రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, నవంబర్ 2017, గురువారం

556 :రివ్యూ!

రచన –దర్శకత్వం : జి. శ్రీనివాసన్
తారాగ
ణం: విజయ్ ఆంథోనీ, డయానా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీవెంకట్ తదితరులు
మాటలు- పాటలు : భాష్యశ్రీ
సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రణం: కె.దిల్ రాజ్
బ్యానర్స్
: ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్, ఆర్‌.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్
నిర్మాతలు: రాధిక త్కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి
విడుదల : నవంబర్ 30, 2017
***
          టుడు - సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ‘బిచ్చగాడు’ హిట్ తర్వాత చేసిన రెండూ - యమన్, బేతాళుడు – అనే సైకలాజికల్ లు వర్కౌట్ కాకపోవడంతో, తిరిగి ‘బిచ్చగాడు’ టైపు సెంటిమెంట్ల పంట వైపు యూ టర్న్ తీసుకుని ‘ఇంద్రసేనుడు’ నటించాడు. ‘బిచ్చగాడు’ మదర్ సెంటి మెంటయితే, ఇది ఫ్యామిలీ సెంటిమెంటు. పైగా ద్విపాత్రాభినయం. జి. శ్రీనివాసన్ అనే దర్శకుడు. తమిళంలో ‘అన్నదురై’ గా విడుదలైన ఇది ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వుందో చూద్దాం...

కథ 
      నూజివీడులో ఇంద్రసేన, రుద్రసేన కవల సోదరులు. ఇంద్రసేన  ప్రియురాలు చనిపోయిన బాధతో తాగుతూంటాడు. రుద్రసేన స్కూల్లో  పీఈటీగా పనిచేస్తూంటాడు. తండ్రికి బట్టల షాపు వుంటుంది. అతను స్థానిక వర్తక సంఘం అధ్యక్షుడు. తల్లి ఇంద్రసేనని పెళ్లి చేసుకోమని పోరుతూంటుంది. రుద్రసేన కి ఓ వ్యాపారి కూతురి సంబంధం వస్తుంది. ఇంద్రసేనకి కూడా సంబంధం చూడాలని తమ్ముడి కూతుర్ని అడిగి అవమాన పడుతుంది తల్లి. పెళ్లి ఇష్టం లేని ఇంద్రసేన తల్లి బాధ పట్టించుకోడు. వూళ్ళో అతడికి మంచి పేరుంటుంది. ఒక స్నేహితుడికి అప్పు కావాల్సి వస్తే హామీగా వుండి వడ్డీ వ్యాపారి దగ్గర  ఆరు లక్షలు ఇప్పిస్తాడు. తీరా తనే ఇరుక్కుంటాడు. ఓ రోజు తాగుడు మానేసి పెళ్లి చేసుకుంటానని తల్లికి మాటిచ్చి, చివరిసారిగా బార్ కి వెళ్తాడు. అక్కడ తాగిన మత్తులో ప్రమాదవశాత్తూ ఒకడు తన చేతిలో చనిపోతాడు. శిక్షపడి ఏడేళ్ళు జైలుకి పోతాడు. 

          విడుదలై వచ్చి చూస్తే, కుటుంబం చెల్లా చెదురై పోయి వుంటుంది. తండ్రి షాపు వడ్డీ వ్యాపారి లాగేసుకున్నాడు. తమ్ముడు రుద్రసేన చైర్మన్ కోటయ్య తరపున  హత్యలు చేసే గూండా లీడర్ గా కనిపిస్తాడు. తల్లిదండ్రులు తలెత్తుకోలేక బతుకుతూంటారు. దీనికంతటికీ కారకుడు తనే అని గ్రహిస్తాడు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పూనుకుంటాడు...

ఎలావుంది కథ 
      ఎక్కడా రాజీపడకుండా వాస్తవిక ధోరణిలో సాగే కథ. సరైన బాధ్యతతో ప్రవర్తించకపోతే,  ఒక్కడి వల్ల మొత్తం కుటుంబమెలా అధోగతి పాలవుతుందో తెలిపే కథ. ఇంట్లో మంచి – బయట మంచి రెండూ బ్యాలెన్స్ అవకపోతే బయటి మంచి కొంప ముంచేస్తుందని చెప్పే కథ. సొంత బాధ సాకు చూపి తనపట్ల తనకే బాధ్యత లేనట్టు తిరిగితే, అది మొత్తం కుటుంబానికే శని పట్టేలా చేస్తుంది. దీనికి ఎలాటి మూస ఫార్ములా చిత్రణల జోలికిపోకుండా, టౌను వాతావరణంలో కల్పించిన రాజకీయ, పోలీసు యంత్రాంగ వాస్తవిక నేపధ్యం బలమైన నిర్ణాయక శక్తిగా అమరింది. సొంత బాధ్యతలు మర్చిపోతే ఇతర శకట్లు నిర్ణయిస్తాయి జీవితాల్ని. 

ఎవరెలా చేశారు 
       అన్న దమ్ముల రెండు పాత్రల్లో విజయ్ ఆంథోనీ రూపంలో కాస్త మార్పు తప్ప, ఆలో చనల్లో తేడా తప్ప - మాట, చూపు, ముఖభావాలు ఒక్కటే. ఇదంతా సీరియెస్సే. అన్న అనుకోకుండా ఒకడి చావుకి కారణమై జైలుకి పోయాడు, దాని పరిణామాల్లో తమ్ముడు నేరస్థుడయ్యాడు. ఐతే ఈ పరిస్థితిని చక్క దిద్దే అన్న ప్రయత్నం ఏకపక్షమై పోయింది. దీంతో తమ్ముడికే సంబధం లేకుండా,  ఇద్దరి మధ్య వైరుధ్యాల సమరం లేక, అమితాబ్ బచ్చన్ – శశి కపూర్ ల మధ్య  వున్నట్టు  ఒక ‘దీవార్’  మూమెంట్ లాంటిది లేకుండా, చప్పగా సాగిపోతుంది.  తమ్ముడికి తెలియకుండా అతడి కోసం అన్న చేసి పోయే త్యాగంతో ఆ పాత్ర ముగుస్తుంది. పాత్ర చిత్రణ లెలా వున్నా, ఫార్ములా కమర్షియల్ పాత్రల్లాగా కృత్రిమ, పైపై భావోద్వేగాలతో కాకుండా, పాత్రల లోతుల్లోంచి  సహజ నటనతో,  బలమైన ముద్ర వేస్తాడు ఆంథోనీ. అతడి బలం ఇలాటి పాత్రలే, మూస కమర్షియల్ పాత్రలు కాదు. 


          హీరోయిన్లు వున్నారు గానీ బాగా లావై పోయారు. మళ్ళీ నమితని చూస్తున్నామా అన్నట్టున్నారు. విలన్ ఎమ్మెల్యేగా రాధారవి ఇలాటి రియలిస్టిక్ సినిమాలకి ఒక ఎసెట్  గా మారాడు. మిగిలిన అన్ని  పాత్రల్లో అందరూ మూస నటననల పాలవకుండా తమ ప్రతిభల్ని కాపాడుకున్నారు. ఇందులో రియలిస్టిక్ యాక్షన్ దృశ్యాలు అత్యంత బలంగా –షాకింగ్ గా వున్నాయి. పాటల్ని ఒక డ్రీం సాంగ్ కి, ఒక థీమ్ సాంగ్ కి పరిమితం చేశారు. కెమెరా వర్క్ డార్క్ షేడ్స్ తో డెప్త్ ని తీసుకొచ్చింది. 

చివరికేమిటి 
      రియలిస్టిక్ అంటే అన్నీ రియలిస్టిక్ గా వుండాలని కాదు. ఒక్క ఫైట్స్ లలో మాత్రమే పంచ్ వుండి,  ఇతర సన్నివేశాల్లో  పంచ్ మిస్ అయి, పాత ఆర్ట్ సినిమాల చిత్రీకరణలా  వుండాలని కాదు. కథ మాత్రమే పవర్ఫుల్ అన్పిస్తూ, కథనంలో సన్నివేశాలు పవర్ పంచ్ తో లేకపోతే  టీవీ సీరియల్ అవచ్చు. ఇదేమీ మతిమాలిన ‘లైటర్ వీన్’ ప్రేమకథ కాదు. బార్ లో హీరో చేతిలో ఒకడు అనుకోకుండా చనిపోయే దృశ్యం,  సరైన ఎఫెక్టివ్ షాట్స్ తో లేక – ఓ క్లోజప్ వేసి తీసేస్తే, పేలవంగా తయారయ్యింది. ఇంత ‘లైటర్ వీన్’ ప్లాట్ పాయింట్ వన్ తో  కథనానికి ఏం బలం వస్తుంది. సన్నివేశాల్లో పంచ్ లేకపోవడం వల్ల ఇంకో నష్టమేమిటంటే,  కథనం స్పీడు తగ్గి,  చాలా నిదానంగా ఒక్కో సన్నివేశం కదలడం. రియలిస్టిక్ కథకైనా స్పీడుగా సాగే డైనమిక్సే  అవసరం. 

          ఇది పూర్తిగా ఆలోచనాత్మక కథ, ఎలాటి వినోదాన్నీ ఆశించకూడదు. కుటుంబ దృశ్యాల్లో శోకమైనా, అందరి జీవితాల్లో విషాదమైనా యాక్షన్ అనే కమర్షియల్ ఎలిమెంట్ తోనే చూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్ధం లేని పాత్ర చిత్రణలు, కథనం లేవు. స్ట్రక్చర్ ని, జానర్ మర్యాదని గౌరవించారు. ముఖ్యంగా  ద్వితీయార్ధం కథ సాంద్రత పెరుగుతుంది. ముగింపూ గుర్తుండేలా వుంటుంది.

-సికిందర్
https://www.cinemabazaar.in

555 : రివ్యూ!


దర్శకత్వం : ఎం జ్యోతికృష్ణ.
తారాగణం :
గోపీచంద్, రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, ఆశీష్ విద్యార్థి, సాయాజీ షిండే, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, అలీ, బ్రహ్మాజీ తదితరులు
కథ : జ్యోతి కృష్ణ, స్క్రీన్ ప్లే : ఎం రత్నం, సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : ఛోటా కె నాయుడు, వెట్రి
బ్యానర్ : శ్రీ సాయి రాం క్రియేషన్స్
నిర్మాతలు :
ఎస్ ఐశ్వర్య, ఎం రత్నం
విడుదల : నవంబర్ 30, 2017
***
      ‘ఆక్సిజన్ గురించి దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చెప్పింది చూస్తే  నిజంగానే ఇదేదో డిఫరెంట్ మూవీ అని సంబరపడతాం. తీరా డిఫరెంట్ కీ ఫార్ములాకీ తేడా  లేకపోవడమే తన దృష్టిలో డిఫరెంటేమో అని తెలిసి కంగుతింటాం. ప్రేక్షకులు ఫార్ములాతో విసిగిపోయి డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారని చెబుతూ, ‘ఆక్సిజన్’ అలాటి తేడాగల మర్చిపోలేని అనుభవాన్నిచ్చే కమర్షియల్ అని సెలవిచ్చాడు. ఫార్ములా మర్చిపోలేని అనుభవాన్నిస్తుందా?

         
పజయాలతో వూపిరి సలపని  గోపీచంద్ కాస్త ఆక్సిజన్ ని ఆశించడంలో తప్పులేదు. ఆ ఆక్సిజన్ ప్రేక్షకుల పాలిట కాలుష్యం ఆవకుండా తను చూసుకోవాలి. చాలాకాలం నిర్మాణంలో వుండి, విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు విడుదలైతే దానర్ధం సిగరెట్లకి ఎక్స్ పైరీ డేట్ వుండదనా? చూద్దాం ఈ ఆక్సిజన్ సంగతులేమిటో...

కథ 

      రాజమండ్రిలో రఘుపతి (జగపతి బాబు) కి ముగ్గురు తమ్ముళ్ళు (బ్రహ్మాజీ, శ్యామ్, ప్రద్యుమ్న సింగ్), వాళ్ళ కుటుంబాలు, తనకో కుమార్తె  శృతీ (రాశీ ఖన్నా) వుంటారు. ఈ కుటుంబం మీద వీరభద్రం (సాయాజీ షిండే) పాత కక్షలతో  చంపుతూంటాడు. రఘుపతి తమ్ముడు, అతగాడి కొడుకూ అలా బలై పోతారు. వీరభద్రం నుంచి కుటుంబానికి రక్షణ  లేదని రఘుపతి కూతురికి అమెరికా సంబంధం చేసి పంపించేయాలనుకుంటాడు. సంబంధం చూడ్డానికి అమెరికా నుంచి  కృష్ణ ప్రసాద్ (గోపీ చంద్) వస్తాడు. శృతికి అమెరికా వెళ్ళడం ఇష్టంలేక, కృష్ణప్రసాద్ కి రకరకాల పరీక్షలు పెడుతూంటుంది మేనమామ (అలీ) తో కలిసి. వీరభద్రం మరోసారి దాడి చేసేసరికి, కృష్ణప్రసాద్ వీరోచితంగా పోరాడి ఆమె మనసు గెల్చుకుంటాడు. గెల్చుకున్నాక, అసలు తను కృష్ణప్రసాద్ కాదని ఆమెకి షాకిస్తాడు. 

          కృష్ణప్రసాద్ ఎవరు? ఏ ఉద్దేశం పెట్టుకుని ఈ వూరొచ్చాడు? అతడి ప్రతీకారం ఎవరి మీద? ఎందుకు? ...ఇవన్నీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

   
       పాత మూస ఫార్ములా డ్రామా అని తెలిసిపోతూనే వుందిగా - ఇంకా డిఫరెంట్ ఏమిటి? డిఫరెంట్ ఏమిటంటే,  నకిలీ సిగరెట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయనే విషయం ఈ పాత మూస ఫార్ములాలో కలిపి చెబుతున్నారు  కాబట్టి, ఇదే డిఫరెంట్ అనుకోవాలని ఉద్దేశం. రేపు అల్లూరి సీతారామరాజు కథ తీయాలన్నా దాన్నిలాగే పాత మూస ఫార్ములాలో బిగించి డిఫరెంట్ చేస్తారు. కాకపోతే ఇంటర్వెల్లో నేను క్లీన్ షేవ్డ్  రాజ్ కుమార్ని కాదు, అల్లూరి సీతా రామరాజునని బ్యాంగ్ ఇస్తాడు గడ్డం పెట్టుకుని. అప్పుడు బాషా లాగానో, ఫ్యాక్షన్ లాగానో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చి, శత్రు సంహారం గావిస్తాడు. మహాత్మా గాంధీ కథ తీసినా ఇదే – తెలిసిన ఇదొక్కటే ఫార్ములా పంజరంలో వుంటుంది. ఇది మర్చిపోలేని అనుభవాన్నిస్తుంది. ఎవరెలా చేశారు 
        నిజానికి గోపీచంద్ పోషించింది ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర. సైన్యంలో వుండే హీరో,  సెలవు మీద ఇంటికి వచ్చినప్పుడే సమాజంలో ఏదో చెడు తన కుటుంబాన్ని బలి తీసుకున్నప్పుడు,  తిరగబడే మూస ఫార్ములాలో వుండే పురాతన టెంప్లెట్ పాత్ర. సైనికుడు సరిహద్దులో వున్నప్పుడే  సమాజ సమస్యలకి స్పందించి సెలవు పెట్టి వచ్చి సంగతి చూసుకోకూడదా? అసలు సెలవు పెట్టి ఇంటికి రాకపోతేనే ఇల్లూ సమాజమూ బావుంటాయేమో?  కుటుంబానికి హాని జరిగినప్పుడే తిరగబడి – దానికి దేశం కోసమే చేస్తున్నట్టు రంగుపులిమి పాత్ర చిత్రణ చేయడం చాలా అన్యాయం. సైనికుడు కుటుంబం కోసం యుద్ధం చేయడు, దేశంకోసమే చేస్తాడు. 

          ఫస్టాఫ్ లో అమెరికా నుంచి వచ్చే గోపీచంద్ పాత్ర  సస్పెన్స్ లేని సాదా రొటీన్ మూస పాత్ర. ఇలాకాక, ఇంకో బాడీ లాంగ్వేజ్ కనబడుతూంటే,  పాత్ర సస్పన్స్ క్రియేట్ చేసి, మూస కథకి కూడా దానికదే  డెప్త్ వచ్చేది. అతను ఆర్మీ మేజర్ అయినప్పుడు ఆ రకమైన వైఖరి కూడా కన్పించదు. ఈ ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర ఇంటర్వెల్ తర్వాత రివీలవుతుంది. సెలవు మీద ఇంటికి వస్తే,  వూరూ పేరూ లేని నకిలీ సిగరెట్లకి తమ్ముడు బలై, దీనివెనుక కుట్ర తెలిసి పోరాటం మొదలెడితే- కుటుంబం నశించి (డిటో ‘పటేల్ సర్’ ఫ్లాష్ బ్యాక్) – పోరాటాన్ని ఉధృతం చేయడం  ఈ పాత్రకిచ్చిన టాస్క్. ఇక్కడా విషాద మేమిటంటే- ఇప్పుడూ తను సైనికుడిలా వుండడు. సైనికుడి మైండ్ తో మాట్లాడడు. తనకి  దక్కిన గోల్డెన్ మూమెంట్స్ చివరి సన్నివేశంలోనే. ఇక్కడ మాత్రమే కదిలించే పాత్ర – మిగతా ఎక్కడా కాదు. రొటీన్ యాక్షన్ జానర్ లో వుండిపోతుంది. తన ఆపరేషన్ కి ‘ఆక్సిజన్’  అని పేరు పెట్టుకున్నప్పుడు- ఆ ఆపరేషన్ సైనికుడు చేసే ఆపరేషన్ కోవలో వుండక పోవడం విచారకరం. ఇలాగైనా డిఫరెంట్ అన్పించుకోలేదు. 

          రాశీ ఖన్నాదీ మూస ఫార్ములా హీరోయిన్ పాత్ర. పల్లెటూళ్ళో హీరోతో ఆమె పాల్పడే చేష్టలు చూసీ చూసీ అరిగిపోయినవి.  సెకండాఫ్ లో మెడికల్ రీసెర్చర్ గా వచ్చే సెకండ్ హీరోయిన్
అనూ ఇమ్మాన్యుయేల్ కాస్త బాధ్యతగల పాత్రగా వున్నా, ఫార్ములా ప్రకారం ఆ పాత్ర ముగిసిపోతుంది. జగపతిబాబు, విలన్లు గా నటించిన ఇతరులూ సైతం చాలా పాత మూస పాత్రలు పోషించారు. అలీకి సీన్లు ఎక్కువే వున్నా కామెడీలో కిక్కు పెద్దగా లేదు.  

          యువన్ శంకర్ రాజా సంగీతం, ఛోటా కె. నాయుడు – వెట్రిల ఛాయాగ్రహణం సాధారణం. పీటర్ హెయిన్స్  సమకూర్చిన యాక్షన్ దృశ్యాల్లో హీరోతో మిలిటరీ యుద్ధ కళలు కన్పించవు. ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీ మేజర్ గా సరిహద్దులో టెర్రర్ స్థావరం మీద హీరో జరిపే దాడి – బిన్ లాడెన్ మీద అమెరికన్ దాడిని జ్ఞప్తికి తెచ్చే టెక్నిక్ తో వుండాల్సింది. పోలికలు కన్పించినప్పుడే కొన్ని సీన్లు ‘మర్చిపోలేని అనుభవాన్ని’ (దర్శకుడి మాటల్లో) ఇచ్చేది.


చివరికేమిటి 
     ఇతర సిగరెట్లు మంచి వైనట్టు నకిలీ సిగరెట్ల మీద సినిమా తీశారు. మంచిదే, ఈ చలనచిత్రం చూసి జనం మంచి సిగరెట్లు అలవాటు చేసుకుంటే! కథా ప్రయోజనం నెరవేరుతుంది. అసలు ఈ సినిమా తీయడం వెనుక కార్పొరేట్ కంపెనీల హస్తాలున్నాయేమో తెలీదు – తమ సిగరెట్లు అమ్ముకోవడానికి. మంచి  సిగరెట్లు తాగమని అన్యాపదేశంగా చెప్పే సినిమా ఎంతైనా గొప్పది. ఈ మార్పు ఈ దర్శకుడి తోనే ప్రారంభం కావాలి. 

          సిగరెట్ల మీద సినిమాలు తీస్తే, సిగరెట్లు తాగాలన్పించేలా వుంటున్నాయి. అనురాగ్ కశ్యప్ తీసిన  ‘నో స్మోకింగ్’ చూస్తే వెంటనే బయటికెళ్ళి గుప్పుగుప్పుమని పది సిగరెట్లు  దమ్ముల్లాగి పడెయ్యాలన్పించింది అప్పట్లో!  సిగరెట్ సినిమాలు అంతటి మార్పుని తెస్తాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’ నకిలీ సిగరెట్లు మానేస్తే పర్యావరణమంతా స్వచ్ఛమైన ఆక్సిజన్ తో తులతూ
గుతుందని తలపోసింది. జరిగింది వేరు. చూపించిన సినిమాలో మూస ఫార్ములా పాత సీనుల కాలుష్యం. 

          సారా అయినా సిగరెట్ అయినా పాత సీసాలో వేస్తే కొత్తగా అన్పిస్తాయని కావొచ్చు ఇలాటి పనికి తెగబడ్డారు. మూస ఫార్ములా టెంప్లెట్ చట్రం, దాంట్లో ఫ్యామిలీల కోసమని ఫ్యామిలీ కథ- (ఎంతాశ, ధూమ పానం మూవీని  కూడా ఫ్యామిలీలకి చూపించాలని) – ఈ ఫ్యామిలీ కథ ఫస్టాఫ్ తో పరిసమాప్తమై, సెకండాఫ్ వేరే స్మోకింగ్ కథగా మారడం చూస్తే – ఫస్టాఫ్ ఫ్యామిలీలు చూసి వెళ్లి పోవచ్చు, అప్పుడు సెకండాఫ్ పొగనంతా స్మోకర్లు భరించగలరు. ఇకపైన మంచి సిగరెట్లు తాగాలని చూసి నేర్చుకోవచ్చు. మంచి సిగరెట్లని అలవాటు చేసిన మంచి సినిమాగా మర్చిపోలేని అనుభవాన్ని మిగుల్చుకోవచ్చు.


      Ps :టెర్రర్ శిబిరం మీద విజయవంతమైన దాడి తర్వాత మేజర్ అయిన హీరో, సహచరులు, ఆనందంగా ఒక పాత హిందీ పాట పల్లవి నందుకుంటారు – ‘హకీఖత్’ లోని – ‘కర్ చలే హమ్ ఫిదా జానో తన్ సాథియోఁ.... అని. ఇది విజయోత్సవ గీత మనుకున్నట్టంది. యుద్ధంలో అమరులైన జవాన్లని చూపిస్తూ వచ్చే విషాద  నేపధ్య గీతమిది. దీనర్ధం : నేస్తాల్లారా మన జీవితాలనీ శరీరాలనీ అర్పణ చేసి వెళ్లి పోతున్నామని...  అర్ధం తెలుసుకోకుండా పాట పెట్టేస్తే,  ఇప్పుడిదేమిటని అర్ధం గాక భేజా ఫ్రై అవడమే మన పని!


-సికిందర్ 
https://www.cinemabazaar.in/