రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 14, 2015

రైటర్స్ కార్నర్

‘క్వీన్’ రచయిత పర్వేజ్ షేక్ 
        వికాస్ బహల్ దర్శకత్వంలో గతేడాది  క్వీన్  స్లీపర్ హిట్ గా నిల్చిన విషయం తెల్సిందే. కంగనా రణౌత్ నటించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ బాలీవుడ్ హిట్ ఒకందుకు కూడా విమర్శకుల దృష్టి నాకర్షించింది : ఈ సినిమా బలమంతా దీని పరిశీలనాత్మకమైన స్క్రిప్టులో ఉన్నందున! ఈ స్క్రిప్టు రాసిన రచయిత పర్వేజ్ షేక్ దీనికి ముందు ఇదే విమర్శకుల చేత మొట్టి కాయలు వేయించుకున్న  ‘ఘన్ చక్కర్’  అనే డార్క్ కామెడీ రచయితే. దానికీ ఇప్పుడు ‘క్వీన్’ కీ రైటింగ్ పరంగా తేడా చాలా కన్పిస్తోంది. ఈ క్వాలిటీ ఎలా సాధించాడో ‘ఫస్ట్ పోస్ట్’ లో మిహిర్ ఫడ్నవిస్ కిచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా చెప్పుకొచ్చారు పర్వేజ్ షేక్...

బాలీవుడ్ అనే కీకారణ్యంలో మీరెలా వచ్చి పడ్డారు? రచయిత  కావాలనుకోవడం మీ చిరకాల కోరికా?  కొత్త రచయితగా మీరూ స్ట్రగుల్ చేసే వుంటారు..
          లేదు, నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ముంబాయి వచ్చింది సినిమా రైటర్ నవ్వాలని కాదు. యాడ్స్ రంగం మీద నాకు ఎక్కువ ఇంటరెస్టు. కాబట్టి కాపీ రైటర్ గా చేరాను.  అక్కడే వికాస్ బహల్ తో పరిచయమైంది. మేమిద్దరం ఒకే బ్రాండ్ యాడ్స్ కోసం పనిచేసేవాళ్ళం. అక్కడ మానేసి వికాస్ యూటీవీలో స్పాట్ బాయ్ గా చేరడంతో, నా కెరీర్  కూడా మలుపు తిరిగింది. ఒక రోజు నా దగ్గరేమైనా సినిమా కథలకి ఐడియా లున్నాయా అని అడిగాడు. నేనొక వన్ లైన్ అయిడియా చెప్పాను. అది అతడికి నచ్చి దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా కి చెప్పాడు. ఆయన డెవలప్ చేయమన్నాడు. ఈ స్క్రిప్టే 2013 లో ‘ఘన్ చక్కర్’  గా విడుదలయ్యింది. అలా నేనేమీ స్ట్రగుల్ చేయకుండానే సినిమా రచయిత  నయ్యాను..
‘క్వీన్’  ఆఫరెలా వచ్చింది?
          అది వికాస్ అయిడియా. ఒకమ్మాయి ఒంటరిగా హనీ మూన్ కెళ్ళే అయిడియాలోంచి   పుట్టిన కథ అది. వికాస్ నా మిత్రుడే కాబట్టి ఈ ఆఫర్ నాకే ఇచ్చాడు. నేను డెవలప్ చేశాను.
కంగనా ని దృష్టిలో పెట్టుకునే రాసినట్టున్నారు?
          రాయడానికి ముందు నుంచే కంగనా మా దృష్టిలో వుంది.
హిందీలో వచ్చే హీరోయిన్  ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయినెప్పుడూ నార్మల్ క్యారక్ట రైజేషన్ తో వుండదేమిటి? పైగా ఆడియెన్స్ తో కనెక్టివ్ గా కూడా వుండదు. ఇలా ఎందుకు జరుగుతోం దంటారు?
          హీరోల పాత్రలు కూడా ఇలాగే ఉంటున్నాయి లెండి. ఈ వైపరీత్యం హీరోయిన్  క్యారక్టర్లకే  ఉంటోందని అనుకోనవసరం లేదు. ప్రేక్షకులు కూడా తమ అభిమాన  హీరో హీరోయిన్లు మానవాతీ  తులుగానే వుండాలని కోరుకుంటారు. అయితే మల్టీప్లెక్స్  ప్రేక్షకుల ట్రెండ్ ప్రారంభమయ్యాక, కొత్త తరం దర్శకులూ రచయితలూ వస్తున్నాక- ఈ అసహజ ధోరణి కొంత తగ్గుతోంది. వీలైనంత వాస్తవికంగానే పాత్రల్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మేం తీసిన ‘క్వీన్’ తో బాటూ శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
‘క్వీన్’ స్క్రిప్ట్ రాయడంలో బాగా కష్ట పెట్టిన పార్టు ఏది? అందులో కమర్షియల్ – నాన్ కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్య బ్యాలెన్స్ ని సాధించడానికి ఎంత ఇబ్బందిపడ్డారు?
          బాగా కష్ట పెట్టింది ఒకే ఒక్కటుంది. అది స్రక్చర్ ని సరైన పంథాలో పెట్టి ఆద్యంతం        ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చేసే విషయంలో. పాత్రే కథని నడిపించే సందర్భంలో మనకి తెలియకుండా అత్యుత్సాహంతో విషయాన్ని సాగలాగడమో, స్లో చేయడమో జరిగిపోయే ప్రమాదముంది. దీన్ని కాచుకోవ డం చాలా కష్టమై పోయింది. నేను తెలుసుకున్న మరో విషయమేమిటంటే,  మన ప్రేక్షకులకి సహనం బాగా తక్కువ. ఇక  కమర్షియల్, నాన్ కమర్షియల్ అనే ఆలోచనే చేయలేదు. చేతిలో ఉన్న కథతో ఉండాల్సినంత సిన్సియర్ గా వున్నాను తప్పితే, ఏవో కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గాయని       తొందరపడలేదు. కథ డిమాండ్ చేసే మేరకే వినోదాత్మకంగా చెప్తున్నామా లేదా అన్నదే ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్నాను.
‘క్వీన్’ ముగింపులో-  ఆమ్స్ స్టర్ డామ్ లో కేఫ్ దగ్గర మనసు మార్చుకుని వచ్చిన విజయ్ ని రాణి అక్కడే తిరస్కరించి వెళ్లిపోయుంటే బావుండేదేమో? ఎందుకంటే, కథా ప్రారంభంలో ఢిల్లీలో కేఫ్ దగ్గర అతను ఆమెని రిజెక్ట్ చేస్తూ ఎంగేజ్ మెంట్ అయిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ప్రారంభ ముగింపులు మ్యాచ్ అయ్యేవి కదా? ఫైనల్ సీనుని  అక్కడే ముగించకుండా, తిరిగి రాణి ఢిల్లీ వెళ్లి విజయ్ ని అతడింట్లో కలిసే పొడిగింపు అవసరమా?
          ఫైనల్ సీను చాలా  క్లిష్టమైనదే. రాణి క్యారక్టర్ కి, కథకీ ఓ ముగింపు నిచ్చే సీను అది. అది       లేకుండా మొత్తమంతా  అసంపూర్ణంగానే  వుంటుంది. ఆమ్స్ స్టర్ డామ్ లో విజయ్ కి ఏ విషయం చెప్పకుండా ఇండియాలో కలుస్తానని చెప్పి వెళ్ళిపోతుంది రాణి. హండ్రెడ్ పర్సెంట్ అతను వద్దనుకుని  ఇంకా ఆమె నిర్ణయానికి రాలేకపోయింది. అందుకే  ఇండియా వచ్చాక విజయ్ తల్లి చెప్పింది ఆమె నిర్ణయం తీసుకోవడానికి కీలకంగా  మారింది. ఆమె విజయ్ కి వెడ్డింగ్ రింగ్ తిరిగి ఇచ్చేస్తుందని ప్రేక్షకులు కూడా    ఊహించలేదు. అది వాళ్లకి సర్ప్రైజ్ ఎండింగ్ లా అన్పించి చప్పట్లు కూడా కొట్టేశారు!
మీరు రాసిన సీన్లు ఏవైనా మీకు బావున్నాయన్పించినవి, సినిమాలోంచి తీసేయడం జరిగిందా?
          అలాటిదేం లేదు, నిడివి దృష్ట్యా  ఏవైనా సీన్లు తీసేసి ఉండొచ్చు. నేను బాధపడింది లేదు.
          ‘ఘన్ చక్కర్’ ని అనవసరంగా తూర్పారబట్టినట్టు అన్పించలేదా? క్రిటిక్స్ ( కొందరు ప్రేక్షకులు కూడా) అందులో పాయింటు ని మిస్సయ్యారని మీకన్పించలేదా? లేకపోతే బ్యాడ్ మార్కెటింగ్ కారణం గా దానికి రావాల్సిన మైలేజీ రాలేదంటారా?? ఏం జరిగి ఉంటుందంటారు?

           ‘ఘన్ చక్కర్’ మీదొచ్చినంత భిన్నాభిప్రాయాలు ఇంకే సినిమా మీదా వచ్చి వుండవు.   దాన్ని ద్వేషించిన వాళ్ళు తీవ్రంగా ద్వేషించారు, ప్రేమించిన వాళ్ళు అమితంగా ప్రేమించారు. ‘ఘన్ చక్కర్’ ఓ డిఫరెంట్ మూవీగా వుండాలని మేం కోరుకున్నాం. ఆ  ప్రయత్నంలో కొంత వరకు సఫలమయ్యామని అనుకుంటున్నాను. దీనికి గర్విస్తాను. ఐతే పాయింటుని క్రిటిక్స్ పూర్తిగా మిస్సయ్యారనేది మాత్రం నిజం. దాన్నొక  ఒక రెగ్యులర్ థ్రిల్లర్ గా భావించుకుని రివ్యూలు రాశారు. దాన్ని రెగ్యులర్ థ్రిల్లర్ లాగా చూడకూడదన్న పాయింటుని మిస్సయ్యారు. ఒక డిఫరెంట్ మూవీని ప్రేక్షకులకి పరిచయం చేసే          అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు. తర్వాత టీవీల్లో చూసిన ప్రేక్షకులకి  ఈ మూవీ కి ఇంత బ్యాడ్ రివ్యూస్ ఎందుకిచ్చారో అంతుబట్టలేదు. ఇక థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల విషయానికొస్తే, పోస్టర్లని బట్టి ఇది డొమెస్టిక్ కామెడీ అయివుంటుందనుకుని వెళ్లి-    వయొలెంట్ ఎండింగ్ తో వున్న డార్క్ కామెడీని చూసి థ్రిల్లయ్యారు!
మీ నెక్స్ట్ మూవీస్ ఏమిటి? దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?
          ఇప్పుడిప్పుడే ‘ఫాంటమ్’ అనే పోలిటికల్ సెటైర్ స్క్రిప్టు రాయడం ముగించాను. ఇది కబీర్        ఖాన్ దర్శకత్వం వహించే మూవీ. సైఫలీ ఖాన్ - కరీనా కపూర్ లు నటిస్తారు. కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో ఇమ్రాన్ హాష్మీ నటించబోయే ‘షతిర్’ అనే మరో మూవీ కి స్క్రిప్ట్ పూర్తి చేశా. ప్రస్తుతం అనూజా చౌహాన్ రాసిన నవల ‘బాటిల్ ఫర్ బిటోరా’ కి స్క్రీన్ ప్లే రాసే పనిలో వున్నాను. దీన్నిఅనిల్ కపూర్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. దర్శకత్వం మీద నాకు ఆసక్తి లేదు. ఇంట్లోంచి బయటి కెళ్ళా లంటేనే నాకు పరమ బోరు. రైటర్ గా హేపీగానే వున్నాను.
ఏఏ  సినిమాలు చూస్తూ మీరు పెరిగారు? మీ ఫేవరేట్ దర్శకులెవరు?
          రోజర్ మూర్ జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తూ, 80 లలో 90 లలో వచ్చిన బాలీవుడ్   సినిమాలు చూస్తూ పెరిగాను. నా కిష్టమైన దర్శకులు అలెగ్జాండర్ పైన్, మైకేల్ మన్, పాల్ గ్రీన్ గ్రాస్, ఉడీ అలెన్, ఫ్రిట్జ్ లాంగ్.. మొదలైన వాళ్ళు. మన విషయానికి వస్తే మన్మోహన్ దేశాయ్, హృషికేశ్ ముఖర్జ్జీ, జోయా అఖ్తర్, అనురాగ్ కశ్యప్ లు నా అభిమాన దర్శకులు.
రచయిత లవ్వాలనుకునే వాళ్లకి మీ సలహా?
          రాస్తూనే వుండాలి. ఐదు స్క్రిప్టులు రాశారంటే ఏదో ఒకటి బయటి కొస్తుంది. వేరే జాబ్ చేస్తూంటే రెండో స్క్రిప్టు ఓకే అయ్యే దాకా ఆ జాబ్ మానెయ్యకూడదు!

***