రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జులై 2018, సోమవారం

664 : స్క్రీన్ ప్లే సంగతులు


     2000 సంవత్సరం నుంచీ తెలుగు సినిమాలు నరనరాన ఇంకిన అవే లోపాలతో అట్టర్ ఫ్లాపవుతున్నాయి. అవే పాసివ్ హీరో పాత్రలు, అవే మిడిల్ మటాషులు, అవే ఎండ్ సస్పెన్సులు, అవే సెకండాఫ్ సిండ్రోములు సింగారించుకుని, బాక్సాఫీసు చెలియలి కట్ట దగ్గర జామ్మని జలసమాధి అయిపోవడం. పదుల కోట్లు ధారబోసే పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఈ నాల్గు శనిగ్రహలేమిటో, ఇవెందుకు తమ సినిమాల్లో తిష్ట వేస్తున్నాయో పట్టించుకునే పాపాన పోవడం లేదు. అంతా ఏవో అంచనాల మీదే, వూహల మీదే, నమ్మకాల మీదే ఆధారపడి సినిమాలు తీసేయడం. శాస్త్రీయంగా ఏ ప్రాతిపదికా వుండని రాతకోతలతో - ఏం రాసుకున్నారో, ఎలా రాసుకున్నారో, ఎందుకు రాసుకున్నారో తెలియకుండా బౌండెడ్ స్క్రిప్టు అనే డెత్ వారెంట్ ఒకటి జారీ చేసుకుని కొబ్బరికాయ కొట్టేయడం!

          ‘లవర్’ లో ఒకటి కాదు ముచ్చటగా మూడు శనిగ్రహాలు కాపురం పెట్టాయి : పాసివ్ హీరో పాత్ర, మిడిల్ మటాష్, ఎండ్ సస్పెన్స్ అన్నవి. సినిమాకి పెట్టిన పెట్టుబడితో ఈ మూడూ ఆడిన చెలగాటం సహజంగానే ఫ్లాపు అనే పదార్ధాన్ని పుట్టించింది.  ఫ్లాపవుతున్న సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయో విశ్లేషించుకోక కొత్త ఫ్లాపిస్టులుగా తయారవుతున్నారు. ఫ్లాపిస్టులకేం ఎరుక మన చెలగాటమని శనిగ్రహాలు ఇంకా చెలరేగిపోతున్నాయి. ఇప్పుడీ మూడు శనిగ్రహాలూ కూడబలుక్కుని ఎక్కడెక్కడ ఎలా చెలరేగి, హాట్ హాట్ విడుదలని హాంఫట్ చేశాయో చూద్దాం ...

బిగినింగ్ కథ
       రాజ్ (హీరో) బైక్ పక్కన పెట్టుకుని కొండ ప్రాంతంలో కూర్చుని వుంటాడు. తను అనాధ అయినట్టూ, తను ప్రేమిస్తున్న అమ్మాయి మీద ఎవరో ఎటాక్ చేసినట్టూ తల్చుకుని, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఆర్నెల్లు వెనక్కి వెళ్ళాలంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అక్కడ సంపత్ అనే విలన్, అతడి అనుచరుడు జగ్గూ పరిచయమవుతారు. జగ్గూ ని అన్నలా భావించి అతడింట్లోనే వుంటాడు రాజ్. వదిన, ఆమె చిన్న కూతురూ వుంటారు.

          రాజ్ కస్టమైజ్డ్ బైక్ బిల్డర్ గా జీవనోపాధి పొందుతూంటాడు. మెయిన్ విలన్ ఓపెన్ అవుతాడు. ఇతను అరుదైన వ్యాధితో బాధపడుతూంటాడు. అవయవ మార్పిడికి మనిషి కోసం వెతుకుతూంటాడు. హీరో ఫ్రెండ్స్ నల్గురున్నట్టు ఓపెనవుతారు. వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ హీరో పాట వేసుకుంటాడు. పాట తర్వాత ఇంకో విలన్ జెపితో తగాదా వచ్చి గాయపడతాడు. హాస్పిటల్లో చేరి,  అక్కడ నర్సు  చైత్రని చూసి ప్రేమలో పడతాడు. ఆమె పడదు. ఆమె వెంట పడుతూంటాడు. ఓ పాటేసుకుంటాడు.

          చైత్రకి హాస్పిటల్లో ఏదో గూడుపుఠానీ జరుగుతోందని అనుమానంవచ్చి డాక్టర్లని అడుగుతుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. డాక్టర్ కి మెయిన్ విలన్ అనుచరుడు అజయ్ నుంచి కాల్ వస్తుంది. త్వరలో మ్యాచింగ్ మనిషిని అప్పగిస్తానంటాడు డాక్టర్. రాజ్ మళ్ళీ తన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తాడు. ఓ దిక్కులేని పేషంట్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరతాడు. ఆపరేషన్ చేయాలంటే ష్యూరిటీ పెట్టేవాళ్ళు లేక కంగారుపడుతుంది చైత్ర. సంతకం పెట్టేందుకు రాజ్ ముందుకొచ్చి ఆమె మనసుని గెలుచుకుంటాడు. ఆమె ప్రేమలో పడి అతడితో పాటేసుకుంటుంది. 

          పాట తర్వాత, లక్ష్మి అనే పిల్ల పేషంట్ కనపడక కంగారు పడుతుంది చైత్ర. ఒక స్లో పాయిజన్ ఇంజెక్షన్ దొరికి డాక్టర్లని అడుగుతుంది. వాళ్ళు సీరియస్ అవుతారు. చైత్ర పారిపోతుంది. పారిపోయిన చైత్ర రాజ్ తో కొండ ప్రాంతంలో కూర్చుని వుంటుంది. గ్యాంగ్ వచ్చి ఎటాక్ చేస్తారు. రాజ్ పోరాడి వాళ్ళని తరిమేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ మొదటి సీనుకొచ్చి, అలా కొండప్రాంతంలో కూర్చున్న రాజ్,  ఎవరు ఎటాక్ చేశారు? అని మళ్ళీ ప్రశ్నించుకుంటాడు. ఇంటర్వెల్ పడతుతుంది.

       సెకండాఫ్ మొదలవుతుంది. రాజ్, చైత్ర వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేస్తారు. చూస్తాంలే అంటారు పోలీసులు. అన్న జగ్గూకి విషయం తెలిసి, చైత్రని దూరంగా పంపించెయ్యమంటాడు. మలయాళీ అయిన చైత్రతో రాజ్ కేరళ వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె తల్లి వుంటుంది. ఇద్దరి ప్రేమాయణం మళ్ళీ మొదలవుతుంది. రేపు ఓనం పండగ వుందని చెప్తుంది చైత్ర. ఇద్దరూ ఓనం పండక్కి గ్రూప్ సాంగ్ వేసుకుంటారు. అచ్చిబుచ్చి ప్రేమలు  కంటిన్యూ చేస్తారు. 

          అటు డాక్టర్లూ మెయిన్ విలన్ సీరియస్ అవుతారు. చైత్ర ఎక్కడుందో పట్టుకోవాలని హడావిడీ చేస్తారు. ఇటు చైత్ర తల్లి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. చైత్ర తిప్పికొడుతుంది. అప్పుడు రాజ్ మీద ప్రేమ బయట పెట్టుకుంటుంది. మీ సంగతి తెలుసుకోవాలనే ఉత్తుత్తి పెళ్ళిచూపులతో నాటకమాడానని సంతోషపడుతుంది తల్లి. అయితే రాజ్ కుటుంబాన్ని పిలిపించి ఎంగేజ్ మెంట్ కానిద్దామంటుంది. 

          అటు జగ్గూ మీద గ్యాంగ్ ఎటాక్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ విలన్ తొత్తుగా జగ్గూ బాస్ సంపత్ రివీలవుతాడు. చైత్ర ఎక్కడుందో చెప్పమంటాడు. చెప్పకుండా కేరళ వెళ్ళిపోతాడు జగ్గూ. కుటుంబంతో నిశ్చితార్ధాని కొచ్చిన జగ్గూ, రాజ్ తో మాట్లాడాలని రాజ్ పిలిపిస్తాడు. కానీ మాట్లాడడు. నిశ్చితార్ధం అయ్యాక తిరిగి వెళ్ళిపోతూ,  స్టేషన్లో ఆగిపోయి చైత్రకి కాల్ చేసి పిలిపించుకుంటాడు. లక్ష్మిని ఎక్కడ దాచావో చెప్పేస్తే మనకి ప్రమాదం తప్పుతుందంటాడు. ఆమె చెప్పదు. ఇంతలో మెయిన్ విలన్ అనుచరుడు అజయ్ గ్యాంగ్ తో వచ్చేసి జగ్గూని చంపేసి చైత్రని ఎత్తుకుపోతాడు. చైత్రకి కాల్ చేస్తూంటే రెస్పాన్స్ రాకపోవడంతో, వెతుక్కుంటూ వచ్చి చచ్చి పడున్న జగ్గూని చూస్తాడు రాజ్.

మిడిల్ కథ 
      చనిపోయిన అన్న చితికి నిప్పెట్టి చైత్రని వెతుక్కుంటూ ఓ శాడ్ సాంగ్ వేసుకుంటాడు రాజ్. తిరిగి వూరి కొచ్చేసి గల్లీగల్లీలు గాలిస్తూంటాడు. ఓ గల్లీలో ఒకడు దొరుకుతాడు. వాణ్ణి కొడితే ఇంకొకడి గురించి చెప్తాడు. వాణ్ణి కొడితే మెయిన్ విలన్ గురించి అంతా చెప్పేస్తాడు. మెయిన్ విలన్ కి లివర్ వ్యాధి. అరుదైన బ్లడ్ గ్రూపు. ఆ బ్లడ్ గ్రూపున్న పిల్ల లక్ష్మి దొరికింది. ఆమెని ఇంజెక్షన్ల ద్వారా నెమ్మదిగా బ్రెయిన్ డెడ్ అయ్యేలా చేసి, లివర్ తస్కరించాలని ప్లాను. ఇది విని మెయిన్ విలన్ ఆచూకీ చెప్పమంటాడు రాజ్.
ఎండ్ కథ
          విలన్లు లక్ష్మి కోసం చిత్రని  చిత్రవధ చేస్తూంటారు.  రాజ్ చైత్రని విడిపించుకుని, మెయిన్ విలన్, అతడి అనుచరుడు అజయ్ లు ప్రయాణిస్తున్న కారుని రిమోట్ కంట్రోల్ చేసి ప్రమాదం జరిగేలా చూస్తాడు. వెంటనే ఎండ్ టైటిల్స్ పడతాయి.
***
         స్థూలంగా ఇది పూరీ జగన్నాథ్ టెంప్లెట్టే. కాకపోతే పూరీ జగన్నాథ్ పాల్పడని అనౌచిత్యాలకి దీని కథకుడు అత్యుత్సాహంతో పాల్పడ్డాడు : పాసివ్ హీరో పాత్ర, మిడిల్ మటాష్ కథనం,  ఎండ్ సస్పెన్స్ హంగు. అయితే దీన్ని సరిదిద్దితే ఈ కథ బాగుపడుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తదు. ఎందుకంటే ఇలాటి కథకి ఇప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ లేదు. ట్విట్టర్ లో ప్రేక్షకుల కామెంట్స్ చూస్తే, ఇంకా ఎన్నిసార్లు తీస్తార్రా ఈ కథలూ, కొంచెమైనా మారండ్రా బాబూ, కొత్తగా ఆలోచించండి...అంటూ వాపోతున్నారు యూత్. 

          కాబట్టి ఇలా విశ్లేషించడం కథని బాగుపర్చే దృష్టితో కాదు. పనికిరాని కథని ఏం బాగుపరుస్తాం. అసలే పనికిరాని కథని ఇంకెంత పనికిరాకుండా దారుణంగా తీశారో తెలుసుకోవడానికే ఇది.  కథకుడి మీద  తెలుగు సినిమాల ప్రభావం చాలా వున్నట్టుంది. వాటిలోని సీన్లని కాపీ చేసి, దిల్ రాజుకి సమర్పించుకోకుండా వుండలేకపోయాడు. వేరే నిర్మాత తీసిన సినిమాలోని సంగతులు తన చేత ఖర్చు పెట్టించి తన ఖాతాలోనే వేసినట్టు దిల్ రాజుకి  కూడా తెలియక పోయుండొచ్చు. 

          గుణశేఖర్ తీసిన ‘అర్జున్’ లో మహేష్ బాబు వర్షంలో కత్తి పట్టుకుని కూర్చునే ఓపెనింగ్ ఇమేజిని ఎంచక్కా కాపీచేసి కథకుడు తన కథలో కొండల మధ్య హీరోని కూర్చోబెట్టి పెట్టేశాడు. అక్కడ్నుంచి  ‘అర్జున్’ లో లాగే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి, హీరోయిన్ తో కథ చెప్పుకొస్తూ, ఆమె మీద ఎటాక్ చేసిన గ్యాంగ్ తో తలపడేట్టు చేసి, ‘అర్జున్’ లోలాగే ప్రారంభ సీను కొచ్చాడు. అక్కడ ఇంటర్వెల్ వేశాడు. ఇంకా కథకి మూలబిందువైన అరుదైన బ్లడ్ గ్రూపు పాయింటు గోపీచంద్ నటించిన ‘ఒక్కడున్నాడు’ లోంచి మనసుపడి స్వీకరించాడు. ఇలా మనసు పడి స్వీకరించకుండా స్వీకరించినట్టయిన పని కూడా ఒకటి జరిగిపోయింది పనిలోపనిగా. మనుసు పడి స్వీకరించిన వాటిని పూరీ టెంప్లెట్ లోనే  కొనసాగిస్తే పోయేది - ఇంకేదో క్రియేటివిటీ చూపబోయే సరికి అదికాస్తా మళ్ళీ మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లోకి తిరగబెట్టింది. అందుకే ఫ్లాపు ఖాయమైపోయింది ‘బాబీ’ లాగే. స్ట్రక్చర్ పట్టని క్రియేటివిటీతో ఎంత కళా పోసనో!

       స్ట్రక్చర్ లో పైన చెప్పుకున్న బిగినింగ్ కథ చూస్తే, అరగంట ముప్పావుగంటలో ముగియాల్సిన బిగినింగ్, ఇంటర్వెల్ కూడా దాటేసి  సెకండాఫ్ లోకి జొరబడి,  గంటన్నర దాకా సాగింది. మొత్తం రెండు గంటల సినిమాలో బిగినింగే గంటన్నర! బిగినింగే గంటన్నర! బిగినింగే గంటన్నర! ఇలా ఇప్పుడు గానీ ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. ఇక మిడిల్ కి ఎనిమిదే నిమిషాలు! ఎండ్ పదిహేను నిమిషాలుండొచ్చు... 

          రెండు గంటల సినిమాలో బిగినింగ్, ఎండ్ లు అరగంట చొప్పున వుండి, మిడిల్ గంట పాటు సుదీర్ఘంగా వుండాల్సింది పోయి, మిడిలే పూర్తిగా మటాష్ అయిపోయింది. అంటే గుండె కాయ గల్లంతన్న మాట. అంటే కథే లేదన్న మాట. గంటన్నర దాకా సాగదీసిన దంతా కథే అనుకున్నట్టుంది కథకుడు. అది కథ కాదనీ, తర్వాత మొదలవబోయే మిడిల్ కి కేవలం సన్నాహమన్న బేసిక్స్ ని తెలుసుకోలేక పోయాడు. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడ రావాలో అసలేమీ తెలియకుండా పోయాడు. 

          నిజానికి ప్లాట్ పాయింట్ వన్ అనేది, అంటే కథకి ప్రధాన మలుపు, అంటే హీరోకి ఒక లక్ష్యం అంటూ ఏర్పడి దాని కోసం పోరాడే ఘట్టం, ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ పూర్తయాక ఇంటర్వెల్లో రావాలి ఈ కథకి. కానీ ఇక్కడ కూడా ఎవరీ ఎటాక్ చేశారు? అని ప్రశ్న వేసుకుని ఇంటర్వెల్ వేసుకున్నాడు. దీంతో ఏమైనా లాభం చేకూరిందా? ఈ ప్రశ్నతో ఫస్టాఫ్ మొదలెట్టినప్పుడు కథలో ఏ స్థితి వుందో,  ఇంటర్వెల్లో మళ్ళీ అదే స్థితిలో ఎక్కడేసిన గొంగళిలా వుంది. అంటే ఏమాత్రం టెన్షన్ ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్ అనేవి ఏర్పడకుండా చప్పగా వుందన్న మాట. 

          సరే, ఎవరీ ఎటాక్ చేశారు? అన్న ప్రశ్నతో సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేశాడా? అదీ చెయ్యక అన్న చెప్పాడని హీరోయిన్ ని తీసుకుని కేరళ వెళ్ళిపోయాడు. అంటే మాట వరసకి ఇంటర్వెల్ ప్లాట్ పాయింట్ వన్ అనుకుంటే, దాన్ని పరిహసించి పలాయనం చిత్తగించాడు. ప్లాట్ పాయింట్ వన్ అనేది కథ పుట్టే మలుపే కాదు, అది హీరోకి పర్సనల్ టర్నింగ్ పాయింటు కూడా. అక్కడ కథలో పుట్టిన సమస్యని సాధించే లక్ష్యం ఏర్పర్చు కోకుండా కథలోంచి పారిపోలేడు. పారిపోతే పాసివ్ పాత్ర అయినట్టే.

       అలాగే అయ్యాడు, మళ్ళీ కేరళలో ప్రేమలు వెలగబెడుతూ వుండిపోయాడు. బ్యాక్ డ్రాప్ లో విలన్లతో పుట్టిన సమస్య పట్టకుండా వుండిపోయాడు. ఎవరీ ఎటాక్ చేశారన్న ప్రశ్నని హీరోయిన్నే అడిగితే సరిపోతుంది. ఆమె డాక్టర్లతో జరిగిందంతా చేప్పేసేది. కానీ ఆమెని అడగడు, ఆమె చెప్పదు. అలా వుంది అతడి తెలివి. అలా వుంది ప్రేమలో ఆమె నిజాయితీ. మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లో మాహేష్ బాబు, ఆరతీ అగర్వాల్ ల మాఫియా తండ్రులిద్దరూ నగరాన్ని అట్టుడికిస్తూంటారు. కాల్పులతో, పేలుళ్లతో జనం అల్లాడి పోతూంటారు. అయినా అదే నగరంలో ఇదేమీ పట్టకుండా ఇద్దరూ ప్రేమ సన్నివేశాల్లో వుంటారు. ప్రేమించుకుంటూనే వుంటారు. చుట్టూ బ్యాక్ డ్రాప్ లో అసలేమీ జరగడంలేదన్న ప్రపంచంలోనే వుంటారు. ఈ బ్యాక్ డ్రాప్ తో మహేష్ బాబుకి సంపర్కమే వుండదు. ఇలాగే  బ్యాక్ డ్రాప్ లో విలన్ల కుట్రతో సంబంధమే లేదన్నట్టుగా ‘లవర్’ హీరో కూడా వుండి  పోతాడు. ఇదంతా ఇంకా బిగినింగ్ విభాగంగానే సాగుతూంటుంది సెండాఫ్ లో కూడా. చివరికి విలన్లు అన్నని చంపి హీరోయిన్ని ఎత్తుకుపోయినప్పుడు గానీ, అసలు విషయం తెలిసిరాదు హీరోకి. 

          అంటే ఇక్కడ ఇప్పుడు కథ ప్రారంభమయ్యిందన్న మాట! గంటన్నరకి!  ఇంతసేపూ ప్రేక్షకులు తలపట్టుక్కూర్చోవాలన్న మాట. ఆకలికి ఇడ్లీ పెట్టకుండా ఎంతసేపూ చట్నీయే గుమ్మరిస్తున్నాడు కథకుడనే వంటకాడు నాకమని. ఇలా హీరోకి ఎప్పుడైతే ఇక్కడ విషయం తెలిసిందో, తెలిసి ఇప్పుడేం చేయాలన్న గోల్ ఏర్పడిందో – అప్పుడేర్పడిందన్న మాట ప్లాట్ పాయింట్ వన్!  ఈ ప్లాట్ పాయింట్ దగ్గర గోల్ తో మిడిల్ ల్లోకి ఎంటరయ్యాడు. అన్నకి కర్మకాండ చేశాడు, విషాద గీతం వేసుకుంటూ హీరోయిన్ని వెతికాడు, దుండగుల్ని పట్టుకున్నాడు. అప్పడు తెలుసుకున్నాడు విలన్ల కుట్రేమితో. ఇది ప్లాట్ పాయింట్ టూ! ఇంతే, మిడిల్ ఎనిమిది నిమిషాల్లో ముగిసిపోయి మిడిల్ మటాషై పోయింది. ఇంతకంటే అన్యాయం వుంటుందా ఏ సినిమాకైనా? వంద రూపాయల టికెట్ కి ఎనిమిది నిమిషాల కథే  చూపిస్తారా?  

          ఈ మిడిల్ చివర్లో కుట్ర చెప్పించేదాకా మనకికూడా ఇంతసేపూ తెలీదు. ఎండ్ సస్పెన్స్ గా ఇప్పుడే రివీలవుతుంది. అంటే కుట్ర  వివరాలు తెలియకుండా, ఏం కథ చూస్తున్నామో తెలియకుండా, ఏది ఎందుకు జరుగుతోంతో అర్ధంగాక ఇన్వాల్ కాలేకా,  మనం అసహనానికి గురవుతూ సినిమా చూడాలన్న మాట. 

          దీంతో అయిపోలేదు. ఇంకా ఇలాగే తీస్తూంటారు. ఇలాగే వస్తూంటాయి సినిమాలు. ఇలాగే సమాధి అవుతూంటాయి. దీన్నాపలేరు, ఆపడం తెలీదు, తెలుసుకోవాలనీ వుండదు. 

సికిందర్