రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, మే 2023, మంగళవారం

1328 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : నెల్సన్ వెంకటేశన్
తారాగణం : ఐశ్వర్యా రాజేష్, జితన్ రమేష్, సెల్వరాఘవన్, అనుమోల్ తదితరులు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం :  గోకుల్ బెనోయ్
బ్యానర్ : డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
విడుదల : మే 12, 2023
***

        హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ సినిమాలు ఫిబ్రవరి -మే మధ్య 4 నెలల్లో 4 విడుదలయ్యాయి. ఇంకో 8 నిర్మాణంలో వున్నాయి. ఈమె హీరోల పక్క ఆడిపాడే రెగ్యులర్ హీరోయిన్ గా గాక, హీరోయిన్ ప్రధాన సినిమాలు నటిస్తూ ప్రత్యేక స్థానం పొందింది. అభిమానులు ఆమెని సూపర్ స్టార్ అనేశారు. సినిమాలు కూడా అలాగే హిట్ట వుతున్నాయి. ఈ నాలుగు నెలల్లో  ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, రన్ బేబీ రన్’, సొప్పన సుందరి’, ఫర్హానా. తెలుగులో 2019 లో కౌసల్యా కృష్ణ మూర్తి తో ప్రారంభించి, మిస్ మ్యాచ్’, వరల్డ్ ఫేమస్ లవర్’, టక్ జగదీష్’, రిపబ్లిక్ లలో నటించింది. 7 కోట్ల బడ్జెట్ తో తీసిన ఫర్హానా తమిళ తెలుగు హిందీ భాషల్లో విడుదలైంది.
        
థ్రిల్లర్ని ముస్లిం సినిమాగా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్నకి- మలయాళంలో, హిందీలో ఎన్నో ముస్లిం సినిమాలు తీస్తున్నప్పుడు, తమిళంలో తనెందుకు తీయకూడదని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ సమాధానమిచ్చాడు. ఇటీవల తెలుగులో హిట్టయిన మసూద అనే చేతబడి సినిమాని ముస్లిం సినిమాగా తీసినప్పుడు పాతబడిపోయిన చేతబడి కథలకి కొత్త ప్రాణం పోసినట్టయింది. రెగ్యులర్ గా వచ్చే సినిమాలనే నేపథ్యాలు మారిస్తే కొత్తవైపోతాయి. ఈ మార్కెట్ యాస్పెక్ట్ తోనే వచ్చిన ఫర్హానా అనే థ్రిల్లర్ ఎలా వుందో చూద్దాం...

కథ

చెన్నై ట్రిప్లికేన్ గల్లీల్లో దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫర్హానా (ఐశ్వర్యా రాజేష్) పిల్లలతో, భర్త కరీం (జితన్ రమేష్) తో, తండ్రి అజీజ్ భాయ్ తో నివసిస్తూ వుంటుంది. తండ్రి సాంప్రదాయవాది, కఠినంగా వుంటాడు. భర్త సౌమ్యుడు. తండ్రి నడిపే చెప్పుల షాపులో పనిచేస్తూంటాడు. ఆన్లయిన్ వ్యాపారాలు పెరగడంతో చెప్పుల షాపుకి కస్టమర్లు రావడం తగ్గిపోతారు. దీంతో ఆర్ధిక ఇబ్బందులు చూసి ఫర్హానా ఉద్యోగం చేస్తానంటుంది. తండ్రి వ్యతిరేకిస్తాడు. భర్త ఒప్పుకుంటాడు. ఫర్హానాకి కాల్ సెంటర్ లో పనిచేసే నిత్య (అనుమోల్) అనే ఫ్రెండ్ వుంటుంది. ఆమె కాల్ సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తుంది. ఇంట్లో మగ్గిన జీవితంలోంచి బయటి ప్రపంచంలోకి, బయటి ప్రపంచంలో ఆర్ధిక స్వావలంబన లోకీ ఆమె జీవితం థ్రిల్లింగ్ గా మారిపోతుంది.
        
ఇంతలో కొడుకు అనారోగ్యానికి ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో కాల్ సెంటర్ లో ఎక్కువ జీతం వచ్చే సెక్షన్ కి మార్పించమని నిత్యని కోరుతుంది. ఆ సెక్షన్ లో పని చేస్తున్న నిత్య, అదే సెక్షన్ కి ఫర్హానాని మార్పిస్తుంది. ఇక్కడ పనిచేయడం మొదలెట్టిన ఫర్హానాకి షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇది సెక్స్ చాట్ సెక్షన్. కాలర్స్ తో సెక్సీగా మాట్లాడి సంతృప్తి పర్చాలి.
        
ఏం చేయాలో అర్ధంగాక, మానెయ్యలేక, అలాగే పనిచేస్తున్న ఫర్హానాకి ఒక కాలర్ కాల్స్ చేయడం మొదలెడతాడు. ఇతను మర్యాదస్తుడిలా వుంటాడు. కవిత్వం మాట్లాడతాడు. బాధల్లో వున్నట్టు అనిపిస్తాడు. సానుభూతితో దగ్గరవుతుంది. దగ్గరయ్యాక కలవాలంటాడు. ఇలా అన్నాక మొదలవుతుంది ఆమెకి అతడితో అసలు కథ. ఏమా కథ? అతడ్ని ఎలా కలుసుకుంది? కలుసుకుంటే ఏం జరిగింది? అసలతను ఎవరు? ఏ ఉద్దేశంతో ఆమెని ట్రాప్ చేశాడు? చివరికి ఆమె జీవితం ఏమైంది?... ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా సినిమాలో తెలుస్తాయి.

ఎలా వుంది కథ

ఆప్యాయంగా మాట్లాడినంత మాత్రాన అపరిచితులకి ఫిదా అయిపోకూడదని చెప్పే కథ. ఈ కథలో కాల్ సెంటర్ లో దాదాపు ఉద్యోగినందరూ ప్రొఫెషనల్ గానే వుంటారు. కాలర్స్ తో ఎఫైర్స్ కి దూరంగా వుంటారు. ఒక ఉద్యోగిని ఫోన్ సెక్స్ తో రియల్ సెక్స్ ట్రాప్ లోకి లాగిన వాడికి పడిపోయి హత్యకి గురవుతుంది. ఫర్హానా కాలర్ మాటల్ని పర్సనల్ గా తీసుకుని ఫ్రెండ్ అవుదామనుకుంటుంది. దీనికి కారణం చివర్లో భర్తకి చెప్తుంది- మన కష్టాలు తప్ప మనం ఏమీ మాట్లాడుకోలేదు, సడెన్ గా వాడు బాగా మాట్లాడేసరికి దగ్గరయ్యానని. ఇంట్లో ఈతిబాధలు తప్ప ఇంకేం ముచ్చట్లాడుకోక పోతే బయటి వ్యక్తులకి ఇలాగే పడిపోతారని చెప్పడం.
          
లిప్ స్టిక్ అండర్ మై బురఖా (2016) లో రోజీ అనే ఆమ్మాయి ఒక యువకుడితో ఫోన్ సెక్స్ చేస్తూంటుంది. చివరి కతను పెళ్ళికి కూడా సిద్ధమైపోతాడు. తీరా చూస్తే ఆమె 55 ఏళ్ళ విడో ఉషా అనీ, తను బకరా అయ్యాననీ తెలుసుకుని ఆమె సామానంతా  విసిరేసి, ఆమెని వీధిలోకి నెట్టేస్తాడు. వీధిలో ఆమె పరువంతా పోతుంది. ఆన్లయిన్ పరిచయాలతో ఇలాటివి కూడా జరుగుతూంటాయి.
        
ఇది ఫర్హానా పాత్ర దృష్టి కోణంలో సాగే కథ. దాదాపు ప్రతీ సీనులో తనుంటుంది. అయితే తను బకరా అవదు. త్వరలోనే కాలర్ ఉద్దేశం పసిగట్టి దూరం పెట్టడం మొదలెడుతుంది. అతను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆమె భయాల్నీ కష్టాల్నీ పెంచేస్తాడు. ఇల్లు కనుక్కుని అక్కడిదాకా వచ్చేస్తాడు. అయితే ఎవరి కంటా పడకుండా గేమ్ ఆడుతూంటాడు. అతనెలా వుంటాడో ఆమెకి తెలియదు. ప్రేక్షకులకి కూడా కనపడడు. గొంతు మాత్రమే విన్పిస్తూంటుంది. ఈ సస్పెన్స్ ఫ్యాక్టరే ఈ థ్రిల్లర్ ని నిలబెట్టింది. అయితే ఫస్టాఫ్ లో, అలాగే సెకండాఫ్ లో కొన్ని చోట్ల డ్రాప్ అయిపోతుంది వేగం. దీనికి కారణం ఫర్హానా పాత్ర నిదానంగా వుండడం.  
        
ఇది హీరోయిన్ పాత్ర దృక్కోణంలో హీరోయిన్ ప్రధాన కథయినప్పుడు, ముగింపులో ఆమె గెలుపు కుటుంబం చేతుల్లోకి, ఇంకొందరి చేతుల్లోకీ వెళ్ళి పోకుండా తన చేతిలోనే వుండుంటే- ఇది ఉమన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్న కథగా బలంగా వుండేది. కాలర్ ఎంత సీక్రెట్ గా ఆపరేట్ చేస్తున్నాడో, అంత సీక్రెట్ గా ఆమె ఈ లేకి వ్యవహారం బయటగానీ, ఇంట్లోగానీ తెలిసిపోకుండా మేనేజ్ చేసి కాలర్ ని దెబ్బకొట్టి వుంటే - క్యారక్టర్ ప్రేక్షకాభిమానం బాగా పొంది వుండేది. ఐశ్వర్యా రాజేష్ రియల్ సూపర్ స్టార్ అయ్యేది.

నటనలు - సాంకేతికాలు

పాత్రని తడుముకోకుండా నటించేసింది ఐశ్వర్యా రాజేష్. కమర్షియల్ సినిమా హీరోయిన్ గా కాదు, సెమీ రియలిస్టిక్ హీరోయిన్ గా సహజ భావోద్వేగ ప్రకటనతో. ఈ సినిమాలో దర్శకుడు ప్రేక్షకుల్ని కథాప్రపంచంలో మాత్రమే ఇన్వాల్వ్ చేయడు, క్యారక్టర్ వరల్డ్ లోకి కూడా తీసికెళ్తాడు. ఈ క్యారక్టర్ వరల్డ్ లో ఐశ్వర్యా రాజేష్ పాత్రకి ఇల్లే లోకంగా ఇంటి పని, వంటపని; తండ్రితో, భర్తతో, పిల్లలతో సంబంధాలు; కుటుంబ ఆర్ధిక సమస్యలు, బాధ్యతలు;  బయట కాల్ సెంటర్ లో పూర్తిగా వేరైన కార్పొరేట్ ప్రపంచంతో వ్యవహరించడం, ఈ ఆనందంలో కాలర్ తో చేదు అనుభవాలూ-  ఇవన్నీ తడుముకోకుండా నటించేసింది.
        
పాత్రకి ఇంకో తత్వం కూడా వుంది-  మతం పట్ల విశ్వాసం, ఐదు పూటలా నమాజు, రంజాన్ ఉపవాసాలు, జకాత్, రంజాన్ విందు వినోదాలూ కథాక్రమంలో కథలో కలిసిపోయేలా చేసుకు పోతూంటుంది. ఇక హజ్ కి వెళ్ళడమే మిగిలింది. అయితే రంజాన్ కి ఫ్రెండ్ నిత్యని పిలవడం మర్చిపోయినట్టున్నాడు దర్శకుడు. కొడుకు బర్త్ డేకి మాత్రం కాల్ సెంటర్లో స్వీట్లు  పంచమన్నాడు.
        
సౌమ్యుడైన భర్తగా, కళ్ళు దించుకుని మాట్లాడే పాత్రలో జింతన్ రమేష్ ఇంకో రియలిస్టిక్ క్యారక్టర్ కి న్యాయం చేశాడు. అలాగే నిత్య పాత్రలో అనుమోల్. ఇక గొంతు విన్పిస్తూ చివరి దృశ్యాల్లో మాత్రమే తెరపై కొచ్చే విలన్ దయాకర్ గా, దర్శకుడు సెల్వ రాఘవన్ సాఫ్ట్ సైకోతనం మంచి ఫినిషింగ్ టచ్ సినిమాకి.
        
మూడు పాటలున్నాయి. షాపింగ్ మాల్ లో సెల్వరాఘవన్ రివీలయ్యే సందర్భంలో వచ్చే సాంగ్ బావుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా జస్టిన్ ప్రభాకరన్ బాగానే ఇచ్చాడు. గోకుల్ బెనోయ్ ఛాయాగ్రహణం థ్రిల్లర్ ఫీల్ ని ఎలివేట్ చేసుకుంటూ పోయింది, ఇతర సాంకేతిక విలువలు, ప్రొడక్షన్ విలువలూ ఖైదీ నిర్మాతల స్థాయిలో వున్నాయి.

చివరికేమిటి

సినిమాలో చూపించిన కాల్ సెంటర్ వ్యవహారాన్నీ, కాల్స్ చేసే వాళ్ళ కల్చర్ నీ దేన్నీ విమర్శించకుండా, వాటి పై మెసేజి లివ్వకుండా, అమ్మాయిలు అపరిచితుల కాల్స్ కి పడిపోరాదని చెప్పడానికి మాత్రమే కాల్ సెంటర్ ని నేపథ్యంగా వాడుకున్నాడు దర్శకుడు. కథ ముగిశాక, అదే కాల్ సెంటర్ కి మొదట చేరిన బ్యాంకింగ్ కాల్స్ రిసీవ్ చేసుకునే సెక్షన్ కే జాబ్ కి వెళ్తూంటుంది హీరోయిన్. ఎక్కువ శాలరీకి ఆశపడినందుకే ఇదంతా జరిగింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంది.
       
ఫస్టాఫ్ కుటుంబ జీవితం
, జాబ్ లో చేరడం, కాలర్ తగలడం, అతడి మాటలకి పడిపోయి ఫోన్లోనే ఫ్రెండ్ షిప్ చేయడం జరుగుతూ, ఇంకో ఉద్యోగిని హత్యకి గురవడం వంటివి వుంటాయి. సెకండాఫ్ లో కాలర్ కలవాలని ప్రయత్నించడం, బ్లాక్ మెయిల్ చేయడం, స్టాకింగ్ చేయడం జరుగుతూ వచ్చి, ఇతనెవరో తెలుసుకోవడానికి ఆమె పూనుకోవడంతో క్లయిమాక్స్ దిశగా వెళ్తుంది కథ.
       
అయితే ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో హీరోయిన్ గా  ఒంటి చేత్తో కాలర్ అంతు చూడకుండా
, ఇంట్లో చెప్పేయడంతో యాక్టివ్ గా వున్న పాత్ర కాస్తా బేలగా, పాసివ్ గా మారిపోయింది. ఆడవాళ్ళు రక్షణ కోసం చివరికి మగవాళ్ళ దగ్గరికి రావాల్సిందే అన్నట్టు తిరోగమన పంథాకి పోవడం తెలిసో తెలియకో దర్శకుడు చేసిన పొరపాటు. అయినా ఈ సినిమాని మత ప్రచార ప్రధాని ప్రమోట్ చేయట్లేదు కాబట్టి తమిళనాడులో కొందరు ముస్లిములే బ్యాన్ చేసుకుంటున్నారు. నేను ముస్లిముల మధ్యే పుట్టి పెరిగానురా అని దర్శకుడు మతసామరస్యం చెప్పుకుంటున్నాడు.
—సికిందర్