రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, అక్టోబర్ 2018, శుక్రవారం

695 : స్క్రీన్ ప్లే సంగతులు


3
      దొంగ రాముడులో  చిన్న దొంగ రాముడు తల్లికి మందుల కోసం దొంగగా పట్టుబడి, తల్లి మరణించి, చెల్లెలు ఆనాథ అవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపుగా చూశాం. దీని తర్వాత కథ, అంటే  మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో చిన్న దొంగ రాముణ్ణి బాలనేరస్థుల కేంద్రంలో వేస్తారు. దీనికి మ్యాచింగ్ సీనుగా అటు చెల్లెలు లక్ష్మిని అనాధాశ్రమంలో చేర్పిస్తారు. వెంటనే దీని తర్వాతి సీనులో అనాధాశ్రమం నుంచి కాలేజీకి బయల్దేరుతున్న లక్ష్మి (జమున ఎంట్రీ) ని చూపిస్తారు. ఆ వెంటనే అటు బాలనేరస్థుల కేంద్రంలో కారు తుడుస్తున్న దొంగరాముణ్ణి (అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ) చూపిస్తారు. ఈ మ్యాచ్ కట్స్ తో టైం లాప్స్ చూపించేస్తారు. అంతేగానీ కాల చక్రం గిర్రున తిరిగినట్టు ఎలాటి ఆప్టికల్స్ లేవు. తర్వాత్తర్వాత ఆప్టికల్స్ తో ఎడిటింగ్ కాలుష్యమయమవుతూ ఆఖరికి ఏమైందంటే, ఇప్పుడు ఆప్టికల్స్ అంటేనే  చిరాకుపడే పరిస్థితి ప్రేక్షకులకి కూడా వచ్చిందని ఇటీవల ఒక ఎడిటర్ చెప్పారు. దృశ్యాలు శుభ్రంగా, సహజంగా వుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారనీ, నటుల వోద్వేగాల్ని ఎడిటింగ్ తో డిస్టర్బ్ చేయకుండా, పదేసి షాట్లు వేయకుండా- ఒక్క స్టడీ షాట్ తో ఏకాగ్రతని పెంచేలా వుంటే ప్రేక్షకులకి నచ్చుతోందని చెప్పుకొచ్చారు. అరవింద సమేతలో దీన్నే ఎక్కువ వర్కౌట్ చేశారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో చూస్తే కొత్త ట్రెండ్ గా వచ్చిన స్ప్లిట్ స్క్రీ న్, స్పీడ్ రాంప్స్, షిఫ్ట్  వైప్స్.... వంటి అనుభూతుల్ని ఊడ్చేసే అనేకానేక చీపురు కట్ట టెక్నాలజీలు ఏమీ కనిపించడం లేదు. 

      దొంగరాముణ్ణి చూస్తూంటే, ఆధునికత్వమనేది గొర్రెల మందలా చెల్లాచెదురైపోకుండా, పాత సాంప్రదాయమనే ములుగర్ర దారిలో పెట్టి నడిపిస్తుందన్నవిన్ స్టన్ చర్చిల్ మాటలు నిజమే నన్పిస్తుంది. ఎడిటింగ్ ఇక సాంప్రదాయ సన్నివేశం లోకొచ్చేసింది. చీపురు కట్టలకి ములుగర్రతో దిశానిర్దేశం. ఇలా సున్నితంగా మ్యాచ్ కట్స్ తో లక్ష్మి కాలేజీకి పోతున్నట్టు చూపిస్తూ, దొంగరాముడు విడుదలై వూరికి బయల్దేరుతున్నట్టూ చూపించి, టైం లాప్స్ ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు. ఇక్కడొక పూడ్చకుండా వదిలేసిన గ్యాప్ వుంది. ఓ రెండ్రూపాయల చిల్లర దొంగతనానికి పాల్పడ్డ చిన్న దొంగరాముడు అక్కినేని నాగేశ్వర్రవుగా ఎంట్రీ ఇచ్చేదాకా, పది పదిహేనేళ్ళు  అక్కడే వుంచేసి శిక్షణ ఇచ్చారా అనేది. ఇప్పటికి కూడా అతడికి తల్లి మరణించిన విషయం తెలియకుండానే వుంటుంది. తను పట్టుబడ్డ క్షణాన్నే తల్లి మరణిస్తే అంత్య క్రియల కోసమైనా అతణ్ణి విడుదల చేయలేదా? ఈ కామన్ సెన్సునంతా కథాసౌలభ్యం కోసం దాటవేశారు బాగానే వుంది –అయితే, అన్నేళ్ల శిక్షణ తర్వాత కూడా ఇప్పుడు దొంగరాముడు మంచి వాడుగా మారడు. అవే చిన్నప్పటి బుద్ధులు అలాగే వుంటాయి. పైగా సిగరెట్ వూది పారేస్తూ, అవారాలా నడుస్తూ ఇంటికి బయల్దేరతాడు. ఇది బాలనేరస్థుల కేంద్రం ప్రయోజనాన్నే దెబ్బ తీస్తోంది. ఇలా కథా సౌలభ్యం కోసం పాత్ర చిత్రణ కూడా బలైంది. బాల నేరస్థుల కేంద్రంలో పడకుండా, పోలీసులకి దొరక్కుండా, చిన్నదొంగరాముడు పారిపోయి వుంటే, ఆ పోలీసుల భయంతోనే ఇంటికి రాకుండా ఎక్కడో పెరిగి వుంటే, మరిన్ని దొంగతనాలతో ముదిరిపోయి వుంటే, తల్లి గురించిన, చెల్లెలి గురించిన, లాజిక్ అడ్డు పడేది కాదు. పెద్దయ్యాక తిరిగి వచ్చి వాస్తవాలు తెలుసుకునే వాడు. 

          కృష్ణ నటించిన దొంగలకు దొంగ (ఫకీరా రీమేక్ ) లో తల్లిదండ్రులు అగ్నిప్రమాదంలో మరణించి, కొందరి వేధింపుల కారణంగా చిన్నప్పుడు పారిపోతారు అన్నదమ్ములు. వాళ్ళల్లో ఒకడు నేరస్థుడవుతాడు. ఇలా కథ (మిడిల్) మొదలవుతుంది. ఇలాగే దొంగరాముడు మారలేదనడానికి బాల నేరస్థుల కేంద్రంలో చేరిక కాకుండా, పారిపోయినట్టు చూపించి వుంటే పాత్ర చిత్రణ సహా అన్ని లాజిక్కులు పూడేవి. బాల నేరస్థుల కేంద్రంలోనే వేయాలనుకుంటే, అప్పుడు మంచివాడుగా మార్చి విడుదల చేసి, పరిస్థితుల ప్రాబల్యం వల్ల తిరిగి నేరస్థుడైనట్టు చూపిస్తే, పాత్రకి ఉత్థాన పతనాలతో కూడిన ఒక క్యారెక్టర్ ఆర్క్ ఏర్పడేది. దర్శకుడు బిల్లీ వైల్డర్ ప్లాట్ పాయింట్ వన్ విషయంలో ఎప్పుడో ఒక హెచ్చరిక చేయనే చేశాడు. ప్లాట్ పాయింట్ వన్ లో విషయం లోపభూయిష్టంగా వుంటే, సినిమా ముగింపు కూడా బలహీనంగా మారుతుందని. ఇందుకే కాబోలు దొంగరాముడులో హీరోగా  దొంగరాముడు కథ ముగించకుండా, హీరోయిన్ (సావిత్రి) క్లయిమాక్స్ ఫైట్ చేసి దొంగరాముణ్ణి విడిపించుకుని ముగిస్తుంది! 

     ఈ మధ్యే ఒక యాక్షన్ కథ క్లయిమాక్స్ లో, హీరోయిన్ని విలన్ కిడ్నాప్ చేసే అరిగిపోయిన పాత ఫార్ములా ఇంకెందుకని, దీన్ని తిరగేసి హీరోయినే విలన్ని కిడ్నాప్ చేసే ఔటాఫ్ బాక్స్ థింకింగ్ చేద్దామన్నప్పుడు – హాహాకారాలు చెలరేగాయి. మరిప్పుడు దొంగరాముడులో సావిత్రి చేసిందేమిటి? విలన్ని నాల్గు తన్నులు తన్ని నిజం కక్కించి హీరోని కాపాడ్డమేగా! తప్పో ఒప్పో పాత సినిమాల్లో కొన్ని జరిగిపోతాయి. అవి ఇన్స్ పైర్ చేస్తాయి. అసలే ఇప్పుడు కూడా సినిమాల్లో అవే పాత మూస కథలుంటే, వాటికి  కాలీన స్పృహ లేకుండా ఇంకా అవే పాత మూస కథనాలు చేయడం...క్రియేటివిటీని ఏ ఫార్ములా శాసించదు. క్రియేటివిటీ చంచలమైనది, తల్చుకుంటే అది ఫార్ములాల్నే కొత్తగా మార్చేస్తుంది.
***
      ఈ మిడిల్లో రాముడు ఇంటికొచ్చి, అమ్మ చచ్చిపోయిందని తెలుసుకుని షాకవుతాడు. చెల్లెలు లక్ష్మిని పంతులు వేరే వూళ్ళో బళ్ళో వేశాడని తెలుసుకుని వెతుక్కుంటూ అనాధాశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఎవరో దుష్టుడనుకుని తరిమికొడతారు. అక్కడ్నించి ఇద్దరు పెద్దవాళ్ళతో పొడుపు కథల మాయచేసి అర్ధ రూపాయి సంపాదించుకుంటాడు. అక్కడ్నించి హోటల్ కెళ్ళి భోజనం చేసి, పావలా ఇచ్చి ముప్పావలా ఎగ్గొడతాడు. అక్కడ్నించి దొంగలెత్తుకు పోయిన ఒక పిల్లాణ్ణి కాపాడి వడ్డీ వ్యాపారి భద్రయ్య (రేలంగి) ఇంటికి చేరుస్తాడు. తన కొడుకుని కాపాడిన రాముణ్ణి భద్రయ్య పనివాడుగా పెట్టుకుంటాడు. 

          ఒక బాబుల్ గాడు (ఆర్ నాగేశ్వరరావు) అనే వీధి రౌడీ వుంటాడు. వాడు కూరగాయలమ్మే సీత (సావిత్రి) ని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తూంటే, రాముడు వాణ్ణి కొట్టి ఆమెని రక్షిస్తాడు. ఈసారి లక్ష్మి (జమున) ని కలవడానికి సూటు బూటేసుకుని, బిజినెస్ మాన్ ‘రాంబాబు’ గా పేరు పెట్టుకుని నటిస్తూ అనాధాశ్రమానికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి అన్నని చూసి ఆనందిస్తుంది. కొన్ని బిజినెస్ పనులు పూర్తి చేసుకుని ఆమెని తీసికెళ్తానంటాడు. ఆమె కాలేజీలో కట్టడానికి మూడు వందలు కావాలంటుంది.15 వ తేదీ కల్లా కట్టాలంటుంది.14 వ తేదీకే అందిస్తానని మాటిస్తాడు.

       రాముడు ఇటు సీతతో ప్రేమలో పడతాడు. కానీ లక్ష్మి కిస్తానన్న మూడొందల గురించే దిగులుతో వుంటాడు.  అంత డబ్బు ఎలా సంపాదించాలని సీతని అడుగుతాడు. ఏమో తనకి తెలీదంటుంది. చిలక జోస్యం చెప్పించుకుంటే – నువ్వు ఆపదలో వున్నావు, నీవల్ల నీ వాళ్లకి ఇబ్బంది కలిగే ప్రమాదముంది, కానీ నీ తెలివి తేటలుపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే, ఆ ప్రమాదం తప్పవచ్చని జోస్యం చెప్తుంది. దీంతో ఇంకా దిగాలుగా కూర్చుంటే అంతరాత్మ పలుకుతుంది – ఒరేయ్ నీకేమైనా బుద్ధుందా? కూటికి లేదు, నీ బతుక్కి తోడు మూడొందలిస్తానని చెప్పి వచ్చావే, ఎక్కడ తేద్దామనుకున్నావ్? పైగా వెళ్ళిన వాడివి చూసిరాక నోటి కొచ్చినట్టు కూసొచ్చావ్. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెల్సా? చూడు – అని దృశ్యం చూపిస్తుంది అంతరాత్మ – ఆ దృశ్యంలో అనాధాశ్రమం నిర్వాహకురాలు, డబ్బు తీసుకురాని అన్న ‘రాంబాబు’ గురించి పరుషంగా మాట్లాడి, ఫో ఇక్కడ్నించీ - అని లక్ష్మిని వెళ్ళగొడ్తుంది. ఈ దృశ్యానికి రాముడు బెదిరిపోయి ఎలాగైనా డబ్బు సంపాయిస్తానంటాడు అంతరాత్మతో. 

          ఇంట్లో భద్రయ్య కూతురి పెళ్ళికి దాచిన నగల్లో ఒక నెక్లెస్ కనపడక కంగారుపడతారు. భార్య (సూర్యకాంతం) దులిపిచూస్తే అది బట్టల్లోనే వుంటుంది. భర్త దగ్గర డబ్బులు లాక్కుని లెక్కబెడుతుంది. ఆరొందల రూపాయలు లెక్కబెట్టడాన్ని రాముడు ఆశగా చూస్తాడు. ఆ డబ్బు బీరువాలో పెడుతోంటే కనిపెడతాడు. అర్ధరాత్రి బీరువా తెరిచి డబ్బు తీస్తూంటే, బాబుల్ గాడు దొంగతనానికి జొరబడతాడు. రాముడు బీరువాలో  దాక్కుంటే, బాబుల్ గాడు తీసి చూసి క్యారు మంటాడు. ఇద్దరూ కూడబలుక్కుని డబ్బు చెరిసగం పంచుకుంటారు. 

          దొంగతనం గురించి తెల్లారి భద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి విచారిస్తారు. రాముడు అలాటి వాడు కాదని, సొంత బిడ్డ లాంటివాడని వెనకేసుకొస్తుంది భద్రయ్య భార్య. రాముడు డాబుగా లక్ష్మి  దగ్గరి కెళ్ళి డబ్బూ, పట్టు చీరా నగలూ ఇచ్చేస్తాడు. అనాధాశ్రమం నిర్వాహకురాలు ‘రాంబాబు’ ని వార్షికోత్సవానికి  ఆహ్వానిస్తుంది. లక్ష్మి కూడా తప్పకుండా వచ్చి తన పాటల కార్యక్రమం చూడాలని అంటుంది.

      అనాధాశ్రమం నిర్వాహకురాలు కొత్త భవనం విరాళాల కోసం భద్రయ్య ఇంటికి వస్తుంది. రాముడు గతుక్కుమని దాక్కుంటాడు. చూడకుండా పక్కనుంచి వచ్చి టీలందిస్తాడు. భద్రయ్య కూతురి పెళ్లి ప్రస్తావన తెస్తాడు. అనాధాశ్రమం నిర్వాహకురాలు ‘రాంబాబు’ గురించి గొప్పగా చెప్పి, సరేనంటే సంబంధం మాట్లాడతానంటుంది. భద్రయ్యని వార్షికోత్సవ సభకి వస్తే ‘రాంబాబు’ ని పరిచయం చేస్తానంటుంది. ఇదంతా వింటున్న రాముడు కంగారు పడిపోతాడు. ఇలాకాదని, భద్రయ్య భార్యతో సభకి వెళ్ళకుండా గడియారంలో టైము మారుస్తాడు, తేలుతో కుట్టిస్తాడు. ఇవేవీ ఫలించకపోవడంతో, వాళ్ళు సభకి వెళ్ళిపోయాక, ఇహ తప్పక సూటు బూటేసుకుని తనూ బయల్దేరతాడు. 

          సభలో భద్రయ్య పక్కన కేటాయించిన సీట్లో కూర్చోకుండా తప్పించుకు తిరుగుతూం టాడు రాముడు. ‘రాంబాబు’ ఏడని నిర్వాహకురాల్ని అడుగుతూంటాడు భద్రయ్య. స్టేజి మీద పాటల కార్యక్రమంలో వున్న లక్ష్మి ధరించిన పట్టు చీరా నగలూ గుర్తు పట్టి భద్రయ్యని ఎలర్ట్ చేస్తుంది భార్య. వెంటనే భద్రయ్య పోలీసుల్ని పిలిపిస్తాడు. పోలీసులు రాకుండా రాముడు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. పోలీసులొచ్చి నిండు సభలో లక్ష్మిని పట్టుకుంటారు. కట్టుకున్న చీరా నగలూ చూసుకుని తనకేం తెలీదని వాపోతుంది లక్ష్మి. పోలీస్ స్టేషన్ కి పదమని పోలీసులంటూంటే, రాముడు వచ్చేసి బయటపడి పోతాడు. భద్రయ్య ఇంట్లో దొంగతనం చేసింది తనేనంటాడు. సూటూ బూటూలో వున్న రాముణ్ణి  చూసి భద్రయ్య విస్తుపోతాడు. ఇతను భద్రయ్య ఇంట్లో పనివాడని తెలిసి నిర్వాహకురాలు నివ్వెరబోతుంది. రాముడు దొంగ రాముడుగా పట్టుబడి జైలుకు పోతాడు. నిర్వాహకురాలు లక్ష్మిని దూషిస్తుంది. దొంగ రాముడు పోలీసులతో వెళ్లడాన్ని చూసిన సీత ఎవగించు కుంటుంది.

***
         ఇదీ మిడిల్ -1 లో కథ, దాని కథనం. పాత్ర మిడిల్లో పడిందంటే సంఘర్షించడమే వుంటుంది కాబట్టి పై కథనంలో సమస్యతో రాముడి సంఘర్షణంతా కనబడుతోంది. రాముడి సమస్యేమిటి? ఇది ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటయింది : బాలనేరస్థుల కేంద్రం నుంచి కొన్నేళ్ళ తర్వాత విడుదలై వచ్చేసరికి తల్లి చనిపోయీ, చెల్లెలు ఎక్కడుందో తెలీని పరిస్థితి నెదుర్కొన్నాడు. ఆ చెల్లెల్ని అన్వేషించి ఆమె బాగోగులు చూసుకోవడమే తన సమస్య, గోల్. చెల్లెల్ని బాగా చూసుకుంటానని చిన్నప్పుడే తల్లికి మాటిచ్చాడు. 

          ఇలా చెల్లెలు లక్ష్మి కోసం తపిస్తున్న అన్నగా, రాముడు ఆమెకోసం చేయరాని పనులు చేశాడు. కమర్షియల్ సినిమా కథల్లో ప్రత్యర్ధి పాత్ర లేకపోతే కథలా వుండదు, గాథలా వుంటుంది. ఇది కమర్షియల్ సినిమాలకి పనికిరాదు. కమర్షియల్ సినిమా కథనేది చూసే ప్రేక్షకుల మానసిక లోకానికి నకలుగా నర్తించే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అని చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రధానపాత్ర  కాన్షస్ మైండ్ (ఇగో) అయితే, ప్రత్యర్ది పాత్ర సబ్ కాన్షస్ మైండ్ (అంతరాత్మ). ఇలా అంతరాత్మతో ఇగో లడాయే ప్రేక్షకుల మానసిక లోకానికి గాలం వేసి లాక్కెళ్ళే కమర్షియల్ సినిమా కథ. ప్రేక్షకుల నాడి పట్టుకోవడమంటే ఇదే. ఈ లడాయి (ఇంటర్ ప్లే) ఆర్ట్ సినిమాల్లో, ఆర్ట్ సినిమాల్లాంటి వరల్డ్ మూవీస్ లో వుండదు. కాబట్టి వాటిలో ప్రధాన పాత్ర పాసివ్ గా వుంటుంది. ప్రధాన పాత్ర పాసివ్ గా వుంటే కమర్షియల్ సినిమాలు అట్టర్ ఫ్లాపవుతాయి. ఇది కూడా వందల సార్లు గమనించాం. కాబట్టి ప్రేక్షకుల మానసిక లోకాన్ని ప్రతిబింబించే  కాన్షస్ – సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే కమర్షియల్ సినిమాలకి అత్యవసరమైంది. 

          మరి కమర్షియల్ సినిమాల్లో ప్రత్యర్ధి పాత్ర అవసరం లేని సందర్భాల్లో ఇంటర్ ప్లేని ఎలా చూపించాలి?  అప్పుడు ప్రధాన పాత్ర మనసునే ప్రత్యర్ధిగా చేసి ఇంటర్ ప్లేని చూపించాలి. ఇదే చూపిస్తున్నారు పై దొంగరాముడు మిడిల్ కథనంలో. దొంగరాముడులో ప్రత్యేకంగా ప్రత్యర్ధి పాత్ర – అంటే విలన్ లేడు. దొంగరాముడి బుద్ధే దొంగరాముడి శత్రువు. అతను తనతో తానే సంఘర్షిస్తున్నాడు. అతడి ఇగోకీ, అంతరాత్మకీ పడడం లేదు. బుద్ధి బావుంటే అంతరాత్మతో సెటిలవుతుంది. లేకపోతే  అంతరాత్మని అతలాకుతలం చేసుకుంటూ అశాంతిగా జీవితాన్ని వెళ్ళమారుస్తుంది. 

          స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో, బిగినింగ్ విభాగమంటే కాన్షస్ మైండ్ అని కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. మిడిల్ విభాగమనేది సబ్ కాన్షస్ మైండ్ అని కూడా చెప్పుకున్నాం. మన కాన్షస్ మైండ్ కి అధిపతి మన ఇగో. ఇగో పక్కా కోతి లాంటిది. దానికి క్లాస్ లక్షణాలుండవు, మాస్ లక్షణాలే. ఇలా కోతి లాంటి ఇగో మాస్ గా ఆడించినట్టూ మన కాన్షస్ మైండ్ మాస్ గా ఆడుతుంది. వెధవ పనులన్నీ చక్కగా చేసుకుంటాం. కమర్షియల్ సినిమాల్లో కాన్షస్ మైండ్ అనే బిగినింగ్ విభాగంలో,  హీరో ఆవారాగా, బేవార్సుగా, లోఫర్ గా తిరగడం ఇందుకే. కమర్షియల్ సినిమాల్లో హీరో అంటే మన ఇగోనే. ఇంతవరకూ బాగానే కనిపెట్టారు. దీని తర్వాత ఏం చేయాలో చాలా సినిమాల్లో పట్టించుకోవడం లేదు. దీని తర్వాత – అంటే కాన్షస్ మైండ్ అనే బిగినింగ్ తర్వాత - ప్లాట్ పాయింట్ వన్ దగ్గర - ఇగో తన కెదురైన సమస్యతో - దాన్ని సాధించే గోల్ తో  - వుంటుంది. సమస్యని సాధించాలంటే అంతర్మధనం జరగాల్సిందే. అంటే సబ్ కాన్షస్ మైండ్ లోకి – అంటే అంతరాత్మలోకి - దూకాల్సిందే. కానీ మన ఇగో అంతరాత్మని ఎదుర్కోవాలంటేనే భయపడుతుంది. దానికి తన కాన్షస్ మైండ్ సామ్రాజ్యమే మజాగా వుంటుంది. సమస్యలనుంచి తప్పించుకు తిరగాలనుకుంటుంది. అందుకే జీవితంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కావు. ఇలాటి బలహీనతతో రాజకీయ నాయకులుంటే దేశంలో సమస్యల్నే పరిష్కరించరు. దేశమలా దేహీ అంటూ వాళ్ళ కేసి చూస్తూ వుండాల్సిందే. వేసిన ఓట్లు వేస్తూ వుండాల్సిందే. అందుకని కమర్షియల్ సినిమాల్లో ఏం చేస్తారంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సమస్యతో నిలబడ్డ జిత్తులమారి ఇగోని – అంటే హీరోని - సబ్ కాన్షస్ మైండ్ లోకి (మిడిల్లోకి) మెడబట్టి ఒక్క నెట్టు నెట్టి పారేస్తారు.

          కమర్షియల్ సినిమాకొచ్చే ప్రేక్షకులు చాలావరకూ జీవితంలో సమస్యల నుంచి పలాయనం చిత్తగించే చిత్తంతో వుంటారు కాబట్టి - వెండి తెరమీద ఈ విన్యాసానికి వెంటనే కనెక్ట్ అవుతారు. జీవితంలో తాము చేయలేకపోతున్నది (అంతరాత్మలోకి తొంగి చూడడం) వెండితెర మీద హీరో పరంగా శుభ్రంగా కనిపిస్తూంటే వాళ్ళ ఇగో దాన్ని పట్టేసుకుంటుంది.  ఇక అంతరాత్మలో (మిడిల్లో) పడ్డ హీరో (ఇగో) అందులో వుండే సవాళ్లు, నైతిక విలువలు, జీవితసత్యాలూ, నగ్నసత్యాలూ వగైరా వగైరాలతో సంఘర్షించీ సంఘర్షించీ – ఓహో జీవితమంటే ఇదా నాయనా  - అని తెలుసుకుని ఒడ్డున పడి పునీతమవుతుంది. అంటే మెచ్యూర్డ్ ఇగోగా మరుతుంది. ఇగోని (హీరో పాత్రని) మెచ్యూర్డ్ ఇగోగా (మెచ్యూర్డ్ హీరో పాత్రగా) మార్చి చూపించేదే మంచి కమర్షియల్ సినిమా కథ. ఇగోని ఎవ్వరూ చంపుకోలేరు. దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని సుఖపడగలరు  మనసుంటే. ఇదే మంచి కమర్షియల్ సినిమాలు చేసే సైకో థెరఫీ. 

          ఇదంతా కూడా ఈ బ్లాగులోనే ఆయా సందర్భాల్లో అనేక సార్లు చెప్పుకున్నదే. ఇప్పుడు చెప్పుకుంటున్న దొంగరాముడు స్క్రీన్ ప్లే సంగతులకి రిఫ్రెష్ చేయడానికే ఈ ఉటంకింపు.

***
    తన బుద్ధే తనకి బద్ధ శత్రువైనప్పుడు దొంగరాముడుకి కథలో వేరే విలన్ అక్కర్లేదు. ఆ బుద్ధితో అతడి సంఘర్షణే మిడిల్ లో కన్పించే అతడి పాట్లు. ఈ మిడిల్లో కన్పించేసీత, భద్రయ్య, అతడి భార్య, అనాధాశ్రమం నిర్వాహకురాలు, బాబుల్ గాడు, చిలక జోస్యం వాడు, పోలీసులూ...ఇంకా ప్రతీ చిన్న పాత్రా అంతరాత్మకి ఏదోవొక రూపాలే. ఇవన్నీ అతడికి ఏదోవొకటి నేర్పుతున్నాయి. నేర్చుకుంటేగా? వాటికి ఎదురీదుతున్నాడు.      
        ఇన్నర్ గా ఈ సైకో థెరఫీ నుంచి, పైకి కన్పించే కథగా చూసినప్పుడు, మిడిల్ విభాగపు బిజినెస్ కొస్తే, ఇక్కడ సంఘర్షణలో భాగంగా వచ్చే యాక్షన్ రియాక్షన్ తాలూకు డైనమిక్స్  వెనువెంటనే వుంటాయి. దీంతో కథనంలో చాలా వేగం కన్పిస్తుంది. 



          అమ్మ చచ్చిపోయిందని, చెల్లెలు ఎక్కడుందో తెలియదని షాకవడం, దీనికి యాక్షన్ గా వెతుక్కుంటూ అనాధాశ్రమంలో వున్న చెల్లెలి కోసం వెళ్తే, రియాక్షన్ గా అక్కడ వేషం చూసి అతణ్ణి వెళ్ళగొట్టడం, ముందు తినడానికి యాక్షన్ తీసుకుని డబ్బుల కోసం పొడుపు కథతో మాయ చేయడం, రియాక్షన్ గా ఆ డబ్బుతో హోటల్లో తిని సగం డబ్బు ఎగ్గొట్టడం, అక్కడ్నించి దొంగలెత్తుకు పోయిన పిల్లాణ్ణి కాపాడే యాక్షన్ తీసుకోవడం, దీనికి రియాక్షన్ గా భద్రయ్య ఇంట్లో పనివాడుగా చేరడం...

           వీధి రౌడీ బాబుల్ గాడు సీతతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే యాక్షన్ తీసుకుని బుద్ధి చెప్పడం, దీనికి రియాక్షన్ గా సీతతో ప్రేమ మొలకెత్తడం, అనాధాశ్రమంలో తన వేషం చూసి వెళ్ళగొట్టినందుకు యాక్షన్ తీసుకుని,  సూటు బూటేసుకుని బిజినెస్ మాన్ లా నటిస్తూ చెల్లెల్ని కలుసుకోవడం, దీనికి రియాక్షన్ గా ఆమె కాలేజీకి డబ్బులు కట్టే పని నెత్తిన పడ్డం...

          ఆ డబ్బెలా అని యాక్షన్ తీసుకుని చిలక జోస్యం చెప్పించుకుంటే, రియాక్షన్ గా జోస్యం ప్రమాదకరంగా వుండడం, ఇంకో రియాక్షన్ గా అంతరాత్మ గట్టి క్లాసు పీకడం, ఇక భరించలేక ఇంట్లో కెళ్తే – దీనికి రియాక్షన్ గా అక్కడ భద్రయ్య భార్య డబ్బు లెక్కెట్టడం, దీనికి యాక్షన్ గా బీరువాలో ఆ డబ్బు కొట్టేయబోతే, రియాక్షన్ గా బాబుల్ గాడు అప్పుడే తగలడ్డం, దీనికి యాక్షన్ తీసుకుని వాడికి సగం డబ్బు పంచడం...

          దీనికి రియాక్షన్ గా తెల్లారి పోలీసులొచ్చి ప్రశ్నించడం, దీనికి యాక్షన్ గా భద్రయ్య భార్య రాముణ్ణి కాపాడడం, దీనికి రియాక్షన్ గా రాముడు వెళ్లి చెల్లెలికి ఆ దొంగిలించిన డబ్బివ్వడం, దీనికి రియాక్షన్ గా అతణ్ణి వార్షికోత్సవానికి రమ్మనడం, దీనికి యాక్షన్ గా నిర్వాహకురాలు భద్రయ్య ఇంటికి రావడం, దీనికి రియాక్షన్ గా భద్రయ్య కూతురి పెళ్లి ప్రస్తావన తేవడం, దీనికి రియాక్షన్ గా నిర్వాహకురాలు దొరబాబు ‘రాంబాబు’ గురించి చెప్పడం, పరిచయం చేస్తానని సభకి రమ్మనడం...

          దీనికి యాక్షన్ గా భద్రయ్య సభకి వెళ్ళకుండా  రాముడు గడియారం టైము మార్చడం, దీనికి రియాక్షన్ గా భద్రయ్య భార్య వచ్చి మార్చిన టైము మార్చేయడం, దీనికి రియాక్షన్ గా రాముడు భద్రయ్య చొక్కాలో తేలు వేయడం, దీనికి యాక్షన్ గా తేలు కుట్టినా భద్రయ్య కేమీ కాక సభ కెళ్ళి పోవడం...

          దీనికి రియాక్షన్ గా దొరబాబులా రాముడు సభ కెళ్లడం, దీనికి యాక్షన్ గా భద్రయ్య పక్కనే తన సీటు వుండడం, రియాక్షన్ గా కనపడకుండా తప్పించుకు తిరగడం, దీనికి యాక్షన్ గా కాబోయే అల్లుడుగారు ‘రాంబాబు’ కోసం భద్రయ్య ఎదురు చూడ్డం, దీనికి రి యాక్షన్ గా భద్రయ్య భార్య రాముడి చెల్లెలు కట్టుకున్న పట్టు చీరా నగలూ గుర్తు పట్టడం, దీనికి యాక్షన్ గా భద్రయ్య పోలీసుల్ని పిలవడం, దీనికి యాక్షన్ గా రాముడు పోలీసుల్ని ఆపాలనుకోవడం, దీనికి రియాక్షన్ గా పోలీసులోచచేసి  రాముడి చెల్లెల్ని దొంగగా పట్టుకోవడం. దీనికి యాక్షన్ తీసుకుని రాముడు తనే దొంగగా లొంగిపోవడం...
***
             చెల్లెలి శ్రేయస్సు గోల్ గా రాముడు తన దొంగబుద్ధి కొద్దీ పడ్డ పాట్లే తనతో మిడిల్ సంఘర్షణ. మిడిల్ బిజినెస్ లో భాగంగా వచ్చిన యాక్షన్ రియాక్షన్లతో కథనానికి స్పీడునీ, టెంపోనీ ఇచ్చే డైనమిక్స్ ఏర్పడ్డాయి. కథనానికి డైనమిక్సే ప్రాణం. డైనమిక్స్ కి పాత్ర పాల్పడే చర్యలే ప్రాణం. పాత్ర పాల్పడే చర్యలకి సంఘటనలే ప్రాణం. పై పేరాల్లో చూసుకుంటే చకచకా అవన్నీ సంఘటనలే. సంఘటన లేనిది పాత్రలేదు. సంఘటన లేనికి కథనం లేదు. డైలాగులతో నడిపేది కథనం కాదు. సినిమా కథని  సంఘటనలతో విజువల్ గా చెప్పే నేర్పుండాలి, డైలాగులతో ఓరల్ గా కాదు. “What is character but the determination of incident? And what is incident but the illumination of character?” ― Henry James ( from Syd Field’s  ‘Screen writer’s Problem Solver ‘)


          ఇక్కడ బిగినింగ్ బాల్య కథకి ముగింపు దొంగగా అరెస్టవడమే, మిడిల్ -1 కథకీ దొంగగా అరెస్టవడమే. మిడిల్ -1 తో మళ్ళీ మొదటికొచ్చింది కథ. ఈ అరెస్ట్ అనే ఘట్టం ప్లాట్ డివైస్ గా వుంది. ప్లాట్ డివైసులు కథని ఒక్కో దిశకి తీసికెళ్ళే చోదక శక్తులుగా వుంటాయి. దీని తర్వాత మొదలయ్యే మిడిల్ - 2 ని ఈ రెండో అరెస్టు ఏ దిశగా డ్రైవ్ చేస్తుందో చూడాలి...

సికిందర్