హైదరాబాద్ లో ఉప్పల్, ఎల్బీ నగర్, మేడ్చల్ వంటి శివారు
ప్రాంతాల్లో మల్టీ ప్లెక్స్ టికెట్ ధర మూడేళ్ళ క్రితం 100 రూపాయలుండేది. దీంతో
సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళే సగటు ప్రేక్షకులు మల్టీప్లెక్సుల వైపు మరలారు.
ఇంతలో ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతో, పార్కింగ్ ఫీజుల నష్టాల్ని
పూడ్చుకోవడానికా అన్నట్టు టికెట్ ధరలు 150 కి పెంచేశారు. పార్కింగ్
ఫీజులున్నప్పుడు బైక్ కి 20, కారుకి 30 రూపాయలుండేది. పార్కింగ్ ఫీజు
ఎత్తేయడంతో టికెట్ ధర 150 చేశారు. దీంతో 20, 30 రూపాయలు నష్టం ప్రేక్షలకే తప్ప, మల్టీప్లెక్సులకి
టికెట్టు మీద 20, 30
రూపాయలు అదనపు లాభమే. పార్కింగ్ ఫీజులు ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
మల్టీప్లెక్సులకే అదనపు ఆదాయంగా మారింది! అయినా సగటు ప్రేక్షకులు భరించారు.
ఇక కోవిడ్ తర్వాత టికెట్ ధర 200 కి
పెంచేశారు. ఆన్ లైన్ బుక్కింగ్ చేసుకుంటే 30 రూపాయలు అదనం. కోవిడ్ దెబ్బతో
కోట్లాది కుటుంబాలు ఆర్ధికంగా ఛిన్నాభిన్నమవగా, కోట్లమంది మధ్యతరగతి
జీవులు దారిద్ర్య రేఖకి దిగువకు జారిపోగా, సినిమా టికెట్ల రేట్లు
పెంచడం తెలివి తక్కువ నిర్ణయమే. పైగా పెద్ద సినిమాలు విడుదలైతే 300, 400 రూపాయలు వసూలు
చేయడం దోపిడీయే. తినుబండారాలు కూడా 30గ్రా పాప్ కార్న్ 100 రూపాయలు, 70 గ్రా పాప్ కార్న్
200 రూపాయలు! టీ కాఫీలు 40 రూపాయలు! ఇదంతా కోవిడ్ కాలంలో మల్టీప్లెక్సులు మూతబడి
భారీ నష్టాలు చవి చూసినందుకని కారణం చెప్పారు. మరి కోవిడ్ కాలంలో చితికిపోయిన
ప్రజల నష్టాలు ఎవరు
తీరుస్తారు. తమ నష్టాల్ని ప్రజలు తామే భరించినట్టు, మల్టీప్లెక్సులు వాటి
నష్టాల్ని అవే భరించాలి. ఎవరి నష్టాల్ని వారే జీర్ణం చేసుకోవాలి తప్ప ఇంకొకరి
ద్వారా పూడ్చుకోవాలని చూస్తే అసలుకే ఎసరురే వస్తుంది.
ఇదే జరిగింది. మల్టీప్లెక్సుల నష్టాల్ని
పూడ్చడానికి ప్రేక్షకులు ససేమిరా అని సినిమాలకి డుమ్మా కొట్టడం ప్రారంభించారు.
మల్టీప్లెక్సుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక గ్రూపు కంపెనీ ఇంకో గ్రూపుకి
మల్టీప్లెక్సులు అమ్మేసి చేతులు దులుపుకుంది. సినిమాలు ఫ్లాపవడానికి రకరకాల
కారణాలు వూహించారు. వాటిలో ఓటీటీలు ఒకటి. ఓటీటీలతో నిర్మాతలు లాభపడుతున్నారు, మల్టీప్లెక్సులకి
నష్టాలే. అమెరికాలో కోవిడ్ కాలంలో దూరమైన ప్రేక్షకుల్ని తిరిగి రప్పించడానికి 3
డాలర్ల టికెట్టుతో జాతీయ సినిమా దినోత్సవం నిర్వహించారు. ఇది బ్రహ్మాండంగా
విజయవంతమైంది. ఇది చూసి ఇండియాలో నిర్వహించారు. ఇక్కడ కూడా విజయవంతమైంది. దీన్ని
మూడు రోజులు పొడిగించి చూశారు. ప్రేక్షకులు తగ్గలేదు.
దీంతో వ్యాపారం అర్ధమైంది. ప్రేక్షకులు
సినిమాలకి దూరమవడానికి ఓటీటీలు పూర్తి కారణం కాదనీ, పెంచేసిన టికెట్ల
ధరలేననీ జ్ఞానోదయమైంది. సినిమా పండగ రోజు హిందీలో ‘చుప్ - రివెంజ్ ఆఫ్
ది ఆర్టిస్ట్’ నిర్మాతలు
వెనుకాడకుండా 75 రూపాయల టికెట్ ధరకే సినిమా విడుదల చేశారు. 90 శాతం ఆక్యుపెన్సీ తో
ఆటలు కళకళ లాడాయి. దీన్ని మూడు రోజులు పొడిగించారు. ఇంకా బాగా ప్రేక్షకులొచ్చారు.
అంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు దూరమయ్యారనే అభిప్రాయం కూడా తప్పని
రుజువయ్యింది. ఇదే ‘చుప్’ కి 200, 300 రెగ్యులర్ టికెట్
రేట్లు వసూలు చేస్తే అన్ని చిన్న సినిమాలకి లాగే ఇదీ మల్టీప్లెక్సుల రెంట్లు
కట్టుకుని వెనక్కి వచ్చేది.
సినిమా పండుగ జరిగే సెప్టెంబర్ 23 వ
తేదీన తెలుగులో అల్లూరి, కృష్ణ
వ్రింద విహారి (ఇదొక వికృత టైటిల్), దొంగలున్నారు జాగ్రత్త
అని మీడియం, చిన్న
సినిమాలు విడుదలయ్యాయి. అందుకని తెలుగు రాష్ట్రాల్లో 75 రూపాయల సినిమా పండుగని
రద్దు చేశారు. రద్దు చేసి లాభపడిందేమీ లేదు. 75 రూపాయల టికెట్ కే ఈ
మూడు సినిమాలు చూపించి వుంటే మీడియం, చిన్న సినిమాలకి 200
రూపాయల టికెట్ కారణంగా దూరమైన
ప్రేక్షకుల స్పందన వేరేగా వుండేదేమో- ‘చుప్’ కి లాగా!
ఇక కనీసం తెలుగులో చిన్న, మధ్య తరహా
సినిమాల నిర్మాతలు పునరాలోచించు కోవాలేమో. ప్రేక్షకులకి సినిమా అంటే
100 రూపాయల వస్తువే. సగటు ప్రేక్షకులకి సైతం. మల్టీప్లెక్స్ కంపెనీలు ఈ కోవలోనే
ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. దీనికో
ఎజెండా రూపొందిస్తున్నారు. చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాలకి వేరియబుల్ ధర వుంటుంది. ఈవినింగ్, నైట్ షోలు, అలాగే వారాంతాల్లో ఉద్యోగాలు చేసే యువ ప్రేక్షకులు ఎక్కువగా
వుంటున్నారు. వీరిని వీలైనన్ని ఎక్కువ సార్లు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం
చేస్తున్నారు. ఎక్కువగా విడుదలయ్యే చిన్న, మధ్య తరహా సినిమాల
టికెట్ల ధర్ల 100 రూపాయలు నిర్ణయించి, తినుబండారాల ధరలూ బాగా
తగ్గించాలని ఆలోచిస్తున్నారు. ఈ చర్యలు రాబోయే నెలల్లో
విడుదలయ్యే మధ్య స్థాయి హిందీ సినిమాలని దృష్టిలో పెట్టుకుని
తీసుకుంటున్నారు.
‘బ్రహ్మాస్త్రా’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది
ఆర్టిస్ట్’ లకి ప్రయోగాత్మకంగా గత
వారం 100 రూపాయల టిక్కెట్‌లని విక్రయించారు. స్పందన బావుంది. నవంబర్‌లో షెడ్యూల్ చేసిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ కి 50 శాతం తగ్గింపుని
ఆఫర్ చేస్తున్నారు. అమితాబ్
బచ్చన్ నటించిన ‘గుడ్‌బై’ ప్రారంభ రోజున ₹150 లకే టికెట్స్ ని
అందించారు. మరి కొంత
సమయం తీసుకుని, టిక్కెట్
ధరలు తగ్గిస్తే థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల ఫ్రీక్వెన్సీ నిజంగా పెరుగుతుందో
లేదో విశ్లేషిస్తారు. టిక్కెట్
రేట్లు చాలా తక్కువగా వుంటే
పెట్టుబడిని తిరిగి పొందలేని భారీ-బడ్జెట్ చిత్రాలకి సాధ్యం కాదు. అయితే అక్టోబర్‌లో విడుదలయ్యే చిన్న తరహా సినిమాలకి నిర్మాతలు
ప్రయోజనమే పొందుతారు.
ఒకే ప్రాపర్టీ ఒకే సమయంలో ప్రీమియంతో
బాటు తక్కువ ధర టికెట్లని అమలు చేయగల డ్యూయల్
టికెటింగ్ వ్యూహంకూడా ప్రయోజనం
చేకూరుస్తుంది. చౌకగా వున్నందున
యువకులు, శ్రామిక
తరగతి ఫ్రేక్షకులు పెరుగుతారని
ఆశిస్తున్నారు. ఈ సంస్కరణలకి తెలుగు నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి.
***