రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, మార్చి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!

స్క్రీన్ ప్లే - దర్శకత్వం : వంశీ పైడిపల్లి

తారాగణం : నాగార్జున అక్కినేని, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్,
ఊర్వశి, జయసుధ, అలీ, తనికెళ్ళ తదితరులు
మాటలు : అబ్బూరి రవి, సంగీతం : గోపీ సుందర్, ఛాయగ్రహణం : పి ఎస్ వినోద్
బ్యానర్: పివిపి సినిమా , నిర్మాత : ప్రసాద్ వి. పొట్లూరి
విడుదల : 25 మార్చి, 2016
***

       న కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయోగాత్మక సినిమాలతో దూసుకెళ్తున్న నాగార్జున అక్కినేని ‘ఊపిరి’ తో మరో మెట్టు పైకెక్కి హ్యాట్ ట్రిక్ సాధించారు. సరీగ్గా కెరీర్ ప్రారంభంలో కూడా కొత్త దర్శకులకి, పరభాషా దర్శకులకీ  అవకాశమిస్తూ శివ, గీతాంజలి, ద్రోహి లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రయోగాలు చేసిన చరిత్రే పునరావృతం చేస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ విజయాలే సాధిస్తున్నారు. నాగార్జున ట్రేడ్ మార్క్ ఇప్పుడు విలక్షణ సినిమా అయ్యాక ఆయనకి యూత్ లో ఫాలోయింగ్ అనూహ్యంగా విపరీతంగా పెరగడం గమనార్హం. ఎందుకని? ఆయనేం స్టెప్పులేసి, ఫైట్లు చేసీ  అలరించే ప్రయత్నం చేయడం లేదే? ఇది ఆలోచించాల్సిన విషయం. ‘ఊపిరి’ లోనైతే పూర్తిగా చైర్ కే బందీ అయిపోయి కూర్చున్నా ఆయన్ని అభిమానించడానికి ఇదేం ప్రతిబంధకం కాలేదు.

        నాగార్జున- తమిళ స్టార్ కార్తీ- టాప్ హీరోయిన్ తమన్నాలతో ఊపిరిఒక జాయ్ రైడ్. మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనాలాంటి ఎంటర్ టైనర్స్ తో  పాలిష్ చేసిన కామెడీని, కథల్నీ ఇచ్చిన నాగార్జున,  మరోసారి ఇదే ట్రేడ్ మార్క్ వినోదానికి కట్టుబడ్డం, దీన్ని సరీగ్గా అర్ధం జేసుకుని దర్శకుడు వంశీ పైడిపల్లి నీటుగా తెరకెక్కించడం ఊపిరికి ఊపిరిపోశాయి.
తెలుగు
, తమిళ స్టార్స్ ఓకే సినిమాలో కలిసి నటించిన సందర్భం ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాగార్జున- కార్తీల కాంబినేషన్ ఆ లోటు తీరుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా అనుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తు తుంది- ఎందుకంటే ఇదొక ఫ్రెంచి సినిమాకి రీమేక్ అంటూ చాలా ప్రచారం జరిగింది కాబట్టి.  మరి ఈ రిమేక్ కి ఎంతవరకు న్యాయం చేశారో చూద్దాం..

కథ 
        దొంగతనాలు మరిగిన శీను ( కార్తీ) పెరోల్ మీద జైలు నుంచి విడుదల అవుతాడు. ఈ పెరోల్ కాలంలో సమాజంలో సత్ప్రవర్తనతో మంచి  పేరు తెచ్చుకుంటే శిక్షా కాలం తగ్గుతుందని లాయర్ (అలీ) చెప్పి,   అనాధాశ్రమంలో, వృద్ధాశ్రమంలో సేవలు చేయడానికి తీసికెళ్ళి విఫలమై, ఒక రిచ్ మాన్ విక్రమాదిత్య దగ్గరికి పంపిస్తాడు. విక్రమ్ ఒక పారా గ్లైడింగ్ ఈవెంట్ లో ప్రమాదంపాలై శరీరం చలనం కోల్పోయి వీల్ చైర్ కి బందీ అయిపోతాడు. అతడికి  శీను సేవలు చెయ్యాలన్నమాట. అక్కడే విక్రమ్  సెక్రెటరీ కీర్తి ( తమన్నా ) వుంటుంది. ఈమెని చూసిన మొదటి క్షణంలోనే మనసు పారేసుకుంటాడు. సున్నితంగా డీల్ చేయాల్సిన  విక్రమ్ తో తన ధోరణిలో రఫ్ గా ప్రవర్తించడంతో ప్రారంభమవుతుంది ఇద్దరి మధ్యా ఒడిదుడుకుల అనుబంధం. ఈ అనుబంధం ఎక్కడికి దారి తీసిందీ, ఈ  పరస్పర పరిచయంలో  భిన్న ధృవాలైన ఇద్దరూ జీవితంలో ఏం నేర్చున్నారూ- అన్నది మిగతా  కథ.

 ఎలా వుంది కథ 
        యూనివర్శల్ బ్రదర్ హుడ్. సౌభాతృత్వం. దీనికి అంతస్తులు అడ్డురావన్న సార్వజనీన అంశంతో కూడుకుని వుంది. ఇద్దరు మగాళ్ళ మధ్య ఇదొక  బ్రోమాన్స్ కావొచ్చు, మేల్ బాండింగ్ కావొచ్చు- ఏమైనా అది పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న కామన్సెన్స్ ని ఉద్బోధిస్తూ క్లాస్- మాస్ వర్గాలందరికీ సూటిగా తాకే విధంగా వుంది.

ఎవరెలా చేశారు 
        నిస్సందేహంగా నాగార్జున ఈ పాత్రకి భిక్ష పెట్టారు. ఎవరూ సాహసించలేని ఇలాటి పాత్రకి తను భిక్ష పెడితేనే ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఇలా ముందు కొచ్చాక నిరా శపర్చలేదు. ఎందుకంటే ఇది చైర్ లో కూర్చుని తన దురదృష్టానికి ఏడుస్తూ వుండే తెలుగు మార్కు (బకరా) పాత్ర కాదు. పైపెచ్చు అలా తనమీద జాలి పడుతూ పలకరించే వాళ్ళతో విసిపోయాడు. అందుకే ఏ జాలీ దయా వంటి మనవ గుణాలు ఏమాత్రం లేని శీనుని పెట్టుకున్నాడు. ఎమోషన్స్ ని సున్నితంగా ప్రదర్శించడం, ఓ చిరున్నవ్వుతో కష్టాల్లో వున్న వాళ్ళ సమస్యలు తీర్చేయ్యడం, ఈ రెండు యాంగిల్స్ లో సాగే పాత్ర  నాగార్జున మెచ్యూరిటీకి పరీక్షే. ఒక గుర్తుండి పోయే అభినయ కౌశలంతో  ఇక్కడ నాగార్జునని చూస్తాం.

        అలాగే కార్తీ. ఇతడి వేషాలు ఎంత నవ్విస్తాయో, విశ్వాసం అంత ఆలోచింప జేస్తుంది. పక్కా మాస్ పాత్ర. వచ్చి స్వర్గ సుఖాల్లో పడ్డాడు నాగార్జున బంగళాలో. పైగా అక్కడే అందమైన అమ్మాయి తమన్నా. ఈమె  కూడా నీటుగా  తన పాత్రని పోషించుకొచ్చింది. ఇక నాగార్జున ఫ్రెండ్ గా ప్రకాష్ రాజ్ పాత్రతో శీను పెయింటింగ్ ఎపిసోడ్ కామెడీకి, ప్రకాష్ రాజ్ సెన్సాఫ్ హ్యూమర్ థియేటర్లు దద్దరిల్లేలా వుంది. 

        మిగతా మైనర్ పాత్రల్లో కార్తీ తల్లిగా జయసుధ, నాగార్జున ఆయాగా ఊర్వశి తదితరులు కన్పిస్తారు.

        దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి చెప్పుకోవాలంటే అతడి దర్శకత్వ శైలి ఈసారి బాగా మెరుగుపడి ఉన్నతంగా వుంది. ఎక్కడా చీప్ సీన్లు, చీప్ నటనా, ఇంకే చీప్ విషయాలూ వచ్చి చొరబడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు. బహుశా ఫ్రెంచి మూవీ ప్రభావం ఇది. విదేశీ సినిమాల్లోంచి దర్శకులు సంస్కారవంతమైన దర్శకత్వాన్ని కూడా నేర్చుకుంటే సినిమాల క్వాలిటీ చాలా మెరుగుపడుతుంది. వంశీ గతంలో తీసినవి రొటీన్ రొడ్డ  దర్శకత్వాల తెలుగు సినిమాలు. నాగార్జున సౌజన్యంతో ప్రస్తుత సినిమాతో పాలీషు పట్టిన మరో  మనంవిక్రం కుమార్ లా తను మెరిసినప్పుడు ఈ మెరుపుని ఇంకా ముందు సినిమాల్లో కూడా ప్రదర్శిస్తారని ఆశిద్దాం.
 

        అబ్బూరిరవి పొడిపొడి సంభాషణలు కొన్ని సందర్భాల్లో చాలా బలంగా వున్నాయి. మనిషి వెళ్ళిన చోటల్లా మనసు వెళ్ళదు... అనే డైలాగుకి ప్రతి వొక్కరూ ఒక్క క్షణం ఆగి ఆలోచనలో పడతారు. 

        సంగీతం పాటలూ కథానుసారం నడిచిపోయాయి తప్ప పెద్దగా చెప్పుకునేది లేదు. పి ఎస్ వినోద్ ఛాయాగ్రహణం ఉన్నత ప్రమాణాలతో వుంది. అలాగే నిర్మాత పొట్లూరి ప్రసాద్ ఎంత ప్రొడక్షన్ విలువలు చాలా చాలా రిచ్ గా వున్నాయి. 

చివరి కేమిటి
        కేవలం నాగార్జున దయాదాక్షిణ్యాల వల్ల మరో సారి తెలుగు సినిమా పరువుప్రతిష్టలు నిలబెట్టుకుంది. ఫ్రెంచి సినిమా ఇన్ టచబుల్స్కి ఇది రీమేక్. కొట్టొచ్చినట్టు ఈ సినిమాలో కన్పించేది ఏమిటంటే హాలీవుడ్ సినిమా కథల స్ట్రక్చర్ అంటూ లేకపోవడం. ప్రధానంగా ఒక సమస్య దానితో పోరాటం, పాత్రకి లక్ష్యం వగైరా టూల్స్ లేకపోవడం. ఫ్రెంచి సినిమా అంటే వరల్డ్ సినిమానే కాబట్టి, ఆర్ట్ సినిమా సరళిలో వుండే వరల్డ్ సినిమాలు కామన్ కమర్షియల్ సినిమాల కథా కథనాలతో వుండవు. అదే ఇందులో కన్పిస్తుంది. ఇది రెండు పాత్రల ప్రయాణం, ఇకంతే. ఇందులో బలమేమిటంటే, ఆ ఇద్దరి మధ్యా ఆసక్తికరమైన కెమిస్ట్రీ.

        అయితే తెలుగులోకి వచ్చేసరికి సెకండాఫ్ లో విషాదం, మెలోడ్రామాల డోసు ఎక్కువైంది. అంత కథ వున్నా మనంచూసికూడా మనం హాయిగా బయటి కొస్తాం, కానీ ఊపిరిచూశాక బరువెక్కిన హృదయాలతో భారంగా బయటికొస్తాం. ఇలా జరిగి వుండాల్సింది కాదు. సినిమా అంతా అక్కడక్కడా కదిలిస్తూ ఎంత ఫన్నీగా నడుస్తుందో, చివరి పదిహేను నిమిషాల పైగా అంత  విషాదంతో ఒకటే హెవీగా సాగి గంభీరంగా ముగిస్తుంది. దీంతో హాయిగా నవ్వుకుంటూ బయటికి రావాల్సిన వాళ్ళం, బరువెక్కిన గుండెలతో అదోలా బయటికొస్తాం. ఇది అవసరం లేదు. కార్తీకి అనవసరంగా సబ్ ప్లాట్ లో కుటుంబ కథ పెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఆ అంతులేని కథసినిమా టైపు కుటుంబ కష్టాలు తీసేస్తే అరగంట సినిమా నిడివి తగ్గి- నాగార్జున, కార్తీల మధ్య హేపీ నోట్ తో హాయిగా ముగిసేది. ఒరిజినల్లో ఇలాగే వుంది మరి...


-సికిందర్
http://cinemabazaar.in