రచన- దర్శకత్వం పుష్కర్-గాయత్రి
తారాగణం : హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్ తదితరులు
హిందీ చిత్రానువాదం : బెనజీర్ అలీ ఫిదా, మాటలు : బెనజీర్ అలీ ఫిదా, గాయత్రి, మనోజ్ ముంతషీర్; సంగీతం : సామ్ సి.ఎస్, ఛాయాగ్రహణం
: పిఎస్ వినోద్
బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్
ఎంటర్ టైంమెంట్, టీ సిరీస్ ఫిల్మ్స్,
జియో స్టూడియోస్, థీమ్ స్టూడియోస్
నిర్మాతలు : ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, భూషణ్ కుమార్
విడుదల : సెప్టెంబర్ 30, 2022
***
కథ
లక్నోలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎసెస్పీ విక్రమ్ (సైఫలీ ఖాన్) క్రూరుడైన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వేదా బేతాళ్ (హృతిక్ రోషన్) అనుచరుల్నిఎన్ కౌంటర్ చేసి చంపేస్తాడు. ఇక వేదా కోసం వేట మొదలెడతాడు. వేదా 16 మందిని చంపి లక్నోని గడగడ లాడిస్తున్నాడు. ఐతే విక్రమ్ ఇంకో ఎన్ కౌంటర్ కి ప్లాన్ చేస్తూంటే, స్వయంగా వచ్చి వేదా లొంగిపోవడం ఆశ్చర్య పరుస్తుంది. ఇంటరాగేషన్లో వేదా ఒక కథ చెప్తానని చెప్పుకొస్తాడు. కథ చెప్పి, ఈ కథలో న్యాయం చెప్పమంటాడు. విక్రమ్ న్యాయం చెప్తాడు. ఆ న్యాయమే తను చేశానంటాడు వేదా. విక్రమ్ ఇరుకునపడతాడు. తను చెప్పిన న్యాయమే వేదా చేసి వుంటే ఇక అన్యాయం ఎక్కడుంది? న్యాయాన్యాయాల పట్ల అతను అభిప్రాయం మార్చుకోవాల్సిన పరిస్థితి...
ఇంతలో విక్రమ్ భార్య లాయర్ ప్రియ (రాధికా ఆప్టే) వచ్చి వేదాని బెయిల్ మీద విడిపించేస్తుంది. ఆగ్రహంతో విక్రమ్ మళ్ళీ వేదాని పట్టుకుంటే ఈసారి అతనింకో కథ చెప్పి న్యాయం చెప్పమంటాడు. విక్రమ్ న్యాయం చెప్తే ఆ న్యాయమే చేశానంటాడు వేదా...ఇలా న్యాయాన్యాయాల ప్రశ్న విక్రమ్ నైతిక బలాన్నే దెబ్బతీస్తూంటుంది. ఈ సమస్యని అతనెలా పరిష్కరించాడు? వేదా ఇంకో కథ కూడా చెప్తాడు. ఇక విసిగిన వేదాకి విక్రమ్ ఏం న్యాయం చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో భార్య ప్రియా పాత్రేంటి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
.jpg)
‘విక్రమ్ - వేదా’ తమిళంలో 2017 లో మాధవన్- విజయ్ సేతుపతిలతో హిట్టయిన ‘విక్రమ్- వేదా’ కి రీమేక్. అప్పట్లో దీని బడ్జెట్ 11 కోట్లకి 66 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ రీమేక్ కి 175 కోట్ల బడ్జెట్. మొదటి రోజు 12 కోట్లే వసూలు చేసింది. ఓవర్సీస్ కలుపుకుని 20 కోట్లు. ఇది హిందీ ‘పొన్నియిన్ సెల్వన్’ కి 10 రెట్లు ఎక్కువే అయినా, ఈ అంకె నిరాశాజనకంగా వుంది. మూడేళ్ళ తర్వాత హృతిక్ రోషన్ తెర మీదికొచ్చి, సినిమాకి మీడియా రెస్పాన్స్ బాగుండి, రెండో రోజు 25 శాతం కలెక్షన్లు పెరిగాయి. అనుకున్న క్రేజ్ రాకపోవడానికి కారణం సినిమాలో విషయంతో వుందా అంటే అదేమీ కాదు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, అధిక ధరలు పీడిస్తున్న నార్త్ ప్రేక్షకులకి మత భక్తి ఫాంటసీల్లో ఊరట లభిస్తుందేమో. మత భక్తే ఈ పరిస్థితి తెచ్చినా. బాలీవుడ్ కి చాలా గడ్డు రోజులు.
ఈ గ్యాంగ్ స్టర్ కథని ఏది న్యాయం? ఏది అన్యాయం - అన్న నైతిక ఆవరణలో డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటు చేసి
చెప్పిన విధానమే జీవం పోసిందని చెప్పాలి.
చాలా పూర్వం, అంటే 1971 లో గుమ్మడి హీరోగా నటించిన బ్లాక్
అండ్ వైట్ ‘నేనూ మనిషినే’ ని ఈ
సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇందులో జడ్జి పాత్రలో గుమ్మడియే హత్య చేస్తాడు. ఆ
సమయంలో అతను జడ్జి కాదు, మనిషి. అయినా నేరం గిట్టుబాటు కాదని తెలిసీ మనిషి కుండే
ప్రతీకారేచ్ఛతో తనలోని రెండో మనిషి వైపే మొగ్గి హత్య చేసేస్తాడు. ఇప్పుడు తమ్ముడి
పాత్రలో పోలీసు అధికారిగా హీరో కృష్ణ ముందు నైతిక ప్రశ్న. ఇప్పుడు తను పోలీసు
అధికారిగా డ్యూటీ చేయాలా, లేక తనూ ఓ మనిషిగా రక్త సంబంధాలకి లొంగిపోవాలా? బలమైన భావోద్వేగాలతో కూడిన క్రైమ్ డ్రామా ఇది. ఇందులో ఆ రోజుల్లోనే
బుల్లెట్స్ తో బాలస్టిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ చూపించారు.
గ్యాంగ్ స్టర్ వేదా విసిరే నైతిక
ప్రశ్నలతో పోలీసు అధికారి విక్రమ్ డైలమా ఇలాంటిదే. గమనిస్తే పోలీసులకంటే
నేరస్థులకి ఎక్కువ ఫిలాసఫీ వుంటుందేమో. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణని ఇదే డ్రైవ్
చేస్తూంటుంది. చివరికి అంతిమ న్యాయం డిమాండ్ చేసినప్పుడు ఇద్దరి మధ్య మెక్సికన్
స్టాండాఫ్ సీను. తమిళ కథని ఎక్కడా మార్చకుండా రీమేక్ చేశారు. కథలో మలుపులు
ఉత్కంఠని పెంచుతూ కదలకుండా కూర్చోబెడతాయి.
నటనలు -సాంకేతికాలు
.jpg)
ఓ రెండు పాటలకి పెద్దగా ప్రాధాన్యం లేదుగానీ, సామ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఈ స్టయిలిష్ గ్యాంగ్ స్టర్ మూవీకి స్టయిలిష్ గానే కుదిరింది. హృతిక్ కి రాజ్ కపూర్ పాటల పిచ్చి వుంటుంది. ఒక ఫైట్ లో రేడియోలో ‘కిసీకీ ముస్కురాహటో పే హో నిసార్’ సాంగ్ వస్తూంటే, తన్మయం చెందుతూ చేసే ఫైట్ ఫన్నీగా వుంటుంది. ఫైట్ సీన్స్ కూడా స్టయిలిష్ గా కంపోజ్ చేశారు. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం ఒక హైలైట్ లక్నో నగర దృశ్యాలతో.
చివరిగా, దర్శకులు పుష్కర్- గాయత్రీలు రీమేక్ కి న్యాయమే చేశారు. రొటీన్ మూస ఫార్ములా ధోరణులకి పోకుండా నియో నోయర్ పోకడలతో - ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్- శైలిలో గ్యాంగ్ స్టర్ మూవీని రాసి తీశారు. బాగా రాస్తే బాగా తీయొచ్చు, బాగా రాయక పోతే ఎంత బాగా తీసినా పొన్నియిన్ సెల్వనే!
—సికిందర్
,