రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, జనవరి 2019, శుక్రవారం

730 : లవర్ నుంచి ఎఫ్ 2 దాకా...


     ఈ ఆరు నెలల కాలంలో యాక్షన్ సినిమాలు 13 విడుదలయ్యాయి. 11 ఫ్లాపయ్యాయి, ఒకటెలాగో హిట్ అని చెప్పుకున్నారు, ఇంకోటి ఏవరేజి. రెండు దశాబ్దాలుగా యాక్షన్లు, యాక్షన్ కామెడీలు, రోమాంటిక్  కామెడీలూ ఓ మూడు వేలు తీసి వుంటారు. ఇవి తప్ప మరోటి తీయలేని బ్యాక్ గ్రౌండ్ లోంచి వచ్చినప్పుడు, వీటిలో కూడా నిష్ణాతులన్పించుకుంది లేదు. అలాగని వీటిని వదిలిపెట్టింది లేదు. వీటి విషయంలో ఎడ్యుకేట్ అవకుండా ఫ్లాపుల మీద ఫ్లాపులు తీసుకుంటూ పోవడమే. ప్రతి యేటా వందల కోట్లు, రెండు దశాబ్దాలుగా వేల కోట్లు నష్టాలకి గురిచేయడమే. దటీజ్ టాలీవుడ్.
         
ప్పుడు యాక్షన్ సినిమాల ఎక్కడేసిన గొంగళి ఈ ఆరునెలల్లో కూడా ఎలా వుందో చూద్దాం...

1. లవర్
రాజ్ తరుణ్, రిద్దీ కుమార్; అనీష్ కృష్ణ ( ఒక సినిమా దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ :  అరిగిపోయిన కంటెంట్ – ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : పాసివ్ పాత్ర, ఎండ్ సస్పెన్స్, మిడిల్ మటాష్ – ఫ్లాప్
         
పూరీ జగన్నాథ్ మార్కు టెంప్లెట్ కథ. పూరీ స్టయిల్లో అదే రొటీన్. హీరోయిన్ ప్రేమకోసం హీరో వెంట పడడం, తీరా ప్రేమించాక మాఫియా విలన్ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ని ఇబ్బంది పెట్టడం. ఒకే టెంప్లెట్ తో పూరీ తీస్తూ ఫ్లాపవుతున్నాక కూడా, పూరీనే కాపీ కొడుతూ దర్శకుడు ఇదే టెంప్లెట్ ని, ఎండిపోయిన కథనీ తెచ్చుకుని వాడేశాడు. రెండు గంటల పది నిమిషాల కథలో, గంట ముప్పావు సేపూ ప్రేమికుడిగానే నస పెడతాడు హీరో. తన వెనుకాల హీరోయిన్ తో బోలెడు మాఫియా కుట్రలు జరుగుతున్నా తెలుసుకోడు. ఇంటర్వెల్లో హీరోయిన్ మీద దాడి జరిగినా హీరోకి తెలియదు. కథని నడిపే కథానాయకుడికి కథలో ఏం జరుగుతోందో తెలీదంటే ఇది కథని అట్టర్ ఫ్లాప్ చేసే పాసివ్ పాత్రే. చిట్ట చివర్లో హీరోయిన్ కిడ్నాపయ్యాకే  జరుగుతున్నది తెలుసుకుని కథలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకూ కథలోకి ప్రవేశించే మాటే లేదు. అంటే,  ఒకప్పుడు మహేష్ బాబు నటించిన అట్టర్ ఫ్లాప్ బాబీ’ లో బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్నది తెలియని, పరమ పాసివ్ పాత్ర అన్నమాట. ఇక ఫస్టాఫ్ లో లవ్ టెంప్లెట్ రొటీన్ గా కృత్రిమ కామెడీయే. కామెడీలో రెండు మూడు చోట్ల తప్ప ప్రేక్షకులు నవ్వే పరిస్థితి లేదు. ‘లవర్’ అని టైటిల్ అనుకున్నాక ప్రేమలో బలమైన సన్నివేశాలు గానీ, కదిలించే భావోద్వేగాలు గానీ లేవు. ఇక్కడ పూరీ టెంప్లెట్ ని వున్నదున్నట్టు డైరెక్టుగా వాడలేదు. అసలు విలన్ల కుట్రేమిటో,  హీరోయిన్ వెంట ఎందుకు పడుతున్నారోప్రేక్షకులకి కథ తెలియనివ్వకుండా,  చివరి వరకూ ఎండ్ సస్పెన్స్ గా పెట్టి నడిపాడు. ఇదే కొంప ముంచింది. ఎండ్ సస్పెన్స్ తో వచ్చిన అన్ని సినిమాలకీ పట్టిన గతే దీనికీ పట్టింది. పైగా హీరో చిట్టచివరికి గానీ కథలోకి ప్రవేశించక పోవడంతో, అప్పుడు గంట ముప్పావుకు గానీ కథ ప్రారంభం కాకపోవడంతో, ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కూడా అయింది. ఇలా పాసివ్ పాత్ర, ఎండ్ సస్పెన్స్, మిడిల్ మటాష్ అనే మూడు ఘోర తప్పిదాలతో, ఈ ఏడుకోట్ల బడ్జెట్ కి - క్రియేటివ్ యాస్పెక్ట్ అంతా రూపాయికి కూడా పనికి రాకుండా పోయింది. ఇక  చివరికి విప్పిన విషయం కూడా కాపీదే. గోపీచంద్ ఒక్కడున్నాడులో అరుదైన బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన విషయమే.. 

2. వీర భోగ వసంతరాయలు
సుధీర్ బాబు, నారారోహిత్, శ్రీవిష్ణు; ఆర్ ఇంద్రసేన (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : మిథికల్ జానర్ – ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : పూర్ రైటింగ్ – ఫ్లాప్
            బ్రహ్మంగారి భవిష్యవాణి - లోక రక్షకుడుగా దేవదూత వీరభోగ వసంతరాయలి ఆగమనం  గురించిన పాయింటు తీసుకుని గొప్ప కథ అల్లారు. దేశంలో ఎటు చూసినా హింస, దోపిడీ, హత్యలు పెచ్చు మీరిపోయి, ప్రజలు గడగడలాడుతున్నారని ఓ  యువకుడు, తనని తానూ వీర భోగ వసంత రాయలి అవతారంగా ప్రకటించుకుని, దుష్టుల ఎరివేతకి పూనుకోవడం కథ. విమాన హైజాక్ లాంటి సెటప్ తో కథా విస్తృతి పెద్దది, తీసిన సినిమానేమో బడ్జెట్ చాలని బుడ్డది. ‘భారతీయుడులాంటి హై కాన్సెప్ట్ కథని బొటాబొటీ  లోబడ్జెట్ లో బీ గ్రేడ్ గా తీస్తే ఎలావుండేదో అలా తయారయ్యింది. పైగా చెప్పేదేదో సూటి కథగా చెప్పకుండా, ఇంకో రెండు మూడు ట్రాకులు కలిపి కన్ఫ్యూజ్ చేయడం. కథా నిర్వహణ పూర్తిగా కంచి కెళ్ళడం. 

3. ఆటగాళ్ళు 
నారా రోహిత్, జగపతి బాబు; పరుచూరి మురళి (7 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : పాత మూస  - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ :  థ్రిల్లర్ లక్షణాల్లేని కథనం – ఫ్లాప్ 
          కేవలంహత్య చుట్టూ సరైన విలన్ లేకుండా బలహీనంగా అల్లిన పాత మూస యాక్షన్ కథ. హత్య కేసులో చట్టాన్ని ఏమార్చి బయట పడ్డ హీరో కథ కుండాల్సిన బిగి, వేగం, సస్పెన్స్, థ్రిల్, టెంపో, యాక్షన్ వంటివి ఏవీ లేకుండా ఒట్టి డైలాగులతో నడిచే కథ.  థ్రిల్లర్ కథా లక్షణాలు తెలీనట్టు ఇష్టమొచ్చినట్టు డైలాగులు నింపేసి బీ గ్రేడ్ స్థాయికి తెచ్చారు. దర్శకుడి ట్రాక్ రికార్డు చూస్తే  థ్రిల్లర్స్ తీసిన అనుభవం లేదు.

4. యూ టర్న్ 
సమంత, ఆది పినిశెట్టి; పవన్ కుమార్ (2 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : రియలిస్టిక్, హార్రర్ విజాతి జానర్స్  – ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్
 
          ట్రాఫిక్ రూల్స్ పాటించని పరిణామా లెలా వుంటాయన్న కథగా ప్రారంభమై, జానర్ ఫిరాయించి హార్రర్ కథగా మారిపోవడంతో, ఎత్తుకున్న కాన్సెప్ట్ గల్లంతైపోయింది. ఈ రియలిస్టిక్ జానర్ కథని పౌరబాధ్యతలతో, వ్యవస్థ లోపాలతో వాస్తవిక కథగా చెప్పకుండా, పలాయన వాదంతో హార్రర్ కల్పనల్లోకి  ప్లేటు ఫిరాయించడంతో కిచిడీలా తయారైంది.
ట్రాఫిక్ రూల్స్ పాటింపు అనే సామాజిక అంశాన్ని, అతీంద్రియ శక్తులతో ముడిపెట్టి, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలతో జరుగుతున్న మరణాలకి దెయ్యం కారణమని చెప్పి ముగించడం హాస్యాస్పదంగా మారింది. ఈ సినిమా విడుదలప్పుడే, కొండగట్టు ఘాట్ రోడ్స్ మీద జరిగిన బస్సు ప్రమాదం రూల్స్ ని ఉల్లంఘించిన ఫలితమేనని అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రాంతలో అరవై కోతులు చనిపోయి కనిపించడంతోబస్సు ప్రమాదంలో చనిపోయింది కూడా అరవై మందే కాబట్టి, కోతుల్ని చంపినందుకు ఆంజనేయుడే బస్సు ప్రమాదం జరిపించి  పగదీర్చుకున్నాడని పుకారు లేవదీయడం ఎలా వుందో, కథలో కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్ళ ఆత్మహత్యలకి దెయ్యం కారణమని చెప్పడం అలా వుంది

         
జపాన్లో ఒకడుందే వాడు. వాడు టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో పదేపదే టెస్టు  ఫెయిలవుతున్నాడు. దీంతో తనకి డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వకూడదని కావాలనే ఇలా చేస్తున్నారని కోపం పెంచుకున్నాడు. ఓ రోజు సైకిలు తొక్కుకుంటూ పోతూంటే పక్క నుంచి కారు బురద కొట్టి పోయింది. దీంతో భగ్గున రగిలిపోయాడు. డ్రైవింగ్ లైసెన్స్ కి అనర్హుడుగా చేసి డిపార్ట్ మెంట్ ఏడ్పిస్తున్న బాధ ఒకవైపుంటే, వెక్కిరింతగా వీడు బురద కొట్టాడని మండిపోయి- వూళ్ళో కార్ల టైర్లు కోసేయడం మొదలెట్టాడు. రాత్రైతే చాలు వూళ్ళో  కార్ల టైర్లు పరపరా చిరిగిపోతున్నాయి. చివరికెలాగో పోలీసులు ఈ సీరియల్ కార్ టైర్ కిల్లర్ ని పట్టుకున్నారు. కథగా చూస్తే ఇది వ్యవస్థ మీద పగదీర్చుకున్న వ్యక్తి కథ అవుతుంది. అంతే గానీ, ఆ బాధిత వ్యక్తి స్థానంలో అదేదో అతీత శక్తి వచ్చి టైర్లు కోస్తున్నట్టు చూపిస్తే? 

5. భైరవ గీత
ధనంజయ్, ఐరా మోర్; సిద్ధార్థ్ టి (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : కాలం చెల్లిన బానిసత్వపు కాన్సెప్ట్ – ఫ్లాప్  
క్రియేటివ్ యాస్పెక్ట్ : కాలం చెల్లిన ఎర్ర సినిమాల కథనం – ఫ్లాప్
          ఫ్యాక్షన్ అని చెప్పి ఎలాటి కథైనా సినిమా తీసేయొచ్చేమో. 1991 లో నిజంగా  జరిగిన కథ అన్నారు. నిజంగా జరిగిందంటూ తీసిన  కథలన్నీ ఫ్లాపులే. రాయల సీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్. ఫ్యాక్షన్ దొర పెత్తనం కింద బానిసల కష్టాలు, తిరుగుబాట్లు. ఎర్ర విప్లవ  సినిమాల తీరులో కథనం. ఆర్. నారాయణ మూర్తి కూడా ఇప్పుడు ముట్టని కాన్సెప్ట్. పూరీ మార్కు టెంప్లెట్లో ఫస్టాఫ్ ప్రేమ కథ, సెకండాఫ్ ప్రేమ కథ మాయమైపోయి, బానిసల కథ. మొదలెట్టిన కథ  ఒకటైతే, ముగించిన కథ  మరొకటి. పైగా ఇప్పుడు లేని ఫ్యాక్షన్ కి అరవింద సమేతలో అర్జంటుగా శాంతి మంత్రం చెప్పడమెలా వుందో, ‘భైరవగీతలో ఇప్పుడు యూత్ అప్పీల్, మాస్ అప్పీల్ లేని కాలగర్భంలో కలిసిన  బానిసల విముక్తి చూపడం అలా వుంది.

 6. సాక్ష్యం 

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే; శ్రీవాస్ (5 సినిమాల దర్శకుడు) 
మార్కెట్ యాస్పెక్ట్ : మార్కెట్ కి మించిన బడ్జెట్ - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : ఫిలాసఫీ పాఠంగా ఫాంటసీ యాక్షన్  - ఫ్లాప్
          
ఫాంటసీ యాక్షన్ జానర్. ఆధ్యాత్మిక కోణంగా మిథికల్ ఎలిమెంట్స్ జోడించారు. భక్తి సినిమాలతో తీరే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని, కొత్త ట్రెండ్ ఫాంటసీ యాక్షన్ తో తీర్చాలని విఫల యత్నం చేశారు. ప్రతీవారం అవే మూస ఫార్ములా యాక్షన్ సినిమాలతో విసిగిన ప్రేక్షకులకి, ఇదొక ఫ్రెష్ యాక్షన్ కొంతవరకే. నాల్గు దిక్కులు చూసి ఎవరూ లేరని తప్పుచేస్తే,  పైనున్న ఐదో దిక్కు కనిపెడుతూనే వుంటుందనీ,  అదే కర్మసాక్షి అనీ, అదే ప్రాయశ్చిత్తం జరిపిస్తుందనీ, దాన్నుంచి తప్పించుకోలేరనీ చెప్పే కథ. గాలి, నీరు, నిప్పు, నేల, నింగీ - ఈ పంచభూతాలకి లోబడి మనం మెలగాలని చెప్తుంది. చాలాపూర్వం బాపూ రమణలు తీసిన ‘ముత్యాల ముగ్గు’ లో ఇలాటిదే మిథికల్ ఎలిమెంట్ వుంటుంది. సృష్టి ఉపసంహారం జరిగే పద్ధతుల్లో ఒకటైన నైమిత్తిక ఉపసంహార పద్ధతిని ఆధారంగా చేసుకుని చూపించారు. నైమిత్తిక ఉపసంహారం ప్రకారం పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని సృష్టిని ముగిస్తాయి. ఇదే విధంగా ‘ముత్యాలముగ్గు’ లోని రావుగోపాలరావు సహా దుష్టపాత్రలు పరస్పరం కీచులాడుకుని అనుభవిస్తారు. అయితే ఈ మిథికల్ ఎలిమెంట్ గురించి డైలాగుల్లో ఊదరగొట్టకుండా అంతర్వాహినిగా యాక్షన్ పూతతో చూపించారు. ఇలా ‘ముత్యాల ముగ్గు’ క్లయిమాక్స్ సన్నివేశం ఒక క్లాసిక్ క్రియేషన్ అని చెప్పొచ్చు. కానీ ‘సాక్షి’లో దీనికి భిన్నంగా కర్మసాక్షి  ఫిలాసఫీ పాఠాలు పదేపదే డైలాగుల్లో చెప్పడంతో, భక్తి సినిమాలా అన్పించి యూత్ అప్పీల్ కనాకష్టమై పోయింది. ఇందుకే అన్నాడేమో ఐన్ స్టీన్ - క్రియేటివిటీ రహస్యమంతా మూలాల్ని దాచడంలోనే వుందని. ఇక మార్కెట్ కి మించిన బడ్జెట్ అవడంతో మాస్ ప్రేక్షకులు కూడా దీన్ని గట్టెక్కించలేకపోయారు.

7. కవచం 
బెల్లంకొండ్ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ ఎం (కొత్త దర్శకుడు) 
మార్కెట్ యాస్పెక్ట్ : కాలం చెల్లిన కంటెంట్  - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : పాసివ్ పాత్ర, ఎండ్ సస్పెన్స్, జానర్ జంప్ – ఫ్లాప్
         
ఇందులో ఫస్టాఫ్ అంతా తెలిసిన రొటీన్ మూస ఫార్ములా టెంప్లెట్ గా సాగుతూ, అకస్మాత్తుగా ఇంటర్వెల్లో సస్పన్స్ థ్రిల్లర్ జానర్ లోకి తిరగబెడుతుంది. ఇక్కడ్నించీ సెకండాఫ్ ఎండ్ సస్పెన్స్ కథగా సాగుతుంది. సస్పెన్స్ ప్రేక్షకులు ముందే వూహించేస్తారుగానీ, పోలీసు పాత్ర అయిన హీరోయే (తన శత్రువెవరో) తెలుసుకోడు. దీంతో పాత్ర కూడా పాసివ్ పాత్రయింది. ఓవరాల్ కథగా చూస్తే, కుటుంబంలో బావమరిది చేసే పాత కుట్రల కథే. పాత కుటుంబ కుట్రల్నే రీసైక్లింగ్ చేసి సస్పెన్స్ కాని సస్పెన్స్ చేశారు.

(మిగిలిన యాక్షన్ సినిమా సంగతులు రేపు) 

సికిందర్