవా లేదు, గ్లామర్ లేదు, అలవిమానిన హీరోయిజం లేదు, స్టార్ పవర్ లేదు. మలయాళ సినిమాలంటేనే వాస్తవికత. పూర్తిగా వాస్తవిక ధోరణికి కట్టుబడి నిజజీవితంలోని సహజమైన గుడ్డిపాత్రని ఒక నిష్ణాతుడిలా ఆవిష్కరించాడు. పోలీసులు తనని కొడుతున్న సన్నివేశంలోనైతే, ఓ రిక్షావాణ్ణి కొడితే ఎలా మొత్తుకుంటూ అటూఇటూ దూకుతాడో అచ్చం అలాగే చేశాడు. తర్వాత తను ఆ పోలీసులందర్నీ కలిపి కొట్టేయాల్సిన అత్యవసర పరిస్థితిలో,  అలవాటులేని ఆ పనికి పిల్లి మొగ్గలేస్తూ అష్టకష్టాలూ పడి మొత్తం మీద విజయం సాధిస్తాడు. కళ్ళులేని తను శారీరకంగా అసమర్ధుడైనా మానసికంగా  శక్తి సంపన్నుడు. తన ఎదురుగా వున్న మనిషి ఎత్తెంతో, బరువెంతో చెప్పేయగలడు.  మనిషి మాటలు ఏ ఎత్తునుంచి విన్పిస్తున్నాయో దాన్నిబట్టి తన ఎత్తుతో బేరీజు వేసుకుని చెప్పేయగలడు. హంతకుడు తనతో చెలగాటమాడే దృశ్యాల్లో చిక్కకుండా వేసే ఎత్తుగడలు అంధులకి స్ఫూర్తినిస్తాయి. కానీ అంధులు సినిమా చూడలేరు. కానీ అంధపాత్రలతో ఏఏ సినిమాలు ఎలా తీయవచ్చో కళ్ళున్న వాళ్ళకి తెలియజెప్తాయి. కళ్ళతో బాటు బుర్ర వున్నవాళ్ళకి ఇంకా బాగా తెలియజెప్తాయి. అంధ పాత్రలకి మోహన్ లాల్ అభినయం ఒక అధ్యయనాంశమే. 



       ఇక నేరస్థుడిగా ముద్ర పడ్డ మోహన్ లాల్ దగ్గరికి చెల్లెలు వచ్చి- నువ్వు నా పెళ్ళికి రావొద్దు, వస్తే నా పెళ్లి జరగదు- అనేసి కర్కశంగా చెప్పేసి వెళ్ళిపోవడంలాటిది సాధారణంగా తెలుగు సినిమాల్లో చూపించడానికి జంకుతారు- ఏదో సెంటి మెంటు దెబ్బతినేసి కొంపలంటుకుంటాయని. కానీ మలయాళ సినిమా జీవితాన్ని కప్పెట్టి మాయ చేయాలనుకోదు.  ఇలాంటివి జరిగే జీవితాలు కూడా వుంటాయి. గుడ్డివాడై వుండికూడా మోహన్ లాల్ తను సమకూర్చిన నీతిమంతమైన డబ్బుతోనే ఆ పెళ్లి జరుగుతున్నా, చెల్లెలిలో ఆ స్వార్ధం- స్వసుఖం అతన్నెలా దెబ్బ తీసి వుంటాయో ఇక్కడ పదాల్లో చెప్పడం కుదరదు. మోహన్ లాల్ ని చూడాల్సిందే. 

       ఇక సీరియల్ కిల్లర్ వాసుదేవ్ గా సముద్రకనిది కూడా డౌన్ ప్లే చేసిన సహజ- ఎక్సెలెంట్ నటన. మోహన్ లాల్ తనని చూడలేడు కాబట్టి, మోహన్ లాల్ ఎక్కడుంటే అక్కడ, పోలీస్ స్టేషన్ లో వుంటే అక్కడా, అన్నీ గమనిస్తూ ఫ్రీగా మసలుకుంటూ వుంటాడు.  బస్టాప్ లో పక్కనే నించుని లారీకింద తోసేసిపోతాడు. అసలు అపార్ట్ మెంట్ లోనే నివాసముంటాడు. క్లయిమాక్స్ పూర్తిగా అతడి ఆధీనంలో కొచ్చి, ఇంకో రెండు మూడు హత్యలు కూడా చేసి,  మోహన్ లాల్ నీ, బాలికనీ చీకట్లో చంపడానికి చేతులదాకా వచ్చినప్పుడు అతడి కళ్ళూ, మొహమూ అత్యంత భయానకంగా రూపుదాలుస్తాయి. సైలెంట్ విలనీని పరాకాష్ఠకి చేర్చిన హైపాయింట్ అది. 
          మోహన్ లాల్ కి సహకరించే యంగ్ ఎసిపి గంగ గా అనుశ్రీది, సరీగ్గా అలాటి ఆఫీసర్ కుండే స్కిల్స్ తో కూడిన ప్రొఫెషనల్ నటన. అయితే క్లయిమాక్స్ లో అర్ధాంతర మరణమే మింగుడుపడనిది. 

            బాలనటి బేబీ మీనాక్షి పాత్ర థర్డ్ యాక్ట్ లో- అంటే  క్లయిమాక్స్ లో అందుకుంటుంది, కిల్లర్ ఆమెకోసం రావడం అప్పుడే జరగడంతో. ఈ క్లయిమాక్స్ లో మోహన్ లాల్ ఆమెని కాపాడుతూ చేసే స్ట్రగుల్ తో పాసివ్ గా వుండిపోదు బేబీ మీనాక్షి. సర్వసాధారణంగా ఇలాంటప్పుడు బాల పాత్రలు భయపడుతూ, ఏడుస్తూ,  పెద్ద పాత్రలకి భారంగా వుంటాయి. కానీ బేబీ మీనాక్షి చాలా యాక్టివ్ గా, ఇంటలిజెంట్ గా వుంటూ, మోహన్ లాల్ కి దారి చూపుతూ, హంతకుడి ఉనికిని తెలుపుతూ, ఆయుధాలు అందిస్తూ, సమాన పాత్ర పోషించడంతో ఈ పాత్రకి వన్నె చేకూరింది.

          ఇక సహాయపాత్రలు కూడా బిజీగా వుంటాయి కథలో. జడ్జిగారి గ్లామరస్ పని మనిషిగా, మోహన్ లాల్ కి లైనేసే ఆడ రోమియోగా  మొన్నటి  మలయాళ- తెలుగు హీరోయిన్ విమలారామన్ కన్పిస్తుంది. అపార్ట్ మెంట్ వాచ్ మన్ గా మముక్కోయా, ఆటో డ్రైవర్ గా అజూ వర్ఘీస్ - వీళ్ళిద్దరూ మాటలతో పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతూంటారు. కోర్టులో ఒకరోజు నిలబడి వుండే శిక్ష వేయించుకునే దుష్టుడైన సీఐగా వినోద్ జోస్, ఐపీఎస్ అధికారిగా రెంజీ పణిక్కర్, ఇంకో పోలీసు అధికారిగా ప్రదీప్ చంద్రన్, మోహన్ లాల్ చెల్లెలిగా అంజలీ అనీష్ కన్పిస్తారు. 



        సంగీతం చూస్తే సినిమాకి పాటలు బలహీనం, నేపధ్య సంగీతమే బలం. కెమెరా వర్క్ ఫర్వాలేదు. కోచీ నైట్ సీన్లు, ఊటీ పగటి సీన్లూ మాత్రం చిత్రీకరణా పరంగా బావున్నాయి. కోచీ  నైట్ సీన్లు  పాత క్లాసిక్ లుక్ రావడానికి డార్క్ రెడ్ లో డీఐ చేయడం బావుంది. ఇక యాక్షన్ సీన్లు మోహన్ లాల్ పాత్ర పరిమితులకి లోబడి సహజంగా వున్నాయి. 

చివరికేమిటి 
     అరవై ఏళ్ల ప్రియదర్శన్ దర్శకత్వం ఫస్టాఫ్ లో అలసటని తెలియజేస్తుంది. ఈ వయసులో ఇంకో కామెడీ చేసుకోక, ఎందుకురా థ్రిల్లర్ ని నెత్తి నేసుకున్నానూ అన్నట్టు వుంటుంది. మోహన్ లాల్ అంధ పాత్ర అష్టకష్టాలూ పడి ఎలాగో పోలీసుల్ని కొట్టి బయటపడినట్టు, ప్రియదర్శన్ కూడా కనాకష్టంగా  ఫస్టాఫ్ లోంచి బయటపడ్డాక తన పూర్వపు సత్తా ప్రదర్శిస్తాడు సెకండాఫ్ లో. ఫస్టాఫ్ లో కథని ప్రారంభించడానికే ఇంటర్వెల్ వరకూ తీసుకున్నాడు. నిజానికి కథని సెటప్ చేయడానికి అంత సుదీర్ఘమైన విషయం  లేదు- కేవలం జడ్జి గారి ఫ్లాష్ బ్యాక్ చెప్పేసి సీరియల్ కిల్లర్ తో రానున్న ప్రమాదాన్ని వెల్లడిస్తే సరిపోతుంది. కానీ అపార్ట్ మెంట్ లో రకరకాల పాత్రలతో, ప్రేమ వ్యవహారాలతో, కాలక్షేపాలతో, మూడేసి  పాటలతో గంట వరకూ సాగలాగడంతో పలచన బడిపోయింది సగం వరకూ థ్రిల్లర్.

           అన్నేసి పాత్రల పరిచయాలూ కథలూ ఎప్పుడవసరమంటే- ‘బర్నింగ్ ట్రైన్’ లాంటి ఉమ్మడి ప్రమాద పరిస్థితి వున్నప్పుడు. ‘బర్నింగ్ ట్రైన్’ లో గంట వరకూ రకరకాల పాత్రలు ట్రైన్ ఎక్కుతూ వుండడం, వాటి సరదాలూ కబుర్లూ, డ్యూయెట్లూ  ఖవ్వాలీలూ  ప్రేమలూ ఫ్లాష్ బ్యాకులూ వగైరా పూర్తి స్థాయిలో కానిచ్చాకే ప్రమాదంలో పడుతుంది ట్రైన్. ట్రైన్ సహా ఈ పాత్రలన్నీ అప్పుడు ప్రమాదంలో పడతాయి. ఇలా అన్ని పాత్రలూ ప్రమాదంలో  పడుతున్నప్పుడు వాటన్నిటి కథలూ  అవసరమే. 

          కానీ ప్రియదర్శన్ కథలో ఆ అపార్ట్ మెంట్ లో ప్రమాదం వాటిల్లబోయేది ఒక్క రిటైర్డ్ జడ్జికే. కనుక అతనొక్కడి కథమీద దృష్టి పెడితే సరిపోతుంది. అపార్ట్ మెంట్ లో మరెన్నో పాత్రల వ్యవహారాలన్నీ చూపిస్తూ కూర్చుంటే జడ్జి పాత్ర ఆనదు. పైగా అన్నేసి పాత్రలతో కథేమిటో అర్ధంగాదు. అపార్ట్ మెంట్ లో సర్దార్జీల పెళ్లి వేడుకల నేపధ్యంలో జడ్జి హత్య చూపించారు కాబట్టి- అంతమాత్రం చేత ఆ కాబోయే పెళ్లి కొడుకూ పెళ్లి కూతుర్ల ఎఫైర్లకి సీన్లు, వాళ్ళు పట్టు బడితే అపార్ట్ మెంట్ లో పెద్ద పంచాయితీ, పెళ్లి చేయాలనీ తీర్పూ వంటి తతంగాలతో కూడిన ఎపిసోడ్స్ తో కథకేం సంబంధం లేదు. అలాగే పెళ్లి సందడి చూసుకుని హంతకుడు వచ్చి హత్య చేసి పోయాడని కథలో చెప్పించారు. హంతకుడు వచ్చి వొంటరిగా వుండే జడ్జిని చంపిపోవడానికి ఈ పెళ్లి తతంగమే అవసరం లేదు. 

          బహుశా, జడ్జి పాత్ర మీంచి  ప్రేక్షకుల దృష్టి మళ్లించడానికే అన్నేసి పాత్రలూ, పెళ్లి సందడీ సృష్టించి వుంటారు. ఇవన్నీ లేకుండా కేవలం జడ్జి పాత్రే కన్పిస్తూంటే ప్రేక్షకులకి అనేక సందేహాలు వస్తాయి : సీరియల్ కిల్లర్ గురించి అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పిన జడ్జి తన రక్షణ గురించి ఎందుకు ఏర్పాట్లు చేసుకోవడం లేదు? ఊటీలో చదువుకుంటున్న కూతురికీ ప్రమాదముందని పోలీస్ కంప్లెయింట్ ఎందుకివ్వడం లేదు?  హంతకుడు ఒక్కొకర్నీ చంపుతున్నాడని తెలిసీ, ఎందుకు చంపుతున్నాడో వాడి గురించి పేరుతో  సహా పోలీసులకి చెప్పేసి ఎందుకు పట్టుకునే ఆలోచన చేయడం లేదు? మోహన్ లాల్ కూడా ఇవన్నీ తెలిసీ ఎందుకు మిన్నకుండిపోయాడు? – ఈ సందేహాలన్నీ వస్తాయి కనుకనే, వస్తే కథే వుండదు కాబట్టీ,  అపార్ట్ మెంట్ లో అన్నేసి పాత్రలతో దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారనుకోవాలి.

          ఇలా దాటవేతలతో ఫస్టాఫ్ అనే భవసాగరాన్ని ఎలాగో ఈది జడ్జిని చంపాక, ఇక సెకండాఫ్ లో పోలీసుల సంగతి. వాళ్ళు పాత  కేసులు  తిరగేస్తూ ఈ హత్యలన్నీ ఒకడే చేస్తున్నాడనీ, వాడు చంపి  చిటికెన వేళ్ళు కత్తిరించుకు పోతున్నాడనీ అనుకుంటారు. అయినా  ఇంతకాలం ఈ కేసుల మీద దృష్టి పెట్టలేదంటే ఈ  పోలీసు పాత్రల పోకడని బట్టి వీళ్ళింతేలే  అనుకోవచ్చు. మరి ఆ హంతకుడు జడ్జి చిటికెన వేలిని కూడా కత్తిరించినట్టా లేదా? ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుకోలేదంటే ఇది దర్శకుడి లోపమే. మరణించిన జడ్జి చేతుల అనాటమీ ఎలా వుందో మనకి  కూడా చూపించలేదు. అంటే చిటికెన వేలు కత్తిరించనట్టే. ఎందుకు ఈసారి కత్తిరించలేదు సీరియల్ కిల్లర్? అసలంతకి ముందు ఎందుకు కత్తిరిస్తున్నట్టు? అమెరికన్ పోలీసులు  నేరస్థుల ఇలాటి ప్రవర్తనని ‘ట్రోఫీ’ దాచుకునే యత్నంగా చెప్తారు. అంటే బాధితుల తాలూకు ఏదో వస్తువునో, అంగమో సేకరించి తమ విజయ చిహ్నంగా భద్రపర్చుకోవడ మన్నమాట. చిటికెన వేళ్ళు కత్తిరించడం ఇందుకేనా? ఏ సంగతీ చెప్పనప్పుడు ఇలాటి క్లూలు వూరికే ప్రస్తావిస్తే అది ఉత్త బిల్డప్  కోసమే అన్నట్టుగా వుంటుంది.

          సీరియల్ కిల్లర్ ప్రణాళికలో కూడా లోపం వుంది. అతడికి జడ్జికో కూతురుందని తెలుసు. అలాంటప్పుడు  కూతుర్ని ముందు చంపి, జడ్జి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంటే చూడాలనుకుంటాడు పగబట్టిన ఏ కిల్లరైనా. అప్పుడే  జడ్జిని కసిదీరా చంపుతాడు. ఈ మానసిక ధోరణి కూడా చూపిస్తే కూతురే ముందు చచ్చిపోయి కథే వుండదు. కాబట్టి కిల్లర్ పాత్రని ఇలా ఎక్కడబడితే అక్కడ కిల్  చేస్తూపోయారు.

          కథని పాత్రల్ని స్థాపించే ప్రయత్నం ఇలావున్నాక- ఇక హీరో/పోలీస్/కిల్లర్ అనే త్రిముఖ అట మొదలయ్యాక  సాఫీగా నడిచిపోతుంది. ఈ ఆటకి రాత్రిపూట ఊటీలో క్లయిమాక్స్ బలంగా వచ్చింది. అయితే ఇది కూడా ఎసిపి గంగ పాత్రలాగే సడెన్ గా ముగిసి పోవడమెందుకో అర్ధంగాదు. ఆ చిట్టచివరి చర్యని ఇంకో పావు నిమిషం పొడిగించి వుంటే అసలేం జరిగిందో ప్రేక్షకులకి అర్ధమయ్యే వీలుంటుంది. ఇలా ఈ కథ క్లయిమాక్స్ లోనే పాపని కాపాడే కథే తప్ప, మొత్తం అదే కథ కాదు. 

          వెరైటీగా అంధుడి పాత్ర వుండి, ఆ పాత్రలో సూపర్ స్టార్ మోహన్ లాల్ వున్నప్పుడు, దేశవాళీ కథని వరల్డ్ క్లాస్ స్టోరీగా అందించాల్సిన అవసరం కూడా వుంటుంది. ప్రియదర్శన్ కథని కూడా కనుపాపలా కాపాడుకుని వుండుంటే ఇది సాధ్యమయ్యేదేమో!  

-సికిందర్