ఇటీవల కుబేరా, 100 లాంటి సినిమాలు యాక్షన్ తో కాక, డైలాగులతో వెర్బల్ గా నడపడం వల్ల కథ పరుగులు తీయక నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. సినిమా అనేది విజువల్ మాధ్యమం, ఆడియో మాధ్యమం కాదు. కథ విజువల్ గానే సాగాలి, డైలాగులతో ఆడియో విన్పిస్తూ కాదు. అది రేడియో నాటికల పని. దీంతో పై రెండు సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్ ఏమాత్రం అనుభవం కావు. యాక్షన్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఎట్టి పరిస్థితిలో డైలాగులతో కథని ముందుకు నడిపించేవిగా గాకుండా, యాక్షన్ తో పరుగులు తీయాల్సిందే. లేదూ, ఆడియో- విజువల్ రెండు మాధ్యమాల మీదా పట్టు వుండి, ఆ రెండిటినీ పరస్పరం పోటీ పెట్టి ఎలా దృశ్యాల్ని పండించ వచ్చో తెలిసి వుంటే, క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్’ లాంటి ప్రయోగం చేయొచ్చు. ఏం చేస్తున్నామో దాని స్పృహ లేకుండా చేసుకుంటూ పొతే సినిమా సాంకేతికాలకే అన్యాయం!
పై రెండు సినిమాలతో బాటు తాజాగా ‘వార్ 2’ తో కూడా ఇదే సమస్య. బోలెడు డైలాగులు- బారెడు యాక్షన్ సీన్లు. సినిమా చివరంటా ఇవే రిపీటవుతూ వుంటాయి. బోలెడు డైలాగులతో బారెడు వెర్బల్ సీను పూర్తయ్యాక, తెగ బారెడు యాక్షన్ సీను మొదలవుతుంది. యాక్షన్ సీను పూర్తవగానే, తిరిగి బోలెడు డైలాగులతో తెగ వాగుడు సీను... దీంతో యాక్షన్ పార్టు- డైలాగ్ పార్టు పరస్పరం సహకరించుకోక- యాక్షన్ పార్టు లేకపోయినా, డైలాగ్ పార్టు వింటే సినిమా అర్ధమైపోయే దయనీయ పరిస్థితేర్పడింది!
సినిమా అనేది ప్రాథమికంగా దృశ్య మాధ్యమం. ప్రేక్షకుల వీక్షణానుభవాన్ని మెరుగుపరచడానికి, అర్థాన్ని తెలియజేయడానికీ డైలాగుల్ని కలుపుకున్నప్పటికీ అది ప్రాథమికంగా దృశ్య మాధ్యమమే. ఈ మాధ్యమం కథని చెప్పడానికి, ప్రేక్షకులకి భావాన్ని తెలియజేయడానికీ కదిలే బొమ్మల నిరంతర ప్రవాహంపై ఆధారపడి వుంటుంది. ధ్వని లేకుండా ఒక సినిమా వుండొచ్చు, కానీ కదిలే బొమ్మలు లేకుండా సినిమా అనేది లేదు. దృశ్యంతో కథ చెప్పడమంటే, పాత్రల మానసిక స్థితిని సృష్టించడానికి, సంక్లిష్ట భావోద్వేగాలని తెలియజేయడానికీ, ప్రేక్షకుల దృష్టిని మళ్ళించడానికీ లైటింగ్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ వంటి విజువల్ పద్ధతుల్ని ఉపయోగించుకోవడం. ఆధునిక సినిమాల్లో ధ్వనిని (డైలాగులు కాదు) తరచుగా దృశ్యాలతో కలిపి మరింత లీనమయ్యే పూర్తి అనుభవాన్ని సృష్టిస్తారు. అయితే, ధ్వని దాని కథనంలో అంతర్భాగంగా వున్నా కూడా, సినిమా స్వభావం ప్రాథమికంగా దృశ్య మాధ్యమంగానే వుండి పోయింది. అందుకని డైలాగులు దృశ్య మాధ్యమంతో సహకరించాలే గానీ, దృశ్య మాధ్యమం డైలాగులతో సహకరించ కూడదు. అంటే పాత్రలు తెగ డైలాగులు అప్పజెప్తూంటే, వాటిని చిత్రీ కరించే వెట్టి బానిసగా దృశ్య మాధ్యమం వుండకూడదు.
అతి తక్కువ డైలాగులతో విజువల్ గా అర్ధమయ్యేలా ముత్యాలముగ్గు, సితార, మేఘ సందేశం, శంకరాభరణం నాలుగూ పెద్ద హిట్టయ్యాయిగా? ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి- మన సబ్ కాన్షస్ మైండ్ విజువల్స్ కి స్పందిస్తుంది. వాటిని ముద్రించుకుంటుంది. మన జ్ఞాపకాల నిండా వుండేవి విజువల్ గా రికార్డయిన బిట్సే. అందుకే పై నాల్గు సినిమాల్లో మాటలు లేని, భావాన్ని తెలియజేసే కొన్ని విజువల్స్ ఇప్పటికీ మనకి గుర్తుంటున్నాయి.
సరే, బోలెడు డైలాగులు వాడుతూ యాక్షన్ కథ చెప్పడం కూడా ఒక టెక్నిక్కే అయితే ఆ టెక్నిక్ తెలుసుకుని క్రియేటివ్ గా వాడుకోవచ్చు. అప్పుడు తెగ డైలాగులతో బోరు కొట్టేలా వుంది సినిమా అంటూ ఎవరూ విమర్శించరు. పైపెచ్చు ఇది కూడా ఆర్టు కదా అన్పించి పొగడ్తల్లో ముంచెత్తుతారు. ఈ ఆర్టుని స్థాపించింది ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరాంటినో. 2003 లో ఉమా థర్మాన్ హీరోయిన్ గా తీసిన సూపర్ హిట్ రివెంజి యాక్షన్ ‘కిల్ బిల్’ చూస్తే చాలు అర్ధమై పోతుంది.
ఇందులో సీన్లు ఇలా వుంటాయి : ఓ పది నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగే సీనుంటుంది. ఈ సీను త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటుంది. కథా గమనాన్ని తెలియజేసే డైలాగులతో బిగినింగ్ నెమ్మదిగా ప్రారంభమై, ప్లాట్ పాయింట్ వన్ కి చేరి, డైలాగులు సంఘర్షణాత్మకంగా మారతాయి. ఈ మిడిల్ పూర్తయ్యి- ప్లాట్ పాయింట్ టూ లో వాగ్యుద్ధానికి తెరపడుతూ, ఎండ్ లో సడెన్ గా గన్ పేలి యాక్షన్ మొదలైపోతుంది. గన్ కాకపొతే ఇంకేదో. ఇలా పదినిమిషాల సుదీర్ఘ డైలాగుల ఒక్కో సీను హఠాత్తుగా యాక్షన్ లోకి తిరగబెట్టి - షాకిస్తూ పోతూంటాయి. ఈ టెక్నిక్ ‘వార్ 2’ లో వాడవచ్చు విజయవంతంగా. కానీ తమదేదో టెక్నిక్ వాడుదామనుకున్నారు విజయవంతం కాకుండా.
-సికిందర్