రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, August 12, 2016

రివ్యూ!







రచన- దర్శకత్వం :  మారుతి

తారాగణం ; వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, సంపత్ రాజ్, జయప్రకాష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని తదితరులు
సంగీతం : జిబ్రాన్ , ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్, కూర్పు : ఉద్ధవ్,
పోరాటాలు : రామ్ –లక్ష్మణ్, రవివర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : సూర్య దేవర నాగవంశీ,  పిడివి ప్రసాద్
విడుదల : 12 ఆగస్టు,  2016
***
      వెంకటేష్ – మారుతీ అనే జనరేషన్ గ్యాప్ వున్న కాంబినేషన్ తో,  ‘బాబు బంగారం’ అనే సంసారపక్ష టైటిల్ తో,  కొంత కాలంగా కుతూహలం రేకెత్తిస్తున్న వెంకీ మార్కు కుటుంబ కథా చిత్రం- ఎన్ని విచిత్రాలు చేసిందో ఈ కింద చూద్దాం...

కథ : 
          
కృష్ణ (వెంకటేష్) జాలిగల ఎసిపి. నేరస్థులని కొట్టాలన్నా అతడికి మనసొప్పదు. అలాటి వాడు  ఇంకో జాలి గుండెగల శైలజ (నయనతార) ని చూసి మనసు పారేసుకుంటాడు. వెంటనే సెలవు పెట్టేసి ఆమెని ప్రేమించడానికి బయల్దేరతాడు. ఆమె నడిపే మెస్  సాధక బాధకాల్లో పాలు పంచుకుంటాడు. ఆమెది పెద్ద కుటుంబం. అందరూ ఆడవాళ్లే-  బామ్మ, అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళూ.  ఒక హత్య కేసులో ఇరుక్కున్న తండ్రి శాస్త్రి (జయప్రకాష్) అజ్ఞాతంలో ఎక్కడున్నాడో తెలీసు. అతడి ఆచూకి కోసం మల్లేష్ (సంపత్ రాజ్)  ముఠా  శైలజని వేధిస్తూంటారు. తన కుటుంబానికి కృష్ణ చేసిన మంచి పనులకి శైలజ అతణ్ణి ప్రేమిస్తుంది. ఇంతలో కృష్ణ తనతో  ప్రేమ నటించాడనీ, తన తండ్రి ఆచూకీ కోసమే  తనకి దగ్గరయ్యాడనీ అసహ్యించుకుని దూరమవుతుంది శైలజ. ఈమెతో ప్రేమా లేక, ఆమె తండ్రి నిర్దోషి అని నిరూపించే  అవకాశమూ లేక డైలమాలో పడతాడు కృష్ణ. ఇక్కడ్నించీ ఈ రెండు లక్ష్యాలూ సాధించడానికి ఏం చేశాడు కృష్ణ అన్నది మిగతా సెకండాఫ్ కథ. 

ఎలా వుంది కథ 
        చాలా చాలా పాత వాసనలతో వుంది. చూసి చూసి వున్న మూస ఫార్ములా కథతో,  పాత్రలతో అనాసక్తి కరంగా వుంది. అసలిదొక కథగా వుండే అవకాశం కూడా లేదనే  లాజిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ తరం దర్శకుడు మారుతీ,  వెంకటేష్ తో ఈ కాలపు కథ తీసుకోకుండా, వెంకటేష్ కాలపు కథనే తీసుకోవడంతో, పాత వెంకటేష్ సినిమా చూస్తున్నట్టే వుంది. ఇలాటి సినిమాలు ఎందరో అప్పటి దర్శకులు తీసేశారు- ఇంకా ఇప్పుడు ఇప్పటి ప్రేక్షకుల కోసం ఇప్పటి దర్శకుడు మారుతి కూడా తీయాలా!

          . ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ లాంటి వినూత్న ఇమేజియేతర కథలతో కాలంతో బాటు ముందుకు కదులుతున్న వెంకీని వెనక్కి లాక్కొచ్చి పాత పీఠం మళ్ళీ ఎక్కించినట్టుంది.  ఇందుకు పూర్తిగా మారుతీ బాధ్యుడనలేం, వెంకీ కూడా ‘ఊఁ...తీయ్!’ అనకపోతే ఈ పురాతన కహానీ కుహనా కమర్షియల్ గా నయా జమానాలో వచ్చే అవకాశమే లేదు. ఫస్టాఫ్ ప్రేమలో పడేసే రొటీన్ ట్రాక్ తో వుంటే, సెకండాఫ్ విలన్లతో యాక్షన్ కామెడీ కథగా మారుతుంది. ఈ యాక్షన్ కామెడీ కథలో క్రియేటివిటీ లోపించడంతో మూసఫార్ములా సన్నివేశాలే రాజ్యమేలి నిద్రపుచ్చుతాయి. పైగా ఫస్టాఫ్ ముగియగానే  ఈ సెకండాఫ్ కథేమిటో తెలిసిపోవడంతో చూడ్డాని కేమీ మిగలదు. 

          ఆపదల్లో వున్న హీరోయిన్ కుటుంబాన్ని కాపాడి ఆమె ప్రేమని పొందే కథలతో స్టార్ సినిమాలు ఇంకా ఎన్ని సార్లు తీస్తారనేది మిలియన్ డిస్కుల ప్రశ్న. 

ఎవరెలా చేశారు
        వీలైనంత ఫన్నీ గా తన పాత్రలో వెంకీ కన్పించడానికి  ప్రయత్నించారు. కానీ  లేని కథే ఈ పోలీస్ పాత్రకి తోడ్పడలేదు. దీంతో కృతకంగా కన్పిస్తుంది పాత్ర.  పైగా వెంకీ పాత్రకి సరయిన నయనతార పాత్ర సహకారం లేదు. వెంకీ చేసే ఫన్ కి దీటుగా నయన్  కూడా చేసి వుంటే ఈ ఇద్దరు సీనియర్లు మళ్ళీ ఓ ఊపు ఊపే వారు ఈ రొటీన్ మూసతో. కానీ నయన్  పాత్రని దర్శకుడు అస్తమానం శోక పాత్రగా కొనసాగించడంతో- ఎప్పుడూ కుటుంబ బాధలతో ఆమెకి ఏడుపే మిగిలింది. ఈ రెండు పాత్రల సంకలనాన్ని ఈ రోజుల్లో కూడా బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా ఇంత  నిస్తేజంగా ఎలా ప్రెజెంట్ చేస్తారో తెలీదు. బాక్సాఫీస్ ఎప్పుడూ యూత్ ఫుల్ గానే వుంటుంది మరి. నయన్  మెస్ నడపడం, వెంకీ సహకరించడం ఇటీవలి ‘పెళ్లి చూపులు’ లో వచ్చిన వ్యవహారమే. ఇక పాటల్లో కూడా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. నయన్ జస్ట్ వేస్టయిన గ్లామర్ తార అనొచ్చు ఈ సినిమాలో. 

          ఇక యాక్షన్ కామెడీ వచ్చేసరికి వెంకీ- తన ఇరవై ఆరేళ్ళ నాటి  ‘బొబ్బిలి రాజా’ ఎలిమెంట్స్ ని అరువు దెచ్చుకున్నారు. ఫైట్ చేస్తున్నప్పుడు ‘అయ్యో అయ్యో’ అనే ఊతపదం, క్లయిమాక్స్ ఫైట్ లో ‘బలపం పట్టి భామ వొళ్ళో’   పాట పేరడీ వంటి గిమ్మిక్కుల్ని ఆశ్రయించారు. కామెడీ అనేది కథలోంచి సహజంగా పుట్టుకురావాలి గానీ, ఇలా ఇంకో సినిమా పేరడీలు తెచ్చుకుని, స్పూఫ్ లు తెచ్చుకుని నింపే ప్రయత్నం చేస్తే దీనికి మారుతి ఎందుకు? క్రియేటివిటీ చచ్చిపోతే  వచ్చి చేరేది -ఈ సినిమాలో పదేపదే వాడిన  పదంలాగా -  పుచ్చిన బత్తాయిల్లాంటి  కృషి ఫలాలే. కుళ్ళిన బత్తాయిలనకుండా పుచ్చిన బత్తాయిలనడం కూడా పట్టాలు తప్పిన మారుతీ ఎక్స్ ప్రెస్ తడాఖా నేమో!

          గ్లామర్ పరంగా, ఫిజిక్స్ పరంగా ఆకర్షణీయంగా వెంకీ వున్నంత స్థాయిలో, తన కథా కథనాలతో మారుతీ కూడా పోటీపడి వుంటే  బావుండేది. పృథ్వీ తో మళ్ళీ ‘నాన్నకు ప్రేమతో’ పేరడీ కి న్యూవేవ్ దర్శకుడు మారుతి కెందుకు? ఇంకొకరి మూస మార్గం మారుతి కెందుకు? బత్తాయి లమ్మే బాబ్జీ పాత్రలో పృథ్వీ, నయన్ పాత్రని ప్రేమించే బావగా నానా హంగామా చేయడం బాగానే వుంది ఫన్నీగా, కానీ ఆమె వెంకీ ప్రేమకి లొంగిందని తెలుసుకుని- సంగతి చూస్తానని తొడలు కొట్టుకుని సవాళ్లు చేసి వెళ్ళిన  వాడు- మళ్ళీ కన్పించడెందుకో అర్ధం కాదు. ఎమ్మెల్యే పిచ్చయ్యగా పోసాని, మేజీసియన్ గా బ్రహ్మానందం వీళ్ళిద్దర్లో పోసానికి ఎక్కువ కామెడీకి అవకాశం దక్కింది. అయితే సెకండాఫ్ లో కామెడీ ఒక్కో విడివిడి ఎపిసోడ్ లుగా కాకుండా- కథని ముందుకునడిపించే రెండు సీక్వెన్సులుగా వచ్చి వుంటే కమెడియన్ లందరూ ఒక వెలుగు వెలిగే వాళ్ళు. దురదృష్ట మేమిటంటే కథని ముందుకు పరిగెత్తించే సీక్వేన్సులుగా గాక, వంతు లేసుకున్నట్టు విడివిడి ఎపిసోడ్లు కమెడియన్లు పంచుకోవడంతోనే ఫస్టాఫో సెకండాఫో విషయం లేక కుప్పకూలుతున్నాయి. 

          విలన్ గా సంపత్ రాజ్, బామ్మగా షావుకారు జానకి, నయన్ తండ్రిగా జయప్రకాష్ కన్పిస్తారు. వెన్నెల కిషోర్ కి సరైన పాత్ర, కామెడీ కూడా లేవు.
          ఛాయాగ్రహణం, సంగీతం చెప్పుకునేంత ప్రత్యేకంగా ఏమీ లేవు. 

చివరికేమిటి 
          
సెకండాఫ్ తోనే సమస్య. హీరోయిన్ తండ్రి దగ్గర విలన్ల తాలూకు ఒక వీడియో వుంటే, అది పెన్ డ్రైవ్ రూపంలో హీరో చేతికి చేరితే, ఆ పెన్ డ్రైవ్ ని కొట్టేయడం కోసం విలన్లు చేసే ప్రయత్నాలే కథగా మారడంతో పూర్తిగా అనాసక్తికరంగా మారిపోయింది. ఇలాటిది ఇంకెన్ని సార్లు ఎన్ని సినిమాల్లో చూస్తాం. పైగా హీరోకి బలమైన గోల్, దానికి తగ్గ ప్రత్యర్ధి వర్గమూ లేకపోవడం కూడా మారుతీ కథనపు బలహీనతగా తయారయ్యింది. అసలా హీరోయిన్ తండ్రి ఆ వీడియోతో పారిపోయి ఎక్కడో భయపడుతూ బతకడం కంటే, కుటుంబాన్ని విలన్ల ఆగడాలకి వదిలేయడం కంటే, పారిపోయినప్పుడే  ఆ ఎసిపి అయిన హీరోనే ఆ వీడియోతో ఆశ్రయిస్తే సరిపోయేదిగా? అప్పుడు ఈ కథంతా వుండే అవకాశమే లేదుగా?  కథగా ఇదంతా ఉండేందుకు అవకాశమే లేనప్పుడు ఈ కథంతా కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు సినిమాగా తీసినట్టు? ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తండ్రి ఆ విలన్ల వీడియో తీసినప్పుడు, విలన్లకి ఈ సంగతి తెలిసి వెంటబడినప్పుడు,  హీరోయిన్ తండ్రి నేరుగా  పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ తోనే కథ ముగిసిపోయే వ్యవహారం కదా? ఎందుకు ఇంత పెద్ద వ్యవహారం పెట్టుకున్నారు? లాజిక్ తట్టకనా, లేకపోతే ప్రేక్షకులకి లాజిక్ ఏం తెలుస్తుందనా?

          ఇంత కాలం గ్యాప్ తర్వాత వెంకీ ‘బాబు బంగారం’ అంటూ ఒక ఫీల్ గుడ్ టైటిల్ తో వచ్చినప్పుడు సినిమా కూడా ఎంత వెచ్చ వెచ్చగా, నులి వెచ్చగా - చలిమంట వేసుకున్న అనుభవంలా  ఆహ్లాదపర్చాల్సింది - నిలువెత్తు ఒరిజినాలిటీతో!


-సికిందర్ (దీనికి స్క్రీన్ ప్లే సంగతులు 
అవసరం లేదు)
http://www.cinemabazaar.in