రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, అక్టోబర్ 2015, సోమవారం

సాంకేతికం : హేర్ స్టయిలింగ్సినిమా స్టార్స్ ప్రత్యేకమైన హేర్ కట్స్ తో, చెక్కుచెదరని కేశ సంపదతో,
ఎప్పుడూ డిఫరెంట్ గా కన్పిస్తారెందుకని? అలా మనమెందుకు కన్పించం?
కొన్నిసార్లు స్టార్స్ ఎంత ఫైట్ చేసినా క్రాఫు చెక్కు చెదరదెందుకని?
మనకైతే చిందర వందర అయిపోతుందెందుకని? ఎందుకంటే,
వాళ్ళకంటూ ప్రత్యేకంగా హేర్ స్టయిలిస్టు లుండి మనకి
వుండరు గనుక. పైగా వాళ్ళదో పెద్ద పరిశ్రమ,
మనది కుటీర పరిశ్రమ కూడా కాదు!

        ‘హేర్ స్టయిలిస్టులకి డిమాండ్ ఎప్పుడూ వుంటుంది. సినిమా సినిమాకీ స్టార్లు డిఫరెంట్ లుక్ అన్న కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టడంతో, హేర్ స్టయిలిస్టుల కత్తెరలకి మరీ పని పెరిగిపోయింది. ఈ ట్రెండ్ ఎంతవరకూ కరెక్ట్? దీనికి హేర్ స్టయిలిస్టుల ఆమోదం ఉంటుందా?’ అంటే- ఫక్కుమని ఒక్క నవ్వు నవ్వారు పోగుల మల్లిక - ‘అవి హీరోయిన్లకి బావుంటాయండీ. హీరోలకి కొత్తగా ట్రై చేసి చూద్దామనుకుంటున్నారు, అంతే!’ అని తేల్చేశారు. 

        ‘పాత రోజుల్లో ఇలాటి ట్రెండ్ లేదు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ అదే విగ్గు, అమితాబ్ బచ్చన్ కి అదే చెవుల మీది వరకూ క్రాఫు. సినిమా కథలు కూడా పాతవే రీసైక్లింగ్ అవుతున్నట్టు, హేర్ స్టయిల్స్ కూడా రీసైక్లింగ్ అయ్యే అవకాశముందా?’ అన్న మరో ప్రశ్నకి, ఉండొచ్చన్నారు. ‘ఇప్పుడు పెద్ద పెద్ద ముళ్ళు వేయించుకుంటున్నారుగా. వాణిశ్రీ స్టయిల్ కావాలని అడుగుతున్నారు. పెద్ద పెద్ద ముళ్ళకి వాణిశ్రీ పెట్టింది పేరు కదా..’ అన్నారు హేర్ స్టయిలిస్టుగా పదేళ్ళ అనుభవమున్న మల్లిక. 

     అయితే కొత్త ప్రయోగాల్ని చిన్న చిన్న తారల మీద ముందుగా ట్రయల్ వేసి, మంచి రెస్పాన్స్ వస్తే,  స్టార్ హీరోయిన్లకి అమలు చేస్తున్నామన్నారు. విగ్గుల విషయానికొస్తే, వాటి వాడకం బాగా తగ్గిందనీ, ప్రతీ సినిమాలోనూ  ఫ్రీ హేర్ ఇష్ట పడుతున్నారనీ, కృత్రిమత్వం అస్సలు నచ్చడం లేదనీ వివరించారు. హారర్, ఫాంటసీ, పౌరాణికాలకైతే పనెక్కువ ఉంటుందనీ, ఆ సినిమాల్లో చాలా మందికి పని దొరికి హేపీగా ఉంటారనీ అన్నారు. సినిమా హేర్ స్టయిల్స్ ని బయట యువతీ యువకులు అనుకరించడం కష్టమనీ, ఆ స్టయిల్స్ అనేవి చేస్తున్నప్పుడు  చూస్తూంటేనే అనుకరించగలరని అన్నారు మల్లిక.


        చేస్తున్నప్పుడు చూడ్డమన్నది, నేర్చుకున్న దానికన్నా చేస్తూంటేనే బాగా వస్తుందనేదీ ఈ వృత్తిలో బాగా గుర్తుంచు కోవాల్సిన ముఖ్య విషయాలని ఆమె నిశ్చితా భిప్రాయం. లోపాల విషయానికొస్తే,  కొన్నిసార్లు అవి తప్పవన్నారు. ఎందుకంటే, ఒక్కోసారి టైం ఉండక మేకప్, హేర్ స్టయిల్ ఏదో ఒకటి చేసేసి పంపేస్తారు...స్క్రీన్ మీద ఆ లోపాలేమిటో తెలుస్తూంటాయి...అయినా సైలెంట్ గా ఉండిపోక తప్పదన్నారు. కాస్ట్యూమర్లకి ఫారెన్ రిఫరెన్సులున్నట్టు, హేర్ స్టయిలిస్టులు నెట్ లోంచి రిఫరెన్సులు తీసుకుంటారని అన్నారు.

     మేకప్ కి లాగే, హేర్ స్టయిల్స్ కి కూడా కంటిన్యూటీ చూసుకోవాలన్నారు మల్లిక ఇంకా చెప్పుకొస్తూ.. ఒక షాట్ లో హీరోయిన్ కి  పోనీ టెయిల్ వుండి, మూడు లూజ్ స్ట్రాండ్స్  ముఖం మీద పడేట్టుగా వుంటే, ఖచ్చితంగా ఆ స్టైల్ నే పొల్లుపోకుండా ప్రతీ షాట్ కీ, ప్రతీ షెడ్యూల్ కీ ఉండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఇందుకు కొలతలు, ఫోటోలు కూడా తీసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేగాక, సన్నివేశపరమైన మార్పులుంటాయి..కాలాలకి, వాతావరణానికీ, ఆనంద విషాదాలకీ, గాయాలూ ఘోరాలకూ, వివిధ రకాలుగా జుట్టు మారిపోవచ్చు...ఆ వాస్తవికతని చూపించడం కూడా కళే అన్నారు. 

        జుట్టుని వాష్ చేయడం, కట్ చేయడం, బ్లో డ్రయింగ్ చేసి, ప్రొడక్ట్సుని అప్లయి చేయడం, స్పెషల్ డిజైన్స్ ని క్రియేట్ చేయడానికి టెక్నిక్స్ ని ప్రయోగించడం - మళ్ళీ వీటన్నిటినీ టేక్ కీ టేక్ కీ మధ్య టచప్స్ ఇస్తూ ఉండడం, ప్యాకప్ చెప్పాక ప్రొడక్ట్సుఅన్నిటినీ  కడిగేసి ఆర్టిస్టుని ఇంటికి పంపించడం, విగ్గు వుంటే రీ డ్రెస్ చేసి భద్రపరచడం, ఇవన్నీ హేర్ స్టయిలిస్టు బాధ్యతలే నన్నారు.

        ‘హేర్ స్టయిలిస్టులెవరైనా ఈటీవీ నుంచి రావాల్సిందే!’ అని స్టేట్ మెంటిచ్చారు, ‘99 శాతం మంది ఈటీవీ లోనే నేర్చుకుని సినిమా ఫీల్డు కొస్తారు. ముందు చిన్న చిన్న ఆర్టిస్టులకి చేస్తూ ఆత్మవిశ్వాసం పెంచుకున్నాక, రెగ్యులర్ హీరో హీరోయిన్లకి చేస్తారు. బ్యూటీ పార్లర్స్ లో కూడా నేర్చుకుని రావచ్చు, అయితే సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే ఇక్కడి సీనియర్స్ దగ్గర నేర్చుకోవడం మస్ట్ అండ్ షుడ్’ అని ఉద్ఘాటించారు.


 హేర్ స్టయిలిస్టులకి బాలీవుడ్ తాకిడి గురించి చెప్పమంటే, ‘అక్కడి వాళ్లకి పారితోషికాలెక్కువ. వాళ్ళ రాక వల్ల మాలాంటి లోకల్స్ కి పని తగ్గిపోతుంది. పని తగ్గిపోతే కాస్ట్యూమర్లు టైలరింగ్ షాపులు పెట్టుకున్నట్టు, హేర్ స్టయిలిస్టులు బ్యూటీ పార్లర్లు పెట్టుకోవడం కుదరదు. ఎందుకంటారా,  ఫిమేల్ హేర్ స్టయిలిస్టుల సంఖ్యా తక్కువేమీ లేదు. పైగా బ్యూటీ పార్లర్ల మీద వచ్చే ఆదాయమంతా కృష్ణానగర్ లో రెంట్స్ కే సరిపోతుంది. పోనీ దూరంగా వెళ్లి పెట్టుకుందామంటే,  రాత్రి పూట జర్నీ ప్రాబ్లం. మీరు టీవీలో చూస్తూనే వుంటారు కదా..నేరాలు ఘోరాలు  ఎలా జరుగుతున్నాయో!’  అని చెప్పుకొచ్చారు.


        విజయవాడకి చెందిన మల్లిక 2000 లో ఈటీవీ లో చేరి కేశాలంకరణ చేశారు. సినిమా ఫీల్డు కి వచ్చి 2008 లో ‘నచ్చావులే’ కి హేర్ స్టయిలిస్టు అయ్యారు. మొన్నటి బాలకృష్ణ నటించిన డా. దాసరి మూవీ ‘పరమవీర చక్ర’ తో కలుపుకుని ఆరేడు సినిమాలు చేశారు ఇంతవరకూ. ఇక్కడ పరిస్థితి బాగా లేక కన్నడ ఫీల్డుకి వెళ్ళారు. అక్కడ బాగానే వుందిప్పుడు. 


        ఇంతకీ ఈ వృత్తి మీద తనకెందుకు ఆసక్తి కలిగిందంటే, సినిమాలంటే ఎవరికి  ఆసక్తి వుండదు గనుక? పైగా ఇంట్లో ఆడపిల్లల్ని రెడీ చేయడం కూడా ఓ ఉత్సాహకరమైన దినచర్యగానే వుండేది.. ఈ కారణాలు సరిపోయాయి తను హేర్ స్టయిలింగ్ రంగంలోకి రావడానికి!


-సికిందర్
( మే 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక )