రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 28, 2016

దర్శకత్వం : నీతేష్ తివారీ
తారాగణం : అమీర్ ఖాన్, సాక్షీ తన్వర్, ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ భట్నాగర్, అపర్శక్తి ఖురానా, రిత్విక్ సహోర్, గిరీష్ కులకర్ణి, రోహిత్ శంకర్వర్,
రచన : నీతేష్ తివారీ, పీయూష్ గుప్తా, శ్రేయాస్ జైన్, నిఖిల్ మహరోత్రా
సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : సేతు శ్రీరామ్
బ్యానర్లు :  : వాల్ట్ డిస్నీ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్
 విడుదల : 23 డిసెంబర్, 2016

***
      సూపర్ స్టార్లు స్పోర్ట్స్ సినిమాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఖాన్లు ముగ్గురూ స్పోర్ట్స్ సినిమాలు తలా ఒకటి చేశారు- షారుఖ్ ‘చక్ దే ఇండియా’, సల్మాన్ ‘సుల్తాన్’ ల తర్వాత ఇప్పుడు అమీర్ ‘దంగల్’ తో వచ్చాడు. మధ్యలో అక్షయ్ కుమార్ ‘బ్రదర్స్’ తో వచ్చినా అది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ గురించి. ‘చక్ దే ఇండియా’,  ‘దంగల్’ ల ప్రత్యేకత ఏమిటంటే ఇవి క్రీడారంగం వైపు  అమ్మాయిల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తీసినవి. కానీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మహిళా ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ మీద తీసిన  ‘దంగల్’ (మల్లయుద్ధం- కుస్తీ పోటీ) అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల్నే ఎక్కువ ఉత్సాహపరుస్తున్నట్టు కన్పిస్తోంది.  సోషల్ మీడియాలో, పత్రికల వెబ్ సైట్స్ లో కూడా పురుష పుంగవులే యుద్ధ ప్రాతిపదికన  కామెంట్లు చేస్తూ కనపడుతున్నారు. వాళ్ళతో భారతమాత పుత్రికలు పోటీ పడ్డం లేదు. 70 కోట్ల సినిమా మాత్రం మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్ ని దాటిపోయింది.




       ‘దంగల్’ కేవలం కుస్తీ పట్లని థ్రిల్లింగ్ గా –యాక్షన్ ఓరియెంటెడ్ గా చూపించి సొమ్ము చేసుకుంటున్న తెలివి తక్కువ మూవీ కాదు. క్రీడలో ఇది ఇగోల పాలబడ్డ భావోద్వేగాల సమరం కూడా. క్రీడలో ఇది సాంప్రదాయానికీ ఆధునికత్వానికీ మధ్య ఎడతెగని సంవాదం కూడా.  ఈ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామాకి ఇవే అసలైన బలాలు.

కథ 
         ర్యానా భివానీ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే సగటు ప్రభుత్వోద్యోగి మాహావీర్ సింగ్ ఫోఘాట్ (అమీర్ ఖాన్) పూర్వం కుస్తీలో జాతీయ స్థాయి వరకే ఎదిగి, అంతర్జాతీయ ఖ్యాతికి సాగాలన్న కోరిక తీరకుండా మిగిలిపోయాడు. ఆర్ధిక ఇబ్బందులు ఆ  కల నెరవేర్చుకోకుండా చేసి ప్రభుత్వోద్యోగంలో స్థిరపడేలా చేశాయి. కొడుకు పుడితే వాడి ద్వారానైనా ఆ  కల నెరవేర్చుకుందామనుకుంటే, వరుసగా నల్గురు ఆడ పిల్లలే పుట్టారు. ఇక చేసేది లేక కలల్ని చంపేసుకుని వున్న జీవితంతోనే  రాజీ పడిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు గీతా కుమారి (జైరా వసీమ్), బబితా కుమారి ( సుహానీ భట్నాగర్) లు కాస్త ఎదిగి వచ్చారు. స్కూలు కెళ్తున్న వాళ్ళిద్దరూ ఒక రోజు ఇద్దరు అబ్బాయిల్ని యమ పీకుడు పీకారు. దీంతో మహావీర్ కళ్ళు తెర్చుకున్నాయి. తన కూతుళ్ళ రక్తంలోనూ   కుస్తీ కళే పొంగి ప్రవహిస్తోందని  గ్రహించి వెంటనే వాళ్ళకి శిక్షణ నివ్వడం ప్రారంభించాడు. ఆడుకునే వయస్సులో ఈ ట్రైనింగేమిటా అని-

విసుక్కుంటూ అయిష్టంగానే వాళ్ళు కఠిన శిక్షణ పొందసాగారు. తండ్రంటే అయిష్టం పెంచుకున్న దశలో ఓ పెళ్ళిలో వాళ్లకి జ్ఞానోదయమైంది. ఇక రెట్టించిన ఉత్సాహంతో పూర్తి  శిక్షణ పొంది టౌన్లో జరిగే కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ ఒక్కో కుస్తీ కుర్రాణ్ణీ  యమపట్లు పట్టి మట్టి కరిపించడం చూసి నివ్వెర పోయారందరూ. మహావీర్ కి విశ్వాసం బాగా పెరిగింది. పెద్ద కూతురు గీతా (ఇప్పుడు ఫాతిమా సనా షేక్) పాటియాలా జ్యూనియర్ ఇంటర్నేషనల్ గెల్చి- కామన్వెల్త్ గేమ్స్ లో ప్రవేశం పొందేందుకు స్పోర్ట్స్ అకాడెమీలో ప్రత్యేక శిక్షణకి చేరింది. ఇక్కడ్నించీ గీతా జీవితంలో, మనసులో ఎలాటి మార్పులు చెలరేగి- తండ్రితో సంబంధాలూ చెదిరి, చెల్లెలు బాబితా తోనూ (ఇప్పుడు సాన్యా మల్హోత్రా) ఎడం పెరిగి, తల్లి శోభ (సాక్షీ తన్వర్) తోనూ, చిన్నప్పట్నించీ శిక్షణలో సహాయపడ్డ చిన్నాన్న కొడుకు (చిన్నప్పుడు రుత్విక్ సహోర్, ఇప్పుడు అపర్శక్తి ఖురానా)  లతోనూ సంబంధాలు అంటీ ముట్టనట్టు మారిన క్రమంలో, భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారై  - ఎలా కామన్వెల్త్ గెల్చి వరల్డ్ ఛాంపియన్ అయ్యిందన్నది మిగతా కథ. 


ఎలావుంది కథ
      ముందు చెప్పుకున్నట్టు ఇది బయోపిక్. నిజకథ. కలల్ని చంపేసుకున్న ఔత్సాహిక కుస్తీ క్రీడాకారుడు, ఒలింపిక్స్ లో సీనియర్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతా అయిన మహావీర్ సింగ్ ఫోఘాట్ జీవిత కథ ఇది. గీతా బాబితా రీతూ సంగీతా కూతుళ్ళు నల్గుర్నీ, తమ్ముడి కొడుకు వినేష్ – కూతురు ప్రియాంకాలనీ- ఈ ఆరుగురు కుటుంబ సభ్యుల్నీ  అత్యంత శ్రమకోర్చుకుని ఒకే క్రీడ-  కుస్తీపోటీల్లో విజేతలుగా  ప్రపంచానికందించిన ఘనత అతడిది.  2010 కామన్వెల్త్ గేమ్స్ లో గీత వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన తొలి భారత కుస్తీ క్రీడా కారిణి అయి, మళ్ళీ ఒలింపిక్స్ కి క్వాలిఫై అయిన తొలి భారత కుస్తీ క్రీడాకారిణి కూడా అయింది. బబిత 2012 ప్రపంచ కుస్తీ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాన్నీ, 2014 కామన్వెల్త్ లో బంగారు పతకాన్నీ గెల్చింది. రీతూ నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడలిస్ట్ అయితే, సంగీతా జ్యూనియర్ ఇంటర్నేషనల్ లో మెడల్ సాధించింది. ఇక వినీష్ కూడా కామన్వెల్త్ లో గోల్డ్ మెడలిస్ట్. ప్రియాంకా జ్యూనియర్ ఇంటర్నేషనల్లో మెడలిస్టు. ఇలా తను సాధించలేకపోయిన విజయాల్ని తన పిల్లల ద్వారా నెరవేర్చుకున్నాడు మహావీర్. 


           2012 లో డిస్నీ క్రియేటివ్ టీమ్ మెంబర్ దివ్యారావ్ పత్రికలో మహావీర్ గురించి చదివి, ఇది గొప్ప సినిమా అవుతుందని భావించి, సిద్ధార్థ రాయ్ కపూర్ కి చెప్పారు. సిద్ధార్థ రాయ్ కపూర్ ఈ కథ రాసి దర్శకత్వం వహించే బాధ్యతని నీతేష్ తివారీ కి అప్పగించారు. అప్పటికి నితేష్ తివారీ ‘చిల్లర్ పార్టీ’, ‘భూత్ నాథ్ రిటర్న్స్’ అనే రెండు సాధారణ సినిమాల దర్శకుడు. 2013 లో అమీర్ ఖాన్ కి కథ చెప్పాడు. 2015 లో షూటింగ్ ప్రారంభమయ్యింది.

          సినిమాకి ప్రధానంగా గీతా కథనే తీసుకున్నారు. సబ్ ప్లాట్ లో సమాంతరంగా ఎదిగివస్తున్న బబితని చూపించారు. దేశం కోసం నిజమయిన రణ రంగాలు రెండే వుంటాయి : ఒకటి యుద్ధ రంగం, రెండు క్రీడా రంగం. దేశభక్తి పెల్లుబికేది ఈ రెండు రంగాల్లోనే. వీటి పుణ్యాన ఇతరులు అర్జెంటుగా దేశభక్తిని పులుముకుని విర్రవీగిపోతారు. లేనిపోని ఉద్రిక్తతల్ని సృష్టిస్తారు. ఈ కథ గీతా కుమారి కథలా అన్పించినా కథా సారధి మహావీర్ పాత్రే. మహావీర్ పాత్ర లక్ష్యానికి సాధనంగా గీతా కుమారి పాత్ర. వీళ్ళిద్దరి సంఘర్షణ లోంచి అమ్మాయిల్లో క్రీడాస్ఫూర్తిని రగిలించడం, అంతర్లీనంగా దేశభక్తిని ప్రవహింప జేయడం. ఇంకొకటి, క్రికెట్ తప్ప మరే దేశీయ క్రీడలపట్లా ఆసక్తి చూపని జనబాహుళ్యంలోకి కుస్తీ ని తీసికెళ్ళి ప్రకాశింప జేయడం – 
‘బహుత్ హోగీ  పెహల్వానీ, అబ్ దంగల్ హోగా’  అని షురూ చేస్తూ!

ఎవరెలా చేశారు      ఇక్కడ ఎవరి పాత్రనీ డిజైనర్ చరిత్రలా చేయలేదు. డిజైనర్  చరిత్ర అంటే షారుఖ్ ‘అశోకా’ లో లాంటిది. అది కృతకమైనది సీజీ సపోర్టుతో. ‘దంగల్’ లో కరుడుగట్టిన పర్ఫెక్ష నిస్టు అమీర్ ఊబ కాయం సహా ఏదీ కృతకమైనది కాదు. కుస్తీ పట్లు కూడా రియల్లే. బాలనటులు, హీరోయిన్లు సహా అమీర్ - కుస్తీలో శిక్షణ తీసుకునే నటించారు. వాటినీ  హైడెఫినేషన్ స్లో-మో తో కలుషితం చేయలేదు.  ప్రారంభంలో కొద్ది సేపు అమీర్ యుక్తవయసు మహావీర్ గా కన్పించినా, ఆ తర్వాతంతా పాతిక కేజీలు వొళ్ళు పెంచి వయసు మీరిన మహావీర్ పాత్రనే పోషించాడు, బాన కడుపుతో ఇమేజి ఏమైపోతుందన్న భయం లేకుండా. పాత్రకి ఎలాటి కమర్షియల్ బిల్డప్పులూ ఇవ్వలేదు- ‘సుల్తాన్’ లో ఇలాటి పాత్రకి సల్మాన్ కి లా. కూతుళ్ళకి శిక్షణ ఇచ్చినంత సేపూ లీడ్ యాక్టర్ లా వుండి, ఆ తర్వాత ఎదిగిన పెద్ద కూతురు పాత్ర కథకి మిగతా స్క్రీన్ టైంని ఇచ్చేసి నేపధ్యంలో వుంటాడు. ఎక్కడా హీరోయిజాన్ని ప్రదర్శించే పని చేయకపోవడం అమీర్ చేసిన మంచి పని. అయితే సినిమాటిక్ అనుభవం కోసం ఫోఘాట్ ల నిజ జీవితాలతో  కొంత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోక తప్పలేదు. వాళ్ళ జీవితాలు పూర్తిగా ఇలాగే వుండి వుంటాయా అంటే వుండవు, సినిమా కోసం వున్నాయి.    



         అమీర్ గత సినిమాల్లో హీరోగా నటించాడు, ఈ సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్టుకి ఒదిగాడు.  కోడి రామ్మూర్తి సాంప్రదాయ -దేశవాళీ కుస్తీ వేరు, స్పోర్ట్స్ అకాడెమీ కుస్తీ వేరు. కోడి పందాలు కోడి పందాలే, వాటిని  ఇంకేదో ఆధునిక టెక్నిక్ లతో నేర్పాల్సిన పనుండదు. అమీర్ పాత్ర గొడవ ఇదే. ఏఏ పట్లు ఎలా పడితే 1-2-3-(4 వుండదు)- 5 పాయింట్లు వస్తాయో దేశవాళీగా అతడికి బాగా తెలుసు. దీని ముందు విదేశాల నుంచి రుద్దుతున్న టెక్నిక్కులు బలాదూరు అని నమ్ముతాడు గనుకనే- ఇది కూతురితోనూ, ఆమె కోచ్ తోనూ  భావజాలాల సంఘర్షణకి దారి  తీసి, తీవ్ర అవమానానికీ మానసిక క్షోభకీ  గురవుతాడు. ఇండియన్నెస్ కి పట్టం గట్టడానికే కంకణం కట్టుకున్న పాత్రగా ఎదుగుతాడు. అర్ధవంతమైన సినిమాల్లో ఎక్కడ శంకరా భరణం శంకర శాస్త్రి వుంటే అక్కడ అది సూపర్ హిట్టవుతుంది. 


       ఫాతిమా కూడా తన పాత్ర అనుభవించే ఒడిదుడుకుల్ని నేర్పుగా ప్రదర్శించింది. మూలాల్ని మర్చిపోయి ఎక్కడికో వెళ్లిపోవాలన్న ఉడుకురక్తం పాత్ర ఆమెది. ఒకసారి  ఇంటి పెంపకం నుంచి బయటి  ప్రపంచంలోకి స్వతంత్రులై వెళ్ళాక, ఇంటి పెంపకం చాదస్తంగా అన్పిస్తుంది. కని పెంచి ప్రయోజకులుగా పంపిన కన్న వాళ్ళు పాతసరుకులా అన్పిస్తారు. ఎదుగుదలకి కొత్త ప్రపంచంలోనే  అసలు హంగులున్నాయని అనుకుంటారు. ఏ స్పోర్ట్స్ అకాడెమీ లో చేరేందుకు  ఆమె తండ్రి నేర్పిన విద్య తోడ్పడిందో, అదిప్పుడు వుత్త  నాన్సెన్స్ గా అన్పిస్తుంది. నీ కిటుకులు ఇప్పుడు పనికి రావు నాన్నా- ఇక్కడ చాలా ప్రోగ్రెస్ వుందనే మాటలతో అతణ్ణి కించ పర్చి, తీరా నేర్చుకున్న ఆధునిక టెక్నిక్కులతో, ప్రతీ ఇంటర్నేషనల్లోనూ  ఓడిపోతూంటుంది. వూళ్ళో వున్నప్పటి కంటే వేషభాషలు, యాటిట్యూడ్, పాయిజ్ గీయిజ్  సర్వం మారిపోయి- ఫారినర్ లా తయారవుతుంది. కానీ కుస్తీలో పుటుక్కున ఓడిపోతోంది...ఏం చేయాలి... ఇప్పుడు తండ్రి తప్ప దిక్కులేదు...

         తండ్రితో ఇగోలకి పోతే  ఇంతే సంగతులు. ఈ తెచ్చిపెట్టుకున్న మానసిక సంఘర్షణతో కూడిన పాత్రని, దర్శకుడి సమర్ధత పుణ్యమాని సజీవంగా నిలబెట్టింది ఫాతిమా అనాలి. చెల్లెలి పాత్రలో తండ్రి పక్షం వహించే సాన్యా పాత్ర అక్కకంటే పరిణతితో వ్యవహరించే పాత్ర.  అక్క తర్వాత తనూ స్పోర్ట్స్ అకాడెమీలో చేరి అక్కని మార్చాలని ప్రయత్నిస్తుంది. ఈమె కూడా సినిమాకి ఆకర్షణే. అలాగే ఫస్టాఫ్ లో బాలనటులు జైరా, సుహానీలు చాలా వినోదాన్ని పండిస్తారు వాళ్ళ పాత్రలతో. వీళ్ళ కజిన్ గా చిన్నప్పుడు రిత్విక్ సహోర్, పెద్దయ్యాక అపర్శక్తి ఖురనాలు కామెడిక్ అండర్ కరెంట్లు.
తల్లిపాత్రలో సాక్షీ తన్వర్ కూడా ఉత్తమ నటీమణే.


        ‘యే దిల్ హై ముష్కిల్’ తర్వాత మరొక్కసారి  ప్రీతమ్ సంగీతస్వరాలు హుషారు తెప్పిస్తాయి. సేతు శ్రీరామ్ ఛాయాగ్రహణం అంతర్జాతీయ స్థాయికి చెందింది. వూళ్ళో లొకేషన్స్, ఇరుకు సందులు, పాతబడి పేదరికాన్ని తలపించే ఇళ్ళూ, మళ్ళీ  అటు స్పోర్ట్స్ అకాడెమీలో, ఈవెంట్స్ జరిగే స్టేడియాల్లో టేకింగ్ -దేనికా వాతావరణాన్ని క్రియేట్ చేసే క్లాసిక్ లుక్ తో వున్నాయి.

        దర్శకుడు నీతేష్ తివారీ ఆశ్చర్య పర్చే ప్రతిభతో నిజ జీవితాల్ని తెరకెక్కించాడు. అతడి రచనని, దర్శకత్వాన్నీ ఒక్క మాటలో వివరించడం కష్టం, ఎన్నో విడదీయరాని లేయర్స్ ఈ అద్భుత సృష్టికి కారణమయ్యాయి. ఇగోల పాలబడ్డ భావోద్వేగాల సమరమనుకుంటే, మళ్ళీ దీనికి హస్యరపు పూత, దీనిమీద మళ్ళీ సాంప్రదాయానికీ ఆధునికత్వానికీ మధ్య ఎడతెగని సంవాదపు లేయర్ అనుకుంటే, దీనికీ  ఇగోలతో బాటూ  హస్యరసపు పూత, ఫిజికల్ యాక్షన్ తో ఉర్రూత. ఒడుపు తెలిసిన వీటన్నిటి కలబోతతోనే సజీవ దృశ్యావిష్కరణ సాధ్యమవుతుందనేది ఇక్కడ గ్రహించాల్సిన విషయం. అమీర్ ఖానే అన్నట్టు, రకరకాల భాద్వేగాలతో కూడిన సీరియస్ సబ్జెక్టుని వినోదాద్మకంగా చెప్పే రాజూ హిరానీ సరసన నీతేష్ తివారీ ఒక్కడే చేరతాడు. జీవితం తెలీకపోతే సినిమా తీయడం తెలీదు. 



చివరికేమిటి 
        ఒక క్వాలిటీ కమర్షియల్ చూసిన అనుభవం. పాత్రలు కష్ట కాలంలోనూ హాస్యమాడే  సినిమాల్ని ఎప్పుడు చూశాం? బాలల పాత్రలు సహా ఏ పాత్రకూడా వదలకుండా హాస్యంగా మాట్లాడేవే. అది కూడా హర్యాన్వీ భాషలో. అయితే ఈ హర్యాన్వీ భాష సల్మాన్ ‘సుల్తాన్’ లోలా మరీ అతి యాసతో ఇబ్బంది పెట్టేలా వుండదు. ‘మ్హారీ ఛోరియాఁ ఛోరోఁ సే కమ్ హై కే?’ (మా అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువా?) అని హర్యాన్వీలో హిందీ ఎక్కువ పలికే డైలాగులతో వుంటుంది. ‘గంగా జమున’ లో దిలీప్ కుమార్ యూపీ  యాస మాట్లాడి మాస్ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్ళి నట్టు- (హిందీ సినిమాల్లో యూపీ యాస ఇదే మొదలు) ‘దంగల్’ కూడా యాస కారణంగా కూడా పల్లెలకీ  పట్టణాలకీ ఇంతగా ప్రాకిపోతోంది.

        పాత్రలు ఇబ్బందుల్లో వున్నప్పుడు కూడా దర్శకుడు దాన్ని ఫన్ చేసి చూపించే వ్యూహం పెట్టుకోవడం ఈ బరువైన డ్రై సబ్జెక్ట్ ని తేలికపాటి వినోదాద్మకంగా మార్చేసింది. సీరియస్ నెస్ కి సంబంధించి ఒకటుంది- ఒక పాత్ర ఏదో సమస్యలో వుంటే పక్కనున్న పాత్ర ఆ సమస్యని తను కూడా ఫీలై కన్నీళ్లు తుడవడం నిస్తేజమైన చిత్రణ. ఒకరి సమస్యని ఇంకొకరు ఎందుకు  ఫీలవ్వాలన్న ధోరణిలో హాస్యమాడితే అది చైతన్యంతో కూడుకున్న చిత్రణ. ఈ రెండో దానికే ఈలలేస్తారు  ప్రేక్షకులు. ఈ సినిమా సాంతం ప్రేక్షకుల కేరింతలే ఫన్నీ డైలాగులకి ( పేదా గొప్పా అన్నిఆర్దిక అంతస్తుల ఉత్తరాది వాళ్ళు- ముస్లిములు  ఎక్కువ వచ్చే ఆబిడ్స్ రామకృష్ణలో హౌస్ ఫుల్ ఆట చూశాడీ వ్యాసకర్త పనిగట్టుకుని). అంతే కాదు, తమ కష్టాల మీద తామే జోకులేసుకుంటాయి కూడా ఈ పాత్రలు. ‘దంగల్’ లో చివరంటా జరిగిందిదే. ఈ ఛలోక్తులతో కూడిన రియల్ డైలాగులు చాలా మేధస్సుని డిమాండ్ చేస్తాయి. హాస్యాన్ని పండించడమనేది సీరియస్ బిజినెస్ అన్నారు. అది అపార మేధస్సుతో కూడుకున్న వ్యవహారం. దర్శకుడితో బాటు  మిగిలిన ముగ్గురు రచయితలూ అపూర్వంగా దీన్ని సాధించి చూపెట్టిన జీనియస్సులు. అత్యున్నత స్థాయికి వెళ్లి ఆలోచిస్తేనే, అట్టడుగు మాస్ ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేస్తూ రాయగల్గుతారని దీన్ని బట్టి అర్ధమవుతోంది. కథ వదిలేసి సెకండాఫ్ లో కూడా ఎంటర్ టైన్మెంట్ అనే పిచ్చితనంతో పిచ్చి కామెడీలు చేసే వాళ్లకి- దీనిద్వారా కథలోంచి, పాత్రల్లోంచీ కామెడీ పుడుతూ - కథ దెబ్బతినకుండా –ఎల్లడెలా ఎలా కామెడీ ప్రవహిస్తుందో తెలుసుకుంటారు- తెలుసుకోవాలన్న జిజ్ఞాస వుంటే. 


        స్క్రీన్ ప్లే ఉండీ లేనట్టుగా వుంటుంది. ఇదీ మా స్క్రీన్ ప్లే- మేమింత మేధావులంగా మారిపోయి ఎంత బీభత్సంగా రాసి తీస్తున్నామో చూడండి - అన్నట్టుగా ఎక్కడా అన్పించదు. అసలున్నారా లేరా అన్నట్టే వుంటుంది. అంతా ఆటో పైలట్ మీద నడించి పోతున్నట్టు వుంటుంది. ఇది డ్రైవర్ లేని సెల్ఫ్ డ్రైవింగ్ గూగుల్ కారులా యాక్సిడెంట్ ఎక్కడా చెయ్యదు. ఈ సీను ఫెయిలయ్యిందనో, ఇక్కడ ఈ పాత్ర తేడా కొట్టిందనో ఎక్కడా అన్పించదు.  ప్లాట్ పాయింట్స్ అన్నీ ఒక అంకంలోంచి ఇంకో అంకంలోకి కథని మనం గమనించ లేనంత స్మూత్ ట్రాన్సిషన్స్ తో తీసికెళ్తూంటాయి. ట్రాన్సిషన్స్ కళ ఎడిటింగ్ కి సంబంధించిన వ్యవహారమే అనుకుంటాం, కానీ ఇక్కడ స్క్రిప్టింగ్ లోనే కనబడుతోంది. 



        ఇది మహావీర్ చేతిలో కథ. తన ఇద్దరమ్మాయిల్ని అస్త్రాలుగా ప్రయోగించే కథ. ఇది బూమరాంగై ఒకమ్మాయికి తనే ప్రత్యర్ధి అవుతాడు. ముందు కెళ్ళి ఆమె కోచ్ కి తనే విరోధి అవుతాడు. కథని హీరో విలన్లుగా విడగొట్టక పోతే  మజా లేదు, సంఘర్షణ లేదు, సంఘర్షణ లేకపోతే అంకాలు లేవు, అంకాలు లేకపోతే ప్లాట్ పాయింట్స్ లేవు, ప్లాట్ పాయింట్స్ లేకపోతే హోల్మోత్తంగా పాత్రలే లేవు, పాత్రల్లేక నమ్ముకున్న కథా కాకరకాయా ఒక్క కేజీ కూడా లేవు. 
        ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా  జోసెఫ్ క్యాంప్ బెల్ సూత్రాలు  అమలవుతాయంటే ( ఒకసారి పై  చిత్రపటం చూడండి) ఈ సూత్రాలతో ‘దంగల్’ స్క్రీన్ ప్లేని అనుసరిస్తూ పోతే-


Campbell's stages:
1. Ordinary World :  అమ్మాయిలతో మహావీర్ సాధారణ జీవితం
2.
Call to Adventure : అమ్మాయిలు అబ్బాయిల్ని కొట్టడంతో మహావీర్ తన కుస్తీ లక్ష్యానికి పనికొస్తారని గుర్తించడం
3. Refusal of the Call : అమ్మాయిలు తండ్రి శిక్షణ పట్ల, లక్ష్యం పట్లా అయిష్టంగా వుండడం
4. Meeting the Mentor: అమ్మాయిలు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురి మాటలకి కుస్తీ వైపు మరలడం.
5.
Crossing the Threshold : ఒకమ్మాయి హీరోయిన్ గా స్పోర్ట్స్ అకాడెమీలో చేరడం.
6. Tests, Allies, Enemies : స్పోర్ట్స్ కొత్త ప్రపంచంలో పరీక్ష లెదురై,  తన మిత్రు లెవరో(కోచ్),  విరోధులెవరో (తండ్రి) గుర్తించడం.
7.
Approach : తనదైన విధానంతో ఇంటర్నేషనల్స్ లో పాల్గొనడం.
8. Ordeal, Death & Rebirth : ఇంటర్నేషనల్స్ లో చావుదెబ్బలు తిని, తండ్రి విధానాలే కరెక్ట్ అన్న అవగాహనతో పునర్జన్మెత్తడం
9. Reward, Seizing the Sword : తండ్రి ఆశీస్షులతో సమరానికి ఖడ్గమెత్తడం
10. The Road Back : తండ్రి విరోధి అయిన కోచ్ వల్ల గోల్డ్ మెడల్ కొట్టలేని స్థితి
11. Resurrection : తండ్రిని కోచ్ మాయం చేసిన నిస్సహాయ స్థితిలో, తండ్రి తనకి చెప్పిన కిటుకులే మెదిలి పునరుత్థానం చెందడం
12. Return with Elixir: విజయోత్సాహంతో అమృత కలశమనే ఉట్టిని కొట్టడం!


***


      ఇంత బ్యూటిఫుల్ గా రన్ అయిన స్క్రీన్ ప్లేని ఈ మధ్య కాలంలో చూసి వుండం. మహావీర్ అమ్మాయిలకి ఏమాత్రం కాలక్షేపం చేయనివ్వడు. కుస్తీ మీంచి వాళ్ళ దృష్టి మరలకుండా ఎప్పుడూ శిక్షణే. అలాంటిది చెప్పకుండా వాళ్ళొక పెళ్ళికి వెళ్లి ఆడి పాడేసరికి, వెళ్లి గద్దిస్తాడు. దీంతో 14 ఏళ్ల పెళ్లి కూతురు - ఏంటి మీ సమస్యని అడుగుతుంది. వాళ్ళు తండ్రి తమతో చేస్తున్నది చెప్పుకుంటారు. మీరు అదృష్టవంతులు, మీనాన్న మిమ్మల్ని నాలాగా తయారు చేయడం లేదు, నన్ను చూడండి, అప్పుడే పెళ్లి చేసుకుని ముక్కూ మొహం తెలీని మొగుడికి సేవలు చేస్తూ వుండి పోవాలనే సరికి -అమ్మాయిలకి జ్ఞానోదయమవుతుంది. బేటీ బచావో, బేటీ పడావోలో భాగంగా వాళ్ళు తండ్రి బాటలోకి వచ్చేస్తారు. 


        ఈ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ ని శారీరక పోరాటంగా, సెకండాఫ్ ని అంతకంటే బలమైన మానసిక యుద్ధంగా విభజించడం ఒక మంచి బాక్సాఫీసు వ్యూహమే.  లేకపోతే కొంత సేపయ్యాక విషయం సన్నగిల్లి చతికిలబడే  ప్రమాదముంది మొనాటనీని మోస్తూ. ఫస్టాఫ్ లో శిక్షణ పొందడమూ స్థానిక పోటీల్లో గెలవడమూ అనే ఫిజికల్ యాక్షన్ తో గడిచిపోతుంది. ఫస్టాఫ్ కిది తియ్యటి మాత్రగా అవసరం కూడా ఆడియెన్స్ ని ఊరడించడం కోసం, సెకండాఫ్  మానసిక యుద్ధం మూడ్ లోకి స్మూత్ ట్రాన్సిషన్ కోసం. ప్రారంభంలో తండ్రి అంటే పడక ఫిజికల్  యాక్షన్ తో కలిపి మానసిక యుద్ధమూ చేసినా,  అది పెళ్లి కూతురి మాటలతో తీరిపోతుంది. కానీ సెకండాఫ్ లో ఆ మానసిక యుద్ధమే బ్రహ్మ రాక్షసి అవుతుంది. ఇప్పుడు ఆధునికంగా మారిన హీరోయిన్ కి పాత విధానాల తండ్రితో ఇగో క్లాషెస్ వచ్చి, తండ్రీ  కూతుళ్ళ మధ్య మాటలు కూడా కరువయ్యే యుద్ధం మొదలవుతుంది. దీంతో సెకండాఫ్ లో కూడా గోల్డ్ మెడల్ కోసం శారీరక పోరాటమనే  మొనాటనీ, బోరూ తప్పాయి. ఈ మానసిక యుద్ధంలో ఆమె ఓడిపోయి తండ్రినే నమ్ముకున్నాక, ఆమె గెలుపు క్రెడిట్ ని తను కొట్టేయడం కోసం తండ్రీ కూతుళ్ళిద్దరికీ కనపడని విరోధిలా మారతాడు కోచ్. 

        హీరోయిన్ స్పోర్ట్స్ అకాడెమీలో చేరే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ,  మిడిల్లోపడ్డ కథ, లక్ష్యంకోసం ఎడతెగని- టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని పెంచేసే- క్యారక్టర్ ఆర్క్ ని ఓడిడుకుల పాల్జేసే, సంఘర్షణగా మిడిల్ సూత్రాలకి న్యాయం చేస్తూ- సెకండాఫ్ లో మహావీర్ ని కోచ్ బంధించే ప్లాట్ పాయింట్ టూ వరకూ సాగుతుంది. 


        నిజ జీవితంలో కోచ్ ఇలా బంధించాడా అంటే  లేదు.  కానీ బంధించకపోతే క్లయిమాక్స్ వర్కౌట్ కాదు ( తనని ఇంత దారుణంగా చూపించారని గీతా కుమారి విజయకారకుడైన కోచ్ పిఆర్ సొంధీ కోర్టు కెళ్తున్నాడు. అసలు కామన్వెల్త్ కి ఆమెకి శిక్షణ నిచ్చింది తనేగానీ ఆమె తండ్రి కాదంటున్నాడు. సినిమాలో తను విలన్  అయిపోయాడు పాపం).


        కామన్వెల్త్ ఫైనల్స్ లో గెలుపు కోసం హీరోయిన్ చేసిన పోరాటాన్ని కూడా తప్పుగా చూపించారని గీతా కుమారి ఒరిజినల్ విజువల్స్ ని బయట పెట్టారు కొందరు (వీడియో  కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి). నిజంగా గీతాకుమారి ఎదురులేకుండా పాయింట్స్ కొట్టుకుంటూ పోయింది. ఏ క్షణంలోనూ డైలమాలో పడింది లేదు. మొదలెట్టడమే టపటపా కొట్టేసుకుంటూ పోయింది. కానీ సినిమాలో ఈ వాస్తవం చూపిస్తే సినిమాలా వుండదు. ముందు ఓడిపోతున్నట్టే చూపిస్తూ చివరి క్షణంలో గెలిపిస్తేనే సీన్ నిలబడుతుంది కాబట్టి అదే చేశారు. హీరోయిన్ ఒక్క పాయింటే కొట్టి అక్కడే వుండిపోతుంది- ప్రత్యర్థి చకచకా  గెలుపు వైపు వెళ్ళిపోతూంటుంది. చూస్తే గ్యాలరీ లోంచి ఉత్సాహ పర్చే, కిటుకులు చెప్పే తండ్రి ఇప్పుడు లేడు- కోచ్ బంధించాడు. అంతులేని టెన్షన్, సస్పెన్స్. అటు బందికానా లోంచి బయట పడేందుకు తండ్రి విఫలయత్నాలు. ఇప్పుడెలా గెలుస్తుంది హీరోయిన్, ఎలా గెలుస్తుంది? ఆమెకున్న మార్గం ఇప్పుడేమిటి? అప్పుడు... తండ్రి చెప్తూ వుండిన ఒక కిటుకు మెదులుతుంది- ఈ ఏకంగా 5 పాయింట్లు వచ్చే కిటుకు చిన్నప్పుడు చిన్నాన్న కొడుకుతో చూపించబోతాడు తండ్రి- ఆ చిన్నాన్న కొడుకు భయపడి వద్దంటాడు. ఆ కిటుకు ప్రేక్షకులకి చూపించకుండా, కుతూహలం తీర్చకుండా, పెండింగులో పెట్టేశాడు దర్శకుడు. ఇపుడు హీరోయిన్ గుర్తు తెచ్చుకోవడం ద్వారా అనూహ్యంగా దాన్నిచూపించి, పే ఆఫ్ చేస్తూ కుతూహలం తీర్చే స్తాడు దర్శకుడు - ఈ టెక్నికల్ విశేషాల కథనంలో. 


        ఇంకా ఒక్క పాయింటు దగ్గరే ఆగిపోయిన హీరోయిన్, ఇక 1-2-3-పాయింట్లు వచ్చే కుస్తీ పట్లు పడుతూ ఇక కొద్ది సెకెన్లే  వున్న టైంని వేస్ట్ చెయ్యక- తెగించి ఏకంగా తండ్రి నేర్పిన 5 పాయింట్లు కొట్టే,  ప్రత్యర్ధిని అధిగమించే పట్టులో బిగించి- లేపి మట్టి కరిపిస్తుంది! గోల్డ్  మెడల్ కైవసం. చూస్తే ఇంకా తండ్రి ఇంకా లేడు. బందికానాలోనే దురదృష్టాన్ని తిట్టుకుంటూ  దీనంగా కూర్చున్న అతడి  ముఖంలో అప్పుడు ఆనందం - జాతీయ గీతం విన్పించేసరికి. 


        ఇలా ఎమోషనల్, యాక్షన్ డ్రామాలు, వీటిలో హాస్య రసమూ, భావజాలాల బేధాలు, ఇగోల సంఘర్షణా, బాలికా అభ్యున్నతీ, స్త్రీ విజయమూ, దేశభక్తీ, క్రీడా స్ఫూర్తీ,  కుటుంబ సంబంధాలూ, ఫాదర్ సెంటిమెంటూ, ఒకటని కాదు- జానర్ డిమాండ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ నంతా కూడేసి  ఫిజికల్ యాక్షన్ అనే హార్డ్ వేర్ కి అందించారు. స్మూత్ గా స్క్రీన్ ప్లే తనపని తను చేసుకుపోయింది...


       
In order to do something physical, you have to accomplish something mental; in order to accomplish something mental, you have to achieve something emotional – James Bonnet.

-సికిందర్
http://www.cinemabazaar.in