రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 31, 2025

1390 : స్క్రీన్ ప్లే సంగతులు


హౌస్ ఆఫ్ డైనమైట్ '-అక్టోబర్ 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న హాలీవుడ్ మూవీ ప్రపంచ ప్రేక్షకుల నుంచి మెప్పుదలలు, మొట్టి కాయలు రెండూ ఎదుర్కొంటోంది. ఆస్కార్ అవార్డు పొందిన దర్శకురాలు కేథరీన్ బిగేలో ఇలాటి అర్ధం లేని సినిమా ఎలా తీసిందా అని, లేదు అర్ధవంతమైన సినిమానే తీసిందనీ - ప్రేక్షకులతో బాటు రివ్యూ రైటర్లూ కామెంట్లు విసురుతున్నారు. సినిమాల  గురించి భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ వుంటాయి. అవి కంటెంట్, మేకింగ్ వంటి ఓవరాల్ ప్రయత్నం గురించి తప్ప మరీ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వంటి క్రియేటివ్  ప్రక్రియ గురించి ఎవరికీ పట్టింపు వుండదు. కారణం సినిమాల్ని కొంచెం అటు ఇటుగా త్రీయాక్ట్స్  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో చూస్తూ అలవాటు పడిపోవడం వల్ల. ఇందులో పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలూ, కథ గాక గాథలూ వంటి  సవాలక్ష సాంకేతిక లోపాలు పెద్దగా తెలియవు. కానీ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ నే పూర్తిగా మార్చేస్తూ ప్రయోగం చేస్తే రెగ్యులర్ కథాగమనానికి, ఆ వీక్షణానుభవానికీ  తీవ్ర భంగం కలిగిందనిపించి ఇది సినిమా కాదు పొమ్మని వెళ్ళిపోతారు. ఒక పాటలో చరణాలు ఎత్తేసి పల్లవులే వినిపిస్తూ వుంటే ఎలా వుంటుంది? ఇదే ఈ సినిమా కథతో కనిపిస్తుంది.  అభిరుచిగల ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగంతో ఆ దర్శకుడు లేదా దర్శకురాలి కవి హృదయాన్ని అర్ధంజేసుకుని ఆనందిస్తారు. దర్శకురాలు బిగేలో, రచయిత నోవా ఒపెన్హీం కలిసి ఈ వెలుగు నీడల సయ్యాటల్నే సృష్టించారు. జగ్రత్తగా చూస్తే  ఈ ఏ కీలుకా కీలుగా  విరిచేసినట్టున్న స్ట్రక్చర్ లో తెలుగు సినిమాలు స్క్రీన్ ప్లేల పరంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకి సమాధానాలు కనిపిస్తాయి. ఈ సమాధానాలతో తమ సినిమాల్ని సరిదిద్దుకోవచ్చా లేదా అనేది మేకర్స్ ఇష్టాయిష్టాలకి వదిలేద్దాం. కానీ ఈ సమాధానాలు సవాలు చేస్తూ వెన్నంటే వుంటే ఏం చేయాలి? స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో ఈ కొత్త ప్రయోగం పేరేమిటి? రాంగోపాల్ వర్మ ‘శివ’ ని ఇలాగే తీస్తే ఎలా వుండేది?



ముందుగా  సినిమా కథేంటో చూద్దాం - అలస్కాలోని ఫోర్ట్ గ్రీలీలో ఆ రోజు… అక్కడ మేజర్ డేనియల్ గొంజాల్వెస్ (ఆంథోనీ రామోస్) సైనిక స్థావరంలో నిఘా ఇంఛార్జిగా వుంటాడు. గగన తలంలో ప్రమాదాల్ని గుర్తించి ఇంటర్‌సెప్టర్ క్షిపణులతో వాటిని నాశనం చేయడం అతడి డ్యూటీ. అతను  యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ కమాండ్ తో కనెక్ట్ అయి వుంటాడు. 


కెప్టెన్ ఒలీవియా వాకర్ (రెబెక్కా ఫెర్గూసన్)  వైట్ హౌస్ లోని వాచ్ రూమ్‌లో సీనియర్ ఆఫీసర్. ఉదయం తొమ్మిదిన్నరకి ఆమె రాడార్ స్క్రీన్ మీద పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దూసుకురావడాన్ని గమనిస్తుంది. మొదట్లో అదేదో ఉత్తర కొరియా జరుపుతున్న సాధారణ క్షిపణి పరీక్ష కావచ్చనుకుంటుంది. కానీ దాని ప్రయాణం కక్ష్య మార్చుకోవడంతో అది షికాగో నగరాన్ని టార్గెట్ చేసుకుని దూసుకొస్తున్నట్టు గ్రహిస్తుంది…అంటే ఇంకో 18 నిమిషాల్లో షికాగో గగన తలాన్ని తాకుతుందన్న మాట. వెంటనే వ్యవస్థల్ని అప్రమత్తం చేస్తుంది. డిఫెన్స్ సెక్రెటరీ, వివిధ వార్ కమాండ్స్ సహా అమెరికా అధ్యక్షుడు అప్రమత్తమవుతారు. 


కానీ క్షిపణిని ఏ దేశం ప్రయోగించిందో తెలుసుకోలేక పోతారు. ఇక అలస్కా లోని సైనిక స్థావరానికి ఆదేశాలిస్తారు. మేజర్ డేనియల్ గొంజాలేస్ సిబ్బంది దూసుకొస్తున్న ఆ క్షిపణి మీదికి రెండు ఇంటర్ సెప్టర్స్ ని ప్రయోగిస్తారు. రెండూ క్షిపణిని తాకకుండా మిస్సవుతాయి. ఒలీవియాకి ఆందోళన పెరుగుతుంది. క్షిపణి దాడికి ఐదు నిమిషాలే మిగిలి వున్నాయి- వెంటనే భర్తకి  ఫోన్ చేసి కొడుకుని తీసుకుని వీలైనంత దూరంగా వెళ్ళి పొమ్మని చెబుతుంది. కౌంట్ డౌన్ పడిపోతూండగా- ప్రతీకారంగా మనం అణ్వాయుధాల్ని ప్రయోగించాలా వద్దా అనే దానిపై సైనిక జనరల్ ఆంటోనీ బ్రాడీ (ట్రేసీ లెట్స్) అధ్యక్షుడిని  అడుగుతాడు. దీంతో స్క్రీన్ బ్లాంక్ గా మారుతుంది... 


ఇదీ బిగినింగ్ -1 

     పైన చెప్పుకున్నది రెగ్యులర్  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో వచ్చే యాక్ట్ వన్ (బిగినింగ్) విభాగం. ఇక్కడ పాత్రల పరిచయం (సీనియర్ ఆఫీసర్ కెప్టెన్ ఒలీవియా, మేజర్ డేనియల్, సైనిక జనరల్ ఆంటోనీ బ్రాడీ తదితరులు), కథా వాతావరణం ఏర్పాటు (రక్షణ వ్యవస్థ కలాపాలు),సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన (రాడార్ స్క్రీన్ మీద శత్రు క్షిపణి కదలికలు), సమస్య ఏర్పాటూ (శత్రు క్షిపణిని పేల్చి వేయడంలో వైఫల్యం) అన్న నాల్గు బిగినింగ్ విభాగపు టూల్సూ ఇందులో పని చేశాయి. నిడివి 30 నిమిషాలు. 


అంటే శత్రు క్షిపణిని పేల్చడంలో ఎదురైన వైఫల్యంతో స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ 1 ఏర్పాటయ్యిందన్న మాట. అంటే ఇప్పుడు మిస్సైన శత్రు మిస్సైల్ తో షికాగో నగరానికి పెను ముప్పు నిమిషాల వ్యవధితో సమీపించిందన్న మాట. అది పేలితే నగరం పాతిక లక్షల మంది సహా నాశనమవుతుందన్న మాట.అంటే దీన్ని ఎట్టి  పరిస్థితిలో నివారించాలన్న గోల్ రక్షణ వ్యవస్థ కేర్పడిందన్న మాట. ఈ గోల్ సాధించాలంటే శత్రు క్షిపణిని ప్రయోగించిన దేశమేదో తెలియాలి. ఇది తెలియడం లేదు. శత్రు క్షిపణిని ఆపే అవకాశం కనిపించడం లేదు. అంటే  షికాగో నగరాన్ని కోల్పోక తప్పదు. ఇందుకే దీనికి ప్రతీకారంగా అనుమానిత దేశాల పైకి అణ్వాయుధాల్నిప్రయోగించాలా వద్దా అని సైనిక జనరల్, దేశాధ్యక్షుడ్ని అడిగాడు. సమాధానంగా స్క్రీన్ బ్లాంక్ అయింది- దీంతో యాక్ట్ వన్, అంటే బిగినింగ్ విభాగం ముగిసింది.


లాక్ చేసిన సస్పెన్స్ 

    ఏమిటీ సస్పెన్స్? విషయం మీద దుప్పటి కప్పేసినట్టు స్క్రీన్ బ్లాంక్ అయింది? అంటే షికాగో నగరం నాశనమైందనుకోవాలా? ప్రతీకారంగా అధ్యక్షుడు ఆదేశాలిచ్చేశాడా?  మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా? ఇప్పుడేం జరగబోతోంది? ఎటూ కాని క్లిఫ్ హేంగర్ మూమెంట్ తో సస్పెన్స్ లో పడేస్తూ ముగిసింది బిగినింగ్ విభాగం. క్లిఫ్ హేంగర్ మూమెంట్ అంటే లోయలో జారిపడుతూ కొండ చరియని పట్టుకు వేలాడే పరిస్థితి అన్న మాట. ఇది ప్రేక్షకులకి కల్పించిన పరిస్థితి.


ఈ పరిస్థితిలో  స్క్రీన్ ప్లేలో యాక్ట్ టూ- అంటే కథ ముందుకెళ్తూ మిడిల్ విభాగం మొదలైతే, అసలేం జరిగివుంటుందో ఇప్పుడు తెలుస్తుంది కదాని లొట్టలేసుకుంటూ చూస్తూంటాం కదా? అంత ఆశలేం పెట్టుకోవద్దు. ఆశించినట్టు ఏం  జరగదు. కోర్టు వ్యవహారాల్లో తీర్పు రిజర్వ్ చేసినట్టు, ఇక్కడ కథలో సస్పెన్సు రిజర్వ్ అయిపోయింది. కథ ముందు కెళ్ళడం లేదు. బిగినింగ్ ముగుస్తూ మిస్సైల్ మిస్సై ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డాక, ఆ తర్వాతి కథతో స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం ప్రారంభం కావడం లేదు.  మరేం జరుగుతోంది? కథ మొదటి కొచ్చి ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ విభాగమే రిపీటవబోతోందన్న మాట!


ఇదేంటి? ఇదింతే! ఇది సహజమైన - సార్వజనీన త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు. అసహజ స్ట్రక్చర్. ఇప్పుడు చూడబోతోంది బిగినింగ్ తర్వాత మిడిల్ కాదు, మళ్ళీ బిగినింగే! కథ వెనక్కే.  ఫ్లాష్ బ్యాకులతోనే కాదు, నాన్ లీనియర్ కథనం ఇలా కూడా వుంటుందన్న మాట ఫస్ట్ యాక్ట్ రిపీటవుతూ. మొదట ప్రారంభమైన బిగినింగ్ కెప్టెన్ ఒలీవియా దృక్కోణం లో సాగింది. ఇప్పుడు ఈ రెండో బిగినింగ్ సైనికాధికారుల, సీనియర్ వైట్ హౌస్ అధికారుల దృక్కోణాల నుంచీ …


బిగినింగ్ -2 చూద్దాం 

    మళ్ళీ పాత్రల పరిచయం, అదే కథా వాతావరణం ఏర్పాటు, అదే సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన- దాన్ని నివారించేందుకు హడావిడీ, సమస్య ఏర్పాటూ-  ఈ నాల్గు బిగినింగ్ విభాగపు టూల్సూ మళ్ళీ రిపీటవుతాయి.ఈ బిగినింగ్ టూ నిడివి కూడా 30 నిమిషాలు.  ప్రాథమికంగా, క్షిపణిని ఎవరు ప్రయోగించారో  స్పష్టంగా తెలియకపోయినా, అమెరికా అణ్వాయుధాలతో శత్రువులపై దాడి చేయడం ప్రారంభించాలని మిలిటరీ జనరల్ బ్రాడీ విశ్వసిస్తాడు. అదే సమయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం వుందని డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ (గాబ్రియేల్ బాసో) విశ్వసిస్తాడు. అమెరికా అణ్వాయుధాలని  ప్రయోగించడానికి సిద్ధమవుతున్నందున ప్రత్యర్థులు కూడా అదే విధంగా చేయమని ప్రేరేపించి నట్టవుతుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధానికి దారితీస్తుందనీ  హెచ్చరిస్తాడు. 


ఉత్తర కొరియా నిపుణురాలు అన్నా పార్క్ (గ్రేటా లీ)తో సంప్రదించడానికి జేక్ సమయం కావాలని వేడుకుంటాడు. ఆమెకి పరిస్థితిపై మరింత అవగాహన వుంటుందని అతడి నమ్మకం. ఈ క్షిపణి ప్రయోగం వెనుక ఉత్తర కొరియా లేదా రష్యా వుండే అవకాశం వుందని ఆమె జేక్‌తో చెబుతుంది. జేక్ మరింత  సమాచారం సేకరించాలనుకుంటే  సమయం మించిపోతోంది. క్షిపణి షికాగో మీదికి దూసుకొచ్చేస్తోంది…


అమెరికా తన సొంత దళాల్ని సమీకరించడం ద్వారా ప్రతిస్పందిస్తున్న ప్రత్యర్థులపై ముందస్తుగా దూకుడుగా దాడి చేయాలని  జనరల్ బ్రాడీ అధ్యక్షుడిని ఒత్తిడి చేస్తాడు. ఈ క్షిపణి వెనుక ఎవరైతే వున్నాడో ఆ  వ్యక్తి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడని అనుకోవాలని వాదిస్తాడు. 


మరోవైపు, షికాగోకి క్షిపణితో ఏం జరుగుతుందో చూసే వరకు ఏ దేశంపైనా దాడి చేయ వద్దని జేక్ అధ్యక్షుడిని కోరతాడు. ఆ క్షిపణి పని చేయక పోవచ్చని, పేలకుండా నేల కూలిపోయే అవకాశం కూడా వుందని అంటాడు. అధ్యక్షుడు ఆలోచించడానికి ఒక నిమిషం సమయం అడుగుతాడు. అణు దళాలు సిద్ధంగా వుండడంతో - అధ్యక్షుడు తన అధికార కోడ్‌ని  అందిస్తాడు. జనరల్ బ్రాడీ అధ్యక్షుడి ఆదేశాల్ని అడుగుతాడు. అధ్యక్షుడు సమాధానం చెప్పే ముందు, స్క్రీన్ బ్లాంక్ గా మారుతుంది…


మళ్ళీ అక్కడే, అలాగే…

    మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది కథ. మళ్ళీ దుప్పటి కప్పేశాడు రైటర్. ఇప్పుడు సస్పెన్స్, ఉత్కంఠ రెట్టింపయ్యాయా? ఈ బిగినింగ్ 2 దాటి ఈసారి కథ మిడిల్ తో ముందు కెళ్తుందేమో చూద్దామనుకుంటే ఇంటర్వెల్ కూడా పడింది. మళ్ళీ అదే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కొచ్చి ఆగింది. ఇంతకీ ఏం జరుగుతోంది కథ వెనకాల కథ? అధ్యక్షుడు ఆదేశాలిచ్చేశాడా? క్షిపణి షికాగో మీద పడిందా? లేక ఫెయిలై పోయిందా? విషయాన్నిఒకసారి కాదు రెండు సార్లు దాచి పెట్టి ఇంకెప్పుడు  రివీల్ చేస్తారు ప్రేక్షకులకి? 


ఇంటర్వెల్ లో కొత్త మలుపు కూడా రాలేదు. బిగినింగ్ 1 ప్లాట్ పాయింట్ వన్నే తిరిగి బిగినింగ్ 2 కి కూడా ఏర్పడింది. ఇలా ఎన్నిసార్లు అదే క్లిఫ్ హేంగర్ మూమెంట్ లో వేలాడదీసి వదిలేస్తారు ప్రేక్షకుల్ని? కథ రెండోసారి కూడా బిగినింగ్ దాటి ముందు కెళ్ళడం లేదని అసంతృప్తి చెందరా ప్రేక్షకులు? ఒకసారి పంక్చరైందని పంక్చరేసి స్టార్ట్ చేస్తే, మళ్ళీ పంక్చరవడం తూట్లు పడ్డ కథని మామీద రుద్ది  రిపేర్లు చేస్తున్నారని తిరగబడరా ప్రేక్షకులు? ఎందుకు నార్మల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని కాదని ఇంత రిస్కు  తీసుకోవడం?


‘శివ’ లో నాగార్జున జేడీ మీద సైకిలు చైనుతో తిరగబడే ప్లాట్ పాయింట్ వన్ సీను తర్వాత కథ ముందు కెళ్ళకుండా స్క్రీన్ ని బ్లాంక్ చేసి- ఇది నాగార్జున పాయింటాఫ్ వ్యూ అని చెప్పి- మళ్ళీ ఇదే కథ మొదలెట్టి, ఇలాగే  నాగార్జున జేడీ మీద సైకిలు చైనుతో తిరగబడే ప్లాట్ పాయింట్ వన్ సీను తర్వాత -మళ్ళీ స్క్రీన్ ని బ్లాంక్ చేసి- ఇది జేడీ పాయింటాఫ్ వ్యూ అని చెప్పి ఇంటర్వెల్ వేస్తే  ఎలా వుంటుంది? 


బిగినింగ్ -3 కూడా ఇంతే!

    ఇప్పుడు సెకండాఫ్ ప్రారంభిస్తే- ఈసారి అధ్యక్షుడి పాయింటాఫ్ వ్యూలో స్టోరీ- మళ్ళీ ఫస్టాఫ్ లో చూపించిన బిగినింగ్ నుంచీ మూడోసారి రిపీట్.మళ్ళీ పాత్రల పరిచయం, అదే కథా వాతావరణం ఏర్పాటు, అదే సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన- దాన్ని నివారించేందుకు హడావిడీ, సమస్య ఏర్పాటూ-  ఈ నాల్గు బిగినింగ్ విభాగపు టూల్సే మూడోసారీ  రిపీటవుతాయి.


ఇప్పుడు దేశాధ్యక్షుడు (ఇడ్రిస్ ఎల్బా) ప్రత్యక్షమవుతాడు. ఫస్టాఫ్ లో రెండు బిగినింగ్స్ లో ఇతను కనిపించడు. ఫోన్లో వాయిస్ వినిపిస్తూంటుంది. ఈ మూడో బిగినింగ్ లో ఒక టీనేజీ బాస్కెట్ బాల్ ఈవెంట్ కి హాజరై కన్పిస్తాడు.  వెంట రెడీగా బ్రీఫ్ కేసు పట్టుకుని లెఫ్టినెంట్ కమాండర్ రాబర్ట్ రీవ్స్ (జోనా కింగ్)వుంటాడు. ఆ బ్రీఫ్ కేసుని ‘న్యూక్లియర్ ఫుట్ బాల్’ అంటారు. అది పట్టుకుని డిఫెన్స్ సెక్రెటరీ రీవ్స్ ఎల్లప్పుడూ అధ్యక్షుడి వెంట వుంటాడు. ఏ అత్యవసర క్షణంలో అణు దాడికి అదేశాలివ్వాల్సిన అవసరమొస్తుందో తెలీదు-  ఆ క్షణం అధ్యక్షుడు బ్రీఫ్ కేసులో వున్నన్యూక్లియర్ ఫుట్ బాల్ తెరిచి మీట నొక్కి అదేశాలిచ్చేసేందుకు వీలుగా, ఈ 24 x 7 అందుబాటులో వుండే  ఏర్పాటు.


అధ్యక్షుడు బాస్కెట్ బాల్ జట్టుతో మాట్లాడుతున్నప్పుడు, సడెన్ గా సెక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడ్ని చుట్టు  ముట్టి అక్కడ్నుంచి  తప్పించేస్తారు. అతడ్నితీసుకుని పరిగెడుతూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కించేసి సురక్షిత ప్రదేశానికి తరలిం
చేస్తారు.


అటు డిఫెన్స్ సెక్రెటరీ రీడ్ బేకర్ (జేర్డ్ హేరిస్)  భయాందోళలకి గురై, షికాగోలో వున్న కుమార్తెని తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. అది అసాధ్యమవడంతో, భద్రతా సమావేశాల్ని ఎగ్గొట్టి కుమార్తెకి వీడ్కోలు చెప్పడానికి కాల్ చేస్తాడు. క్షిపణి దాడితో కుమార్తె ఇక బ్రతకదని, కుమార్తె లేని జీవితాన్ని ఊహించలేననీ  ఆమెకి వీడ్కోలు చెప్పి, భవనం మీంచి దూకేస్తాడు.


విమానంలో అధ్యక్షుడు మిసైల్ దాడి గురించి తెలుసుకుని, లెఫ్టినెంట్ కమాండర్ రాబర్ట్ రీవ్స్ ని అడుగుతాడు. రీవ్స్ న్యూక్లియర్ ఫుట్‌బాల్ లోని ఆప్షన్స్ గురించి చెప్తాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి ఆప్షన్స్ సాంకేతికాల్ని వివరించమంటాడు అధ్యక్షుడు. రీవ్స్ వివరించడం మొదలెడతాడు.


జనరల్ బ్రాడీ కాల్ చేసి అధ్యక్షుడి నిర్ణయం అడుగుతాడు. అధ్యక్షుడు తన భార్యకి  ఫోన్ చేసి, అణు ముప్పు గురించి, తాను తీసుకోవలసిన నిర్ణయం గురించీ చెబుతూంటే, కాల్ కనెక్షన్ తెగిపోతుంది.


అధ్యక్షుడు తిరిగి జనరల్‌ బ్రాడీకి కాల్ చేసి, తన అధికార కోడ్‌ని బిగ్గరగా చదువుతాడు. రీవ్స్ నుంచి న్యూక్లియర్ ఫుట్‌బాల్‌ని తీసుకుంటాడు. దాన్ని తెరిచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటోండగా-   బ్లాంక్ అయిపోతుంది స్క్రీన్!


ప్చ్, ఇదంతా ట్రిప్టిచ్చే!

    మూడోసారీ ఆ ఘట్టం దగ్గరే స్క్రీన్ బ్లాంక్. మాటిమాటికీ కరెంట్ పోతూంటే ఎలా వుంటుందో అలాటి పరిస్థితే  ప్రేక్షకులకి. మూడో సారీ అక్కడికే వచ్చి ఆగింది కథ! అదే బిగినింగ్- అదే ప్లాట్ పాయింట్ వన్-  అదే బ్లాంక్ స్క్రీన్! ఈ చెలగాటం ఆత్మహత్యా సదృశమే. అయినా వదిలిపెట్టడం లేదు రైటర్, డైరెక్టర్. పైన చెప్పుకున్నట్టు ‘శివ’ లో ప్లాట్ పాయింట్ వన్ ని రెండు రౌండ్లు తిప్పి ఇంటర్వెల్లో పడేశాక- సెకండాఫ్ లో ఇప్పుడు విలన్ రఘువరన్ పాయింటాఫ్ వ్యూ అంటూ ప్రారంభించి -మళ్ళీ అదే బిగినింగ్ ఇంకో రౌండేసి, మళ్ళీ అదే సైకిలు చైను కొట్టుడు సీనుతో ప్లాట్ పాయింట్ వన్ ని ఇంకో రౌండు తిప్పి - స్క్రీన్ బ్లాంక్ చేస్తే ఎలా వుంటుందో -ఆ ప్రేక్షకుల అల్లరి, సైకిలు చైన్లు పిడికిళ్ళకి చుట్టుకుని తిరగబడడమూ, విరగబాదడమూ లాంటి రియల్ ఫైట్ తో థియేటర్లు శివశివా అనుకుంటూ దద్దరిల్లడమూ వంటి దృశ్యాలు ఇక్కడా వూహించుకోవచ్చు! ఇంత రిస్కు చేసిన చెలగాట మన్నమాట. 


మూడొంతులు సినిమా అయిపోతున్నా కథ బిగినింగ్ దాటి ముందుకెళ్ళదా? మూడొంతులు సినిమా అయిపోతున్నా  కథ బిగినింగ్ దాటి ముందుకెళ్ళక పోతే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఇంతవరకూ తెలిసిందే. కానీ ఇక్కడ బిగినింగ్ దాటి ముందు కెళ్ళక పోవడమే కాదు, అదే బిగినింగ్ అదే ప్లాట్ పాయింట్ వన్ తో మూడు సార్లు రిపీటవడం. ఈ కొత్త క్రియేటివిటీని ఏమంటారని వెతికితే, ట్రిప్టిచ్  (triptych) అంటారని తెలిసింది. ఇది సినిమా కళలో కనపళ్ళేదు, చిత్రకళలో తప్ప.


సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో ట్రిప్టిచ్ ప్రయోగ ఫలితం ఇదన్న మాట. ఇందులో ఒకే బిగినింగ్ మూడు సార్లు రిపీటవడం చూశాం. దీని ప్రయోజనమేమిటి? ఇదెలా ఉపయోగపడింది సినిమాకి? అభిరుచిగల ప్రేక్షకులు ఈ ట్రిప్టిచ్ ని ఫాలోయితే ఒక హుక్ కి ఎటాచ్ అయిపోతారు. అదేమిటంటే, మూడు సార్లూ అదే ప్లాట్ పాయింటుతో అదే సస్పెన్స్ ని అనుభవించడం. షికాగో మీద క్షిపణి పడిందా లేదా, అధ్యక్షుడు ఏ ఆప్షన్ ని నొక్కాడు? దాంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలై పోయిందా లేదా?  అన్న సస్పెన్స్. ఈ సస్పెన్స్ మూడు సార్లూ కవ్విస్తూ వచ్చిపోతోంది. రిపీటవుతున్న మూడు బిగినింగ్స్ నీ కలిపి వుంచుతున్న లింకు  ఈ సస్పెన్సే. 


ఈ మూడు వేర్వేరు పాయింటాఫ్ వ్యూలతో కథ ఎపిసోడిక్ కథనం కాలేదు. ఎపిసోడిక్ కథనంలో ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ ఒక్కో సమస్య తీసుకుని దాన్ని పరిష్కరిస్తూ పోవడం వుంటుంది. ఇది డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్  స్టాప్ టెక్నిక్. సినిమాలకి పనికిరాదు. సినిమా కథకి  ఒకే సమస్యతో వుండే ఒకే పెద్ద కథ అవసరం. ఇందుకే తెలుగులో ఆటోనగర్ సూర్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ వంటి ఎపిసోడిక్ కథనాలతో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. 


పోతే, ఈ హాలీవుడ్ కథని చాప్టర్లుగా నడిచే కథ అనికూడా అనలేం. ఎందుకంటే చాప్టర్స్ తో కథ ముందు కెళ్తూ వుంటుంది. ట్రిప్టిచ్ లో బిగినింగ్ ఆగిపోతూ రిపీటవుతూ వుంటుంది. ప్రతీసారీ అదే సస్పెన్స్ ని లాక్ చేసి బిగినింగ్ రిపీటవుతూ వుంటుంది. దీనివల్ల అభిరుఛి గల ప్రేక్షకులకి ఏమిటి గేమ్? ప్రతీసారీ లాక్ అవుతున్న అదే సస్పెన్సు తో మైండ్ గేమే. గెస్సింగ్ గేమే. 


బిగినింగ్ త్వరగా అంటే అరగంటలోపు ముగించి మిడిల్ ప్రారంభిస్తే అక్కడ్నించీ ఆ మిడిల్ సెకండాఫ్ లో సగానికి పైగా ఆక్రమిస్తూ బారుగా వుంటుంది. బిగినింగ్ ప్లాట్ పాయింట్ వన్ లో సస్పెన్స్ క్రియేట్ చేసి వుంటే ఆ సస్పెన్స్ ని సెకండాఫ్ కల్లా మర్చిపోతారు ప్రేక్షకులు. పైగా అంత సేపు మిడిల్ కథ నడపడం కూడా ఈ రోజుల్లో మేకర్స్ కి కష్టమైపోతోంది. ఫస్టాఫ్ అరగంట కల్లా కాకుండా, ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ ని సృష్టించిన ఎన్నో సినిమాలకి కూడా సెకండాఫ్ ఆ కొంచెం మిడిల్ కథ నడపలేక ఫ్లాప్ చేసుకుంటున్న సందర్భాలు ఈ మధ్య పెరిగిపోయాయి. అలాంటిది ఇంకా ముందుగా ప్లాట్ పాయింట్ వన్ లో సస్పెన్స్ ని క్రియేట్ చేసిన కథలు ఏమవుతాయి?


అందుకని, ప్రేక్షకులు కథకి కీలకమైన సస్పెన్స్ అనే ఎలిమెంటుని బారెడు కథాక్రమంలో మర్చిపోకుండా, అదే బిగినింగ్ ని సస్పెన్స్ ఏర్పాటయిన ప్లాట్ పాయింట్ వన్ తో  రిపీట్ చేస్తూ, పదేపదే గుర్తు చేస్తూ వుంటే, ఆ సస్పెన్స్ రీఫ్రెష్ అవుతూ- దాన్ని అనుభవించే అవకాశం ఎక్కువ వుంటుంది ప్రేక్షకులు. ట్రిప్చిట్ తో ఒనగూడే ప్రయోజనమిదే. అయితే ఇది ‘శివ’ లాంటి యాక్షన్ కథలకి పనిచేయక పోవచ్చు. సస్పెన్స్ కేంద్ర బిందువుగా నడిచే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఇది కొత్తాలోచన. మరి ముప్పావు వంతు సినిమా మూడు సార్లు బిగినింగే ఆక్రమిస్తే మిడిల్ ఏమవుతుంది? ఇది కూడా తెలుసుకుందాం…


ఈక్వలైజర్ 2 ఈక్వేషన్
    ఇప్పుడు సెకండాఫ్ లో మూడోసారీ బిగినింగ్ రిపీటయ్యాక- మిడిల్ ప్రారంభమవుతుంది. అయితే అధ్యక్షుడు ఏ ఆప్షన్ ని ఎంపిక చేసుకున్నాడన్నది అస్పష్టంగానే వుంటుంది. వాషింగ్టన్ లో హడావిడి మొదలై పోతుంది. ఉన్నతా కారుల్ని అణు బంకర్‌కి తరలించేస్తూంటారు. ఫైటర్ జెట్‌ల శబ్దం,  వైమానిక దాడుల సైరన్‌ల శబ్దం మనకు వినిస్తూ వుంటాయి.  సినిమా చివరి షాట్ ఫోర్ట్ గ్రీలీ బేస్ వెలుపల మోకాళ్లపై మేజర్ డేనియల్ గొంజాల్వెజ్ వుంటాడు- ఆకాశం మబ్బుగా, వింతగా పసుపు రంగులో వుంటుంది. ఇది షికాగోలో అణు బాంబు -అంటే క్షిపణి పేలడం వల్లనా? షికాగో నాశనమైందా? అణుయుద్ధం మొదలై పోయిందా? అధ్యక్షుడు ఈ ఆప్షన్ తీసుకున్నాడా? ఇదెప్పటికీ మనకి తెలియదు. సినిమా ముగుస్తుంది. 


అంటే ముగింపుని కూడా సస్పెన్స్ లో పెట్టేశారు. అదలా వుంచితే మిడిల్ లో పెద్దగా కథ లేదు. కానీ ఈ సెకండాఫ్ లోనే బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో కూడిన సమగ్ర త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ వుంది. ఇందులో మూడోసారి రిపీటైన బిగినింగ్ వుంది, ఆ తర్వాత కథని ముందుకి నడిపిస్తూ మిడిల్, ఎండ్ లున్నాయి. అయితే ఎండ్ ఓపెన్ ఎండ్ గా వుంది. ప్రేక్షకులు ఎలాగైనా ఊహించుకో వచ్చు. ఈ వూహ సస్పెన్సుని ఇంకా పెంచుతుంది. ముగింపు చూపించేస్తే చప్పగా వుంటుంది. ఏముంది- షికాగో మీద దాడి చేసినందుకు అధ్యక్షుడు అనుమానిత దేశాల మీద అణు దాడికి ఆదేశాలిచ్చేశాడని చూపిస్తే, ఇది ప్రేక్షకులు ఊహించేదే. షికాగో మీద దాడి విఫలమైంది, అధ్యక్షుడు ఆప్షన్స్ తీసుకోకుండా ఆగిపోయాడు -అని చూపిస్తే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. అందుకని ఎటూ తేల్చకుండా వదిలేస్తే తర్జభర్జన పడుతూంటారు ప్రేక్షకులు. అందుకని బాగా ప్రభావశీలంగా వుండే ఓపెన్ ఎండెడ్ గా వదిలేశారు ముగింపుని. 


మిడిల్ ఎంత వుండాలి? ఎందుకుండాలి? ఆంటన్ ఫక్వా తీసిన ‘ఈక్వలైజర్ 2’ లో మిడిల్ కథ 10 నిమిషాలకన్నా ఎక్కువుండదు. బిగినింగ్ ఫస్టాఫ్ అంతా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ 10 నిమిషాలే వుంటుంది. అక్కడ్నించీ 45 నిమిషాలూ ఏకబిగిన క్లయిమాక్సే! ఈ మాఫియాల కథకి మిడిల్ కొత్తగా ఏమీ అనిపించదు. అది టెంప్లెట్ లో రొటీన్ గానే వస్తుంది. అందుకని 10 నిమిషాల్లో పాయింటు చెప్పేసి క్లయిమాక్స్ ప్రారంభించేశారు. ఇదీ కొత్త ప్రయోగమే!



    ఈ కథకి హీరో లేకపోవడం, విలనెవరో తెలియకపోవడం, కథలో అసలేం జరిగిందనేదీ సస్పెన్సుగానే వుండడం, యాక్షన్ సీన్లు లేకుండా కేవలం సస్పెన్సు తో నడిచే డ్రామా కావడం వల్ల ఆలోచనాత్మకంగా వుంటుందీ కమర్షియల్ సినిమాతో సాహస ప్రయోగం. ఇలాటివే అవసరం. కానీ ఎవరు సాహసిస్తారు? ఒకవేళ మేకర్ సాహసించినా నిర్మాతలు శిరసావహిస్తారా? అనుమానమే. ఇంకా మూసలో పోసిన సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడమే కావాలి. ఎడ్యుకేట్ అవ్వాల్సిందెవరు? ఆలోచించుకోవాలి.


-సికిందర్