రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, జులై 2018, శనివారం

667 : రివ్యూ
దర్శకత్వం : తిగ్మాంశూ ధూలియా
తారాగణం : సంజయ్ దత్. జిమ్మీ షేర్గిల్. మహీ గిల్, చిత్రాంగదా సింగ్, సోహా అలీ ఖాన్, నఫీసా అలీ, జాకీర్ హుస్సేన్, కబీర్ బేడీ, దీపక్ తిజోరీ తదితరులు
రచన : సంజయ్ చౌహాన్ - తిగ్మాంశూ ధూలియా, సంగీతం : రాణా మజుందార్. ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్ : జే ఏ ఆర్ పిక్చర్స్
నిర్మాత : రాహుల్ మిత్రా
విడుదల : జులై 27, 2018
***

          ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’  - 1, 2 లు దర్శకుడు తిగ్మాంశూ ధూలియాకి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఈ పరంపరని ఇంకా కొనసాగిస్తూ ఐదేళ్ళ తర్వాత ఇదే టైటిల్ తో ఇప్పుడు సీక్వెల్ తీశాడు. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ -2’ ఎక్కడైతే ముగిసిందో అక్కడ్నించి అదే ఆదిత్యా ప్రతాప్ సింగ్ కథని సీక్వెల్ గా కొనసాగించాడు. సీక్వెల్ లో ఈసారి ‘సంజు’ ఫేమ్ సంజయ్ దత్ జాయినయ్యాడు. డార్క్ మూవీ జానర్లో సంస్థానాల్లో జరిగే కుట్రలు కుహకాలని ఈసారి రష్యన్ రూలెట్ అనే మృత్యుక్రీడని జోడించి తీశాడు. అయితే ఆ మృత్యు క్రీడ ప్రేక్షకులతో ఆడుకున్నట్టయ్యింది. 

         
ప్రకాష్ ఝా రాజకీయాల్లో మహాభారతాన్ని చూపిస్తున్నానని చెప్పి,  2010 లో బోలెడు పాత్రలతో ‘రాజనీతి’ అనే బక్వాస్ చాటభారతం తీసి చంపినట్టే, ధూలియా కూడా సంస్థానం కథంటూ లెక్కలేనన్ని పాత్రలతో చావగొట్టి వదిలాడు. ఫస్టాఫ్ అంతా ఎవరెవరో పాత్రల పరిచయాలతోనే, వాళ్ళ ఉప కథలతోనే సరిపోతుంది. ఏం చూస్తున్నామో అర్ధంగాని గందరగోళం ఏర్పడుతుంది. నిద్రపోయి లేచినా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే కథ ఎంతకీ ప్రారంభమే కాదు. ఒక సీనుకి ఇంకో సీనుకీ సంబంధమే వుండదు. అసలు ఏ సీను ఎందుకొస్తోందో అంతేబట్టదు. ఇంటర్వెల్లో లండన్ నుంచి సంజయ్ దత్ వస్తేగానీ కాస్త కదలిక రాదు. వచ్చాక సెకండాఫ్ లో వున్న కథ కూడా అంతంత మాత్రమే. కేవలం క్లయిమాక్స్ లో రష్యన్ రూలెట్ ని చూపించి థ్రిల్ చేయడానికి తప్ప, ఇంకో  సదాశయం పెట్టుకుని ఈ సీక్వెల్ తీయాలనుకున్నట్టు లేదు. పావుగంట రూలెట్ క్లయిమాక్స్ కోసం రెండుంపావు గంటల సినిమాని భరించాలి. విచిత్రమేమిటంటే,  ఇంత అవకతవక సినిమాలో క్లయిమాక్సే, దాంతో ముగింపే సీట్లకి కట్టేసి కూర్చోబెడుతుంది. 

          క్లయిమాక్స్ తప్ప సినిమాని ఏ కోశానా ఎంతగా పట్టించుకోలేదంటే, ఐదేళ్ళ తర్వాత తీసిన ఈ సీక్వెల్ కనీసం దీని ముందు భాగంలో జరిగిన కథేమిటో రీక్యాప్ కూడా వేయలేదు.  గత సీక్వెల్ చూడని ప్రేక్షకులకి, ఈ సీక్వెల్లో ఆదిత్యా ప్రతాప్ సింగ్ జైల్లో ఎందుకున్నాడో అర్ధం గాదు.  అతడి భార్య ఎమ్మెల్యే ఎప్పుడయిందో అస్సలర్ధంగాదు. 

      రష్యన్ రూలెట్ రివాల్వర్ తో ఆడే ఆట. ఐదు గ్లాసుల్లో నీరు, ఒక గ్లాసులో వోడ్కా వుంటుంది. ఏ  గ్లాసులో వోడ్కా వుందో గుర్తుపట్టి తాగని వ్యక్తి రివాల్వర్ తలకి పెట్టుకుని మీట నొక్కుకోవాలి. రివాల్వర్ లో వుండే ఆరు ఛాంబర్స్ లో ఒకటే తూటా వుంటుంది. అది ఏ ఛాంబర్లో వుందో తెలీదు. ఒకరి తర్వాత ఒకరు తలకి పెట్టుకుని మీట నొక్కుకునే క్రమంలో ఎవరి చేతిలోనో పేలవచ్చు. అప్పుడు చావడమే. ఎదుటి వాడు గెలవడమే. అమెరికాలో ప్రత్యర్దుల మధ్య మెక్సికన్ స్టాండాఫ్ ప్రతిష్టంభన కూడా ఇలాటిదే. కాకపోతే ఇద్దరి చేతుల్లో గన్స్ వుంటాయి. ఎవరు ముందు పేలిస్తే వాడు బతికి పోతాడు. 

          లండన్లో ఈ రష్యన్ రూలెట్ స్పెషలిస్టు ఉదయ్ ప్రతాప్ సింగ్ (సంజయ్ దత్). ఉత్తర ప్రదేశ్ లో ఒక సంస్థానానికి చెందిన ఇతను తల్లిదండ్రులని (నఫీసా అలీ, కబీర్ బేడీ) వదిలేసి గ్యాంగ్ స్టర్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఇంకో సంస్థానానికి చెందిన ఆదిత్యా ప్రతాప్ సింగ్ (జిమ్మీ షేర్గిల్) జైల్లో వుంటాడు. అతడి భార్య మాధవీ దేవి (మహీ గిల్) ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేస్తూంటుంది. ఆమె కన్నీ దుష్టాలోచనలుంటాయి. రెండో భార్య  రంజన (సోహా ఆలీఖాన్) తాగుడుకి అలవాటుపడి ఆత్మహత్యా యత్నం చేస్తుంది. ఒకరోజు మాధవీ దేవి ఆమెని కాల్చి చంపి ఆత్మహత్యగా సృష్టిస్తుంది. ఇక భర్త మిగిలాడు. అతను బయటి కొస్తే తన జీవితమిలా వుండదు. మళ్ళీ బానిసలా బతకాలి. అందుకని భర్తని బెయిలు మీద విడిపించి చంపే పథకమేస్తుంది. కానీ ఈలోగా భర్తతో గర్భవతి అవుతుంది. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉదయ్ ప్రతాప్ సింగ్ పరిచయంతో ఆమె పథకానికి ఒక రూపు వస్తుంది. ఏ మగాణ్ణయినా ఇట్టే బుట్టలో వేసుకోగల ఆమె ఉదయ్ ని ఆకర్షించి తన వూరు రప్పించుకుంటుంది. అక్కడ భర్తని చంపే ఆలోచన చెప్తుంది. ఆదిత్యతో ఉదయ్ కీ ఒక వైరం వుంటుంది. దాంతో అతణ్ణి రష్యన్ రూలెట్ ఆటలోకి దింపి చచ్చేలా చేయాలనుకుంటాడు. మరోవైపు అతడి పూర్వ ప్రేయసి సుహానీ (చిత్రాంగదా సింగ్) ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. 


         ఈ రూలెట్ ఆటకి సన్నాహం, అతిధుల రాక, ఆట తీరూ మాత్రం  పకడ్బందీగా వుంటాయి. కావాల్సినంత సస్పన్స్ ని సృష్టిస్తాయి. దీని  ముగింపేమిటన్నది కూడా అనూహ్యంగా వుంటుంది.  భార్య చేసిన కుట్ర ఆదిత్యకి  తెలిసిపోతుంది. అయితే అతను చంపబోతే, ఆమె తెలివిగా కడుపులో వున్న నీ బిడ్డని కూడా చంపుకుంటావని చెప్పి ప్రాణాలు దక్కించుకుంటుంది. అప్పుడతను అంటాడు – నువ్వు కన్నాక, ఆ బిడ్డ ముందు నిన్ను నించోబెట్టి కాల్చి చంపుతానని. దీనికేం మంత్రమేసిందామె?  రూలెట్ క్రీడ దాకా ఎంత అవకతవకగా సాగి నరకయాతన పెట్టినా, ఈ క్రీడతో, దీనికిచ్చిన ముగింపుతో చచ్చినట్టూ మనం ఒక సలాము చేసి రావాల్సిందే. 

          నటనలో సాహెబ్ గా జిమ్మీ షేర్గిల్ తర్వాతే గ్యాంగ్ స్టర్ గా సంజయ్ దత్. రంగులు మార్చే బీవీగా మహీ గిల్ కి అందరికంటే ఎక్కువ మార్కులివ్వచ్చు. సెక్సీ చిత్రాంగదా సింగ్ వండర్ఫుల్. 

          టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. ముఖ్యంగా అమలేందు చౌదరీ ఛాయగ్రాహణం – వాడిన రంగులు, కాంతులు. మూడు పాటలూ బావున్నాయి. లొకేషన్స్, భవనాలూ, కళాదర్శకత్వం కళాత్మకతని ప్రదర్శిస్తాయి. కానీ ఇంత ఔన్నత్యంతో కూడా ఫస్టాఫ్ ని చూడలేం. ధూలియా విషయం పట్టకుండా నిర్లక్ష్యంగా తీసిన సినిమా ఇదొక్కటే.

సికిందర్
         
           


25, జులై 2018, బుధవారం

666 : స్క్రీన్ ప్లే సంగతులు


     ముందుగా స్ట్రక్చర్ అప్డేట్స్....ఏ స్క్రిప్టు లోనైనా ప్లాట్ పాయింట్ వన్ గోల్ ని ఏర్పాటు చేసే కథా ప్రారంభ ఘట్టమని తెలిసిందే. ఇక్కడ కథని ప్రారంభించడానికి బిగినింగ్ విభాగంలో చేసే సన్నాహంలో వుండే పరికరాల్లో ఒకదాన్ని గుప్తంగా వుంచేస్తే ఏం జరుగుతుంది? అంటే, సర్వసాధారణంగా బిగినింగ్ విభాగ పరికరాలైన పాత్రల పరిచయం, కథా నేపధ్యపు ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, చివరికి సమస్యా స్థాపనా – అనే నాల్గు పరికరాలూ మనకి ప్రత్యక్షంగా తెరపై కన్పిస్తూనే వుంటాయి. వీటిని అనుసరిస్తూ ప్లాట్ పాయింట్ వన్ ని వూహిస్తాం. ఉదాహరణకి ‘శివ’ లో 1. నాగార్జున, అమల, వాళ్ళ ఫ్రెండ్స్, అన్నావదినెలూ మొదలైన కొన్ని ముఖ్య పాత్రల్ని పరిచయం చేస్తూ, 2. మాఫియా పడగ నీడలో కాలేజీ వున్నట్టు కథా నేపథ్యాన్ని ఏర్పాటు చేస్తూ, 3. జేడీ కవ్వింపులతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసుకొస్తూ, 4. చివరికి అమలతో జేడీ మిస్ బిహేవ్ చేయగానే సైకిల్ చైను తెంపి నాగార్జున కొట్టే ఘట్టంతో సమస్య ఏర్పాటవుతుంది. ఇక  నాగార్జున మాఫియా భవానీతో అమీతుమీ తేల్చుకునే గోల్ తో కథ ప్రారంభమవుతుంది...

        ప్పుడు ఈ నాల్గు పరికరాల్లో మూడవదైన సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనని తీసేస్తే ఏమవుతుంది? జేడీ కవ్వింపులుండవు. దాంతో నాగార్జున చైనుతో కొట్టే సీను వుండదు. ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. కథనెలా పుట్టించాలో అర్ధంగాదు. అంటే బిగినింగ్ విభాగంలో మొదట్నుంచీ హీరో మీద కథనం చేసుకొస్తున్నప్పుడు, దాని తాలూకు సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన కూడా చూపిస్తున్నప్పుడు, ఆ హీరోకి ఖచ్చితంగా ఆ సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసి,  గోల్ ఏర్పాటు చేసి తీరాల్సిందే. మరో మార్గం లేదు. ఇలాటి ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్ తోనే సర్వసాధారణంగా, రొటీన్ గా సినిమాలుంటాయి. ఇందుకే మార్పు లేని, మార్చ వీల్లేని, ఈ సార్వజనీన స్ట్రక్చర్ బోరు కొట్టే పరిస్థితి వస్తుంది. అయినా స్ట్రక్చర్ అనేది తప్పనిసరి తద్దినం. ఈ తద్దినంతో కాస్తంత క్రియేటివిటీకి పాల్పడితే, ఆటాపాటలతో తద్దినం కూడా శోభతో కళకళ లాడుతూంటుంది ఎవరేమనుకున్నా. ఎలాగంటే - 

     పైన చెప్పుకున్నట్టు, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి దాకా వెళ్లి  గోల్ ఏర్పాటు చేయకుండా, ఈ బిగినింగ్ విభాగం ప్రారంభంలోనే, హీరోకి ఒక గోల్ పెట్టేస్తే ఏమవుతుంది? అప్పుడు సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన అవసరముండదు. ఆల్రెడీ గోల్ చెప్పేశాక ఇంకా గోల్ కి (సమస్యకి) దారి తీసే పరిస్థితుల కల్పన అనవసరం. అప్పుడు సమస్య ఉరుములేని పిడుగులా, ఆకస్మికంగా, విధివశాత్తూ వచ్చి పడుతుంది. దాంతో హీరో పెట్టుకున్న గోల్,  దానికోసం చేసుకుంటున్న సన్నాహాలూ సమస్తం చెల్లాచెదురై, అనుకోని కొత్త గోల్ వచ్చి మీద పడుతుంది. ఇక్కడే ప్లాట్ పాయింట్ ఏర్పడి, మనం వూహించని  కథ మొదలవుతుంది. ఈ క్రియేటివిటీ ఎంత ఫ్రెష్ గా, రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు కొత్త  వుంటుందో అర్ధమయ్యే వుంటుంది...

          ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ చక్కటి ఉదాహరణ. ఇందులో చిన్నప్పట్నుంచీ బిల్డర్ అవ్వాలన్న కలలు (గోల్) వున్న హీరో, దానికోసం ప్రణాళికలు వేసుకుని విదేశీ ప్రయాణం కట్టబోతాడు. అంతలో తండ్రి గుండె పోటుతో మరణిస్తాడు. దాంతో తండ్రి కంపెనీ  బాధ్యత (కొత్త గోల్) మీదపడి, తన కన్న కలలన్నీ(ఒరిజినల్ గోల్) కల్లలై పోతాయి. ఇలా ఊహించని కొత్త కథ పుడుతుంది.  పైగా హీరోకి కంపెనీ బాధ్యతలతో ప్రారంభమైన స్టోరీ గోల్, కల్లలైన తన కలలతో థీమాటిక్ గోల్ రెండూ ఏర్పడతాయి. ఈ రెండిటితో పడే వేదన పాత్రని ఇంకా బలంగా తయారు చేస్తుంది.

          రొటీన్ ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్ వున్న కథల్లో సమస్యని ఎదుర్కొనే స్టోరీ గోల్ తో పాటు, దీని కారణంగా వ్యక్తిగతంగా నష్టం జరిగే ఎమోషనల్ గోల్ వుంటుంది. ‘శివ’లో భవానీని ఎదుర్కొనే ఫిజికల్ గోల్ వుంటూనే, ఇటు అన్నకుటుంబాన్ని కాపాడుకునే  ఎమోషనల్ గోల్ వున్నట్టూ. ఇది రొటీనే. కానీ పైన చెప్పిన థీమాటిక్  గోల్ లో అంతర్గతంగా తనతో తానే సంఘర్షించుకోవడం వుంటుంది.

     ఇప్పుడు ‘విజేత’ లో చూద్దాం. ఇందులో హీరో ఆవారాగా తిరుగుతూ హీరోయిన్ ని ప్రేమించడం కోసం తను మారి, ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టి దెబ్బతింటాడు. దాంతో తండ్రికి గుండెపోటు వచ్చి పడిపోతాడు. అప్పుడు ఫోటోగ్రఫీ గురించి తండ్రి చిరకాల కోరిక తెలుసుకుంటాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్. ఇందులో ఈవెంట్  మేనేజిమెంట్ అనేది రాంగ్ కథనం. తండ్రికి అణిచిపెట్టుకున్న ఫోటోగ్రఫీ కల వుందనీ ముందే చూపించడం కూడా రాంగ్ కథనమే. దీన్ని తీసేసి,  హీరోకి ఈవెంట్ మేనేజి మెంట్  గోల్ ని పెడితే ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో వున్నట్టు ప్రారంభంలోనే పెట్టాలి, ఆ వ్యాపారం నడిపించాలి. అయితే మళ్ళీ ఇది  ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో లాంటి  క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్ కే దారి తీస్తుంది. ఇలా కాకుండా, ప్లాట్ పాయింట్ వన్ తో ఇంకో క్రియేటివిటీలో,  గోల్ లేకుండా అవారాగానే తిరుగుతున్న హీరోకి, ఉరుములేని పిడుగులా, ఆకస్మికంగా, విధివశాత్తూ సమస్యా - దాని తాలూకు గోల్ మీద పడతాయి. గుండెపోటు వచ్చిన తండ్రి ఫోటోగ్రఫీ గోల్ ని తన గోల్ గా తీసుకుని ముందుకు సాగుతాడు. ఇక్కడ కూడా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అవసరముండదు. అందుకని ఈ క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్ కూడా ఫ్రెష్ గా వుంటుంది. అయితే క్వాలిటీపరంగా ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ తర్వాతనే. 

       ఇప్పుడిక ‘సంజు’ చూద్దాం. ఇక్కడ డ్రగ్స్ మరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఏ ఆశా (గోల్) లేకుండా తిరుగుతున్నహీరో సంగతి తండ్రికి తెలిసి ఆయన బాధ్యత (గోల్) తీసుకుంటాడు. పై మూడు ఉదాహరణల్లో కూడా చూస్తే, గోల్ హీరోకే వుంటుందన్న అంచనా మనకుంటుంది. కానీ ఇక్కడ ఆ అంచనా తప్పుతుంది. గోల్ హీరోకి కాకుండా ఇంకో పాత్ర (తండ్రి) చేతిలో పడింది. హీరో పాసిన్ గా అవుతాడు. అయినా ఇది హీరోయిజం గురించిన కథ కాదు కాబట్టి, జీవితం గురించి కాబట్టి నష్టం లేదు. అదే హీరో కథని నడిపే యాక్టివ్ పాత్రగా తండ్రి పాత్ర వుంది కాబట్టి, కమర్షియల్ యాస్పెక్ట్ కి ఢోకా లేదు. ఇక్కదేమవుతోందంటే, ప్లాట్ పాయింట్ వన్ రివర్సై పోతుంది. ఇక్కడ హీరో ప్రవర్తనతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ఖచ్చితంగా వుంటుంది. కానీ సమస్య (గోల్) ఇంకో కొత్త పాత్ర ఎదుట నిలుస్తుంది.        అంటే రొటీన్ ‘ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్’ కి ప్రత్యాన్మాయంగా రెండు విధాలైన ‘క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్’ లు, ఇంకో ‘రివర్స్ ప్లాట్ పాయింట్ వన్’ లుగా మనకి   కొత్తగా స్ట్రక్చర్ అప్డేట్స్  దొరికాయన్న మాట. వీటిని ఏ జానర్ కథలకైనా అప్లయి చేసుకోవచ్చు. తద్వారా సార్వజనీన స్ట్రక్చర్ మొనాటనీ ని వదిలించ వచ్చు.

సికిందర్

24, జులై 2018, మంగళవారం

665 : దిద్దుబాటు          రాత్రి ఒంటి గంట దెయ్యాలు తిరిగే వేళ పోటీగా, ఎంతో కొంత మానవుడిలా కూర్చుని, అసలింతకీ  ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ ఏమిటాని తీరిగ్గా చూస్తూంటే, అందులో తళుక్కున మన ‘విజేత’ ఒక మెరుపు మెరిపించి షాకిచ్చింది. గత వారమే విడుదలైన ‘విజేత’ పరాజయం చూశాక, ఇలా  ఇక్కడ దర్శన మివ్వడం షాకే. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ‘విజేత’ మెరవడమేమిటి? కాపీ కొట్టారా? సీన్లు ఎత్తేశారా? కాదు, జస్ట్ కాకతాళీయం. 1946 లో విడుదలైన ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ 2018 లో ‘విజేత’ కి తాత లాంటిదే.  మరి తాత ఛాయలు ఎంతోకొంత పొడసూపుతాయిగా. ఆ ఛాయలతో నెల పొడుపులా ఇలా మెరిసి అలా మాయమైంది ‘విజేత’. దీంతో చూస్తున్న ‘లైఫ్’ కి విరామమిచ్చి కాసేపు దెయ్యాలతో చాయ్ పానీ కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక దెయ్యం, ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో జేమ్స్ స్టీవార్ట్ ఫాదర్ కి గుండె పోటు రావడం, చనిపోవడం ప్లాట్ పాయింట్ వన్ అని గుర్తు చేసింది. ఇంకో దెయ్యం, ‘విజేత’లో హీరో ఫాదర్ కి గుండెపోటు రావడమే ప్లాట్ పాయింట్ వన్ అయినా, ఫాదర్ కోరిక తెలుసుకున్న హీరో దాని గురించి వెంటనే ప్రయత్నాల్లోకి వెళ్లలేదని ఫిర్యాదు చేసింది. మరింకో దెయ్యం, రెండిటిలోనూ బిగినింగ్ విభాగంలో హీరోల జీవితాలు ఇంచుమించు ఒకటేనని వివరించింది. మూడు దెయ్యాలూ కలిసి మూడు సిగరెట్లు ఇచ్చి వెళ్ళాయి. 

         
తిరిగి ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ ని చూస్తూంటే, చూడాలన్పించలేదు. మిగిలింది రేపు చూసుకోవచ్చు. ఇప్పుడు రాయాలన్పించింది. పూర్వీకులు మనిషి మస్తిష్కాన్ని మధించి పాత్రల్ని, కథల్ని సృష్టించే వాళ్ళు. అప్పట్లో నాటకం, పుస్తకం, రేడియో వినా ఇంకే దృశ్య, శ్రవణ, సామాజిక మాధ్యమాలు లేవు ప్రభావితం కావడానికి, డిస్టర్బ్ చేయడానికి. ఇప్పుడు లెక్కలేనన్ని మాధ్యమాలు దాడి చేస్తున్నాయి. వాటికి ప్రభావితమై, డిస్టర్బ్ అయి, సొంత ఆలోచన మానేశారు. రకరకాల మాధ్యమాల్లో చూస్తున్న రకరకాల దృశ్యాలు ముసురుకుంటోంటే, ఆలోచనలు గతి తప్పి అవీ ఇవీ అన్నీ ఎత్తేసి ఏదో సినిమా చుట్టేస్తున్నారు. బేసిక్స్ ని ఒప్పుకోవడంలేదు. మనసులో ముద్రేసుకున్న మాధ్యమాల మోజులో బేసిక్స్ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. తల్లి వేరు కత్తిరించి మొక్కని నాటాలనుకుంటున్నారు. ఎంత ఎక్కువ మాధ్యమాలని ఫీడ్ చేసుకుంటే, అంత ఎక్కువ జ్ఞానవంతులమని నమ్ముతున్నారు. కొందరు ఫేస్బుక్ నుంచి విరమించుకున్నామని చెప్తున్నారు, సంతోషం. ఫేస్బుక్ కి వ్యాపారం ఇవ్వాలనుకున్నప్పుడు ఆలోచిద్దాం, ఉచిత ఫ్యాషన్ లొద్దు.      

         ఈ 21వ శతాబ్దంలో19 వ శతాబ్దపు మనిషి వున్నాడు. ఆయన హాలీవుడ్ లో పేరుమోసిన క్రిస్టఫర్ నోలన్. ఆయన దగ్గర ఫేస్బుక్ గీస్బుక్, ట్విట్టర్ గ్విట్టర్, సెల్ఫోన్ గిల్ఫోన్, టీవీ గీవీ ఏవీ వుండవు. ఒక ల్యాండ్ లైన్ మాత్రమే వుంటుంది కాల్స్ కి. సవాలక్ష మాధ్యమాల దాడికి దూరంగా, తన మస్తిష్కమే తన తోడుగా, కథా సృష్టి చేస్తాడు ఆర్గానిక్ గా. మనం ఆన్ని మాధ్యమాల రణగొణ ధ్వనుల మధ్యా కూర్చుని మెకానికల్ గా చేస్తాం. చూసిన చాలా డిజిటల్ డేటాని మైండ్ లో మోస్తూంటాం. అవే తీసి రాస్తూంటాం. మన మైండ్ డిజిటల్ డిష్ అయిపోయింది. నోలన్ కథా సృష్టి చేస్తున్నప్పుడే 19 వ శతాబ్డంలో వుండడు. ఆయన శాశ్వత చిరునామాయే 19 వ శతాబ్దం.19 వ శతాబ్దం ఇప్పుడంతా మనుషుల్లేక ఖాళీగా వుంటుంది. ఆ ఖాళీ ప్రపంచంలో ఆయనొక్కడే మానవుడు! అందుకే ఆయన మస్తిష్కమే ఆయన తోడు. అందులోంచే అద్భుతాలు. ఆయన 19 వ శతాబ్దంలో వుండి, 21 వ శతాబ్దపు సినిమా ఆలోచిస్తాడు. మనం 21 వ శతాబ్దంలో వుండి కూడా 19 వ శతాబ్దపు సినిమాలే తీస్తాం, అంతే తేడా. 

      జీవితం స్వచ్ఛంగా గతంలోనే వుంటుంది, ప్రస్తుత జీవితం తుచ్ఛమైనది. ప్రస్తుత సినిమాలకి సమాధానం గత సినిమాలే. 1946 లో దర్శకుడు ఫ్రాంక్ కాప్రా (1897 - 1991) ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ తీసే ముందు, తీసిన తర్వాతా మొత్తం 11 మూకీలు, 42 టాకీలు తీసిన ఘనత వుంది. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’, ‘కాసాబ్లాంకా’ సరసన క్లాసిక్ అయింది. ఇందులో జీవితాలు, భావోద్వేగాలూ ఇప్పట్లాగే వున్నాయి. అయితే వీటిని సినిమాలో ఎలా మేనేజ్ చేయాలో అప్పుడు తెలిసినంతగా ఇప్పుడు తెలీదు. అప్పుడంతా ఆర్గానిక్ క్రియేషన్. ఇప్పుడు నట్లు బోల్ట్ లు తెలీని మెకానికల్ రీక్రియేషన్. అప్పట్లో కథల్ని నేసేవాళ్ళు, ఇప్పుడు కథల్ని ఎక్కడో మేసి, వేస్తున్నారు. ఇందుకే గతమంతా స్వచ్ఛమైన గైడ్ బుక్. ఇందులో ప్రేమలు ఎంత బావుంటాయంటే, అవొక తియ్యటి బాధని మిగుల్చుతాయి. 
          ప్రస్తుత పాయింటు, ఈ సినిమాలో బిగినింగ్ విభాగం, ఆ తర్వాత వచ్చే ప్లాట్ పాయింట్ వన్, వీటితో ‘విజేత’ విశేషం గురించే.

          సిగరెట్ -1 : ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో జేమ్స్ స్టీవార్ట్ చిన్నప్పట్నుంచీ పెద్ద పెద్ద కలలతో వుంటాడు. వుంటున్న వూళ్లోంచి వెళ్ళిపోయి ప్రపంచంలో నగరాల్ని ప్లానింగ్ చేయాలనీ, పెద్ద పెద్ద ఆకాశహార్మ్యాలు నిర్మించాలనీ, ఏర్ పోర్టులూ వంతెనలూ కట్టాలనీ కోరికలతో వుంటాడు (అమరావతికి వచ్చుంటే చంద్రబాబు రెడ్ కార్పెట్ పర్చేవారేమో. స్టీవార్ట్ తనే డబ్బులు పెట్టుకుని కట్టేసే వాడు, జీవీఎల్ నరసింహా రావుతో పనిలేకుండా). చిన్నప్పుడు తమ్ముణ్ని కాపాడే ప్రయత్నంలో అతడి ఎడం చెవి వినికిడి శక్తి పోయింది ( ‘రంగస్థలం’ లో రాంచరణ్ వినికిడి శక్తి ఎలా పోయిందో?). చిన్నప్పుడే డోనా రీడ్, గ్లోరియా గ్రాహం లు అతణ్ణి ఆకట్టుకోవాలని తిప్పలు పడుతూంటారు. స్టీవార్ట్ తండ్రి ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతూంటాడు. కానీ తన కలలు వేరే కాబట్టి ఈ కంపెనీకి దూరంగా వుంటాడు స్టీవార్ట్. ఆ కంపెనీకి పోటీ కంపెనీ వాడు సమస్యగా మారతాడు. దీనికి దూరంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న స్టీవార్ట్ కాలేజీ పూర్తి చేసి, ఇక వరల్డ్ టూర్ కి సిద్ధమవుతాడు. 

          ‘విజేత’ లో హీరో
కళ్యాణ్ దేవ్ చిన్నప్పట్నుంచీ తండ్రి ఆదుపాజ్ఞల్లో చదువుకుని ఇంజనీర్ అవుతాడు. కానీ ఉద్యోగం రాక ఆవారాగా తిరుగుతూంటాడు. ఒక పెళ్లి సందర్భంలో తండ్రికి ఫోటోగ్రఫీ కలలున్నాయని బయటపడుతుంది. తండ్రి ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగి. కళ్యాణ్ దేవ్ ఎదురింట్లో అమ్మాయి వెంట పడతాడు. ఇక ఆమె ప్రేమ కోసమే ప్రయోజకుడవాలని ఈవెంట్ మేనేజి మెంట్ పెడతాడు. అది బెడిసికొట్టి పోలీస్ స్టేషన్లో పడతాడు. 

        ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరోకి మొదట్నుంచే ఆశయాలున్నాయి. వాటికోసం జీవితాన్ని మల్చుకుంటూ వస్తాడు. తన ఆశయాలు వేరు కనుక తండ్రి కంపెనీ వ్యవహారాలకి దూరంగా వుంటాడు. అన్నీ సర్దుకుని వరల్డ్ టూర్ కి ప్లాన్ వేస్తాడు. 

          ‘విజేత’ లో హీరోకి ఉద్యోగం పొందాలన్న ఆలోచనే తప్ప, ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్న ప్రణాళిక లేదు. ఆవారాగా మారాడు. హీరోయిన్ ని చూసి ప్రేమించాకే, ఆమె  ప్రేమ కోసం ఈవెంట్ మెంజి మెంట్ పెట్టి సంపాదనా పరుడన్పించుకోవాలనుకున్నాడు. అది బెడిసికొట్టి పోలీస్ స్టేషన్ కెక్కాడు. 

          ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో తండ్రి నీడన వుండకుండా స్వతంత్రంగా ఎదగాలనుకున్నాడు. ‘విజేత’ హీరో తండ్రి నీడన వుంటూనే ఏ మాత్రం తండ్రికి ఉపయోగపడక, హీరోయిన్ కన్పించాక మాత్రమే, ఆమె ప్రేమ కోసం బాగుపడాలన్న స్వార్ధాని కొచ్చాడు. 

          ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరో తండ్రికి ఎదుటి కంపెనీ వాడు సమస్యగా అయ్యాడని చూపించారు. ఇది హీరోకి తెలుసు. అయినా తన చిరకాల కలల్ని వదులుకోలేడు. ‘విజేత’ లో హీరో తండ్రికి ఫోటోగ్రఫీ కలలున్నాయని చూపించారు. ఈ సంగతి హీరోకి తెలీదు. 

          సిగరెట్ -2 :  వరల్డ్ టూర్ కి సిద్ధమైన స్టీవార్ కి పిడుగుపాటు లాంటి సంఘటన. హఠాత్తుగా గుండె పోటుతో తండ్రి మరణిస్తాడు. హీరో ప్లాన్స్ అన్నీ, కలలన్నీ, కోరికలన్నీ తలకిందులై పోతాయి. ఇక కంపెనీ బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితి. ఇది ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.
 
          ఈవెంట్ మేనేజ్ మెంట్ బెడిసి కొట్టి పోలీస్ స్టేషన్ కెక్కిన పర్యవసానంగా, కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్ర గుండెపోటుకి గురవుతాడు. ఇది ‘విజేత’ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

           ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ప్లాట్ పాయింట్ వన్ అరగంటలో వస్తే, ‘విజేత’ లో గంటకి గానీ రాదు. దీంతోనే ఇంటర్వెల్ పడుతుంది. ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరో కలలన్నీ కోల్పోయాడు. ‘విజేత’ లో కోల్పోయిందేమీ లేదు. ప్లాట్ పాయింట్ వన్ తో సంబంధం లేకుండా, అంతకి ముందే ఈవెంట్ మేనేజి మెంట్ పోలీస్ స్టేషన్ సంఘటనతోనే మూతబడింది. 

      ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో కంపెనీ బాధ్యతల్ని చేపడుతూ హీరో తను పెంచి పోషించుకున్న కలల్నే పణంగా పెట్టాడు. పైగా పూర్తిగా తనకి తెలీని కొత్త ప్రపంచమైన వ్యాపారంలో దిగి, ఎదుటి వాణ్ణి ఎదుర్కోవాల్సిన కష్టం వచ్చి పడింది. తన కలల్ని చంపుకుని, తండ్రి వ్యాపారాన్నీ, తద్వారా ఖాతాదార్ల ప్రయోజనాలనీ కాపాడాల్సిన బాధ్యత మీద పడింది. ఇలా గోల్ ఎలిమెంట్స్ లో వుండాల్సిన నాల్గు పరికరాలూ- కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనేవి ఏర్పడ్డాయి. 

           ‘విజేత’ లో పణంగా పెట్టడానికి హీరో పెంచి పోషించుకున్నదేమీ లేదు – హీరోయిన్ ప్రేమకోసం స్వార్ధంతో పెట్టిన ఈవెంట్ మేనేజి మెంట్ తప్ప. స్వార్ధానికి తగ్గట్టే అది మూతబడింది. ఇప్పుడు తండ్రికి సపర్యలు చేసి కోలుకునేలా చేయడం ఒక్కటే గోల్ అనే అర్ధంలో ఇంటర్వెల్ పడింది. ఈ ఇంటర్వెల్ కి కథా విలువ లేదు. ఇది అర్ధం లేని ప్లాట్ పాయింట్ వన్. ఇక్కడ గోల్ ఎలిమెంట్స్ లేవు, పరికరాలూ లేవు. 

          ప్లాట్ పాయింట్ వన్ అంటే,  హీరో బిగినింగ్ లో వున్న అలవాటయిన ప్రపంచంలోంచి,  పరిచయం లేని పూర్తి కొత్త ప్రపంచంలోకి ప్రవేశించి, కొత్త శక్తుల్ని ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడే ద్వార మార్గమే. 

          బిగినింగ్ తో సినిమా చూసే ప్రేక్షకులు తమ కాన్షస్ మైండ్ ని అనుభవిస్తే, ప్లాట్ పాయింట్ వన్ తో ఏర్పడే మిడిల్ తో, తమ సబ్ కాన్షస్ మైండ్ ని, అంటే అంతరంగాన్ని అనుభవిస్తారు. ఇది కథలకి సైకలాజికల్ సైన్సు. అంతరంగపు శాశ్వత విలువలతో, చేదు నిజాలతో పోరాటం చేసి నిగ్గు తేల్చుకోవడమే మిడిల్లో వుండే కథ. ఇందుకు ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ చక్కగా సిద్ధమైంది. ‘విజేత’  కాలేదు. కారణం, ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ కి అర్ధం లేదు. అక్కడ్నించీ హీరో ప్రవేశించడానికి కొత్త ప్రపంచమే లేదు, తండ్రి అనారోగ్యం తప్ప. 

           తర్వాత సెకండాఫ్ ప్రారంభ దృశ్యాల్లో చెప్పారు - తండ్రి ఫోటోగ్రఫీ కలల గురించి హీరోకి. అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ పూర్తిగా ఏర్పడింది. ఇంటర్వెల్లో ఒక ముక్క, ఇంటర్వెల్ తర్వాత మిగిలిన ముక్క -  ఇలా ప్లాట్ పాయింట్ వన్ ని విరచ కూడదన్న సోయి లేకపోతే, రసోయిలా వుండదు స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు హీరో తండ్రి ఫోటోగ్రఫీ కోరిక నెరవేర్చే గోల్ ఏర్పడిందన్న మాట. మంచిదే.

         సిగరెట్ -3 :  ఇప్పుడు బిగినింగ్ ని, ప్లాట్ పాయింట్ -1 నీ పట్టుకుని మిడిల్లో కొచ్చాం. అంటే బిగినింగ్- ప్లాట్ పాయింట్ వన్ ల సారమైన ‘గోల్’ సాధన  ప్రక్రియ కొచ్చాం. 
 ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో హీరోకి  రెండు గోల్స్ ఏర్పడ్డాయి : స్టోరీ గోల్, థీమాటిక్ గోల్ అన్నవి. స్టోరీ గోల్ వచ్చేసి,  తండ్రి వ్యాపారాన్ని నిలబెట్టడం; థీమాటిక్ గోల్ వచ్చేసి, చెదిరిపోయిన తన సొంత కలల సంగతి చూడ్డం. ఏది జరుగుతుంది? ఏది జరగదు? 

          ‘విజేత’ లో మొత్తానికి హీరో గోల్ ఏర్పడినా ఆ కథలోకే వెళ్ళడు. ప్లాట్ పాయింట్ వన్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఫోటోగ్రఫీ పాయింటుని వదిలేసి ఎలా కథ నడుపుతారు?  చెల్లెలి పెళ్లి చేస్తాడు. కానీ ఇది గోల్ కాదు. మళ్ళీ ఈవెంట్ మేనేజి మెంట్ ప్రారంభిస్తాడు. ఇది కూడా గోల్ కాదు. హీరోయిన్ ప్రేమ కోసం స్వార్ధంతో ప్రారంభించిన దీనికి నైతికత లేకే ఫస్టాఫ్ లో దెబ్బ తిన్నాడు. ఇది గ్రహించకుండా మళ్ళీ దాని జోలికి వెళ్ళాడంటే అలా వున్నాయి హీరో పాత్ర విలువలు. చెల్లెలి పెళ్లి, ఈవెంట్ మేనేజి మెంట్ పునప్రారంభం గావించుకుని, చివరికి తండ్రికో కెమెరా కొనిచ్చి ఫోటోలు తీసుకోమని ప్రపంచం తిప్పితే,  అయిపోయింది గోల్!

          ఇదీ దెయ్యాల దిద్దుబాటు. పూర్వీకులకి ఏం చేయాలో తెలుసు. ఎలా తెలుసు? సినిమా కథల స్ట్రక్చర్ కోసం అరిస్టాటిల్ సూత్రాల మీద ఆధార పడ్డారు గనుక. షేక్స్ పియర్ నాటకాల మీద ఆధారపడ్డారు గనుక. అశేష ప్రేక్షక లోకం చూసే కమర్షియల్ సినిమాలకి అలా సార్వజనీన స్ట్రక్చర్ వుండాల్సిందే. దీన్ని పక్కన పెట్టి,  సొంత కవిత్వాలు రచించుకోవాలనుకుంటే మాత్రం ఆర్ట్ సినిమాలు తీసుకోవాలి, కమర్షియల్ నిర్మాతల్ని ముంచడం కాదు.

సికిందర్

23, జులై 2018, సోమవారం

664 : స్క్రీన్ ప్లే సంగతులు


     2000 సంవత్సరం నుంచీ తెలుగు సినిమాలు నరనరాన ఇంకిన అవే లోపాలతో అట్టర్ ఫ్లాపవుతున్నాయి. అవే పాసివ్ హీరో పాత్రలు, అవే మిడిల్ మటాషులు, అవే ఎండ్ సస్పెన్సులు, అవే సెకండాఫ్ సిండ్రోములు సింగారించుకుని, బాక్సాఫీసు చెలియలి కట్ట దగ్గర జామ్మని జలసమాధి అయిపోవడం. పదుల కోట్లు ధారబోసే పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఈ నాల్గు శనిగ్రహలేమిటో, ఇవెందుకు తమ సినిమాల్లో తిష్ట వేస్తున్నాయో పట్టించుకునే పాపాన పోవడం లేదు. అంతా ఏవో అంచనాల మీదే, వూహల మీదే, నమ్మకాల మీదే ఆధారపడి సినిమాలు తీసేయడం. శాస్త్రీయంగా ఏ ప్రాతిపదికా వుండని రాతకోతలతో - ఏం రాసుకున్నారో, ఎలా రాసుకున్నారో, ఎందుకు రాసుకున్నారో తెలియకుండా బౌండెడ్ స్క్రిప్టు అనే డెత్ వారెంట్ ఒకటి జారీ చేసుకుని కొబ్బరికాయ కొట్టేయడం!

          ‘లవర్’ లో ఒకటి కాదు ముచ్చటగా మూడు శనిగ్రహాలు కాపురం పెట్టాయి : పాసివ్ హీరో పాత్ర, మిడిల్ మటాష్, ఎండ్ సస్పెన్స్ అన్నవి. సినిమాకి పెట్టిన పెట్టుబడితో ఈ మూడూ ఆడిన చెలగాటం సహజంగానే ఫ్లాపు అనే పదార్ధాన్ని పుట్టించింది.  ఫ్లాపవుతున్న సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయో విశ్లేషించుకోక కొత్త ఫ్లాపిస్టులుగా తయారవుతున్నారు. ఫ్లాపిస్టులకేం ఎరుక మన చెలగాటమని శనిగ్రహాలు ఇంకా చెలరేగిపోతున్నాయి. ఇప్పుడీ మూడు శనిగ్రహాలూ కూడబలుక్కుని ఎక్కడెక్కడ ఎలా చెలరేగి, హాట్ హాట్ విడుదలని హాంఫట్ చేశాయో చూద్దాం ...

బిగినింగ్ కథ
       రాజ్ (హీరో) బైక్ పక్కన పెట్టుకుని కొండ ప్రాంతంలో కూర్చుని వుంటాడు. తను అనాధ అయినట్టూ, తను ప్రేమిస్తున్న అమ్మాయి మీద ఎవరో ఎటాక్ చేసినట్టూ తల్చుకుని, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఆర్నెల్లు వెనక్కి వెళ్ళాలంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అక్కడ సంపత్ అనే విలన్, అతడి అనుచరుడు జగ్గూ పరిచయమవుతారు. జగ్గూ ని అన్నలా భావించి అతడింట్లోనే వుంటాడు రాజ్. వదిన, ఆమె చిన్న కూతురూ వుంటారు.

          రాజ్ కస్టమైజ్డ్ బైక్ బిల్డర్ గా జీవనోపాధి పొందుతూంటాడు. మెయిన్ విలన్ ఓపెన్ అవుతాడు. ఇతను అరుదైన వ్యాధితో బాధపడుతూంటాడు. అవయవ మార్పిడికి మనిషి కోసం వెతుకుతూంటాడు. హీరో ఫ్రెండ్స్ నల్గురున్నట్టు ఓపెనవుతారు. వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ హీరో పాట వేసుకుంటాడు. పాట తర్వాత ఇంకో విలన్ జెపితో తగాదా వచ్చి గాయపడతాడు. హాస్పిటల్లో చేరి,  అక్కడ నర్సు  చైత్రని చూసి ప్రేమలో పడతాడు. ఆమె పడదు. ఆమె వెంట పడుతూంటాడు. ఓ పాటేసుకుంటాడు.

          చైత్రకి హాస్పిటల్లో ఏదో గూడుపుఠానీ జరుగుతోందని అనుమానంవచ్చి డాక్టర్లని అడుగుతుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. డాక్టర్ కి మెయిన్ విలన్ అనుచరుడు అజయ్ నుంచి కాల్ వస్తుంది. త్వరలో మ్యాచింగ్ మనిషిని అప్పగిస్తానంటాడు డాక్టర్. రాజ్ మళ్ళీ తన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తాడు. ఓ దిక్కులేని పేషంట్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరతాడు. ఆపరేషన్ చేయాలంటే ష్యూరిటీ పెట్టేవాళ్ళు లేక కంగారుపడుతుంది చైత్ర. సంతకం పెట్టేందుకు రాజ్ ముందుకొచ్చి ఆమె మనసుని గెలుచుకుంటాడు. ఆమె ప్రేమలో పడి అతడితో పాటేసుకుంటుంది. 

          పాట తర్వాత, లక్ష్మి అనే పిల్ల పేషంట్ కనపడక కంగారు పడుతుంది చైత్ర. ఒక స్లో పాయిజన్ ఇంజెక్షన్ దొరికి డాక్టర్లని అడుగుతుంది. వాళ్ళు సీరియస్ అవుతారు. చైత్ర పారిపోతుంది. పారిపోయిన చైత్ర రాజ్ తో కొండ ప్రాంతంలో కూర్చుని వుంటుంది. గ్యాంగ్ వచ్చి ఎటాక్ చేస్తారు. రాజ్ పోరాడి వాళ్ళని తరిమేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ మొదటి సీనుకొచ్చి, అలా కొండప్రాంతంలో కూర్చున్న రాజ్,  ఎవరు ఎటాక్ చేశారు? అని మళ్ళీ ప్రశ్నించుకుంటాడు. ఇంటర్వెల్ పడతుతుంది.

       సెకండాఫ్ మొదలవుతుంది. రాజ్, చైత్ర వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేస్తారు. చూస్తాంలే అంటారు పోలీసులు. అన్న జగ్గూకి విషయం తెలిసి, చైత్రని దూరంగా పంపించెయ్యమంటాడు. మలయాళీ అయిన చైత్రతో రాజ్ కేరళ వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె తల్లి వుంటుంది. ఇద్దరి ప్రేమాయణం మళ్ళీ మొదలవుతుంది. రేపు ఓనం పండగ వుందని చెప్తుంది చైత్ర. ఇద్దరూ ఓనం పండక్కి గ్రూప్ సాంగ్ వేసుకుంటారు. అచ్చిబుచ్చి ప్రేమలు  కంటిన్యూ చేస్తారు. 

          అటు డాక్టర్లూ మెయిన్ విలన్ సీరియస్ అవుతారు. చైత్ర ఎక్కడుందో పట్టుకోవాలని హడావిడీ చేస్తారు. ఇటు చైత్ర తల్లి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. చైత్ర తిప్పికొడుతుంది. అప్పుడు రాజ్ మీద ప్రేమ బయట పెట్టుకుంటుంది. మీ సంగతి తెలుసుకోవాలనే ఉత్తుత్తి పెళ్ళిచూపులతో నాటకమాడానని సంతోషపడుతుంది తల్లి. అయితే రాజ్ కుటుంబాన్ని పిలిపించి ఎంగేజ్ మెంట్ కానిద్దామంటుంది. 

          అటు జగ్గూ మీద గ్యాంగ్ ఎటాక్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ విలన్ తొత్తుగా జగ్గూ బాస్ సంపత్ రివీలవుతాడు. చైత్ర ఎక్కడుందో చెప్పమంటాడు. చెప్పకుండా కేరళ వెళ్ళిపోతాడు జగ్గూ. కుటుంబంతో నిశ్చితార్ధాని కొచ్చిన జగ్గూ, రాజ్ తో మాట్లాడాలని రాజ్ పిలిపిస్తాడు. కానీ మాట్లాడడు. నిశ్చితార్ధం అయ్యాక తిరిగి వెళ్ళిపోతూ,  స్టేషన్లో ఆగిపోయి చైత్రకి కాల్ చేసి పిలిపించుకుంటాడు. లక్ష్మిని ఎక్కడ దాచావో చెప్పేస్తే మనకి ప్రమాదం తప్పుతుందంటాడు. ఆమె చెప్పదు. ఇంతలో మెయిన్ విలన్ అనుచరుడు అజయ్ గ్యాంగ్ తో వచ్చేసి జగ్గూని చంపేసి చైత్రని ఎత్తుకుపోతాడు. చైత్రకి కాల్ చేస్తూంటే రెస్పాన్స్ రాకపోవడంతో, వెతుక్కుంటూ వచ్చి చచ్చి పడున్న జగ్గూని చూస్తాడు రాజ్.

మిడిల్ కథ 
      చనిపోయిన అన్న చితికి నిప్పెట్టి చైత్రని వెతుక్కుంటూ ఓ శాడ్ సాంగ్ వేసుకుంటాడు రాజ్. తిరిగి వూరి కొచ్చేసి గల్లీగల్లీలు గాలిస్తూంటాడు. ఓ గల్లీలో ఒకడు దొరుకుతాడు. వాణ్ణి కొడితే ఇంకొకడి గురించి చెప్తాడు. వాణ్ణి కొడితే మెయిన్ విలన్ గురించి అంతా చెప్పేస్తాడు. మెయిన్ విలన్ కి లివర్ వ్యాధి. అరుదైన బ్లడ్ గ్రూపు. ఆ బ్లడ్ గ్రూపున్న పిల్ల లక్ష్మి దొరికింది. ఆమెని ఇంజెక్షన్ల ద్వారా నెమ్మదిగా బ్రెయిన్ డెడ్ అయ్యేలా చేసి, లివర్ తస్కరించాలని ప్లాను. ఇది విని మెయిన్ విలన్ ఆచూకీ చెప్పమంటాడు రాజ్.
ఎండ్ కథ
          విలన్లు లక్ష్మి కోసం చిత్రని  చిత్రవధ చేస్తూంటారు.  రాజ్ చైత్రని విడిపించుకుని, మెయిన్ విలన్, అతడి అనుచరుడు అజయ్ లు ప్రయాణిస్తున్న కారుని రిమోట్ కంట్రోల్ చేసి ప్రమాదం జరిగేలా చూస్తాడు. వెంటనే ఎండ్ టైటిల్స్ పడతాయి.
***
         స్థూలంగా ఇది పూరీ జగన్నాథ్ టెంప్లెట్టే. కాకపోతే పూరీ జగన్నాథ్ పాల్పడని అనౌచిత్యాలకి దీని కథకుడు అత్యుత్సాహంతో పాల్పడ్డాడు : పాసివ్ హీరో పాత్ర, మిడిల్ మటాష్ కథనం,  ఎండ్ సస్పెన్స్ హంగు. అయితే దీన్ని సరిదిద్దితే ఈ కథ బాగుపడుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తదు. ఎందుకంటే ఇలాటి కథకి ఇప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ లేదు. ట్విట్టర్ లో ప్రేక్షకుల కామెంట్స్ చూస్తే, ఇంకా ఎన్నిసార్లు తీస్తార్రా ఈ కథలూ, కొంచెమైనా మారండ్రా బాబూ, కొత్తగా ఆలోచించండి...అంటూ వాపోతున్నారు యూత్. 

          కాబట్టి ఇలా విశ్లేషించడం కథని బాగుపర్చే దృష్టితో కాదు. పనికిరాని కథని ఏం బాగుపరుస్తాం. అసలే పనికిరాని కథని ఇంకెంత పనికిరాకుండా దారుణంగా తీశారో తెలుసుకోవడానికే ఇది.  కథకుడి మీద  తెలుగు సినిమాల ప్రభావం చాలా వున్నట్టుంది. వాటిలోని సీన్లని కాపీ చేసి, దిల్ రాజుకి సమర్పించుకోకుండా వుండలేకపోయాడు. వేరే నిర్మాత తీసిన సినిమాలోని సంగతులు తన చేత ఖర్చు పెట్టించి తన ఖాతాలోనే వేసినట్టు దిల్ రాజుకి  కూడా తెలియక పోయుండొచ్చు. 

          గుణశేఖర్ తీసిన ‘అర్జున్’ లో మహేష్ బాబు వర్షంలో కత్తి పట్టుకుని కూర్చునే ఓపెనింగ్ ఇమేజిని ఎంచక్కా కాపీచేసి కథకుడు తన కథలో కొండల మధ్య హీరోని కూర్చోబెట్టి పెట్టేశాడు. అక్కడ్నుంచి  ‘అర్జున్’ లో లాగే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి, హీరోయిన్ తో కథ చెప్పుకొస్తూ, ఆమె మీద ఎటాక్ చేసిన గ్యాంగ్ తో తలపడేట్టు చేసి, ‘అర్జున్’ లోలాగే ప్రారంభ సీను కొచ్చాడు. అక్కడ ఇంటర్వెల్ వేశాడు. ఇంకా కథకి మూలబిందువైన అరుదైన బ్లడ్ గ్రూపు పాయింటు గోపీచంద్ నటించిన ‘ఒక్కడున్నాడు’ లోంచి మనసుపడి స్వీకరించాడు. ఇలా మనసు పడి స్వీకరించకుండా స్వీకరించినట్టయిన పని కూడా ఒకటి జరిగిపోయింది పనిలోపనిగా. మనుసు పడి స్వీకరించిన వాటిని పూరీ టెంప్లెట్ లోనే  కొనసాగిస్తే పోయేది - ఇంకేదో క్రియేటివిటీ చూపబోయే సరికి అదికాస్తా మళ్ళీ మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లోకి తిరగబెట్టింది. అందుకే ఫ్లాపు ఖాయమైపోయింది ‘బాబీ’ లాగే. స్ట్రక్చర్ పట్టని క్రియేటివిటీతో ఎంత కళా పోసనో!

       స్ట్రక్చర్ లో పైన చెప్పుకున్న బిగినింగ్ కథ చూస్తే, అరగంట ముప్పావుగంటలో ముగియాల్సిన బిగినింగ్, ఇంటర్వెల్ కూడా దాటేసి  సెకండాఫ్ లోకి జొరబడి,  గంటన్నర దాకా సాగింది. మొత్తం రెండు గంటల సినిమాలో బిగినింగే గంటన్నర! బిగినింగే గంటన్నర! బిగినింగే గంటన్నర! ఇలా ఇప్పుడు గానీ ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. ఇక మిడిల్ కి ఎనిమిదే నిమిషాలు! ఎండ్ పదిహేను నిమిషాలుండొచ్చు... 

          రెండు గంటల సినిమాలో బిగినింగ్, ఎండ్ లు అరగంట చొప్పున వుండి, మిడిల్ గంట పాటు సుదీర్ఘంగా వుండాల్సింది పోయి, మిడిలే పూర్తిగా మటాష్ అయిపోయింది. అంటే గుండె కాయ గల్లంతన్న మాట. అంటే కథే లేదన్న మాట. గంటన్నర దాకా సాగదీసిన దంతా కథే అనుకున్నట్టుంది కథకుడు. అది కథ కాదనీ, తర్వాత మొదలవబోయే మిడిల్ కి కేవలం సన్నాహమన్న బేసిక్స్ ని తెలుసుకోలేక పోయాడు. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడ రావాలో అసలేమీ తెలియకుండా పోయాడు. 

          నిజానికి ప్లాట్ పాయింట్ వన్ అనేది, అంటే కథకి ప్రధాన మలుపు, అంటే హీరోకి ఒక లక్ష్యం అంటూ ఏర్పడి దాని కోసం పోరాడే ఘట్టం, ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ పూర్తయాక ఇంటర్వెల్లో రావాలి ఈ కథకి. కానీ ఇక్కడ కూడా ఎవరీ ఎటాక్ చేశారు? అని ప్రశ్న వేసుకుని ఇంటర్వెల్ వేసుకున్నాడు. దీంతో ఏమైనా లాభం చేకూరిందా? ఈ ప్రశ్నతో ఫస్టాఫ్ మొదలెట్టినప్పుడు కథలో ఏ స్థితి వుందో,  ఇంటర్వెల్లో మళ్ళీ అదే స్థితిలో ఎక్కడేసిన గొంగళిలా వుంది. అంటే ఏమాత్రం టెన్షన్ ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్ అనేవి ఏర్పడకుండా చప్పగా వుందన్న మాట. 

          సరే, ఎవరీ ఎటాక్ చేశారు? అన్న ప్రశ్నతో సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేశాడా? అదీ చెయ్యక అన్న చెప్పాడని హీరోయిన్ ని తీసుకుని కేరళ వెళ్ళిపోయాడు. అంటే మాట వరసకి ఇంటర్వెల్ ప్లాట్ పాయింట్ వన్ అనుకుంటే, దాన్ని పరిహసించి పలాయనం చిత్తగించాడు. ప్లాట్ పాయింట్ వన్ అనేది కథ పుట్టే మలుపే కాదు, అది హీరోకి పర్సనల్ టర్నింగ్ పాయింటు కూడా. అక్కడ కథలో పుట్టిన సమస్యని సాధించే లక్ష్యం ఏర్పర్చు కోకుండా కథలోంచి పారిపోలేడు. పారిపోతే పాసివ్ పాత్ర అయినట్టే.

       అలాగే అయ్యాడు, మళ్ళీ కేరళలో ప్రేమలు వెలగబెడుతూ వుండిపోయాడు. బ్యాక్ డ్రాప్ లో విలన్లతో పుట్టిన సమస్య పట్టకుండా వుండిపోయాడు. ఎవరీ ఎటాక్ చేశారన్న ప్రశ్నని హీరోయిన్నే అడిగితే సరిపోతుంది. ఆమె డాక్టర్లతో జరిగిందంతా చేప్పేసేది. కానీ ఆమెని అడగడు, ఆమె చెప్పదు. అలా వుంది అతడి తెలివి. అలా వుంది ప్రేమలో ఆమె నిజాయితీ. మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లో మాహేష్ బాబు, ఆరతీ అగర్వాల్ ల మాఫియా తండ్రులిద్దరూ నగరాన్ని అట్టుడికిస్తూంటారు. కాల్పులతో, పేలుళ్లతో జనం అల్లాడి పోతూంటారు. అయినా అదే నగరంలో ఇదేమీ పట్టకుండా ఇద్దరూ ప్రేమ సన్నివేశాల్లో వుంటారు. ప్రేమించుకుంటూనే వుంటారు. చుట్టూ బ్యాక్ డ్రాప్ లో అసలేమీ జరగడంలేదన్న ప్రపంచంలోనే వుంటారు. ఈ బ్యాక్ డ్రాప్ తో మహేష్ బాబుకి సంపర్కమే వుండదు. ఇలాగే  బ్యాక్ డ్రాప్ లో విలన్ల కుట్రతో సంబంధమే లేదన్నట్టుగా ‘లవర్’ హీరో కూడా వుండి  పోతాడు. ఇదంతా ఇంకా బిగినింగ్ విభాగంగానే సాగుతూంటుంది సెండాఫ్ లో కూడా. చివరికి విలన్లు అన్నని చంపి హీరోయిన్ని ఎత్తుకుపోయినప్పుడు గానీ, అసలు విషయం తెలిసిరాదు హీరోకి. 

          అంటే ఇక్కడ ఇప్పుడు కథ ప్రారంభమయ్యిందన్న మాట! గంటన్నరకి!  ఇంతసేపూ ప్రేక్షకులు తలపట్టుక్కూర్చోవాలన్న మాట. ఆకలికి ఇడ్లీ పెట్టకుండా ఎంతసేపూ చట్నీయే గుమ్మరిస్తున్నాడు కథకుడనే వంటకాడు నాకమని. ఇలా హీరోకి ఎప్పుడైతే ఇక్కడ విషయం తెలిసిందో, తెలిసి ఇప్పుడేం చేయాలన్న గోల్ ఏర్పడిందో – అప్పుడేర్పడిందన్న మాట ప్లాట్ పాయింట్ వన్!  ఈ ప్లాట్ పాయింట్ దగ్గర గోల్ తో మిడిల్ ల్లోకి ఎంటరయ్యాడు. అన్నకి కర్మకాండ చేశాడు, విషాద గీతం వేసుకుంటూ హీరోయిన్ని వెతికాడు, దుండగుల్ని పట్టుకున్నాడు. అప్పడు తెలుసుకున్నాడు విలన్ల కుట్రేమితో. ఇది ప్లాట్ పాయింట్ టూ! ఇంతే, మిడిల్ ఎనిమిది నిమిషాల్లో ముగిసిపోయి మిడిల్ మటాషై పోయింది. ఇంతకంటే అన్యాయం వుంటుందా ఏ సినిమాకైనా? వంద రూపాయల టికెట్ కి ఎనిమిది నిమిషాల కథే  చూపిస్తారా?  

          ఈ మిడిల్ చివర్లో కుట్ర చెప్పించేదాకా మనకికూడా ఇంతసేపూ తెలీదు. ఎండ్ సస్పెన్స్ గా ఇప్పుడే రివీలవుతుంది. అంటే కుట్ర  వివరాలు తెలియకుండా, ఏం కథ చూస్తున్నామో తెలియకుండా, ఏది ఎందుకు జరుగుతోంతో అర్ధంగాక ఇన్వాల్ కాలేకా,  మనం అసహనానికి గురవుతూ సినిమా చూడాలన్న మాట. 

          దీంతో అయిపోలేదు. ఇంకా ఇలాగే తీస్తూంటారు. ఇలాగే వస్తూంటాయి సినిమాలు. ఇలాగే సమాధి అవుతూంటాయి. దీన్నాపలేరు, ఆపడం తెలీదు, తెలుసుకోవాలనీ వుండదు. 

సికిందర్

21, జులై 2018, శనివారం

663 - రివ్యూ


రచన -  దర్శకత్వం: శశాంక్‌ ఖైతాన్
తారాగణం : జాహ్నవీ కపూర్ఇషాన్‌ ఖట్టర్‌‌అశుతోష్‌ రాణాఅంకిత్‌ బిష్ట్ఆదిత్య కుమార్తదితరులు
సంగీతం
: అజయ్‌-అతుల్, ఛాయాగ్రహణం : విష్ణూ  రావ్
బ్యానర్స్ 
: జీ స్టూడియోస్ధర్మ ప్రొడక్షన్స్
నిర్మాతలు
: కరణ్‌ జోహార్అపూర్వ మెహతా
విడుదల
 తేదీజులై 20, 2018
***

          వెలుగు జిలుగుల అట్టహాసపు బాలీవుడ్  ప్రాంతీయ సినిమాల్ని ఎందుకు రీమేక్ చేస్తుందో అర్ధంగాని పరిస్థితి. ప్రాంతీయ సినిమాల్లో ఏంతో కొంత అస్తిత్వాల్ని నిలుపుకుంటున్నవి మరాఠీ నుంచి వస్తున్నవే. ఇతర ప్రాంతీయ సినిమాలు వాటి అస్తిత్వాల్ని ఏనాడో వదులుకుని, బాలీవుడ్ కి నకళ్ళుగా, ఫక్తు కాలక్షేప సినిమాలుగా మారిపోయాయి. మరాఠీ నుంచి ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయిన ‘ది కోర్ట్’ ని బాలీవుడ్ గనుక రీమేక్ చేస్తే ఎలా వుండేది? అలాగే తయారైంది మరాఠీ ‘సైరాట్’ ని ఇప్పుడు ‘ధడక్’ (గుండె లయ) గా రీమేక్ చేస్తే కూడా. అణగారిన వర్గాల కథలతో సినిమాలు తీసే జోలికి బాలీవుడ్ ఎప్పుడు పోయింది గనుక? అలాటి రికార్డే లేదు. ఒకవేళ వామపక్ష భావాల ప్రకాష్ ఝా అంతటి వాడు,  రిజర్వేషన్ల సమస్య మీద ‘ఆరక్షణ్’ తీస్తే కూడా, సగం నుంచి ప్లేటు ఫిరాయించి కార్పొరేట్ కాలేజీల వేరే కథగా మార్చేసుకుని రక్షణ పొందాడు.  ఇందులో దళితుడి వేషం వేసిన నవాబు స్టార్ సైఫలీ ఖాన్,  ఆ పాత్రలో ఎబ్బెట్టుగా కన్పించి నవ్వులపాలయ్యాడు. 

          ప్పుడు దళిత – ఉన్నత కుల సంఘర్షణాత్మక ప్రేమ కథలో శ్రీదేవి వారసురాలిగా, గ్లామర్ తారగా రంగప్రవేశం చేస్తున్న జాహ్నవీ కపూర్ ది కూడా డిటో సైఫలీ ఖాన్ పరిస్థితే- కాకపోతే దళిత పాత్ర పోషించలేదు. అయినా ఈకథలో తనలాటి రూపవతికి, లావణ్యవతికి స్థానంలేదు. వేరే తియ్యటి స్వప్నలోకాల,  అభూతకల్పనల రోమాంటిక్ కథ తీసుకుని,  రాకుమారిలా యూత్ ని గిలిగింతలు పెట్టాల్సిన పని. తన మార్కెట్ అక్కడుంది, ఇక్కడ కాదు. 

     2015 లో గ్లామర్ తార అనూష్కా శర్మ నిర్మించి నటించిన, సంచలన  ‘ఎన్ హెచ్ – 10’,   హర్యానాలో ఆనర్ కిల్లింగ్స్ కి సంబంధించిన  కథ. దీంట్లో కులాల ప్రసక్తి రాలేదు. కానీ ‘సైరాట్’ అనే స్పష్టమైన కులవివక్షా కథాసంవిధానంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు కుదరరు గాక కుదరరు. దర్శకుడు శశాంక్ ఖైతాన్ కూడా న్యాయం చేయలేడు గాక చేయలేడు. సైరాట్ దర్శకుడు నాగరాజ్ పోపట్ రావ్ మంజులే దళితుడు. కాబట్టి ఆ జీవితాలు, పరిస్థితులు అనుభవ పూర్వకంగా అతడికి తెలుసు. కనుక పరిపూర్ణంగా ఆ నేపధ్యంలో మహారాష్ట్ర గ్రామీణ వాతావరణాన్ని సృష్టించగలిగాడు. అక్కడి మనుషుల్ని అచ్చంగా అలాగే చూపించాడు. మత్స్య కారుడి కొడుకుగా గ్లామర్ లేని కొత్త హీరోని చూపించాడు. స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తెగా అంతగా గ్లామర్ లేని కొత్త హీరోయిన్ ని చూపించాడు. పల్లెటూరి మనుషులు ఎలావుంటారో అలాగే ఏ షోకులు చేయకుండా చిత్రించాడు. అదొక వాస్తవిక కథాచిత్రం. ఇదే బాలీవుడ్ లో రాజ్ కపూర్ ‘బాబీ’  తీస్తే, మత్స్య కారుడుగా క్రిస్టియన్ పాత్రని చూపించి,  అందులో ప్రేమ్ నాథ్ ని నటింప జేశాడు. హీరోయిన్ గా పరిచయమైన, బికినీలో కవ్వించిన డింపుల్ కపాడియా అతడి కూతురు. అదంతా బాలీవుడ్ గ్లామరస్ రిచ్ రోమాంటిక్ డ్రామా వ్యవహారం. ఇక్కడ కుల ప్రసక్తి వుండదు. రెగ్యులర్ బాలీవుడ్ ధనిక పేదా తేడాలే వుంటాయి. 

          ఇలాటి  వ్యవహారమే ‘ధడక్’ ది కూడా.  జైపూర్ లో రిచ్ రాజవంశ కుటుంబం, అందులో ఖరీదైన హీరోయిన్, ఇంకో  పక్క హోటల్ నడుపుకునే వాడి సాధారణ కొడుకు హీరో. కులాల ప్రస్తావనని కన్వీనియెంట్ గా దాటవేస్తూ- ధనిక - పేద అలవాటయిన, బాక్సాఫీసుకి సేఫ్ గా ఫీలయ్యే, రెగ్యులర్ బాలీవుడ్ ఫార్ములా ప్రేమ కథగా ముస్తాబు చేశారు. ‘సైరాట్’  లో కన్పించే పచ్చి రాజకీయ, సాంఘిక పెత్తనాల విత్తనాలు నాటడానికి బాగా భయపడ్డారు. 

          పార్థవి (జాహ్నవి)  జైపూర్ రాజరికపు వంశంలో గారాల కూతురు. జైపూర్లోనే హోటల్ నడుపుకునే వాడి కొడుకు మధుకర్ (
ఇషాన్ఖట్టర్‌‌). ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది పార్థవి తండ్రికి తెలిసిపోయి ఇద్దర్నీ విడదీసి,  మధుకర్ ని పోలీసుల చేత కొట్టిస్తాడు.  తప్పించుకుని ఇద్దరూ కోల్ కత పారిపోతారు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వుంటారు. చీటికీ మాటికీ గొడవలు కూడా మొదలవుతాయి. పార్థవి ఇంటికి వెళ్లి పోడానికి కూడా సిద్ధపడుతుంది. తర్వాత మనసు మార్చుకుంటుంది. పెళ్ళిచేసుకుంటారు. కొడుకుని కంటారు. అప్పుడు జరుగుతుంది అనుకోని సంఘటన...

      ఇలా ఈ కథలో ఒరిజినల్లో వున్న చాలా సీన్లు తొలగించారు. ఒరిజినల్ రెండు గంటల 45 నిమిషాలుంటే, రీమేక్ ని రెండు గంటలకి కుదించారు. ఒరిజినల్ కి ప్రాణమైన కుల నేపధ్య వాతావరణం, దాని తాలూకు సమస్యలూ పూర్తిగా తొలగించేశారు. దీంతో సరైన రెగ్యులర్ ప్రేమ కథైనా కాలేక, సామాజిక రుగ్మతల్ని కడిగేసే వాస్తవిక కథా కాలేక రెంటికి చెడ్డ రేవడి అయింది. 

          మరొక పెద్ద తప్పిద మేమిటంటే, ముగింపుని మార్చెయ్యడం! జాహ్నవి పాత్రని అంత ట్రాజడీతో ముగించలేక, మొదటి సినిమా కాబట్టి ఆమెకి మినహాయింపు నిచ్చి, ప్రేక్షకుల్ని సంతోష పెట్టాలనుకున్నట్టుంది- దీంతో మొత్తం ‘సైరాటే’ నే  తీసి అవతలకి గిరవాటేసినట్టయింది. ‘సైరాట్’ ముగింపు కోపం తెప్పిస్తూ ప్రచండ బలంగా వుంటే, ‘ధడక్’ అయ్యో పాపమని తేలిపోతుంది.

          స్టార్లతో అట్టహాసపు గ్లామర్ ప్రేమ సినిమాలతో హంగామా చేసే నిర్మాత కరణ్ జోహార్,  తనవి కాని చెప్పుల్లో కాళ్ళు దూర్చి, ఛీఛీ అని బూట్లు వెతుక్కున్నట్టుంది. ప్రాంతీయ చెప్పుల కథలు ఏమర్ధమవుతాయి బాలీవుడ్ కి...

సికిందర్
         


Friends! Back to business.

19, జులై 2018, గురువారం

662- స్క్రీన్ ప్లే సంగతులు    హీరోలకు ఎంత వారసత్వపు  నేపధ్య బలమున్నా, అదే వారసత్వపు నిర్మాణ శైలుల్లో సినిమాల్ని కొనసాగించలేరు. కాలాన్ని బట్టి మారాలి. రాజ్ కపూర్ తన కుమారుడు  రిషీ కపూర్ ని హీరోగా పరిచయం చేస్తూ తన కాలం నాటి కథా కథనాలతో, పాత్రలతో ‘బాబీ’ తీయలేదు. కాలానికి తగ్గ ట్రెండ్ సెట్టర్ ‘బాబీ’ ని తీసి చరిత్ర సృష్టించాడు. కొత్తగా పరిచయమయ్యే హీరోలు యువతని ఉర్రూతలూగిస్తూ రంగప్రవేశం చేయాల్సిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, ఈ తరం యువకుడు, తన మామ గారు ఎప్పుడో నటించిన లాంటి, ఇప్పుడు కాలం చెల్లిన పాత వ్యవహారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎవర్ని ఆకట్టుకో గలిగాడు? ఎవర్నీ లేదు!      
 
         
పురాతనాన్ని  రీసైక్లింగ్ చేసిన వ్యవహారంతో  కొత్త దర్శకుడు కూడా దెబ్బతినిపోయాడు. ఏడాదికి 70 మంది కొత్త దర్శకులు వస్తూంటే, ఒకరో ఇద్దరో తప్ప,  అందరూ అట్టర్ ఫ్లాపై తిరిగి వెళ్ళిపోతున్నసాంప్రదాయాన్ని ఈ కొత్త దర్శకుడు కూడా తుచ తప్పకుండా పాటించాడు. కొత్త దర్శకులు ఎందుకు ఫ్లాపవుతున్నారో విశ్లేషించుకోకుండా,  మళ్ళీ ఇంకో  కొత్త దర్శకుడు అవే పోకడలతో అలాగే దర్శన మిస్తూంటే – ఫ్లాపుల చరిత్రకి అంతెక్కడ వుంటుంది. 

          ప్రస్తుత సినిమా సమస్యేమిటంటే, షరామామూలుగా స్క్రీన్ ప్లే భ్రష్టత్వం.  పాత కథకి తోడు స్క్రీన్ ప్లే సర్వ భ్రష్టత్వం సంపూర్ణ దివాలాకోరు తనానికి దారితీసింది. ఈ స్క్రీన్ ప్లేలో పలాయనవాదం ఎంతగా వుందంటే, కథ చెప్పడానికి దర్శకుడు ససేమిరా ఇష్టపడడం లేదు. చివరి పది నిమిషాలకి కథని పరిమితం చేసి, మిగతా గంటా యాభై  నిమిషాల కాలమంతా టైం పాస్ చేశాడు. చివరి పది నిమిషాల కథకి ఈ గంటా యాభై నిమిషాల టైం పాస్ ని చేర్చడానికి రకరకాల వంకర్లు తిప్పాడు. గమ్యానికి ఎలా చేరామన్నది కాదు, చేరామా లేదా అన్నదే ముఖ్యమనే - ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్ మైండ్ సెట్ తో – సహనపరీక్షకి గురిచేసే మేకింగ్ ని రుద్దాడు.

స్థూలంగా కథ 
         ముందు స్థూలంగా కథ చెప్పుకుంటే, ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేసే శ్రీనివాసరావు కొడుకు రామ్. చిన్నప్పట్నుంచీ కొడుకుకేం కావాలన్నా సమకూరుస్తూ, కోరిన చదువుకూడా అప్పు చేసి చదివించాడు.  కానీ రామ్ కి ఉద్యోగం రావడం లేదు. దీంతో నేస్తాలనేసుకుని చెడ  తిరుగుళ్ళు మొదలెట్టాడు. ఇలాకాదని,  నేస్తాలతో కలిసి ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ పెట్టాడు. ఇది వికటించి పోలీస్ స్టేషన్లో పడ్డాడు. తండ్రి విడిపించు కొస్తూంటే యాక్సిడెంట్ అయి గుండె పోటుకి గురయ్యాడు. అప్పుడు తండ్రి మిత్రుడు ఒకాయన తండ్రి గురించి ఒక విషయం  చెప్పాడు. కుటుంబ బాధ్యతల కోసం అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ కావాలన్న తన కలల్ని చంపేసుకున్నాడని.  


             
దీంతో రామ్ మారడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా మళ్ళీ ఈవెంట్ మేనేజ్ మెంట్ చేపట్టి, ప్రేమించిన చైత్ర సహకారంతో ఆమె బాస్ కుటుంబానికి పరిచయమయ్యాడు. ఆ కుటుంబంలో వున్న సమస్యని పరిష్కరించి, ప్రతిఫలంగా ఒక ఈవెంట్ మేనేజి మెంట్ ప్రోగ్రాం పొందాడు. పనిలో పనిగా ఆ బాస్ తన కొడుక్కి రామ్ చెల్లెలితో పెళ్లి కూడా జరిపించాడు.  చివరికి రామ్ తండ్రికి కెమెరా కొనిచ్చి ప్రపంచ యాత్ర తిప్పాడు. అక్కడ తీసిన ఫోటోలని పోటీలకి పంపి,  తండ్రి అవార్డు అందుకునేలా చేశాడు. దీంతో పిల్లలు కూడా తమ పేరెంట్స్ కి కోరికలుంటాయని గుర్తించాలని చెప్పి, ప్రయోజకుడైన రామ్ ని తండ్రి ఆలింగనం చేసుకున్నాడు. 

స్క్రీన్ ప్లే సంగతులు 
         ఈ కథకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా అంటే వుంది. మంచి మార్కెట్ యాస్పెక్ట్  వుంది. అయితే కథని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోకుండా, పాత మూస ధోరణిలో సంసార కథగా మార్చేయడంతో మార్కెట్ యాస్పెక్ట్ గల్లంతై పోయింది. ఈ కథ సెంట్రల్ ఐడియా ఏమిటంటే,  గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలన్న తండ్రి కలని కొడుకు నెరవేర్చడం. వాడవాడలా సెల్ ఫోన్లతో ఫోటోలు తీసే అదృష్టానికి  నోచుకుంటున్న ప్రజలందర్నీ ఆకట్టుకునే ఫోటోగ్రఫీ సెంట్రల్ ఐడియా, ప్రధానాకర్షణ కావాలి ఈ సినిమాకి నిజానికి. కాబట్టి కాన్సెప్ట్ పరంగా మార్కెట్ యాస్పెక్ట్ పుష్కలంగా వుంది. ఇవ్వాళ్టి  మార్కెట్  యాస్పెక్ట్ లో ప్రధానంగా సినిమా ప్రేక్షకులు యువతే. ఐతే ఇందులో అమ్మాయిల్లేరు. ఎంతో క్రేజ్ వున్న హీరోల  సినిమాలకి తప్ప అమ్మాయిలు రావడం లేదు. వాళ్ళతో ఓపెనింగ్స్ ఉండడంలేదు. కాబట్టి జనరల్ గా ‘యువతలో సగం’ సినిమా ప్రేక్షకులుగా లేరు. చిరంజీవి అల్లుడు హీరో అయ్యాడని యువతలో భాగమైన  అమ్మాయిలు కాదుకదా,  అబ్బాయిలు కూడా కానరావడం లేదంటే,  దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏ పాటిదో అర్ధం జేసుకోవచ్చు. 

          యువతని దృష్టిలో పెట్టుకుని ఇవాళ్టి మార్కెట్ యాస్పెక్ట్  రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, అంతే. ఇంకే కబుర్లు చెబుతూ సినిమాలు తీసినా ఇంతే సంగతులు. తెర మీద అమ్మాయి కనపడాలి, లేదా పుష్కలంగా ధనార్జన కనపడాలి. వీటితో ముడిపడి వుంటే ఏ కథైనా ఓకే. ఫోటోగ్రఫీ కథకి ఇది వర్కౌట్ అవుతుంది. 

           క్రియేటివ్ యాస్పెక్ట్ కొస్తే,  ఇంత మంచి మార్కెట్  యాస్పెక్ట్ వున్న సెంట్రల్ ఐడియాతో సమకాలీన కథని వూహించలేక, పురాతన  కుటుంబ కథని అల్లేశారు. ఎప్పుడు తీసినా కుటుంబ కథలు అవే ముప్ఫై ఏళ్ల నాటి కథల్లాగే వుండాలన్న పద్ధతిలో ఇంకా తీస్తున్నారు. ఇలాటి కుటుంబ  సినిమాలు  ఎప్పుడో టీవీ సీరియల్స్ దెబ్బకి అయిపులేకుండా పోయాయి. 

          స్ట్రక్చర్ కొస్తే, క్రియేటివ్ స్కూలు కన్పిస్తుంది. ఇందువల్ల కథకి, పాత్రలకి ఒక చట్రం కన్పించదు. స్ట్రక్చర్ స్కూలు స్క్రీన్ ప్లే కున్నట్టు ప్లాట్ పాయింట్స్ వుండవు. కథని ఒకే పెద్ద ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలన్న సృజనాత్మకత వరకూ బాగానే వుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాకులో  విషయాన్ని సర్దుబాటు చేసిన తీరు దిశా దిక్కూ లేకుండా వుంది. 

          తండ్రీ కొడుకులు బైక్ మీద పోతూండగా వాళ్ళ గురించి ఒక వాయిసోవర్ లో చెబుతూ ఫ్లాష్ బ్యాక్  ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఉస్సూరంటూ చిన్నప్పటి కథ చెప్పడం దగ్గర్నుంచీ ఇంకా అదే పాత పద్ధతిలో స్పూన్ ఫీడింగ్ చేసస్తూ ప్రారంభమవుతుంది. పుట్టిన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి  చేసే వరకూ ఇది కొనసాగుతుంది. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధం ఏమిటంటే, కొడుకు భవిష్యత్తు గురించి తండ్రి కష్టపడడం. అలాటి కొడుకు తీరా  ఉద్యోగం దొరక్క ఆవారాగా కామెడీలు చేస్తూ తిరగడం ప్రారంభిస్తాడు. ఎదురింట్లో దిగిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టి, ఒక పొరపాటు జరిగి పోలీస్ స్టేషన్లో పడతాడు. తండ్రి విడిపించుకొస్తూ గుండె పోటుకి గురై హాస్పిటల్లో పడతాడు. ఇదీ ఫస్టాఫ్ కథ. 

          స్క్రీన్ ప్లే పరంగా ఇది బిగినింగ్ విభాగమనుకుంటే,  దీని ముగింపు ఇంటర్వెల్లో గుండె పోటు సీనుతో వచ్చిందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడాలన్న మాట. కానీ ఏర్పడదు. ప్లాట్ పాయింట్ వన్ అంటే  అక్కడెదురైన సమస్యతో హీరోకి ఒక లక్ష్యం ఏర్పడాలి. కానీ ఇంటర్వెల్ లో కూడా హీరో ఏం చేస్తాడో, కథేమిటో తేలదు. 

          ఇంటర్వెల్ తర్వాత హాస్పిటల్ సీను వస్తుంది. తండ్రి హాస్పిటల్లో వుండగా, ఆయన మిత్రుడు హీరోకి తండ్రి గురించిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇందులో తండ్రికి గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలని కోరిక. నేషనల్ జాగ్రఫిక్ లో ఫోటోలు కూడా ఎంపికై జాబ్  వస్తుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి సిద్ధం కూడా అవుతాడు. అంతలో బైక్ మీద కొడుకుని తీసుకుని భార్యతో పోతూ యాక్సిడెంట్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో  వున్న కొడుకు వైద్యం కోసమే లక్షలు అప్పు చేయాల్సివస్తుంది. దీంతో ఫోటోగ్రఫీ కలలు  కల్లలవుతాయి. సాధారణ ఉద్యోగిగానే ఉక్కు ఫ్యాక్టరీలో ఉండిపోతాడు. 

          అంటే,  చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడడానికి తండ్రి చేసుకున్న త్యాగం గురించి తెలుసుకున్న హీరో, ఇప్పటికైనా తండ్రికి కుటుంబ బాధ్యతలు వదిలించి,  ఫోటోగ్రఫీ కలని నెరవేర్చేందుకు ఒక లక్ష్యంతో కంకణ బద్ధుడవుతాడని ఆశిస్తాం. ఇదేం జరగదు.

          మళ్ళీ ఈవెంట్ మేనేజి మెంట్ లో పడతాడు. దీనికోసం హీరోయిన్ తో ఆమె బాస్ ని పడతాడు. ఆ బాస్ ఇంట్లో కొడుకుతో వున్న సమస్యని కిడ్నాప్ డ్రామా అడి పరిష్కరిస్తాడు. దీంతో అదే బాస్ తన చిన్న కొడుక్కి హీరో చెల్లెలితో పెళ్లి జరిపించేస్తాడు. దీని తర్వాత హీరో తండ్రికి కెమెరా కొని ప్రపంచం తిప్పడం, ఆ ఫోటోలు పోటీలో గెలవడం వగైరా జరిగిపోయి ముగిసిపోతుంది కథ. 

          ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల హీరోకి సంఘర్షణ అంటూ, తద్వారా కథ పుట్టడమంటూ జరక్కుండా పోయింది. దీంతో ప్లాట్ పాయింట్ టూ కూడా ఏర్పడక ముగింపు చప్పగా తేలిపోయింది. ఉన్న విషయంలో కూడా మలుపులు, సన్నివేశాలు అన్నీ పాత  ఎన్నో సినిమాల్లో వచ్చినవే. వాటిని టెంప్లెట్స్ గా పెట్టేసుకుని విషయాన్ని నింపేశాడు. తండ్రికి ఫోటోగ్రఫీ కల అనే సెంట్రల్ ఐడియా జోలికి అసలే వెళ్ళకుండా, పైపైన ఉత్తుత్తిగా ఆ కోరిక కొడుకు తీర్చినట్టు చూపించేసి వదిలించుకున్నాడు. 

          కొత్త హీరోతో యూత్ ని ఆకర్షించే అంశం ఒక్కటీ లేదు. కానీ సెంట్రల్ పాయింటులో గొప్ప యూత్ అప్పీల్ వుంది. తండ్రిని ఇప్పటి కాలానికి తగ్గ ఫోటోగ్రాఫర్ ని చేసేందుకు తండ్రితో కలిసి హీరో చేసే విన్యాసాలు, సాహసాలు, వీరోచిత కృత్యాలూ వగైరా ఫన్నీగా, హాస్య భరితంగా, కొత్త కథగా  చూపించాల్సింది పోయి – ఏ ప్రేక్షకులకీ పట్టని పాత సంసారాల  ఏడ్పుల  కథలో హీరోని కుదేసి కుదేలు చేసేశాడు దర్శకుడు.

పాత్రచిత్రణ  
       కొడుకు పాత్ర ఎంత బలహీనమో, తండ్రి పాత్ర అంతే బలహీనం. కొడుకు మీద పెట్టిన శ్రద్ధ కూతురి మీద ఎందుకో పెట్టడు. కొడుకు చదువు, కొడుకు బాగు, అంతవరకే. పిల్లలిద్దర్నీ సమానంగా చూసే పద్ధతే లేదు. పిచ్చి పిల్ల ఏం  చదివిందో, ఆమెతో ఎప్పుడూ పెళ్లి చేసి పంపించెయ్యాలన్న గోలే. ఆమెని కూడా బాగా చదివించి వుంటే కొడుకుని తలదన్నేసి పోయేది.

          కొడుకు ఏదో తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో విడిపించుకొస్తాడు. కోపంతో వుంటాడు. నిజానికి అది తప్పేం కాదు. ఈవెంట్ మేనేజి మెంట్ లో తెలియక జరిగిన ఒక పొరపాటువల్ల ఒకడు గాయపడ్డాడు, అంతే. ఇక నుంచి ఇలా జరక్కుండా చూసుకోమంటే సరిపోతుంది. కానీ కొడుకేదో ఘోర నేరం చేసి పోలీస్ స్టేషన్ కెక్కించాడన్న ద్వేషం ఎందుకో అర్ధం గాదు. ఈ కోపంతో కొడుకుని బైక్ ఎక్కించుకుని పోతున్న వాడల్లా గుండె పోటుతో పడిపోతాడు. అప్పుడు కొడుకు ఒక అంబులెన్స్ ని ఆపుతాడు. ఆ అంబులెన్స్ లో ఇదివరకు నాటకమాడి నేస్తాలతో ఉచితంగా ప్రయాణం చేశాడు. దీని మీద ఆ డ్రైవర్ ఫైర్ అయి, ఇప్పుడు కూడా తండ్రితో నాటక కమాడుతున్నావని తిట్టి ఎక్కించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో తండ్రికి కొడుకు మీద ఇంకింత మండిపోతుంది అంబులెన్స్ తో హీరో ఆడిన నాటకానికి. కానీ అదంతా గతం. ఇప్పుడు బాగుపడి ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టుకున్నాడుగా?  ఇంకెందుకు అసహ్యం?

           ఇక్కడ గమనించాల్సింది ఇంకోటేమిటంటే, ఈ తండ్రి చిన్నప్పుడే కొడుకుని ఇదే బైక్ మీద ఎక్కించుకుని యాక్సిడెంట్ చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ఇప్పుడు పెద్దయ్యాక కొడుకుని ఎక్కించుకుని రెండోసారీ యాక్సిడెంట్ చేశాడు. కాకపోతే తనకి గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. ఇది చెల్లుకి చెల్లు కదా? ఇంకేమిటి? ఇంకా చెప్పుకోవడానికి, ఇంత సినిమా తీయడానికీ కథ వుంటుందా? తీయాల్సిన అసలు కథ తీయకుండా ఏదో తీస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది?

 సికిందర్  


(తెలుగు రాజ్యం డాట్ కాం సౌజన్యంతో)