రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, September 17, 2019

872 : రివ్యూ!


దర్శకత్వం : అజయ్ బహల్
తారాగణం : అక్షయ్ ఖన్నా, రిచా చడ్డా, మీరా చోప్రా, రాహుల్ భట్, కిషోర్ కదమ్, కృతికా ఖాన్ తదితరులు
రచన : మనీష్ గుప్తా, సంగీతం : క్లింటన్ సిరేజో, ఛాయాగ్రహణం : సుధీర్ చౌధురి
బ్యానర్ : పనోరమా స్టూడియోస్, టీ సిరీస్
         కోర్టు రూమ్ డ్రామాలకి లైంగిక వేధింపుల / మానభంగాల కథలు సెక్స్ అప్పీల్ ని సమకూర్చి పెడుతున్నాయి బాక్సాఫీసు విజయాల కోసం. ఇవి ఫార్ములాకి దూరంగా చుట్టూ జరుగుతున్న సంఘటనలకి వాస్తవిక సినిమాల రూపంలో అద్దం పడుతున్నాయి. లైంగిక వేధింపుల కథతో ‘పింక్’ ఒక కోర్టు రూమ్ డ్రామా కాగా, తాజాగా మానభంగ కథతో ‘సెక్షన్ 375’ ఇంకో అలాటి కోర్టు రూమ్ డ్రామా అయింది. ‘పింక్’  కొంత ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తే, ‘సెక్షన్ 375’ చట్టాన్ని, న్యాయాన్నీపల్టీ కొట్టించే అస్త్రంగా రేప్ ని చూపించింది.

          టు హాలీవుడ్ లోనూ, ఇటు ఇండియాలోనూ ఇంకా ‘మీ టూ’ ఉద్యమం ప్రారంభం కాక ముందే ఈ కథ తయారైందని చెబుతున్నా, ఇప్పుడా ఉద్యమ నేపథ్యంలో, నిత్యవార్తలైన మానభంగాల ఉధృతిలో, బాధితుల ఫిర్యాదుల పైనే అనుమానాలు కలిగేలా వుందీ చిత్రణ. వరకట్న వేధింపుల సెక్షన్ 498 దుర్వినియోగమైనట్టే, మానభంగాల సెక్షన్ 375 నీ వాడుకునే ప్రమాదం వున్నట్టు, స్త్రీలకోసం చట్టాలు చేస్తే వాళ్ళు పురుషుల్ని వేధించడానికి మానిప్యులేట్ చేస్తారన్న అర్ధంలో వుంది కథా రచన. పూర్తిగా పురుష పక్షం వహించి, అవి మగవాళ్ళ చేసే రేపులు కావు, ఆడవాళ్ళు తీర్చుకునే రివెంజిలు అని ముక్తాయించిన ముగింపూ  వుంది. ఎక్కడో అరుదుగా జరిగే అవకాశమున్న ఇలాటి కుయుక్తిని సినిమా కోసం జనరలైజ్ చేసినట్టుగా వుంది కాన్సెప్ట్.

          ఇలా ఎవరైనా చట్టాన్నిదుర్వినియోగం చేస్తే కోర్టు శిక్షించేట్టు కాకుండా, సమర్ధిస్తున్నట్టు తీర్పు చెప్పడం ఇంకో ‘ప్రధానాకర్షణ’. ఈ హైకోర్టు తీర్పు చెప్పడం కూడా బయట ప్రజాందోళనకి లొంగి చెప్పినట్టు వుండడం ‘ప్రధానాకర్షణే’. రేపిస్టుని శిక్షించాలని హైకోర్టు బయట జనం లాఠీ దెబ్బల్ని లెక్కచెయ్యకుండా తీవ్రస్థాయిలో గొడవ చేస్తూంటే, న్యాయమూర్తి మాటిమాటికీ కిటికీలోంచి తొంగి చూసి టెన్షన్ తో గడపడం, ఈ జనాలకి అనుకూలంగా తీర్పు చెప్పకపోయామో, ఇక తమ తలలు వేయి వ్రక్కలే అన్నట్టు హడవిడిగా - ఆ ఇద్దరు న్యాయమూర్తులూ బెంచి మీదికొచ్చేసి -  ‘ఔను వాడు రేపిస్టు ముష్టివాడే’ - అని తీర్పు చెప్పి పారెయ్యడం, అత్యంత ప్రధానాకర్షణ గల చర్యే విశ్వసనీయత పట్ల. 

       విడతలు విడతలుగా మనకి అందించిన కథనం ప్రకారం అతను రేప్ చేయలేదు, అలా ఆమె ట్రాప్ చేసింది. దీనికి రుజువు లేదు. మొదట అతనే ట్రాప్ చేశాడు. అతను పెళ్ళయిన విషయం దాచి పెట్టాడని ఎదురు తిరిగింది. మోసపోయానని మోసానికి ప్రతీకారంగా అతణ్ణి ట్రాప్ చేసి రేప్ కేసులో ఇరికించింది. ఆమె ట్రాప్ చేసిందనడానికి రుజువుల్లేవు, పైగా కోర్టు బయట జనం రెచ్చిపోతున్నారు. అందుకని న్యాయ మూర్తులు అతను రేపిస్టేనని, ఆమె రేప్ బాధితురాలనీ గట్టెక్కించేశారు.

          ఒక నిర్భయ ఘటనలోనో, ఇంకో ఖటువా ఉదంతంలోనో రేప్ బాధితుల్ని చంపి పడేస్తే, కళ్ళారా చూసిన ఆ ఘోరాలకి ప్రజాందోళనలు పెల్లుబకడంలో అర్ధముంది. పడగ్గది లో ఇద్దరి మధ్య అసలేం జరిగిందో తెలిసే వీలులేని కేసుల్లో, జనాలకేం తెలుసనీ రేపిస్టుని ఉరితీయాలని వీధికెక్కుతారు. సోషల్ మీడియాలో వీరంగాలేస్తారు. కోర్టుల మీదికి దండయాత్ర చేస్తారు. ఇలాటి మూకల్ని ఎంకరేజి చేస్తున్నట్టూ, దీన్ని తీర్పుకి వాడుకుంటున్నట్టూ కథ చేశారు. ఈ కేసు నువ్వెలా తీసుకున్నావని అల్లరి మూక నిందితుడి లాయర్ మీద దాడి చేసేలా, ఇంకు జల్లి అవమానపర్చేలా, న్యాయప్రక్రియని అల్లరి మూక చేతిలో పెట్టేసేలా కథాసంవిధానాన్ని తీర్చిదిద్దారు. ఈ కథామాలికలో అల్లరి మూకల పాత్రకి లాజిక్కే లేదు.

          ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులుంటే, వాళ్ళలో ఒకరు మేడమ్  వుంటే, ఆవిడకి ప్రాధాన్యం లేనట్టే చిత్రణ. ఛాంబర్ లోకి వాళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళినా అతడేం చెప్తాడని ఆమే అతడి వైపు చూస్తూంటుంది తప్ప, ఆమె అభిప్రాయం కోసం అతను చూడడు గాక చూడడు. అతనే ఏదో డిక్లేర్ చేస్తే, దానికామె తలూపుతుంది. తలలు పగులుతాయన్న భయం కూడా అతడిదే. అతడి ప్రకారమే తీర్పుకి ఆమె ఓకే. ఛాంబర్లో అంతా వాడిన మేల్ డామినేషన్ పూలతో కథాలంకరణ. వాడిన పూలే వికసించెనే - అని మనం పాడుకునేట్టు.

కేసు కథా ‘కామా’ మిషు
       నిందితుడి బెడ్ కింద వాడిన పూలుంటాయి రేప్ కి సాక్ష్యంగా. తర్వాత ఆమె వికసించిన పూలతో మళ్ళీ వచ్చిందని ఎదురు సాక్ష్యం తీస్తాడు నిందితుడి తరపు లాయర్. బెడ్ కింద వున్న వాడిన పూలు రేప్ కి నాల్గు రోజులు ముందటివి అంటాడు (ఇంట్లోపని మనిషి వుంది, బెడ్ రూమ్ ఊడ్వదా? కథ కోసం అవసరమని నలిగిన పూలు వదిలేసిందా?... సినిమా ఫీల్డులో మోడ్రన్ కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ జడలో వొత్తుగా, వెడల్పుగా కొట్టొచ్చినట్టూ, మల్లెపూల పట్టీ వేసుకు తిరగడం కూడా కథ కోసమేనేమో).

          అంజలీ డాంగ్లే (మీరా చోప్రా) ఒక సినిమా కాస్ట్యూమ్స్ అసిస్టెంట్. కాస్ట్యూమర్ మేడమ్ కింద పనిచేస్తూ, అదే సినిమా షూటింగులో దర్శకుడు రోహన్ ఖురానా (రాహుల్ భట్) కి లొంగిపోతుంది. పెళ్ళయిన విషయం చెప్పడు. కానీ ఆమె వల్ల ఇంట్లో భార్యకి తెలిసిపోయి ఆమెని వెళ్ళగొడతాడు. దీంతో తనని మోసం చేశాడని మనసులో పెట్టుకుని, పథకం ప్రకారం పని ఇప్పియ్యమని జాలి కథలు చెప్పుకుని మళ్ళీ వస్తుంది. షూటింగ్ కి అవసరమైన కాస్ట్యూమ్స్ ని పథకం ప్రకారం వంగి చూపిస్తూ, వక్ష సంపదని ఎక్స్ పోజ్ చేస్తుంది (అప్పుడు బ్రా వేసుకుని వుండదు. ఈ పాయింటు కేసులో ఎక్కడా ఉత్పన్నం కాదు. రోహన్ కూడా తన లాయర్ కి చెప్పడు. చెప్పి వుంటే తన మీద కేసు కింది కోర్టులోనే ఎగిరిపోయేది). ఆ ఎక్స్ పోజింగ్ కి అతను తన సహజ మగ తేనియలు తేరగా వూరగా ఆమె మీద పడతాడు. ఆమె పథకం ప్రకారం ప్రతిఘటించి గాయాలు చేసుకుని, వెళ్లి పోలీస్ స్టేషన్లో  రేప్ కేసు పెట్టేస్తుంది.


        అక్కడ పోలీసాఫీసర్ అడగరాని ప్రశ్నలు అడిగి కేసు రాసుకుంటాడు (ఈ కేసు రాయాల్సింది లేడీ ఆఫీసరైతే నువ్వెందుకు రాశావని తర్వాత హైకోర్టులో రోహన్ లాయర్ తరుణ్ సలూజా (అక్షయ్ ఖన్నా) అడుగుతాడు. సినిమాకి సెక్స్ అప్పీలు పీక్ కి వెళ్ళడానికి  తనుంటేనే బాగుంటుందని ఆ పోలీసాఫీసర్ చెప్పలేకపోతాడు).

          ఇలా రేప్ కేసులో దర్శకుడు రోహన్ అరెస్టయి, సాక్ష్యాలన్నీ ఆమె ఆరోపణలకి నిరూపణలుగా వుండడంతో సెషన్స్ కోర్టు పదేళ్ళ  శిక్ష వేస్తుంది. హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. లాయర్ తరుణ్ సలూజా రంగంలోకొస్తాడు. ప్రాసిక్యూషన్ వైపు ఒకప్పుడు తన అసిస్టెంటే అయిన హీరల్ గాంధీ (రిచా చడ్డా) వస్తుంది. ద్విసభ్య బెంచి (కిషోర్ కదమ్, కృతికా ఖాన్) అప్పీల్ విచారణ. ఈ విచారణలో పై చేయి అంతా మేల్ డామినేషన్ తో తరుణ్ దే. వైరి పక్షాల సమీకరణ కూడా ఎలా వుందంటే, ఆడ జట్టు ఒక వైపు – మగ జట్టు ఒకవైపు అన్నట్టు. మేల్ డామినేషన్ తో మగజట్టుదే పై చేయి. బాధితురాలు, ఆమె తరపు ప్రాసిక్యూటర్ ఆడజట్టు. నిందితుడూ అతడి లాయర్ మగజట్టు. వీళ్ళదే హల్చల్. తన అధికార స్థానాన్ని ఉపయోగించుకుని మగవాడు స్త్రీలని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నాడని చెప్పే రేప్ కథలో కోర్టులోనే, కోర్టు ఛాంబర్లోనే ఈ దృశ్యాలు.

          పబ్లిక్ ప్రాసిక్యూటర్ హీరల్ గాంధీ (గాంధీ పేరు దేనికి? ‘అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ మిస్ గాంధీ’ అని మాటిమాటికీ న్యాయమూర్తులు ఆమె నోర్మూయిస్తూంటే, మహాత్మా గాంధీ పట్ల శాడిజంగా వుంటుందన్నఆనందంతోనా?) ఈ కేసుని తీసుకున్నప్పుడు ఎన్ని తప్పులున్నాయో చూసుకోనట్టు వుంటుంది ఆమె వాదించే తీరు. పైగా తను రాష్ట్రానికి మొదటి మేడమ్ అడ్వొకేట్ జనరల్ గా పనిచేసినట్టు బిల్డప్ ఇచ్చారు.

          లాయర్ తరుణ్ రేప్ జరగలేదనే తేలుస్తాడు- బెడ్ షీట్ ఆధారంగా. బెడ్ షీట్ ని వెంటనే లాబ్ కి పంపకుండా ఇన్స్పెక్టర్ ఐదురోజులు తన దగ్గరుంచుకోవడం వల్ల, దాని మీద సాక్ష్యాధారాలు కలుషితమయ్యాయని, అందువల్ల ఈ ఎవిడెన్స్ చెల్లదని చెప్పేస్తాడు. ధర్మాసనం దీన్ని ఒప్పుకున్నా, ఇంతమాత్రాన కేసుని కొట్టివేయలేమని అంటుంది. దీంతో బాధితురాలు ఏ రకంగా ముద్దాయిని ట్రాప్ చేసిందో సుదీర్ఘ వాదోపవాదాల మధ్య విజువల్ ఎవిడెన్సుని ముందుంచుతాడు తరుణ్. దీన్ని కూడా ధర్మాసనం ఒప్పుకున్నా, బయట మూక అల్లరికి బెంబేలేత్తినట్టు కింది కోర్టు తీర్పునే సమర్ధిస్తూ తీర్పిచ్చేస్తుంది.

          నైతిక విజయం తరుణ్ దే, ముద్దాయిదే. బాధితురాలే సెక్షన్ 375 ని, పోలీసుల్నీ, ప్రాసిక్యూటర్స్ నీ, కోర్టుల్నీ, అందర్నీ తెలివిగా ఏమార్చి వ్యక్తిగత పగ తీర్చుకుంది. దీంతో ఇంతవరకూ వున్న సానుభూతి కరిగిపోయి క్రిమినల్ మాస్టర్ మైండ్ గా, నెగెటివ్ గా  ఆమె కనపడుతుంది. రేప్ బాధితులకి అండగా వున్న సెక్షన్ ని తను ఇలా దుర్వినియోగపర్చి  అప్రతిష్ట తెస్తే, రేపు వేలాది రేప్ బాధితురాళ్ళ పరిస్థితేమిటని ఆడదై వుండి కూడా, ఈ కథకి కథానాయకి అయికూడా ఆలోచించకుండా.

          మద్యనిషేధాన్ని అవకాశంగా తీసుకుని హీరో డబ్బులు సంపాదించుకునే మద్యం స్మగ్లింగ్ కింద మార్చుకునే ‘రణరంగం’ అనైతిక కథకీ, దీనికీ తేడా లేదు.


సికిందర్
telugurajyam.com