రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 26, 2022

1276 : రివ్యూ!


రచన - దర్శకత్వం: అశ్విన్ శరవణన్
తారాగణం: నయనతార, హనియా నఫీసా, వినయ్ రాయ్, సత్య రాజ్, అనుపమ్ ఖేర్, తదితరులు
సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం : మణికంఠన్ కృష్ణమాచారి
బ్యానర్స్ : రౌడీ పిక్చర్స్, యూవీ కాన్సెప్ట్స్
నిర్మాత   : విఘ్నేష్ శివన్

        లేడీ సూపర్ స్టార్ (అని టైటిల్స్ లో వేశారు) నయనతార 2019 నుంచి మూడే తెలుగు సినిమాల్లో నటించింది- సైరా నరసింహా రెడ్డి, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్. తమిళంలో అడపాదడపా నటిస్తోంది. ప్రయోగాత్మకాలు కూడా నటించింది. అయితే 2015 లో ఆమె నటించిన హార్రర్ మాయ దేశవ్యాప్తంగా చర్చకి దారి తీసింది. ఇది తెలుగులో మయూరి గా విడుదలైంది. దీని కథాకథనాలు, మేకింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. హార్రర్ అంత కళాత్మకంగా తీయడం మన దేశంలో జరగలేదు. 10 కోట్ల బడ్జెట్ కి రెండు భాషల్లో 45 కోట్లు వసూలు చేసింది. ఇది 24 ఏళ్ళ దర్శకుడు అశ్విన్ శరవణన్ సాధించిన అపూర్వ విజయం. తర్వాత తాప్సీతో గేమ్ ఓవర్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు. తిరిగి ఇప్పుడు నయనతారతో కనెక్ట్ అనే హార్రర్. ఇది హాలీవుడ్ క్లాసిక్ ఎక్సార్సిస్ట్ నుంచి స్పూర్తి పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, దీనికి కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యాన్ని జోడించినట్టు చెప్పాడు. మరి ఇది తను తీసిన మయూరికి కనీసం దగ్గరి ప్రమాణాలతో వుందా లేదా చూద్దాం...

కథ

    డాక్టర్ జోసెఫ్ (వినయ్ రాయ్), సుసాన్ (నయనతార), అమ్ము (హనియా నఫీసా) ఒక కుటుంబం. అమ్ముకి సంగీతం పట్ల ఆసక్తి. ఆమెకి లండన్ హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్లో సీటు వస్తుంది. కానీ ఇంత చిన్న వయసులో పంపడానికి సుసాన్ ఒప్పుకోదు. ఇది జరిగిన మర్నాడే కోవిడ్ 19 దృష్ట్యా లాక్ డౌన్ విధిస్తుంది ప్రభుత్వం. దీంతో సుసాన్, అమ్ము ఇంట్లో బందీలైపోతారు. నగరంలో వేరే చోట సుసాన్ తండ్రి ఆర్థర్ (సత్యరాజ్) వుంటాడు. డాక్టర్ జోసెఫ్ కోవిడ్ డ్యూటీతో హాస్పిటల్లో బిజీ అయిపోతాడు. అతను కోవిడ్ సోకి మరణిస్తాడు. సుసాన్ దుఖంతో వుంటుంది. అమ్ము తట్టుకోలేక పోతుంది. అయితే ఇద్దరికీ కోవిడ్ సోకి క్వారంటైన్ లో వుంటారు. అమ్ముకి తండ్రి ఆత్మతో మాట్లాడాలన్పించి ఆన్ లైన్లో వూయిజా బోర్డు ని ఆశ్రయిస్తుంది. దాంతో దుష్టాత్మ ఆమెనావహిస్తుంది. దీంతో భయపడిపోయిన సుసాన్ లాక్ డౌన్ సమయంలో కూతుర్ని ఎలా కాపాడుకుందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఓ బాలికకి దుష్టాత్మ ఆవహించడం, దాన్ని భూత వైద్యుడు వదిలించడం వంటి ఎక్సార్సిస్ట్ కోవలోనే వుంది కథ. ఇలాటి కథతోనే గత నెల తెలుగులో  మసూద చూశాం. ప్రస్తుత కథ కి లాక్ డౌన్ నేపథ్యం. దీంతో ఎక్కడున్న పాత్రలు అక్కడుండి పోయి- ఆన్ లైన్లో (వీడియో కాల్స్) ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వుంటారు. ఇలాగే సాగుతుంది మొత్తం కథ, ముంబాయి నుంచి ఆల్ లైన్లో భూత వైద్యం సహా. ఇదొక కొత్త క్రియేటివ్ ఐడియా కథనానికి. అయితే దీని నిర్మాణం లాక్ డౌన్ కాలంలో జరగలేదు.
        
2020 లాక్ డౌన్ సమయంలో మొత్తం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ అన్నీ రిమోట్ గానే, ఆన్ లైన్ లో జరిపి మలయాళంలో సీయూ సూన్ అనే థ్రిల్లర్ని చాలా ప్రయోగాత్మకంగా తీశాడు దర్శకుడు మహేష్ నారాయణన్. తీసి ఓటీటీలో విడుదల చేసి- లాక్ డౌన్ ఏదీ సినిమాల్ని ఆపలేదని రుజువు చేశాడు.
        
సీయూ సూన్’ చేతిలో వున్న స్మార్ట్ ఫోన్స్లాప్ టాప్స్డెస్క్ టాప్స్ వంటి అప్లికేషన్సే  కథలు చెప్పేందుకు మాధ్యమాలు కావచ్చని చెప్పింది. ఇంత కాలం కథల్ని వీటి స్క్రీన్స్ పై చూసేందుకు’ ఇవి మాధ్యమాలుగా వున్నాయిఇప్పుడు కథల్ని చెప్పేందుకు’ ఈ స్క్రీన్స్ మాధ్యమాలవుతాయి. ఆనాడు మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రేమికుల మధ్య కేవలం ఉత్తరాలతో ప్రయోగాత్మకంగా ‘దూరం’ అనే నవల విజయవంతంగా నడిపారు. ఉత్తరాల్లోనే ఆ కథ ప్రవహిస్తూంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లోలాప్ టాప్స్ లోడెస్క్ టాప్స్ లోఇంకా సీసీ కెమెరాల్లోటీవీలో కథ పరుగెత్తుతూంటే ఎలా వుంటుంది? ఈ అనుభవమే సీయూ సూన్ ఇన్నోవేటివ్ అయిడియా.
        
దీనికి ఇంకో రూపం కనెక్ట్. దీని కథ కోసం ఎక్సార్సిస్ట్ ఐడియా తీసుకుని, వూయిజా బోర్డు గేమ్ ని జోడించాడు దర్శకుడు. ఆత్మలతో మాట్లాడే ఈ గేమ్ వికటించి దుష్టాత్మ పట్టుకునే కథ. వూయిజా బోర్డు గేమ్ కథలతో హాలీవుడ్ నంచి 2014 లో, 2016 లో రెండు సినిమా లొచ్చాయి.
        
అయితే ఐడియా, టెక్నికల్ అంశాలు రెండూ బావుండి, కథ విషయంలోనే కుంటుపడింది. మయూరి ప్రమాణాలు మృగ్యమయ్యాయి. హార్రర్ సినిమా హార్రర్ లా వుండక ఏడ్పులతో వుంటే ట్రాజడీ సినిమా అన్పించుకుంటుంది. నయనతార పాత్ర ఏడుస్తూనే వుంటే, హార్రర్ తో థ్రిల్ ఏముంటుంది. కూతురికి పట్టిన హార్రర్ ని ఎదుర్కోవడానికి థ్రిల్స్ కి పాల్పడితేనే హార్రర్- థ్రిల్ నువ్వా నేనా అన్నట్టుంటాయి. దీనికి బదులు పాసివ్ క్యారక్టర్ గా ఏడ్పులతో మదర్ సెంటిమెంటుని రగిలించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. భూతవైద్యుడు దుష్టాత్మని వదిలించే క్లయిమాక్స్ హార్రర్ లో కూడా నయనతార ఏడ్పులు మనల్ని హార్రర్ని అనుభవించకుండా చేశాయి. ఇలా కథ వొక శోక సాగరంలా మారింది.

నటనలు – సాంకేతికాలు

    నటనలు భావోద్వేగ రహితంగా వుండడం ఇంకో లోపం. నయన తార సహా అందరూ ఫ్లాట్ క్యారక్టర్స్ ని ఏ ఫీలూ ప్రదర్శించకుండా పొడిపొడిగా నటించేశారు. నయనతార ఏడ్పు ఒక ఫీలే. కథకి అవసరం లేని ఆమె ఫీలు అది. హార్రర్ తో భయం, సస్పెన్స్ ఫీలై, కూతుర్ని కాపాడుకునే  థ్రిల్స్  కి పాల్పడి వుంటే అప్పుడామెలో భావోద్వేగాలు పలికేవి. ఆమెకో గోల్, ఆ గోల్ కోసం పోరాటమనే సరైన దారిలో నటన వుండేది.
        
కూతురి పాత్ర వేసిన హనియా నఫీసాలో మంచి టాలెంటే వుంది. దుష్టాత్మ పీడితురాలిగా బాధ, ఆక్రోశం బాగా నటించింది. మంచం వూగిపోతున్న ఎక్సార్సిస్ట్ ఐకానిక్ సీను దర్శకుడు క్లయిమాక్స్ లో వాడుకున్నాడు. ఇక్కడ నఫీసాకి  నయనతార (ఏడ్పు) అడ్డుపడక పోతే, తన మీదున్న సీనుతో బలంగా ఆకట్టుకునేది. ఇక నయనతార తండ్రి పాత్ర వేసిన సత్యరాజ్, ముంబాయి భూత వైద్యుడు ఫాదర్ ఆగస్టీన్ పాత్ర వేసిన అనుపమ్ ఖేర్ వీడియో కాల్స్ లో నటన కనబర్చారు.
        
సినిమాలో చెప్పుకోదగ్గవి రెండున్నాయి- సంగీతం, ఛాయాగ్రహణం. రెండూ టాప్ సౌండ్ ఎఫెక్ట్స్ సహా. రెండు మూడు హార్రర్ బిట్స్ నిజంగానే భయపెడతాయి. థియేటర్లకి  దూరమవుతున్న ప్రేక్షకులకి థియేటర్ అనుభవాన్నివడానికే ఎఫెక్ట్స్ ని సాధ్యమైనంత బలంగా వాడుకున్నట్టు చెప్పాడు దర్శకుడు. అయితే ఎఫెక్ట్స్ తో బాటు కథ కూడా కనెక్ట్ అయితేనే థియేటర్స్ కి వెళ్ళడం గురించి ఆలోచిస్తారు ప్రేక్షకులు.

—సికిందర్